బాధ్యత (కరోనా కథ) - sannihith

responsibility(corona story)

అవినాష్ మనసు చాలా ఆనందంగా ఉంది.. ఎన్నాళ్ళ నుండో కంటున్న కల !..ఇప్పుడు తీరబోతోంది.

ఇండియాలో ..అదీ సౌత్‌ ఇండియాలోని ఆంధ్ర ప్రదేశ్‌ లో ఒక మారు మూల పల్లెటూల్లో పుట్టిన కుర్రాడు అతడు. కష్టపడి ఇంజనీరిన్‌ చదువుకొని లండన్‌ దాకా వెళ్ళ గలిగాడు. అదంతా అతని మిత్రుల చలువ. లేకపోతే... పేద రైతులు అతని తల్లి దండ్రులు, అతన్ని విదేశం పంపడం అనేది కల !

లగేజ్‌ సర్దుకుని ఎయిర్‌ పోర్ట్‌ కి కేబ్‌ లో బయలుదేరాడు . నల్లటి కేబ్‌ లో కూర్చున్నాక చుట్టూ పరిసరాలను గమనించసాగాడు. వెనక్కు సాగిపోతున్న ఎత్తైన భవనాలు. అది షేర్‌ కేబ్‌ కావడంతో అతనితో పాటూ వేరే విదేశీ ప్రయాణీకులు. వాళ్ళని చూసి చిన్నగా నవ్వాడు. ప్రతిగా వాళ్ళు కూడా నవ్వారు. అతని మనసు లో ఉన్న ఆనందం మొహంలో తెలుస్తూనే ఉంది.

" గోయింగ్‌ టు ఇండియా ?..." పక్క అతను అడిగాడు

" యా.. " అంటూ సమాధానమిచ్చాడు అవినాష్ . తర్వాత సాధారణంగా సాగిన సంభాషణ ! కాసేపట్లో ఎయిర్‌ పోర్ట్‌ వచ్చింది. దిగి అందరికీ " బాయ్‌ .." అని చెప్పాడు.

విశాలంగా ఉన్న ఎయిర్పోర్ట్‌ లో ప్రవేశించి తన టికెట్‌ తో చెక్‌ ఇన్‌ చేసి హైదరాబాద్‌ దాకా బోర్డింగ్‌ పాస్‌ తీసుకున్నాడు. లగేజ్‌ ని కన్వేయర్ బెల్ట్‌ మీద వేసి అది సరిగ్గా వెళ్ళింది అని నిర్ధారణ చేసుకున్నాక వచ్చి విజిటర్స్‌ లాంజ్‌ లో రిలాక్సెడ్‌ గా కూర్చున్నాడు. అతని మనసు నెమ్మదిగా గతం లోకి జారుకుంది .

* * *

" ఏరా.. బాగా చదువుతున్నావా ?" ప్రేమగా అడిగాడు పరంధామయ్య . ఇంటి బయట నులక మంచం మీద కూర్చుని కొడుకుతో మాట్లాడుతున్నారాయన

" ఆ.. బాగా చదువుతున్నాను నాన్నా ..." చెప్పాడు అవినాష్ .

" ఏదోరా..తొందరగా నీ చదువు పూర్తయితే మన కష్టాలన్నీ తీరుతాయిరా...బోలెడన్ని అప్పులున్నాయి మనకు...అవన్నీ తీర్చాలి. నీ చెల్లెలు పెళ్ళికెదిగి రడీగా ఉంది ..దాన్నో అయ్య చేతిలో పెట్టాలి.. "

" అలాగే నాన్న ..పర్వాలేదు.. నా చదువు పూర్తవగానే ఏదో ఒక జాబ్‌ చూసుకుంటాను.. మన కుటుంబాన్ని ఆదుకుంటాను " బాధ్యత గా చెప్పాడు

ఇంతలో అక్కడికొచ్చిన అన్నపూర్ణమ్మ " అబ్బబ్బ ...సందు దొరికితే వాడి ప్రాణం తీసేస్తారు.. హాయిగా ఆడి చదువు ఆడు చదువుకుంటున్నాడు.. ఇయ్యన్నీ చెప్పి ఆడి బుర్ర పాడుచెయ్యకండి " భర్త ను మందలించింది.

" పోనీలే అమ్మా.. నాన్న నాతో కాకపొతే ఎవరితో చెప్పుకుంటారు " తండ్రిని సమర్ధించాడు అవినాష్ .

" సరేలే.. రండి భోంచేద్దురు గాని " అంటూ లోపలికి వెళ్ళొందామె.

పరంధామయ్య లేచి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు. చుట్టూ చూసాడు అవినాష్ . చీకట్లు కమ్ముకోవడంతో ఊళ్ళో చాలా మంది నిద్రకుపక్రమిస్తున్నారు. ఆ చీకట్లో , జవసత్వాలు ఉడిగిపోయిన వృద్ధుడిలా ఉంది వాళ్ళ ఇల్లు. కొంచెం దూరంగా చెట్టుకింద కట్టి ఉన్న గేదెలు. కొంచెం దూరంలో పొలాలు. ఆ పొలాలు దాటాక సన్నటి తార్రోడ్డు. వాటి మీద అప్పుడప్పుడు ఆటోలు , బైక్‌ లు వెళుతున్నాయి. ఈ మధ్యనే కొంచెం కొంచెం డెవలప్‌ అవుతున్న పల్లెటూరు అది. ఊళ్ళో పై చదువులకి బయటకు వెళ్ళిన అతి కొద్ది మంది లో అవినాష్ ఒకడు...అతని మనసులో ఒక పట్టుదల కదిలింది .

" ఎలాగైనా మంచి జాబ్‌ సంపాదించుకోవాలి..తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి " అని గట్టిగా నిశ్చయించుకున్నాడు.

ఆ తర్వాత శ్రద్ధగా చదువుకున్నాడు. మిత్రులు లండన్‌ లో జాబ్‌ చేస్తే బాగుంటుందని ప్రోత్సహించడంతో.. వాళ్ళ సహకారంతో అక్కడకు వెళ్ళాడు. ప్రతీ నెలా తల్లిదండ్రులకు డబ్బు పంపించేవాడు. అతను పంపిన డబ్బుతో వాళ్ళు తొందరగానే తేరుకున్నారు. ఇల్లూ వాకిలి పూర్తిగా మారిపోయాయి. అతని చెల్లికి మంచి సంబంధం వచ్చింది. అవన్నీ చూసుకోవడానికి , రెండేళ్ళ తర్వాత ..కోటి ఆశలతో తన వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని ఇండియా బయలుదేరాడు అవినాష్.

* * *

అవినాష్ ఇండియాలో లేండ్‌ అయ్యేటప్పటికి కరోనా తీవ్రత పెరిగిపోయింది.

ఎక్కడికక్కడ బాగా చెక్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌ ఎయిర్పోర్ట్‌ చేరుకున్నాక అతన్ని బాగా స్క్రీన్‌ చేసారు. కరోనాకి సంబంధించిన లక్షణాలేవీ లేకపోవడంతో వెళ్ళమని చెప్పారు. తీరా అతను హైదరాబాద్‌ వీడి తన ఊరికి వెళ్తుండేసరికి ప్రధాన మంత్రి లాక్డౌన్‌ ప్రకటించారు. ఎవ్వరినీ ఇళ్ళల్లోంచి బయటకు రావద్దని , రోడ్లపై తిరగొద్దని ప్రకటించారు. కానీ అప్పటికే అతను తన గ్రామానికి చేరుకునేందుకు మార్గమధ్యంలో ఉన్నాడు. తన రాష్ట్ర బోర్డర్‌ వచ్చేటప్పటికి పోలీసులు అతను ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపేసారు. అందరినీ కిందకు దింపి ప్రశ్నించడం ప్రారంభించారు. అప్పటికే అక్కడ అతని లాగే ఎంతో మంది జనాలు, అందులో స్త్రీలు , వృద్ధులు, పిల్లలు... పైగా చీకటి !

అవినాష్ కి ఎందుకో చిరాగ్గా అనిపించింది. పక్కతను అంటున్నాడు " ఏంటి సార్‌ ఇది ..మా ఊళ్ళకి కూడా మమ్మల్ని వెళ్ళనివ్వరా.. ఇక్కడ ..ఈ బోర్డర్‌ లో ఏముందని అందరినీ ఆపేసారు. తాగడానికి నీళ్ళు కూడా లేవు.. చిన్న పిల్లలు అల్లాడిపోతున్నారు. ...ఏంటో ఈ అతి జాగ్రత్తలు... అసలు రోగులుని ఈజీగా వదిలేస్తారు...మనలాంటి సామాన్యులని మాత్రం పీడించుకు తింటారు " అని తుపుక్కున ఉమ్మేస్తూ ఎటో పోయాడు. నిస్సత్తువగా అనిపించింది అవినాష్ కి. ఇంతలో అతని సెల్‌ రింగ్‌ అయింది.

" అన్నయ్యా ...వచ్చేసావా ? " అడుగుతోంది చెల్లెలు

" లేదమ్మా ...ఇక్కడ మన స్టేట్‌ బోర్డర్‌ లో మమ్మల్ని ఆపేసారు...ఇదంతా క్లియర్‌ అయ్యాక వస్తాను ...బి హేపీ అమ్మా " అన్నాడు అవినాష్ .

అటునుంచి చిన్నగా ఏడుస్తున్న శబ్దం. ఒక బాధా వీచిక అవినాష్ మనసులో .." ఊరుకోమ్మా ...నేను వచ్చేస్తాగా " అని ఫోన్‌ కట్‌ చేసేసాడు.

* * *

పోలీసులు చాలా మందిని ప్రశ్నిస్తున్నారు. ఇష్టమున్న వాళ్ళని పద్నాలుగు రోజుల క్వారంటెయిన్‌ కి పంపిస్తున్నారు. ఒప్పుకోని వారిని తిరిగి వెనక్కు ...అంటే తెలంగాణా రాష్ట్రం లోకి వెళ్ళిపోమంటున్నారు. " ఏంటి సార్‌ ఇది ..ఇప్పటికిప్పుడు మమ్మల్ని వెనక్కు పొమ్మంటే ఎలా పోతాం... " ఏడుస్తూ అడుగుతోంది ఒక స్త్రీ

పోలీసాఫీసర్‌ " మేం మాత్రం ఏం చేస్తామమ్మా.. మాకు ఆర్డర్స్‌ అలా ఉన్నాయి... ఏ ఒక్కరి వల్ల ఈ కరోనా వైరస్‌ ఇంకొకరికి అంటుకున్నా అది మన రాష్ట్రమంతా వ్యాపిస్తుంది కదా.. ఇప్పుడు మేం చేస్తున్నది మీకు కష్టం అనిపిస్తున్నా అది మనందరి కోసం ..ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తుకోసమే కదమ్మా .." అని సర్దిచెబుతున్నారు. ఆవిడేదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది.

అవినాష్ చుట్టూ చూసాడు. మీడియా హడావుడి బాగానే ఉంది. కొంతమంది కుర్రాళ్ళు ఏదో రకంగా తప్పించుకుని జారుకుంటున్నారు. అతని మనసులో సందిగ్ధత !

" ఏ చేద్దాం ..." అన్న ఆలోచన. ఒక వైపు అతని మనసు ఇంటికి తొందరగా చేరుకోవాలని ...వాళ్ళందరినీ చూడాలని తహ తహ లాడుతోంది. ఇంకో వైపు బాధ్యత గల పౌరుడిగా తన బాధ్యతను గుర్తు చేస్తోంది. కావాలంటే వీళ్ళ కన్నుగప్పి తను జారుకోగలడు.. కానీ అది ఎంత వరకు కరెక్ట్‌ ? అతని మనసు డోలాయమానం లోకి వెళ్ళింది. తను చదువు కున్న చదువు.. విజ్ఞత అతన్ని హెచ్చరిస్తూనే ఉంది. ఒక నిర్ణయానికొచ్చినట్టు గాఢంగా నిశ్వసించి , సమీపంలో ఉన్న ఆఫీసర్‌ దగ్గరకు వెళ్ళాడు.

" సార్‌... నేను విదేశం నుండి వస్తున్నాను.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా క్వారంటెయిన్‌ లో ఉండటానికి ఇష్టపడుతున్నాను " అని చెప్పాడు.

" వెరీ గుడ్‌ ...అలాగే " అని భుజం తట్టాడు ఆ ఆఫీసర్‌. జేబులో నుండి సెల్‌ తీసి ఇంటికి ఫోన్‌ చేసాడు.

అటు పరంధామయ్య ఫోన్‌ ఎత్తాడు .

" నాన్నా.. ఇక్కడ మమ్మల్ని ఆపేసారు.. నీకు తెలుసు కదా పరిస్థితి ...ఒక పద్నాలుగు రోజుల తర్వాత వస్తాను ..."

" అప్పుడా ..ఇదేంట్రా ...నువ్వొస్తావని ..నిన్ను చూద్దామని మేమంతా కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాం.. రెండేళ్ళు అయింది కదరా నిన్ను సూసి .." బాధగా అన్నాడు పరంధామయ్య

" సరే నన్నా ...నాకు మాత్రం మిమ్మల్ని చూడాలని ఉండదా ...కానీ నా వల్ల మీకు అంటితే ప్రమాదం కదా ..."

" అవును అది కూడా నిజమే నాన్నా ..బాగా చెప్పావు... ఈ రోగం ఇలా అందరికీ అంటుకుంటే ఈ దేశానికే ప్రమాదం. మన ఆప్యాయతలకేముంది ..అవి శాశ్వతం ..కానీ మన వంతు సహకారం అందించడం ఒక బాధ్యత గదా ...నీ ఇష్టం ..అలాగే " అని చెప్పి ఫోన్‌ పెట్టేసాడు. అవినాష్ పెదాలపై సంతృప్తితో కూడిన చిరునవ్వు ...!!!

----------------0----------------

మరిన్ని కథలు

Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE