సు(శు)భ్రమణ్యం - పద్మావతి దివాకర్ల

subrahmanyam

"ఏమిటి బావా! ఇంకా నీ చెయ్యకడగడం పూర్తి కాలేదా? ఇక్కడ భోజనం చల్లారిపోతోంది. వేగం రా!" అన్నాడు డైనింగ్‌టేబుల్ ముందు కూర్చున్న శేఖరం బావ సుభ్రమణ్యంని ఉద్దేశించి.

"నువ్వు కానియ్ శేఖరం! నాకింకో ఐదునిమిషాలు పడుతుంది." అంటూ మరోసారి చేతులోకి హేండ్‌వాష్ తీసుకొని రెండుచేతులు శుభ్రంగా కడుక్కోసాగాడు. అప్పటికే రెండు సార్లు సబ్బుతో, రెండుసార్లు సానిటైజర్‌తో, ఒకసారి హేండ్‌వాష్‌తో చేతులు కడుక్కొనే ఉన్నాడు.

ఐదు నిమిషాలని అన్నవాడు, మరో పావుగంట దాటాక కానీ సుభ్రమణ్యం చేతులు కడుక్కొని భోజనం ముందు కూర్చోలేదు. బావ కోసం చాలసేపు వేచి ఉండి ఇంక లాభంలేదని తన భోజనం ఆరంభించి పూర్తికూడా చేసేసాడు శేఖరం. "సారీ బావా! కొద్దిగా లేటైంది." అన్నాడు సుభ్రమణ్యం నొచ్చుకుంటూ. అయితే అప్పటికే శేఖరం భోజనం ముగించి చేతులు కడుక్కోవటానికి బేసిన్ వద్దకు వెళ్ళాడు.

"ఫర్వాలేదులే బావా! అయినా కొద్దిగా ఎంటి, బాగానే లేటైంది. అయినా నీది మరీ ఓవర్ బావా! దీన్ని వైద్యపరిభాషలో ఓసిడి అని అంటారు. నేను అన్నానని ఏమనుకోకుండా ఓ సారి డాక్టర్‌కి చూపించుకో బావా!" అన్నాడు శేఖరం.

"శేఖరం! అన్నీ శుభ్రంగా, నీట్‌గా ఉండాలన్నది నా పాలసీ, అంతే కానీ ఇదేం జబ్బుకాదే? సరిగ్గా చేతులు కడగకపోతే ఏ ఇన్‌ఫెక్షన్‌లైనా రావచ్చు, ఏ రోగాలైనా రావచ్చు, కాదంటావా? సరైన ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పేమిటి? కోరి రోగాలు తెచ్చుకోవడం దేనికి?" అన్నాడు సుభ్రమణ్యం.

"నువ్వన్నదంతా నిజమేగాని, నీది మరీ ఓవర్‌బావా!" అని సంభాషణ ముగించి వెంటనే హాల్‌లోకి వెళ్ళి టివీ ముందు కూర్చున్నాడు, లేదంటే సుభ్రమణ్యం మరో అరగంట సేపు 'శుభ్రత-దాని అవస్యకత ‘ మీద తలవాచ్చేట్లు ఉపన్యాసం ఇస్తాడని భయపడి.

'శుభ్రత ' మీద ఇంకొంచెం చెబుదామనుకున్న సుభ్రమణ్యం మరి చేసేదిలేక డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు.

భోజనం చేయడానికి కూర్చుంటునే, భార్య సుశీలని పిలిచాడు. ఆమె రాగానే, "కంచం బాగా కడిగావా?" అంటూనే ఆమె జవాబుకోసం ఎదురుచూడకుండా తనే సింక్‌వద్దకు వెళ్ళి మరోసారి బాగా కడిగి తెచ్చుకున్నాడు.

"మీరే కడుగుకునేదానికి నన్ను మళ్ళీ అడగడం దేనికి?" అందామె చిరాగ్గా.

"అది కాదే! చాలా సేపు ఇక్కడే ఉండిపోయింది కదా, అందుకే మళ్ళీ కడిగానన్నమాట." తను చేసిన పనికి సంజాయిషీ ఇచ్చాడు.

సుశీల కూరలు, అన్నం వడ్డించిన తర్వాత, అన్నంలో కూర కలుపుకుని నోట్లో పెట్టుకోబోతూ ఆగి, "అవునూ, కాయగూరలు వండేముందు బాగా కడిగావా, లేదా?" అన్నాడు సుభ్రమణ్యం.

"ఏమిటీ ఒకవేళ నేను కడగలేదంటే, ఈ వండిన కూర కడిగేస్తారేమిటి కొంపతీసి? అయినా ఇంత అనుమానం ఐతే ఎలాగండీ. నా మీద నమ్మకం లేకపోతే మీరే కూరలు శుభ్రంగా కడిగి స్వయంగా వంటకూడా చేసెయ్యొచ్చుకదా!" అందామె విసుగ్గా.

ఆమెకి జవాబివ్వక మారు మాట్లాడక తినసాగాడు సుభ్రమణ్యం. అతనికి, ఆమెకి ఇది ప్రతీరోజూ అలవాటే. సుభ్రమణ్యంకి ప్రతీది శుభ్రంగా ఉండాలి. కడిగిన చేతినే కడుగుతూ ఉంటాడు. ఇంట్లో సబ్బుగానీ, హేండ్‌వాష్ గానీ వారం రోజులు కూడా రాదు. అందుకే అలాంటివన్నీ ఎందుకైనా మంచిదని డజన్లకొద్దీ తెచ్చి ఇంట్లో ఉంచుతాడు. సాయంకాలం ఆఫీస్ నుండి వచ్చినతర్వాత మౌత్‌వాష్‌తో నోరు కడుక్కొని, స్నానం పూర్తి చేసి వచ్చేసరికి అతని కోసం చేసిన కాఫీ చల్లారిపోతుంది. అలాగే రాత్రి భోజనం చేసేముందు చేతులు కడుగుకోవడానికి వెళ్ళేవాడు ఇంతకీ తెమలడు. ఈ లోపున డైనింగ్ టేబుల్ ముందు సుశీల ఓ కునుకు తీసేస్తుంది. ఇలా సుభ్రమణ్యం శుభ్రత గురించి చెప్పుకొని పోతే దానికి అంతుపొంతూ ఉండదు.

ఆఫీస్ నుండి తిరిగివచ్చినా, వీధిలోకి వెళ్ళినా, కూరగాయలు తేవడానికి వెళ్ళినా మళ్ళీ స్నానంచేసి బట్టలు మార్చుకుంటాడు. ఎందుకైనా మంచిదని, భార్య కూరగాయలు కడుగుతుందో లేదోనని బజారునుండి రాగానే అవన్నీ కడిగి తనే ఫ్రిజ్‌లో భద్రపరచుతాడు. అయితే వండేటప్పుడు మళ్ళీ కడగాలని కూడా క్లాస్ తీసుకుంటాడు. అతనికి ఆరోగ్యం పట్ల అవహగాన అటువంటిది మరి. తనొక్కడూ ఆచరిస్తే పర్వాలేదుకాని, తనలాగే అందరూ కూడా శుభ్రత పాటించాలని అనుకొంటాడు, అందుకే అందరికీ పాటించవలసిన శుభ్రత గురించి, దానివల్ల ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో కూడా సోదాహరణగా వివరిస్తాడు. అన్నీ శుభ్రంగా ఉంచాలంటారు, అందేకే అతనికి పేరు బాగా నప్పిందని తెలిసిన వాళ్ళందరూ అతని పేరు యొక్క తోక కట్‌చేసి అతన్ని 'శుభ్రం' అనే పిలుస్తారు. కాఫీ, టీలు అస్సలు తాగడు. ఇంట్లో మిరియాలు, అల్లం, నిమ్మకాయవేసి చేసిన బ్లాక్‌టీ మాత్రమే తాగుతాడు, అంతేకాక ఇంట్లో అందర్నీ అలానే తాగమంటాడు. అంతేకాక ఇంటికొచ్చిన వాళ్ళకి కూడా అదే ఇమ్మంటాడు. అతని అతిథి మర్యాదలకి జడిసి అతని ఇంటి చాయలకి ఎవరూ వచ్చేవారు కాదు. అయితే పాపం, బావమరిదైన పుణ్యానికి శేఖరంకి ఆ ఊళ్ళో పనుండి అప్పడప్పుడు రాక తప్పదు. ఆఫీస్‌లో కూడా తన వస్తులెవ్వరికీ ఇవ్వడు, ఎవర్నీ ముట్టుకోనివ్వడు కంప్యుటర్‌తో సహా. ఆఫీస్ చేరగానే తన కుర్చీ, టేబిల్ తనే శుభ్రంగా నేప్కిన్‌తో, టిస్యూ పేపర్‌తో తుడుస్తాడు, పని కుర్రాడు తుడిచినా సరే! అలాగే, కంప్యూటర్, కీ బోర్డ్, మౌస్‌తో సహా శుభ్ర పరుస్తాడు. ఆఫీస్ క్యాంటిన్‌కి వెళ్ళడు ఎప్పుడూ. భోజనంగాని, టిఫిన్ గాని ఇంటినుండే తెచ్చుకుంటాడు.

అందుకే అతన్ని ఆఫీస్‌లో అందరూ వేళాకోళం చేస్తారు.

"ఏమోయ్ శుభ్రం! నాదో చిన్న సందేహం! ఒకవేళ నువ్వు ఏ దుకాణంలోనైనా వస్తువులు కొని చిల్లర నోట్లు తీసుకున్న తర్వాత కొంపతీసి కడగవు కదా! నీ కోసమైనా ప్రభుత్వం ప్రత్యేకించి ప్లాస్టిక్ నోట్లు తయారు చేస్తే బాగుండును." అన్నాడోసారి సహోద్యోగి రామారావు.

"నేనెప్పుడూ డెబిట్ కార్డు కాని క్రెడిట్ కార్డ్ గానీ వాడతాను! చిన్నచిన్నవాటికి కూడా ఫోన్‌పే, గూగుల్‌పే లాంటివి ఉన్నాయికదా! అందుకే ఆ సమస్యలేదు." తనని వేళాకోళం పట్టిస్తున్నాడని తెలిసినా చిన్నగా నవ్వి జవాబిస్తాడు.

"నీతో చాలా కష్టమేరా! నీ చాదస్తంతో మీ ఆవిడ ఎలా నీతో వేగుతుందో కానీ, ఆవిడకి నా జోహార్లు!" అన్నాడు రామారావు.

“అయినా మన వస్తువులు, మన పరిసరాలు శుభ్రంగా ఉంచటంలో తప్పేమిటి? స్వచ్ఛ భారత్ ప్రస్తుతం మన నినాదం కూడా కదా మరి. అలాగే మన చేతులు శుభ్రంగా ఉంచుకుంటే, మన పరిసరాలు స్వచ్ఛంగా ఉంచితే మనకి ఆరోగ్యదాయకం కూడా! ఇలా శుభ్రత పాటిస్తే జబ్బులేవీ మన దరికి చేరవు కదా." అన్నాడు సుభ్రమణ్యం.

"అవును మరి! నువ్వు స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసాడర్‌వి." నవ్వుతూ అన్నాడు రామారావు.

మరోసారి ఇంకో కోలిగ్ అప్పారావు, "శుభ్రం! వాష్‌రూంలో ఉంచే హేండ్‌వాష్ రెండురోజులుకూడా రావడంలేదని బాస్ ఒక్కటే గోల. నువ్వొక్కడివే దానికి సమాధానం చెప్పగలవని నీ పేరు చెప్పాను. బాస్‌కి ఏం చెప్తావో ఏమో?" అన్నాడోసారి.

ఇలా సుభ్రమణ్యాన్ని ఆఫీస్‌లో అందరూ ఆట పట్టించేవాళ్ళే.

ఇదిలా ఉండగా హఠాత్తుగా చైనాలో ప్రారంభమైన కరోనా ప్రపంచంలో అన్ని దేశాల్లోకీ చాపకింద నీరులా ప్రవేశించి ప్రజలని గడగడలాడిస్తోంది. ప్రపంచ దేశాలమధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఎక్కడవాళ్ళక్కడ నిలిచిపోయారు. భారతదేశంలో కూడా లాక్‌డౌన్ ప్రకటించారు. బస్సులు, రైళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి. ఎవ్వరూ బయటకి వెళ్ళడానికి లేదు. నిత్యావసరాలకు తప్పనిసరై వెళ్ళినా భౌతికదూరం పాటించడం తప్పనిసరి. అయినా ఈ మహమ్మారి వల్ల వేలసంఖ్యల్లో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మెల్లగా ఆ సంఖ్య అతి కొద్ది సమయంలో లక్షల్లోకి చేరింది.

సుభ్రమణ్యం అఫీస్ మూతపడి వర్క్ ఫ్రం హోం చేస్తూ ఇంట్లోనే కూర్చున్నాడు. ఇప్పటికే రెండుదఫాలు లాక్‌డౌన్ పూర్తై, మూడో దఫా నడుస్తోంది. ఇంకెన్నాళ్ళు ఈ విధంగా నడుస్తుందో ఆ దేముడికే ఎరిక. ఆ ఊళ్ళో పనిపడి వచ్చిన శేఖరం కూడా పాపం ఈ లాక్ డౌన్ పుణ్యామా అని బావ ఇంట్లోనే లాక్ అయిపోయాడు. ప్రతీరోజు శుభ్రత మీద బావ ప్రవచనాలు క్రమం తప్పకుండా వినవలసి వస్తోంది. పాటించవలసి వస్తోంది కూడా.

అయితే సుశీలకి మాత్రం పని బాగా పెరిగిపోయింది. ఇంట్లోనే ఉండటం వలన సుభ్రమణ్యం ఆమె చేసే ప్రతీపని నిశితంగా గమనిస్తున్నాడు. ఫలితంగా ఆమె కడిగిన గిన్నెలు మళ్ళీ కడగవలసి వస్తోంది, కడిగిన కూరలు మళ్ళీమళ్ళీ కడగవలసి వస్తోంది. కరోనా వల్ల సుభ్రమణ్యం పైత్యం ఇంకా బాగా ముదిరిపోయింది.

ఈ కరోనా పాపంవల్లో లేక, లాక్‌డౌన్ పుణ్యంవల్లో కానీ టివిలో రామాయణం, మహాభారతం, ఇంకా ఇలా చాలా పాత సీరియల్స్ వీక్షించే సౌభాగ్యం కలిగింది. అయితే, సినిమా, సీరియల్స్ మధ్యనే కాక వార్తల మధ్యలోనూ కరోనా నివారణకోసం ప్రతీ పదినిమిషాలకీ ప్రకటనలు వెలుబడుతున్నాయి. సినీ ప్రముఖులు కూడా తీసుకోవలసిన జాగ్రత్తలు పదేపదే చెప్తునే ఉన్నారు.

అప్పుడే టివిలో ప్రకటన వస్తోంది. "కరోనాకి మందులేదు కాబట్టి నివారణ ఒక్కటే ఉపాయం. అందుకు ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. కరోనావైరస్ సోకకుండా ప్రతీ పదినిమిషాలకి ఇరవై సెకండ్లు అయినా చేతులు సానిటైజెర్‌తో కానీ, సబ్బుతో కానీ శుభ్రంగా కడుక్కోవాలి. వీధిలోకి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించాలి. భౌతిక దూరం పాటించాలి..."ఇలా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సాగుతోంది ఆ ప్రకటన.

అది వింటూనే మళ్ళీ రెచ్చిపోయాడు సుభ్రమణ్యం. "చూసావా బావా! సుశీలా, నువ్వు కూడా చూడు! నేను రోజూ పాటించేవే ఇప్పుడు టివిలో పదేపదే చెప్తున్నారు. ఆఫీస్‌లో కొందరైతే వేళాకోళం చేయడమేకాక వాదిస్తారు కూడా. నేను శుభ్రత పాటిస్తే మీరందరూ నవ్వుతున్నారు. నేనింతకపూర్వం కూడా వీధిలోకి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ మాస్క్ ధరించేవాడిని. అయితే నేను ప్రతీరోజూ ఆచరించేవే ఇప్పుడందరూ తప్పనిసరిగా ఆచరించాలి మరి. లేకపోతే కరోనాని నిరోధించలేము. రోగాలేవీ సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పేమిటి. అసలు ఇప్పుడు ప్రస్థుత పరిస్థితుల్లో మాత్రమేకాదు, ఎల్లప్పడూ కూడా ఇవి పాటించదగ్గవే! నేను చెప్తే అందరూ నవ్వుతారు, వాళు చెప్తే అందరూ ఆచరిస్తారు. అదే తేడా! అంతే కదా!” అన్నాడు సుభ్రమణ్యం.

మరేం జవాబు చెప్తారు పాపం శేఖరమూ, సుశీలానూ! మౌనంగానే ఉండిపోయారు.

'బావా! వాళ్ళు ఇరవై సెకండ్లు చేతులు కడుక్కొమంటే నువ్వు మాత్రం రెండు నిమిషాలు కాదుకదా, ఇరవై నిమిషాలకు తక్కువ కాకుండా చేతులు కడుక్కుంటావు కదా, మరీ ఓవర్‌గా!' అని మనసులోనే అనుకున్నాడు, పైకి అంటే సుభ్రమణ్యం ఇంకేం క్లాస్ పీకుతాడోనని భయపడి.

మన శుభ్రమణ్యం, సారీ సుభ్రమణ్యం మాత్రం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు, తన మాటే ఇప్పుడు ఇంటా బయటా కూడా చెల్లుతున్నందుకు సంతోషపడుతూ.

-పద్మావతి దివాకర్ల

మరిన్ని కథలు

Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు