శేషగిరి నిర్ఘాంతపోయాడు డాక్టర్ల మాటకు. తన కంటే పెద్దవాళ్లే హాయిగా ఉన్నారు. తన కేంటి ఈ సమస్య అని మౌనం గా రోదిస్తున్నాడు. యే ఒక్క అలవాటు లేదు మరి ఈ జబ్బు తనకే ఎందుకొచ్చిందో అర్ధం కాలేదు. . జబ్బు గురించి భార్యా పిల్లలకు తెలిసినట్లుంది. దిక్కులు పిక్కటిల్లెలా రోదిస్తున్నారు. ఎంతోకాలం బ్రతకనని శేషగిరికి అర్ధమైంది... జీవితాన్ని ఈజీ గా తీసుకొనే శేషగిరికి మొదటిసారిగా జీవితం పై ఆశ కలిగింది.
శేషగిరి అధికారపక్షపు M. L. A... రాజకీయాలలోకి రాకముందు జిల్లా ఇండస్ట్రియల్ ఆఫీసర్ గా పనిచేశాడు. 12 యేళ్ళు ఉద్యోగం చేసిన తరువాత రాజకీయాలలోకి వచ్చాడు. శేషగిరి రాజకీయాలలోకి వచ్చాక బాగా సంపాదించాడు. ఎంఎల్‌ఏ అయ్యాడు. ఇద్దరు మగపిల్లలు పుట్టారు. వాళ్ళు ఉద్యోగాలలో ఉన్నారు. పెద్దబ్బాయిని రాజకీయాలలోకి తేవాలని శేషగిరి కోరిక. ఇంత లోనే ఈ విపత్తు వచ్చింది. గత ఆరు నెలలుగా ఒంట్లో బాగా నలతగా ఉంటుంది. ఆహారం లోనికి పోవట్లేదు. డాక్టర్లు రకరకాల మందులు ఇచ్చారు ఫలితం రాలేదు. పరీక్షలలో జీర్ణాశయ కాన్సర్ అని తేలింది. అదీ బాగా ముదిరిపోయిందని కొన్ని రోజులే బతికేది అని డాక్టర్లు చేతులెత్తేశారు. మహా అయితే ఆర్నెల్లు బతకొచ్చని డాక్టర్ చెప్పారు . శేషగిరికీ ఊరి నిండా ఆస్తులే. రాజధానిలో కూడా మంచి ఆస్తి, ఉంది. మంచి పేరూ ఉంది. అంతా సుఖంగా ఉన్న టైములో పిడుగులా ఈ నిజం బైటపడింది. యాభై ఏడేళ్లకే తనువు చాలించాల్సి వస్తుందని శేషగిరి అస్సలు ఊహించలేదు..
శేషగిరి ఇంటికొచ్చాడు. అందరూ పరామర్శకు వచ్చి వెళ్తున్నారు. బాల్య మిత్రులు, బంధువులు అందరూ వచ్చారు. పాత సంగతులన్నీ గుర్తుకు తెచ్చుకుని మరి బాధపడుతున్నారు. ఇవన్నీ చూసి శేషగిరికీ జీవితం పై ఆశ రోజురోజుకి పెరుగుతుంది. కానీ బతికే ఛాన్సే లేదు. అందుకనే నిస్సహాయుడై మౌనం గా రోదిస్తున్నాడు.
పదే పదే గతం గుర్తొస్తుంది శేషగిరికి . తను ఎంతోమందికి సహాయం చేశాడు. వాళ్ళందరూ ఇప్పుడు మంచి పోజిషన్ లో ఉన్నారు. వాళ్ళు రోజు వచ్చి రాకూడని కష్టం వచ్చిందని కామెంట్ చేస్తూ ఓదార్చుతున్నారు. ఇల్లంతా శ్మశాన వైరాగ్యమే రాజ్యామెలుతుంది. చేసిన మంచి తలుచుకున్నా శేషగిరికి సంతోషం గాని, గర్వం గాని కలగట్లేదు. నిజానికి శేషగిరి కొన్ని వందల జీవితాలు నిలబెట్టాడు. ఇన్ని జీవితాలను నిలబెట్టినా శేషగిరికి అంతరాత్మలో ఏదో వెలితి. ఇప్పుడు అంతరాత్మే శత్రువై వేధిస్తుంది. నవ్వుతూ చేసిన ఆ మూడు పాపాలను క్షణం క్షణం ఏకరువు పెడుతూ గుండె ను తొలిచేస్తోంది. రోగం కంటే మనసాక్షే ఎక్కువ వేధిస్తుంది. తన వల్ల నష్టపోయిన ఆ ముగ్గురు వ్యక్తులు కళ్ళముందు కదలాడుతు శపిస్తున్నట్లుగా ఉంది. వాళ్ళకి తను చేసిన అన్యాయం గుర్తుకొచ్చి నరకయాతన పడుతున్నాడు.
గతం లో శేషగిరి ముగ్గురు వ్యక్తులను ఘోరంగా వంచించాడు. ఆరోగ్యంగా ఉన్నన్నాళ్లు వీళ్ళు అసలు గుర్తే లేరు. ఇప్పుడు అనుక్షణం గుర్తొస్తున్నారు. చనిపోయే లోపు వాళ్ళకి న్యాయం చేసి క్షమా భిక్షను అర్ధించి పాపం నుండి బయట పడాలని శేషగిరి కోరిక. మరణం లో ప్రశాంతత కై పరితపిస్తూ ఆ ముగ్గురి జాడ కై అన్వేషణ ప్రారంభించాడు...
వచ్చే పోయేవాళ్లతో ఇల్లంతా సందడిగా ఉంది. ఇంట్లో అందరూ దుఃఖ భారంతో కుంగిపోతున్నారు. శేషగిరి మనసు మాత్రం ఆ ముగ్గురు చుట్టూ తిరుగుతోంది. శేషగిరి వాళ్ళది కలిగిన కుటుంబమే. శేషగిరి తాత సుబ్బారావు గారు మోతుబరి. డెబ్బై ఎకరాల పొలం, రైసుమిల్లు ఇంకా నాలుగు ట్రాక్టర్లు ఉండేవి. సుబ్బారావు గారికి ఇద్దరు మగపిల్లలు. శేషగిరి తండ్రి వెంకటేశ్వర్లు పెద్ద సంతానం. చిన్న సంతానం గోపాలకృష్ణ. వెంకటేశ్వర్లే తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. చిన్న సంతానమైన గోపాలకృష్ణ మానసిక వికలాంగుడు. పెళ్లి కాలేదు.
సుబ్బారావు ఆస్తిని ఇద్దరి పిల్లకు సమానంగా పంచాడు. తండ్రి తరువాత వెంకటేశ్వర్లు తమ్ముడైన గోపాల కృష్ణ ని బాగానే చూసేవాడు. దగ్గరుండి తమ్ముడి పోషణా భారాన్ని మోశాడు. వెంకటేశ్వర్లు చనిపోయాక ఆ పిచ్చివాడి బాధ్యత శేషగిరిపై పడింది.
ఆస్తి మొత్తాన్ని శేషగిరే చూసేవాడు. రోజు ఊరి నుండే ఉద్యోగానికి వెళ్లొచ్చేవాడు. మొదట్లో బాబాయిని బాగానే చూశాడు. కొంతకాలానికి శేషగిరి బుద్ధి మారింది. ఇంత ఆస్తికి నేనొక్కడ్నే వారసుడ్ని అనే అహం ఏర్పడింది. అప్పట్నుండి బాబాయి గుదిబండ గా కనబడ్డాడు. ఆ రోజు నుండి పిచ్చివాడైన బాబాయికి సరైన తిండి పెట్టేవాడు కాదు మందులిచ్చేవాడు కాదు. మందుల్ని క్రమంగా తగ్గించాడు. మతిలేని ఆ మనిషి తిండిలేక, మందులు లేక అల్లాడిపోయి. అందరిళ్లకెళ్ళి అన్నం అడిగేవాడు.
బంధువులందరు బాబాయిని సరిగా చూడామని శేషగిరికీ వార్నింగ్ ఇచ్చారు. ఆస్తి ని అనుభవిస్తూ ఎందుకు చూడవని కొందరు ముఖం మీదే అడిగే వారు. ఇది తట్టుకోలేక శేషగిరి బంధువుల ఇళ్లకు వెళ్లొద్దని బాబాయిని తీవ్రంగా కొట్టేవాడు. అన్నం,మందులు సరిగ్గా లేకపోవడం వల్ల గోపాలకృష్ణకి తీవ్రమైన జబ్బు చేసింది. పట్నం తీసుకెళ్లకుండా పల్లెలోనే వైద్యం చేయించాడు శేషగిరి. అతి దీన స్థితిలో గోపాలకృష్ణ మరణించాడు. నీ వల్లే గోపాల కృష్ణ చనిపోయాడని ఊళ్ళో జనం శేషగిరిని నానా మాటలన్నారు. అయినా సరే.. శేషగిరికి తను చేసింది తప్పనిపించలేదు అప్పుడు. బాబాయి కి కర్మకాండలు పూర్తి చేసి ఆస్తి మొత్తాన్ని క్రమంగా అమ్మి హైదరాబాద్ చేరాడు.
బాబాయి ఉసురు తగిలిందని ఇప్పుడు అర్ధమైంది శేషగిరికి. పిన తండ్రని , మానసిక వికలాంగుడని చూడకుండా హీనంగా కాలితో తన్నినప్పుడు ,అన్నం, మందులు ఇవ్వకుండా ఆ పిచ్చివాడ్ని క్షోభ పెట్టినప్పుడు ఇది పాపం అని అనిపించలేదు. అప్పుడు ఆ ఘోర తప్పిదమే జబ్బు గా మారిందని అర్ధమైంది.. కానీ అప్పటికే చేయిదాటిపోయింది. ఏమి చేయలేం కాబట్టి ఈ పాపాన్ని బతికున్నప్పుడే కడిగేయాలని గట్టిగా సంకల్పించాడు... కానీ.. ఈ పాపం నుండి ఎలా బయటపడాలో తెలియట్లేదు. పినతండ్రి కాళ్ళు కడిగి క్షమాభిక్ష అడగాలంటే ఆయన లేడు. ఈ ఘోరపాపం ను మోస్తూ మరణించడం శేషగిరికీ ఇష్టం లేదు. ఏం చేయాలో అర్ధం కాక సమత మౌతున్నాడు.
2
సులోచన.. శేషగిరి జీవితంలో స్వల్ప కాలం పాటు మెరిసి మురిపించిన విద్యుల్లత. ఇప్పటికీ సులోచన గుర్తొచ్చిన ప్రతి సారీ శేషగిరి మనసు మధుర సంద్రం లో మునిగిపోతుంది...... గడిపింది కొంత కాలమే అయినా మొత్తం జీవితానికి సరిపోయే మాధుర్యాన్ని శేషగిరి మూటగట్టుకున్నాడు.
నిజామాబాద్ లో జిల్లా అధికారిగా పనిచేసేటప్పుడు శేషగిరి అద్దెకున్న ఇంటి క్రింది పోర్షన్ లో సులోచన దంపతులు ఉండేవాళ్ళు. భర్తకి ఏదో చిన్న కాలేజీ లో ఉద్యోగం. సులోచన ఇంట్లో లేడీస్ బట్టలు కుడుతూ ఉండేది. సులోచన తో పరిచయం కావడానికి తొమ్మిది నెలల టైమ్ పట్టింది. సులోచనమంచి రూపసి. అందుకని ఎలాగైనా పరిచయం పెంచుకోవాలని తహతహ లాడాడు.. మొదట్లో సులోచన శేషగిరిని పట్టించుకోలేదు. అందుకని ఆమె దృష్టిలో పడటానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. శ్రమ వృధా పోలేదు... సులోచనకు పోష్ గా బతకాలి అన్న కోరిక ఎక్కువ. ఈ బలహీనతే శేషగిరికి దారి చూపింది. ఇద్దరు సంపాదిస్తున్నా డబ్బు మిగిలేది కాదు. కొన్నిసార్లు అప్పు చేయాల్సివచ్చేది. వచ్చే సంపాదన కు తగినట్లుగా గడిపితే ఆ ఆదాయం సరిపోతుంది. కానీ సులోచన ఖర్చు చాలా ఎక్కువ. పోష్ గా కనబడాలని డబ్బుని ధారాళంగా వాడేది. అందువల్ల అప్పులు ఎప్పుడు ఉండేవి.
సులోచన భర్త నవీన్ పద్దతి గల మనిషి.. ఉన్నదాంట్లో సర్దుకోవాలన్నదే అతని అభిమతం. కానీ సులోచన భర్తను అస్సలు లెక్క చేసేదికాదు. భర్త అని కనీస మర్యాద కూడా ఇచ్చేది కాదు. ఇవన్నీ శేషగిరి కి అస్త్రాలయ్యాయి. చిన్నగా సులోచనకి డబ్బు సాయం చేయడం మొదలుపెట్టాడు. అప్పుగానే తీసుకునేది సులోచన. కొన్ని సార్లు తిరిగిచ్చేది. మరికొన్ని సార్లు డబ్బు సర్దుబాటు కాక అనేక క్షమాపణలు చెప్పేది. శేషగిరి ఏమి కాదులే అని తేలిగ్గా కొట్టిపారేసేవాడు...
సులోచనకి ఖరీదైన వస్తువులు క్రమంగా అలవాటు చేశాడు శేషగిరి. మొదట్లో నవీన్ దంపతులు వద్దనేవారు. ఏవోవో మాటలు చెప్పి వాళ్ళను సమాధాన పర్చేవాడు శేషగిరి. కొన్ని రోజులకి నవీన్ కి తనకు తెలిసిన ఎయిడెడ్ కాలేజీ లో ఉద్యోగం ఇప్పించి కొంత ఖర్చు పెట్టాడు శేషగిరి. అప్పట్నుండి సులోచన మనసులో శేషగిరికి ఆగ్ర స్థానం దక్కింది. ఆ టైమ్ లోనే శేషగిరి ఆమెను పూర్తిగా లొంగదీసుకున్నాడు. తన కుటుంబం హైదరాబాద్ లో ఉండటం తాను నిజామాబాద్ లో ఒంటరిగా ఉండటం శేషగిరికి బాగా కలిసొచ్చింది. సులోచన తో శేషగిరి జీవితం మధురంగా సాగింది..
నవీన్ కి భార్య చేసే తప్పు తెలిసింది. భార్యను నిలదీశాడు. సులోచనకి శేషగిరి అండ ఉండడం వల్ల బెదరలేదు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమని భర్త ని ఎదిరించింది. పెద్దల ముందు ఎన్నో పంచాయితీలు పెట్టినా సులోచన శేషగిరి ని వీడలేదు. కానీ. సులోచన కు దగ్గరవాళ్లందరు అందరూ దూరమయ్యారు. ఒంటరైంది. ఆ వీధిలో అందరూ పరోక్షంగా ఎగతాళి చేసినా సులోచన, శేషగిరి మాత్రం ఏమి పట్టించుకోకుండా స్నేహ మాధుర్యాన్ని చవిచూశారు.
“ నువ్వు నవీన్ తో ఉండలేవు . నా మాట విను. నాతో హైదరాబాద్ పాపని తీసుకొని రా. పువ్వుల్లో పెట్టి చూసుకుంటా” అన్నాడుశేషగిరి, సులోచన తో...
శేషగిరికీ హైదరాబాద్ బదిలీ అయింది. సులోచనను తనతో తీసుకెళ్లాలని శేషగిరి ఆలోచన...
“అమ్మో... అది కుదరదు... నవీన్ ని పూర్తిగా వదిలేస్తే నా గతి పిల్ల గతి ఏం కాను ,,, నేను రాను ... నువ్వే వీలున్నప్పుడు ఇక్కడికి వచ్చిపో...” బదులిచ్చింది సులోచన....
“నా మాట విను. నేను లేకపోతే నిన్ను బతకనివ్వరు. నేనున్నాగా.. నీ కేం భయం. మీ ఇద్దరి భవిష్యత్ కి పూచీ నాది. నిన్ను వదలి ఉండలేను.. నువ్వు సుఖంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తా. నా మాట నమ్ము” ప్రాధేయపడ్డాడు శేషగిరి...
నెలపాటు ఆలోచించింది సులోచన. శేషగిరి అనేక విధాలుగా భరోసా ఇచ్చాడు. చివరకు శేషగిరే గెలిచాడు. భర్తను వదిలి పాపను తీసుకొని శేషగిరి తో హైదరాబాద్ వచ్చింది..... నవీన్ కొంత కాలం పాటు తీవ్రం గా మనస్తాపం చెంది ఊరొదిలి దూరంగా వెళ్లిపోయాడు.
శేషగిరి ఖరీదైన ప్రాంతం లో ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకొన్నాడు. పాపను దగ్గర్లో ఉన్న స్కూల్ లో జాయిన్ చేశాడు. రోజు సులోచన దగ్గరకు వచ్చి వెళ్ళేవాడు. ఇంట్లో తెలీకుండా ఆరు యేళ్ళ పాటు సులోచన తో సహజీవనం చేశాడు. పాప టెన్త్ కు వచ్చింది. సులోచన తో ఒక డ్రస్ మెటేరియల్ దుకాణం పెట్టించాడు. అది పెద్దగా నడిచేది కాదు. ఇంటిఖర్చులకు శేషగిరి డబ్బు బాగానే ఇచ్చేవాడు.... సులోచన మాత్రం. శేషగిరితోనే తన జీవితం ముడిపడిందని, చివరి వరకు తోడుంటాడని నమ్మింది. కానీ విధి విచిత్రమైంది కదా! ......
అన్నీ అనుకున్నట్లు జరిగితే మనిషి దేవుడ్ని పట్టించుకోడు. అందుకే భగవంతుడు విధి రూపం లో మనిషి తో ఆటలాడతాడు. సరిగ్గా శేషగిరికి ఇదే వర్తిస్తుంది. హైదరాబాద్ లో సులోచన తో జీవితం మధురంగా సాగే టైమ్ లో శ్రీధర్ రూపంలో విధి వీళ్ళ సంతోషానికి అడ్డుకట్ట వేసింది. నిజానికి సులోచన కు శ్రీధర్ దూరపు బంధువే. అన్నయ్య వరస. ఇద్దరిదీ ఒకే ఊరు. శ్రీధర్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చి సులోచన ఇంటికి దగ్గర్లోనే ఒక ఫ్లాట్ ని అద్దెకి తీసుకున్నాడు. ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు. మార్కెట్లో శ్రీధర్ ని సులోచనే ముందుగా చూసి పలకరించింది. ఇద్దరు ఒకే బజార్లో ఉండటం వల్ల పరిచయం మునుపటికంటే పెరిగింది. సులోచన విషయం శ్రీధర్ కి తెలిసినప్పటికి పెద్దగా ఏమి ప్రస్తావించలేదు. నవీన్ గురించి, అతడి అనారోగ్యం గురించి మాత్రమే చెప్పాడు. సులోచన మనసు లోనే దిగాలుపడింది. ఇంటికి తిరిగి వెళ్లడానికి ముఖం లేక బాధను మౌనంగా భరించింది. సులోచన దగ్గరకు శ్రీధర్ రోజు వచ్చేవాడు. శ్రీధర్ ని శేషగిరికి పరిచయం చేసింది. మొదట్లో శేషగిరి పెద్దగా పట్టించుకోలేదు....
వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిందన్నవిషయం ఆర్నెల్ల తర్వాత గుర్తించాడు శేషగిరి. శ్రీధర్ పై కొంచెం అనుమానం మొదలైయ్యింది. సులోచనతో ఏమి ప్రస్తావించలేదు. సులోచన తనతో ప్రవర్తించినట్లు గానే శ్రీధర్ తో కూడా ప్రవర్తిస్తుందేమోనన్న అనుమానం శేషగిరి మనస్సు ని పిండి చేసింది. సులోచన పై అనుమానం మొదలైంది. సులోచన కూడా శేషగిరి మౌనాన్ని పట్టించుకోకుండా శ్రీధర్ గురించి పదేపదే ప్రస్తావించేది. దీంతో శేషగిరికి అనుమానం రెట్టింపైయ్యింది. వీళ్ళిద్దరి మధ్య శారీరిక సంబంధం ఉందన్నఅనుమానం శేషగిరి కి బలపడింది . రేయింపవళ్లు శేషగిరికీ ఇదే ఆలోచన. మనిషి సగమయ్యాడు. మెదడు తొలిచే అనుమానంతో ఒకరోజు సులోచనను నిలదీశాడు..
“నీ కోసం ఇంత చేస్తుంటే శ్రీధర్ గాడితో తిరుగుతావా సిగ్గులేదు...”. అని గట్టిగా నిలదీసినట్టు అడిగాడు....
సులోచన దిమ్మెరపోయింది.... “నీకు పిచ్చి గాని ఏం లేదుగా వాడు నాకు అన్నయ్య నేనేమైనా బజారు దాన్న. ఒకసారి చేసిన తప్పుకే తలఎత్తుకోలేక చస్తున్నా, ఇంకో తప్పు నా ప్రాణం పోయినా చేయను. నాకు అక్రమ సంబంధం అంటకట్టి వదిలించుకోవాలని చూస్తున్నావ్” అని గద్గద స్వరంతో పలికింది. శేషగిరి మనసు కరిగింది. అనవసరంగా అనుమానించానని బాధపడ్డాడు. ఆ సంబంధం వీళ్ళిద్దరి మధ్య ఉండదులే అని మనసుకు నచ్చజెప్పుకున్నాడు.
కానీ మనసు కోతి కదా, ఆ శాంతి ఎంతోకాలం నిలవలేదు. మళ్ళీ మొదటికొచ్చింది. ఈ అనుమానపు దెయ్యం నిక్షేపం లాంటి అతడి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. విచిత్రమేమంటే భార్య గురించి ఒక్క ఆలోచన కూడా లేదు. కానీ మధ్యలో ఏర్పడ్డ బంధం శేషగిరిని మాత్రం చిత్రవధ చేసింది.....
శ్రీధర్ గురించి సులోచనతో మళ్ళీ గొడవపడ్డాడు. సులోచన ఎంత నచ్చచెప్పినా శ్రీధర్ తృప్తి పడలేదు. ఆ వీధి నుండి వేరే ప్లేస్ కి ఇల్లు మార్చాడు . అయినా సరే గొడవలు తగ్గలేదు. శేషగిరిని భరించడం సులోచనకు కష్టమనిపించేది. వేరే దారి లేక భరించేది. శేషగిరి ఓ రెండేళ్ల పాటు ఈ అనుమానం తో ఆరోగ్యాన్ని పూర్తిగా చెడగొట్టుకున్నాడు. భార్య, కొడుకు సమస్య ఏంటని అడిగినా చెప్పలేదు. ఈ ఆనుమానం కొనసాగితే ప్రాణానికే ముప్పనిపించి శేషగిరి సులోచన ను దూరం పెట్టసాగాడు. ఆమె కి దూరం గా ఉండి జాబ్ లో బిజీ అయిన తర్వాత శేషగిరి ఆరోగ్యం కుదుటపడింది. సులోచన గురించి ఆలోచించడమూ ఆమె ఆలన పాలన చూడడమూ మానేశాడు.
సులోచన కర్మకు సులోచనను వదలి వైజాగ్ ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. సులోచన శేషగిరి ని కలవడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ శేషగిరి అవకాశం ఇవ్వలేదు. ఎండమావులను నమ్మి పొదరింటిని కాలదన్నుకున్న సులోచన రెంటికీ చెడింది. స్వాతిశయంతో వ్యామోహం తో తీసుకున్న నిర్ణయం సులోచన జీవితాన్ని నాశనం చేసింది. ఆమె నిరాశ్రయురాలైంది. శేషగిరి మాత్రం అంతా మర్చిపోయి హాయిగా జాబ్ లో మునిగిపోయాడు. సులోచన, ఆమె బిడ్డ ఏమయ్యారో ఎవ్వరికీ తెలీదు....
సుఖంగా బతుకుతున్న దంపతులను మాయ మాటల తో వేరుజేసి వాళ్ళ జీవితాలను సర్వ నాశనం చేయడం వల్లే తన కుటుంబం త్వరలోనే పెద్ద దిక్కుని కోల్పోతుందని తెలిసొచ్చింది. నవీన్ కి సులోచనకు సరియైన న్యాయం ఎలాగైనా వాళ్ళ జీవితంలో వెలుగులు నింపాలన్నదే శేషగిరి ఆలోచన. అప్పుడే తన మనసుకు తృప్తి అనుకుని వారికి ఎలా న్యాయం చేయాలో ఆలోచిస్తున్నాడు
3
వెంకట పతి శేష గిరి బాల్య మిత్రుడు. వెంకట పతి తండ్రి రాజా రావు శేషగిరి తండ్రి దగ్గర గుమాస్తా గా ఉండేవాడు. లెక్కలన్నీ రాజారావే చూసేవాడు. దూరపు బంధువు అవ్వడం తో శేషగిరి కుటుంబం రాజారావుకి మంచి గౌరవం ఇచ్చేది. రాజారావు కొడుకు వెంకట పతి శేషగిరి తో కలిసే పెరిగాడు. వెంకటపతి కి చదువు సరిగా అబ్బలేదు. ఇంటర్ తో చదువు ఆపేసి చిన్న చిన్న ఉద్యోగాలు చాలా చేశాడు. ఆస్తి కొద్దిగాఉండేది. వెంకటపతి జీవితం లో చాలాకాలం పాటు సెటిల్ అవ్వలేదు. చాలా కష్టాలు పడ్డాడు. వెంకట పతి భార్య విజయ సౌమ్యురాలు, భర్తకు సహాయంగానే ఉండేది. వెంకటపతి కొడుకు పవన్. పెళ్ళైన చాలా కాలానికి పుట్టాడు...
అత్తగారి తరుపు నుండి వెంకట పతికి కొంచెం ఆస్తి వచ్చింది. ఎన్నో వ్యాపారాలు చేసి దెబ్బతిన్న వెంకట పతి అత్తగారిచ్చిన ఆస్తి అమ్మి వడ్డీ వ్యాపారం చేద్దామని హైదరాబాద్ చేరాడు. శేషగిరి మంచి పోజిషన్ లో ఉండడం తో శేషగిరి సహాయాన్ని అర్ధించాడు. శేషగిరి కూడా బాగానే సహాయం చేశాడు. వెంకట పతికి భగవదనుగ్రహం కలిగి ఫైనాన్స్ వ్యాపారం బాగా కలిసొచ్చింది. పదేళ్లలోనే వేంకటపతి మంచి స్థితికి చేరుకొని సొంతిల్లు, కారు అన్నీ సమకూర్చుకొని బాగా సెటిల్ అయ్యాడు. మిత్రుడు శేషగిరి సహాయం వల్లనే ఈ స్థితికి చేరానని వెంకటపతి నమ్మకం. అందువల్ల శేషగిరి కి విశ్వాసంగా ఉండేవాడు. రోజూ వ్యాపారం చూసుకొని ఖాళీ టైమంతా శేషగిరి తోనే గడిపేవాడు.
బిజినెస్ బాగున్నందున వెంకటపతి తన వ్యాపారాన్ని పెంచాడు. తక్కువ వడ్డీకి అప్పుతీసుకొని ఎక్కువ వడ్డీకి అప్పు ఇవ్వడం ప్రారంభించాడు. ఇది కూడా బాగానే సాగింది. వ్యాపారం కోట్లల్లోకి వెళ్లింది. వెంకటపతి ఇంకో మెట్టు పైకెక్కాడు. కొడుకు పవన్ చదువు కోసం చెన్నైలో ఉండేవాడు. వెంకటపతి భార్యకు చదువు పెద్దగా రాదు. ఈమెకు భర్త చేసే వ్యాపారం గురించి అంతగా తెలీదు. అంతా తానై చూసుకొనేవాడు వెంకటపతి...
శేషగిరి రాజకీయాలలో పైకొచ్చాడు. పటిష్టమైన ఆర్ధిక స్థితి శేషగిరి సొంతమైంది. విపరీతంగా సంపాదించాడు. వెంకటపతి కూడా లక్ష్మి పుత్రుడయ్యాడు. అంతా సుఖంగా సాగుతున్న సమయం లో ఎన్నికలొచ్చాయి. శేషగిరి రెండోసారి ఎంఎల్‌ఏ గా నిలబడ్డాడు. ప్రత్యర్థి గట్టివాడు అవ్వడం వల్ల శేషగిరి ఎక్కువ ఖర్చు పెట్టి ఓట్లు కొనాల్సివచ్చింది. తన దగ్గర క్యాష్ ఎక్కువగా లేకపోవడం వల్ల వెంకట పతి దగ్గర కొద్ది వడ్డీకి అప్పు తీసుకున్నాడు శేషగిరి. సుమారు నలభై కోట్ల దాకా వెంకట పతి శేషగిరికి ఇచ్చాడు. అనుకున్నట్లుగానే శేషగిరి గెలిచాడు. ఏదో కార్పొరేషన్ కి ఛైర్మన్ కూడా అయ్యాడు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారడం వల్ల శేషగిరి లాంటి వాళ్ళు గెలవడం పెద్ద కష్టం కాదు కదా...
ఎన్నికై ఏడాది దాటినా వెంకట పతికి డబ్బు తిరిగి ఇవ్వలేదు శేషగిరి. వడ్డీ కూడా ఇవ్వలేదు. ప్రాణ స్నేహితుడు కదా అని ఎటువంటి గ్యారెంటీ లేకుండానే డబ్బు ఇచ్చాడు వెంకటపతి. నిజానికి ఆ సమయం లో వెంకటపతి దగ్గర కూడా అంత డబ్బు లేదు. బయట నుండి తెచ్చి ఇచ్చాడు. ఒకటి రెండు సార్లు శేషగిరి కి గుర్తుచేశాడు వెంకటపతి. డబ్బు బయట నుండి రావాలి రాగానే ఇద్దామనేవాడు. శేషగిరి పై బాగా నమ్మకం ఉండటంతో అంత డబ్బు ఇచ్చినా ఎన్నడూ భయపడలేదు వెంకటపతి.
రోజులన్నీ మనవి కావు కదా... అందుకే ఎప్పుడు తగు జాగ్రత్తలోఉండాలని పెద్దలు సలహా ఇస్తారు. కొంత కాలానికి వెంకటపతి సడన్ గా హార్ట్ స్ట్రోక్ తో మరణించాడు. శేషగిరి అప్పటికే కొంత డబ్బుతిరిగి ఇచ్చాడు. మరణించే నాటికి వెంకటపతికి శేషగిరి నుండి ఇరవై కోట్లు రావాలి.
వెంకటపతి చనిపోవడంతో డబ్బిచ్చిన వారందరూ ఒక్కసారిగా వెంకటపతి ఇంటిమీద పడ్డారు. వెంకటపతి బావమరుదులే ఈ బాకీలన్నీ పరిష్కారం చేశారు. రావాల్సిన డబ్బు రాలేదు, కానీ ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం డబ్బు కోసం వేధించ సాగారు. రావాల్సిన సొమ్మును చాలా వరకు వసూలు చేసి బాకీలు తీర్చారు వెంకటపతి బావమరుదులు. ఇంకా చాలా బాకీ మిగిలుంది...
వెంకటపతి భార్యవిజయ, శేషగిరి బాకీ గురించి తమ్ముళ్ళకు చెప్పింది. వాళ్ళు పాత డైరీలు చూశారు.. శేషగిరికి ఎంత ఇచ్చింది శేషగిరి ఎంత తిరిగి ఇచ్చింది ఇంకా ఎంత మొత్తం రావాలో ఆ వివరాలన్ని డైరీ లో నోట్ చేసి పెట్టాడు వెంకటపతి.. విజయ తన తమ్ముళ్లను తీసుకొని శేషగిరి దగ్గరకు వెళ్ళి బాకీ విషయం ప్రస్తావించింది....
“డబ్బా,,,,నేనేప్పోడో తిరిగిచ్చేశా. డబ్బు తిరిగి ఇచ్చాకనే నా నోట్లు నాకు తిరిగి ఇచ్చాడు..”. అని తాను స్వయంగా తయారు చేసిన ప్రోమిసరి నోట్లు, బ్యాంక్ చెక్కు లను చూపించాడు...
వెంకటపతి బావమరుదులు నమ్మలేదు... “డబ్బు ఇచ్చేస్తే ఇంకా డైరీ లో మా బావ ఎందుకు రాసి ఉంచుతాడు.. ఒకసారి గుర్తుచేసుకోండి, ఇప్పుడు డబ్బు కట్టకపోతే ఇల్లు, స్థలాలు పొలం అంతా అమ్మాల్సి వస్తుంది. మా అక్క రోడ్డున పడుతుంది. కాస్త దయుంచి గుర్తు చేసుకోండి” అని ఎంతగానో బతిమాలారు.....
శేషగిరి కరిగిపోలేదు... వాళ్ళు ఎంత అడిగినా తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చానని బుకాయించి, ఇంకా ఎక్కువ మాట్లాడితే పోలీస్ లను పిలుస్తానని బెదిరించాడు...చేసేదేమీలేక నిస్సహాయులై తిరిగెళ్ళారు....
వెంకట పతి భార్య విజయ సిటి లో ఉన్న ఇల్లు స్థలాలు ఇంకా ఊళ్ళో ఉన్న పొలం మొత్తం అమ్మిమిగిలిన బాకీలు తీర్చింది. కొడుకుని చదువు మాన్పించి సోదరులతో కలిసి పుట్టింటికి చేరింది. కొన్ని జీవితాలను దేవుడే పగబట్టి మరీ సాధిస్తాడు. మనుషులం చేసేముంటుంది శిక్షను భరించడం తప్ప...
వెంకట పతి కుటుంబానికి తాను చేసిన అన్యాయం గుర్తుకొచ్చి శేషగిరి సిగ్గుతో చచ్చిపోతున్నాడు. ఎంత దుర్మార్గుడైన ఇంత నీచమైన పని చేయడనిపించింది. ఆ కుటుంబాన్ని ఆదుకుంటేనే తన పాపభారం తగ్గుతుందని భావించాడు శేషగిరి.
శేషగిరిని పలకరించడానికి బంధు మిత్రులందరూ వస్తూనే ఉన్నారు. పలకరించడానికి వచ్చినవాళ్లతో అన్యమనస్కంగా మాట్లాడుతున్నాడు శేషగిరి. ఈ ముగ్గురికి తన వల్ల జరిగిన అపకారం గురించే చింతిస్తున్నాడు. వాళ్ళకి ఎలాగైనా న్యాయం చేయాలన్నదే శేషగిరి ఆలోచన. కానీ ఈ విషయాలు బయటకు తెలిస్తే పరువు పోతుందని శేషగిరి భయం.. కానీ ఈ పాపాలతో చనిపోవడం శేషగిరికి ఇష్టం లేదు. ఎలాగైనా ఈ పాపం నుండి బయటపడాలన్నదే శేషగిరి ఆలోచన. ఎవ్వరికి తెలియకుండా ఈ కుటుంబాలను వెతికి వాళ్ళని ఆదుకోడానికి నమ్మకమైన వ్యక్తి కావాలి. ఆ కుటుంబాలకు మాత్రమే తెలిసేలా రహస్యంగా సహాయం చేసి ప్రాయశ్చిత్తం అందించే నమ్మకమైన వ్యక్తి గురించి అన్వేషణ ప్రారంభించాడు శేషగిరి...
చనిపోయే లోపే ఈ ముగ్గురికి ఏదో ఒకటి చేయాలని గట్టి సంకల్పంతో శేషగిరి ఉన్నాడు. ఈ పనిలో సాయం చేయడానికి ఎవరైతే బాగుంటారా అని ఆలోచించాడు. తానైతే ప్రయాణం చేయలేడు. ఆ కుటుంబాల జాడ కనుక్కోలేడు... తప్పనిసరిగా వేరే వ్యక్తి సాయం అవసరం.. ఆ వ్యక్తి కూడా అన్ని విధాలా మంచోడై ఉండాలి ... లేకపోతే అనుకున్న ఆశయం నెరవేరదు.. ధనం కూడా దుర్వినియోగం అవుతుంది. అటువంటి మంచి వ్యక్తికొసం అన్వేషణ చేస్తున్నాడు...
తన బాబాయి కి తన వల్ల చాలా అన్యాయం జరిగింది. బాబాయి పట్ల తాను చేసిన పాపం కడుక్కోడానికి బాబాయి లేడు. అతనికి కుటుంబం కూడా లేదు. అందుకని బాబాయి విషయం తరువాత చూద్దామని శేషగిరి నిర్ణయించాడు. మిగిలిన వారిని వెతికి వారికి సహాయం చేస్తే మంచిదని శేషగిరి అనుకున్నాడు...
మంచివ్యక్తి ఎవరా అని పరిపరి విధాలుగా ఆలోచించాడు. బంధువులలో ఎవ్వరికీ ఈ బాధ్యత ఇవ్వలేడు. కాబట్టి బయట వ్యక్తులగురించి ఆలోచించాడు. చివరకు శర్మ గుర్తుకొచ్చాడు. శర్మ ఇంతకుముందు టెన్యూర్ లో పర్సనల్ అసిస్టెంట్ గా చేశాడు. నిజానికి శర్మ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తను మొదటిసారి ఎంఎల్‌ఏ అయినప్పుడు డెప్యూటషన్ పై అసిస్టెంట్ గా వచ్చాడు. శర్మ నిజాయితీపరుడు. ఎవ్వరి నుండి పైసా ఆశించడు.. దంపతులిద్దరూ ఉద్యోగులే. అందుకే డబ్బు అవసరం పెద్దగా లేదు. ఇప్పుడు రిటైర్ అయ్యి ఖాళీగా ఉన్నాడు. అతనిని సాయం అడగాలని సంకల్పించాడు శేషగిరి.
ఫోన్ చేసి శర్మని పిలిచి అన్ని విషయాలు చెప్పాడు...
తన ఆశయం గురించి చెప్పాడు... అన్నిటిని సావకాశంగా విన్న శర్మ...
“వెంకటపతి గారి కుటుంబానికి మీరు చేసిన అన్యాయం గురించి నాకప్పుడే తెలుసు. నా కింక గుర్తే ఉంది. మిగిలిన విషయాలు తెలీదు. ఇప్పుడే తెలిసింది. మీరు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఆలోచన రావడమే చాలా గొప్పవిషయం. మీరు మంచివారు కాబట్టే ఇంత కష్టం లో కూడా వాళ్ళకి సాయం చేయడానికి ముందుకొచ్చారు. నేను ఈ పనిని ఓ యజ్ఞం గా భావించి మీ కోరిక నెరవేర్చుతా. మీకు భయం వద్దు. ముందుగా సులోచన గారిని విజయగారిని వెతికి పట్టుకుంటా. మీ బాబాయి గురించి తరువాత చూద్దాం” అన్నాడు.
శేషగిరి మనసు నెమ్మదించింది. ఆ రాత్రి సుఖంగా నిద్రపోయాడు. మరుసటి రోజున శర్మను పిలిచి సులోచన, వెంకటపతి ఫ్యామిలీల వివరాల ఇచ్చాడు. వాళ్ళ ఊర్ల పేర్లు, వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు.. ఇంకా వాళ్ళ గురించి తన దగ్గరున్న సమాచారం మొత్తం ఇచ్చాడు. ఓ నెల రోజుల్లో మొత్తం పని పూర్తి కావాలని చెప్పాడు. శర్మకు సహాయంగా తన నమ్మిన బంటు అయిన దివాకర్ ని వెంట పంపాడు. ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చాడు... శర్మ ,దివాకర్ ఇద్దరు ఆ మనషుల కోసం అన్వేషణ ప్రారంభించారు....
4
శర్మ, దివాకర్ ఇద్దరూ సులోచన వాళ్ళనే అందరికన్నా ముందుగా కలవాలని నిర్ణయించారు. అందుకే వెంకటా పురానికి చేరారు. నిజామబాద్ కు దగ్గర్లోనే ఉంది. ఊళ్ళోకి వెళ్ళాక నవీన్ గురించి వాకబు చేయగా “ పట్టాభి కొడుకేగా .. అదిగో కనిపించే రామాలయం పక్కనే ఉంది.”.. అని ఒక పెద్దాయన చెప్పాడు..
ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కగానే ఓ వ్యక్తి తలుపు తీశాడు. ఆయనే పట్టాభి అని నిర్ధారణకొచ్చారు
“ఎవరు... ఏంకావాలి” అని అడిగాడు...
“మేము హైదరాబాద్ నుండి వస్తున్నాం. నవీన్ ని కలవడానికి వచ్చాం.” బదులిచ్చాడు దివాకర్.
“నవీనా, వాడు హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడుగా. తెలీదా మీకు. అక్కడ నుండే వచ్చామన్నారుగా.” అన్నాడు పట్టాభి...
“తెలిదండి. నవీన్ ని కలిసి చాలాకాలం అయ్యింది. ఫోన్ నెంబరు వివరాలు తెలీదు. ఇక్కడే ఉన్నాడనుకున్నాం” జవాబిచ్చాడు శర్మ...
“ఇదిగో నిన్నే టీ పంపించు. అబ్బాయి స్నేహితులట వచ్చారు..” భార్యకు పని పురమాయించాడు. పట్టాభి...
టీ లు పూర్తయ్యాక “సులోచన గారు, అమ్మాయి బాగున్నారా” అడిగాడు శర్మ సులోచన వివరాలు తెలుసుకోడానికి..
“ఏం బాగు పరువు గంగలో కలిపి తన దారిన తాను పోయింది” అన్నాడు పట్టాభి.
“మేం నిజామబాద్ లో ఉన్నప్పుడు పరిచయం. అందుకనే అడిగా” అన్నాడు శర్మ...
“అయితే సంగతులేవీ తెలిదా” అన్నాడు పట్టాభి..
“ఏ సంగతులు..” అడిగాడు దివాకర్...
“మా కోడలు ఆడున్నపుడే వెధవ పని చేసి మమ్ముల్ని బజారు కీడ్చింది. ఎవడితోనో వెళ్లిపోయిందిగా మీకు తెలీదా” అన్నాడు పట్టాభి
“మేం ఎక్కువ రోజులు లేం. ఈ విషయాలేవీ తెలీదు” అన్నాడు శర్మ...
“ ఇప్పుడు సులోచన గారు .”.. అని అంటూఉండగానే .. పట్టాభి కలగజేసుకొని..
“కొంతకాలం వాడితోనే ఉంది. వాడు మోజు తీరాక వదిలేశాడు. గతి లేక మళ్ళీ మా పంచనచేరింది. మనవరాలి ముఖం చూసి రానిచ్చాం. అప్పటి కే మా నవీన్ కి ఇదంటే అసహ్యం. కానీ పైకి మాత్రం బాగానే ఉండేవాడు. ఏం అనేవాడు కాదు. కానీ ఊళ్ళో జనం మా కోడల్నిచూసి గుసగుస లాడేవాళ్లు. ఊళ్ళో తలఎత్తుకోలేని దౌర్భాగ్యం. అందుకని ఇద్దరినీ హైదరాబాద్ పంపించా. మా వాడికి ఉద్యోగం వచ్చింది. చేసిన తప్పుకి ఎప్పుడు బాధపడేది. ఇదంతా పరిస్థితుల ప్రభావంలే అని నచ్చచెప్పేవాళ్లం . వినేదికాదు. మౌనంగా ఉండేది. డిప్రెషన్ లో పడి చివరికి ఆత్మహత్య చేసుకుంది. మోహంతో చేసిన తప్పు వల్ల మా ఫ్యామిలీ రోడ్డుపాలైంది. అందుకే మనసెళ్లే అన్ని చోట్లకి మనం పోకూడదని పెద్దలు ఎప్పుడో చెప్పారు.” బాధతో వివరించాడు పట్టాభి
“మీ కోడల్ని ఎవరు తీసుకెళ్లారో మీకు తెలుసా ” అడిగాడు దివాకర్...
“మా ఖర్మ బాగోలేదు. మన బంగారం మంచిదైతే ఇన్ని జరగవు. అతను ఇప్పుడు పెద్ద పొలిటీషియన్. అంత స్థాయి లో ఉండి ఈ చిల్లర వేషాలు ఎందో. మా వుసురు ఎప్పటికైనా ఖచ్చితంగా తగులుద్ది. మా వాడు అమాయకుడు. ఆ పెద్దాయన్ని మేం ఏమి చేయలేం. అంత శక్తి మాకు లేదు. మాకు దేవుడే అండ. భగవంతుడే ఎప్పటికైనా వీడ్ని వదిలిపెట్టడు.” అంటూ శేషగిరిని నానా తిట్లు తిట్టాడు....పట్టాభి..
అక్కడి వాతావరణం చూసి శేషగిరే పంపించాడని చెప్పడానికి ఇద్దరికీ భయం వేసింది. పట్టాభి నుండి సెలవు తీసుకొని నవీన్ దగ్గరకు బయలుదేరారు. నవీన్ అడ్రెస్, ఫోన్ నంబరు వివరాలు తీసుకొని ఇద్దరు హైదరాబాద్ బయలుదేరారు......
హైదరాబాద్ చేరుకొని ఆ రోజు రెస్ట్ తీసుకొని రెండో రోజు కాలేజీ లో నవీన్ ని కలిశారు. నవీన్ శారదా కాలేజీ లో లైబ్రేరియన్. .
“మీరెవరు.. నాతో ఏం పని” అడిగాడు నవీన్
“ కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి” అన్నాడు దివాకర్..
“రండి...ఈ రూమ్ లో కూర్చుందాం” అని పక్కనే ఉన్న గదిలోకి దారితీశాడు...నవీన్..
“ఊ..ఇప్పుడు చెప్పండి... ఏం పని” అన్నాడు నవీన్
“మేము సులోచన గారి గురించి వచ్చాం....” అన్నాడు శర్మ...
నవీన్ ముఖం లో రంగులు మారాయి. ఒక్కసారిగా ముఖం వాడిపోయింది.... “సులోచన ఇప్పుడు లేదు. ఎప్పుడో చనిపోయింది..” అన్నాడు బాధగా.
“తెలుసు. ఇప్పుడు డైరెక్ట్ గా విషయం లోకి వస్తా. శేషగిరి గారు తెలుసుగా... వారే మిమ్మల్ని కలవమని పంపారు” అన్నాడు శర్మ
దిగ్గున కుర్చీలోనుండి లేచి.... ముందు బయటకు పోండి.. ఇంకా ఏం మిగిలిందని పంపాడు. మనుషుల వీక్నెస్ తో ఆడుకునే కుక్క... వాడ్ని ఏం చేసినాపాపం లేదు. భార్యను పోగొట్టుకొని నేను, తల్లిని పోగొట్టుకొని నా బిడ్డ ఇప్పటికీ ఏడ్వని రోజు లేదు. మా కన్నీరే వాడ్ని నాశనం చేస్తాయి” అని వినరాని మాటలతో కొంతసేపు శేషగిరిని తిట్టాడు....
“మా మాట వినండి .. ఇప్పుడదే జరిగింది ఇప్పుడు. మీ ఉసూరు క్యాన్సర్ గా మారి శేషగిరి గారిని పీడిస్తుంది. ఎన్నో రోజులు బతకడు. చేసిన పాపం తల్చుకొని సిగ్గుపడని రోజు లేదు... సులోచన గారు చనిపోయినట్టు ఇంకా తెలీదు. చచ్చిపోయే లోపు మీకు న్యాయం చేయమని పంపాడు. ఏం చేస్తే మీరు క్షమిస్తారో చెప్పండి అది ఎంత పెద్దదైన చేస్తాం” అన్నాడు శర్మ...
శేషగిరి ఎక్కువ రోజులు బతకడని తెలుసుకుని కొంత సేపు మౌనంగా ఉన్నాడు నవీన్.... కొంతసేపటికి.. “మా ఖర్మ ఇలా ఉంటే ఆయన మాత్రం ఏమి చేస్తాడు. ఇందులో సులోచన తప్పుకూడా ఉంది. జరగాల్సింది జరిగాక ఏం చేస్తాం . భగవంతుడున్నాడు అన్నీ ఆయనకే వదిలేశాను. మాకేంవద్దు... ఇక మీరు వెళ్లవచ్చు” అన్నాడు నవీన్...
“లేదు... ఏం కావాలో చెప్పిందాకా మేం పోము.. ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొనే అవకాశం ఇవ్వండి. ఇంత జరిగినా కూడా మీరు ఆయన్ని మీరు మన్నించారు. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి” అన్నాడు దివాకర్...
“దేవుని దయవల్ల అన్నీ ఉన్నాయి ... ఏమి వద్దు నన్ను వదిలేయ్యండి” అన్నాడు నవీన్...
ఇలా రెండు గంటల పాటు వాదించినా ఏం కావాలో మాత్రం చెప్పలేదు నవీన్.
“పాప ఏం చదువుతుంది....” అడిగాడు శర్మా...
“మెడిసిన్ పూర్తి అయ్యింది... PG సీట్ కోసం 3 యేళ్లుగా ట్రై చేస్తోంది... సీట్ రావట్లేదు. అదే మాకు పెద్ద దిగులు” అన్నాడు నవీన్...
“ఓ....అదెంత పని మీరు ఊ అనాలె గాని రేపటికల్లా సీట్ వస్తుంది...” అన్నాడు దివాకర్..
“అలా సీట్ తీసుకోవడం ఇష్టం లేదు..” అన్నాడు నవీన్...
“శేషగిరి గారికి మెడికల్ కాలేజీ ఉందిగా. అన్నీ ఆయనే చూసుకుంటాడు. మీరు కాదనోద్దు....”అన్నాడు శర్మ..
మరో రెండు గంటలు నవీన్ తో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత... నామినల్ ఫీజు తో సీట్ తీసుకోడానికి నవీన్ అంగీకరించాడు....శర్మ దివాకర్ ఇద్దరు సంబరపడి సెలవ తీసుకోని శేషగిరిని కలిశారు...
సులోచన మరణం గురించి శేషగిరికి ఇద్దరు చెప్పలేదు. ఈ టైమ్ లో శేషగిరిని కలత పెట్టడం శర్మ కి ఇష్టం లేదు. అందుకని సులోచన బతికే ఉందని కలిశామని ఇద్దరూ చెప్పారు.
“ఆమెఏమంది” శర్మగారు అడిగాడు శేషగిరి.
“మీ అనారోగ్యం గురించి పేపర్లో చూశారట. చాలా బాధపడ్డారు.” చెప్పాడు శర్మ.
“ఇంత చేసినా నా మీద కోపం లేదా” అడిగాడు శేషగిరి
“లేదు..అంతా తన ఖర్మ అనుకుంది. మీకు అనుమానం రాకుండా చూడాల్సింది. అలా చేయలేకపోయానని బాధపడింది. అప్పటి పరిస్థితిలో ఏ మగాడైనా అలాగా చేస్తాడని సర్దుకుపోయింది. భర్త మళ్ళీ దగ్గరకు తీశాడు. సుఖంగానే ఉన్నారు. మీ గురించి ఇప్పుడు బాధపడుతున్నారు” బదులిచ్చాడు శర్మ.
“ఇంత చేసినా నా మీద ప్రేమ తగ్గలేదు. ఆమె నిజంగా మంచిది. నాకు ఈ చివరి రోజుల్లో ఆమెని ఒక్కసారి కలవాలని ఉంది..” అన్నాడు శేషగిరి.
కథ ఇలా అడ్డం తిరిగి ఆమెని కలవాలంటాడని అస్సలు ఊహించలేదు ఇద్దరు. ఏం చెప్పాలో అర్దం కాక బిక్క ముఖం తో సైలెంట్ అయిపోయారు... చనిపోయిన మనిషిని తీసుకు రాలేం. కాబట్టి నిజం చెబుదామని దివాకర్ మాట్లాడబోతుండగా ఇంత శేషగిరి కల్పించుకొని...
“వద్దులే శర్మగారు. ఆమెకి చాలా నష్టం చేశాను. నమ్మిన నవీన్ కి ద్రోహం చేశాను. ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ ముఖం చూడాలంటే ఎలాగో ఉంది. ద్రోహం చేసిన నా ముఖం వాళ్ళకి చూపించలేను.చాలా చిన్నతనం గా ఉంది” అన్నాడు..
ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు..
చేసిన తప్పును క్షమించినందుకు సులోచనకు మనసులోనే కృతజ్ఞతలు తెలిపాడు శేషగిరి. ఆమె క్షేమంగా ఉందని నమ్మి ప్రశాంతంగా ఉన్నాడు.
శర్మని పిలిచి శేషగిరి...
“శర్మగారు. మీరు యాభై లక్షలు ఇస్తాను. సులోచన కూతురి పేరు మీద డిపాజిట్ చేయండి. మన కాలేజీ లో ఏ బ్రాంచ్ లో కావాలంటే ఆ బ్రాంచ్ లో సీట్ ఇవ్వండి. ఎటువంటి ఫీజు తీసుకోవద్దు. హాస్టల్ లో ఆమె ఒక్కదానికే సెపరేట్ రూమ్ ఇవ్వండి. చదువుకు అయ్యే అన్నీ ఖర్చులు పుస్తకాలతో సహా నా ఖాతా లో రాయండి. చదువు పూర్తి అయ్యాక మన కాలేజీ లో కానీ హాస్పిటల్ కానీ జాబ్ ఇప్పించండి. నేను పోయిన తరువాత కూడా ఆ అమ్మాయికి లోటు రానియద్దు. రేపు ప్రిన్సిపాల్ ను, మా అబ్బాయిని ఇద్దర్ని పిలవండి..
అన్నీ చెప్తాను” ఆయాసం తో చెప్పాడు శేషగిరి. మనసు కొంత నెమ్మదించింది.చేసిన పాపానికి కొంత ప్రాయశ్చిత్తం జరిగిందనినిపించింది శేషగిరికి... నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు....
శర్మ దివాకర్ ఇద్దరూ శేషగిరి చెప్పినట్లే చేశారు.. నవీన్ సంతోషానికి అవధుల్లేవు. అతనికి శేషగిరి మీద కోపం పోయింది. జరిగిన అనర్ధమంతా సులోచన తలరాత వల్లనే జరిగిందని సర్దుకుపోయాడు...
పరిస్థితులు, అవసరాలను బట్టి ఆలోచన మారుతుంది.... మానవ నైజం అంతే
5
సడన్ గా ప్రాబ్లం రావడం తో శేషగిరిని హాస్పటల్ లో జాయిన్ చేశారు. వెంటిలెటర్ తో కొంతకాలం నడిపించారు... నెల తర్వాత వెంటిలేటర్ తీసేశారు. ఇప్పుడు కొంచెం ఆరోగ్యం మెరుగుపడింది. మాట్లాడగలుగుతున్నాడు. వెంటనే శర్మ ని పిలిచి వెంకటపతి ఫ్యామిలి గురించి వాకబు చేయమని అడిగాడు. తాను ఎక్కువ రోజులు బతకనని మిగిలిన పని కూడా త్వరగా చేయమని శర్మని కోరాడు.
శర్మతో మాట్లాడిన రెండోరోజు ఉదయం “మిమ్ముల్ని చూడ్డానికి విజయమ్మ గారోచ్చారు...” అన్నాడు దివాకర్...
“విజయమ్మ ఎవర్రా....” అన్నాడు శేషగిరి..
“అదేనండీ.. మన వెంకటపతిగారి భార్య” అన్నాడు దివాకర్...
ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు... ఇప్పుడు ఈమెందుకొచ్చింది.. తిట్టడానికి కాదుగా అని భయపడి లేచి కూర్చున్నాడు..
“అన్నయ్యా,, ఇప్పుడెలా ఉంది... వారం కింద వచ్చాను. మీకు స్పృహ లేదు. పేపర్ లో చూసి మిమ్ముల్ని చూసిపోదామని వచ్చా...” అంది విజయ.
ముఖం లో ఎలాంటి భావం లేదు...పరామర్శకే వచ్చినట్లుంది....
“ కొంచెం పర్లేదమ్మ” అన్నాడు శేషగిరి...
నిజానికి విజయ వచ్చిందనగానే తిట్టడానికో లేదా ఇంకా ఏదైనా పంచాయతీ పెట్టడానికో వచ్చిందేమోనని భయపడ్డాడు. అలాంటిదేమీ లేకపోవడం తో శేషగిరి స్థిమితపడ్డాడు. ఇంత అన్యాయం చేసినా ఈమె ఎలా రాగలిగిందనుకున్నాడు శేషగిరి.
అంతే మరి... స్త్రీ గదా. కోపం గాని ద్వేషం కానీ ఎక్కువకాలం మోయలేదు. దేవుడు ఇంతటి క్షమా శక్తి స్త్రీ కి ఇచ్చాడు కాబట్టే ఇంకా సమాజం లో నాగరికత ఉంది.
“ ఎక్కడుంటున్నావు విజయ. బాబు ఉద్యోగం చేస్తున్నాడా. అంతా బాగేనా” పరామర్శించాడు శేషగిరి...
“ఏం బాగులే అన్న. నేను వాడు మా అమ్మగారి ఊళ్ళో ఉంటున్నాం. స్థలం కొని చిన్న ఇల్లు కట్టాం. చిన్న కిరాణా కొట్టు నడుపుతున్నాం......” చెప్పింది విజయ...
“అదేంది వాడు చదవలేదా...” అన్నాడు. శేషగిరి...
“నీకు తెల్సుగా అన్నయ్య. ఆయన తో పాటే ఉన్న ఆస్తి అంతా పోయింది. కట్టుబట్టలతో మిగిలాం. ఇంకా తమ్ముడు ఉండబట్టి బతికున్నాం...” అంది విజయ విచారంగా...
“నేను చాలా అన్యాయం చేశాను...” అన్నాడు శేషగిరి.
“మా ఖర్మకి మీరేంచేస్తారు..” అంది విచారంగా
“ విజయ. నేను మీకు బాకీ ఉన్నాను..” అన్నాడు శేషగిరి తలదించుకొని..
“ఇచ్చారన్నారుగా అన్నయ్య. ఆయనకే ఇచ్చానన్నారు... :” అంది విజయ
ఆమె అమాయకత్వానికి జాలేసింది. ఇటువంటి మనుషుల్నా నేను మోసం చేసిందని విలవిలలాడాడు.
“ఆయన బతికున్నప్పుడు మీరే లోకంగా బతికాడు. ఎప్పుడు మీ గురించే ఆలోచన. మీరు చేసిన సాయం గురించి అందరికీ చెప్పి గర్వపడేవాడు.. ఆయన దృష్టిలో మీరు దేవుడు. అందుకే మిమ్ముల్ని చూద్దామని వచ్చా. రాకపోతే ఆయన ఆత్మ శాంతించదు..” చెప్పింది విజయ..
శేషగిరికీ తన మీద తనకే అసహ్యం వేసింది. ఇలాంటి వాళ్ళని మోసంచేసి ఎంత సంపాదించినా . ఒక్క రూక కూడా వెంట రావట్లేదు. కానీ ఖర్మ మాత్రమే తనతో వస్తుంది. ఈ కొద్ది రోజుల జీవితం కోసం ఇన్ని నాటకాలు వేసినందుకు మొదటిసారిగా భగవంతునికి క్షమాపణ చెప్పాడు. శేషగిరి...
“విజయ నన్ను మన్నించు. మీకు నేను బాకీ ఉన్నా. వాడికి డబ్బు ఇవ్వలేదు. మీ కుటుంబం నాశనం అవ్వడానికి నేనే కారణం. పెద్ద మనసు తో క్షమించమ్మ..మీకు చేసిన అన్యాయానికి ఇప్పుడు ఘోరమైన శిక్షను అనుభవిస్తున్నా. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొనే అవకాశం ఇవ్వమ్మ. నాకు మనశ్శాంతిని కలిగించు.” చేతులు పట్టుకొని విలపించాడు శేషగిరి.
“ అన్నీ నాకు తెలుసన్నా.. కానీ చూడకుండా ఉండలేకపోయా. నీ మీద కోపం లేదు. నీ లాంటి వాళ్ళు ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు. నా కుటుంబం మాత్రం పూర్తిగా నష్టపోయింది. కానీ నాకున్న మనశ్శాంతి నీకు లేదు. డబ్బుతో శాంతి రాదు. ఇప్పుడు తెలిసింది నీకు. కానీ ఏం లాభం జీవితం మాత్రం లేదు... మనం చేసే పనులే మన జీవితాన్ని తీర్చి దిద్దుతాయి... నేను నష్టపోయినా నాకు ఎప్పుడో ఒకప్పుడు మంచి జరుగుతుందని ఎప్పుడు నమ్ముతాను. ఎందుకంటే నేను ఇంతవరకు ఎవ్వరికి ద్రోహం చేయలేదు. నా ఈ పుణ్యమే నీలో మార్పు తెచ్చింది. అందుకే డబ్బు తిరిగి ఇస్తానంటున్నావు.. నాకు రావాల్సిన డబ్బు కంటే ఒక్క పైసా కూడా వద్దు. నా సొమ్ము ఇస్తే చాలు” చెప్పింది విజయ గర్వంగా
సిగ్గుతో కొంచెం సేపు తలదించుకుని అలా ఉండిపోయాడు శేషగిరి... కొద్దిసేపటికి
“ త్వరలోనే నీ డబ్బు ఇస్తాను.... నన్ను క్షమించు” అని బదులిచ్చాడు. కొంతసేపు ఉండి విజయ వెళ్లిపోయింది....
చిత్రంగా శేషగిరికి సముద్రమంత శాంతి కలిగింది. తన పాపాన్ని విజయ క్షమించడం తో శాంతి కలిగిందని శేషగిరికీ అర్ధం అయ్యింది...
విజయకు డబ్బు ఎలా ఇవ్వాలా అన్న ఆలోచన లో పడ్డాడు శేషగిరి...
శర్మను పిలిచి వెంకట పతికి ఇవ్వాల్సిన డబ్బు గురించి చెప్పాడు శేషగిరి. చాలా పెద్ద మొత్తం లో వెంకట పతికి బాకీ పడ్డాడని శర్మ గ్రహించాడు...
“ఇవ్వాల్సిన డబ్బు చాలా ఉంది. .ఇంత డబ్బు ఎలా తెస్తారు...” అనుమానం వెలిబుచ్చాడు శర్మ...
“హైదరాబాద్ లో ఉన్న నాలుగు ప్లాట్లు మంచి ఏరియా లో ఉన్నాయి. అందులో రెండు రాసిద్దాం. చాలా వరకు క్లియర్ అవుతుంది. మిగిలినవి క్యాష్ ఇద్దాం. ఇవి చాలక పోతే వేరే ఏర్పాట్లు చేద్దాం. ఇన్నిఇచ్చినా మన స్థితి కి లోపం రాదు. ఇంకా చాలా ఉన్నాయి....” చెప్పాడు శేషగిరి
“ప్లాట్ల వివరాలు మా పెద్దోడికి తెలుసు. వాడ్ని అడిగి విజయకు ఇవ్వడానికి అన్నీ ఏర్పాట్లు చేయి...” చెప్పాడు శేషగిరి.
శర్మ తల ఊపి వెంటనే పన్లో పడ్డాడు. సాయంత్రానికి హాస్పటల్ కు నీరసంగా తిరిగొచ్చాడు.
“ అన్ని పన్లు అయ్యయా...” అడిగాడు శేషగిరి...
“లేదు. పెద్ద చిక్కోచ్చిపడింది. పనులు అయ్యేట్లు లేవు”బదులిచ్చాడు శర్మ...
“ ఏమైంది. ఏం సమస్య....” అడిగాడు శేషగిరి ఆందోళనగా
“మీ ఇంట్లో వాళ్ళు ఆ ప్లాట్లు ఇవ్వడానికి ఒప్పుకోవట్ల” చెప్పాడు శర్మ..
ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు శేషగిరి... వెంటనే తేరుకొని.
“వాళ్ళెవరూ. వద్దంటానికి. నేను చెప్పానని చెప్పకపోయావా...” అన్నాడు
“చెప్పాను. ఆయనికి మతిలేదు. మేం బాకీ పడ్డమేమిటి... ఎవరన్నా వింటే నవ్వుతారు. మేం ఎవ్వరికీ డబ్బు ఇవ్వాల్సిన పని లేదు.... ఆస్తి కూడా ఇవ్వం.. మీరు ఇందులో కలగజేసుకోవద్దు... అన్నారండి” చెప్పాడు శర్మ...
శేషగిరి ముఖం వాడింది.. ఇంతలోఇదే గోల ... అందుకనే కాబోలు మధ్యాన్నం నుండి అందరూ ముభావంగా ఉన్నారనుకున్నాడు. అందర్నీ ఒక్కసారి పిలిచి మాట్లాడాలని అనుకోని
“సర్లే నేను మాట్లాడతా” అని శర్మని ఇంటికి పంపాడు...
ఓ గంట తర్వాత అందర్నీ పిలిచి వెంకటపతికి ఇవ్వాల్సిన డబ్బు గురించి చెప్పాడు... భార్య పిల్లలు శేషగిరిని అనరాని మాటలన్నారు. ఏనాడో పోయినొడికి డబ్బు ఇవ్వడమేందని ఎదురు తిరిగారు. ఎవ్వరం లైఫ్ లోఇంకా సెటిల్ కాలేదు. ముందుముందు మాకు చాలా అవసరాలుంటాయి. .ఆస్తులన్నీ ఇప్పుడే పోగొట్టుకొని బతికేదెట్లా అని శేషగిరిని నిలదీశారు. ఒక్క పైసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. గట్టిగా మాట్లాడితే లాయర్ ని సంప్రదిస్తామని ఎదురు తిరిగారు...
మ్రాన్పడిపోయాడు శేషగిరి. పెద్దమనుషుల తో చెప్పిద్దామనకున్నా తను తప్పు అందరి తెలుస్తుంది. పరువు పోతుందని ఆలోచించి భార్య ను బతిమాలాడు. ఆమె కూడా ససేమిరా అంది. విజయ తో నీకు అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది. శేషగిరికీ నోటిమాట రాలేదు. ఈ మాట శేషగిరిని గాయపర్చింది. ఇలాంటి వాళ్ళ కోసం అందర్నీ మోసం చేసి డబ్బు వెనకేసినందుకు బాధపడ్డాడు. వేసిన నింద అబద్దమని భార్యని గట్టిగా అరిచాడు శేషగిరి. భార్య వెళ్లిపోయింది..
శేషగిరి సంకటం లో పడ్డాడు. డబ్బే పెద్ద సమస్య అయ్యింది. భార్య పిల్లల ప్రవర్తనశేషగిరిని క్రుంగదీసింది. విజయకు డబ్బు ఇవ్వాలా మదనపడ్డాడు శేషగిరి....
6
విజయకు డబ్బు ఎలా ఇవ్వాలా అని ఒకటే ఆలోచన శేషగిరికి. నిద్ర పట్టడం లేదు. కుటుంబం తనని లెక్క చేయలేదన్న మనస్తాపం తో ఆరోగ్యం మరింత క్షీణించింది. వారం తర్వాత ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. ఎలాగంటే ఈ వారం రోజుల్లో శేషగిరి డెసిషన్ తీసుకున్నాడు. అలా చేస్తే వెంకట పతి ఋణం తీరిపోతుంది. ఆ డెసిషన్ ని పాటించడానికి సిద్దపడ్డాడు.
ఆరేళ్ళ క్రితం నుండి తన బాబాయి పేరున మానసిక వికలాంగుల సదనం కట్టాలని శేషగిరి నిర్ణయించి దానికి అవసరమైన అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు. తను మంచి పదవిలో ఉండడం తో డొనేషన్స్ బాగా వచ్చాయి. ఇంట్లో తెలీదు. కాస్ట్లీ ఏరియా లో ఐదు ఎకరాల స్థలం తీసుకున్నాడు. తీసుకోవడం అంటే ఆ స్థలం సెటిల్మెంట్ శేషగిరే చేశాడు. అది మొత్తం అరవై ఎకరాలుంటుంది. సెటిల్మెంట్ చేశాడు కాబట్టి శేషగిరికీ ఓ ఐదు ఎకరాలిచ్చారు. కొంతమంది స్నేహితుల దగ్గర పెద్ద మొత్తం లో శేషగిరి డబ్బు ఉంది. సదనం నిర్మాణానికి పెద్ద మొత్తం లో డబ్బు పోగుచేసి నమ్మకస్తుల దగ్గర ఉంచాడు...
ఇంట్లో వాళ్ళకి తెలీకుండా ఈ డబ్బుని విజయకు ఇవ్వొచ్చు. ఇబ్బంది ఉండదు. కానీ ఇన్నీ కలిపినా విజయకు ఇవ్వాల్సినంత డబ్బు కాలేదు. మొత్తం ఇచ్చినా బాకీ కొంత మిగిలే ఉంటుంది. ఇంకా ఒక్క ప్లాట్ ని కలిపి ఇస్తే బాకీ పూర్తిగా తీరుతుంది. కానీ స్థలం ఇవ్వడానికి ఇంట్లో ఒప్పుకోరు...
ఎలా చేయాలా అని ఆలోచిస్తుంటే ఈ మధ్యనే బెంగుళూరు లో కొన్న స్థలం గుర్తొచ్చింది.. ఇప్పటికైతే పెద్ద రేటు లేదు. భవిష్యత్ లో పెరుగుతుంది. అది కలిపి ఇద్దామనుకున్నాడు. ఇప్పటి కి ఎంత ఉంటే అంత ఆస్తి విజయకు ఇచ్చి మిగిలింది కొద్ది రోజుల్లో సర్దుదామనుకున్నాడు. కానీ ఇలా చేస్తేతన బాబాయి పేరున కడదామనుకున్న సదనం ఆగిపోతుందని రెండు రోజులు ఆలోచించాడు... ఇక వేరే మార్గం లేదు కాబట్టి సదనం సంగతి తర్వాత చూద్దామని అనుకుని, విజయకు కబురు చేశాడు..
శర్మని దివాకర్ ని పిలిచి అన్ని వివరాలు చెప్పి విజయకు డబ్బు ఏర్పాటు చేయమన్నాడు. నాలుగు రోజుల్లో అన్నీ తయారు చేశారు.. విజయకు కబురు పంపినా విజయ రాలేదు... డబ్బు, ఆస్తి పేపర్లు అన్నీ తీసుకొని విజయ ఊరికి వెళ్లాడు శర్మ. భూమిని విజయ పేరున రాశాడు శేషగిరి. బెంగుళూరు స్థలం కూడా టెంపరరీ అగ్రీమెంట్ రాసాడు. బెంగళూరు లో ఉన్న ఫ్రెండ్స్ కి వివరం చెప్పి ఓ వారం రోజుల్లో విజయ పేరున ట్రాన్సఫర్ చేయమన్నాడు....
శర్మ విజయకు అన్నీ పత్రాలు డబ్బు అందజేశాడు... సంతకం తీసుకున్నాడు. విజయ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మిగిలిన సొమ్ము గురించి వర్రీ కావద్దని చెప్పింది శేషగిరికీ సహస్ర నమస్కారాలు చేసింది. ఇదంతా శేషగిరికీ ఫోన్ లోనే చెప్పింది.. దారి చూపిన దేవుడిగా మా గుండెలో ఎప్పటికీ ఉంటావంది..
ఇవి విన్న శేషగిరికి కొండంత భారం తొలిగినట్లైంది....
తన పినతండ్రి కి చేసిన అన్యాయం నుండి ఎలా బయటపడాలో తెలియట్లేదు శేషగిరికి చిన్నాన్న బతికి లేడు. ఆయన సంతతి కూడా లేదు. గతం లో ఇలా ఆలోచించే మానసిక వికలాంగుల సదనం పెట్టాలని సంకల్పించాడు. ఇలా చేస్తే తన చిన్నాన్న ఆత్మ శాంతిస్తుందని భావించాడు. కానీ అందుకై ఉంచిన డబ్బు, స్థలం వెంకట పతి బాకీ క్రింద పడ్డాయి... శేషగిరి చేతిలో భార్య పిల్లలకు తెలీకుండా చిల్లిగవ్వ లేదిప్పుడు
సదన నిర్మాణం కోసం ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టాడు. తెలిసిన వాళ్లందరిని డబ్బు సాయం కోరాడు. కానీ ఒక్క అడుగు ముందుకెళ్లలేదు. శేషగిరి స్థితి గమనించి డబ్బు సాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. శర్మ దివాకర్ లు చేసిన సేవకి కొంత డబ్బు ఇచ్చాడు. శేషగిరి వల్ల ఏ లాభం ఉండదని శర్మ దివాకర్ ఇద్దరూ రావడం మానేశారు. ఎంత ప్రయత్నించినా ఒక్క పైసా రాలేదు. శేషగిరికి దిగులు ఎక్కువైంది. బాబాయికి చేసిన పాపం నుండి విముక్తి లేకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డాడు. ఈ దిగులుతో వ్యాధి ముదిరింది...
పది రోజుల పాటు నరకం చూశాడు. ఇంత బాధలోను సదన నిర్మాణానికి సాయం చేయమని వచ్చిన వాళ్ళను అడుగుతూనే ఉన్నాడు. ఎవ్వరూ పట్టించుకోలేదు. భార్య పిల్లలు కూడా ఈ గోలేందని విసుకున్నారు. ఎవ్వరూ సాయం చేయలేదు...ఈ ఒక్క పాపానికి పరిహారం లేదని అర్ధమైంది శేషగిరికీ. ఈ చరమ దశలో సదన నిర్మాణానికి డబ్బు వసూలు చేసి సొంతానికి వాడుకున్న పాపం కూడా తోడైంది. తిరిగి జన్మెత్తి పాపకర్మను కష్టాల రూపంలో అనుభవించడమే పరిహారమని, అదే దైవ నిర్ణయమని గ్రహించి మౌనం గా ఉండిపోయాడు...
శేషగిరి పినతండ్రి కి చేసిన పాప ఫలాన్ని మోసుకుంటూ నిద్రలోనే కన్ను మూశాడు. మానసిక వికలాంగుడైన బాబాయిని హింసించిన పాపానికి నివృత్తి లేదేమో... ఆ పాపం తోనే చనిపోయాడు శేషగిరి.
నిజమే మరి... మానసిక వికలాంగులు దైవసమానులు... వారిని హింసిస్తే దేవుడే పగతీర్చుకుంటాడు... బలహీనులను హింసిస్తే కాలమే కాటేస్తుంది ...శేషగిరి విషయంలో ఇది సత్యమైంది....
శేషగిరి తప్పులు చేసినా గొప్పవాడే. ఎందుకంటే తాను పాపం చేశానని గ్రహించి ఆ పాప పరిహారం కోసం చివరి రోజుల్లో తపించాడు. రెండు జీవితాల్ని నిలబెట్టాడు. చేసిన తప్పులను, పాపాలను అంగీకరించడం సామాన్య విషయం కాదు. మనసులో ఏదో ఓ మూల కరుణ, పాపభీతి ఉంటేనే అది సాధ్య మౌతుంది.... నిజం చెప్పాలంటే శేషగిరి తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి...
పశ్చాత్తాపం అనే దైవలక్షణాన్ని తోడు గా చేసుకొని నింగికేగాడు శేషగిరి... మళ్ళీ జన్మ ఎత్తి మిగిలిన పాపాన్ని తొలగించుకోవడానికి సిద్దపడ్డాడు. అందుకనే శేషగిరి నిజంగా గొప్పవాడే...
***********************************************
సూర్యదేవర వేణుగోపాల్
సుందరయ్య నగర్...... మధిర
ఖమ్మం జిల్లా