బాబి వయసు పదేళ్లు. చాలా తెలివైన వాడు. వాడి చిట్టి బుర్రలో ఎన్నో ప్రశ్నలు. మరెన్నోసందేహాలు. తనకు తెలియని వాటి గురించి స్కూల్లో మాస్టార్లనీ, ఇంట్లో అమ్మా నాన్నల్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. ఒకోసారి వాడి ప్రశ్నలకు జవాబులు చెప్పలేక, తల్లి మాలతి చాలా ఇబ్బంది పడుతుండేది.
ఆమెకు దైవ భక్తి చాలా ఎక్కువ. ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు చేస్తుండేది. తండ్రి చరణ్ కూడా భక్తి ప్రపత్తులలో తక్కువవాడు కాదు. ఆ చిన్న కుటుంబం సెలవులు దొరికితే చాలు గుళ్లకు, గోపురాలకు, యాత్రలకు వెళుతుండేవారు. అలా కొంత దైవ భక్తి బాబీకి కూడా అలవడింది.
ఈ మధ్య బాబీని వేధిస్తున్న సందేహాలలో ముఖ్యమైనవి ‘దేవుడంటే ఎవరు?’ ‘ఎక్కడుంటాడు?’, ‘ఎలా ఉంటాడు?’ అన్నవి. ‘దేవుడు ఎలా ఉంటాడు?’ అన్నది తనకు కొంత వరకు తెలుసు. ఎందుకంటే తను అమ్మా నాన్నలతో కలిసి ఆలయాలకు వెళుతుంటాడు కదా. అక్కడ గుళ్లో ఉన్న దేవుడ్ని దర్శించే వాడు. అలాగే తమ ఇంటిలోని పూజా మందిరంలో చిన్న చిన్న బొమ్మల రూపంలో దేవుడ్ని చూసాడు. గోడకున్న ఫోటోలో, పటంలో దేవుడు కనిపిస్తుంటాడు. అందుకని దేవుడు ఎలా ఉంటాడో తనకు తెలుసు.
కాని ‘ఎక్కడుంటాడు?’ ’ఎప్పుడు కనిపిస్తాడు?’ అన్నదే బాబీ ధర్మ సందేహం. మాలతి బాబి ధర్మ సందే హాల్ని కొంతవరకు తీర్చింది గాని అది బాబీకి పూర్తి సంతృప్తి నివ్వలేదు. దాంతో తండ్రి చరణ్ బాబీకి, దేవుడికి సంబంధించిన సందేహాల్ని కొంతవరకు నివృత్తి చేసాడు. చాలా వరకు బాబీకి అర్ధమయినట్టే అనిపించింది కానీ ఇంకా ఏదో అసంతృప్తి.
“సరే బాబీ… నీకు ఇంకా పూర్తి గా అర్ధం కావడానికి సమయం వచ్చినప్పుడు చెబుతాను లే” అన్నాడు తండ్రి చరణ్.
అంతలో కరోనా వైరస్ వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన కరోనా మన దేశంలో కూడా ప్రవేశించింది. ఎక్కడో చైనాలో ప్రారంభమై ఇప్పుడు భారతదేశంతో సహా ప్రపంచమంతా అతి శీఘ్రంగా వ్యాపించి ప్రజలను గడగడలాడిస్తోంది. కరోనా బారిన పడి వేలాదిమంది మరణిస్తున్నారు. వార్తలంతా ఆ వైరస్ గురించే. కరోనా గురించే.
ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి పదే పదే హెచ్చరికలు టీవీలో వస్తున్నాయి. వార్తల్లో, కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నది ప్రభుత్వం. ఆ వార్తలన్నీ టీవీలో వస్తున్నవి.
అది ఒక ప్రాణాంతకమైన వైరస్. అది ఒకరి నుండి ఒకరికి చాలా సులభంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే దాని బారినపడి ప్రపంచ దేశాలన్నీ విలవిల లాడుతున్నాయి. లక్షలాదిమంది దాని బారిన పడుతున్నారు. వేలాదిమంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు.
కరోనా కోరలనుండి ప్రజలని రక్షించడానికి, ఆ వ్యాధిని అరికట్టడానికి మన ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. అత్యవసర విధుల్లో ఉన్నవారు తప్పించి, ప్రజలెవరూ నిత్యవసరాలకు తప్పించి వీధుల్లో తిరగరాదు. అదీ తగిన జాగ్రత్తలు తీసుకొని మాత్రమే. అంతే కాకుండా మాటిమాటికీ చేతులు శానిటైజేషన్ చేసుకోవడం, సబ్బుతో కడుక్కోవడం లాంటివి కూడా తప్పనిసరి గా చేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించడం, ముఖానికి మాస్క్ ధరించడం కూడా తప్పనిసరి. ఎందుకంటే ఇంతవరకూ ఈ మహమ్మారికి మందు లేదు. ఇంకా కనిపెట్టలేదు.
అసలు ఈ వైరస్ ఉనికి కూడా ఈ మధ్యనే తెలిసింది. అది తెలిసేలోగానే చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మందులు లేనందువలన, ప్రస్తుతం వైరస్ సోకకుండా నివారణ ఒక్కటే ఉపాయం మాత్రమే కాదు, బ్రహ్మాస్త్రం కూడా అని ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై పోయారు. దాంతో ప్రజా జీవితం పూర్తిగా స్తంభించిపోయింది.
వేలాదిగా ప్రజలు కరోనా బారిన పడి అనేక ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వారికి సేవలు చేసే డాక్టర్లు, నర్సులు, హాస్పిటల్ సిబ్బంది, ఇంకా అహర్నిశలు కష్ట పడుతున్న పోలీసులు, పారిశుధ్య కార్మికులు. ప్రపంచమంతా ఇళ్లల్లో ఉంటూ ఉన్న వీరు మాత్రం తమ కుటుంబాల్ని వదిలి, కరోనా వ్యాధి గ్రస్తులకు నిరంతరం తమ సేవలను అందిస్తున్నారు. ఎన్నో వేల మంది ఆరోగ్య వంతులై, ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయి తమ తమ ఇళ్లకు వెళ్ళడానికి నిరంతరం శ్రమిస్తున్నారు.
అది అలుపెరుగని కఠోర శ్రమ! ఒక యజ్ఞం!! ఆ శ్రమలో, ఆ యజ్ఞంలో ఎంతో మంది సమిధలవుతున్నారు. చాలా మంది డాక్టర్లకు, నర్సులకు ఆ వ్యాధి అంటుకొని వాళ్ళు ప్రాణాలు వదలడం కూడా జరుగుతుంది.
ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు అందరితో పాటూ చరణ్ కుటుంబం కూడా టీవీల్లో చూస్తూనే ఉన్నారు. అలాంటి సందర్భం లోనే చరణ్ బాబీకి అర్ధమయ్యేలా చెప్పాడు.
“బాబీ… దేవుళ్ళు అంటే ఎక్కడో ఉండరు. వాళ్ళు మనుషుల్లోనే ఉంటారు. వాళ్లే దేవుడు చేసిన మనుషులు. మనుషుల్లో దేవుళ్ళు. మనకు ప్రత్యక్షంగా కనిపించే దేవుళ్ళు. మనకు మంచి చేసే దేవుళ్ళు. మనిషికి మనిషి రూపంలో సేవలు చేసే ప్రతివారూ దేవుళ్ళే. మానవ సేవే మాధవ సేవగా భావించేవాళ్లు.
ఉదాహరణకి ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు నిరంతరం సేవలు చేసే డాక్టర్ లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు ఇంకా వారిని రక్షించడానికి తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టే ఎందరో మహానుభావులు. వాళ్లంతా దేవుళ్ళే బా బూ…” అని బాబీకి అర్ధమయ్యేలా చెప్పాడు చరణ్. దాంతో బాబీ చిట్టి బుర్రకి తండ్రి చెప్పింది బాగా అర్ధమయ్యి, వాళ్ళు టీవీలో కనిపిస్తే చాలు చేతులెత్తి మొక్కేవాడు.
***