చిచ్చరపిడుగు - అఖిలాశ

smart boy

ఇస్కూల్ నుండి ఇంటికొచ్చే దావలోనే బళ్ళో జరిగేవన్ని సెప్పే బిట్టు. ఈరోజెందుకో మాటాడటం లేదే ఏమైంటాదబ్బా? అని బిట్టు వాల్లమ్మ ఆలోచిస్తూ అంతలోనే సరేలే అలసిపోయుంటాడు పిల్లగాడు కదా! ఇంటికి పోయినాక ఇష్టమైన బొరుగులుంటలిస్తే వాడే తేరుకుంటాడులే అని మనసులో అనుకుని నెమ్మదించింది.

బిట్టు మూడవ క్లాసు చదువుతాండాడు, చలాకీగా ఉంటాడు, ఒకసారి సెపితే అట్టే గుర్తికి బెట్టుకుంటాడు.

బిట్టు తెలివితేటలకు పంతులమ్మలే ముక్కున ఏలేసుకుంటారు. పిల్లగాడేగానీ ప్రతిదాన్ని బాగా గమనిస్తాడు, లోతుగా ఆలోచించే గుణముండాదని సెప్పుకుంటూ ఉంటారు.

ఇంటికి పోతానే బిట్టు వాలమ్మతో “ఓమ్మో! నాయన ఎందుకని రాత్రి తూగుతూ వచ్చాండాడు?” నాయన దగ్గర ఎందుకని గబ్బు వాసన వచ్చాంది? నా దోస్తు రవిగాడు ఉండాడు కదా వాళ్ళ మామ “నాయనను మన వీధి వెనకమాల సీసాల అంగడి దగ్గర చూసినాడంట”

“బిట్టు అడిగిన ప్రశ్నలకు విస్తుపోయిన తల్లి అట్లే నిలబడిపోయింది.”

“మ్మా! ఏమైంది సెప్పు?”నువ్వు సీసాల అంగడికి వెల్లకూడదన్నావు గదా! మల్లా నాయన ఎందుకు ఎప్పుడూ అక్కడే ఉంటాడు. సీసాలు ఎందుకు ఇంటికి తెత్తన్నాడు.

“బళ్ళో దోస్తులందరూ నాతో మాట్లాడరంట”

ఎందుకు మాట్లాడరంట? బిట్టు వాలమ్మ సిన్నపాటి స్వరంతో అడిగింది.

నాయన ఆ సీసాలు తాగుతాండు కదా! అది బో సెడ్డపని అంట.. జబ్బు చేచ్చుందని అందరూ అంటన్నారు. నాయనకు జబ్బు చేచ్చే ఆ జబ్బు నాకు కూడా వచ్చాదని రవిగాడు అందరికీ సెప్పాడు. అందుకే నా పక్కన ఎవరు కూర్చోవడం లేదు.

విషయం అర్థం చేసుకున్న తల్లి లోలోపలే కుమిలిపోతూ చీరను మొకానికి అడ్డపెట్టుకొని కుమిలి కుమిలి ఏడ్చసాగింది.

అది గమనించిన బిట్టు “మ్మా... ఏమైంది? ఎందుకు ఏడుచ్చాండావు? నేనేమైనా తప్పు మాట్లాడినానా?...”

వెంటనే బిట్టును ఒళ్ళో కూర్చోబెట్టుకొని అదేం కాదులే రేపు ఇస్కూల్కి వచ్చి నేను మాట్లాడుతానులే పంతులమ్మతో అని బిట్టుకి ఇష్టమైన బొరుగులుంటలు ఇచ్చి ఆడుకోపో అన్నది.

నేను ఆడుకోడానికి పోనమ్మా “ఆడ కూడా నన్ను ఆడిపించుకోకపొతే ఎలా?” ఇంట్లోనే లెక్కలు రాసుకుంటానని బొరుగులుంటలు తీసుకొని ఒక మూలాన కూర్చొని రెండు కట్ల రెండు అని గట్టిగా పలుకుతూ పలకపై లెక్కలు రాయడం మొదలెట్టాడు.

మరుసటి రోజు బిట్టు వాలమ్మ పంతులమ్మతో జరిగిదంతా సెప్పింది.

పిల్లలు అంతేనమ్మా! ఏదైనా లోతుగా ఆలోచిస్తారు. సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉందిలే నేను పెద్దసారుతో మాట్లాడుతానులే నువ్వు బాధపడమాకు అనగానే బిట్టు వాలమ్మ మనసు సల్లచేసుకొని ఇంటికెల్లిపోయింది.

ఇది ఒకరి సమస్య మాత్రమే కాదు అందరి సమస్య కూడా ఎలాగైనా దీనికొక పరిష్కారం లభిచ్చే అంతే చాలని మనసులో అనుకున్న పంతులమ్మ వెంటనే ఇస్కూల్ పెద్దసారు దృష్టికి సమస్య తీసుకెళ్ళింది.

మరుసటి రోజు ఒకటో తరగతి నుండి పదవ తరగతి పిల్లలందరితోనూ ఎం.ఆర్.వో ఆఫీస్ దగ్గర దర్నా మొదలెట్టారు.

సీసాల దుకాణం మూసెయ్యాలి అని బిట్టు గట్టిగా కేకలేస్తున్నాడు.

ఎం.ఆర్.వో బయటికొచ్చి ఏమైంది? ఎందుకు పిల్లలందరితో ఇలా ధర్నా చేపిస్తున్నారు అని అడిగేలోపే. ముందు వరుసలోనే ఉన్న బిట్టు “మా నాయన సీసాలు తాగుతున్నాడు అంకుల్..,అవి తాగితే జబ్బు చేస్తుంది. ఆ జబ్బు మాకు కూడా వస్తుంది కదా అని ఏ మాత్రం తడబడకుండా విషయం మొత్తం సెప్పేసాడు.”

“పిట్ట కొంచం కూత ఘనం” అన్నట్టు బిట్టు అంతమందిలో కూడా అలా మాట్లాడటం అక్కడున్న పత్రికల వారి దృష్టిలో పడింది. బిట్టు సెప్పె విషయం మొత్తం రాసుకున్నారు.

ఎం.ఆర్.వోకు సమస్య అర్థమయ్యింది వెంటనే ఊళ్ళో ఉన్నా అక్రమ మద్యం దుకాణాలను మూసివేయాల్సిందిగా ఆదేశించారు.

చురుకుగా మాట్లాడిన బిట్టునుద్దేశించి “చూడండి పిల్లలు మన బిట్టు ఇంతమందిలో కూడా ఎంత చక్కగా మాట్లాడినాడో మీరు కూడా ఇలానే బిట్టులాగా ఉండాలని అభినందిస్తూ పలక, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు ఇచ్చారు.

అప్పటి నుండి బిట్టు బుర్రలో ఒక బీజం పడిపోయింది. ఏదైనా తప్పు జరిగితే అందరీ ముందర భయపడకుండా మాట్లాడాలి. అప్పుడు నన్ను అందరూ మెచ్చుకుంటారని అనుకుంటాడు. బిట్టు గురించి మరుసటి రోజు అన్ని పత్రికలలో తప్పుని ప్రశ్నించిన చిచ్చరపిడుగు అని వార్త రావడంతో వాళ్ళ నాయన తన తప్పుని తెలుసుకొని అప్పటి నుండి తాగడం మానేశాడు.

***

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు