ధనుర్మాసపు చలి కాలం..
రాత్రంతా చలి చెలికౌగిలిలో ఒదిగిపోయి, మంచు బిందువులతో ముచ్చటలాడి, మంచు దుప్పటి కప్పుకున్న పచ్చని ప్రకృతి..వెచ్చదనపు తొలి కిరణాల నులి వెచ్చదనం కోసం ఎదురు చూస్తోంది.
రాత్రంతా..చెట్టుకొమ్మల్లో ముడుచుకొని పడుకున్న పక్షులన్నీ అప్పుడప్పుడే తమ రెక్కలను విదిలిస్తూ..తమ కువ ..కువ.. నాదలతో వెచ్చదనం కోసం ఎదురుచూస్తూ...
జగన్నాథునికి స్వాగత గీతాలు పాడుతున్నాయి.
నారాయణ మాస్టారు...తన మంకి క్యాప్ సరి చేసుకుంటూ..వాకర్స్ గ్రౌండ్లో
తన మినీ సౌండ్ సిస్టం ఆన్ చేసి వాకింగ్ మొదలు పెట్టాడు.
మానవుడే మహనీయుడు... ఘంటసాల మాస్టారు పాట గ్రౌండ్ అంత వినిపిస్తుంది.
నడుస్తున్న... వాకర్స్ ఆప్యాయoగా
నమస్తే నారాయణ సార్..అని
అన్నా..నమస్తేనే అని..
బాబాయ్..గుడ్ మార్నింగ్..
అంటూ పలకరిస్తు సాగి పోతున్నారు...
బాబాయ్ నువ్వోస్తేనే గ్రౌండ్ లో సందడి ..ఆ పాత పాటలు వింటూ..నడుస్తూ ఉంటే నడిచినట్లే ఉండదు బాబాయి అని....ఒకరు
అవునే నారాయణన్నా..
పాట మోగిందంటే..
తెలియకుండానే కాళ్ళ జోరు పెరుగుతుంది
అని,. మరొకరు
నువ్వొక్కపూట రాకుంటే గ్రౌండ్ చిన్నబోతుందన్న అని...ఇంకొకరు అంటుంటే...
అందరిని ఆత్మీయంగా పలకరిస్తూ.. విష్ చేస్తూ.. చిరునవ్వుతో ...ముందుకు నడుస్తున్నాడు నారాయణ.
వాకింగ్ ముగించుకొని బైటకి వస్తున్నాడు..
ఒక యాభై ..అరవై సవత్సరాల అవ్వ,తలకు గుడ్డ కట్టుకొని,ఒంటినిండా పవిట చెంగు కప్పుకొని చలికి వణుకుతూ..ప్లాస్కోలో టీ పట్టుకొని బాబు అల్లం టీ బాబు..పంచదార వెయ్యంది కుడా ఉందయ్యా ...చలికాలం ఒంటికి మంచిదయ్యా వేడి వేడిగా తాగండయ్యా.. అంటూ దగ్గరి కి వచ్చింది.
నారాయణ గారికి టీ తాగలని లేదు కాని.. ఆ అవ్వను చూసి..అంత చలిలో ఏం అవసరమో..ఏ పరిస్థితులు అవ్వను..అక్కడికి తీసుకొచ్చాయో..ఒక్క క్షణం మనసు బరువెక్కింది..
సరే అవ్వా...ఒక టీ ఇవ్వు...
అంటూ...జేబులో ఉన్న వంద కాగితం చేతిలో పెట్టాడు..నారాయణ .
నారాయణ మాస్తారును చూసి మరికొందరు..టీ తీసుకున్నారు.
అంతటి చలిలో కూడా రోడ్డు పక్కన చిన్న చిన్న గుడారాలు వేసుకొని
మండుతున్న కొలిమిలో ఇనుమును కాల్చి సమ్మెటతో..కొడుతూ కత్తులు కొడవళ్లు తయారు చేస్తున్నారు...కొందరు రాజస్థానీలు.
వారి ఆడవాళ్లు లయ బద్దంగా బలంగా ఇనుము పై సమ్మెట దెబ్బలు వేయటం చూస్తే స్త్రీలు బలహీనలని అనటం ఎంత తప్పో అనిపిస్తుoది.
చిల్లర డబ్బులు తిరిగి ఇవ్వబోతున్న అవ్వను..వారించి
అవ్వ వీళ్ళందరికి టీ ఇవ్వు అని ఆ రాజస్థాని వాళ్లందరికీ టీ ఇప్పించాడు నారాయణ.
అవ్వా..రోజు వీళ్ళందరికి టీ ఇవ్వు డబ్బులు నేనిస్తాను అన్నాడు.
అవ్వ బోసిగా నవ్వింది.
రాజస్థానీలంతా..చేతులెత్తి నమస్కరిస్తూ...ధన్యవాద్ ..భయ్యా అని దండం పెట్టారు.
ఇంటి కొచ్చిన నారాయణ
స్నానాదులు ముగించుకొని..పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని...టిఫిన్ చేసి లంచ్ బాక్స్ కోసం హడావిడి చేస్తున్నాడు.
ఓ ..ఆరాటం ..
మీరు రిటైర్ అయిన నా ప్రాణానికి మాత్రం సుఖం లేదు..ఉద్యోగం చేసేటోళ్లకన్న లేదు ఇంత తొందర.. చంపుక తింటున్నావయ్యా..అంటూ చీదరించుకుంది శకుంతల.
ఏంటో కొంపలు మునిగినట్లు ..ప్రపంచం మునిగిపోయినట్లు..
వాగుతూనే ఉంది..
రోజులాగే సణుగుతూ...వంటింట్లో గిన్నెలు చప్పుడు చేస్తూ వంట పూర్తి చేసి లంచ్ బాక్స్ అందించింది నారాయణ భార్య శకుంతల.
రోజు ఉన్న సణుగుడే..
రోజు అలవాటైన వ్యవహారమే కావడంతో...
మారు మాట్లాడకుండా లంచ్ బాక్స్ తీసుకొని స్కూటీ ఎక్కి ఎప్పటిలాగే స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చేరుకున్నాడు నారాయణ.
నారాయణ సింగరేణి సంస్థలో ఆఫీస్ సూపరెంటెండెంట్ జాబులో ఉన్నప్పటి నుండి సెలవు రోజు ఓ గంట బ్యాoక్ దగ్గర కూర్చొని..
అవసరమైన వారికి విత్ డ్రాయల్ ఓచర్స్ ,డిపాజిట్ వోచర్స్ వగైరాలు రాస్తూ సహాయం చేస్తూ ఉండేవాడు.
ఇప్పుడు రిటైర్ అయ్యాక..పూర్తి టైం బ్యాంకులో ఉండి.. ఒక్క పైసా ఆశించ కుండా తన సహాయాన్ని అవసరమైన అందరికి అందిస్తున్నాడు నారాయణ.
అందరూ నారాయణ సార్ అని గౌరవంగా పిలిచేవాళ్ళు..చుట్టుపక్క పల్లెలనుండి వచ్చిన చదువురాని వారికి..నెల నెలా పించనుకోసం వచ్చే వృద్ధులకు, వికలాంగులకు,పేదవారికి బ్యాంకుకు వచ్చే అందరికి సహాయం చేస్తూ ఉండేవాడు నారాయణ.
అంతేకాదు వూర్లో వుండే ప్రముఖులు కూడా బ్యాంకులో ఏ అవసరం వచ్చినా నారాయణ గారికి ఫోన్ చేసేవారు.
బ్యాంకుకు కొత్తగా వచ్చే స్టాఫ్ కు కూడా నారాయణ గారు గైడ్ చేస్తూ ఉండేవారు.
ఒక్క మాటలో చెప్పాలంటే నారాయణ సార్ వల్ల ఆ బ్యాంక్ రేపుటేషన్ పెరిగిందనవచ్చు.
ఉదయం వాకింగ్, తరువాత సాయంత్ర వరకు బ్యాంక్ డ్యూటీ..సాయంత్రం..స్నేహితులతో ఓ గంట కాలక్షేపం..ఇది నారాయణ గారి దిన చర్య.
అప్పుడప్పుడు బ్యాంక్ కు వచ్చే పల్లె ప్రజలు ప్రేమతో తెచ్చిన మొక్క జొన్న కంకులు,కూరగాయలు,తేనె జున్ను.. పిండి వంటలు..బలవంతంగా నారాయణను మోహవాటపెట్టి మరి ఇచ్చేవారు.
ఇక నారాయణ ఎక్కడికి వెళ్లినా సార్ సార్ అంటూ ఆప్యాయతగా పలకరింపులు, మార్కెట్లో కూరగాయల మొదలు,సరుకులు వగైరా అన్ని తక్కువ ధర చేసి.. నారాయణ గారి కి ప్రత్యేకంగా ఇచ్చేవారు.
అందుకే నారాయణ గారు ఏది కొనే వారు కాదు..ఆయనకు తనను ప్రత్యేకంగా చూడటం ఇష్టం ఉండేది కాదు.
అందుకే అన్నింటికీ..భార్యనే వెళ్ళమనేవారు..
కానీ శకుంతలకు భర్త ప్రవర్తన నచ్చేది కాదు..ఇచ్చినప్పుడు తీసుకోవడంలో తప్పేంటి అనేది...అలాగే దాన ధర్మాలకు తన చెయ్యి ముందుకు వచ్చేది కాదు.ఎంగిలి చెయ్యితో కాకిని కొట్టని గుణం ఆమెది.భర్త పనికి రాని పనులు చేస్తున్నాడని చులకన భావం ఉండేది.
ఒక రోజు...నారాయణ గారు వాఁకింగ్ కు వెళ్లి వస్తూ స్కూటీ స్కిడ్డయి క్రింద పడిపోయారు...చాలా దెబ్బలు తగిలాయి..చూసిన వారు వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు.
ఈ వార్త వూరంతా పాకింది..హాస్పిటల్ జనాలతో కిక్కిరిసింది..
పెద్ద అపాయం లేక పోయినా నారాయణ గారి కుడి చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది..కట్టు కట్టి ఇంటికి పంపారు డాక్టర్లు.
ఇంటికి వచ్చిన దగ్గరనుండి జనాలు తండోప తండాలుగా నారాయణ గారిని పరామర్షిoచడానికి వస్తూనేవున్నారు.
నారాయణ దగ్గరకొచ్చి ..
అయ్యా..మాకు బ్యాంకులో దిక్కెవరయ్యా..మాకు సాయం చేసే చెయ్యికి ఇలా అయిందేంటయ్యా..అంటూ కుటుంబ అభ్యులకన్నా..ఎక్కువ బాధపడే వాళ్లను చూసి శకుంతల ఆశ్చర్యపోయింది..
ఎక్కడెక్కడినుండో వచ్చే జనాలు సొంత మనిషిలా.. భావించి ఏడుస్తున్నారు.
పెద్ద పెద్ద అధికారులు.. రాజకీయ నాయకులు ఇంటికి వచ్చి పరామర్శిస్తూ ధైర్యం చెపుతున్నారు.
వాళ్ళు తెచ్చే పండ్లు..ఫలాలతో ఇల్లంతా నిండిపోయింది.
అలా తామరాకుపై నీటి బొట్టులా..రోజులు జారిపోయాయి..
నారాయణ యదా విధిగా దినచర్య ప్రారంభించాడు..
ఆశ్చర్యంగా..శ్రీమతి సనుగుడు ..దెప్పిపొడుపులు తగ్గిపోయాయి..లంచ్ బాక్స్ కట్టి తాను నారాయణ గారి తో బయలు దేరింది శకుంతల..
అవునండి..ఈ రోజునుండి నేను మీతో వస్తాను
మీతో పాటు కొందరికి సహాయం చేస్తాను..ఇంత మంది దీవెనలే.. నా పసుపు కుంకుమను కాపాడాయి..వారి రుణం కొంతైనా తీర్చుకుంటాను అంటూ భర్త అడుగులో అడుగు వేసింది.. శకుంతల.
ఆ తెల్లవారి ఉదయం శకుంతల కొన్ని దుప్పట్లు... స్వేట్టర్లతో నారాయణతో పాటు వాకింగ్ కు బయలు దేరింది.
అవ్వకు ఇచ్చిన చలి కోటు వేసుకొని చూసుకుంటూ మురిసిపోతుంది..
రాజస్థానీలు..దుప్పట్లు కళ్లకద్దుకుంటూ తీసుకున్నారు...
చలికోట్లు వేసుకున్న రాజస్థాని మహిళలు మురిసిపోతూ.. శకుంతల..పాదాలకు నమస్కరించారు.
సూర్యుడు ..కొత్త కిరణాలతో నులివెచ్చగా బైటికి వస్తున్నాడు.
పచ్చని పచ్చికపై నిలిచిన మంచు బిందువులు ఆవిరై...ఆకాశానికి ఎగిరిపోతున్నాయి.
పక్షులన్నీ... రెక్కలు విదిలిస్తూ... ఆకాశంలోకి రెక్కలు చాచుకొని ఎగురుతున్నాయి..వెచ్చని వేడిని ఆస్వాదిస్తూ..
చలి..భయం భయంగా..దూరంగా జరిగి పోతుంది.
..సమాప్తం...