కో(విడే)టీశ్వరులు - శింగరాజు శ్రీనివాసరావు

ko(vide)teeshwarulu

అసలే అందతుకులుగా వున్న రియల్ ఎస్టేటు వ్యాపారం ఈ కోవిడ్ మహమ్మారి రాకతో ఇంకా కుదేలయిపోయింది. అప్పటికీ నా వ్యాపార సామ్రాజ్యాన్ని కుదించుకున్నాను, నష్టాలు భరించలేక. పోయిన సంవత్సరం పూర్తయిన అపార్టుమెంటులో ఇంకా రెండు ఫ్లాట్లు ఖాళీగానే ఉన్నాయి. అసలుకు ఇబ్బంది లేకపోయినా వడ్డీలు మాత్రం హుళక్కి అనే చెప్పాలి. అప్పుడప్పుడు అనిపించేది ఈ వాపును నమ్ముకుని ఇందులో దిగకుండా గోవిందు గాడిలా కిరాణాకొట్టు పెట్టుకున్నా బాగుండేది అని. అనుకుంటాం గాని, పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి అని, ఎక్కడి బాధలు అక్కడ. పోయిన సారి వాడు కలిసినపుడు అడిగాను వాడిని ఫ్లాటు కొంటావటరా, ఓ రెండు లక్షలు తగ్గించి ఇస్తానని. వాడు ఇప్పుడు నా వల్ల కాదురా అంటూ వాడి కష్టాలు చెప్పుకొచ్చాడు.

కొత్తగా ఊరూరా మాల్స్ వచ్చిన తరువాత చిల్లర కొట్లకు గిరాకీ బాగా తగ్గిపోయిందట. వాళ్ళ తండ్రిగారి కాలంలో పొట్టి వాళ్ళ చిల్లరకొట్టుకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండేది. ఇప్పటికీ సరుకులు మంచివే ఇస్తున్నా, పెద్ద పెద్ద మాల్స్ తో పోటీ పడలేక వ్యాపారాన్ని తగ్గించేశాడు గోవిందు. అప్పట్లో వాడికంటే నేను మెరుగు. సంవత్సరానికి ఎంత లేదన్నా పాతికలక్షల పై చిలుకే నా సంపాదన. ఇది పదేళ్ళ కిందటి మాట. ఇప్పుడు అంతా ఉల్టా అయిపోయింది. అందుకే పోయిన సంవత్సరం నుంచి ఆ వ్యాపారం పక్కనబెట్టి ప్లాట్ల బ్రోకరేజిలోకి దిగాను. దీనికైతే పెట్టుబడి అక్కరలేదు గాబట్టి ఎలాగో నెట్టుకొస్తున్నాను. నోట్లరద్దు తరువాత రాబడి బాగ తగ్గిపోయింది.

పోయిన సంవత్సరం గోవిందు ఆడపిల్లలిద్దరికీ పెళ్ళి చేశాడు. పెద్దల్లుడిది మందుల షాపు, చిన్నల్లుడికి బ్రాంది షాపులతో లింకు వుంది. అంటే ప్రభుత్వ దుకాణంతో లాలూచి పడి పెద్ద మొత్తంలో సరుకు కొని బయట అమ్ముతుంటాడు. రాజకీయంగా మంచి పట్టు ఉంది. అధికార పార్టీలో ఏదో పోస్టు కూడ ఉంది. అదిగాక కూరగాయల హోల్ సేల్ వ్యాపారం కూడ వుంది. ఇద్దరికీ ఇరవై సంవత్సరాల లోపే పెళ్ళిళ్ళు లాగించేశాడు. అదృష్టవంతుడు.

రెండు రోజుల క్రితం వాడు ఫోను చేసి 'షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర స్థలం అమ్మకానికుందని చెప్పావుగా. అది వుందా అమ్ముడుపోయిందా' అని అడిగాడు.
అసలే హాట్ సెంటరది. అంత డబ్బు పెట్టి ఎవరు కొంటారు ఈ మాంద్యం సమయంలో. అందుకే నేను కూడ దాని జోలి వెళ్ళలేదు. వీడి ఫోను వచ్చిన తరువాత స్థలం యజమానికి ఫోను చేశాను. అతను తెగ సంబరపడిపోయాడు. వెంటనే సొమ్ము ఇచ్చే పనయితే మార్కెట్ ఖరీదు కంటే పదిలక్షలు తగ్గించే ఇస్తానన్నాడు. నాకు వచ్చే కమీషన్ కూడ ఒక శాతం అదనంగా ఇస్తానన్నాడు.

అసలతను ఎందుకలా అమ్ముతున్నాడో అర్థం కాలేదు. అతని సర్కిల్ లో కొందరిని విచారిస్తే తెలిసింది. అతను పోయిన సంవత్సరం మంగళగిరిలో పది కోట్లు పెట్టి స్థలం కొని వెంచర్ వేశాడట. అది ఇప్పుడు అమ్ముడుపోక, తెచ్చిన బాకీలు పెరిగి ఈ స్థలాన్ని తెగనమ్ముతన్నాడట. నాకు కొంచెం బాధ వేసింది. కారణం నేను కూడ అటువంటి వ్యాపారినే కాబట్టి. వెంటనే మా గోవిందుకు ఫోను చేసి రమ్మన్నాను.

****

" అవునురా గోవిందూ, మొన్నటి దాకా వ్యాపారం లేదు పడిపోయింది. పిల్లల పెళ్ళిళ్ళ తరువాత చేతిలో పైసా లేదు అన్నావు. హఠాత్తుగా కోటి రూపాయల స్థలాన్ని కొంటానన్నావేరా" ఉండబట్టలేక అడిగాను.

" నిజమేరా అది. మొన్నటి దాకా నిజంగానే వ్యాపారాలు లేవు. ఇదిగో ఈ కరోన వచ్చిన తరువాత సీను మారిపోయింది. మాల్స్ అన్నీ మూసే సరికి మా కొట్టుకు గిరాకీ పెరిగింది. అంతకు ముందు తక్కువ ధరకు కొని నిలువ చేసిన సరుకంతా, ఎక్కువ ధరలో అమ్మేశాను ఈ యాభై రోజులలో. నీకు చెప్పకేమిరా యాభై శాతం పై చిలుకు లాభం వచ్చింది. ఇక మా పెద్ద అల్లుడు రాజకీయ పలుకుబడి ఉపయోగించి మాస్కులు, శానిటైజర్లు, మందులు అమ్మకానికి జిల్లా ఏజన్సీ తీసుకున్నాడు. షాపు ఎలాగూ ఉంది కదా. హైదరాబాద్ కంపెనీలలో తయారయే మందులను అమ్మేశాము. దానిలో అరవై శాతం లాభం. ఇక చిన్నల్లుడు కూరగాయల హోల్ సేల్, బ్రాంది బ్రోకరేజి. ఇక చెప్పేదేముంది. పదిరోజుల క్రితం వరకు అలా అలా వున్న రాబడి ఇబ్బడి ముబ్బడయింది. ఏదో కరోనా పుణ్యమా అని లక్షల ఆదాయం వచ్చింది. పైగా ఇప్పుడు ప్లాట్ల ధర బాగా తగ్గిందని అల్లుళ్ళు బ్యాంకులో సొమ్ము కూడ తీసి స్థలం కొందామన్నారు. అందుకే ఈ హడావుడి" విషయం వివరించాడు

ఏమిటో లోకమంతా ఒకవైపు అతలాకుతలమవుతుంటే అదృష్టం వచ్చి కొందరి తలుపు తట్టింది. నాణానికి రెండోవైపంటే ఇదేనేమో.
అందుకే అంటారు ' సిరి తావచ్చిన వచ్చును' అని.

వెంటనే స్థలం అతనికి ఫోను చేశాను వస్తున్నామని చెప్పి. పనిలో పనిగా మెసేజి పెట్టాను. " మీరు చెప్పిన కోటి పాతిక లక్షల మీదే ఉండండి. తగ్గవద్దు. బేరం నేను మాట్లాడుతానని".

బయట అవకాశం లేదు గనుక అతనింటికే వెళ్ళి కూర్చొని కోటి ఇరవై మూడు లక్షలకు బేరం సెటిల్ చేసి, పదిలక్షల రూపాయలు అడ్వాన్సు ఇచ్చి వంద రూపాయల స్టాంపు పేపరు మీద అగ్రిమెంట్ వ్రాయించాము. అరవై లక్షలు వైట్ మనీ, మిగిలినది బ్లాకు. తప్పదుకదా.

స్థలం అమ్మిన అతని కళ్ళు కృతజ్ఞతగా నా వైపు చూశాయి, నష్టపోకుండా కాపాడినందుకు. తరువాత కలుస్తానని చెప్పి వచ్చేశాము.

******
" సార్. మీరు చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోలేను. ఎంతకో ఒకంతకు తెగనమ్మాలనుకున్న నన్ను ఆపి మార్కెట్ రేటుకు తగ్గకుండా అమ్మేలా చేశారు. అందుకని మీకెంత కమీషన్ కావాలో అడగండి, ఇచ్చేస్తాను" సంతోషంగా చెబుతున్నాడతను.

" భలే వారేనండి. నేను కూడ రియల్ ఎస్టేటు వ్యాపారినే. ఆ సాధకబాధకాలు నాకు తెలుసు. మీరు బాగా డిప్రెషన్ కు వెళ్ళి ఈ పని నాకప్పగించారు గానీ లేకపోతే స్థలం అమ్మడం మీకొక లెక్కా. ఏదో భగవంతుడి దయవల్ల, మీరు నష్టపోకుండా కాపాడగలిగాను. ఇక నా కమీషన్ అంటారా. మొదట్లో ఎంత అనుకున్నామో అంతే. మధ్యలో గాని, ఇప్పుడు గాని మీరిచ్చిన ఆఫర్ నాకు వద్దనే వద్దు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ మొదలవగానే మిగిలిన పైకం ఇచ్చి స్థలం రిజిష్టర్ చేయిద్దాము." మనసులో మాట చెప్పాను.

అతను పొంగిపోయాడు. కానీ ఎంతో కొంత కమీషన్ ఎక్కువ తీసుకోవాలని పట్టుబట్టాడు. ఇక లాభం లేదనుకుని మరొక ఆప్షన్ చెప్పాను.

" ఒక పని చేద్దాం సర్. ఏదో భగవంతుడి దయవలన మనకు తినడానికి లోటు లేదు. కానీ ఈ కరోన కష్టకాలంలో తిండికి కూడ నోచుకోని చిన్న చిన్న దేవాలయాలలో అర్చకులు సుమారు వంద పైచిలుకు కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు. వీరు అటు ప్రభుత్వ పథకాలు దక్కక, యాచనకు పోలేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఏదో చిరు సహాయంగా ఇంటికొక పదివేలు సహాయంగా అందిద్దాము. నా వంతుగా నేను ఒక యాభై వేలు ఇస్తాను. మీరు నాకెంత ఇవ్వదలచుకుంటే అంత దానికి జత చేయండి. అందరికీ పంచగా పోను మిగిలిన మొత్తాన్ని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండుకు ఇద్దాము. అలా చేస్తే మంచిదనిపిస్తున్నది. ఆ తరువాత మీ ఇష్టం" అన్నాను.

" అలాగే సర్ తప్పకుండా. మీరు చెప్పింది నిజమే. మీ లక్ష్యం పేదలను ఆదుకోవడం ఎవరైతేనేం. మనవంతు సహాయం అంతే. మీరెప్పుడంటే అప్పుడే" అతనిలో ఏదో కొత్త చైతన్యం.

నేను స్నేహధర్మాన్ని విస్మరించి గోవిందుకు అనుకూలంగా ప్రవర్తించలేదేమో అనిపించింది. కానీ వాడి సంపాదన ఉట్రవడియంగా వచ్చినది. కష్టాలలో వున్న సాటి మనిషి అవసరాన్ని మాకు అనువుగా వాడుకోవడం నాకు తప్పనిపించింది. పాపం అతనిది కూడ ఎంత మంచి మనసు, కాకుంటే నా ప్రతిపాదనకు వొప్పుకోడు. కాలం కలిసి రాని జీవితమతనిది. ఎలాగోలా నన్ను నేను సమర్ధించుకుని, పేద అర్చకుల కుటుంబాల డేటా సేకరణకు బయలుదేరాను.

****** అయిపోయింది *********

మరిన్ని కథలు

Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు