“బడి నాలుగున్నరకే ఇడుత్తారు గదా!” రాజు ఎందుకో ప్రతిరోజూ గంట లేటు వచ్చానాడే, యాడికి పోతాన్నాడు వీడు? ఏమైనా గబ్బుపనులు చేచ్చానాడా! అని అనుమాన పడసాగింది గోవిందమ్మ.
ఏంటే గోవిందమ్మా? చెంబంత ముఖం జేసుకొని ఏందో ఆలోచించాడావే. ఏమైంది మా అన్నయ్య గొడవెట్టుకున్నాడా ఏంటి? అని పక్కింటి పార్వతమ్మ పలకరించింది.
ఆలోచనలో నుండి తేరుకున్న గోవిందమ్మ “రా..! రా..,! పార్వతమ్మా కుర్సో, ఏం కురాకు సేసావు? అని పరద్యానంగానే అడిగింది”.
సంగటి సేసాను,”ఈయనకు రోకట్లో చేసిన చెన్నిక్కాయాల చట్ని అంటేనే ఇష్టం గదా! మా రోకలి పగిలిపోయింది అందుకే ఇట్టా వచ్చాను.”
“ఏమైందే అట్టా ఉండావు?”
తల్లికి పిల్లల గురించి తప్ప వేరే యావ ఏముంటుందే! రాజు గాడి ప్రవర్తన ఒకలా అనిపించండాది. బడి నుండి గంట లేటుగా వచ్చాన్నాడు. ఎప్పుడూ దిగాలుగానే ఉంటాన్నాడు. ఏడో తరగతి పిల్లగాడు ఎగురుతూ, దుంకుతూ ఉండకుండా సద్ది మొఖమేసుకొని ఉంటాన్నాడు. వాడి ఇబ్బందేందో అర్థం కాడంల్యా అని తన దిగులుకు కారణం వెల్లబుచ్చింది.
“ఏమో తల్లీ! ఈ పిల్లగాల్లను నమ్మడానికే లేదు.” అదో ఆ ఎదురింటి ఏకాంబరం కొడుకు లేడూ ఏడో తరగతికే చెడు సవాసలతో బీడిలను గప్పు గప్పుమని పీల్చుతాండాడు.
పొట్ట కోచ్చె అక్షరం ముక్క రాదోడికి, పిల్లోలను బెదిరించి దుడ్లు తీసుకుంటున్నాడంటా! అని తనకు తెలిసిన కాస్త విషయానికి ఇంకాస్త జోడించి చెప్పింది పార్వతమ్మ.
గోవిందమ్మ మనసు ముందే బాగ లేదు. పార్వతమ్మ సెప్పిన మాటలతో కొడుకు గురించి మరింత ఆలోచించసాగింది. భర్త తాగుడుబోతు, ఏందీ పట్టించుకోడు ఈ సమస్యకు పరిష్కారం ఎలా రా దేవుడా! అని మనసులో అనుకుంది.
సాయంత్రం రాజు ఇంటికి రాగానే ఇష్టమైన బూంది గిన్నెలో వేసి ఇచ్చింది. రాజు బూంది తింటూ వరండాలో కూర్చొని ఆలోచించసాగాడు.
“ఏమైంది బంగారు ఏందో అలోచిస్తాండావు? అమ్మకు సెపితే సలహా ఇస్తుంది కదా! అని ప్రేమగా రాజు తలపై నిమిరింది గోవిందమ్మ.”
రాజు వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మా..! అమ్మా..! అంటూ ఏడవసాగాడు. గోవిందమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఎవరైనా ఏమైనా అన్నారా? సెప్పు నాయన అని అడగసాగింది.
“నా స్నేహితురాలు త్రివేణి వాల్లమ్మ చచ్చిపోతుంది అంటా? ఏందో జబ్బు చేసింది అంటా అందుకే రోజు అక్కడికి వెళ్తున్నాను అని విషయాన్ని తల్లికి సెప్పాడు .”
గోవిందమ్మ పెద్దగా సదువుకోలేదు కాని విషయాలపట్ల మంచి అవగాహనైతే ఉంది.
దీని గురించేనా నీలో నువ్వు కుళ్ళుకుంటాన్నావు? అలా ఎప్పుడూ సేయకు ఏదైనా సరే ఇంట్లో సెప్పాలి అంటూ ఇలా చెప్పసాగింది.
“సూడు రాజు నువ్వేమి చిన్నపిల్లగానివి కాదు సావు బతుకులు సహజం పుట్టినోళ్ళు ఎదో ఒక రకంగా పానాలు ఇడుస్తారు. వారి కోసం మనం ఏడిస్తే ఎలా? వారి చివరి కోరికలు తీర్చాలా! అప్పుడే వారు సుఖంగా ఈ పపంచాన్నివదిలి వెళ్ళిపోతారు. వాళ్ళు ఉన్నని రోజులు బాగా సూసుకోవాలా సరేనా!.
రేపటి నుండి నేను కూడా త్రివేణి ఇంటికొస్తా. వాళ్లకు ఏదైనా సహాయంగా ఉంటుంది. అలా ఇద్దరూ కలిసి రోజు వారింటికి వెళ్లి త్రివేణికి ధైర్యం సెప్పి వాల్లమ్మతో కాసేపు గడిపి వచ్చేవారు. అలా ఒక నెల గడిసేలోపే త్రివేణి వాల్లమ్మ పానం ఇడిసింది.
కానీ..,త్రివేణికి గోవిందమ్మ రూపంలో తల్లి దొరికింది. త్రివేణి చేసే ప్రతివిషయంపై గోవిందమ్మతో చర్చించి సలహాలు తీసుకుంటూ నడుసుకునేది. అలా రాజు, త్రివేణి మంచి స్నేహితులుగా నిలిచిపోయారు.
పిల్లలు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అవి మనకు చిన్నగానే కనిపిస్తాయి కానీ పిల్లలకు అవే పెద్ద సమస్యలు వాటిని తల్లిదండ్రులుగా తెలుసుకొని విషయాలపట్ల అవగాహన కల్పించాలి. వారి బాధలో మనం ఉంటామని పిల్లలు గ్రహించాలి. ఆ విధంగా తల్లిదండ్రులు ఉండగల్గుతేనే మంచి బాల్యాన్ని ఇచ్చిన వారౌతారు.
పిల్లలకి చాలా విషయాలపట్ల అవగాహన ఉండదు. అవసరమైన సమాచారం తప్పకుండా పిల్లలకు తెలియజేయాలి అప్పుడే వారి మానసిక ఎదుగుదల కూడా బాగుంటుంది. మనకు ఇష్టమైన వారు దూరమైతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. కానీ వారి ఆశయాల సాధన కొరకు మనం నడవాలి అనేదే ఈ కథ సారాంశం.
***