మనుషులు ఇంత బలహీనంగా ఎందుకుంటారో నాకు అర్థం కాదు. నేనంటున్నది శారీరక బలహీనత గురించి కాదు. మానసిక బలహీనత గురించి. బంధాలు అనుబంధాలు అనేవి మనసుని మరింత బలహీనం చేస్తాయని నా అభిప్రాయం. ఈ సంకెళ్ళలో పడటం వల్ల ఏమిటి లాభం ? మనిషి ఎదుగుదలకి మరింత ఆటంకం కలగడం తప్ప !
అప్పుడప్పుడే తెలవారుతోంది. భాను కిరణాలు ఒంటికి చురుక్కున తగులుతున్నాయి. భుజాన బేగ్ తో నెమ్మదిగా మట్టి రోడ్డు మీద నడుస్తున్నాను. ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్న నేను నా తల్లి మరణ వార్త విని మా ఊరికి వచ్చాను. లూప్ రోడ్డు మీద బస్ దిగి మరో రెండు కిలోమీటర్లు నడిస్తే గాని రాదు మా ఊరు. అంత వెనుకబడిన గ్రామం . అటువంటి పల్లెటూల్లో పుట్టి హైదరాబాద్ దాకా ఎదిగానంటే నిశ్చయంగా అది నా గొప్పతనమే కదా !
అసలు ఇప్పుడు నేను రాకూడదు అనుకున్నాను. కానీ ఈ లోకం నన్ను ఒక రాక్షసుడి గా చిత్రీకరిస్తుందని భయపడ్డాను. మనిషి చనిపోయాక వచ్చి ఏమి లాభం ? అసలు అమ్మ బ్రతికున్నప్పుడు వస్తేనే నాకు వృధాగా అనిపించేది. ఇంతకు ముందు చాలా సార్లు నన్ను ఊరు రమ్మని నా ప్రాణం తీసేస్తుండే వారు నా తల్లిదండ్రులు. వచ్చి మాత్రం నేను ఏమి చెయ్యాలి ? వాళ్ళ పోరు పడలేక అప్పుడప్పుడు వచ్చేవాడిని. మాట్లాడుకోవాల్సిన మాటలు అన్నీ ఒక రోజు లో అయిపోతాయి. ఆ తర్వాత అంతా బోర్. ఎవరెవరో వస్తూ ఉంటారు. ఏదేదో అడుగుతూ ఉంటారు. అవన్నీ నేను చెప్పి వాళ్ళని ఆనందింపజేయాలి. పెద్ద టైం వేస్ట్ లా అనిపించేది నాకు. అన్నిటి కంటే ముఖ్యంగా అక్కడ హైదరాబాద్ లో నా ఆఫీసు గుర్తుకు వచ్చేది. చెయ్యాల్సిన పని గుర్తుకు వచ్చేది. బాగా పని చేస్తే వచ్చే ప్రమోషన్ గుర్తుకు వచ్చేది. వెను వెంటనే మనసులో చిన్న పాటి భయం పుట్టేది. ఆ భయం - ఇలాగే పల్లెటూల్లో ఉండిపోతే ఈ నవ యుగంలో నేను మిగతా వాళ్ళకంటే రేసు లో వెనకబడిపోతానేమోనని. వెంటనే దుకాణం సర్దేసి హైదరాబాద్ పారిపోయే వాడిని....
నడుస్తుంటే ఇద్దరు ముగ్గురు తెలిసిన గ్రామీణులు కనిపించి పలకరించారు. వాళ్ళని చూస్తేనే నాకు అదో లాంటి చిన్న చూపు కలిగింది. పిపీలికాల్లా కనిపించారు. నా చిన్నప్పటి నుండి వాళ్ళను చూస్తున్నాను. అదే ఊళ్ళో ఎదుగొ బొదుగూ లేకుండా ఉండిపోయారు. కనీసం జీవితం లో ఎదగాలన్న ప్రయత్నం కూడా చేయరు. ఏమిటో ఈ మనుషులు ?
ఇల్లు రావడంతో ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి చుట్టూ చూసాను. నా తల్లి శవం వాకిట్లో ఉంది.అందరూ నన్ను చూడగానే భోరున ఏడవడం మొదలు పెట్టారు. నాకు పెద్దగా ఏడుపు రాలేదు. బహుశా అది నా స్థితప్రజ్ఞత కావచ్చు. వెంటనే చెయ్యవలసిన పనుల్లో దిగి పోయాను. అన్ని పనులు పూర్తయ్యేటపటికి సాయంత్రం అయింది. బాగా అలసటగా అనిపించి మంచం మీద వాలిపోయాను.
* * *
మా ఊరు... బాగా వెనుకబడినదైనా చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. డబ్బున్న వాళ్ళు, పేద వాళ్ళు, చదువుకున్న వాళ్ళు , నిరక్షరాస్యులు ..ఇలా అందరూ ఉన్నారు మా ఊళ్ళో. అందమైన కోనేరు , దానికానుకుని కోవెల
...దూరంగా చిన్న పాఠశాల. ఆ పాఠశాల నుండి అక్షరాలు నేర్చుకుంటున్న పిల్లల గొంతులు ..లయబద్ధంగా వినబడే సంగీత ప్రవాహంలా ఉంటుంది.
పొద్దున్న లేవగానే మేడ మీదకి చేరుకుని ఆ అందాలన్నిటినీ చూస్తున్నాను.
నా చిన్నప్పుడు ఇదే ఊళ్ళో చదువుకున్న సంగతులన్నీ గుర్తుకు రాసాగాయి. ఎంతో హాయిగా ఉండేది అప్పటి జీవితం. చదువు తప్ప ఇంకే బాధా లేని అందమైన బాల్యం. ఆ మాటకొస్తే చదువు కూడా ఆనందంగా ఉండేది. అదంతా నా తల్లి దండ్రులు దీవెన ... నా గురువుల చలవ !
అప్పట్లో సాయంత్రం కాగానే సైకిల్ బెల్ కోసం నా చెవులు ఎదురు చూస్తుండేవి. ఆ శబ్దం వినగానే నేను ఇంట్లోకి పరుగెత్తి పుస్తకాలు ముందేసుకుని చదువుతున్నట్టు నటించేవాడిని. కాసేపటికి మా నాన్నగారు సైకిల్ ని వాకిట్లో పెట్టి లోనికి వచ్చేవారు. బుద్ధిగా చదువుతున్న నన్ను చూసి సంతృప్తి గా తలాడించేవారు.
ఆయన కాళ్ళూ చేతులూ కడుక్కుని కూర్చున్నాక టీ తీసుకొచ్చి ఇచ్చేది అమ్మ. పిచ్చాపాటీ మాట్లాడుకొనే వారు. నేను నెమ్మదిగా వాళ్ళ దగ్గర చేరేవాడిని. ఆ ముచ్చట్లు వింటూ లోక జ్ఞానం పెంచుకొనేవాడిని. తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య బంధం బలపడటానికి ఇటువంటి చిన్న చిన్న సమావేశాలే కదా దోహదపడేది !
కాలక్రమేణా నేను చదువుకోసం దూరంగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒక రకమైన బాధ కలిగింది. కానీ చదువు మీద శ్రద్ధ ఆ బాధను జయించేలా చేసింది. ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు సెలవులకి ఇంటికి వచ్చి పోతూ ఉండేవాడిని. క్రమంగా నాకంటూ ఒక ప్రపంచం ఏర్పడుతూ ఉండటంతో నా తల్లిదండ్రులతో ఉన్న బాంధవ్యం పలచబడసాగింది. డిగ్రీ పూర్తయి జాబ్ లో చేరేటప్పటికి పూర్తిగా రాటు దేలిపోయాను. మానవసంబంధాలన్నీ పూర్తిగా అవసరం పునాదులమీదే నిర్మించ బడతాయని బలంగా నమ్మే స్థితికి వచ్చేసాను. అందుకే అప్పుడు అందంగా కనబడిన ఊరు
ఇప్పుడు చాలా బోరింగ్ గా అనిపిస్తోంది. ఊరి వాళ్ళు పనికి రాని వాళ్ళుగా కనబడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఇక్కడి నుండి పారిపోదామా అని ఆరాటం !
" ఏరా ...బయలు దేరుతానన్నావటగా ! " అంటూ వచ్చారు నాన్న.
" అవును నాన్నా. ఆఫీసు లో చాలా పని ఉంది. వెంటనే వెళ్ళాలి. ప్రోజెక్ట్ డెడ్ లైన్ దగ్గరపడుతోంది " నోటికొచ్చిన అబద్ధం చెప్పేసాను. ఉసూరుమంటూ చూసారు నాన్న. ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తున్న నిస్పృహ !
కిందికొచ్చి బేగ్ సర్దుకుని బయలు దేరాను. తిరుగు ప్రయాణంలో కళ్ళు మూసుకున్నప్పుడల్లా నాన్న ముఖమే కనిపిస్తోంది. అందులో ఆయనేదో చెప్పబోతున్న ' సందిగ్ధత ' కనిపిస్తోంది. అది నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతోంది. ఆ ఇబ్బంది ని ' మెటీరియలిజం ' అనే ముసుగు వేసుకుని పక్కకు తోసేసాను.
హైదరాబాద్ లో ఇంటికి చేరుకొనే సరికి నా భార్య ఇంట్లో లేదు.
" చిన్నీ ..మీ మమ్మీ ఎక్కడ్రా ?" అని నా కొడుకుని అడిగాను.
" నాకు తెలీదు " అని కేర్లెస్ గా సమాధానం ఇచ్చి స్మార్ట్ టేబ్ లో తల దూర్చేసాడు. ఎనిమిదో క్లాసు చదువుతున్న వాడికి నేనంటే ఎటువంటి భయం లేదు. ప్రేమ అంతకన్నా లేదు. జనరేషన్ గేప్ అనుకుని సర్దుకున్నాను. నా భార్య మొబైల్ కి ఫోన్ చేసాను. నో రెస్పాన్స్ !
ఈసురోమంటూ సోఫాలో కూలబడి అలాగే వాలిపోయాను. ఇంట గెలిచి రచ్చ గెలువు అంటారు పెద్దలు. కానీ నేను బయట మాత్రమే హీరోని ! ఇంట్లో మాత్రం జీరో ని .విరక్తి తో నవ్వొచ్చింది నాకు
* * *
కంప్యూటర్ కి మొహాన్ని అతికించి సీరియస్ గా పని చేసుకుంటుంటే మొబైల్ రింగ్ అయింది. నాన్న దగ్గర నుండి ఫోన్. గుండె గుభేల్ మంది. కొంపదీసి ఊరికి రమ్మని అడగడు కదా !
లిఫ్ట్ చేసి " హలో .." అన్నాను.
" బాబూ..నేను..నీ బాబాయి ని ...నాన్న కి పొద్దున్న బీపీ బాగా డౌన్ అయింది. ఇప్పుడే హాస్పిటల్ కి తీసుకొచ్చి ఎడ్మిట్ చేసాము. నువ్వొకసారి వస్తే బాగుంటుంది . వీలు చూసుకుని రా " అని చెప్పాడు.
" అయ్యో ..అలాగా ..సరే బాబాయ్ ..తప్పకుండా వస్తాను. నాన్న జాగ్రత్త ! " ఫోన్ కట్ చేసాను. మనసులో ఒకటే అలజడి. వెంటనే బయలుదేరి వెళ్ళాలనిపించింది. కానీ కంప్లీట్ చెయ్యాల్సిన వర్క్ కళ్ళముందు కదిలింది. బాస్ ని పర్మిషన్ అడుగుదామని ఆయన కేబిన్ దాకా వెళ్ళి మనసొప్పక వెనక్కి వచ్చేసాను. ఫోన్ చేసి నా భార్యకు చెబుదామనుకున్నాను. వెళ్ళాలని పూర్తిగా డిసైడ్ అవక ముందే ఆమెకు చెప్పడం ఎందుకని ఆగిపోయాను. అంతా డైలమా ! మనసులో నాన్న దగ్గరకు వెళ్ళాలని ఉంది.. అలాగని బాస్ అని లీవ్ అడగలేని అశక్తత ! అడిగితే ప్రోజెక్ట్ షెడ్యూల్స్ గుర్తుచేస్తాడని భయం ! కెరీర్ లో పైకి ఎదగ లేక వెనకపడిపోతానన్న భయం .
సాయంత్రం ఇంటికొచ్చాను. నా కోసమే ఎదురుచూస్తున్నట్టు గబ గబా నా దగ్గరకొచ్చి " చిన్ని గాడికి బాగా జ్వరం వచ్చిందండీ ..మీకు ఆఫీసుకి ఫోన్ చేసి చెబుదామనుకున్నాను..కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యడం ఇష్టం లేక చెయ్యలేదు " చెప్పింది నా భార్య. తల తిరిగిపోయింది నాకు. నాన్నకు బాగా లేదని చెప్పి ఆవిడ తో డిస్కస్ చేసి ఊరు వెళదామనుకున్నాను. చిన్ని గాడికి బాగా లేని ఈ పరిస్థితి లో ఎలా చెప్పగలను. నా మనసులో మాటలు మనసులోనే సమాధి అయి పోయాయి.
చిన్ని గాడి దగ్గరకు వెళ్ళి నుదుటి మీద చెయ్యి వేసి టెంపరేచర్ చూసాను. బాగా కాలిపోతోంది. వెంటనే వాడిని దగ్గర్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఎమర్జెంసీ కి తీసుకెళ్ళాను. డాక్టర్ అన్ని పరీక్షలు చేసి మెడిసన్ ఇచ్చాడు. మా టెంషన్ కొంచెం తగ్గింది. రాత్రి భోంచేసి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాను. నాన్న మొహమే గుర్తుకు వచ్చింది. ' బాబాయి వాళ్ళు నాన్నను బాగా చూసుకుంటారు లే ' అని సర్ది చెప్పుకొని నిద్ర లోకి జారుకున్నాను.
" ఏరా ..ఎప్పుడొచ్చావు..బాగున్నావా " అడుగుతున్నాడు బాబాయి.
" బాగున్నాను బాబాయ్ ...నాన్న గారు ఎక్కడ " అడిగాను
బాబాయ్ తన వెంట హాస్పిటల్ వార్డ్ లోకి తీసుకెళ్ళాడు. బెడ్ మీద మగత నిద్రలో ఉన్నాడు నాన్న. " నాన్నా .." అని పిలిచాను. నెమ్మదిగా కళ్ళు తెరిచారు. చీకటి స్థానంలో వెలుగు వస్తున్నట్టు నాన్న మొహంలో ఆనందాశ్చర్యాలు.
" బాగున్నావా నాన్నా .." చేతిని స్పృశించి ప్రేమగా అడిగాను.
బాగున్నాను అన్నట్టు తలాడించారు. చాలా సేపు మా మధ్య మౌన సంభాషణ సాగింది. " వెళ్ళొస్తాను నాన్నా .." అని లేచాను. అప్రయత్నంగా నా కంటి నుండి జారిన కన్నీటి చుక్క ! గబుక్కున మెలకువ వచ్చింది. కల.. కల చెదిరి పోయింది. చెంపల పైకి జారిన కన్నీటిని తుడుచుకున్నాను.
ప్రతీ చిన్న విషయానికీ నా తల్లి మీద ఆధారపడిన నాన్న ఇప్పుడు ఒంటరిగా ఎలా నెగ్గుకొస్తున్నాడో ? బహుశా బాబాయి వాళ్ళ సహాయంతో సర్దుకుపోతున్నాడేమో ! నా దగ్గరకు వచ్చేయమని ఎంత బ్రతిమాలినా రానన్నాడు . ఏదైతేనేం ...నేను ఏ విధంగానూ ఆయన్ని చూసుకోలేనప్పుడు బంధువుల సహాయంతో బండి లాగించేస్తే మంచిదే కదా ! అని సర్ది చెప్పుకున్నాను. తర్వాత ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు.
* * *
కాలం ఎవరి కోసం ఆగకుండా పరుగెత్త సాగింది. సంవత్సరం గడిచిపోయింది నా తల్లి మరణం తర్వాత. మధ్యలో నేను ఊరు వెళ్ళింది లేదు. ఒంటరిగా ఉంటున్న నాన్న తో అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడటం తప్ప చూడటానికి వెళ్ళలేదు.
ఒక రోజు... ఆఫీసు పని సీరియస్ గా చేసుకుంటున్నాను.
నా బాస్ దగ్గరికి వచ్చి " ఎంతవరకు వచ్చింది వర్క్ " అడిగాడు .
" బాగానే అవుతుంది సార్ .." ఒబీడియంట్ గా చెప్పాను.
" ఓకే.. ఓకే.. కేరీ ఆన్ .." అని ఆగి " ...మన వైజాగ్ బ్రాంచ్ వర్క్ ప్రోగ్రెస్ ఒక సారి చూసి రావాలి.. నీకు వెళ్ళడం వీలవుతుందా " అడిగాడు.
" వీలవుతుంది సార్ .." అని వెంటనే చెప్పాను. మా ఊరు వైజాగ్ నుండి ఏభై కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. ఆఫీసు పని మీద వైజాగ్ వెళ్ళడం మంచిదే ..నాన్నగారిని ఒక సారి మా బ్రాంచ్ ఆఫీసు కి వచ్చి కలవమని చెప్పొచ్చు.. లేదా వీలైతే నేనే ఊరు వెళ్ళి ఆయనను చూడొచ్చు అనుకున్నాను.
ఇంటికి రాగానే నా భార్యతో టూర్ విషయం చెప్పాను. నర్మగర్భంగా నవ్వి " వెళ్ళు ...ఇప్పుడు నిన్ను ఎవరు ఆపారని ? అయినా నేను ఆపినా నువ్వు ఆగవు కదా ! " అంది. ఆమె మనసులో కదులుతున్న భావాలు నాక్కూడా అర్థం అయ్యాయి. అయినా నేను వైజాగ్ వెళ్ళాలి ..తప్పదు. లగేజ్ బేగ్ సర్దుకున్నాను.
బయలు దేరుతుంటే నా భార్య అంది. " ఆఫీసు పని పూర్తి చేసుకుని తిన్నగా హైదరాబాద్ రండి . చిన్నీ నేనూ ఒంటరిగా ఉండలేము. అర్థమైంది కదా ! "
" అర్థమైంది... తిన్నగా వచ్చేస్తాను " అని చెప్పి బయటపడ్డాను.
* * *
రైలు కదులుతోంది. బయట చీకటి నా మనసు లాగే నల్లగా .... బాధతో మూలుగుతున్నట్టుగా ఉంది. అక్కడక్కడ మిణుకు మిణుకు మంటున్న లైట్లు నా మనసులో కదులుతున్న అస్పష్టమైన ఆశల్లాగే మెరుస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా ఊరు వెళ్ళి నాన్నను చూడాలి. అదే నా కోరిక. అనారోగ్యం నుండి బయటపడిన తర్వాత నన్ను ఒకసారి రమ్మని నాన్న అడిగారు. అయినా నేను బిజీ గా (?) ఉండటం వల్ల వెళ్ళలేకపోయాను. ఇప్పుడు ఎలాగైనా వెళ్ళాలి...ఒంటరి తనంతో బాధపడుతున్న నా తండ్రిని ఓదార్చాలి. ఎందుకో నా బాల్యంలో జరిగిన చిన్న సంఘటన గుర్తుకొచ్చింది.
" బాబూ ...అన్నం పెట్టనా " అడుగుతున్నారు నాన్న. అదేంటి ! రోజూ అమ్మ అడుగుతుంది కదా ..ఈ రోజు నాన్న ఎందుకడుగుతున్నారు అనుకున్నాను. నా సందేహం అర్థమైనట్టు " మీ అమ్మ ఊరెళ్ళిందిరా ..వాళ్ళ అమ్మను చూడ్డానికి. ఇంకో రెండు రోజుల దాకా రాదు. " అని చెప్పారు.
" సరే నాన్నా ..అన్నం పెట్టు " అని తినడానికి సిద్ధమయ్యాను. ప్లేట్లో అన్నం..కూర .. పెట్టి తెచ్చారు నాన్న. దాన్ని అన్నం అనే కంటే ' జావ ' అనడం బెటర్.కూర అనే పదార్ధం అయితే నల్ల గా మాడి పోయి కొత్త రకం చైనీస్ వంటకంలా ఉంది.
" ఇదేంటి నాన్నా..ఇలా ఉంది "అన్నాను.
" నీ కోసం కష్టపడి వండి పెడితే అలా అంటావేంట్రా ..చక చకా తినేసేయ్ " అన్నారు
అతి కష్టం మీద అన్నం అనే ఆ పదార్ధాన్ని పొట్టలోకి పంపించేసాను. కాసేపయ్యాక కడుపు నొప్పి మొదలయ్యింది.
కడుపు పట్టుకుని " నాన్న ..కడుపు నొప్పి " అంటూ ఏడ్చాను. టేబ్లెట్ కోసం వెదకడం మొదలు పెట్టారు నాన్న. కానీ ఆయన అంవేషణ ఫలించ లేదు . " టేబ్లెట్స్ అన్నీ ఎక్కడ పెట్టిందిరా మీ అమ్మ " అంటూ విసుక్కోవడం మొదలు పెట్టారు. చేతగాని తనానికి మరో రూపమే విసుగు కదా ! పొద్దున్న లేచి సైకిలేసుకుని స్కూల్ కి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్పి సాయంత్రం వచ్చి బాగా అలిసి పోయినట్టు పోజు పెట్టి ' రెస్ట్ ' తీసుకొనే నాన్నకి ఇంట్లో ఎక్కడ ఏముందో తెలుస్తుందనుకోవడం నా అత్యాశే ! మొత్తానికి టేబ్లెట్ దొరక లేదు కానీ నా కడుపు నొప్పి నెమ్మదిగా తగ్గు ముఖం పట్టింది. తర్వాతి రోజు కూడా ఇదే తంతు. ఇల్లంతా నరకం లా తయారయింది. రెండ్రోజుల తర్వాత అమ్మ వచ్చింది. ఇల్లంతా సర్ది ఒక దార్లోకి తెచ్చింది. ఆ తర్వాత ఎప్పుడూ అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళినట్టు గుర్తు లేదు.
అలా... ఇటు పుల్ల తీసి అటు పెట్టడం చేతగాని నాన్న ...దాహం వెస్తే గ్లాసు లో నీళ్ళు పోసుకుని త్రాగడం చేతగాని నాన్న ...ప్రతీ చిన్న విషయానికి అమ్మ మీద ఆధారపడే నాన్న.. ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నాడో .... ఒంటరి తనాన్ని ఎలా భరిస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు.ట్రైన్ వేగం అందుకుంది. నిద్ర ముంచుకు రావడంతో బెర్త్ మీద అలా వాలి పోయాను.
పొద్దున్న వైజాగ్ లో రైలు దిగి ఫ్రెష్ అయ్యి బ్రాంచ్ ఆఫీసుకి వెళ్ళాను. వెళ్ళడంతోనే పని ప్రారంభించాను. లక్కీ గా మధ్యాహ్నం లంచ్ టైము కల్లా పని పూర్తయింది. నేను హైదరాబాద్ వెళ్ళాల్సిన ట్రైన్ రాత్రి పదకొండు గంటలకి. మా ఊరు వెళ్ళి నాన్న గారిని చూసి మళ్ళీ వైజాగ్ వచ్చి ట్రైన్ కేచ్ చెయ్యడానికి టైము సరిపోతుంది. ఇక మరో ఆలోచన లేకుండా ద్వారకా బస్ స్టేషన్ కి వెళ్ళి మా ఊరు వెళ్ళే బస్ ఎక్కేసాను.
* * *
గంట లో ఊరికి చేరుకున్నాను. బస్ దిగి ఇంటికి వెళ్ళేటప్పటికి తాళం కప్ప వెక్కిరిస్తూ కనపడింది.
" ఏరా ..ఎప్పుడొచ్చావు ? " అంటూ బాబాయి వచ్చారు. " ఏం బాబూ బాగున్నావా ? " అని చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు. " ఏరా.. హైదరాబాద్ వెళ్ళాక ఊరు మర్చిపోయావా ? " ఎవరో ఎకసెక్కంగా అంటున్నారు. అన్నీ విని మౌనంగా ఊరుకున్నాను. ఎందుకంటే... ఏ ప్రశ్నకూ నా దగ్గర సమాధానం లేదు.
" బాబాయ్ .. నాన్న ఎక్కడికెళ్ళారు ..ఇంటికి తాళం వేసి ఉంది ? " అన్నాను.
ఆయన చిన్నగా నిట్టూర్చారు . " ఏం చెప్పమంటావురా ..హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత చాలా స్తబ్దుగా మారిపోయాడు మీ నాన్న. ఎవరి తోనూ మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ ఉండే వాడు. కొన్నాళ్ళ తర్వాత ఇంటికి తాళం పెట్టి మన పక్కనే ఉన్న ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయాడు...అక్కడే ఉంటున్నాడు "
" ఫారెస్ట్ లోకా " అదిరి పడ్డాను నేను.
" అవును ...ఫారెస్ట్ లోకే " నొక్కి వక్కాణిస్తూ చెప్పాడు.
ఆలోచనలో పడ్డాను నేను. ఊర్లో ఉన్న వాళ్ళందరినీ వదిలి ఫారెస్ట్ కి వెళ్ళాల్సిన అవసరం ఆయనకెందుకు వచ్చింది ? వెళ్ళడం సరే ...కనీసం నాతో మాట మాత్రమైనా చెప్పకుండా ఎలా వెళ్ళారు ? ఎందుకోసం వెళ్ళారు ? ...ఎవరైనా ఆయన్ని ఇబ్బంది పెట్టారా ? ఇలా ఎన్నో ప్రశ్నలు నా మదిలో ! . అన్నిటికీ సమాధానం తెలియాలంటే నేను ఫారెస్ట్ కి వెళ్ళి ఆయనని కలవాలి. అప్పుడే క్లారిటీ వస్తుంది .
" బాబాయ్ ..నాన్న గారి దగ్గరకు వెళ్దాం పద " అన్నాను. సందిగ్ధంగా చూసాడాయన. కాసేపాగి "సరే ..పద " అన్నాడు.
ఇద్దరం నడవసాగాం. దట్టమైన చెట్లు... రాళ్ళు రప్పలు ..వీటన్నిటినీ దాటుకుని నడుస్తున్నాము. అలా ఒక గంటసేపు నడిచాక విశాలమైన మైదానం లాంటి ప్రాంతానికి చేరుకున్నాము. ఒక్క సారిగా నా మనసు చిత్రమైన అనుభూతికి లోనయ్యింది. చుట్టూ పచ్చని చెట్ల మధ్య పరుచుకొని ఉన్న ఆ మైదానం మధ్యలో పర్ణశాల లాంటి ఒక ఇల్లు . దానికి దగ్గరలోనే ఒక వైపు పాఠశాల. ఇంకోవైపు హాస్పిటల్. మరి కొంచెం దూరంలో వసతి గృహం.. పక్కనే పిల్లలు ఆడుకొనే మైదానం. ఒక కొత్త లోకం లా అనిపించింది. పర్ణశాల లోకి వెళ్ళాము. తపోవనం లోని ఋషి లా ఉన్నాడు నాన్న.
" నాన్నా ...బాగున్నావా " అన్నాను.
నిర్వికారంగా నన్ను చూసి " బాగున్నాను " అన్నారు.
" ఇదేంటి నాన్నా ..అందరినీ వదిలి ఇలా ఇక్కడికి వచ్చేసావు " బాధగా అన్నాను.
అర్ధం కానట్టు చూసారు.
" వదలడం అంటే ఏమిటి ? " అని అడిగారు . నేను బ్లాంక్ గా చూసాను.
" ఏదైనా బంధనం ఉన్నప్పుడే కదా వదలడం అన్న మాట వస్తుంది. నాకు ఏ బంధనాలూ లేవు. ఇక వదలడం ప్రసక్తి ఏముంది ? " అన్నారు
నాకు మనసు లో ముల్లు గుచ్చినట్టయింది. మాతో ..అంటే నా భార్యా పిల్లలతో కూడా ఆయనకు ఏ సంబంధమూ లేదా ? బహుశా లేదేమో ! అందుకే ఈ వానప్రస్థం అనుకున్నాను.
పక్కనే ఉన్న పాఠశాల నుండి పిల్లలు గొంతెత్తి చదవడం వినిపిస్తోంది. వాళ్ళంతా గిరిజన పిల్లలు. బాహ్యప్రపంచానికి...నాగరికతకు దూరంగా బ్రతుకుతున్న వాళ్ళు. ఒక పక్క చంద్రుడి మీద నివాసం కోసం శాస్త్రవేత్తలు కృషి చేస్తుంటే ..ఇక్కడ నిరక్షరాస్యతతో ..అనారోగ్యాలతో ..అలరారుతున్న గిరిజనం. మనుషులందరూ జీవిస్తున్న ఒకే భూమి మీద ఇన్ని అసమానతలు...ఇన్ని వైరుధ్యాలు.
నాన్నగారు చెబుతున్నారు " బాబూ .. జీవితపు చివరి దశలో ఎదురైన సవాల్ ని జయించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్ని బాధ్యతలూ సక్రమంగా నిర్వర్తించానని అనుకున్నాను. కానీ ఒంటరి తనం నాకు కర్తవ్యాన్ని గుర్తు చేసింది. నేను చెయ్యాల్సిన పనులు ఇంకా మిగిలి ఉన్నాయని నాకు తెలిసొచ్చింది. నా అవసరం మీకు ఎవ్వరికీ లేకపోవచ్చు కానీ ఈ గిరిజనులకి ఉంది, అదే ఒక వరం గా భావించాను . అందుకే ఇంతవరకు నేను జీవించిన సమాజాన్ని పక్కకు పెట్టి ఇక్కడికి వచ్చేసాను. ఈ గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపటానికి నా వంతు గా కృషి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. వీళ్ళకి సరైన విద్య లేదు ..సమయానికి వైద్యసదుపాయం లేదు. అందుకే ఆ రెండింటినీ సమకూర్చాలని కంకణం కట్టుకున్నాను. ఇప్పుడు నాకు లక్ష్య సాధనలో క్షణం తీరిక లేదు. . " అంటూ ఆగారు.
" ... ఆ పనేదో మన ఊళ్ళోనే ఉండి చెయ్యొచ్చు కద నాన్నా .." అన్నాను
కాసేపు సాలోచనగా చూసి " తపస్సు అనేది అడవుల్లోనే చెయ్యాలి...జనారణ్యంలో కాదు. అయినా నా జీవితపు చివరి అంకం ఇక్కడే ముగియాలి. అదే నా నిర్ణయం . ఇక మీరు వెళ్ళవచ్చు " అన్నారు. నేను లేచి నిలబడ్డాను. బాబాయి మాత్రం నాన్నతో ఆ పూట ఉంటానన్నాడు. వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాను. నాకు తోడుగా ఒక గిరిజనుడిని పంపారు. అడవి నుండి వ్యతిరేక దిశ లో ఇంకోదారి గుండా నడిచాక బస్సు రోడ్డు తగిలింది. అక్కడి నుండి వైజాగ్ దగ్గరట. కాసేపట్లో బస్ వచ్చింది. ఎక్కి కూర్చున్నాను. బస్ పరుగెడుతోంది. సూరీడు పడమటి కొండల్లోకి దిగిపోతున్నాడు. సంజ కెంజాయ చెట్ల మీద నుండి ఏటవాలుగా రోడ్డు మీద పడుతోంది. నాన్న గురించి ఏదో అనుకుని వచ్చాను ..ఏదో తెలుసుకున్నాను. ఇన్నాళ్ళూ విజయం అంటే కెరీర్ లోపైకి ఎగబ్రాకడం అనుకున్నాను. మనల్ని మనం జయించడం అని తెలుసుకోలేకపోయాను. నాన్న ఎప్పటికీ ఒంటరి కాదు. కాంక్రీట్ జంగిల్ లో నాలుగ్గోడల మధ్య నిస్సారంగా బ్రతికేస్తున్న నేను...నేను... ఒంటరిని !
-------------0-------------