బ్రతుకు కబురు - శానాపతి (ఏడిద) ప్రసన్నలక్ష్మి

news about alive

అమ్మో...చావడం కూడా తేలికైన పనికాదు. నా దురదుష్టమేమిటో...అరడజను సార్లు ప్రయత్నించినా.... చావు కరుణించట్లేదు...అనుకున్నాడు అప్పారావు.

పైనుంచి దూకేస్తే నాచావు సులభం అనుకున్నాడు గానీ ఎత్తయిన కొండను చూస్తే కళ్ళు తిరిగాయి. దానితో ఆ కొండ ఎక్కలేనేమో అనుకుని సాహసం చేయలేదు. ఇంకోసారి చెట్టు కొమ్మకి ఊరేసుకుందామని ప్రయత్నిస్తే ఆ కొమ్మ కాస్తా విరిగిపోయింది. విరిగిపోతే విరిగింది... మరో చెట్టుకైనా ప్రయత్నిద్దామని చూస్తే...అన్నీ మొక్కలూ, తుప్పల్లాంటివే కనిపించాయి. మూడోసారి గోదావరి బ్రిడ్జి ఎక్కి దూకేసాడు. కానీ ఏమయ్యింది...గడ్డిమోపున్న పడవలో పడ్డాడు. పడితే పడ్డాడు...ఆపడవలోంచి మళ్లీ నీళ్లలోకి దూకేయబోతుంటే... ఆ పడవ నడిపేవాడు చేతిలోని చుక్కాన్ని వదిలేసి...అతని కాలు పట్టుకుని ఒక పట్టాన్న వదలనంటే వదలనన్నాడు. ఈసురోమని ఒడ్డుకు చేరుకున్నాకా...పురుగుల మందు సంపాదించాడు. అది తాగితే అతని కడుపులో పురుగులన్నీ చచ్చాయి గానీ...తను మాత్రం చావలేదు. మరోసారి నిద్రమాత్రలు కొనుక్కుని మింగితే...అదేంటో గానీ రోజూ పట్టే నిద్రకూడా పట్టలేదు సరికదా...ఇట్టే తెల్లారిపోయింది. లాభం లేదు యే రైలు కిందో తల పెడదామని వెళ్లి ..పట్టాల మీద ఉన్న ఇంజను ముందుకెళ్లి పడుకున్నాడు. ఒక బుర్రమీసాల పోలీసాయనొచ్చి..."లేలే నాయనా...ఈరోజు నుంచి రైళ్లు రాకపోకలు ఆపేశారు. ఈ లాక్ డౌన్ ఉన్నంత కాలం...ఏమీ కదలవు...ఇంటికెళ్లి బుద్దిగా పెళ్ళాం పిల్లలతో గడుపుకోక ఎందుకొచ్చింది నీకీ పాట్లు" అంటూ....నాలుగు చివాట్లు వేసి...వెనక్కి పంపించేశాడు.

ఓరి నాయనో...ఆఇంటి నుంచి తప్పించుకోడానికే కదా...నేనెన్నిపాట్లూ పడుతున్నాను. మళ్లీ నేను మాత్రం ఇంటికెళ్లే ప్రసక్తి లేదు గట్టిగా మరోసారి నిర్ణయించుకున్నాడు తన ప్రయత్నాలన్నీ బెడుసుకొట్టడంతో....మరింత మనసు పాడైపోయి నడుస్తుంటే...ఎప్పుడు ఆంధ్రా బోర్డర్ దాటేసి తెలంగాణాలో అడుగుపెట్టేసాడో తనకే తెలియలేదు. అదిగో అక్కడే పట్టేసుకున్నారు అతన్ని మళ్లీ పోలీసోళ్లు. రోడ్ల మీద నడుస్తున్న పాపానికి క్వారెంటైన్లో పడేసారు. అక్కడ ఉండగా చిన్నపాటి దగ్గు వచ్చిందని కరోనా టెస్ట్ చేశారు. నా కోరిక తీర్చడానికి నన్ను అదృష్టం వెంటాడినట్టుంది...అనుకుంటూ పొంగిపోయాడు. తనకు కరోనా పాజిటివ్ రావడంతో ఎగిరి గంతేశాడు. "నాకు చావు ముంచుకొస్తుందోచ్" అని అరిచేశాడు కూడా. అక్కడున్న అందరూ అతని వైపు పిచ్జోడిలా చూసారు.

ఆఖరిసారిగా తన భార్యా పిల్లలతో మాట్లాడదామని స్విచ్ ఆఫ్ చేసున్న తన సెల్ ఫోన్ ని ఆన్ చేసాడు. అప్పటికే అతని భార్య నుంచి చాలా కాల్స్ వచ్చి ఉన్నాయి. భార్యకు ఫోన్ చేయబోతుంటే...ఈలోపులో ఆవిడే చేసేసింది.

"ఏమండీ... మీరేం అయిపోయారు...? ఎన్నిసార్లు ఫొన్ చేసినా ఎత్తలేదు. రెండు రోజుల క్రితమే మీరు హైద్రాబాద్ వస్తానని రాలేదు. ఈ లాక్ డౌన్ లో మీరెక్కడ లాక్ అయిపోయారో అని తెగ కంగారు పడ్డాం. అన్నట్టు... మన తెలంగాణా ముఖ్యమంత్రి గారి పుణ్యమాని మూడు నెలల వరకూ మనం ఇంటి అద్దె కట్టవసరం లేదండీ. అద్దె అడిగితే 100 కి ఫోను చేయమన్నారు. ఈలోపు మన ఆర్థిక పరిస్థితులు చక్కబడక మానవు. మీరేమీ ఇంటి ఓనరుకి అద్దె కట్టాల్సిన విషయంలో కంగారుపడి భయపడాల్సిందేమీ లేదు. మీరెక్కడ వున్నా...జాగ్రత్తగా ఉండండి. ఈ కరోనా కాటేయకుండా" అంటూ చెప్పి ఫోన్ పెట్టేసింది.

అప్పారావుకి ఫోన్లో భార్య చెప్పిన మాటలు వినగానే.... ప్రాణం లేచివచ్చినట్లయ్యింది. ఈ ఇంటి అద్దెలు కట్టుకోలేక... ఇంటి ఓనరు బెదిరింపులకు తట్టుకోలేక.... ఆత్మహత్యే నయమనుకున్నాడు. ఇప్పుడు కనీసం ఈ మూడు నెలలు అయినా తన భార్యా బిడ్డలతో ఆనందంగా గడపొచ్చు అనుకున్నాడు. ఆ మరుక్షణమే తను ఏ పరిస్థితిలో ఉన్నాడో గుర్తొచ్చి ...ఈ కరోనా ఏంటి నన్నిలా కబళించింది...? నేను పురుగుల మందు తాగినందుకు నాలో పురుగులు చచ్చినట్టే ఈ వైరస్ కూడా చచ్చిఉంటే ఎంత బాగుండేది...? నన్ను రక్షించు దేవుడా...అనుకుంటూ కనిపించని దేవుళ్లందరినీ వేడుకుంటున్నాడు.

రెండు వారాలు గడిచిపోయాయి....

అప్పారావుకి కరోనా పాజిటివ్ వచ్చినా...ఎలాంటి దగ్గూ, తుమ్ములు, జ్వరం ఇలాంటి ఏ లక్షణాలూ కనిపించకపోవడంతో... తప్పకుండా తను పురుగుల మందు తాగిన ఫలితమే అనుకున్నాడు. కానీ...చావు భయం ఇంకా వెంటాడుతూనే ఉంది. తను చస్తాడో.... బ్రతుకుతాడో... ఇంకా ఏమీ అర్ధం కాని పరిస్థితిలో ఉండగా...డాక్టర్ గారు వచ్చి అప్పారావు భుజం తట్టారు.

"మిస్టర్ అప్పారావు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకొచ్చిన రిపోర్టు నీది కాదు ..... మరొక అప్పారావు కొచ్చిన పాజిటివ్ రిపోర్టు అది. పొరపాటున నీకు ఇచ్చేసారు" అంటూ బ్రతుకు కబురు చల్లగా చెప్పారు.

అప్పారావు...ఆనందానికి అవధుల్లేవు. చావుని జయించినంత ఆనందంగా...గంతులేసుకుంటూ....ఇంటి ముఖం పట్టాడు...!!*

మరిన్ని కథలు

Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE