నమ్మకం - ఎం బిందుమాధవి

trust

ఈ రోజు మధ్యాహ్నం రెండింటి నించి రాబోయే సంపూర్ణ సూర్యగ్రహణం గురించి... మూడురోజుల నించి టీవీలో హొరెత్తిస్తున్న జ్యోతిష్య పండితుల చర్చ.. గ్రహణం ప్రభావం..అది ఏనక్షత్రం లో వస్తున్నదో..వారికి కలిగే ఫలితాలు..అరిష్టాలు విన్న వసుంధర...

"అమ్మో ...మామగారికి గ్రహణ సమయానికి కనీసం రెండు గంటల ముందే భోజనం పెట్టెయ్యాలి" అని గబ గబా వంటపనిలో పడింది.

అత్తగారు తాముండే పల్లెటూరు కి వెళ్ళారు.

వంట పూర్తి చేసే పనిలో ఉండగా..తమ్ముడు రఘు ఫోన్ చేసి.."అక్కా...ఈ రోజు గ్రహణం నీ నక్షత్రంలో వస్తున్నది. టీవీలోవస్తున్న చర్చలని బట్టి చూస్తే చాలా పెద్ద గ్రహణంట! ఎవరి నక్షత్రంలో వస్తున్నదో వాళ్ళు చూడకూడదుట. వాళ్ళకి ఈసంవత్సరం గ్రహ స్థితి బాగా లేదుట. శాంతి చెయ్యలిట. దానాలుకూడా ఇవ్వాలిట. ఎవరినైనా కనుక్కున్నావా? జాగ్రత్త" అని హెచ్చరించాడు.

"మంచో..చెడో అనుభవించక తప్పదు...కర్మ నించి పారిపోలేం కదా!" అనుకుంది.

"నేనొక్క దాన్నే కాదు ...ఇంట్లో ఇంకో నలుగురు అదే రాశి వారు. ప్రతికూల గ్రహ స్థితులు..జాగ్రత్తలు..శాంతులు..అందరికీసంబంధించినవే!"

"పిల్లలకి దీనివల్ల ఏం నష్టం జరుగుతుందో..." అని ఆలోచిస్తూ వంట పని చూసుకుంటున్న వసుంధరని మామగారునరసింహ మూర్తి గారు పిలిచి

"అమ్మాయ్..వంటయ్యాక నువ్వు కూడా నాతో పాటు భోజనం చేసి..గ్రహణం "పట్టుస్నానం" చేసి రెడీగా ఉంటే నీకు పాముమంత్రం చెబుతాను" అన్నారు.

@@@@@@@

ఒక రోజు మామగారు..తను పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా...ఆ మాటల్లో ఆయన .."మా వూళ్ళో వారికి..పాము కరిస్తేనేను మంత్రం వేస్తూ ఉండేవాడిని. వారు కోలుకునే వారు. మంత్రోపదేశం మాత్రం గ్రహణం నాడే జరగాలి..ఈ సారిగ్రహణం వచ్చినప్పుడు నీకు ఆ మంత్రం చెబుతాను" అని ఆయన చెప్పిన మాట గుర్తొచ్చింది...వసుంధరకి.

"ఇలాంటివి ఎంత వరకు నమ్మాలో" సందేహం వసుంధరకి.

" ఇంతకు ముందు ఎప్పుడైనా ఆయన ఆ ప్రయోగం ద్వారా ఎవరినైనా కాపాడారా? పెద్దాయన?..ఇలాంటి సందేహాలువెలిబుచ్చితే చిన్నబుచ్చుకుంటారేమో!" అని మనసులో అనుకుంటూ

"సరే ఏదయితే అదయింది...ఆయన చెప్పింది చేస్తే సరిపోతుంది...తను ప్రయోగాలు చేస్తే కదా...దాని వల్ల లాభనష్టాలప్రసక్తి వచ్చేది..."అనుకుంది వసుంధర.

అటు వంట పని చూస్తూనే... "మామయ్యగారూ..వదినా వాళ్ళకి కూడా నేర్పారా?" అనడిగింది.

"లేదమ్మా..వాళ్ళకి నీకున్న ఆసక్తులు లేవు. నువ్వు అప్పుడప్పుడు నాతో ఇలాంటివి మాట్లాడుతుంటావని..నీకుచెప్పాలనుకున్నా.." అన్నారు.

"ఓహో నామీద ఆయనకి నమ్మకం అన్నమాట"...

వసుంధర మామగారి దగ్గర మంత్రం నేర్చుకుంది.

@@@@@

నరసింహ మూర్తి గారు హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యాక ...కొడుకు దగ్గర హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆయనకిపెన్షన్ వస్తుంది. దానికోసం సంవత్సరానికి ఒక సారి జనవరిలో వెళ్ళి లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చి వస్తూ ఉంటారు.

ఇప్పుడు లైఫ్ సర్టిఫికెట్ ఆ ఊరే వెళ్ళి ఇవ్వనక్కరలేక పోయినా ...నరసింహ మూర్తి గారికి అక్కడికే వెళ్ళి ఇవ్వటం ఒకసంతృప్తి.

ఒక సారి తన ఊరు..పరిసరాలు..చూసి..అక్కడి మనుషులని పలకరించినట్లుంటుదని ఆయన భావన.

అలా..ఆ పని మీద ఆయన..కొడుకు..కోడలు భీమవరం దగ్గర ఉన్న వాళ్ళ ఊరికి వెళ్ళారు. పని పూర్తయ్యేసరికి సాయంత్రంచీకటి పడింది. మరునాడు బయలుదేరచ్చు అనుకుని..ఆ రాత్రికి ఆ ఊరి పెద్ద గారి ఇంట్లో బస చేయటానికినిర్ణయించుకున్నారు.

బయట కుర్చీల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా..ఆ ఇంటి పాలేరు వీరయ్య... నాలుగేళ్ళ మనవడిని చేతుల మీదవేసుకుని ఏడుస్తూ పరుగున వచ్చి "అయ్యా..మా బుడ్డోడిని పాము కరిచింది..తమరే ఏదో ఒకటి చెయ్యాలి." అని పెద్దగాశోకాలు పెడుతున్నాడు.

ఆ ఊరి వాళ్ళకి పాము కాటుకి మంత్రం వేయించటం మీద ఉన్న "నమ్మకం" విషయం తెలిసిన ఆ పెద్ద మనిషి..

"మేస్టారూ.. మీరు పాము మంత్రం వేస్తారు కదా! చూడండి" అన్నాడు యధాలాపంగా!

నరసింహ మూర్తి గారు కోడలి వంక చూసి..నువ్వు నేర్చుకున్నది ఉపయోగించే అవకాశం వచ్చింది అన్నట్లుగా... ఆ పనిచెయ్యమని..కంటి తోనే సైగ చేశారు.

ఆయనకి కోడలు ఆ పని చెయ్యగలదని "నమ్మకం"!

మొన్న వచ్చిన సూర్య గ్రహణం తనకి మంచిది కాదని అందరూ హెచ్చరించారు!

ఆ కష్టం ఇలా వచ్చి పడిందేమో అనుకున్న

వసుంధరకి కాలూ..చెయ్యి ఆడలేదు.

గొంతులో పచ్చి వెలక్కాయ పడింది!

ఏమంటే ఏం తేడా వస్తుందో?

దీని పర్యవసానాలేమిటో?

చూస్తూ ..చూస్తూ ఒక నిండు ప్రాణాన్ని బలి ఇచ్చినట్టవుతుందేమో?

.....వసుంధర బుర్రలో ఆలోచనలు గజిబిజిగా సుడులు తిరుగుతున్నాయ్.

వాళ్ళ ఏడుపులు అంతకంతకీ పెరుగుతున్నాయ్!

"మంత్రాలకి చింతకాయలు రాలతాయా"?

ఏదో ఒకటి చేసి ముందు ఆ పరిస్థితిని చక్కదిద్దాలి! ఎలా?

వసుంధర మనసులోనే కనపడని దేవుళ్ళందరికీ మొక్కటం మొదలుపెట్టింది.

పక్కనున్న బల్ల మీద పడుకోబెట్టి..."మీరంతా దూరంగా జరగండి.. పిల్లవాడికి గాలి తగలాలి" అన్నది.

"స్నానం చేసొచ్చి...శుచిగా...కళ్ళు మూసుకుని మనసులోనే ఏదో జపిస్తూ ..పాము కరిచిందని వాళ్ళు చెప్పిన చోటుకి పైనఒక బట్ట గట్టిగా కట్టింది. క్రింది భాగంలో చెయ్యి వేసి... నిమరటం మొదలు పెట్టింది."

"చూసే వాళ్ళకి నమ్మకం కలగాలి...."

"కంగారు తగ్గి స్థిమిత పడాలి ..."

"పిల్లవాడు కోలుకోవాలి..."అదే వసుంధర అప్పటి ధ్యేయం!

కొంతసేపటికి పిల్లవాడిలో కదలిక వచ్చింది. "దాహం..దాహం" అని గ్లాసెడు మంచినీళ్ళు తాగాడు.

మరికొంత సేపటికి లేచి కూర్చున్నాడు.

హమ్మయ్యా అని అందరు గాలి పీల్చుకున్నారు.

వీరయ్య ఆనందంగా ముందుకొచ్చి...వసుంధర కాళ్ళమీద పడి.."అమ్మాయి గారు తమరు ఇయ్యాల మా బుడ్డోడికి ప్రాణంపోశారమ్మా! మీకు జన్మ జన్మలకి ఋణపడి ఉంటాం..తమర్ని దేవుడు పంపించినట్టొచ్చారమ్మా మా ఊరికి" అని ఒకటేదండాలు పెట్టటం మొదలుపెట్టాడు.

వసుంధర మనసులో జరిగింది మొత్తం సినిమా రీల్ లాగా తిరుగుతున్నది.

"పిల్లవాడిశరీరం మీద పాము కరిచిన చోటు చూడగానే తెలిసింది తనకి.. అది పాము కాటు కాదని!"

"కానీ కొంచెం కమిలి ఉండటాన్ని బట్టి ఏదో పురుగు కుట్టిందనుకుంది!"

"చిన్న పిల్లవాడు కాబట్టి వాళ్ళందరూ కంగారు పడుతున్నారు"

తనకి హోమియో మందు మీద "నమ్మకం"

"వెంటనే ఇన్సెక్ట్ బైట్ కి వేసే మందు వేసింది"

"తక్కువ సమయం లోనే లేచి కూర్చున్నాడు"

హమ్మయ్యా..అని గుండెలనిండా గాలి పీల్చుకుని

"ఇక భయం లేదులే వీరయ్యా..రేపొకసారి వచ్చి చూస్తాను.. ఈ రాత్రికి అన్నం పెట్టకండి..పాలు తాగించండి" అని చెప్పిపంపింది.

@@@@@

రాత్రి అన్నాలు తినేశాక ... వసుంధర మంచం మీద పడుకుని.."ఈ రోజు జరిగిన సంఘటనలో చిన్న పిల్లవాడికి పాముకరిస్తే...ఎవరో తెలియని పెద్ద మనిషి పాము కాటుకి మంత్రం వేస్తారని..యజమాని చెబితే..అది పని చేస్తుందని వాళ్ళుపెట్టుకున్న నమ్మకానికి..

పోయినవారం తను..ఫ్రెండ్ ని చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ...వారు పెద్ద పెద్ద డాక్టర్ల మీద నమ్మకంపెట్టుకోలేకపోవటానికి ఎంత తేడా" అనుకున్నది.

"ఆ రోజు ఆ పేషెంట్ కి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే..ఆ హాస్పిటల్లో చేర్చారుట. అది బాగా పేరున్న హాస్పిటల్. అక్కడ అందరూ బాగాఅనుభవము...విదేశాల్లో చదువుకున్న అర్హతలు ఉన్న డాక్టర్లే!"

"స్పెషలిష్ట్ డాక్టర్స్ అందరూ...రోగికి రక రకాల పరీక్షలు చేసి..రోగ నిర్ధారణ చేసే పనిలో ఉన్నారు."

"ఆ రోగికి తమ్ముడుట... ఆ రోజు..అంటే షుమారు ఆయనకి స్ట్రోక్ వచ్చిన నాలుగు రోజుల తరువాత...పరామర్శకివచ్చి..."ఇక్కడ ఈ రోగానికి సంబంధించిన వైద్యం చెయ్యటంలో అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఉన్నారా? మీరు ఆ విషయంనిర్ధారించుకునే ఇక్కడ చేర్పించారా?" అని హడావుడి చేసి... తనకి మాత్రమే ఆ రోగి పట్ల అక్కర ఉన్నట్లు గొడవ చేసివెళ్ళాడు.

అతనికి ఎవరి మీద "నమ్మకం" ఉన్నట్లు లేదు..

"సాధారణంగా ఎవరయినా తమ విధి చిత్తశుద్ధితోనే నిర్వహిస్తారు అని నమ్మాలి. మన పట్ల ప్రత్యేకమైన నిర్లక్ష్యంకానీ..దురభిప్రాయం కానీ వారికేముంటాయి..అయినా

"అంత పెద్ద హాస్పిటల్లో అంతమంది స్పెషలిష్ట్ లు ఉన్న చోట చేర్చిన రోగికి ...నయమౌతుంది అనే "నమ్మకం" లేదు...వాళ్ళకి" అనుకున్నది వసుంధర.

వైద్యానికి మందులతో పాటు నమ్మకము ..విశ్వాసమూ కూడా ముఖ్యమే!

@@@@@

మరునాడు బయలుదేరాక..కార్ వీరయ్య ఇంటి మీదుగా తిప్పారు.

వాకిట్లో ఆడుకుంటున్న వీరయ్య మనవడిని చూసి తృప్తిగా గాలి పీల్చుకున్నది.

ఇప్పుడు వసుంధరకి మనసు నిండా సందేహాలు!

" నిజంగా పాము కరిస్తే మందు వెయ్యకుండా..మంత్రం వెయ్యటం ఎంతవరకు సబబు?"

"అసలు అలాంటివి పని చేస్తాయని "నమ్మకం" ప్రజల్లో ఎలా వచ్చింది?

"అలా తగ్గిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా?"

"ఏమో" ..."ఏమో" ...."ఏమో"

"ఎంత చిత్రం...మనిషి ఆలోచనలు..నమ్మకాలు" అనుకుని...

మంత్రం వేసి వైద్యం చెయ్యటం అనే గండం నించి గట్టెక్కానని..గుండెల నిండా గాలి పీల్చుకుని..కార్లో వెనక సీట్ కిచేరగిలపడి పుస్తకం చదువుకోవటంలో నిమజ్ఞమయింది..వసుంధర

మరిన్ని కథలు

Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు