వలస జీవితాలు - డాక్టర్ చివుకుల పద్మజ

valasa jeevithalu

రాత్రి ఏడు గంటలు. కువైట్ లోని ఒక షెల్టర్ ఇండియన్ వర్కర్స్ తో నిండి పోయి వుంది. మరునాడు తెల్లవారుఝాము న ఇండియా కి ఫ్లైట్ బయలుదేరుతుంది. రకరకాల భాషల వాళ్ళతో కోలాహలం గా వుంది. ఎక్కువ మంది స్వదేశానికి వెళ్తున్నామనే ఆనందం లో వున్నారు. కౌంటర్ దగ్గర బ్రెడ్ ఇస్తున్నారు అందరికీ. వరుసలో నిలబడే ఓపిక లేక ఒక పక్కగా కూర్చుని వుంది పార్వతి .

"మీరు తెలుగు వాళ్ళా?". పలకరించాడు ఒక అతను. "అవునయ్యా" సమాధానం చెప్పింది పార్వతి.

"నీరసం గా ఉన్నట్లున్నారు, మీకు బ్రెడ్ నేను తెచ్చి ఇస్తాను వుండండి" అని లైన్ లో కి వెళ్ళాడు.

కాస్సేపటికి బ్రెడ్ తీసుకుని వచ్చి పార్వతి కి ఇచ్చి పక్కనే కూర్చున్నాడు. "చూడగానే తెలుగు వాళ్ళనుకున్నాను. మా అమ్మ లాగ అనిపిస్తున్నారు. " అభిమానం గా అన్నాడు.

"అలాగా బాబూ" నవ్వి "నీ పేరేంటి" అడిగింది పార్వతి. "నా పేరు బాలాజీ, మీ పేరు?" అడిగాడు అతను. తన పరిచయం చేసుకుంది పార్వతి.

బ్రెడ్ తిని మంచినీళ్లు తాగేసరిగి సేద తీరినట్లయింది పార్వతి కి. "నీది వీసా అయిపోయిందా బాబూ" కుతూహలం గా అడిగింది.

బాలాజీ దిగాలు గా "అవునమ్మా..ఈ అవకాశం వచ్చి స్వంత ఊరికి వెళ్తున్నందుకు సంతోషపడాలో లేక కష్టమో నిష్ఠురమో ఇక్కడే ఉంటే వచ్చే డబ్బు గురించి బాధ పడాలో అర్ధం కావట్లేదు" అన్నాడు.

"నీది ఎలాంటి పరిస్థితో మరి. దాని బట్టే ఉంటుంది మన ఆలోచన" అంది పార్వతి. తానూ కొంచెం బ్రెడ్ తిని గోడకి చారగిల పడ్డాడు బాలాజీ.

***

అటు పట్నమూ కాని, ఇటు పల్లెటూరు కాని వూరు బాలాజీ వాళ్ళది. ఇద్దరు అన్నతమ్ములు. తల్లి, తండ్రి వ్యవసాయపు పనులు చేసేవారు. అన్నాతమ్ములిద్దరు గవర్నమెంట్ స్కూల్ కి వెళ్తూ, సెలవు రోజుల్లో కూలి కి వెళ్లే వారు.

అన్న కృష్ణ ఒక మోస్తరు గా చదివే వాడు కాని బాలాజీ కి మాత్రం చదువు అంతగా అబ్బలేదు. స్కూల్ ఎగ్గొట్టి ఫ్రెండ్ అబ్దుల్లా తో కల్సి తిరుగుతుండేవాడు. అబ్దుల్లా వాళ్ళకు మెకానిక్ షెడ్ వుంది.

ఒకరోజు షెడ్ లో మెకానిక్ పని చేస్తూ వాళ్ళ నాన్న కంట పడ్డాడు బాలాజీ.

"సదువుకో రా అని బడికి పంపితే, ఎగ్గొట్టి బళ్ళు బాగు చేస్తావా.. బళ్ళు " చింత బరికె తో బాలాజీ వీపు చిట్లగొట్టాడు తండ్రి. "ఊరుకో. . పిల్లాణ్ణి గొడ్డును బాదినట్టు బాదుతున్నావ్" అడ్డంపడింది తల్లి.

"బాదక, ముద్దెట్టుకోమంటావా.. మన బతుకులు ఇట్టా ఏడ్సినాయి. వాళ్ళన్నా సదివి ఉజ్జోగాలు సేసుకుంటారని కదా" తల కొట్టుకుంటూ అన్నాడు తండ్రి.

తండ్రి కొట్టిన దెబ్బలు ఇంకా మొండితనం పెంచాయి బాలాజీ లో. తెల్లవారేసరికి బట్టలు ఒక సంచి లో కూరుకుని ఇంటి నుండి పారిపోయాడు బాలాజీ.

ఘొల్లుమన్నారు తల్లీ, తండ్రి. కృష్ణ తన స్నేహితులని వేసుకుని ఊరంతా వెతికి వచ్చాడు, కాని లాభం లేదు.

ఆ పోవటం, పోవటం ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు కానీ అప్పటికి జరగాల్సింది జరిగిపోయింది.

కన్న కొడుకు తనవల్ల పారిపోయాడని దిగులుతో తండ్రి చనిపోతే, కొడుకు, భర్త దూరమయ్యారనే వేదన తో తల్లి కన్నుమూసింది.

తల్లి, తండ్రి పోయాక కృష్ణ సిమెంట్ ఫ్యాక్టరీ లో వుద్యోగం సంపాదించాడు. తన తోటి కార్మికుని కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు.

కృష్ణ ను పట్టుకుని కుమిలి, కుమిలి ఏడ్చాడు బాలాజీ. తమ్ముడిని ఊరడిస్తూ "ఊరుకోరా..ఐపోయిందేదో అయిపోయింది. ఇప్పుడైనా వచ్చావు" అన్నాడు కృష్ణ.

ఈ ఐదేళ్లు రక రకాల చోట్ల తిరిగాడు బాలాజీ. చివరికి ఒక కార్ షెడ్ లో పనికి కుదిరి, కొంచెం స్థిమిత పడి అప్పుడు ఊరికి వచ్చాడు.

"పాపం. నాన్న మనం బాగా చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేసి బాగా డబ్బు సంపాదించాలి. తన దరిద్రం మనం పడకూడదు అనుకునేవాడు రా. నాకు అంతంత మాత్రం చదువు వచ్చింది, నీకదీ లేదు" ఆ రాత్రి బయట మంచాలు వేసుకుని పడుకుంటూ అన్నాడు కృష్ణ.

"అవును కదా, ఈ వున్న గుడిసె నే కాస్త గట్టి గా అయినా కట్టాలి అనే వాడు" తాను గుర్తు చేసుకుంటూ అన్నాడు బాలాజీ.

ఇప్పుడు ఎలాగూ చదువుకోలేం, కనీసం కాస్త డబ్బు సంపాదించి ఇల్లయినా కడితే బాగుండు. తాను పని చేసే చోట ఒకళ్ళిద్దరు గల్ఫ్ దేశాలకు వెళ్లారు డ్రైవర్లు గా. బాగా సంపాదించారని చెప్పుకునేవాళ్ళు తన తోటి వాళ్ళు. ఆలోచిస్తున్నాడు బాలాజీ. అనుకున్నదే తడవు అన్నతో సంప్రదించి వెంటనే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అదే ఏజెంట్ ను పట్టుకుని మొత్తానికి కువైట్ వచ్చాడు డ్రైవర్ గా. మధ్య మధ్య లో అన్నకు డబ్బు పంపిస్తూ ఇల్లు కట్టించమన్నాడు. కొన్నేళ్ల తరువాత నెల సెలవు మీద ఇంటికి వచ్చాడు. కొత్త ఇల్లు, ఇద్దరు ముద్దులొలికే పిల్లలు, అన్న వదినల సంసారం చూసి సంతోషపడ్డాడు. చుట్టూ పక్కల అందరూ మీ తమ్ముడు బాగానే సంపాదిస్తున్నాడు కదా, ఇంక పెళ్లి చేయమని కృష్ణ కు సలహా ఇవ్వసాగారు.

"చాలులెండి, వాళ్ళ మాట వింటే అంతే ఇంక.. రేపు పొద్దున్న పెళ్ళాం వస్తే మనకు రూపాయి రాలుతుందా?" ఎదో మాయ పుచ్చండి సలహా ఇచ్చింది కృష్ణ భార్య.

ఈ మధ్య కృష్ణ లో మార్పు వచ్చింది. ఇంతకు ముందు తమ్ముడే అన్న అభిమానం ఉండేది.. కురుస్తున్న కాసుల వర్షం లో తడిసాక అది కాస్త స్వార్థం గా మారిపోయింది. పైగా ఎదుగు బొదుగూ లేని వుద్యోగం కూడా దీనికి తోడయింది.

పెళ్లి చేసుకుని, భార్య ను ఇక్కడ ఉంచి మరికొన్నాళ్లు కువైట్ లో గడించాక తిరిగి వచ్చేసి ఏదైనా సొంతగా మొదలు పెట్టచ్చు అనుకుని సంబంధాలు చూడమన్నాడు బాలాజీ. ఒకరోజు తాను ఇదివరలో పని చేసిన షెడ్ కి పోయి వచ్చేసరికి చీకటి పడింది. తోడు కరెంటు కూడా పోయింది. చిన్నగా నడుస్తూ ఇంటి ముందుకి రాగానే, ఆరుబయట కూర్చుని అన్న వదినలు మాట్లాడుకుంటున్న మాటలు వినపడ్డాయి. తన పేరు వినపడగానే ఆగిపోయేడు.

"ఏమైంది బాలాజీ సంబంధం" అడిగింది వదిన. "ఇప్పుడే చేసుకోనంటున్నాడు మా తమ్ముడు అని చెప్పాను. ప్రస్తుతానికి తప్పినట్లే. మిగిలినవి కూడా వాడిని చూడమని, వెనక ఎదో ఒకటి అడ్డం వేస్తాను. ఇంతలోకి వాడు వెళ్లే టైం వస్తుంది కనక, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం, ఇహ ఎన్నేళ్లకో కదా" తీరుబడి గా చెప్పాడు కృష్ణ.

"మరీ. పిల్లలకి రేపు మంచి భవిష్యత్తు కావాలంటే మీ సంపాదనేం చాలుతుంది. యింకా నయం, ఇల్లు మీ పేరనే పెట్టారు. ఎలాగోలా మీ తమ్ముడి చేత సంతకం పెట్టించండి, మళ్ళీ గొడవలు కాకుండా" నయగారం గా చెప్తోంది వదిన.

నిర్ఘాంతపోయేడు బాలాజీ... తనకు ఈ లోకంలో మిగిలిన ఏకైక సంబంధం అన్న. ఇలా మారిపోయాడా? వదిన పరాయిది. కనీసం స్వంత అన్న క్కూడా తాను కాకుండా పోయేడా? కేవలం డబ్బేనా జీవితానికి పరమార్ధం?

ఇంక క్షణం ఉండ బుద్ధి కాలేదు.

"ఇప్పుడు ఇంక సంబంధాలు వద్దన్నయ్య, పై సారి చూస్తాను" మర్నాడు ఏం బయటపడకుండా చెప్పి తిరిగి కువైట్ వచ్చేశాడు.

***

"ఎన్నింటికి వెళ్ళాలి బాబూ ఇక్కడి నుంచి" అడిగింది పార్వతి. బాలాజీ ఆలోచనల నుంచి తేరుకుని "12 గంటలకి బస్సు వస్తుందండి" సమాధానం చెప్పాడు. పార్వతి ఫోన్ తీసి భర్త కు కాల్ చేసి ఎట్లా వచ్చేది వివరం చెప్పింది.

అది గమనించి "మీ కోసం చూసే వాళ్ళు ఉన్నారా అమ్మా" అడిగాడు బాలాజీ.

"భర్త, ఇద్దరు కూతుళ్లు వున్నారయ్యా. నేనిక్కడి కొచ్చి 20 ఏళ్లయింది. ఇన్నేళ్ళుగా రమ్మని బతిమాలుతూనే వున్నారు, మొండిదాన్ని నేనే వెళ్ళలేదు" నిట్టూరుస్తూ చెప్పింది పార్వతి.

"అవునా. 20 ఏళ్ల బట్టి వెళ్లలేదా?" ఆశ్చర్యంగా అడిగాడు బాలాజీ.

ఎన్ని సంవత్సరాలనుండి పళ్ళ బిగువున ఇక్కడ ఉండి పోయిందో ఒక్కసారిగా ఏడ్చింది పార్వతి.

***

పార్వతి భర్త నర్సింహ ఒక ఐస్ ఫ్యాక్టరీ లో వాచ్ మాన్ గా చేసేవాడు. మరీ లేని కుటుంబం కాదు, ఉన్నంతలో హాయి గా గడిచిపోతోంది తన సంసారం. ఇద్దరు ఆడపిల్లలు. రెండోది నెలల పిల్ల గా వున్నప్పుడు, ఒకరోజు నర్సింహ నైట్ డ్యూటీ దిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఏదో గుద్దేసింది. టైర్ కాలు మీదగా వెళ్ళటంతో కాలు పూర్తిగా తీసేసారు. వుద్యోగం పెర్మనెంట్ ది కాకపోవటం వల్ల ఏదో కొద్ది మాత్రం డబ్బు ఇచ్చి చేతులు దులుపుకుంది కంపెనీ. కాలి గాయం తగ్గటానికి ఆరు నెలలు పట్టింది. తగ్గాక, కర్రతో నడవాలంటే కష్టం అయిపోయింది నర్సింహకు. ఏ వుద్యోగం చేయలేడు, పార్వతి కా పెద్ద చదువు లేదు. చాలా ఇబ్బందుల్లో పడింది చక్కటి కుటుంబం కాస్తా. అభిమానం చంపుకుని కాస్త తెలిసిన వాళ్ళ ఇళ్లలో పని చేయ సాగింది పార్వతి.

పార్వతి కష్టాన్ని చూసిన వీధి చివర వుండే శాంత "ఇక్కడ ఎన్నాళ్ళు ఇలా పాచి పని చేసి కుటుంబాన్ని సాకుతావు. మా పిన్ని కువైట్ లో పని చేస్తుంది. నువ్వు కూడా కొన్నాళ్లు అక్కడికెళ్లి సంపాదించుకో" అని సలహా ఇచ్చింది.

"ఆమ్మో విదేశాలా?" భయపడింది పార్వతి. నర్సింహ సందేహిస్తూనే ఒప్పుకున్నాడు. ఇటు చూస్తే నిస్సహాయుడైన భర్త, అటు ఇద్దరు ఆడ పిల్లలు, వాళ్ళ పెళ్లిళ్లు అన్నీ ఆలోచిస్తే వెళ్ళటమే నయం అనిపించింది పార్వతి కి. కాస్త డబ్బు సంపాదించి వస్తే ఈ సమస్యలు తీరతాయని భావించి సరే అంది. ఆలా కువైట్ చేరింది పార్వతి. ఒక పెద్ద ఇంట్లో వాళ్ళ కవల పిల్లలకి ఆయా గా చేరింది. అక్కడ మామా, బాబా బాగానే చూసే వారు. కాకపోతే చాకిరీ మాత్రం విపరీతం, ఫోన్స్ ఉండ కూడదు లాంటి పరిస్థితులుండేవి.

అన్నిటికీ ఓర్చుకుని కాలం గడిపింది పార్వతి. తన అక్క సాయం తో ఆడపిల్లల్ని ఎక్కదీసుకొచ్చాడు భర్త. పంపిన కొంత డబ్బుతో చిన్న ఇల్లు కట్టాడు, మరికొంత డబ్బు తో డ్రైక్లీనింగ్ షాప్ పెట్టాడు. పెద్ద పిల్ల పెళ్ళికి డబ్బు కూడేసింది పార్వతి. పెళ్లికి వద్దామని బయలుదేరింది. చివరి నిమిషం లో పెళ్లి వాళ్ళు మరికొంత కట్నం అడిగారు. మధ్యవర్తి చేసిన తప్పిదం వల్ల ఈ సమస్య వచ్చింది. తాను వస్తే ఆ డబ్బు కూడా ఎందుకు వేస్ట్ అని పెళ్లి వాళ్ళ కిచ్చి పెళ్లి జరిపించింది. అంతా ఖాళీ అయింది, మళ్ళీ రెండో కూతురికి కూడబెట్టడం మొదలు పెట్టింది. మధ్య మధ్య లో భర్త, పిల్లలు వచ్చేయమని చాలా బతిమాలారు. ఇంత దూరం వచ్చింది, తన దురదృష్టం పిల్లలని వెన్నాడకూడదని, మంచి సంబంధాలు చెయ్యాలని మనసు రాయి చేసుకుంది. ఈ మధ్యన రెండో కూతురి పెళ్లి కూడా జరిపించింది.

ఇంతలో కరోనా వైరస్ అనే ఒక మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. ఒక దేశం లో పుట్టి, అన్ని దేశాలకూ వ్యాపించింది. దాని బారిన పడ్డ దేశాల్లో కువైట్, ఇండియా కూడా వున్నాయి. అంతటా లాక్ డౌన్ విధించారు. ఇండియా లో షాపులన్నీ మూసేసారు. విద్యాసంస్థలు, కర్మాగారాలు ఒకటేంటి ఏవి నడవట్లేదు. విమానాలు, రైళ్లు, బస్సులు, ఆటోలు ఏవి లేవు. డబ్బున్న వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్లంతా చిగురుటాకుల్లా వొణికి పోతున్నారు. పొట్ట చేత బట్టుకుని ఎక్కడెక్కడికో వెళ్లిన వాళ్లంతా తిండి లేక, ఊళ్లకు చేరుకునే మార్గం లేక అల్లాడిపోతున్నారు. కువైట్ లో కూడా ఇదే పరిస్థితి. ఇంటి నుండి కూతుళ్లు ఒకటే ఏడుపు.."అమ్మా, ఎలా వున్నావు, చూడలేకపోతున్నాం నిన్ను కంటితో" అని. అక్కడ వలస కూలీలు అందరూ రైళ్ల పట్టాలు వెంబడి నడిచి వెళ్తున్నారట వల్ల స్వస్థలాలకు. తనకు ఆ వీలు కూడా లేదు. ఎంతో కాలం గా పట్టుదలగా వున్న పార్వతి ఈ సారి మాత్రం తహ తహ లాడిపోసాగింది స్వదేశానికి రావాలని, తన వాళ్ళను చేరుకోవాలని.

ఈ గొడవల మధ్య చల్లని వార్త ఒకటి చేరింది పార్వతికి. కువైట్ గవర్నమెంట్ వీసా చెల్లిపోయిన ఇతర దేశాల పనివారిని క్షమాభిక్ష మీద వారి వారి దేశాలకు పంపించేందుకు ఒప్పుకుందని. పార్వతి ఆనందానికి అంతు లేదు. ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. పార్వతి లాంటి చిక్కుకు పోయిన వాళ్లంతా పేర్లు రాయించుకుని ఎదురుచూస్తున్నారు. పార్వతి వంతు రానే వచ్చింది. గబా గబా అన్ని సర్దుకుని షెల్టర్ కి వచ్చింది అందరితో కలిసి విమానం ఎక్కేందుకు.

***

అంతా విన్న బాలాజీ "అదృష్టవంతురాలివమ్మా నువ్వు, నీ కోసం ఎదురు చూసే నీ వాళ్ళు వున్నారు, అది చాలు నీ కష్టాలన్నీ మర్చిపోవటానికి" అన్నాడు. నిజమే. ఎన్నో కష్టాలు పడింది. మధ్యలో ఏజెన్సీ వాళ్ళు చాలా ఇళ్లకు పంపేవాళ్లు. మొదట వాళ్ళు బాగా చూసారు కానీ, తర్వాత యజమానులతో చాలా కష్టాలు పడింది. సరైన తిండి, నిద్ర వుండవు. కొంత మంది పనివాళ్లని కొడతారు కూడా. ఈ అవకాశం రాకుండా ఉంటే ఇంక ఎప్పటికి ఇక్కడే వుండవలసి వచ్చేది. వీసా లేకుండా దొరికితే శిక్షే, ఇంక బయట పడే వీలు లేదు. కళ్లనీళ్లు తుడుచుకుంది పార్వతి.

"మీరు కాసేపు పడుకోండి. బస్సు రాగానే నేను లేపుతాను" పక్కకి జరిగి చోటిస్తూ చెప్పాడు బాలాజీ.

**

ఎదురు చూస్తున్న బస్సు రానే వచ్చింది. బాలాజీ తన లగేజ్ తీసుకుని పార్వతిని లేపాడు. పార్వతి లేవలేదు. దగ్గరగా వచ్చి తట్టి లేపాడు. ప్రాణం లేని పార్వతి శరీరం బాలాజీ చేతుల్లో నుంచి జారిపోయింది.

ఇరవై ఏళ్ల తర్వాత స్వదేశానికి వెళ్తున్నాననే ఆనందం, తన వాళ్ళను చూడబోతున్నానే ఉద్వేగం పార్వతి అలసిపోయిన గుండె తట్టుకోలేకపోయింది. కరోనా కారణం గా దొరికిన అరుదైన అవకాశం అందుకోలేని దురదృష్టవంతురాలైంది. ఎవరి కోసం అయితే తన జీవితం ధారపోసిందో వాళ్ళను కళ్లారా చేసుకోలేని నిర్భాగ్యురాలైంది. ఇంటి దగ్గర పార్వతి భర్త, పిల్లలు ఎదురు చూస్తూనే వున్నారు. తల్లి సజీవంగా రాలేదని, కనీసం భౌతిక కాయం అన్నా వచ్చే పరిస్థితి వుందో లేదో కూడా తెలియదు వాళ్లకు.

మరిన్ని కథలు

Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE