"బాబు తొందరగా లేవండి.మొదటి రైలు వొచ్చేసమయం అయింది.అది వెళ్లి పోయిందంటే మళ్ళీ పదింటి వరకు మరో బండి లేదు. మళ్ళీ మా వారోస్తే గొడవ అవుతోంది" అన్న పెద్దావిడ మాటలు చెవుల్లో పడగానే, అప్పుడప్పుడే పట్టీపట్టనట్లు పడుతన్న నిద్దుర చేదిరిపోయి, దిగ్గున లేచి కూర్చున్నాను.
పూర్తిగా తెల్లారినట్లు లేదు,ఇంకా చీకటి గానే ఉంది.ఉదయం నాలుగు అవుతున్నట్లుగా ఉంది. గోడ కు ఉన్న గడియారం మూడు గంటల నలబై నిమిషాలు చూపిస్తుంది .
"ట్రైన్ ఎప్పుడన్నారు" అని అడిగాను.జవాబుగా అదే ముసలావిడ గొంతు ,"నాలుగింటికి బాబు".అంది.
ఆమె చూపుల్లో ఏదో ఆతృత ,భయం కనిపిస్తున్నాయి.నేనెంత తొందరగా ఆ ఇంటి నుంచి బయటపడతానా, విషయం సద్దుమనిగి పోతుందా అని చూస్తున్నట్లుంది.
మౌనిక మాత్రం కనిపించలేదు.
**** ****** **** ******
రైలు మౌనిక వాళ్ళ ఊరికి చేరుకునే సరికి, బాగా చీకటి పడి పోయింది. ముందు ప్లాను చేసుకున్న ప్రయాణం కాదు కాబట్టి శ్రమైతే పడాల్సి వచ్చింది.అది కూడా పగటి పూట , రైలు ప్రయాణం ఇంకెలా ఉంటుంది.
ఇంట్లో మౌనిక,ఓ ముసలావిడ వున్నారు. ఆ ముసలావిడ మౌనిక వాల్ల నాన్న్నమ్మ కావచ్చును. పరిచయం తరువాత ఆమె నాన్నమ్మ అన్న నిజం ఖాయమయ్యింది
మౌనిక నేను ఇంజబీరింగ్ కాలేజ్ లో సహవిద్యార్థులం.తాను హాస్టల్ లో ఉండేది.నేను మాత్రం ఇంటి నుండి రోజు కాలేజీ కి వెళ్ళేవాన్ని. మొదట నోట్స్ షేర్ చేసుకోవటం నుంచి మొదయ్యయింది మా స్నేహం. తరువాత , మెలిమెల్లిగా, నే తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ షేర్ చేసుకోవడము, ఏదో ఒక ఒంక తో రోజు కలుసుకునే వరకు వచ్చింది. మౌనిక నాతో కలిసి తినేందుకు చాలా ఇష్ట పడేది .బహుశా హాస్టల్లో తిండి రుచించక కాబొలు.
తాను నేను కలిసి సినిమాలకి మరియు షికార్లకే కాదు ట్యూషన్స్కి,చదువుకోడానికి ,లైబ్రరీకి,సబ్జెక్ట్ డిస్కషన్స్ కి కలిసి వెళ్ళేవాళ్ళం.క్లాస్ రూంలో నైనా,ఏదైనా ఈవెంట్ లో నైనమేమిద్దరం పక్క పక్కనే కూర్చునేవాళ్ళం.మమ్మల్ని తోటి స్టూడెంట్స్ అదోలా చూసేవారు.
ఒకరి నొకరు బాగా ఇష్టపడే స్థాయికి ఎదిగాము, అది ప్రేమ గా ఎప్పడు రూపాంతరం చెందుతుందో అన్న ఆలోచన కూడా మాకు ఎప్పడు రాలేదు. నిజానికి మా ఇద్దరి మధ్యన ఉన్నది ఫ్రెండ్షిప్ మాత్రమే. ఐతే అది ప్రేమగా ఎప్పుడు అంకురం తొడిగిందో మాకే తెలియదు.
మేము ప్రేమలో ఉన్న సంగతి ,ఎప్పుడైతే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి తాను హాస్టల్ వదలి ఇంటికి వెళ్లి, నాకు దూరమయ్యిందో అప్పడు అర్థమయ్యింది. నాలో తెలియని అలజడి మొదలయ్యింది. తినాలనిపించేది కాదు.ఏ పని మీద ధ్యాస ఉండడం లేదు.ఏదో కోల్పోయిన వానిల , కనీసం వ్యక్తిగత శుభ్రతను కూడా పట్టించుకోలేక పోతున్నాను.చింపిరి గడ్డం,నిద్ర లేక పేలవంగా మారిన కళ్ళు, కాంతి హీనమైన ముఖం.
అంతే కాకుండా, మళ్ళీ నేను మౌనికని కలుస్తానో లేదో అని అనుమానం.మౌనికతో కలసి ఉండే రోజులు మాటి మాటికి గుర్తుకు రావడం చాలా ఇబ్బందిగా ఉండేది. ప్రేమో, ధోమో నాకనవసరం, కానీ నేను మాత్రం మౌనికని కావలి.
మౌనికని కలిసి ఆమెను పెళ్లిచేసుకోవాలని కాదు నా ఉద్దేశ్యం. ఆమె సన్నిధి లో నాకు మనశ్శాంతి లబిస్తుంది , నా మనసు చదువు పై లగ్నం అవుతుంది.నా ఏకాగ్రత పెరిగుతుంది. నే ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోగలను. నాకు మౌనిక కంటే , ఆమె సన్నిధి ముఖ్యం.
వేసవి సెలవుల నిమిత్తం ఎవరి ఇంటికి వాళ్ళం వెళ్లిపోయాము. నేను మా ఇంటికి వొచ్చిన మాట నిజమే అయినప్పటికీ నేను మాత్రం ఇక్కడ లేను. నా పరిస్తితి ఎవరికి చెప్పిన అర్థం కాదు.నన్ను నేను కంట్రోల్ చేసుకోలోని పరిస్థితి. మనసు ఉండబట్టలేక, ఉన్నపలంగా దొరికిన బండి పట్టుకొని మౌనిక వాల్లా ఊరికి వొచ్చేసాన
రాత్రి తొమ్మిది దాటింది.అది ఒక చిన్న టౌన్.రైళ్ల రాకపోకలు కూడా అంతగా ఉండేట్టు లేవు.స్టేషన్ చిన్నదే.మౌనిక వాల్ల ఇల్లు కనుక్కోవడం పెద్దగా కష్టం అనిపించలేదు.స్టేషన్ బయటకు వచ్చి ,చిరునామా చెపితే, ఆటో వాడు అయిదు నిమిషాల్లో అక్కడ తెచ్చి దించేశాడు.ఆటో దిగగానే, ఎదురుగా గుమ్మం లో నిలుచుని దర్శనమిచ్చింది మౌనిక.
మౌనిక ఎంతో బలహీనంగా కనిపించింది. అక్కడ సిటీ లో ఉన్నప్పుడు ఉన్న మౌనికకి , ఇప్పుడు నే చూస్తున్న మౌనికకి చాలా వ్యత్యాసం ఉంది.నిద్ర లేమి వలన కళ్ళక్రింద నల్లని చారలు ఏర్పడి ఉన్నాయి.తైల సంస్కారం లేని జుట్టు,అన్నిటికీ మించి తన ముఖంలో కనిపించే ఆందోళన,భయము నన్ను అయోమయస్థితిలోకి నెట్టేసాయి.తాను కూడా నాలాగే నన్ను మిస్ అవుతుందేమో. నాలాంటి పరిస్థితుల్లో తాను కూడా ఉందేమో.
మౌనిక నన్ను చూసి చాలా సంతోషపడింది. తను వింత వింత గా ప్రవర్తించడం మొదలు పెట్టింది.
ఈ ప్రవర్తన, ముఖంలో మార్పులు ఇవన్నీ చూసి
వాళ్ల నానమ్మ ఏదో ఊహించిఉకొని, తనదైన శైలిలో పావులు కదపడం మొదలు పెట్టింది
అయితే నేను రావటానికి గల కారణం, మనసు పడే వేదన అంతా వినిపించాను. కానీ నాకర్థమయ్యిందేమిటంటే ,నేను మౌనికని కలవటానికి రావటం, ఆ పెద్దావిడకు పెద్దగా నచ్చినట్టు లేదు.
అంతే ముసలమ్మ ఇరుగు పొరుగు వారిని పోగు చేసి ఒక రచ్చ బండ కు శ్రీకారం చుట్టింది.ముసలావిడ ఎలా మేనేజ్ చేసిందో కానీ, మంచి నెట్ వర్క్ ఉన్నట్లుంది.ఓ నాలుగైదుగురు పెద్దమనుషులను పిలిలించింది. వయసులో పెద్దవారిని, కొంచెం దగ్గరి బంధువులు మరియు నమ్మకస్తులను పిలిపించినట్లుంది.ఈ నలుగురైదురు కాకుండా ,చుట్టుపక్కల వారొక ఐదారు మంది గుమిగూడారు.
మొదటి ఎత్తుగా,మౌనికని అక్కడ నుంచి మాయం చేసేసింది.మళ్ళీ కనిపించనివ్వలేదు.
రెండు ఎత్తుగా, నన్ను సముదాయించడం,హెచ్చరించడం,తిరిగి ఒంటరిగా వెనక్కి పంపించడం.
ముసలావిడ కలిపించుకొంటు "చూడు బాబు, ఆ అమ్మాయి పెళ్లి ఖాయం అయింది.పెద్దవాళ్ళు అది మాట్లాడడానికే అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లారు.ఇలాంటి సమయంలో,నీవు ఇక్కడికి రావడమే తప్పు."
"పెళ్లా; ఖాయమయిందా! ఏమైనా మతుండే మటాడుతున్నారా?, మౌనిక ఇప్పుడిపుడే ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసింది.ఇంకా డిగ్రీ పట్టా కూడా చేతికి రాలేదు.అప్పుడే పెళ్ళెంటి? " అని నిలదీశాను.
"మేమింకా చదవాలి.మా గోల్స్ వేరు.
సమిష్టిగా చదువుకున్నాము,ఎన్నో మాక్ ఇంటర్వూస్ చేసుకున్నాము,కంప్యూటర్స్ లో కొత్త కోర్సులు చేయాలి,సమాంతరంగా సివిల్స్ కు ప్రిపేర్ కావాలి.మా ప్రపంచం వేరు.మా కలలు వేరు.మోనిక వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు.ఆమె తెలివి తేటలు ,ఐక్యూ గూర్చి నాకు అవగాహన ఉంది. ఆమె జీవితాన్ని నాశనం చేయొద్దు.తన జీవితంతో పాటు నా జీవితం కూడా పాడైపోతుంది." అంటూ నా గోడంత వెళ్లబుచ్చాను.
పరిస్థితిని మేము చూసే కోణాల్లో ఆ నాయనమ్మ గాని ఆ కుటుంభం సభ్యులు గాని ,లేదా ఆ వాతావరణంలో పెరిగిన జనం గాని చూడటం లేదు.
ఆ ముసలావిడ మమ్మల్ని వేరుగా అర్థం చేసుకుంటుంది.ఆమె ఆలోచన విధానం వేరు.
ఆ పెద్దమ్మ "ఈ వయసులో ఒక అడా మగ మధ్య
స్నేహం అంటే అది ప్రేమే అవుతుంది.అది కూడా యవ్వనంలో ఉన్న మీ మధ్య ప్రేమ తప్ప మరోటి ఉండదు.
ప్రేమ కాదు ఇది స్నేహం అంటే ఒప్పుకునే నాగరిక పద్ధతుల్లో మేము లేము. సహజీవనాలు, దోస్తానులు మీ లాంటి పెద్ద పట్టణాలలో నడుస్తుండవచ్చు. ఇక్కడ కావు.
మా చిన్న టవునల్లో ,ఇప్పటికి అడపిళ్ళంటే భరువే అంతే కాదు భాధ్యత కూడాను..పెళ్లిచేసి బరువు దించుకొని, మా భాధ్యతను నెరవేర్చనీయండి" అంది ఆ ముసలమ్మ.
వీరి మొండి వైఖరి, సంకుచిత ఆలోచనలకు ఓ యువ నారి భవిత అంతం కావాల్సిందేన? పెళ్లి చేయడమే బాధ్యతా? ఇంకా చదువుకొని, ఉన్నతమైన స్థితిలో ఉండి సమసమాజ నిర్మాణంలో భాగస్వాములను చేసే దిశగా ఈ అడుగులు ఎందుకు పడటం లేదు.ఎప్పుడు తాము గీసుకొన్న వలయంలో నే ఎందుకు అలిచిస్తున్నారు.తమ ఆలోచన పరిధిని ఎందుకు విస్తరించుకోవడం లేదు.
నాకు ఇంకా ఏదో చెప్పాలని ఉంది కానీ వారు వినే పరిస్థితులలో లేరు.
అబ్బాయి ,ఇదంతా వదిలేయ్,మా తాలేవొ మేము పడతాము, మా అబ్బాయిల స్వభావము నీకు తెలియదు,ఏదో, వేళ కానీ వేళ వచ్చావు, పొద్దునే మా వాళ్లు రాకముందే,ఫస్ట్ బండి పట్టుకొని వెళ్లిపో. లేదంటే చిక్కుల్లో పడతావ్" అని మాట్లాడ్డానికి వీలు ఇవ్వకుండా, కుండ బద్దలు కొట్టినట్లు నిక్కచ్చిగా చెప్పేసింది.
వీరు నన్ను మాటాడ నీయరు.మాట్లాడిన విని అర్థం చేసుకొనే పరిస్థితి లో లేరు.
ఇక్కడ మౌనిక ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది.అందుకే ఆ ముసలిది తెలివిగా, ఆ అమ్మాయిని అక్కడ నుండి తప్పించింది.
ఇప్పటి వరకు కర్కశంగా మాటాడిన ఆవిడే కొంచం ధీనత్వాన్ని తెచ్చుకొని,'ఈ విషయాన్ని రాద్ధాంతం చేసి దాని జీవితాన్ని పాడుచేయకు' అంటూ ప్రాధేయపడినట్లుగా అడిగింది.
"పెద్దమ్మ వీడితో మాటాలెందుకు, మక్కెలిరగ తన్నితే చాలు, దిమాకు టికానకు వస్తుంది" అని ఎవడో అక్కడ గుంపు లోనుండి కోపంగా అరచినట్లు అన్నాడు.
ముసలావిడక అతన్ని వారిస్తూ " పెద్దదాన్నీ నే మాట్లాడుతున్నా , నువ్వూరుకోరా వీరేశం" అంది.
మళ్ళీ చెప్పడం మొదలుపెడుతూ, " చూడు నాయనా,చూస్తే మంచి కుటుంభం నుంచి వచ్చినట్లున్నావు.చదువు సంస్కారం గట్ల ఉన్న వాణిలాగా వున్నావు.దాని కి బుద్ది లేకుంటే నీకైనా ఉండక్కర్లేదయ్య.
మాది చిన్న టౌను. మా ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే.దీనిని సిటీ లో ,హాస్టల్లో పెట్టి ఇంజనీరింగ్ చేయించామే ,అదే మాకు తాహతుకు మించిన పని.ఇంకా నువ్వన్నట్లు అవి ఇవి చదివించే స్తోమత మాకు లేదు.ఇప్పుడొచ్చిన సంబంధం కూడా మంచిదే.అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్.కుటుంభం కూడా బాగానే ఉన్నాయి.
అంతగా చదువు కోవలనుకొంటే పెళ్లయిన తరువాత చదువుకుంటుంది. పెళ్ళైన తరువాత పెద్ద పెద్ద చదువులు చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారూ లేదా?
అవును ఈ ప్రశ్న నన్ను సమాధాన పరిచింది.మోనిక కు నా అవసరం లేక పోవచ్చు.నాకు మౌనిక బలహీనత.ఆమె సన్నిహితంతో నే నా జీవితం గట్టెక్కుతుందని భావిస్తున్నాను.మౌనిక ఆలోచన విధానం ఏంటో!?!
"పెళ్లంటే అడా మగ కలిసి పోతే అయ్యేది కాదు, రెండు కుటుంబాలు కలవాలి.రెండు సంస్కృతులు కలవాలి.కట్టుబాట్లు ,వేషాదరణ,తిండి తిప్పలు అన్ని ఒకరివి ఇంకొకరికి అర్థం కావాలి.అర్థమే కాదు ,ఇరు వర్గాల వారికి నచ్చాలి కూడా, అవన్నీ నచ్చాయి కనుకనే మేము ఒప్పుకున్నాము"
మోనిక చిన్న పిల్ల ,దానికేం తెలుసు.దానికి ఏమంత అనుభవం ఉంది గనుక.అలా ఒకరి తరువాత ఒకరు చెప్పుకుంటుపోతునే వున్నారు.ఒకరు సౌమ్యంగా,ఒకరు కోపంగా,మరొకరు కసిగా, ఇలా ఒకొక్కరు ఒక్కో రకంగా వాదిస్తూ ,పురమాయిస్తూ చెపుతూనే వున్నారు. రాత్రి చాలా పొద్దుపోయేవరకు అదే గోల.
సీను కట్ చేస్తే , పొద్దు పోయినాక వొచ్చావు .ఇంట్లో వాల్లా నాన్న, చిన్నాన్న లేరు కాబట్టి బతికి పోయావు.ఈ స్నేహం ఇవన్నీ మాకు తట్టవు,మారు మాటాడకుండా పొద్దున్నే ఫస్ట్ బండి కి వెళ్ళిపొమ్మని వార్నింగ్.
***** ****** ****** *****
ఇద్దరు ఆ ఊరి వాళ్లు నాకు ఎస్కార్ట్స్. పొరుగు వాళ్ళు కావొచ్చు, నన్ను రైల్వే స్టేషన్ లో దించారు, బలవంతంగా అనలేను, అలాగని నా ఇష్టపూర్వకంగాను కాదు.
"నీవు అదృష్టవంతుడివి లేదంటే ఏ కీలుకి ఆ కీలు ఇరగ్గొట్టి పంపేవాళ్ళు... అని మాత్రం అన్నాడు వారిలో ఒకరు.
ఊరుగాని ఊరు.అందరు వాళ్ళవైపే ఉన్నారు.అనువు గాని చోట అధికులమని అనలేముగా.
రైలు కొంచెం లేటుగా వొచ్చింది.జనరల్ బోగీ అంత కాలిగా వుంది. కిటికీ దగ్గర కూర్చుని అలా బయటకు చూస్తూ వున్నాను.ట్రేను కదిలే వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు.ట్రైన్ మెల్లిగా కదిలింది.స్టేషన్ ప్లేట్ ఫామ్ మెల్లిగా వెనక్కు వెళుతుంది.
రైలు స్టేషను ఒదిలి కొంచెం స్పీడ్ అందుకుంది.
బయట ఇంకా మసక మసక గానే ఉంది.సూర్యుని ఉదయ రేఖలు కనిపించి కనిపించనట్లు కనిపిస్తున్నాయి.
ఎందుకో ఊరు పొలిమేరలో రైలు స్పీడు మళ్ళీ తగ్గింది.
కిటికీలోంచి దూరంగా చూస్తున్నాను.తూరుపు వెలుగు రేఖలు విస్తరించుకొంటున్నాయి. మసక చీకటి మాయమవుతూ ఉంది.
చెట్లు పుట్టలు రాత్రంతా పడుకోకుండా, నిద్ర కాచి చిందరవందరగా ఉన్నట్టున్నాయి, నా లాగా.
నా చూపు ఇంకొంచెం దూరంగా ముందుకి వెళ్ళింది.ఎవరో అమ్మాయి పరిగెత్తుకొస్తున్నట్లు మసకగా కనిపించింది.కళ్ళు విప్పారు చేసుకొని మరి మరి చూసాను.యెస్ ఆమె అమ్మాయే.
రైలు క్రాసింగ్ దగ్గర ఆగి ఉన్నది. నడక కంటే తిన్నంగా కదలసాగింది. బహుశా సిగనల్ ఇచ్చివుంటారు.
కానీ అదేంటి.ఆ అమ్మాయి మౌనిక లాగా ఉందే! ఆ వొంటి నిండా గాయాలేంటి, పడుతూ లేస్తూ నిస్సత్తువగా ఇటు వైపే వొస్తుంది.అవును ఆమె మౌనికనే. ఇటు వైపే ,ట్రైన్ క్యాచ్ జేయడానికి వస్తున్నట్లుంది.రైలు పట్టాలు దాటుతున్న శబ్దం ,ఈ సారి కొంచెం గట్టిగానే ఉంది..ట్రైన్ స్పీడ్ అందుకోవడం మొదలుపెట్టింది.ఆంతే ఒక్క కదుపున లేచి ట్రైన్ ఆపడానికి చైన్ లాగలని చేయిని ముందుకు సాచాడు