జిప్సి - ​​​​​​​రాయపెద్ది వివేకానంద్

gypsy

"నువ్వు దెయ్యాల్ని ఎప్పుడైనా చూశావా?" రాజీవ్ గొంతు లో భయం స్పష్టంగా వినిపిస్తోంది

"చూట్టమేమిటి మాట్లాడాను, ఇదే జీపులో ప్రయాణం చేశాను" ఆగి వున్న జిప్సీ వంక చూపిస్తూ చెప్పాను

"వ్హాట్?" పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు రాజీవ్.

సమయం రాత్రి ఒంటి గంట దాటింది. చిమ్మచీకటి. ఎండు కర్రలు సేకరించి రోడ్డు వారగా నెగడు వేసుకుని కూర్చున్నాం ఇద్దరం.

*****

ఆ దట్టమైన అరణ్యంలొ పగటి పూట ప్రయాణం చేయాలంటేనే భయం అవుతుంది. అలాంటి భయంకరమైన అరణ్యంలొ జిప్సీలో పెట్రోలు అయిపోవటం వల్ల ఆగిపోయాము.

ఈ కథలో జిప్సీని కారు అని జీపు అని కూడా వ్యవహరిస్తూ వుంటాను మీరు కన్ఫ్యూజ్ అవకండి.

అది పెద్దపులుల అభయారణ్యం. అంటె అ అడవిలో పెద్ద పులుల వేట పూర్తిగా నిషేదం.

’ఛ! పెట్రోలు అయిపోయింది" జిప్సీ ని రోడ్డుకు ఒక సైడుకు తీసి ఆపుతూ నిట్టూర్చాను నేను సరిగ్గా మూడు గంటల క్రితం.

ప్రయాణానికి ముందు రోజే పెట్రోల్ ట్యాంకు ఫుల్ చేయించె భాద్యత రాజీవికి అప్పజెప్పి నేను నిశ్చింతగా వుండటం ఎంత పొరపాటు అయిందో నాకు అర్థమవుతోంది.

"నీవు పెట్రోల్ ఫుల్ ట్యాంకు పట్టించలేదా" అడిగాను ప్రక్క సీట్లో కూర్చున్న రాజీవ్ ని అడిగాను.

"ఓ సారి బాస్. నీవు నాకు నిన్ననే చెప్పావు గాని నేను ఇతర పనుల్లో పడి మరచిపోయాను" అతను నిజంగానే పశ్చాత్తాప పడుతున్నాడు.

నాకు వాడి పీక పిసికేయాలన్నంత కోపం వచ్చింది. పెట్రోలు ఇండికేటర్ పనిచేయక దాదాపు నెల రోజులు దాటింది నేను దానిని సరి చేసుంటే ఈ ఇబ్బంది వుండేది కాదు.

ఇంకో వంద కిలో మీటర్లు ప్రయాణం చేస్తే గమ్యం చేరిపోయుండే వారం.

మేమా అడవిలో చిక్కుకు పోయి దాదాపు మూడు గంటలు అవుతోంది.

రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు గంటల దాకా ఆ అడవిగుండా వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేదం.

మా వెహికల్ తర్వాత మరే వాహనం ప్రవేశించినట్టు లేదు అడవి దారిలో. ఏదురు గా వచ్చే వాహనాలు ఒకట్రెండు ఎదురయినా మమ్మల్ని చూసి కూడా ఆపలేదు, ఎందుకొచ్చిన రిస్క్ అని అనుకున్నారేమో. ఆ అడవిలొ నక్సలైట్ల భయం కూడా ఎక్కువే.

చలి కూడా బాగానే వుంది.

రోడ్డుకు అటు వైపు, ఇటూ వైపూ కూడా దట్టమైన కీకారణ్యం. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి. ఒక వైపు అడవిలో కాస్తా లోపలికి నడచుకుంటూ వెళితే లోతైన లోయ ఆ క్రిందనే భయంకరంగా ప్రవహిస్తున్న కృష్ణా నది వుందని ఇందాక చూసుకున్నప్పుడు మొబైల్ లో గూగుల్ మాప్ చెప్పింది. ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ కూడా లేవు.

వుండుండి అడవిలో నుండి పెద్దపులుల గాండ్రింపులు, ఇతర కౄరమృగాల అరుపులు వినిపిస్తున్నాయి. ఎండుటాకులపైన ఏదో జర జరమని పాకిన చప్పుడు వినిపించి మేము ఇద్దరం ఉలిక్కి పడ్డాం. చూస్తుండగానే ఒక నల్ల త్రాచు రోడ్డు వారగా పాకుతూ చెట్లలో కలిసి పొయింది.

పార్కింగ్ లైట్లు ఆన్ చేసి వుంచాము మొదట. ఆ తర్వాత కార్ బాటరీ ఖర్చు అయిపోతుంది అన్చెప్పి అది కూడా ఆర్పేశాం ఇప్పుడు.

దట్టంగా కాటుక వ్రాసినట్టు చీకటి. అలాంటి చీకటిని ఎప్పుడూ చూసి వుండలేదు నేను ఇది వరకెప్పుడు.

తెల్లవారి ట్రాఫిక్ కి అనుమతి ఇచ్చిన తర్వాత నే ఏదైనా వాహనం వస్తేనే మాకు విముక్తి అని అర్థం అయింది.

ఆ చీకట్లో మా అత్మస్థైర్యాన్ని కోల్పోకుండా, ఏ పులినోటో పడకుండా తెల్లవారే వరకు ఆ అడవిలో క్షేమంగా గడపటం మా ముందర వున్న పెద్ద ఛాలెంజ్ అని మాకు అర్థమయ్యింది.

"అయామ్ రియల్లీ సారి గురు. నేను పెట్రోల్ పట్టించుకుని వచ్చింటే ఈ ఇబ్బంది ఉండకపోను" రాజీవ్ మరొక్క సారి పశ్తాత్తాపపడ్డాడు.

అతడు పశ్తాత్తాప పడ్డా లాభం లేదు.

ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. మేము ప్రధానంగా చేయాల్సింది మా ప్రాణాల్ని కాపాడుకోవటం. అది అభయారణ్యం అయినందువల్ల ఆ సమయంలో మాపై ఏ పులో దాడి చేసినా మమ్మల్ని మేము కాపాడుకోవటానికి దాన్ని గాయపర్చటానికి సయితం వీల్లేదు. అసలా సమయంలో మేము అక్కడ వుండటమే చట్టవిరుద్దం. నా దగ్గర లైసెన్స్‍డ్ రివాల్వర్ ఉన్నా కూడా అది ఏ మాత్రం ఉపయోగం లేనట్టే లెక్క.

అది ఓపెన్ టాప్ జిప్సి జీప్ అయినందువల్ల అది మాకు కౄరమృగాల నుండి ఏమాత్రం రక్షణ కల్పించదు. మమ్మల్ని మేము కాపాడుకోవటానికి మా ముందు వున్న ఏకైక మార్గం, నెగడు ఏర్పాటు చేసుకుని, అది ఏ మాత్రం ఆరకుండా చూసుకుంటూ గడిపేయటమే.

అలా అనుకున్న తక్షణం సెల్ ఫోన్ లో టార్చి లైటు సాయంతో అటు ఇటు తిరిగి ఏండు కర్రలు, చిన్న చిన్న దుంగలు సేకరించుకుని వచ్చి, డాష్ బోర్డ్ లో వున్న ఇంజిన్ ఆయిల్ టిన్ తీసి, నెగడు రగల్చి దాని ఎదురుగా అటు ఇటు కూర్చున్నాం.

చెక్ పోస్టు దాటకముందే ధాభాలో డిన్నర్ పూర్తి చేయటం వల్ల ఆకలి బాధ లేదు ఉన్నంతలొ.

"అన్నట్టు ఈ అడవిలో కౄరమృగాలే కాక, దెయ్యాలు వుండొచ్చు అంటావా?" అడిగాడు అకస్మాత్తుగా రాజీవ్.

"నేను అతని వంక ఒక సారి తేరిపారా చూసి, ఈ అడవిలో దెయ్యాలు వున్నాయో లేదో తెలియదు నా జీవితంలో దెయ్యంతో చిత్రమైన అనుభవం ఒకటుంది." నేను సమాధానం చెప్పాను.

"ఓహ్ మై గాడ్. నీవు దెయ్యాన్ని నిజంగా చూశావా?"

"అఫ్ కోర్స్. చూట్టమే కాదు ఆ దెయ్యంతో ఇదే జిప్సీలో ప్రయాణించా, మాట్లాడాను, ఆ దెయ్యం తాలుకు ఒక పని అసంపూర్తిగా మిగిలిపోయినది చేసి పెట్టాను. అవిన్నీ ఇప్పుడు తలచుకుంటే కాస్తా భయం కలుగుతుంది"

"ఏమిటి ఈ జిప్సీ లో ప్రయాణించావా దెయ్యంతొ?" విభ్రముడై అడిగాడు రాజివ్.

"అసలు ఈ జిప్సీ ఆ దెయ్యానిదే" చావు కబురు చల్లగ చెప్పాను నేను.

"అదేంటి గురు, అలా చెపుతున్నావు? మనకేం పర్లేదు కద" రాజివ్ కంఠంలో భయం స్పష్టంగా వినిపిస్తోంది.

నేను నవ్వుతూ వుండి పోయాను

"అదేంటి గురు. నవ్వుతావు? నాకు ఇక్కడ పై ప్రాణాలు పనే పోతున్నాయి. అసలేం జరిగింది మొత్తం చెప్పు" రాజివ్ వణికి పోతున్నాడు భయంతో.

^^^^^^ ^^^^^^ ^^^^^^^ ^^^^^ ^^^^^^

ఆ రాత్రి నాకు ఇప్పటికి గుర్తే.

అప్పుడు సమయం పది దాటి వుంటుంది. నిండు పున్నమి వెన్నెల. అలాంటి రాత్రి వేళ, వెన్నెలలో, టాప్ లేని జిప్సీ ప్రయాణం నాకు చాలా ఇష్టం.

తార్రోడ్డు పై జిప్సీ సాఫీగా సాగిపోతోంది. అది కొని అప్పటికి వారం కూడా కాలేదు.

నేను యూస్డ్ కార్స్ డీలర్షిప్ నడుపుతున్నాను. సెకండ్ హేండ్ కార్లు అమ్మే ఇతర సాధారణ డీలర్ల కీ లేని చాలా ప్రత్యేకతలు మా కంపెనీకి వున్నాయి.

ఆటోమొబైల్స్ అంటే నాకున్న సహజమైన ఆసక్తివల్ల ఆటొమొబైల్ ఇంజినీరింగ్ చేసి, ఇష్టంతో ఈ రంగంలోకి వచ్చాను నేను. ఒక చిన్న షేడ్ లో ప్రారంభమయిన మా కంపెనీ అతి త్వరలోనే దేశవ్యాప్తంగా బ్రాంచీలు పెట్టి, మొబైల్ ఆప్, ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు, కొనుగోళ్ళు ఇలా ఎవ్వరూ ఊహించడానికి కూడా వీలు కాని దశలోనే మా కంపెనీలో ఈ సేవలన్నీ ప్రవేశ పెట్టాం. అంతేకాక కష్టమర్ సర్వీస్ అత్యుత్తమ స్థాయిలో వుండే విధంగా చూసుకుంటాం.

కొత్త కారు కొనే కష్టమర్ ఏ విధంగా సంతృప్తిగా , నిశ్చింతగా ఫీలవుతాడో అదే స్థాయి నిశ్చింత సెకండ హేండ్ కార్ల రంగంలో ఇచ్చే ఏకైక కంపెనీ మాది అన్న పెరు అతి త్వరలో తెచ్చుకున్నాం.

బాటాకిరువైపులా కొబ్బర్ తోటలు, అక్కడక్కడా తారస పడుతున్న చిన్నచిన్న వాగులు, పిల్ల కాలువలు, చిరు చలి చాలా అహ్లాదంగా వుంది ప్రయాణం.

నాకు కార్ లో వీలయినంత లాంగ్ డ్రైవ్ కి వెళ్ళటం చాలా ఇష్టం. నాకు వాహనాలంటె పిచ్చి. లారీలు, బస్సులు, ఇలా ఏ ఆటోమొబైల్ అయినా నాకు చాలా ఇష్టం. కార్లంటే చెప్పలేనంత పిచ్చి. కార్లంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. వృత్తి ప్రవృత్తి ఒక్కటే కావటం నా అదృష్టం.

దేశమంతటా బ్రాంచీలు ఉన్నాయి, డబ్బులకు కొదవలేదు.

వృత్తి రిత్యా కొని అమ్మే కార్లు సరే సరి . అవి కాకుండా నా సరదాకు , నా స్వంత వాడకానికి నెను కొన్న కార్లే ఓ ఇరవైముఫై వుంటాయి.

అత్యంత ఖరీదైన మెర్సిడీస్ బెంజ్, అవుడి, బీఎండబ్యూ లతో పాటు అతి సాధారణమైన మారుతి 800 కూడా వున్నాయి నా కలెక్షన్ లో.

ఈ కథకి మూల కారణం అయిన జిప్సీ కూడా అలాగే కోరి కోరి కొనుక్కున్నాను.

మారుతీ కంపెనీ వారు తమ జిప్సీ మోడల్ ని మాములు వినియోగదారులకి అమ్మటం కన్నా ఎక్కువగా రక్షణరంగానికి అమ్మడానికే ప్రాధాన్యత ఇస్తారు.

దానికి తోడు ఆర్మీ వారి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది.

తన దగ్గరకొచ్చే క్లయింట్లు చాలా మంది "ఆర్మీ వారి జిప్సీ కావాలి" అని ఆడిగి మరీ అడ్వాన్స్ ఇచ్చి వెయిట్ చేస్తూ వుండటం సహజం.

అందువల్ల నేను ఆర్మీ వారి జిప్సి కోసం ప్రత్యేక శ్రద్ధతో వెదకుతూ వుంటాను. అలాంటి అన్వేషణలో భాగంగా నాకు దొరికిందే ఈ జిప్సీ.

సాధారణంగా ఆర్మీ వారి జిప్సీలు, ఆకుపచ్చ రంగులోనో, తెల్ల రంగులోనో, బూడిద రంగులోనో లభ్యమవుతాయి. ఈ జిప్సి కలర్ కూడా ప్రత్యేకం. ఇది చెట్ల పొదల రంగులో కలిసిపోయే ఆర్మీ యూనీఫాం రంగు అయిన ఖేమూఫ్లాష్ (camouflage) రంగులో లభించింది.

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కద, అలాగా నాకు ఈ జిప్సిని చూడంగానే మొదటి చూపులోనే తీవ్రమైన ఇష్టం ఏర్పడింది.

ఆర్మీ వారు తరచు వేలం పాట పాడి పాత కార్లను, జీపుల్ని, ఇతర వాహనాల్ని అమ్మేస్తుంటారు. నా దగ్గర తెల్లరంగు జిప్సీ వున్నప్పటికీ ఈ ఖెమూఫ్లాష్ జిప్సీని కొనేశాను. అంతగా ఆకట్టుకుంది ఇది నన్ను.

అంత అద్భుతంగా మెయింటెయిన్ చేయబడ్డ సెకండ్ హేండ్ కారుని నేను అప్పటిదాకా చూసింది లెదు. దానిని కొన్నది లగాయతు, నా దగ్గర వున్న కార్లని అన్నింటిని పక్కన పెట్టేసి ప్రతి పనికి దాన్నే వాడటం మొదలు పెట్టాను. అంతగా ఆకట్టుకుంది నన్ను అది.

ఇక ఆ వెన్నెల రాత్రి జిప్సీలో ప్రయాణం చాలా కీలకమైనది.

ఒక ముఖ్యమైన వ్యాపార లావాదేవి నిమిత్తం నేను రెండు వందల కిలోమీటర్ల దూరంలో వున్న కృష్ణగిరికి వెళ్ళాల్సి వచ్చింది. మహా అంటే మూడు గంటల ప్రయాణం. తెల్లవారు ఝామున్నే బయలుదేరి, అక్కడికి వెళ్లీ పని ముగించుకుని సాయంత్రానికల్లా వెనుదిరిగి వచ్చేయవచ్చు. కానీ ఈ వెన్నెల రాత్రి ఈ లాంగ్ డ్రయివ్ , జిప్సీలో ప్రయాణం నాకు సరదా. అందుకే బయలు దేరాను ఆ రాత్రి.

తేలికగా రాత్రి ఆహారం ముగించి, చిన్న బ్యాగు తీసుకుని, సుమారు పదింటికి టాప్ లేని జిప్సీ తీసుకుని బయలుదేరాను.

మా ఇల్లు ఇంచుమించు నగర శివార్లలో వుంటుంది. శ్రీమతికి, పిల్లలకి వీడ్కోలు చెప్పి మేడ దిగి పోర్టికోలోకి వచ్చి జిప్సీ వద్దకు వచ్చాను, అవుటు హవుస్ లో వుండే డ్రయివర్ పరుగున వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని బయలుదేరబోయాడు. నేనతన్ని సున్నితంగా తిరస్కరించి, బ్యాగ్ వెనుక సీట్లో పడేసి స్టీరింగ్ ముందు కూర్చున్నాను.

మా వీధి మలుపు తిరగంగానే జాతీయ రహదారి ప్రారంభమవుతుంది.

ఆ ప్రయాణం లో డ్రైవర్ ని తిరస్కరించకుండా నాతో తీస్కు పోయివుంటే ఎలా వుండేదో అని ఎన్ని సార్లనుకున్నానో లెక్క లేదు.

వాతావరణం చాలా అహ్లాదంగా వుంది.

పిండారబోసినట్టు వెన్నెల. చల్లటిగాలులు, పల్చటి మబ్బులు. వెన్నెల వెలుగులో వెలవెల బోతున్న నక్షత్రాలు.

సెల్యూట్ చేసి గేట్లు తీశారు సెక్యూరిటి గార్డులు. గేటు తీసి ముందుకురికించాను జిప్సీని. నా వెనుకే నెమ్మదిగా మూసుకున్నాయి గేట్లు.

వీధి మలుపులో జాతీయ రహదారిని ఎక్కించేటప్పుడు చూశాను ఓ వ్యక్తిని దూరం నుంచే. అతడు ఆజానుబాహుడు. రోడ్డు ప్రక్కనే నిలబడి కార్ ఆపమని సైగ చేస్తున్నాడు.

నా జీవితంలో జరిగిన అనేకానేక వింత సంఘటనలకి ఇది నాంది అనుకోవచ్చు.

కార్ దగ్గరయ్యేకొద్ది అతని రూపం స్పష్టంగా కనిపించసాగింది. అతనో ఆర్మీ ఆఫీసర్ అని చూడంగానె అర్థం అవుతోంది.

నెమ్మదిగా ఆయన ముందు కారాపాను.

చాలా స్పష్టమైన ఉఛ్ఛారణతో, మంచి స్థాయి వున్న ఆంగ్లంలో అతడు అడిగాడు, తలను కాస్తా ముందుకు వుంచి "కృష్ణగిరి దాకా రావొచ్చా?"

ఆర్మీలో అతను చాలా పైస్థాయిలొ వున్న అధికారి అని అతని మెడల్స్, డ్రస్సు తెలుపుతున్నాయి. అతడి భాష, అతడి బాడీ లాంగేవ్జ్ , ఆతని హుందాతనం ఆతన్ని చూడగానే గౌరవ భావం కలిగించే లాగున్నాయి. ఇంగ్లీష్ భాషలో ’కమాండింగ్ ది రెస్పెక్ట్’ అన్న పదబంధం అతనికి సరిగ్గ సరిపోతుంది.

అతని అభ్యర్థనని తిరస్కరించటానికి నాకేం కారణం కనిపించలెదు.

చిరునవ్వుతో తల పంకిస్తూ, కాస్తా నా ఎడమ వైపుకి వంగుతూ తలుపు తీశాను. ’కృతఙ్జతలు’ చెబుతూ కారెక్కి నా పక్కసీట్లో కూర్చున్నాడు.

కారు బయలుదేరింది. జాతీయ రహదారి మీద వేగంగా పరుగులు తీయటం మొదలుపెట్టింది.

ఎనిమిది వరుసల జాతీయ రహదారి చాలా విశాలంగా వుంది. ఇంత హాయి అయిన రహదారి పైన ప్రయాణం ఇంకో పది కిలోమీటర్లే. ఆపై ఎడమ వైపుకు మలుపు తీసుకుని సింగిల్ రోడ్డు మీద ప్రయాణం ప్రారంభం ఆవుతుంది. ఆ తరువాత కృష్ణగిరి వరకు ఇలా సింగిల్ రోడ్డు మీదనే ప్రయాణం.

లిఫ్ట్ అడిగేటప్పుడు ఎవరైనా ’మీరే ఊరికి వెళుతున్నారనో’ లేదా ’నేను ఫలానా ఊరికి వెళుతున్నాను. మీరు అటు వేపుగానీ వెళుతున్నారా’ అని గాని అడగటం కద్దు.

కానీ ఈ ఆర్మీ ఆఫీసర్ నా ప్రయాణం కృష్ణగిరికే అని ముందరే తెలిసినట్టు ప్రవర్తించడం నాకు కాస్తా ఆశ్చర్యం కలిగించింది.

జాతీయ రహదారి పై వాహనాల రద్దీ విపరీతంగా వుంది. లాఘవంగా జిప్సీ నడుపుతూ కూడా పరిచయం చేసుకున్నాను నన్ను నేను.

ఆయన కూడా తన పరిచయం చేసుకున్నాడు. ఆయన పేరు కల్నల్ శ్రీధర్ అని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ సరిహద్దులో విధి నిర్వాహణలు నిర్వహిస్తున్నాడని చెప్పారు.

ట్రాఫిక్ రద్దీ కారణంగా నేను ఆయనతో కరచాలనం చేయలేకపోయాను. ఒక వేళ షేక్ హాండ్ ఇచ్చే ప్రయత్నం చేసుంటే ఆయన మనిషీ కాదు ఆత్మ అని ఆరోజే తెలుసుకొనగలిగి వుండే వాడిని.

చాలా అత్యవసరమైన వ్యక్తిగతమైన పనుల వల్ల ప్రస్తుతం ఇక్కడికి రావాల్సించ్చిందట. అంత మాత్రమే చెప్పుకొచ్చారాయన. ’వ్యక్తిగతమైన పనులు అని ఆయన అనటం వల్ల నేను కూడ "ఏ పని మీద వచ్చారు?" అని అడగలేదు నేను రెట్టించి.

మా మధ్య సంభాషణ చాలా మటుకు ఆంగ్లంలో సాగిపోతోంది.

కృష్ణగిరి కి వెళ్ళే సూచిక కనపడుతోంది ఆకు పచ్చ రంగు బోర్డు పై తెల్లటి రేడియం అక్షరాలతో.

ఏడమ వైపు చివరి లేన్లోకి క్రమంగా బండిని మళ్ళిస్తూ ఒక దగ్గర నెమ్మది చేసి, ఇండికేటర్ వేస్తూ ఎడమవైపుకు మలుపు తిప్పి సింగిల్ లేన్ రోడ్డు పై పరుగులు పెట్టించటం మొదలెట్టాను.

"నాకీ కార్ చాలా ఇష్టం. మీరు చాలా జాగ్రత్తగా హేండిల్ చేస్తున్నారు. అయాం హేపీ" ఎదో తన కారుని నేను నడుపుతున్నట్టు అభినందించారు.

అర్థం కానట్టు చూశాను.

"అదే జిప్సీ అంటే నాకు ఇష్టం" తిరిగి ఆయనే చెప్పారు.

ఆయన చాలా మాటకారి. చమత్కారంగా మాట్లాడుతు ఎదుటివారిని ఆకట్టుకునేలా మాట్లాడటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని నాకు అర్థమయిపోయింది.

చాలా విషయాలలో మా అభిరుచులు కలుస్తున్నాయి. ముఖ్యంగా కార్ల సేకరణ, లేటేస్ట్ కార్ల గురించి విషయ సేకరణ, లాంగ్ డ్రయివ్స్, కార్ రేసింగ్స్, సాహసోపేతమైన ఏడారి కార్ ర్యాలీలు, మౌంటేన్ టెర్రేన్ కార్ ర్యాలీలు ఇలా చాలా అంశాలలో మా ఇద్దరి అభిరుచులు కలుస్తున్నాయి. నాకిష్టమయిన చాలా మంది ఛాంపియన్స్ ఆయనకు కూడా ఇష్టం.

ఈ అభిరుచుల కారణంగా మేం చాలా తక్కువ సమయంలో మేం చాలా కాలం నుంచి పరిచయం వున్న వారిలా మారిపోయాం.

నేను ఒకటి గమనించాను. ఆయన నీలిరంగు కళ్ళు చాలా ఆకర్షణీయంగా వున్నాయి. నన్ను ఆశ్చర్య పరిచిన అంశం ఏమిటంటె నేను చూస్తుండగా ఆయన్ కను రెప్పలు ఆడించలేదు ఒక్కసారి కూడా. మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిని కను రెప్ప వేయకుండా తదేకంగా చూస్తూ మాట్లాడుతున్నారు ఆయన్.

బహుశా ఆర్మీ శిక్షణ వల్ల అలవడిందనుకుంటా ఆ అలవాటు.

ఆయన సాంగత్యం లో ఒక విధమైన్ ప్రశాంతతని అనుభవిస్తోంది నా మనస్సు. శరీరం కూడా అసలు అలసట అన్నది ఎరుగని ఒక విధమైన విశ్రాంతి ని అనుభవిస్తోంది.

అప్పుడప్పుడూ ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాము, లేదంటే మౌనంగా తదేక దీక్షతో డ్రైవ్ చేస్తున్నాను. నా మనసు ఎన్నడు ఎరుగని ఒక విధమైన ధ్యాన స్థితిని అనుభవిస్తోంది. ఇదో కొత్త అనుభూతి నాకు.

ప్రయాణం సాఫీగా సాగిపోతోంది.

ఎదురుగా ఓ పెద్ద కొండ అడ్డుగా వస్తుంది మా దారికి. ఇది వరకు ఆ కొండను చుట్టుకుంటూ వెళ్ళాల్సిన విధంగా వుండేది దారి. కానీ ఇటీవలే ఆ కొండ పై ఘాట్ రోడ్డు వేశారు, ఇదొక ఆకర్షణ ఈ ప్రయాణంలో.

ఇప్పటికీ పాత రోడ్డును కూడా వాడుతుంటారు కొంత మంది. కానీ ఆ దారిలో ఒక పది కిలోమీటర్ల ప్రయాణదూరం ఎక్కువ వుంటుంది.

“మనం ఈ ఘాట్ రోడ్డులో కాకుండా మాములు రహదారిలో వేళదాం" ఆయన తీర్పు చెట్టినట్టు ప్రకటించారు.

వేగాన్ని కాస్తా తగ్గించి ఆయన వంక అయోమయంగా చూశాను.

"మీరు సరిగ్గానే విన్నారు. ఘాట్ రోడ్డుపై కాకుండా చుట్టూ తిరిగినా సరే పాత దారిలోనే వెళదాం"ఆయన నా వైపు చూడకుండా రోడ్డు వైపు తదేక దీక్షతో చూస్తూ చెప్పారు.

ఘాట్ రోడ్డుపై ప్రయాణం బాగుంటుంది. ఎందుకీ పెద్దమనిషి వద్దంటున్నాడు. నాకు చిరాకేసింది.

"ఎందుకలా?" చిరాకుని వీలయినంత అణచుకుంటూ అడిగాను ఆయనని.

"ఘాట్ రోడ్డు పై తొమ్మిదో నెంబరు మలుపులో కొండ చరియలు విరిగి పడబోతున్నాయి. ఈ కారుకి చిన్న గీత పడినా నేను భరించలేను" అంతే స్థిరంగా చెప్పారాయన.

"ఏమిటి కొండ చరియలు విరిగి పడ్డాయా? పడబోతున్నాయా? మీరు సరిగ్గానే మాట్లాడుతున్నారా?" కోపాన్ని అణచుకుంటూ అడిగాను

ఆయన చెప్పిన తొమ్మిదో మలుపు చేరుకోవటానికి ఇంకా అరగంట ప్రయాణం వుంది.

నా ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. మౌనం వహించాడు.

అప్పుడు సమయం రాత్రి పదిన్నర అయ్యుంటుంది.

రోడ్ జంక్షన్ రానే వచ్చింది. నేరుగా వెడితే ఘాట్ రోడ్డు, కుడి వైపు మలుపు తిరిగితే పాత రోడ్డు. ఆయన నన్నే చూస్తున్నట్టు అనిపించింది. అసంకల్పితంగా నేను కుడి వయిపుకి మలుపు తిప్పాను.

ఆ తర్వాత ఇద్దరం పెద్దగా మాట్లాడుకోలేదు. కృష్ణగిరి చేరుకునేటప్పటికి రాత్రి దాదాపు పన్నెండున్నర అయింది.

"నా మాట పై గౌరవం పెట్టి ఘాట్ రోడ్డుపై రానందుకు ధాంక్స్. కారు ఇక్కడ ఆపేయ్యండి" ఇంకా ఊరు రాక ముందే శివార్లలో దిగిపోయారు ఆయన. అక్కడ చెప్పుకోదగ్గ పెద్ద భవనాలు ఏవీ లేవు. ఇంచుమించు నిర్మానుష్యమైన ప్రదేశం అది.

దూరంగా ఎక్కడో నక్కలు ఊళలు పెడుతున్నాయి. చలి గాలి శరీరాల్ని వణీకిస్తోంది.

"ఆయన స్థిరమైన చూపుతో నా వంక సూటిగా చుస్తూ అగర్వాల్ బ్రదర్స్ మిమ్మల్ని కలువలేరు. మీ ప్రయాణం వృధా అని నాకనిపిస్తోంది" అని అన్నారు కారు దిగి.

ఈ మనిషి కి ఏమన్నా పిచ్చా? శుభం పలకరా పెళ్ళికోడుకా అంటే ఏదో అన్నాడట. అలా వుంది ఈయన వ్యవహారం.

నాకు చాలా చిరాకేసింది. అగర్వాల్ బ్రదర్స్ తొ చాలా ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ సంతకం చేయబోతున్నాను. వారు డబ్బు కూడా సిద్దం చేసుకుని వున్నారు. వారం క్రితమే మా అపాయింట్‍మెంట్ ఫిక్స్ అయింది. తీరా బయలుదేరేముందు కూడా రాత్రి ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాకే బయలుదేరాను. కాబట్టి అగర్వాల్ బ్రదర్స్ ని నేను కలవలేకపోవటం అన్నది అసాధ్యం.

ఈ పెద్దమనిషికి కాస్తా పిచ్చి అనుకుంటాను.

ఒక చిరునవ్వు నవ్వి కారు బయలుదేరదీశాను. అంతా ఓ యాభై అడుగుల దూరం వెళ్ళగానే నాకు ఆప్పుడు తోచింది, అసలు నేను కృష్ణగిరికి వస్తున్నట్టు, అగర్వాల్ బ్రదర్స్ ని కలవబోతున్నట్టు ఈ పెద్దమనిషికి ఎలా తెలుసు? అసలు ఎవరు ఇతడు?

ఆ ఆలోచన వచ్చిన తక్షణం సడన్ బ్రేకు వేశాను. కీచు మని చప్పుడు చేస్తూ కారు ఆగింది. నేను కారు దిగి అతన్ని దింపిన ప్రదేశం వంక చూశాను. అక్కడ ఎవరూ లేరు ఆ చుట్టుప్రక్కల ఎక్కడా కూడా అతను కనిపించలేదు. అక్కడ ఏవిధమైన గల్లీలు, మలుపులు ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళాడబ్బా?

నాకు వెన్నులో కాస్తా చలిపుట్టింది.

"ఈ కారుకి ఏమన్నా అయితే నాకు కోపం వస్తుంది అని చెప్పానా? ఇలా సడన్ బ్రేకులు వేయకండి" చాలా స్పష్టమైన కంఠంతో నా ప్రక్కనే నిలబడి వున్నాడు కల్నల్ శ్రీధర్. నేను ఉలిక్కి పడ్డాను.

నా ఆ అయోమయం పతాక స్థాయికి చేరుకుంది.

"ఎనీ హౌ గుడ్ నైట్" అని చెప్పేసి క్షణమ్ ఆలశ్యం చేయకుండా వేగంగా చీకట్లో కలిసి పోయాడు.

నా గుండె చప్పుడు నాకే స్పష్టంగా వినిపిస్తోంది.

ముందే బుక్ చేసుకున్న గెస్ట్ హవుసి కి వెళ్ళిపోయాను. ఇతర ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్ర పోయాను ఆ రాత్రి.

******

ఉదయం నిద్ర లేవంగానే నాకు షాకుల మీద షాకులు.

ఎంత ఆలశ్యంగా పడుకున్నా కూడా ఉదయం అయిందింటికి నిద్ర లేచే అలవాటు వుంది నాకు. ఉదయాన్నే కాసిన్ని గోరువెచ్చని నీళ్ళు త్రాగి వాకింగ్ , యోగా ముగించుకుని బాల్కనీ లో విశ్రాంతిగా టీ త్రాగటానికి కూర్చున్నాను.

ఎదురుగా టీ పాయ్ పై ఆవేళ్టి వార్తా పత్రికలు పెట్టి వెళ్ళాడు రూం సర్వీస్ బాయ్.

రూం లోని టీవి కిటికీలోంచి కనిపిస్తోంది. టీవి వాల్యూం పెద్దగానే వుంది. చాగంటి కోటేశ్వర రావు గారి ఆధ్యాత్మిక ప్రవచనాల తర్వాత వార్తా ప్రసారం ప్రారంభం అయ్యింది.

ఘాట్ రోడ్డుపై క్రితం రాత్రి సరిగ్గా కల్నల్ శ్రీధర్ చెప్పిన సమయానికి కొండ చరియలు విరిగి పడ్డాయట. అదృష్ట వశాత్తు ఆ సమయం లో వాహనాలు ఏవి లేకపోవటం వల్ల పెద్ద ప్రమాదం తప్పి పోయిందని చెబుతున్నారు.

ప్రతిపక్షాలు ఆ కాంట్రాక్టర్ కి అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలు వున్నాయని, రహదారుల శాఖామాత్యుడు తక్షణం రాజినామా చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.

రిమోట్ తో టీవీ కట్టేశాను.

అంటే అరగంట ముందరే ఆ విషయం నాకు చెప్పి నా ప్రాణాలు కాపాడాడన్న మాట ఆ శ్రీధర్. అసలు అతడికి ఎలా తెల్సు ఆ కొండ చరియలు విరిగి పడే విషయం? ఇందులో ఏదన్నా కుట్ర వుందా? ఆ కుట్ర చేసిన మనుషులు ఈయన్ గ్యాంగ్ లోని వారా? నాకు ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి.

ఇంతలో నా ఫోన్ మ్రోగింది. స్క్రీన్ పై అగర్వాల్ ప్రొఫైల్ పిక్ నవ్వుతూ కనిపిస్తోంది. కానీ అతను చెప్పిన విషయం విని నా నవ్వు మాయం అయింది.

క్రితం రాత్రే ఆయన పెద్ద అన్నయ్య కి హఠాత్తుగా గుండె పోటు రావటంతో హుటాహుటిన నగరానికి తీసుకు వెళ్ళారట. అప్పటికి అర్థరాత్రి దాటి వుండటం తొ ఫోన్ చేసి చెప్పలెదు, ’మీరు ఇంకా బయలుదేరకుండా వుండుంటే తక్షణం ఆగి పొండి, మరలా ఎప్పుడు కలుద్దాం అన్న విషయం మళ్ళీ ఫోన్ చేసి చెబుతాన” అని అంటున్నాడు అటు నుండి అగర్వాల్.

నాకు ఒక లాంటి జలదరింపు కలిగింది. అది భయమా.. భయం కాదేమో. మానావాతీత శక్తులు, మన ఊహకు అందని పరిణామాలు మన జీవితంలోనే జరిగితే కలిగే లాంటి ఉద్విగ్నత అది.

ఏదో పారానార్మల్ ఆక్టివిటీస్ సినిమాల్లో జరిగితే చూసి థ్రిల్ ఫీలవ్వటానికి బాగుంటాయి కానీ సాక్షాత్తు మన జీవితాల్లొ జరిగితే భరించలేము అనిపించింది.

కల్నల్ శ్రీధర గురించి నాకు మూడు విషయాలు పజిల్ గా మిగిలి పోయాయి.

ఒకటి. నేను కృష్ణగిరికే వెళుతున్నాని తెలిసినట్టు ఎలా ప్రవర్తించగలిగాడు? అప్పటికి నేను కృష్ణగిరి డైవర్షన్ తీసుకోలేదు. ఇంకా కరెక్టుగా చెప్పాలి అంటే నేను అప్పటికి ఇంకా హైవేనే ఎక్కలేదు. నేను సిటిలోనికి కూడా వెళ్ళే అవకాశం వుంది కద. మామూలుగా అయితే నా గమ్యం ఎవరికీ తెలిసే అవకాశం కూడా లేదు.

రెండు. అరగంట ముందరే విరిగి పడబోయే కొండ చరియల విషయం అతడు ఎలా చెప్పగలిగాడు?

మూడు. పక్కాగా ముందరే ఫిక్స్ అయి వున్న నా బిజినెస్ మీటింగ్ కాన్సెల్ అవుతుందని ఎలా చెప్పగలిగాడు. అతను అలా చెప్పిన సమయానికి అగర్వాల్ అన్నయ్యకి ఇంకా గుండె పోటు రాలేదు.

నాకయితే అంతా అయోమయంగా వుంది. చేసేదేం లేక నేను నగరానికి తిరిగి వచ్చేశాను.

నా దినచర్య అంతా యధావిధిగా ఎటువంటి వింత సంఘటనలు లేకుండా గడిచిపోతు వుంది.

కానీ అంతా మాములుగా జరిగితే ఈ కథే లేదు.

ఎనిమిది లేన్లు వున్న అవుటర్ రింగ్ రోడ్డు అంటే నాకు చాలా ఇష్టం. ఒక రాత్రి బిజినెస్ డీలింగ్ ముగించుకుని ఇంటి దారి పట్టాను. అవుటర్ రింగు రోడ్డు మీద సాఫీగా సాగి పోతోంది జిప్సీ. వేగం దాదాపు నూటా ఇరవై- నూటా ముఫై మధ్య నడుపుతున్నాను. కార్లో నాతో ఎవరూ లేరు.

ఎందుకో తెలియదు నా చూపు వుండుండి నా ప్రక్క సీటు పై పడుతోంది. మసక వెన్నెల, చిరు చలి. వాతావరణం అదోలా వుంది. ఏదో ఇంగ్లీష్ బుక్ లో చదివాను దెయ్యాలకి చలి వాతావరణం అంటే ఇష్టమట. ఏదో తెలియని ఇబ్బంది నా మనసులో కలుగుతోంది.

తదేక దీక్షతో రోడ్డు వంక చూస్తూ నడుపుతున్న నేను కను చివర్ల నుండి గమనించాను పక్క సీట్లో ఎవరో కూర్చొని వున్నట్టు. అప్పుడు తల తిప్పిచూశాను. అతను నా ప్రక్కన సీట్లో కూర్చుని వున్నాడు. స్పష్టాతి స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఇది నా భ్రమ కానేకాదు.

అతడు కల్నల్ శ్రీధర్. క్షణం క్రితం లేడు. వందకిలోమీటర్లకు పైగా వేగంతో వెళుతున్న వాహనంలోకి ఎలా రాగలిగాడు?

’కీచు’ మని చప్పుడుతో ఆగిపోయింది కారు., నేను సడన్ గా బ్రేక్స్ వేయటం వల్ల.

"హఠాత్తుగా బ్రేక్స్ వేయకండి అని ఇదివరకు కూడా మీకు ఒక సారి చెప్పాను. నాకు ఈ కారంటే ప్రాణం. దీనికి చిన్న గీత పడినా కూడా నేను సహించలేను" స్థిరంగా చెప్పాడు కల్నల్ శ్రీధర్.

అతని స్థిరత్వం చూసి నాకు చిర్రెత్తుకు వచ్చింది.

నేను సభ్యత సంస్కారాలు కూడా పాఠించకుండా "ఇడియట్. ఇది నా కారు నా ఇష్టం. మధ్యలో నీ బోడి ఇష్టా అయిష్టాలు ఎవడిక్కావాలి. అసలు కదిలే కార్లో కి ఎలా రాగలిగావు? పిచ్చి పిచ్చిగా వుందా?" అని గట్టిగా కేకేశాను.

"ఓ అయాం సారి. మీరు చాలా కోపంలో వున్నట్టున్నారు.మరో సారి కలుద్దాం" అంటూ అతడు నా కళ్ళముందరే అదృశ్యం అయ్యాడు.

పల్చటి మంచు తెర లాగా క్రమక్రమంగా పలచబడి క్షీణించిపోతూ శూన్యంలోకి కల్సి పోయాడు. ఆ తరువాత అక్కడ అతని ఆనవాలే కనపడలేదు.

అప్పుడరిచాను నేను "దెయ్యం....దెయ్యం" అంటూ దిక్కులు పిక్కటిల్లి పోయేలాగా. నెను అంత గట్టిగా అరవగలనని నాకే తెలియదు.

ఛాతీలో ఎడమవైపున మొదలయిన నొప్పి క్రమంగా తీవ్రమయింది క్షణాలలో. నాకు అసలు గుండె సమస్య లేదు అప్పటిదాకా.

నా కేకలు అరణ్యరోదనే అయ్యాయి నిర్మానుష్యమైన అవుటర్ రింగు రోడ్డుపైన.

క్రమంగా ముందుకు వాలి స్టీరింగ్ వీల్ పై వాలిపోయాను. నా వత్తిడికి హారన్ మ్రోగటం ప్రారంభించింది. ఆ హారన్ చప్పుడు వినిపిస్తుండగా క్రమంగా స్పృహ కోల్ఫోయాను.

అదే నా చివరి ఙ్జ్యాపకం స్పృహకోల్ఫొయే ముందు.

*** ***** *****

కళ్ళు తెరిచి చూసేటప్పటికి అర్థమయింది నేను ఆసుపత్రిలో వున్నానని.

రెండు పూర్తి రోజులు స్పృహలో లేనట ఆసుపత్రి లో.

హైవే పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారట.

నాకు మెలకువ రావటంతో ప్రక్కనే కూర్చుని వున్న శ్రీమతి రిలీఫ్ గా నిట్టూర్చింది. ’నా అరచేయి మీద చేయి వేసి తన స్పర్శ ద్వారా నాకు భరోసా ఇచ్చింది.

తర్వాత బజ్జర్ ప్రెస్ చేసి, నర్సింగ్ స్టాఫ్ ని, డాక్టర్స్ ని పిలిపించింది.

ఆ తర్వాత సంభాషణలో ’ఏమి జరిగింది’ అని డాక్టర్లు అడిగిన ప్రశ్నకి నా సమాధానాలు విని వాళ్ళు నమ్మలేదు నా మాటల్ని. నన్నో వెర్రివాడిగ చూశారు. శ్రీమతి నా వంక జాలిగా చూస్తోంది.

ఏదో షాక్ కి గురి అవటం వల్ల నేను అలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నానని వారు భావించారు.

వారం రోజుల చికిత్స అనంతరం ఇంటికి పంపించారు.

నేను చెప్పిన సంగతి నమ్మినా నమ్మక పోయినా నా శ్రీమతి ఆ కారుని ఆమ్మేయమని గోల ప్రారంభించింది.

ఇదిలా వుండగా ఇంకో సంఘటన జరిగింది.

అది నిండు పౌర్ణమి రాత్రి. సమయం పది అయి వుంటుంది.

బెడ్ రూంలో పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్నాను. శ్రీమతి వంట గదిలో ఏదో పని చేసుకుంటూ వుంది.

ఏసీ చల్లదనంతో గదిలో వాతావరణం హాయిగా వుంది. బుక్స్ చదువుకుంటూ గడపటంలో వున్న ఆనందం నాకు కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లు, టీవీలలో లభించదు. నాకు బుక్స్ చదవటం చాలా ఇష్టం.

బుక్ చదువుతున్న వాడినల్లా అసంకల్పితంగా ఒక సారి బయటకు చూశాను.

గది కిటికోలోంచి బయటి వెన్నెల చక్కగా కనిపిస్తోంది. మా కాంపౌండ్ లో వున్న పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు, మామిడిచెట్లు వెన్నెల్లొ మెరిసిపోతూ చూడటానికి చాలా అందంగా వుంది వాతా వరణం.

లాన్, పచ్చటి పచ్చిక, ఫౌంటెన్స్, వరుసగా పార్క్ చేయబడి వున్న నాకార్లు, ఇవన్నీ కాదు నా దృష్టిని ఆకట్టుకుంది.

కల్నల్ శ్రీధర్ కనిపించాడు మా కాంపౌండ్ లో. జిప్సీ లో కూర్చుని వున్నాడు చిరునవ్వులు చిందిస్తూ. స్టీరింగ్ వీలు పట్టుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుని కనిపించాడు. అతడు కూడా నా వంకే చూస్తున్నాడు.

నన్ను ’రమ్మ’న్నట్టుగా తల కదిలించాడు.

చిత్రంగా నాకు భయం వేయలేదు ఈ సారి.

ఈ వ్యవహారం ఏమిటో తేల్చేసుకుందాం అని నాకు అనిపించింది. బుక్ పక్కన్ పెట్టేసి, మేడ దిగి మెయిన్ డోర్ తిస్కుని బయటకు వచ్చాను.

’ప్రాడో’ ఒక సారి గట్టిగా కేకేశాను. గేట్ దగ్గరనుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది మా జర్మన్ షెపర్డ్ కుక్క. చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగ వుంది. అది నన్ను చూసి చూడంగానె రెండు కాళ్ళనీ నా భుజాలపై వేస్తూ ఆనందం వ్యక్తం చేసింది.

నేను ఆ సమయంలో తలుపు తీసుకుని బయటకు రావటంతో, సెక్యూరిటి గార్డ్ కూడా నా వద్దకు వచ్చి ’సెల్యూట్’ చేసి వినయంగా నిలబడ్డాడు.

నా వెంబడి రమ్మని సైగ చేసి నిశ్శబ్దంగా మేడ వెనుక వైపు కి కదిలాను. నాతో పాటు ప్రాడో కూడా ఉత్సాహంగా బయలుదేరింది. టార్చ్ తీసుకుని సెక్యూరిటీ కూడా నాతొ కదిలాడు.

వెన్నెల కాంతి పల్చగా పరచుకుని వుంది. దూరంగా ఎక్కడి నుంచో మైకులో ఏవో హిందీ సినిమా పాటలు వినిపిస్తున్నాయి.

మేము అక్కడికి చేరుకునే సరికి అతను స్టీరింగ్ ముందరనుండి దిగి జిప్సీ ప్రక్కన్ నిలబడి వున్నాడు. అవే దుస్తులు వేసుకుని వున్నాడాయన. ఏమీ మార్పులేదు ఆయన గెటప్ లో.

"శ్రీధర్ గారు మీకు ఇది భావ్యమా? ఇలా చెప్పాపెట్టకుండా ఇలా ఇండ్లలోకి జొరబడవచ్చునా? అసలు మీరెవరు,మీకేమి కావాలి?" అని ఆయనని సూటిగా ప్రశ్నించాను.

’సాబ్! ఆప్ కిస్ సే బాత్ కర్ రహే( హై?’ అని కంగారు పడుతున్నాడు సెక్యూరిటీ గార్డ్.

నేను సెక్యూరిటి వంక ఆశ్చర్యంగా చూస్తూ ’నా ఎదురుగా చెట్టంత మనిషి వుంటే ఎవరితో మాట్లాడుతున్నాను అంటావేమిటి?’ అని చిరాగ్గ చూశాను

"నేను మీకు తప్ప ఎవ్వరికీ కనపడను" నెమ్మదిగా చెప్పాడు కల్నల్ శ్రీధర్.

నేను ప్రాడో వంక చూశాను. కొత్త మనిషి కనిపించినప్పుడు సాధారణంగా చాలా దారుణంగా అరుస్తుంది అది. అలాంటిది అది ఏమి అరవకుండా ఆయన వంక నిశ్శబ్దంగా చూస్తోంది. మొదట కాస్తా అరిచింది, ఆ తరువాత అది మంత్రముగ్ధలా అతన్నే చూస్తు నిలుచుంది.

శ్రీధరే తిరిగి చెప్పటం ప్రారంభించారు.

"భయపడకండి. నేను మీకు ఏ హానీ చేయను. నేను మీకు హాని చేయటానికి రాలేదు. ఇప్పటి దాకా నేను మీకు ఏదీ అబద్దం చెప్పలేదు. కాకపోతే నేను మీకు ఒక నిజం చెప్పలేదు. అదే నా మరణం గురించి. అది మీరు నిన్ననే గూగుల్ చూసి నిర్ధారించుకున్నారు.అవును నేను చనిపోయాను. ఈ నిజం నాకే ఇంకా సరిగ్గా జీర్ణం కాలేదు.

సరిగ్గా సంవత్సరం క్రితం జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులతో జరిగిన ఒక పోరులో నేను చనిపోయాను. ఉగ్రవాదులు స్థానిక ప్రజలను హ్యూమన్ షీల్డ్ గా పెట్టుకుని మమ్మల్ని దొంగ దెబ్బతీసి చంపేశారు. చనిపోయిన తక్షణం నాకు అంతా తెలుస్తూనే వుంది. నాకు అందరూ కనిపిసూనే ఉన్నారు. కానీ నేనే ఎవ్వరికీ కనిపించటం లేదు. మరి దెయ్యాన్నా? కాదు. మరి నన్నేమనాలి? ఆత్మనా? కాదేమో?

సాధారణంగా కుక్కలకి ఘ్రాణ శక్తి, అతీంద్రియ శక్తులు వుంటాయి. వాటికి నేను కనిపిస్తున్నాను కానీ నన్ను చూసి భయంకరంగా మొరగటం చేయటం లేదు. అవి నన్ను సాధు ఆత్మగా గుర్తించి వుంటాయనుకుంటాను.

ఒకటి మాత్రం నిజం ప్రాణాలతో వున్నపుడు ఎలా అలోచించగలిగే వాడినో, అలా నిరంతరం నాలో చైతన్య స్రవంతిలాగా ఆలోచనలు ఝరిలా కొనసాగుతూనే వున్నాయి.

అంటే నేను శరీరం లేని ఆలోచనల ఝరినన్నమాట. నా ఊహ పారిన చోటికి నేను తక్షణం వెళ్ళి ఆయా ప్రదేశాలు చూడగలుగుతున్నాను. నా స్వగ్రామం ఒరిస్సా లో వుంది. అక్కడికి వెళ్ళగలుగుతున్నాను, నా భార్యా బిడ్డల్ని చూడగలుగుతున్నాను. నాకిష్టమైన ఈ జిప్సీని ఆర్మీ వారు సెకండ్స్ డీలర్లకు వేలం వేసే దగ్గరికి వెళ్ళగలిగాను. ఆ వేలం పాట తతంగాన్నీ యావత్తూ చూడగలిగాను. మీరు జిప్సీ కొనటం చూశాను.

ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే ఇన్ని రోజులుగా నెనెంత ప్రయత్నం చేసినా ఎవరూ నన్ను చూడ లేకపోయారు. నేను మాట్లాడుతూనే వున్నాను,నా మాటలు ఎవ్వరికీ వినపడలేదు.

కానీ అదృష్టవశాత్తు మీరు నన్ను చూడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు. ఇంకో చిత్రమైన విషయం ఏమిటంటే మీరు కూడా నేను ఈ జిప్సీకి కేవలం పదడుగుల దూరంలో వుంటేనే చూడగలుగుతున్నారు. అది కూడా పున్నమి రాత్రులలోనే చూడగలుగుతున్నారు.

హేతువాదులకు, నాస్తికులకు ఈ విషయాలు చెప్పినా నమ్మలేరు. ’ట్రూత్ ఈస్ స్ట్రేంజర్ దేన్ ఫిక్షన్’ వాస్తవం ఎన్నటికీ కల్పనకన్నా విచిత్రంగా వుంటుంది. అది మీకు తెలుసు.

నా మొహంలో భావాల్ని చదివే ప్రయత్నం చేస్తూ కాసేపు నిశ్శబ్దంగా వుండిపోయాడు శ్రీధర్.

నా వంక అయోమయంగా చూస్తుండిపోయిన సెక్యూరిటిగార్డ్ ను తన స్థానానికి వెళ్ళిపొమ్మని నెమ్మదిగా సైగ చేశాను.

చలి గాలి శరీరాన్ని వణికిస్తోంది. దూరంగా హైవే పై వాహనాల రొద చెవుల్ని తాకుతోంది.

"మీరు నాకు చిన్న సాయం చేయాలి. నన్ను మీరు ఎప్పుడైతే చూడగలిగారో ఆ రోజే అర్థమయిపోయింది నాకు సాయం చేయగలిగింది మీరు ఒక్కరే అని" నేను ఆయన వంకే చూస్తుండి పోయాను.

"మనం ఒరిస్సా వెళ్ళాలి. అక్కడ మీరు నెరవేర్చాల్సిన కార్యం ఒకటుంది. వచ్చే పున్నమి రోజు ఉదయాన్నే బయలుదేరి మనం ఒరిస్సా వెళదాం" శ్రీధర్ చెప్పాడు.

నాకు కాస్తా భీతి కలిగింది.

"నేను మీకు ఏ హాని చేయను. అది నా హామీ" శ్రీధర్ అలా చెప్పి నెమ్మదిగా దూరంగా గాల్లో కల్సిపోయాడు.

నేను ఆ వైపే చూస్తుండి పోయాను.

*** **** ****

దరింగ్‍బడి (హిల్ స్టేషన్) ఒరిస్సా

మేము అక్కడికి చేరుకునే సరికి సాయంత్రం ఆరవుతోంది. పల్చటి చీకట్లు అలుముకుంటున్నాయి. చాలా చలిగా వుంది వాతావరణం.

ప్రక్కనే కూర్చున్న శ్రీధర్ దారి చూపిస్తుండగా ఓ ఎతైన మలుపులో ఉన్న ఇంటికి చేరుకున్నాము. అది చాలా పెద్ద ఇల్లు. కనుచూపు ఆనినంత మేరకు అల్లం, పసుపు తోటలు కనిపిస్తున్నాయి. ఆకాశం చాలా స్వచ్చంగా వుంది.

ఆ ఇంటి గేటు ముందు జిప్సీ ఆపి కాలింగ్ బెల్ నొక్కాను.

సెక్యూరిటీ గార్డ్ నెమ్మదిగా గేటు తీశాడు.

సెక్యూరిటీ గార్డుకి అర్థం కాలేదు నేనెవరో. కానీ జిప్సీకున్న రంగును బట్టి నాకు ఆర్మీకి ఏదో సంబంధం వుందని అంచనా వేశాడు.

’అమ్మగారున్నారా’ అని హిందీలో అడిగి, అతనికి నా విజిటింగ్ కార్డ్ ఇచ్చి ఆవిడకు ఇచ్చి రమ్మన్నాను.

ఇంతలో ఎవరూ ఉహించని విధంగా వాళ్ళ ఇంటి నుంచి లాబ్రడార్ బ్రీడ్ కి చెందిన వారి పెంపుడు కుక్క పరుగున వచ్చి ముందరి సీట్లో ఉన్న శ్రీధర్ పై ప్రేమ గా ఎగబడి అతన్ని నాకే ప్రయత్నం చేస్తోంది.

అతను నాకు మాత్రమే కనిపిస్తున్నాడు. సెక్యూరిటీ గార్డుకు అయోమయంగా వుంది. దాన్ని బలవంతంగా లాక్కుపోతున్నా అది లోనికి వెళ్ళటం లేదు.

అందుకే శ్రీధర్ కార్ దిగి లోనికి నడిచాడు. అతడి వెంబడే అది కూడా లోనికి నడిచింది.

**** ***** *****

విషయం మొత్తం వివరంగా చెప్పాను త్రివేణి కి. ఆసలే పెద్దవైన ఆమె కళ్ళు ఆశ్చర్యంతో మరింత పెద్దవయ్యాయి.

సోఫాలో త్రివేణికి ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నాను. ఆమె ఒడిలో ఆరేళ్ళ్ బాబు, ఆమె ప్రక్కనే సోఫాలో కూర్చున్న పదేండ్ల పాప కూడా నా మాటలు ఆసక్తిగా వింటున్నారు.

"ఇప్పుడు కల్నల్ శ్రీధర్ మీ పక్కనే కూర్చుని వున్నాడు సోఫాలో. మిమ్మల్ని కళ్ళారా చూసుకుంటున్నాడు. ఆయన్ని నేను చూడగలుగుతున్నాను, మీరు చూడలేక పోతున్నారు."

అలా చెబుతున్నప్పుడు నా కంఠం రుద్ధమయింది.

"అమ్మా మీ ఇద్దరు పిల్లల బాధ్యత, వృద్ధులైన శ్రీధర్ గారి తలితండ్రుల బాధ్యత ఇవన్నీ మీ భుజస్కంధాలపై పడ్డాయి. వారు మీ గురించి బాధపడుతున్నారు. పెన్షన్ డబ్బులు ఎలాగు వస్తాయి, కానీ శ్రీధర్ గారు మీ తోటల తాలుకు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లని బ్యాంకు లాకర్ లో పెట్టారట. మీకు ఆ విషయం తెలియక ఆ డాక్యుమెంట్లు పోయాయి అని కంగారు పడుతున్నారట. చెబుదామంటే మీతో వారు కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. అవి కాక వారు చేసిన కొన్ని ఇన్వెస్ట్ మెంట్ల గురించిన వివరాలు మీకు చెబుతున్నారు.

ఇవి కాక వారు కొన్ని పాస్ వర్డ్ లు మీకు చెప్పాలని తపన పడుతున్నారు. ఇవన్నీ నాకు వివరంగా చెప్పారమ్మా. మీరు ఇక పై డబ్బుల గురించి ఏ విధమైన ఆందోళన చెందకండి.

ఈ వివరాలన్నీ మీకు తెలియజేయాలని వారు ఎంత ఆందోళన చెందారో చెప్పలేను”

ఆ వివరాలన్నీ ఆవిడకి చెబుతుంటే ఆయన ఆనంద పడటం ప్రత్యక్షంగా చూడగలిగాను.

ఆయన ఆనందాన్ని కండ్లారా చూడగలిగాను అన్న తృప్తిలో వెయ్యికిలోమీటర్లకు పైగా ప్రయాణం చేసిన అలసట మర్చిపోయాను.

ఓ మంచి పని చేశానన్న తృప్తితో శ్రీధర్ వంక చూశాను.

ఆయన్ వీడ్కోలు చెబుతున్న భంగిమ లో క్రమంగా అదృశ్యమయిపోయారు.

ఆ తర్వాత నేన్నాయన్ని ఎన్నడు చూడలేదు.

***** ****** ******

జరిగిన కథ అంతా చెప్పి రాజీవ్ వంక చూశాను.

"ఓ మై గాడ్. ఈ జిప్సీ వెనుక ఇంత కథ వుందన్న మాట." అన్నాడు రాజీవ్.

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు