మతిమరుపు మోహనరావుకు తెలివితక్కువ తాయారు భార్యగా దొరికిందని అందరూ అనుకుంటూ వుంటారు. దానికి తగ్గట్టు తాయారుకి కోపం ఎక్కువ.
మోహనరావు పనిమీద వెళ్తుండగా దారిమధ్యలో అదేపనిగా సెల్ మోగుతుంటే...బండి ఆపి...జేబులో సెల్ తీసాడు.
అటునుంచి భార్య తాయారు గొంతు....
"ఏమండోయ్...మీరు తిరిగి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకురండి" అంటూ కొన్ని వస్తువులు చెప్పింది.
"అబ్బా...నువ్వుండవే...నువ్వు మరీ ఇంత లిస్ట్ చెప్తే ఎలా...? అసలే నాకు మతిమరుపు ఎక్కువ. అదేదో ఇంటిదగ్గర ఉండగా చెప్పుంటే...ఏ కాగితం మీదో రాసుకునే వాడిని" భార్యను విసుక్కున్నాడు.
"మీరు అలా మర్చిపోకుండా ఉండటానికి చిన్న చిట్కా కూడా చెప్తాను వినండి" అంటూ చెప్పిన భార్య మాటలు వినేసరికి.... అంత చిరాకులోనూ...భార్యకి తెలివితక్కువన్న వాళ్ళందర్నీ తిట్టుకున్నాడు.
భార్య చెప్పినవేమిటో గుర్తు పెట్టుకుంటూ.....మళ్లీ బండి ఎక్కాడు. కానీ....ఏ పనిమీద బయటకు వెళ్లాలని బయలుదేరాడో ఆపని మర్చిపోయి... భార్యచెప్పినవి కొనడానికి పూర్ణామార్కెట్లోకి దూరాడు.
చెప్పిన వాటిలో అన్నీ కొన్నాడు. ఒకటి మాత్రం దొరకలేదు. ఎవర్ని అడిగినా...పిచ్చోడిలా చూసారు. "ఎల్లెళ్లయ్యా" అంటూ తిట్టుకున్నారు.
ఎలాగైతే సామాను తెచ్చిన సంచిని...ఇంట్లోకి తీసుకోస్తుంటే...ఎంతో త్వరగా ఇంటికొచ్చిన భర్తను అడిగింది తాయారు....
"ఇంత త్వరగా ఇంటికొస్తారనుకోలేదు. ఏదో పనిమీద వెళ్లారు కదా...ఆ పనయ్యాకా ఈపని చేసుకుని వచ్చేసరికి...ఏ మధ్యాహ్నమో అయిపోతుందనుకున్నాను." అంటూనే భర్త చేతిలోని సంచిని అందుకుంది.
"అవును తాయారూ... అసలు నేనెక్కడికి వెళ్లాలనుకుని బయలుదేరాను...."? నువ్వు ఇవన్నీ తెమ్మంటేనే కదా వెళ్ళాను" బుర్ర గోక్కుంటూ చెప్పాడు మోహనరావు.
"ఇది మరీ బాగుంది...ఏ పని మీద బయలుదేరారో నాకేమైనా చెప్పారా ఏంటి" అని సాగదీసుకుంటూ భర్త తెచ్చిన సామాన్లను కింద ఒంపింది. వాటిని చూసిన వెంటనే...తాయారు వాటిని తన్నేసినంత పనిచేసింది.
ఇవన్నీ తెచ్చారు బానే ఉంది....మెళ్ళో పామునేసుకుని రావడం మర్చిపోయారేం...? ఒక్కసారిగా అరిచిన భార్య అరుపుకు అదిరిపడ్డాడు మోహనరావు.
" ఓ...అదా తాయారూ...నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు చెప్పిన వాటిలో అదొక్కటే దొరకలేదు. నువ్వు చెప్పడం పొరపాటో...నేను వినడం పొరపాటో అర్థం కాలేదు.
అయినా ఆ పామెందుకే మనకి...? కొంపదీసి పెంచుతావా ఏంటి..."? తిరగబడి అడిగిన భర్త మాటలకు మరింత చిర్రెత్తుకొచ్చింది తాయారుకి.
"మీ మతిమరుపు మండా...మీరు నేను తెమ్మని చెప్పినవి మర్చిపోకుండా తెస్తారు కదాని కొన్ని బండగుర్తులు చెప్పాను. అవీ నాలుగే నాలుగు చెప్పాను. కావలసినవి తేవడం మానేసి... ఘనకార్యం చేసినట్టు బండ గుర్తులు చెప్పినవన్నీ మోసుకొచ్చారు. జీలకర్ర కోసం కర్రని, బంతిపూల కోసం బంతిని, మామిడల్లం కోసం మామిడికాయను , పొట్లకాయ కోసం పామునీ గుర్తించుకోమని చెప్పాను గానీ...ఇవన్నీ నేను తెమ్మనలేదు" అంటూనే... వాటిని మోహనరావు మొహం మీదకు గీరాటేసింది తాయారు...!!*