ఏది నైతికం - సువర్ణ మారెళ్ళ

which is the moral?

ప్రతి వీధికి ,వాడకి ప్రైవేట్ స్కూల్స్ ,కాలేజెస్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ఆ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో వేల సంఖ్యలో విద్యార్థులు ఉండడం ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయిన సుధ గారి చలవే అని అంటూ ఉంటారు అందరు.

అంతేకాదు రిటైర్మెంట్ కి దగ్గర పడుతున్నా కూడా సడలని ఆమె నిజాయితీ , వృత్తి మీద ఆమెకు ఉన్న నిబద్ధత, సహోద్యోగులు ను ప్రోత్సహించడం, ఎదుటి వారి లోపాలను, తప్పులను గుర్తించి

""నొప్పించక తానొవ్వక ""అనే రీతిలో వాటిని సరి చేసే తీరు ఇలాంటి ఎన్నో సుగుణాల వల్ల కాలేజీ లోనే కాకుండా వ్యక్తిగతంగా కూడా అందరికి ఆమె అంటే చాలా గౌరవం.

**** ***** ****

సుధ సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చి కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ కప్పుతో సోఫాలో కూర్చుంటూ ఉండగా ఆమె ఫోన్ మోగింది.

ఫోన్ చేసింది తన "రికార్డు అసిస్టెంట్" గీత ఈ టైములో ఈ అమ్మాయి ఎందుకు చేసింది అబ్బా బహుశా మెడికల్ లీవ్ ఎక్స్టెన్షన్ చేయడానికి అయ్యుంటుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది.

" మేడం మీరు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారా!! మిమ్మల్ని కలవడానికి వద్దాము అనుకుంటున్నాను "

అని అడిగింది గీత.

"ఆ ఇప్పుడు ఇంట్లోనే ఉంటానమ్మా తప్పకుండా రా" అని ఫోన్ పెట్టేసింది సుధ.

గీత ఫోన్ పెట్టగానే ఒక్కసారి గా వారం రోజుల క్రితం జరిగిందంతా కళ్ళ ముందు కదలాడినది సుధ కి.

*****. ***** *****

ఉదయం 10:00, 10:30 కావస్తోంది. కాలేజ్ లో క్లాసెస్ మొదలు అవ్వడం వలన పిల్లలు గోల పెద్ద గా వినపడటం లేదు.

నిశ్శబ్దం గా ఉన్న తన రూం లో ప్రిన్సిపల్ సుధ ఎదో పెండింగ్ ఫైల్ చూసుకుంటోంది.

ఈ లోగా

""ఎక్స్క్యూజ్ మీ మేడం""

అంటూ స్టాఫ్ సెక్రటరీ ,మరో ఇద్దరు స్టాఫ్ నీ తీసుకుని లోపలకు వచ్చారు.రావడం తోనే

" మేడం వారం నుంచి మీతో చెపుతున్న విషయమే మన స్టాఫ్ అందరూ గీత విషయంలో ఏమి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. మీరు ఈ రోజు టైం చెబితే సర్క్యులర్ పంపిస్తాను. ".

అన్నారు.

ఇదంతా వింటున్న సుధ ఒక్క క్షణం ఆలోచించి,ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా తలపంకించి

""సరే అయితే సాయంత్రం 3:40 కి పెడదాము. పిల్లలకి క్లాసెస్ మిస్ అవకుండా ఉంటాయి.""

అని చెప్పింది.

వాళ్ళు సరే అని చెప్పి రూం నుంచి బయటకు వెళ్ళారు. సుధ కి నెల రోజుల నుండి జరుగుతున్న సంఘటనలు గుర్తుకు వస్తున్నాయి.

"గీత " పదవ తరగతి పూర్తికాగానే మేనమామ నీ పెళ్లి చేసుకొని ఇరవై ఏళ్ల కూడా నిండకుండానే ఇద్దరు పిల్లలు కు తల్లి అయ్యింది. పాతికేళ్ళు నిండకుండానే భర్త పోవడం తో "డిసీజ్డ్ కోటా "లో రికార్డ్ అసిస్టెంట్ గా చేరి కుటుంబ బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకుని బతుకు బండిని నడిపిస్తోంది.

ఆమె ఇద్దరు ఆడపిల్లలకు తల్లి అని ఎవరికయినా చెబితే గాని తెలియనంత అందం ,పసిడి మేని ఛాయ ,తీర్చి దిద్దినట్టు ఉండే శరీర సౌస్టవం, బ్యూటీ పార్లర్లకు తిరిగే అవసరం లేని సహజ సౌందర్యం ఆమె సొంతం.

ఈ మధ్యనే తన ఆడపడుచు కి పెళ్లి చేసి అత్తారింటికి పంపింది . ఇంత చిన్న వయసులో ఆమెకు ఇంత పెద్ద కష్టం వచ్చింది కదా!!! అని అప్పుడప్పుడు చాలా జాలి వేసినా, ఆమె నిబ్బరత కు,కుటుంబం పై చూపే శ్రద్ధ కు చాలా ముచ్చట వేస్తుంది తనకు.

అలాంటిది ఈ మధ్య " హెడ్ క్లర్క్ రమణ" తో చనువు గా మెలుగుతోందంటూ కాలేజ్ లో అందరూ చెవులు కొరుక్కోవడం తన చెవి వరకుకూడ వచ్చింది.

ఇంతలో ప్యూన్ లోపలికి వచ్చి "స్టాఫ్ రూమ్ లో స్టాఫ్ అందరూ వచ్చేశారు మేడం ,మీకోసం చూస్తున్నారు మేడం"

అని చెప్పి నించున్నాడు.

సుధ వాచ్ లో టైం చూసుకుని 3:40 అవడం తో "వస్తున్నానని చెప్పు" అని ప్యూన్ కి చెప్పి, తను చేస్తున్న పనిని ఆపి స్టాఫ్ రూమ్ కి బయలుదేరింది.

స్టాఫ్ రూమ్ లో తనకు కేటాయించిన సీట్ లో కూర్చుని "మొదలు పెట్టండి "అన్నట్టు స్టాఫ్ సెక్రటరీ శర్మ గారి పైపు చూసింది సుధ.

శర్మ గారు తనదయిన ధోరణి లో అందరినీ ఉద్దేశించి మాట్లాడసాగారు.

"' మనది విద్యాసంస్థ ఇక్కడ మనం పిల్లలకు పాఠాలు చెప్పడం తో మన బాధ్యత తీరిపోదు. మనం విలువల తో కూడిన జీవితాన్ని పాటిస్తూ వాళ్ళని కూడా మంచి విలువలు తో కూడిన నడవడిక అలవడేల ప్రోత్సహించాలి .అలాంటిది గీత ఒక "విడో" అయివుండి,ఈ జాబ్ తనకు డిసీజీడ్ కోట లో వచ్చిన సంగతి కూడా విస్మరించి, ఈ విధం గా "అనైతికం" గా ప్రవర్తించడం చాలా శోచనీయం... ఇది నా అభిప్రాయమే కాదు మన మిగిలిన స్టాఫ్ కూడా అదే భావిస్తున్నారు .అందువలన మేడం గారు ఇది పరిగణలోకి తీసుకొని పై అధికారులకు ఫిర్యాదు చేసి ఆమె పై చర్యలు తీసుకోవలసిందిగా కోరుకుంటున్నాను. అంతే కాదు ఈ విషయం లో మన అందరి అభిప్రాయం ఒకటే అయినప్పటికీ మీ మీ అభిప్రాయాలను వారికి తెలియచేయండి."

అని చెప్పి అతను కూర్చున్నాడు.

ఇదంతా వింటున్న సుధకి "దెయ్యాలు వేదాలు వల్లించినట్లు" అనిపించింది . అవును మరి కెమిస్ట్రీ అధ్యాపకులు గా పనిచేస్తూ లాబ్ ఎగ్జామ్ పాస్ అవడానికి విద్యార్థుల వద్ద డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణ ( ఆరోపణ ఏమిటి అది అక్షర సత్యం) లో 6నెలలు సస్పెండ్ అయ్యి అడ్డమైన వారి కాళ్లు పట్టుకొని, రెండు లక్షలు సమర్పించుకుని ఈ మధ్యే ఇక్కడ పోస్టింగ్ వేయించుకున్నాడు.

మౌనంగా అంతా విన్న సుధ ఒక నిట్టూర్పు విడిచి తరువాత మాట్లాడేది ఎవరు అన్నట్టు చూసింది.

ఇంతలో మాథ్స్ అధ్యాపకులు గా ఉన్న "రూప" నించుని అందరినీ ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టింది.

"" శర్మ గారు అన్నట్టు మన నడవడిక ను బట్టే మన విద్యార్ధులు లు వారి ప్రవర్తనను అలవరుచు కుంటారు. అందువలన మనం కాలేజ్ లో చాలా జాగ్రత్తగా మెలగాలి. అలాంటిది టీన్ ఏజ్ లో ఉన్న పిల్లలు ఆమెను (గీత) చూసి ఆ ప్రవర్తనని అలవడుచుకుంటే మన వృత్తి కే చిన్నతనము కదా!!! కావున మేడం గారు ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాల్సింది గా కోరుచున్నాను .""

ఆమె కూర్చుంది.

రూప చెప్పిన ప్రతి పదం స్వచ్ఛమైన నిజం.

పిల్లలు అందునా కౌమార దశ నుంచి అప్పుడే యవ్వనం లోనికి అడుగు పెడుతున్న ఈ పిల్లలు చాలా వేగిరంగా ప్రలోభాలకు లోనయ్యే అవకాశం లేకపోలేదు.

వాళ్ళు మనం చెప్పే నీతి పాఠాల కన్నా మనం ప్రవర్తించే తీరును ఎక్కవగా ఆలవరుచు కుంటారు.

కానీ ఆ మాటలు ఆమె నోటంట వినడం చాలా హాస్యాస్పదం గా తోచింది సుధకు.

"రూప " తన పేరుకు దగ్గట్టుగా రుపానికే ఎక్కువ విలువను ఇస్తూ,ఏదో పెళ్ళికో , పెరంటానికో వెలుతున్నట్లుగ మాచింగ్ నగలు,అలంకరణలు వేసుకుంటూ కాలేజ్ లో ఉన్నంత సేపు పిల్లలతో ,స్టాఫ్ తో ఆ విషయాలే చర్చించు కుంటూ ఉంటుంది. పోని అది ఆమె స్వవిషయం అనుకుందాము అనుకున్నా, క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్పే సమయం కన్నా పిల్లల చేత నైల్ ఆర్ట్స్,రకరకాల జడలు వేయించుకునే సమయం ఎక్కువ ఉంటుంది. ఆ వయసు పిల్లలకు సహజ సిద్దంగా ఉండే పరస్పర ఆకర్షణ వలలో పడకుండా చూసుకుంటూ,, బహ్యాఆకర్షన కన్నా ,వ్యక్తిత్వం గొప్పదని తెలిసే లాగ "గురు స్థానం" లో ఉన్న మనం ప్రవర్తించాలి కదా !! కానీ రూప ప్రవర్తన దానికి విరుద్దం గా ఆకర్షణ కి ప్రలోభించేలా ఉన్నది.

సుధ ఈ ఆలోచనలో వుండగానే కొత్తగా కంప్యూటర్ అధ్యాపకులుగా కాలేజ్ లో చేరిన

'హిమజ' మాట్లాడుతూ

""అందరూ గీత మీదనే ఆరోపణ చెయ్యడం నాకు నచ్చడం లేదు. గీత ఈ పరిస్థితికి రమణ కారణం కాదా?? భర్త కి దూరమైన ఆమె నిస్సహాయతను అడ్డుపెట్టుకుని ఆమెని ప్రలోభ పెట్టాడు. అతనిని పిలిచి గట్టి వార్నింగ్ ఇచ్చి సహా ఉద్యోగిని మీద "సెక్సువల్ హెరాస్ మెంట్" కింద జైల్ లో పెడతామని చెబితే అంతా సర్దుకుంటుందని నా అభిప్రాయం.""

అని చెప్పి కూర్చుంది.

సుధ అందరి అభిప్రాయాలు విన్న మీదట ఒక్కసారి అందరి ముఖాలని తేరిపార చూసింది. మొత్తం లో 60శాతం మంది గీత మీద జాలి తో ఉంటే,30 శాతం మంది తటస్థంగా ఉన్నారు,కేవలం 10శాతం మంది మాత్రం ఆమె మీద చర్య తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. అది కూడా చాలా వరకు స్వ ప్రయోజనాల కోసమే అని సుధ కి అర్థమయ్యింది.

ఆమె ఏదో ఖచ్చతమైన నిర్ణయం తీసుకున్న దానిలా గట్టిగా గాలి పీల్చుకుని వదిలి మాట్లాడడం మొదలు పెట్టింది.

"" అందరి అభిప్రాయాలు,ఆలోచనలు విన్న తరువాత నేను మాట్లాడుదలుచుకున్నది ఏమంటే

గీత చేసిన పని నైతిక మా, అనైతకమా తేల్చి చెప్పే అవసరం మనకి లేదని నా అభిప్రాయం. ఆమె చేసే చర్య పూర్తిగా ఆమె వ్యక్తిగతం. తన జీతం మీదే ఆధారపడే బ్రతికే ఆమె కుటుంబ సభ్యులు కోసం తనకు గల డిసీజెడ్ కోటాలో వచ్చిన ఈ ఉద్యోగం ఆమెకి ఎంతో అవసరం. కానీ అదే ఆమె కి వేరొక వివాహం చేసుకునేందుకు అడ్డంకిగా మారింది. అందుచేతనే నేమో ఆమె ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు.

అయినా వాటి కారణాలు,విశ్లేషణలు ఇక్కడ అప్రస్తుతం.

అయినప్పటికీ శర్మగారు,రూప అన్నట్లుగా మనది విద్యాసంస్థ అయినందు వలన మనం అందరి కంటే ఎక్కువ అప్రమత్తం గా మెలగాలి. కానీ గీత,రమణ ఒకే బండి మీద వెళ్ళడం,కలిసి భోజనం చెయ్యడం మినహా ఎటువంటి అసభ్యకర ప్రవర్తన చూపట్లేదు.

మన కంప్యూటర్ అధ్యాపకులు శ్రీనివాస్, రమ లంచ్ టైమ్ లో లాబ్ లోకి ఎవరని రానివ్వకుండా కలసి భోజనం చేస్తున్నారు కాదా !!మరి వాళ్ళు భార్యాభర్తలు అయినందు వలన మీకు అది తప్పుగా తోచలేదు.. భార్యాభర్తలు అయినా కూడా కాలేజ్ పరం గా వారు అధ్యాపకులు గానే ప్రవర్తించ వలసి వస్తుంది కదా!!

అదే మన సమస్య అయితే అందరం స్టాఫ్ రూమ్ లోనే తినాలి అని రూల్ పెట్టుకుందాం. అంతే గాని ఇలా చెయ్యడం నాకు సమంజసం గా అనిపించలేదు.

ఇక పోతే అమ్మా!! "హిమాజ " ఇంత చిన్న వయసులోనే నువ్వు అలవరుచుకున్న అభ్యుదయ భావాలు,ఉన్నతమైన లక్ష్యాలు నాకు చాలా ముచ్చటగా అనిపిస్తోంది. ఇప్పుడు గీత విషయం లో కూడా అందరూ గీత ని మాత్రమే ఆరోపిస్తున్న సమయంలో నువ్వు నీ ఆలోచన రమణ మీదకు కూడా వెళ్ళడం అభినందనీయం. కానీ "హిమజా"!! ""పిడుగుకి, బియ్యానికి ఒకటే మత్రం కాదు!!"" అన్నట్లుగా "గీత,రమణ"ల విషయంలో చట్టాలు ను ఉపయోగించడం ఏ విధంగాను సరైన పద్దతి కాదు.

అయినా మనం స్త్రీ అభ్యుదయం కోసం,భద్రత కోసం మనం ఎంతో కష్టపడి తెచ్చుకున్న చట్టాలను స్త్రీ సంక్షేమానికి ఉపయోగపడేలా చూసుకోవాలి తప్ప, పురుషులు మీద " కక్ష సాధింపు " చర్యలుగా ఉపయోగించుకోకూడదు అనేది నా అభిప్రాయం.

అయినా గీత,రమణల విషయం లో వారు వారి ఇద్దరి సమ్మతం తో వాళ్ళు ఆవిధంగా మెలుగు చున్నారు. అందులో ఒకరిని తప్పు పట్టడం సరైనది కాదు. అది గీత నయినా,రమణ నయినా!!

అయినా "పెళ్లి " అనే భాద్యతలను స్వీకరించ లేక సహజీవనం పేరుతో తప్పించుకుంటున్నా యువతను సమర్ధిస్తున్న ఈ సమాజం .తన కుటుంబబాధ్యత ను విస్మరించి లేక ,వేరే పెళ్లి చేసుకునే పరిస్తితి లేక, తను రమణ తో సహజీవనం చేయడాన్ని ఎందుకు మనమందరం అనైతికం గా తీసుకుంటున్నాం? ఇది ఎంత వరకు సమంజసం. ఇది వారి స్వవిషయం,ఇందులో అన్యులమయిన మనం కల్పించు కోకుండా ఉంటేనే మంచిది.

ఈ విషయం ఇంకా ఎవరు మాట్లాడడానికి వీలులేదు.

అని చెప్పి మీటింగ్ ముగించింది సుధ...

****** ******* ****** *****

ఈ ఆలోచనల నుండి బయటకి రప్పిస్తూ. కాలింగ్ బెల్ మ్రోగింది. గీత అయిఉంటుంది అనుకుంటూ సుధ తలుపు తీసింది.

"నమస్తే మేడం" గారు అంటూ లోపలికి వచ్చింది గీత.

కుర్చీలో కూర్చుని ఇరువురు, ఒకరి క్షేమ సమాచారాలు ఒకరు తెలుసుకున్న తరువాత ఒక 10 నిమషాలు వాళ్ళ మధ్య నిశ్శబ్దం రాజ్యమేలింది.

మెల్లిగా గీత " చాలా థాంక్స్ "మేడం గారు. మీరు నన్ను సమర్థించి నన్ను, నా ఉద్యోగాన్ని కాపాడారు.

"ఇరవై ఏళ్ల వయసు నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాను, ఎన్నో అవమానాలను భరించాను. అప్పుడు ఏమయింది? ఈ సమాజం నన్ను ఇంకొంచం ఇబ్బంది పెట్టింది. అలాంటి ఈ సమాజం తో నాకు పనిలేదు మేడంగారు.

రమణ చాలా మంచి వాడు, అన్ని విషయాల్లోనూ నాకు అండగా ఉంటాడు, నా బాధ్యతల్లో పాలు పంచు కుంటున్నాడు. పిల్లలని ప్రేమగాచూస్తున్నాడు.

ఈ సమాజానికి భయపడి నేను అతన్ని ఎందుకు వదులుకోవాలి మేడం .అందుకే నేను చేస్తున్నది తప్పయినా, ఒప్పయినా నేను ఈ నిర్ణయం తీసుకున్నాను."

అంటూ దుఃఖం, ఆవేశము మిళితమై ఒక సన్నని జీరతో తను చెప్పదలుచుకున్నది అంతా చెప్పి గీత మౌనంగా ఉండి పోయింది.

గీతని ఒక నిమషం అలాగే ఉండనిచ్చి , తరువాత సుధ చెప్పటం మొదలు పెట్టింది .

""అమ్మా గీతా!! నువ్వు అన్న ప్రతీది నిజం కానీ !! నువ్వు అంటున్న ఆ సమాజం అంటే ఏమిటి ?

మన ఉన్నతి ని కోరుకునే మన తల్లితండ్రులు, అత్తమామలు, మనతో ఆనందాలను, ఆప్యాయతలను పంచుకోవాలనుకునే మన తోబుట్టువులు,

మనల్ని అనుసరించి,మన ద్వారా వారి భవిష్యత్తుకు బాటలు వేసుకొనే మన బిడ్డలు. ఇదే సమాజం అంటే!!

అంతే కాదు ప్రతి ఒక్కరి దృష్టి లో నైతికం,అనైతికం అనేది భిన్నం గా ఉంటుంది. ఒకరికి నైతికంగా ఉన్నది వేరొకరికి అనైతికం గా తోస్తుంది.

ఏది నైతికం, ఏది అనైతికం అనేది తెలుసుకోలేని దానివి కాదు నువ్వు ..ఆ నమ్మకం నాకు ఉంది గీత """

అని సుధ ముగించింది.

గీత 'సుధ మాటలు కు బాగా ప్రభావితం అయ్యి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా చివ్వున లేచి సుధ దగ్గర సెలవు తీసుకుని బయటకు వెళ్ళింది ' .

******* ******** *******

ఆ సాయంత్రం అందరిని ఇంట్లో సమావేశ పరచింది. అత్తమామలు, తల్లితండ్రులు, ఆడపడుచు, ఆడపడుచు భర్త, పిల్లలు అందరూ కూర్చుని ఉన్నారు. గీత రమణకి ఫోన్ చేసి పిలిచింది .

అందరి సమక్షలో రమణని తన "జీవిత సహచరుడు" గా పరిచయం చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించింది. అంతే కాకుండా తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు, అవసరాలు వివరించింది, వ్యతిరేకించిన పెద్దలను ఎన్నో విధాలుగా నచ్చచెప్పి ఒప్పించింది. ఇప్పుడిప్పుడే విషయ జ్ఞానం వస్తున్న తన పిల్లలకు తన మీద "అయిష్టం,అపోహ " రాకుండా తన నిర్ణయాన్ని వారికి అర్థమయ్యే రీతిలో వివరించింది.

మొత్తానికి గీత "సుధ "చెప్పిన విధంగా తన పరిధి లో ఉన్న తన సమాజాన్ని ఒప్పించి తను ఇన్నాళ్లు "అనైతికం" గా ప్రవర్తిస్తున్నాను అనే "అపరాధనా భావం" నుండి బయటపడి తన జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు సన్నద్ధం అయ్యింది.

మరిన్ని కథలు

Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE