సొంత గూటికి - గంగాధర్.వడ్లమన్నాటి

to home

మెడికల్‌షాపు దగ్గర మందులు కొనుక్కుంటున్న లలిత,అలవోకగా అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తిని చూసింది.ఓ క్షణం కాస్త దీర్ఘంగా ఆలోచించి,ఇతను అతనేనా? నాతో పాటు జేపీ కాలేజిలో పీజీ చదివిన మధులా ఉన్నాడే అనుకుంటూ,''మధూ'' అని బిగ్గరగా పిలిచింది అతన్ని. చటుక్కున తిరిగి చూసిన ఆ వ్యక్తి, కొంచెం సేపు ఆలోచించి, ''లలితా'' అన్నాడు చిన్నచిరునవ్వుతో.

''ఆ..ఆ..నేనే.మొత్తానికి గుర్తుపట్టావు.సంతోషం.నువ్వు మా తిరుపతిలో ఏంచేస్తున్నావ్‌.ఎప్పుడో మనం ఎనభైతొమ్మిదిలో చివరి సారి కలిసినట్టు గుర్తు. ఇది తొంభైఆరు అంటే మనం కలిసి ఏడేళ్లు అయిందన్న మాట. ఎవరూ మీ బాబా.చాలా ముద్దుగా ఉన్నాడు.ఎంత వయసు'' అడిగిందామె ఆ బాబు బుగ్గని చిన్నగా గిల్లుతూ.

''రెండేళ్లు. వీళ్లమ్మకి మొన్ననే ఓ పెద్దాసుపత్రిలో చిన్న ఆపరేషను జరిగింది. ఇప్పుడు కొంచెం కొంచెంగా కోలుకుంటోంది. స్వామివారిని దర్శించుకుని నువ్వనుకున్న మొక్కు త్వరగా తీర్చేయి అని మా అమ్మ పోరితే ఇలా హఠాత్తుగా తిరుపతి వచ్చాను.పైగా నేను పనిచేసేది చిత్తూరు.దగ్గరేగా''.చెప్పాడు మధు

''అయ్యో.అవునా.ఆవిడ ఇప్పుడు బానే ఉన్నారా మరి'' అడిగిందామె,

''అంతా బానే జరిగింది.ఆపరేషను కూడా సక్సెస్సయింది''.

''అలాగా.సూపర్.ఇక నా గురించి చెప్పమన్నావా.మా వారు కీచక రావ్ అని ఇక్కడే టీచరుగా పనిచేస్తున్నారు.అలాగే నేనిక్కడ ఫుట్‌వేర్‌బిజినెస్సులో ఉన్నాను.ఏదో స్వామి దయ.అలా నడిచిపోతోంది''. చెప్పిందామె.

''ఫుట్‌వేర్‌ బిజినెస్సా''.అంటూ పెద్దగా నవ్వేసాడతను.

''అదేంటీ నేను ఫుట్‌వేర్‌ బిజినెస్‌ చేస్తున్నాననగానే అంత ఇకిలించావేందుకు '' అడిగిందామె ఆశ్చర్యంగా.

''ఏం లేదు.మనం కాలేజీ చదువుకునే రోజుల్లో ,అప్పుడప్పుడూ మన స్నేహితులందరం కలిసి గుడికెళ్లినప్పుడల్లా నువ్వు సరదాగా నీ పాత చెప్పులు వదిలేసి కొత్త చెప్పులు లేపేసేదానివి .అప్పుడు నేను,ఇవన్నీ కలిపి రేపు చెప్పులు షాపు పెట్టుకోవచ్చు అనేవాడిని గుర్తుందా.కానీ నువ్వు నిజంగానే చెప్పులు దుకాణం పెట్టేసాప్‌.కొంపదీసి అలా ఎత్తుకొచ్చిన చెప్పులతోనే కాదుకదా! '' అడిగాడు మధు మరోసారి నవ్వేస్తూ.

ఆ మాటలకి చిన్నగా నవ్వేసి, ''ఛఛ, అదేం కాదు.అయినా ఇలాంటివి నీకు బాగా గుర్తుంటాయి.ఇదిగో,ఇది మా అమ్మాయి, అయిదేళ్లు .నేను ఎక్కడికెళ్లినా,నా కూడా తోకలా వచ్చేస్తుంది.మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, వస్తావా. నడిచెళ్లిపోవచ్చు.తీరిగ్గా కాఫీ తాగుతూ కులాసాగా మాట్లాడుకుందాం.ఆనక భోజనం చేసి బాతాకానీ పెడతాం.నువ్వు రాత్రికి కూడా ఉంటే,మా వారితో కలిసి రమ్ము కూడా పుచ్చుకోవచ్చు. అలాగే నువ్వు కూడా ఈ మధ్యే కట్టిన మా కొత్త ఇల్లు చూసినట్టుంటుంది. ఏవంటాప్‌'' అడిగిందామె.

''సరే అని ఓ క్షణం వాచీ చూసుకుని,తూచ్ రాను. నువ్వు ఇంత ఆత్మీయంగా రమ్మంటున్నావ్. పైగా రమ్ అంటున్నాప్‌. నాకూ రావాలనే ఉంది.కానీ ట్రైనుకి టైమైంది .పైగా అక్కడ హాస్పటల్లో మా ఆవిడ్ని మా అమ్మ ఒక్కతే చూసుకోవాలి. ఏమనుకోకు. ఇదిగో, ఇది నా లేండ్‌లైను ఫోను నెంబరు. అలాగే, ఉంటే నీ విసిటింగ్‌కార్డు ఇవ్వు.మా ఆవిడ కోలుకున్నాక మీ ఇంటికి వస్తాను''.చెప్పాడు మధు.

''ఇంతలో, రకరకాల పక్షులున్న చిన్న పంజరాలని చేత పట్టుకున్న ఓ అమ్మాయి మధు దగ్గరకి వచ్చి, సార్‌, మీరు ఇంట్లో పెంచడానికి కుందేళ్లూ, కుక్క పిల్లలూ లాంటివి అన్నీ మా పెట్‌షాపులో దొరుకుతాయి.అదిగోండి అదే.వచ్చి ఏమైనా కొనండి సార్‌'' అడిగిందామె.

“ఇప్పుడున్న మనుషలని పోషించడానికే నా హెయిర్ లోని ప్రాణం హవాయి చెప్పుల్లోకి వస్తోంది.పైగా పక్షులు ,వద్దమ్మా ఇలాంటివి పెంచడంలో నేను కొంచెం దద్దమ్మ ''.నవ్వుతూనే చెప్పేసాడు.

''లలితాంటి ఇక్కడే మొన్న ఓ రెండు కుందేళ్లు కొన్నారు.కనీసం మీరు నా చేతిలో ఉన్న ఈ పక్షులనైనా కొనండి సారు''.అడిగిందామె

''కొని ఏం చేయనమ్మా.కనీసం కూరకి కూడా సరిపోవే ధీర్ఘంగా చూస్తూ అన్నాడు

''అయ్యో.అదేంటి సారూ అలా అంటారు..అన్నీ మనకి అనుకూలంగా ఆలోచిస్తే ఇలాంటి పాడు ఆలోచనలే వస్తాయి.అవతలి జీవి బాధ కూడా మనం ఊహిస్తేనే కదా మన మనసు కరుగుతుంది. ఈ పిట్టలు మా షావుకారు ఇలా పంజరంలోనే ఉంచి నాతో అమ్మిత్తాడు. కనుక వీటిని కొని ఇప్పుడే స్వేచ్చగా వదిలేయండి''.అడిగిందామె.

''అదేంటీ! నీ పందా చిత్రంగా ఉందే.ఎవరైనా పెంచుకోమంటారు కానీ నువ్వేంటిలా కొని గాలికి వదిలేయమంటున్నావు”.అని క్షణం ఆలోచించి, “ఓహో అర్ధమైంది.నేను కొని వదిలేసాక, మళ్ళీ నువ్వే దాన్ని పట్టుకుని మళ్ళీ ఇంకొకళ్ళకి అమ్మేస్తావన్నమాట.ఇలా ఒకే పక్షిని వందకి, వంద మందికి, వంద సార్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్నావన్న మాట,అంతేనా అడిగాడు .

''ఛ ,ఛ మీ బుద్దులు నాకు లేవు సారు.కొని పెంచుకుంటాం అనే వాళ్లకి ఎప్పుడూ అమ్మనండీ.కొని వదిలేస్తాం అనే వాళ్లకే అమ్ముతాను.అలా కొని వదలనంటే వారి డబ్బులు కూడా వాళ్లకే తిరిగి ఇచ్చేస్తానండి. ఒక సారి వీటిని వదిలితే తిరిగి పట్టుకోలేం . నా కుడిచేతి పంజరంలో ఒకే పక్షి మిగిలింది.ఏ గూటి పక్షో పాపం.ఇప్పుడు ఇలా ఈ పంజరంలో పడింది.పాపం బిక్కు బిక్కుమంటోంది.కొందరు డబ్బుకోసం,మరి కొందరు వారి స్వార్దంతో వీటిని సొంత గూటి నుండి దూరం చేసి ఇలా పంజరం పాలు చేస్తారు.నా దగ్గర ఆ మాత్రం డబ్బులుంటే నేనే వదిలేసేదాన్ని.కానీ కూటికి వీటిని అమ్ముకుంటున్న దాన్ని.కనీసం ఇలా వీటికి మంచి చేయాలని ఇలా అడుగుతున్నాను. దీనిని కొని వదిలేయండీ,సొంత గూటికి చేరుతుంది పాపం. మీకు అంతా మంచే జరుగుతుంది సార్.నిజం.కావాలంటే, పది తగ్గిస్తాను. తొంబై ఇవ్వండి చాలు''. చేయి చాచిందామె

'' నీ ఆలోచన భేష్.పెద్దవాళ్లు కూడా చిన్న ఆలోచనలు చేస్తున్న ఈ రోజుల్లో, చిన్నదానివైనా పెద్ద మనసుతో ఆలోచిస్తున్నావంటే నాకు తిరుపతి కొండంత ఆశ్చర్యంగా ఉందమ్మా.మా ఆవిడకి సుస్తీ చేస్తే,తన పుస్తెలే అమ్మిన వాడ్ని.జాస్తిగా బస్తీలో అప్పులు ఉన్నవాడ్ని.అప్పుడప్పుడూ పస్తులతో కుస్తీ పడుతున్న వాడ్ని.కనుక ప్రస్తుతం కొనలేను. కానీ నువ్వు చెప్పినట్టు మాత్రం తప్పక చేస్తాను.నా మాటకి ఇదిగో నా స్నేహితురాలు లలితే సాక్ష్యం''.చెప్పాడు మధు

ఆ మాటలు వింటూనే తన పర్సులోంచి డబ్బులు తీసి ఇవ్వబోయిన లలితని ఆపుతూ-

''వద్దులే లలితా, ఈ సారి పెద్ద మొత్తం అవసరం వచ్చినపుడు అడుగుతాన్లే చెప్పి చిరునవ్వుతో ముందుకు నడిచేసాడు.

మరుసటిరోజు లలిత, మధుకి ఫోను చేసి, ''ఎలా ఉంది మీ ఆవిడకిపుడు''.అడిగింది

''చాలా చిత్రం. మొదట, మాట్లాడడానికే ఇంకో రోజు పడుతుందన్నారు.కానీ నేను వెళ్లేసరికి చక్కగా అదేదో తెలుగు టి‌వి యాంకర్లా తడబడుతూ పలకరించింది.కాస్త స్వేచ్చగా అటూ ఇటూ నెమ్మెదిగా నడుస్తోంది.అంతా స్వామి మహిమ.అలాగే నిన్న పక్షులు అమ్ముతున్న అమ్మాయి చెప్పిందిగా.ఏ పక్షులు ఆ సొంత గూటిలోనే ఉండాలి అని.అందుకే ఆమె అడిగినట్టే ఓ పక్షిని స్వేచ్చగా వదిలేసాను.సొంత గూటికి చేరింది.అందుకే కాబోలు నాకు ఈ మంచి జరిగింది మరి'' .

''చాలా సంతోషం అని ఓ క్షణం ఆగి, ఏడిసినట్టుంది. నువ్వసలు ఆ పక్షిని కొని చావలేదూ, స్వేచ్చగా వదల్లేదూనూ.నీ దగ్గర డబ్బుల్లేవని పేద కబుర్లు చెప్పి పెధ్ద వీధి వైపు వెళ్లిపోయావుగా.మరి ఓ పక్షికి స్వేచ్చనిచ్చానంటావేంటి?'' అడిగిందామె ఆశ్చర్యంగా.

''అది నాకు నేనుగా చెప్పలేను.కనుక నువ్వు ఇవాల్టి న్యూసు పేపరు మెయిన్‌ ఎడిషనులో రెండో పేజీ చూడు.వివరం తెలుస్తుంది''. ఫోను పెట్టేసాడు మధు.

లలిత వెంటనే పరుగున, అరుగు,సొరుగు అన్నీ వెతికి, హడావుడిగా పేపరు రెండో పేజీ తిప్పి చూసింది.అక్కడ ఓ వార్త కనిపించింది. సొంత గూటికి చేరిన పసివాడు అని ఉంది.వార్త చదవసాగిందామె. ''నిన్న తిరుపతి బస్టాండులో తప్పిపోయిన గరుడనారాయణ అనే రెండేళ్ల బాలుడు నిన్న మధ్యాహ్నం రైల్వే స్టేషను పోలీసులకి అప్పజెప్పబడ్డాడు.తప్పిపోవడంతో తిరిగి రైల్వే పోలీసులకి అప్పజెప్పినట్టుగా ఓ వ్యక్తి చెపడంతో పోలీసులు మనస్పూర్తిగా ఊపిరి పీల్చుకున్నారు.ఆ బాబు తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. తమ బాబుని మళ్లీ తమ వద్దకు చేర్చిన ఆ వ్యక్తికి తప్పక దేవుడు మంచే చేస్తాడన్నారు''. అని చదివేసిన లలిత ఓ క్షణం కొయ్మబారిపోయి, తర్వాత తేరుకుని, ''అంటే ఆ బాబు అతని కొడుకు కాదు.తప్పిపోయి అతని కంట పడ్డాడన్నమాట. పాపం పిల్లల్లేరు కదా, ఆ దొరికిన బాబునే ఎంతో ఆశగా పెంచుకుందామనుకున్నట్టున్నాడు.కానీ, ఆ పక్షులు అమ్మే పిల్ల మాటలతో మనసు మార్చుకున్నట్టున్నాడు. పైగా ఆ పిల్లతో, నువ్వు చెప్పినట్టే చేస్తానమ్మా అనడంలో అంతరార్దం ఇదన్నమాట. తల్లినుండి బిడ్డని విడదీయడానికి మనసు రాలేదు.పైగా అతని ఆర్ధిక పరిస్థితి కూడా గుర్తుకు రావడంతో తిరిగి పిల్లాడ్ని పోలీసులకి అప్పజెప్పి,ఆ పసివాడ్ని సొంత గూటికి చేర్చాడన్నమాట'' అని మరో మారు మధుకి ఫోన్ చేసిందామె .అతను ఫోన్ ఎత్తగానే “మధూ,యు ఆర్ గ్రేట్” చెప్పిందామె.

“ఏం గ్రేట్ లలితా,ఆ బాబుని పిల్లల్లేని మా మేనేజర్ కి అప్పగించి లక్ష నోక్కెద్దామనుకున్నాను.కానీ ఆ అమ్మాయి నా మనసు మార్చేసింది.అందుకే ఆ బాబుని సొంత గూటికి చేర్చాను.ఇలాంటివి ఇకపై చేయకూడదని నిర్ణయించుకున్నాను కూడా” అని అతను చెప్తుండగానే దబ్బుమన్న శబ్దం వినిపించిందతనికి.”హలో హలో” అన్నాడు,కానీ అవతల నుండి ఎవరూ కిక్కురు మనలేదు మరి.”స్పృహ తప్పుంటుంది” ఫోన్ పెట్టేశాడు.

మరిన్ని కథలు

Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE