సుబ్రావ్ గుర్రం - వారణాసి భానుమూర్తి రావు

subbarao's horse

'త్వరగా కానియ్యవే ! ఆఫీసుకు టైం అయిపోతోంది. గుర్రానికి గడ్డి వెయ్యాలి'

సుబ్బా రావు వడివడిగా లుంగీ దోపుకొని మెట్లు దిగి కిందకు వెళ్ళాడు .

షెడ్డులో కట్టిన తన గుర్రం తనను చూడగానే సకిలించింది .

'' తొందరగా తిను కల్యాణి.. ఆఫీసుకు టైం అయిపోయింది '' అని దాని నోటికి పచ్చ గడ్డి, దాణా అందించాడు.

ఒక మోపెడు గడ్డిని కట్టి బాగా పాక్ చేసి , దాని జీనులో ఉన్న ఓ పెద్ద సంచి లో ఆ గడ్డిని తురిమాడు. గుర్రానికి ఈ మధ్య స్పెషల్ గా చేసిన

చలువద్దాలు, బయటకు పొయ్యేటప్పుడు అందంగా డిజైన్ చేసిన జీను కొన్నాడు.

హాల్లోకి రాగానే శ్రీమతి ' మీ టిఫిన్ రెడీ ' అంది .

వడివడిగా డ్రస్సు వేసుకొని , లంచ్ బాక్సు , ఆఫీసు ఫైళ్లు బ్రీఫ్ కేసులో కుక్కుకొని షూ వేసుకొని క్రిందకు దిగినాడు సుబ్బారావు.

కోటేశ్వర రావు గుర్రం అప్పుడే వెళ్లి పోయింది . అవును వెళ్ళకేం చేస్తాడు పాపం !. వాడిదెక్కడో ౩౦ కిలో మీటర్ల అవతల ఉద్యోగం . పటాన్ చెరువు దాటి పది కిలోమీటర్లు వెడితే వస్తుంది వాడి ఫాక్టరీ . అక్కడ వాడు అక్కౌంటంట్ ఉద్యోగం వెలగబెడుతున్నాడు .

తనది అదృష్టం . భగవంతుని దయ వలన సిటీ లోనే ఉద్యోగం దొరికింది.

తన ఇంటికి , ఆఫీసుకి ఇరవై కిమీ ఉంటుంది. ట్రాఫిక్ జాం , రద్దీ ల వాళ్ళ గంటకు పైగా పడుతుంది ఆఫీసుకి చేరుకోవడానికి. గుర్రానికి ఎడమ వైపు వున్న సంచిలో బ్రీఫ్ కేస్ పెట్టి తాళం వేసాడు . కుడి చేతి వైపున్న సంచిలో పచ్చ గడ్డి మోపు , కొన్ని గుగ్గిళ్ళు ఉన్నాయి. ఈ గుర్రాలు గూడా బాగా నేర్చు కొన్నాయి. ఈ గడ్డి దాని నోట్లో దూర్చుతూ ఉండాలి. లేదంటే నడవడం మానేస్తుంది. అప్పుడెప్పుడో వంద సంవత్సరాల క్రితం కార్లలో , స్కూటర్లల్లో పెట్రోలు పోస్తూ ఉన్నట్లు . అప్పుడన్నా అయితే దారి పొడవునా పెట్రోలు బంకు లుండేవి. ఎంత కావలసి వస్తే అంత టాంకుల నిండా పోసుకొని చక్కగా తిరిగే వారంతా. ఆ మర యంత్రాలే ఎంతో నయం, ఈ మూగ జీవాల కన్నా. రోగాలు , రొష్టులు , జబ్బులు , చావులు . అబ్బబ్బ .. ఈ గుర్రం మైంటెనెన్సు లక్షల్లో దాటి పోతోంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు . ఆలోచిస్తూ దాని మెడ దువ్వి ఎగిరి కూర్చొని , ' పద కల్యాణి .. తొందరగా .. మా బాస్ ఆఫీసుకి తొందరగా రమ్మన్నాడు . '' అంటూ అదిలించాడు తన గుర్రాన్ని సుబ్రావ్ .

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

అది 2100 సంవత్సరాల నాటి మాట.

వంద సంవత్సరాల క్రితం టివీల్లో , రేడియోల్లో , న్యూస్ పేపర్లలో , ఇతర ప్రచార మాధ్యమాల్లో ప్రభుత్వాలు మొత్తుకొనే వట. 'కన్సర్వ్ ఆయిల్ .. సేవ్ ఆయిల్ ' అని. సాంప్రదాయ ఇంధన వనరుల్ని జాగ్రత్తగా వాడు కొమ్మని చెప్పేవారట . ఆ నాటి ప్రజలు ఇంధన వనరుల్ని అతిగా వాడడం మానవ జాతి ప్రగతికి అడ్డంకిగా మారింది. క్రూడ్ ఆయిల్ నిల్వలు తరుక్కు పొయ్యాయి. గల్ఫ్ ఎడారుల్లో ఒక్క బొట్టు చమురు లేక చమురు బావులన్ని మూత బడి పొయ్యాయి. అక్కడి ప్రజలు మళ్ళి నిరు పేదలై పొయ్యారు. భారత దేశంలో దొరికే సహజ వాయు నిల్వలన్నీ తరుక్కు పొయ్యాయి. దేశంలో ఉన్న ప్రముఖ రిఫైనరీస్ అన్ని ఎప్పుడో మూత బడి పోయ్యాయి. పెట్రోలు, డీసెల్ బంకులన్ని ఆర్కియాలజీ డిపార్టుమెంటు వారి చేతిలోకి వెళ్లి పొయ్యాయి . కార్లు , స్కూటర్లు, మోటార్ వాహనాలు, బస్సులు వగైరా రోడ్లమీద కనుమరుగై పొయ్యాయి. ఒక లీటరు పెట్రోలు పది వేల రూపాయలు దాటి పోయింది. మధ్య తరగతి ప్రజలు అందుకే ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషించి మళ్లి గుర్రాల్ని, గాడిదల్ని, ఏనుగుల్ని వాడుతున్నారు. ఇంకా సౌర , వాయు విద్యుత్తు ప్రజా వినియోగంలోకి పూర్తి స్థాయిలో రావడం లేదు. వచ్చినా అవి ప్రభుత్వాల అంచనాలు మించిన ప్రాజెక్టుల అధిక వ్యయం వల్ల అందుబాటులో లేక ప్రజల వినిమయ శక్తికి భారమై పోయింది.సంప్రదాయేతర ఇంధన వనరుల మీదనే ఇక ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నిస్తేనే ఈ గండం నుండి గట్టెక్క వచ్చు. కొండలు, గుట్టలు, సముద్రాలు, నదులు , అడవులు, అరణ్యాలు, ఒక్కటేమిటి , మానవుడే స్వార్థబుద్ధితో ఇరవై ఒక్క శతాబ్దంలో ప్రకృతిని బీభత్సం చేసి వాతావరణ సమతౌల్యాన్ని దెబ్బ తీసాడు. భూ ఖనిజాల్ని , సహజ వాయువుల్ని, భూ ఉపరితల గాలిని, నీటిని కలుషితం చేసాడు. ఇరవై రెండవ శతాబ్దంలో ఉన్న ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, సహజ సిద్దమైన అడవులు , చెరువులు, నదులు ఇంకి పోయి మానవ జీవితం కడు దుర్భరంగా మారింది. ప్లాస్టిక్ వస్తు వినియోగం వల్ల సముద్ర జలాలు , అందులోని జల సంపద నాశనమై పోయింది.

సుబ్రావ్ ఆలోచిస్తూ లకిడి క పూల్ దాటి సెక్రెటేరియట్ వైపు బయలు దేరాడు. ఎక్కడ చూసినా జనమే ! కుటుంబ నియంత్రణ పథకాలు నీరు గారి పొయ్యాయి. అప్పుడెప్పుడో అరవై లక్షలున్న భాగ్యనగరం, ఈనాడు ఆరుకోట్లకు దాటింది. ఏనుగులు, గుర్రాలు, గాడిదలు ..ప్రజల తాహతుకు తగ్గట్లు ఆ జంతువుల మీద వస్తున్నారు. కొందరు సైకళ్ల మీద, మరి కొందరు పాదచారులు. జనాభా పెరుగుదలను ఆపక పొతే మన దేశం అధోగతి పాలే !

గుర్రం గట్టిగా సకిలించింది. అలా మొరాయించందంటే , ట్రాఫిక్ పొలీసు పట్టుకొన్నాడన్నమాటే !సుబ్రావ్ గుండెల్లో గుబులు పుట్టింది. పెద్ద లావు పాటి ఇనుప కొక్కి తో గుర్రం రెండు కాళ్ళు వెనక పట్టి లాగాడు. ఆ నెప్పితో గుర్రం రెండు సార్లు మూల్గింది .

సుబ్రావ్ వెను తిరిగి ' గుడ్ మార్నింగ్ సార్ !' అన్నాడు .

వెంటనే ఇన్ స్పెక్టర్ చలానా స్వాపింగ్ మెషిన్ తో ప్రత్యక్ష మయ్యాడు .

సుబ్రావ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. తను చేసిన తప్పేమిటో , ఈ రోజు చలాన్ కట్టేటట్లు తప్పడం లేదు అనుకొన్నాడు మనసులో సుబ్రావ్. గుర్రం దిగి ' నమస్కారమండీ !' అన్నాడు.

' మీ లైసెన్సు చూపించండి. ఈ గుర్రాన్ని ఎప్పుడు కొన్నారు? రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించారు? నెంబర్ క్లియర్గా కనబడ్డం లేదు. స్టాండర్డ్ అక్షరాలే ఉండాలి గదా? ''

'బాగానే ఉంది గదా సార్ ! చూడండి అని గుర్రం తోక పైకెత్తి నంబరు ప్లేట్ చూపించాడు సుబ్రావ్.

' మీరు ఇంకో తప్పు గూడా చేశారు. ఏనుగులు వెళ్ళవలసిన లైన్ లో మీరు గుర్రాన్ని నడిపిస్తున్నారు . లైన్ డిసిప్లిన్ పాటించలేదు . మీరు ఫైవ్ థౌసండ్ ఫైన్ కట్టాలి ' అని మెషిన్ పైకి తీసాడు.

'సారీ సార్ .. ఈ సారికి క్షమించండి .'

'నో ఎక్స్యూజ్ సుబ్రావ్ గారు. ఫైన్ కట్టాల్సిందే ! లేదంటే గుర్రాన్ని తీసుకెళ్ళక తప్పదు. కోర్టులో చూసుకోండి . ' అన్నాడు అతను .

సర్కస్ కంపెనీ లో జంతువులా చేసేదేమీ లేక మరు మాట్లాడకుండా ఫైన్ కట్టి , బ్రతుకు జీవుడా అంటూ ముందుకు సాగాడు సుబ్రావ్.

గుర్రం వేగంగా ముందుకు ఉరికింది ఆఫీసు వైపు.

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఆఫీసుకు చేరుకొనే సరికి గంట ఆలస్య మైంది. దారిలో ట్రాఫిక్ పోలీసు వాళ్ళ తోనే సరి పోయింది. మనసంతా దిగులుగా ఉంది. అనవసరంగా చలానా కట్టి డబ్బు పోగొట్టు కొన్నాడు.

గుర్రం దిగి దాని కళ్లెం పట్టుకొని ఆఫీసులో పార్కింగ్ ప్లేస్ కెళ్ళాడు. అప్పటికే గుర్రాలతో నిండి పోయింది. లేట్ గా రావడం వాళ్ళ తన గుర్రం కి పార్కింగ్ చోటు దొరక లేదు. బయట కట్టి వేయాల్సిందే ! ఎండలో పగలంతా మాడి పోయిందంటే , జబ్బు పడి , లక్షల్లో ఖర్చు అవుతుంది. ఇన్సూరెన్సు వున్నా లాభం లేదు. తనకి గుర్రాన్ని బయట కట్టి వెయ్యడం సుతరామూ ఇష్టం లేదు. ఏనుగుల షెడ్డు ఖాళీగా ఉంది , కానీ ఎండి , జీఎం అండ్ అబోవ్ క్యాడర్ వాళ్ళు కట్టుకొంటారు .

'సలాం సాబ్' అన్నాడు ఖాదర్. ఖాదర్ అక్కడి వాచ్ మాన్. గుర్రాల్ని చూసు కొంటూ , వాటికీ కావల్సిన మేతను గూడా పెట్టే డ్యూటి అతనిది.

' ఖాదర్ .. ఏమిటి నా గతి ? గుర్రాన్ని బయట కట్టెయ్యాల్సిందేనా ? ' అన్నాడు సుబ్రావ్ .

' మీకెందుకు పరేషాన్ సార్. నేను చూసు కొంటాను' అన్నాడు ఖాదర్. సుబ్రావ్ అతని చేతిలో వంద రూపాయలు పెట్టి ఆఫీసులోకి దూరాడు.

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

లంచ్ బ్రేక్ లో కామేశ్వరరావు వచ్చాడు .

'ఏ రా? అదోలా పేల పిండి మొహం వేసు కొన్నావు? ' అన్నాడు

' ఈ రోజు అంతా లాస్ రా!' అని జరిగిన దంతా చెప్పాడు.

' ఓస్.. అంతేనా. . అది సరే ఒక గుడ్ న్యూస్ .. మనం గుర్రాల్ని కొనుక్కోవడానికి ఇంటరెస్ట్ ఫ్రీ లోను ఇస్తారట . అలాగే గుర్రాలకి మంత్లీ మైంటెనెన్స్ అలవెన్సు మూడింతలు పెంచారు తెలుసా ? 'అన్నాడు కామేశ్వరరావు.

'ఎంతరా ? ' అన్నాడు నోరెళ్ళబెట్టి, చెవులు రిక్కించి సుబ్రావ్ .

'ఏనుగులకు యాభై వేలు, గుర్రాలకి నలభై వేలు, గాడిదలకు ఇరవై వేలు , సైకళ్లకు పది వేలు ఇస్తారంట!'

' నా బొందలా ఉంది స్కీమ్ . నా గుర్రం ఖర్చు ఎంతో తెలుసా ? లక్ష రూపాయలు దాటింది. టన్నుల కొద్దీ పచ్చ గడ్డి తింటోంది. గుగ్గిళ్ల ధరలు మండి పోతున్నాయి. దాని హాస్పిటల్ ఖర్చులు , ఇన్సూరెన్సు ' అన్నాడు సుబ్రావ్ .

' సరే లేవోయ్.. నీ ఆశకు అంతు లేదు. ' అన్నాడు కామేశ్వర రావు.

'నీకు మరో విషయం తెలుసా? మన ఎండి గారు ఆఫ్రికా నుండి రెండు స్పెషల్ జుంబోలను తెప్పిస్తున్నారంట. ఒక్కటి ఎండి గారికి, ఇంకొకటి ఈ డి గారికి. '

' వాళ్లకేం బాస్. వాళ్ళు తలచుకొంటే ఐరావతాల్ని గూడా కొంటారు. పవర్స్ అన్ని వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అది సరే గానీ, వీళ్లంతా ఏనుగుల్ని ఎందుకు కొంటున్నారు? గుర్రాల కంటే అవి స్పీడు పోలేవు గదా? 'అన్నాడు సుబ్రావ్.

' నీ తెలివి మండా .. ఏనుగులు అంటే మెల్లగా వొళ్ళు కదపకుండా రావచ్చు. పూర్వం రాజులు చక్కని అంబారీలతో ఏనుగుల్లోనే తిరిగే వారు. చక్కని ఫోమ్ బెడ్డులు వేసుకొని , లోపల ఎసి లు పెట్టుకొని , రాజ భోగాలన్నీ అమర్చుకొని ఆఫీసుకు రావచ్చు. అందుకే అన్ని మిలియన్ డాలర్లు తగల పోసి ఏనుగుల్ని కొంటున్నారు మన వాళ్ళు. గుర్రాల కంటే ఏనుగులే సేఫ్ మోడ్ ఆఫ్ కన్వేయన్సు - ఒక్క స్పీడ్ కంస్ట్రయిన్ తప్ప ' అన్నాడు కామేశ్వర రావు.

ఇద్దరు కలిసి బయటకు వెళ్లారు లంచ్ బ్రేక్ లో .

సుబ్రావ్ తన గుర్రాన్ని చూసాడు. షెడ్డు లోపల నీడలో హాయిగా కునుకు తీస్తోంది.

-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఆ సాయంత్రం ఇంటికొచ్చే సరికి ఏడన్నర దాటింది.

గుర్రాన్ని షెడ్డులో కట్టేసి , ఇంట్లో కెళ్ళి ఫ్రెషప్ అయ్యాడు .

ఇంతలో శ్రీమతి ఒక ప్లేటులో వేడి వేడి పకోడీలు , కాఫీ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టింది.

' ఏమండీ.. కోటేశ్వర రావు అన్నయ్య వాళ్ళు ఆరుగంటలకే సర్కస్ చూడ్డానికి వెళ్లి పొయ్యారు. మీరు గూడా వస్తామని చెప్పారట, చాలా సేపు మీకోసం వెయిట్ చేసి వెళ్లి పోయ్యారు వాళ్ళు.' అన్నది శ్రీమతి.

అప్పటి గాని ఆ విషయం స్ఫురించలేదు సుబ్రావ్ కి. తాను సర్కస్ కి శ్రీమతితో గూడా వస్తానని ప్రామిస్ చేసాడు. అందులోను ఈ రోజు చివరి రోజు. ఆఫీసు గొడవల్లో ఆ విషయం మరచి పొయ్యాడు తను .

'సరే .. ఇప్పుడయినా తెమలండి . సెకండ్ షో కయినా వెళ్ళవచ్చు . అందులోనూ ఇది చివరి ఆట ' అంది సుమిత్ర .

'అల్లాగే మరి. . తప్పుతుందా ? భార్యా మణి ఆజ్ఞ ' అని సుమిత్రని దగ్గరగా తీసుకొని హత్తుకొంటూ అన్నాడు.

ట్రాఫిక్ రద్దీ తక్కువగా ఉన్నందువల్ల గుర్రం హుషారుగా పరుగెడుతోంది .

'సర్కస్ కంపెనీ కి చేరుకొనే సరికి ఎనిమిది ముప్పావు అయింది. పరుగున వెళ్లి టికెట్స్ తీసుకొని, తన గుర్రాన్ని పార్కింగ్ లో కట్టడానికి వెళ్ళాడు.

పార్కింగ్ ప్లేస్ అంతా నిండిపోయింది. చివరి ఆట గాబట్టి , షో హౌస్ ఫుల్ అయిపొయింది .మళ్ళి పార్కింగ్ ఫీజు కట్టడ ఒక్క దండగ అనుకొన్న సుబ్రావ్ గుర్రాన్ని ఒక మూల కట్టి , దాని ముందర గడ్డి వేసి సర్కస్ లోపలి వెళ్ళాడు శ్రీమతితో .

సర్కస్ కరెక్టుగా తొమ్మిదు గంటలకు ప్రారంభమయింది.సర్కస్ కంపెనీ వారు ఆట మధ్యలో ఆరు బలిష్టమైన గుర్రాల్ని ప్రవేశ పెట్టారు. వాటి చేత రకరకాల విన్యాసాలను చేయిస్తున్నారు సర్కస్ వాళ్ళు. అందులో చివరిగా వచ్చిన గుర్రానికి , తన గుర్రం పంచ కల్యాణికి చాలా దగ్గర పోలికలున్నాయి.

కళ్లద్దాలు తీసి తుడుచుకొని , వళ్ళు గిల్లుకొని , మళ్ళీ తేరిపారా చూసాడు సుబ్రావ్ . నిస్సందేహంగా అది తన గుర్రమే ! తన గుర్రమెలా సర్కస్ కంపెనీ వాళ్ళ చేతిలో చిక్కిందో అర్థం గాలేదు తనకి.

చక చక మని సుమిత్రతో గూడా చెప్పకుండా , బయటికి వచ్చి , గుర్రం కట్టిన చోటికి వచ్చి చూసాడు. అక్కడ తన గుర్రం లేదు. భయంతో సుబ్రావ్ గుండెలు కొట్టుకున్నాయి. సర్కస్ లోపలి వెళ్లి , తన సీట్లోంచి లేచి నిల్చొని, ' నా గుర్రం పోయింది. మీరు నా గుర్రం దొంగలించారు. అదో.. అదే .. నా గుర్రం' అని గట్టిగా అరిచాడు సుబ్రావ్ నిప్పు తొక్కిన కోతిలా.

ఆ సర్కస్ కంపెనీ లో సుబ్రావ్ అరుపులు ఎవ్వరికి వినబడ్డం లేదు. అందరూ హుషారుగా విజిల్స్, చప్పట్లు వేస్తున్నారు. సుబ్రావ్ గట్టిగ శోష వచ్చేటట్లు అరుస్తున్నాడు. సర్కస్ వారి జంతువుల విన్యాసాలను చూసి ఉత్సాహంతో కేరింతలు పెడుతున్నాడని అనుకున్నారు అక్కడి ప్రేక్షకులంతా . కానీ సుబ్రావ్ అరుపులు అరణ్య రోదనే అయింది.

సుబ్రావ్ గుర్రం మటుకు సర్కస్ వారి దరువుకు తగ్గట్లుగా స్టెప్స్ వేస్తూ , తల ఆడిస్తోంది . చక్కగా విన్యాసాలు చేస్తూ మిగతా గుర్రాల్లో కలిసి పోయింది.

సుబ్రావ్ గుర్రం డాన్సు చేస్తూనే ఉంది . సుబ్రావ్ అరుస్తూనే ఉన్నాడు .

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు