"అమ్మాగారూ..." అంటూ ఏదో చెప్పబోతున్న పనిమనిషి రంగి వైపు అన్యమనస్కంగా చూసింది రాధ ఏమిటన్నట్లు.
"అమ్మగారూ...మా అమ్మకి ఇంట్లో బాగుండలేదు. ఆస్పత్రికి తీసుకెళ్ళాలి. ఓ వెయ్యరూపాయలు ఉంటే సర్దండి అమ్మగారూ...ఎక్కడా అప్పుపుట్టలేదు. మీరెలాగైనా ఈ అవసరానికి ఆదుకోగలరని బోలెడు ఆశ పెట్టుకున్నాను." అంది రంగి.
అసలే అంతులేని ఆలోచనలతో సతమతమవుతున్న రాధ అప్పు మాట వింటూనే కసిరింది రంగిని, "ఇప్పటికే ఈ నెల జీతం కూడా ముందే తీసుకున్నావు. పోనిలే, లాక్‌డౌన్లో నీకెలా డబ్బులు దొరుకుతాయని ముందే ఇచ్చేసాను. అంతేకాక, నీ కొడుక్కి ఒంట్లో బాగులేదని ఓ రెండు వందల అప్పు పదిరోజుల కిందట తీసుకెళ్ళావు. మళ్ళీ ఇప్పుడు నీకు వెయ్యరూపాయల అప్పుకావాలా? ఎలా తీర్చగలవు? నేనివ్వలేను." అందామె కరాఖండీగా. ‘అసలే తన తండ్రి ఆపరేషన్‌కి అవసరమైన రెండులక్షల రూపాయలెలా సర్దుబాటు అవుతాయో అని బుర్ర బద్దలు కొట్టుకుంటూంటే దీని సొద ఒకటి.’ అనుకుంది రాధ విసుగ్గా.
ఆ విధమైన జవాబు ఊహించని రంగి గుడ్ల నీరు కక్కుకొని ఇంకేమనక పెరట్లోకెళ్ళి పనిలో పడింది. 'ఏంటో ఈ మనుషులు, అవసరానికి కూడా ఎవరూ సహాయం చేయరు. లాక్‌డౌన్ అమలులో ఉన్నా తన ఇల్లు ఆ దగ్గరేనని, అమ్మగారు అన్ని పనులు ఒక్కర్తీ చేసుకోలేదని తను వస్తోంది, కానీ తనకి అవసరం వచ్చినప్పుడు కొద్దిగా సహాయం చేయడానికి ఆమెకి మాత్రం మనసు రావడం లేదు.' అని మనసులో అనుకుంటూ అన్యమనస్కంగా పనులు చేస్తోంది. అయినా ఆమె మనసంతా తన తల్లి చుట్టే తిరుగుతోంది. రాధమ్మే ఇవ్వకపోతే, ఇంకెవర్ని అడుగుతుంది తను. తను పనిచేసే మిగతా ఇళ్ళన్నీ దూరంలో ఉన్నాయి. ఈ పరిస్థితిలో అక్కడకి తను వెళ్ళలేదు కూడా. రిక్షా నడుతున్న తన భర్త కూడా ఈ లాక్‌డౌన్ బాధితుడే. చిల్లిగవ్వ సంపాదనలేక యాభై రోజులు దాటింది. కాకపోతే ప్రభుత్వం ఇచ్చే సహాయం వల్ల ఆ మాత్రంగానైనా జరుగుతోంది. ఇప్పుడు వెయ్యరూపాయలైనా లేకపోతే ఒంటరిగా ఉన్న తన తల్లి పరిస్థితేంటి? వైద్యమైతే ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగాని, మందులకి డబ్బులు కావాలి కదా. ఇలా ఆలోచించుకుంటూ చేసే పనిలో నిమగ్నం కాలేకపోతోంది రంగి. మళ్ళీ రాధమ్మని బతిమాలితే ఆమె డబ్బులు ఇస్తోందేమోనని ఓ వైపు కాస్త ఆశ ఉన్నా ఆమె మళ్ళీ కసురుకుంటే ఏమనాలో తోచలేదు రంగికి.
అటు రాధ హాల్లో టివిముందు కూర్చుంది. ఆమె చూపు టివిపైనే ఉన్నా ఆమె మనసు ఆ పరిసరాల్లోనే లేదు. భర్త ప్రభాకర్ ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఆతృతగా ఎదురుచూస్తోంది ఆమె. తన తండ్రికి ఒంట్లో ఎలా ఉందోనని ఆందోళనగా ఉందామెకి. క్రితం రాత్రి రాధకి తమ్ముడు ఉదయనుండి ఫోన్ వచ్చింది, తండ్రికి గుండెనొప్పి వస్తే అస్పత్రిలో చేర్చారని. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసియూలో ఉంచారని, వెంటనే ఆపరేషన్ చేయాలని అందుకు రెండుమూడు లక్షల వరకూ అవుతుందని ఉదయ్ అన్నాడు. తనవద్ద అంత డబ్బులు లేవని, బావగారికి చెప్పి ఓ రెండు లక్షలైనా సర్దమని కూడా చెప్పాడు. ఈ విషయం వినగానే సహృదయుడైన ప్రభాకర్ వెంటనే స్పందించి ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నాడు.
తండ్రి హర్ట్ఎటాక్ గురించి విన్నప్పటి నుండి ఆమె మనసు కకావికలమైపోయింది. ఈ లాక్ డౌన్‌లో ఎటూ వెళ్ళలేని పరిస్థితి. తన తండ్రికి ఎలా ఉందోనన్న బాధతో పాటు ఇంకా డబ్బులు సర్దుబాటు కాలేదన్న బెంగకూడా ఉంది. చెమర్చిన కళ్ళని మాటిమాటికి తుడుచుకుంటోందామె. దుఃఖభారంతో ఆమె మనసు పరిపరివిధాల ఆలోచిస్తోంది. ఇప్పుడు తనెలాగూ అక్కడికి వెళ్ళలేదు, కనీసం తమ్ముడికి కావలసిన డబ్బులు పంపిస్తే ఈ గండం గడుస్తుంది. తండ్రి తమకు దక్కుతాడు. సమయానికి ప్రభాకర్‌వద్దకూడా అంత డబ్బులేదు. ఈ మధ్యనే తమ వద్ద ఉన్న డబ్బంతా కొనబోయే ఫ్లాట్‌కోసం బిల్డర్‌కి అడ్వాన్స్ ఇచ్చారు. మిగతా డబ్బులు బ్యాంక్ లోన్ తీసిఇంకా వాళ్ళకి ఇవ్వాలి. సరిగ్గా ఇదే సమయంలో కరోనా వైరస్ దేశమంతా విస్తరించడంవల్ల లాక్‌డౌన్ ప్రకటించారు. ప్రభాకర్‌వద్ద పాస్ ఉండబట్టి తన స్నేహితుల్ని కలిసి డబ్బు సర్దుబాటు చేయమని అర్ధించడం కోసంవెళ్ళాడు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు స్నేహితుల్ని కలిసాడు కానీ వాళ్ళందరూ తమ అశక్తత తెలియపర్చారు. ఈ లాక్‌డౌన్ వల్ల అందరికీ కష్టాలే కదా మరి! నిరుత్సాహంగా తిరిగివచ్చి, భోజనం చేసి మళ్ళీ బయలుదేరాడు. ఎవరివద్ద సమయానికి డబ్బులు అందుబాటులో లేవు. అయితే ప్రభాకర్‌కి ఇంకా బాగా తెలిసిన స్నేహితులు ఇంకో ముగ్గురు ఉన్నారు. అందుకే వాళ్ళని కలవడానికి మళ్ళీ బయలుదేరాడు. 'ఇంతమంది తెలిసినవాళ్ళూ, స్నేహితులూ ఉన్నా అవసరానికి ఆదుకొనే వాళ్ళే లేరు. అసలు ఎవరైనా డబ్బులు సర్దుతారా? డబ్బు సర్దుబాటు కాని పరిస్థితిలో ఏమిటి దారి?' అనుకుందామె దిగులుగా. తనకి తెలిసిన దేవుళ్ళందరికీ పేరుపేరునా మొక్కుకుంది రాధ ఈ గండం గట్టెక్కించమని.
ఈ లోపున తమ్ముడు మళ్ళీ ఫోన్ చేసాడు, డబ్బులు సర్దుబాటైందాని. రాధ నిట్టూర్చి, "తమ్ముడూ, బావగారు ఆ పనిమీదే ఉన్నారు. అతని ఫోన్ కోసమే ఎదురు చూస్తూన్నాను. ఎలాగైనా తనకి సహాయం చేయమని అడగడానికి తన స్నేహితులవద్దకు వెళ్ళారు. నువ్వు డబ్బుల గురించి బెంగ పెట్టుకోవద్దు. సాయంకాలంలోగా ఎలాగైనా డబ్బులు పంపిస్తానని అన్నారు. నాన్న పరిస్థితి ఇప్పుడెలా ఉంది?" అడిగిందామె.
"అక్కా! నాన్న ఇంకా ఐసియులోనే ఉన్నారు. డబ్బులు ఎంత త్వరగా కడితే అంత త్వరగా ఆపరేషన్ చేస్తామన్నారు డాక్టర్లు. రేపట్లోగా ఆపరేషన్ చేసి తీరాలన్నారు. నాకైతే ఇక్కడ ఎంత ప్రయత్నించినా అప్పు పుట్టలేదు, మీ మీదే నా భరోసా అంతా! డబ్బులు సర్దుబాటైతే వెంటనే కబురు చేయండి." అన్నాడు ఉదయ్.
ఉదయ్‌కైతే చెప్పగల్చింది కాని, అప్పు పుడుతుందో లేదోనని బెంగగా ఉందామెకి. డబ్బులు సర్దుబాటైతే ఫోన్ చేస్తానన్న ప్రభాకర్ వెళ్ళి అప్పుడే రెండుగంటలైనా ఇంకా ఏ కబురు చేయలేదు.
రంగి పెరట్లో అంట్లు తోమి, మిగతా పనులు పూర్తి చేసి అప్పుడే హాల్‌లోకి వచ్చింది ఊడవడానికి. సరిగ్గా అప్పుడే ప్రభాకర్‌వద్దనుండి ఫోన్ వచ్చింది. "హల్లో!...రాధా!...నా ఫ్రెండ్ సీతారాం, రాంబాబు మనకి కావలసిన డబ్బులు రెండులక్షలూ సర్దారు. ఇప్పుడే నేను బ్యాంక్‌కి వెళ్ళి ఉదయ్ ఖాతాలో డబ్బులు వేసి, ఫోన్ కూడా చేసాను. వెంటనే కావలసిన అపరేషన్‌కి ఏర్పాట్లు చేయమని చెప్పాను." అన్నాడు.
ఈ మాటలు వినగానే రాధకి ఒక్కసారి గుండెలమీద భారం దిగినట్లైంది. "భగవంతుని దయవల్ల అవసరానికి డబ్బులు సమకూరాయి. ఇప్పుడు ఇంకేం ఫర్వాలేదు. ఇక అన్నింటికి ఆ దేవుడే ఉన్నాడు. మీరు వెంటనే ఇంటికి రండి." అంది రాధ.
అప్పుడే పని ముగించి వెళ్ళబోతున్నదల్లా మళ్ళీ అడుగుతానా వద్దా అన్నట్లు సందిగ్ధంగా నిలబడింది రంగి. వాడిపోయి విచారంగా ఉన్న రంగి మొహం చూస్తూనే ఒక్కసారి జాలి కలిగింది రాధకి. వెంటనే తను ఆమెకి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. పాపం ఆమెకి కూడా తల్లికి ఒంట్లో బాగులేకపోవడం వల్ల డబ్బులు అవరమయ్యాయి. తనకైతే అవసరం లక్షల్లో ఉంది కాని, ఆమె అవసరం కేవలం వెయ్యి రూపాయలే! ఆ వెయ్యి రూపాయలే లేకపోతే ఆమె పరిస్థితి ఏమిటి? ఇదే ఒకేళ ప్రభాకర్‌కి కూడా అతని స్నేహితులు ఆ సహాయం చేయకపోతే తన తండ్రి ఆపరేషన్ ఆగిపోను కదా మరి. రంగికి వెయ్యి రూపాయలు ఇవ్వడం తనకి పెద్ద కష్టం కాదు కూడా! 'ఆ దేవుడి దయవల్ల తమ అవసరం తీరింది, అలాగే రంగి అవసరం కూడా తనే తీర్చగలదు, తీర్చాలి కూడా!' అని మనసులో అనుకుందామె.
ఆమెది కూడా తనలాంటి కష్టమే కదా. ఇందాక ఆమెని కసురుకున్నందుకు బాధపడింది రాధ.
ఓ నిర్ణయానికి వచ్చి, "రంగీ!...మీ అమ్మకి ఒంట్లో బాగులేదని వెయ్య రూపాయలు అడిగావు కదా,ఓ నిమిషం ఆగు డబ్బులు ఇస్తాను తీసుకెళుదువుగాని." అని వెంటనే లోపలికెళ్ళి డబ్బులు తీసుకువచ్చి ఆమె చేతిలో పెట్టింది.
"జాగ్రత్త! వెంటనే మీ అమ్మని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళు. మళ్ళీ ఏమైనా అవసరమైతే నన్ను అడుగు." అందామె.
రంగి డబ్బులు చాలా సంతోషంగా తీసుకొని కృతఙతగా రాధకి దండంపెడుతూ, "మీరు చల్లగా ఉండాలి అమ్మా!" అని మనస్పూర్తిగా అంది.