జీవిత చక్రం - సి. ఉమాదేవి

jeevitha chakram Telugu Story

"జీవిత చక్రం తిరుగుతూనే ఉంటుందనేది జగమెరిగిన సత్యం. జీవనగమనాన్ని నిర్దేశించేది చక్రమే! అందుకే ఎటు చూసినా చక్రమే! సుదర్శనచక్రం నుండి మన దీపావళి విష్ణు, భూచక్రాల దాకా! అంతెందుకు, చక్రం కనుక్కున్నాకే కదా నాగరికత పరిఢవిల్లింది. వ్యవసాయమైనా, ప్రయాణమైనా చక్రం చలవే మరి." అలసట తీర్చుకోవాలన్నట్టుగా ఆగాడు రాఘవ.

చంద్రానికి స్నేహితుడి మాటలు అర్ధమవుతూనే ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.

"ఏమైంది నీకు ఉదయాన్నే చరిత్ర బోధిస్తున్నావు? రేపు రిటైరయ్యాక కూడా పాఠాలు మరచిపోయేట్టు లేవు. అయినా గేటుదాకా కార్లోనేగా వచ్చావు, నాలుగు చక్రాలు బాగానే తిరిగాయిగా, పంక్చరేమీ కాలేదు కదా? లేదా ఇంటినుండే వాకింగ్ మొదలు పెట్టేసావేమోనని..."

నవ్వుతున్న చంద్రాన్ని చూసి రాఘవ తను నవ్వి, "నువ్వన్నదే కరెక్ట్ చంద్రం, పెట్రోలు నింపుకుని రివర్స్ చేసేలోపు టైర్ పంక్చర్. దేవుడా అని రెండు కిలోమీటర్లు నడచివచ్చా. నడిచినందుకు బాధలేదు కాని మన కబుర్లకు అరగంట కోత పడిందిగా." కళ్ళెగరేసి స్నేహితుడి భుజంపై చరిచాడు రాఘవ.

"అందుకా వేదాంతం పొడచూపింది, మరేం ఫర్లేదు నీతో నేను వస్తాను పద, నాకు తెలిసిన కారు మెకానిక్ దగ్గరలోనే ఉన్నాడు, టైరు మార్చి పంక్చరు వేసుకుని రమ్మందాం."

"మా వాడిని కాలేజి దగ్గర వదలాలి. లేకపోతే నన్ను బ్రేక్ ఫాస్ట్ కూడా తిననివ్వడు. బాక్స్ లో వేసుకుని పరిగెట్టాలి. వాడిని కాలేజి దగ్గర వదిలాకగాని నేను ఆఫీసుకు చేరుకుని స్థిమితంగా కూర్చుని తినలేను."

"అయితే పోదాంపద. ఈవేళకు నడిచింది చాల్లే." ఇద్దరి అడుగులు వేగమందుకున్నాయి.

"నాన్నా, థర్టీ మినిట్స్ లేట్. ఫస్టవర్ అయిపోయుంటుంది, ఈరోజు మా ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ నా ఫ్యూజు పీకేస్తాడు."

"వాడి బాధ మీకర్ధం కాదు." కొడుకు ముఖంలో కనపడని బాధ భార్య ముఖంలో ఫ్రస్పుటంగా కనిపిస్తోంది.

"అంటే?" రాఘవ అలవాటుగా అనేసాడు.

"మీకు తెలుసు కదా నాన్నా, నాకు ఆబ్సెంట్ వేసేస్తాడని, అందుకే బైకు కొనుక్కొని కాలేజీకి ఆలస్యంగాకుండా వెళ్తాను అంటే మీరు వినిపించుకోరు." మనసులోని విసుగును చిరునవ్వుతో తాపడం పెట్టి అంటున్న కొడుకు మాటలకు అదే నవ్వుని అద్దంలోకి ప్రతిబింబిస్తూ,

"అలాగేరా, వచ్చే నెలలో కొందాంలే పద ఇప్పటికే ఆలస్యమైంది."

సాయంత్రం ఇంటికి వస్తూనే కొడుకు అడిగిన మొదటి ప్రశ్న.

"ఎన్ని వాయిదాలు నాన్నా?" కాలేజీ నుండి రాగానే రాఘవ కొడుకు ప్రశ్నల చిట్టా మొదలు.

"మన ఇష్టంరా ఏడాదో, రెండేండ్లో..."

"బండికి కట్టాల్సిన వాయిదాలు కాదు నాన్నా, నా బైక్ కొనేందుకు మీరు పెట్టే వాయిదాలు." అంటూ రాఘవ కొడుకు గునిసాడు ముద్దుగా.

తల్లి అందించిన ఆపిల్ జ్యూస్ తాగుతూ, "అబ్బ చేదుగా ఉంది."

సగం జ్యూస్ గ్లాసులోనే ఉంది. జ్యూస్ గొంతులోకి దిగడము లేదు.

"జ్యూస్ చేదుగా ఉండటమేమిటిరా, నీకేదో అయింది." విసుగ్గా అన్నాడు రాఘవ.

"అబ్బ వాడికి కావలసినదేదో వాడికి కొనివ్వవచ్చు కదా!" రాఘవ భార్య కాస్త ఘాటుగానే అంది.

"చాక్లెట్టా కొనివ్వడానికి." రాఘవలో కొడుకు కోరిన బైకు ధర బూచిలా భయపెడ్తోంది.

"సరేలెండి మీరు మీ మనసు మాటే వినరు... ఇక నామాటేం వింటారు?" మూతి ముడిచింది రాఘవ భార్య.

కొడుకు బుంగమూతి పెట్టినప్పుడల్లా ఒక ఓటు లెక్కన మొత్తం పోలయిన ఓట్లు బైకునే గెలిపించాయి. బైకు కొనాలన్న కోరికకు తాను తయారు చేసుకున్న గ్రవుండ్ అనుకూలపడ్డ క్రికెట్ పిచ్ లా సంబరాన్ని పెంచింది రాఘవ కొడుకులో.

తళతళా మెరుస్తున్న కొత్త బైకును చూస్తున్న కొడుకు కళ్లలో మిలమిలలు చూసి తృప్తిగా నవ్వుకుంది పితృహృదయం.

"నిన్న రాలేదేం రాఘవా, ఆరోగ్యం బాగా లేదా? ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేస్తావులే అని చూసాను."

"అదేం లేదు, మావాడి బైకు సంగతి చెప్పేవాడిని కదా, అది కొనడానికి వెళ్లాం."

"ఓ! మొత్తానికి సాధించాడన్న మాట మీవాడు. మరి నీ పాత బండేదో ఉందన్నావు, అమ్మేదుందా? మన పార్క్ వాచ్ మ్యాన్ కు కావాలట.

"అది లేదు కాని, ఆ రెండు చక్రాల వెనుక ఓ పెద్ద ఎపిసోడ్ ఉంది."

"ఒకటేనా?" రాఘవ చెప్పే కబుర్లకు ప్రశ్నలు వేస్తూ మరీ వింటుంటాడు చంద్రం.

"ఇది ఇంటింటి కథే, అందుకే ప్రతి వాహన చక్రాల పరుగుల వెనుక ఒక ఎపిసోడ్ తప్పక ఉంటుంది."

"ఇంట్రెస్టింగ్!" చెప్పమన్నట్టుగా చూసాడు చంద్రం.

"నేను ఉద్యోగంలో చేరిన కొత్త! ఇంటికి దూరంగా కాలేజి, బస్సులు గంటకొకటి వచ్చేవి. నాన్నా స్కూటరు కొనుక్కుంటా వాయిదాల్లో అన్నా. నేను మావాడికి చెప్పిన మాటల వాయిదాలకు రెట్టింపుగా వినుంటాను. నాకేమో మా అమ్మ వత్తాసు లేదు. ఎందుకు నాయనా, చిన్నప్పుడు సైకిల్ తొక్కేటప్పుడే కిందపడి ముందరి పళ్లు రెండు రాలాయి.

స్కూటరెందుకు హాయిగా పెద్ద బస్సులో వెళ్లక సురక్షితంగా! అంది. నా ఆశపై చెంబుడు నీళ్లు చిలకరించే మా అమ్మ ఈసారి ఏకంగా ఓ బిందెడు నీళ్లే కుమ్మరించేసింది."

"మరెలా కొన్నావ్?" కథనంలో లీనమైన చంద్రం ఉత్సాహంగా అడిగాడు.

"మొత్తానికి మా నాన్నే ముందు పడ్డాడు."

"అరెరె, పాపం ఎక్కడ?"

"అబ్బ! అదే నీ తొందర. ముందు పడ్డాడంటే కొనివ్వడానికి ముందుకు వచ్చాడు అని."

"మరి మీ నాన్న ఏ బండి కొనమన్నాడు?"

"సైకిలుకు ఎక్కువ, స్కూటరుకు తక్కువగా ఉన్న బండిని కొనుక్కోమన్నాడు."

"మూడు చక్రాల సైకిలు కాదు కదా!"

నవ్వుతున్న చంద్రాన్ని చూసి రాఘవకు కూడా గత తలపుల జ్ఞాపికలో ఒరుసుకుని వచ్చిన అనుభూతులెన్నో!

"మూడు చక్రాలు కాదు. సైకిలు కన్నా వేగంగా వెళ్తుందని సువేగా కొనమన్నాడు."

"అవును, నువ్వంటుంటే గుర్తుకు వచ్చింది. అసలా బండి పేరే మరచిపోయాం. మన పిల్లలనోట ఎన్ఫీల్డ్ పల్సర్, హోండా, కవాసకి ఇలా ఎన్నో!"

"ఆ బండి ఉందా మరి?"

"లేదు బాబూ, అదుంటే దానితోపాటు నన్ను నిలబెట్టే వాళ్లు పురావస్తు ప్రదర్శనలో!"

ఇద్దరి నవ్వులు జతకలిసాయి.

"మంచిదే అయితే, ఎంతైనా క్షేమం ముఖ్యం కదా!"

"అందుకే మరి జీవితంలో చక్రానికున్న ప్రాముఖ్యం ఎన్నతగినదే. మనుషులను మించిపోతోంది వాహనాల సంఖ్య! నీ పని మేలు చంద్రం, నీకు ఆడపిల్లలు, ఈ బాధలుండవు."

"ఆగాగు, నాకున్నది ఆడపిల్లలు కాదు ఆడ పిడుగులు."

"అయ్యో పాపం అలా అంటావేం చిట్టి తల్లి చక్కగా ఆటోలో వెళ్ళేదిగా పదవతరగతి వరకు.

"ఆ తరువాత నాకూ ఓ ఎపిసోడే!"

"అవునా?" ఆశ్చర్యంగా చూసాడు రాఘవ.

"ఏముంది? ఎమ్సెట్ లో మంచి ర్యాంక్ తెస్తే పేరున్న కాలేజీలో సీటు వస్తుందని దాని బుర్ర నిండా ఆశలు నింపాను. దాంతో నా బుర్ర తోడేసేది, నాన్నా ఇక చాల్లే నిద్ర, నా ఫిజిక్స్ క్లాస్ లేటవుతోంది, నా మ్యాథ్స్, నా కెమిస్ట్రీ! ఇదే జపం. నిద్రలో ఉన్నట్టుండి ఉలిక్కి పడి లేచే వాడిని. ట్యూషను నాకన్నట్లు! ఎండాకాలం ఏదోలా గడిచిపోయినా చలికాలం, వానాకాలం అదీ రెండు సంవత్సరాలు ఇంటర్ పూర్తయ్యేదాకా! అమ్మాయి సంగతేమో గాని తుమ్మి తుమ్మి నా ముక్కు నయాగరా జలపాతమయ్యేది."

'నాన్నా నీకెందుకు కష్టం? నాకు కనీసం స్కూటీ కొనివ్వండి. మీ నిద్ర చెడిపోకుండాను ఉంటుంది.' అని రోజుకొక్కసారైనా నన్ను అడుగుతూనే ఉంటుంది. విని విని, 'మా అమ్మ, ఎందుకే తల్లి, పెళ్లి కావలసిన ఆడపిల్లవి ఈ బండ్లు, చక్రాలును.' అని అనడం ఆలస్యం, 'నీకు తెలీదు నానమ్మా, నేను ట్యూషనుకు వెళ్లాలంటే నాన్నే రావాలి. అదే బండి ఉంటే నాకు హాయి, నాన్నకు సుఖం.' అనేది.

'సైకిలే రాదు, ఇక స్కూటీలేమి నడుపుతావు? అంది మా అమ్మ.

'భలే పడిందిరా అడ్డుపుల్ల!' ఇక నాపై దాడి ఉండదనుకున్నాను."

"మరి!" ఆసక్తిగా అడిగాడు రాఘవ.

"ఆఫీసు నుండి సాయంత్రం ఇంటికి వచ్చి కారు పార్కు చేస్తున్నాను. ఎవరో అమ్మాయి సైకిలుపై వెళ్తూ నా వైపు చూచి నవ్వింది. 'ఈ నవ్వెక్కడో చూసానే... అనుకున్నా కాని మైగాడ్, నా కూతురే.'

'అమ్మా! నాన్నా!' అని ఇంట్లోకి వినబడేలా గట్టిగా పిలిచాను."

సైకిల్ స్టాండ్ వేసి దగ్గరకొచ్చి 'నాన్నా!' అని పిలిచింది మా అమ్మాయి.

'సైకిలెక్కడ తెచ్చావు? ఎలా నేర్చుకున్నావు ఒక్క రోజులో?' నేను అడుగుతూనే ఉన్నాను.

'ఇది అసాధ్యురాలే!' అనుకుంటూ, నానమ్మ, తాతయ్య మనవరాలిని కల్లనిండుగా చూసుకుంటున్నారు.

'తప్పదురా, చిట్టి తల్లికి టి.వి.ఎస్ కొనిచ్చెయ్.' అన్నారిద్దరూ"

'హు!' నిట్టూర్చాడు రాఘవ. తను సువేగా కొన్న రోజు గుర్తుకు వచ్చింది.

'టి.వి.ఎస్ కాదు తాతయ్యా, కెనెటిక్ హోండా అయితే బాగుంటుంది కదా!' అని గారాలు పోతోంది నా కూతరు.

'అలాగే తల్లి, నీ మాటే మా మాట.' మనవరాలికి అభయహస్తం ఇచ్చేసాడు మా నాన్న."

వాహనం కొనిచ్చిన వైనాన్ని విని చంద్రంతో, "ట్యూషను పేరు మీద మీ కూతురు, ఫస్టవర్ పేరుపై మా అబ్బాయి బాగానే చక్రం తిప్పారు." అన్నాడు రాఘవ.

ఈసారి నవ్వుల మందహాసాలు కాదు. పకపకలే!

చంద్రం, రాఘవ రిటైర్ అయ్యాక నడకలోనే కాదు ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి వస్తూ పిల్లల చిన్నప్పటి విశేషాలు నెమరేసుకుంటూ కబుర్లు కలబోసుకుంటారు.

"ఇవాళ మీ వాడు బయలుదేరాడన్నావు, ఎప్పటిలోగా రాగలడు? నీ మనవడిని చూద్దామని వచ్చాను. ఆలస్యమవుతుందేమో, వెళ్లనా?" కుర్చీలో నుండి లేవబోయాడు చంద్రం.

"ఆగాగు, ఫోను చేసాడుగా కాసేపట్లో ఇక్కడుంటాడు."

మరో పది నిమిషాలలో ఇంటి ముందుకు వచ్చి ఆగింది కారు. రాఘవ కొడుకు, కోడలు దిగారు. చక్కని జంట అని మరోమారు అనుకున్నాడు చంద్రం.

కారు వెనుక సీటు నుండి చెంగున దూకాడు రాఘవ మనవడు.

తను తెచ్చిన చాక్లెట్ అందివ్వాలని ఆతృతగా జేబులోనుండి తీస్తూ, "నీ పేరేమిటి బాబూ?" అని అడిగాడు చంద్రం.

చెప్తా, ఆగుమన్నట్లుగా సైగ చేస్తూ, గబగబా ఇంట్లోకి వెళ్లి చిన్న స్టూలు తెచ్చి కారు గారేజీ లో ఉన్న బైక్ దగ్గర వేసి దానిపైకి ఎక్కాలని పాకుతున్నాడు. బైక్ వైపు కళ్ళు విప్పార్చి ఆనందంగా చూస్తున్నాడు. వాడి నాన్న కారు నడుపుతున్నంత సేపు వాడి చిన్న బుర్రలో బైకు చక్రాలే తిరిగినట్లున్నాయి. అవును, నిజమే మరి! జీవిత చక్రం తిరుగుతూనే ఉంటుంది కద!

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ