ఏమండీ!! లేవండి...... అయిదైపోతోంది, వాకింగ్ కి లేట్ అయిపోతామని భర్తని లేపుతుందిఅనూష. ఊ...... ఈ రోజుకి వద్దులే అనూ....అంటాడు హేమంత్ బద్దకంగా. అబ్బా.... రోజూ ఇదేగొడవండీ మీతో, ఒకసారి మీ ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ గుర్తు చేసుకోండి.......అని అనూష అనడంతోదిగ్గున లేచి కూర్చుంటాడు హేమంత్.... అవును అనూ, తప్పదు వెళ్ళాలి అని బలవంతంగా కళ్ళునులుముకుంటూ లేస్తాడు.
ఇద్దరూ కాలకృత్యాలు పూర్తి చేసుకుని వాకింగ్ కి బయలు దేరుతారు. ఇంటి నుండి సుమారుగాఒక కిలోమీటర్ దూరం లో పబ్లిక్ పార్క్ ఉంది. అక్కడ ఉండే స్వచ్ఛమైన గాలి, పచ్చని చెట్ల మధ్యవాకింగ్ చేయడం ఆహ్లాదకరంగా ఉంటుంది అందరికి.
రోజూ ఇద్దరికీ ఇంటి నుండి పార్క్ వరకు ఉన్న ఈ ఒక్క కిలోమీటర్ నడవడం చాలా కష్టం. దుర్గంధభరితమైన వాసన. రోజూ ముక్కుకి కర్చీఫ్ పెట్టుకుని నడవాల్సిందే.
రోజూలానే ఆ రోజు కూడా మున్సిపాలిటీ చెత్త కుండీలు దాటి గబ గబా నడుస్తునారు అనూషహేమంత్ లు. బ్రేక్ వేసినట్లు ఇద్దరూ ఒకేసారి టక్కున ఆగిపోతారు. చెత్త కుండీల వెనుక నుండికుయ్ కుయ్ మని చిన్న శబ్దం వినపడటంతో . ఏమండీ!! ఏదో చిన్న పిల్లల ఏడుపులా ఉందికదండీ! అంటుంది అనూష. చిన్నపిల్ల కాదే, కుక్క పిల్ల అయి ఉంటుంది, నడు త్వరగా, కంపుభరించలేము ..... అని తొందర పెడతాడు హేమంత్. ఆమె కూడా “ఇక్కడ చిన్నపిల్లలెందుకుఉంటారులే, కనుచూపు మేరలో ఎక్కడా ఇళ్ళు కూడా లేవు” అనుకుంటుంది.
ఇద్దరూ నాలుగయిదు అడుగులు కూడా వేశారో లేదో ఈసారి స్పష్టంగా అప్పుడే పుట్టిన చిన్న పిల్లఏడుపులా మళ్ళీ వినపడుతుంది. ఇంక హేమంత్ లాభం లేదనుకుని “నువ్విక్కడే ఉండు అనూ, నేవెళ్ళి చూసి వస్తానని” కర్చీఫ్ గట్టిగా ముక్కుకు కట్టుకుని యుద్ధానికి వెళ్ళే యోధుడిలా కుప్పతెట్లు దాటి ఆ ఏడుపు వినిపించిన వైపుగా వెళ్ళి దిగ్భ్రాంతి చెందుతాడు. అన్నూ!! త్వరగా రాఇక్కడికి అని పిలుస్తాడు గట్టిగా. ఏమైదండీ!! అంటూనే భయంకరమైన గబ్బు కంపు కూడాపట్టించుకోకుండా పరుగెడుతుంది హేమంత్ కేసి. అనూష కూడా అక్కడి దృశ్యం చూసి షాక్తిన్నట్లు నిలబడిపోతుంది. ఇద్దరికీ ఏం చెయ్యాలో అర్ధం కాదు ఓ లిప్త కాలం పాటు. అయ్యో!! ఇంత చిన్న పసి కందుని చెత్త కుప్పలో పడెయ్యడానికి వాళ్ళకి మనసెలాఒప్పిందండీ ........ అనితల్లడిల్లిపోతుంది అనూష.
అవును అనూ!! అంటూ ఆ పసికందుని తన చేతుల్లోకి తీసుకుంటాడు హేమంత్. ఒళ్ళంతాచీమలు కుట్టేసి ఎర్రగా కందిపోయి ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో చూడు, ఈపాపని వదిలేసి ఎక్కువ సేపు అయినట్లు లేదు అనూ........లేకపోతే ఏ కుక్కో, పందో పీక్కు తినేసేవిఈ పాటికి అంటాడు హేమంత్.
పాప హాస్పిటల్ వాళ్ళు వేసిన దుస్తుల్లోనే ఉంటుంది. చేతికున్న టాగ్ తీసేసారు ఎవరి బిడ్డోతెలీకుండా. టాగ్ హడావిడిలో కట్ చేసినట్లున్నారు, రిస్ట్ దగ్గర కట్ అయ్యి రక్తం వస్తోంది. ఇద్దరికళ్ళలో మెరుపు, ఆనందం. ఇద్దరి మొహంలో ఒకే నిర్ణయం పాపని ఇంటికి తీసుకు వెళ్ళాలని.
అనూష తన ఓవర్ కోట్ తీసి అందులో పాపని పొదివి పట్టుకుంటుంది ఎంతో అపురూపంగా. హాస్పిటల్ కి తీసుకు వెళ్ళాలో, ఇంటికి తీసుకు వెళ్ళాలో అర్ధం కాలేదు ఇద్దరికి. ఏమైతేఅయ్యిందని
ఇంటికి తీసుకు వెళతారు, ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని భయపడుతూనే. హేమంత్ వాళ్ళబామ్మ సావిత్రమ్మ, అనూష తల్లితండ్రులు అందరూ కలిసే ఉంటారు. తలుపు తీయగానే“ఏమిట్రా, ఇవాళ వెంటనే వచ్చేశారు వాకింగ్ కి అని వెళ్ళి” అంటుంది సావిత్రమ్మ వీళ్ళకేసిచూడకుండానే పూజకి పూలు కోసుకుంటూ.
ఈ లోపే పాప గుక్కపెట్టి ఏడుస్తుంది. అంతే...... ఇల్లంతా కలకలం. సావిత్రమ్మ నోట మాటరానట్లు నిలబడిపోతుంది............అనూష తల్లి కాఫీ డికాక్షన్ తీస్తున్నది అక్కడే పడేసి పరుగెత్తుకువస్తుంది..... అనూష తండ్రి కూడా పసిబిడ్డని చూసి అవాక్కైపోతాడు.
హేమంత్, అనూషలు పాప దొరికిన ఉదంతం అంతా కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు. “ఆ పిల్లనిహాస్పిటల్ లో అప్పగించేసి రాక ఇంటికి ఎందుకు తెచ్చారు ఈ దరిద్రాన్ని” అని గదమాయిస్తుందిసావిత్రమ్మ. అనూష తల్లితండ్రులు కూడా ఆమెతో ఏకీభవిస్తారు. ఆ పిల్లని ముట్టుకుంటేఏమైపోతుందో అన్నట్లు దూరం దూరం జరుగుతారు.
ఏ కులమో, గోత్రమో తెలీదు....... ఎవరి అక్రమ సంతానమో తెలీదు....... వాళ్ళకే బరువైవదిలించుకున్నారు.... మీరు తగిలించుకున్నారు చెత్త కుప్పల నుండి తెచ్చి. బుద్ధి లేకపోతే సరి, దానికి బుద్ధి లేకపోతే నీకేమైందిరా?? అని మనవడిని నిలతీస్తుంది సావిత్రమ్మ.
“ఎంత ముద్దుగా ఉందో చూడవే బామ్మా....
ఇంత పసిదానికి కులం గోత్రాలెందుకే........
ప్లీజే, పిల్లల్లేక మేము ఎంత అవస్థ పడుతున్నామో మీకందరికీ తెలుసు. ఇప్పటికి రెండు సార్లుఐ.వీ. ఎఫ్. విఫలమైంది. అందుకే ఆ దేముడిచ్చిన వరంగా ఈ పాపని పెంచుకుంటామే” అనిబామ్మని బ్రతిమాలతాడు హేమంత్.
హేమంత్ చిన్నప్పుడే తల్లితండ్రులు యాక్సిడెంట్ లో చనిపోతే కొడుకు పోయిన కష్టాన్నిదిగమింగుకుని, ఆస్తిపాస్తులు లేకపోయినా ఎంతో కష్టపడి సాకుతుంది వాళ్ళ బామ్మ ఒక్కర్తి. అందుకే బామ్మ అంటే అభిమానం, ఆమె గీసిన గీత దాటడు హేమంత్. ఎలాగైనా బామ్మనిఒప్పించాలని విశ్వప్రయత్నం చేస్తాడు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ పిల్లని పెంచుకోవడానికివీల్లేదురా..... మీ ఇద్దరికేమైనా వయసు దాటి పోయిందా!! పెళ్ళైన పది ఏళ్ళకి పిల్లలు పుట్టినవాళ్ళు తెలుసు నాకు..... అని నిష్కర్ష గా చెప్తుంది సావిత్రమ్మ.
ఏం చెయ్యాలో పాలుపోని అనూష, హేమంత్ లు ఆ పసికందు ఏడుస్తుంటే సముదాయించడంలోపడతారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ సహకరించక పోవడంతో పక్క ఇంట్లోనే ఉన్న ఫ్రెండ్సహాయంతో పాపకి పాలు పట్టే ప్రయత్నం చేస్తారు. హేమంత్ ఫ్రెండ్ ఒకతను పీడియాట్రిషియన్ఉంటే అతనికి
కాల్ చేసి ఇంటికి పిలిపించి పాపకి వైద్యం చేయిస్తాడు.
అతను కూడా పాపని ఆర్ఫనేజ్ లో ఇచ్చేయి హేము... ఇలాంటి పిల్లలతో ముందు ముందు చాలాహెడ్ ఏక్స్ వస్తాయి అని చెప్తాడు. దానికి వాళ్ళిద్దరూ సుముఖంగా లేకపోవడంతో
ముందు ఏదైనా ఆర్ఫనేజ్ లో నేమ్ యాడ్ చేసి వాళ్ళ ద్వారా లీగల్ గా అడాప్ట్ చేసుకో అనిఐడియా ఇస్తాడు.
ఏది ఏమైనా బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. ఎప్పుడు అవసరమైనా కాల్ చేయండి, వస్తాను అని చెప్పి వెళతాడు.
కాలక్రమంలో అన్నీ సర్దుకుంటాయనే ఉద్దేశ్యంతో పెద్దవాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగానే పాపని దత్తతతీసుకోవడానికి సిద్ధ పడతారు అనూష హేమంత్ లు,
పాపకి కావలసిన మిల్క్ బాటిల్స్, క్రిబ్, డ్రెస్సెస్, టాయ్స్ అన్నీ తీసుకు వస్తాడు హేమంత్. ఇవన్నీచూసిన సావిత్రమ్మ ఏడుస్తూ “అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా” అని ముక్కుచీదేస్తూ గది లోకి వెళ్ళి భళ్ళుమని తలుపేసుకుంటుంది కోపంగా.
అనూష హేమంత్ లు ఇద్దరూ ఆఫీసుకి సెలవు పెట్టుకుని పాపని పెంచడానికి హైరానాపడిపోతూ ఉంటారు. పక్క ఇంట్లో ఉన్న అనూష ఫ్రెండ్ రాధ వీళ్ళకి పాప పనుల్లో ముఖ్యంగాస్నానం చేయించడానికి హెల్ప్ చేస్తుంది.
పెద్దవాళ్ళందరూ ఒక్క తాటి మీద నడుస్తుంటారు సహాయ నిరాకరణ ఉద్యమంలో.
పాప దొరికిన రోజే పుట్టిన రోజుగా భావించి ఇరవైఒకటో రోజున సింపుల్ గా గుళ్ళో “ఉషశ్రీ” అనినామకరణం చేస్తారు, తమ జీవితాల్లో ఉషస్సు తెచ్చిందని భావించి.
అనూష ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది. చూస్తుండగానే ఉషకి తొమ్మిది నెలలు వచ్చేస్తాయి. ప్రాకడం మొదలుపెడుతుంది. నల్లటి వత్తైన గిరజాల జుట్టు, మేలిమి బంగారు ఛాయతో బొద్దుగామిస మిసలాడిపోతూ ఉంటుంది ఉషశ్రీ చూపరుల దృష్టిని ఆకట్టుకునేలా. సావిత్రమ్మ అంటేమహా ఇష్టం ఉషకి. ఆవిడ తులసి కోట దగ్గర కూర్చుని జపం చేసుకుంటుంటే తప తపా చేతులుకొట్టుకుంటూ ప్రాక్కుంటూ వెళుతుంది ఆవిడ కేసి. ఊ..... రాకు........ మడి కట్టుకున్నాను........ అని విసుగ్గా కర్ర పెట్టి ఆపుతుంది ముట్టుకోకుండా. ఇదివరకటి అంత వ్యతిరేకత తగ్గుతుంది పెద్దవాళ్ళలో. ఉష పెద్ద బోసి నవ్వు నవ్వేసి వెనక్కి తిరిగినట్లే తిరిగి మళ్ళీ ఆవిడ దగ్గరకే వెళుతుంది. పో..మొండిదానా.........అని అనూషా!! దీన్ని తీసుకుపోవే అవతలకి అని చెప్పి అక్కడ నుండివెళుతుంది సావిత్రమ్మ.
ఉషశ్రీ రాకతో అనూష వాళ్ళ జీవితంలో పిల్లల్లేరనే నిరాశ నిస్పృహలు పోయి ఆమె ఆటపాటల్లో, పెంపకంలో బిజీ అయిపోతారు. మళ్ళీ పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకోవాలన్న ఆలోచనకి తావేలేకుండా పోతుంది. అనూష తల్లితండ్రులు ఉషశ్రీ ని దగ్గరకు తీయకుండా ఉండలేకపోతారు. ఉషశ్రీ రాక వలన ఇంట్లో ఒక రకమైన ఉత్సాహ భరితమైన వాతావరణం ఏర్పడుతుంది.
ఉషశ్రీకి ఐదేళ్ల వయస్సులో అనూష కన్సీవ్ చేస్తుంది. వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. అనూషకితొమ్మిది నెలలు నిండి ఒక శుభ ముహూర్తంలో ఆడపిల్లకి జన్మనిస్తుంది. సావిత్రమ్మ గారు పెద్దపండుగే చేసుకుంటుంది. “మన పిల్ల మనకుండగా ఆ దరిద్రం మనకెందుకు?? ఆర్ఫనేజ్ లోవదిలేసి రా...... కావాలంటే ఎప్పుడైనా వెళ్ళి చూసి రండి” అంటుంది సావిత్రమ్మ.
ఆ మాటలు ఉషశ్రీకి అర్ధం అయ్యి కానట్లుగా ఉండటంతో నాన్నా!! నన్నెక్కడికి పంపించద్దు, నేనెక్కడికి వెళ్ళను నాన్నా అని హేమంత్ ని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది.
బామ్మా!! ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే నిన్నే వృద్ధాశ్రమంలో పడేస్తా అని కోపంగాఅరిచి ఉషని తీసుకుని అక్కడ నుంచి వెళతాడు. హేమంత్ అన్నంత పనీ చేస్తాడని భయమేసిగమ్మునుంటుంది సావిత్రమ్మ.
అనూష, హేమంత్ లు “తపస్వి” అని నామకరణం చేస్తారు ఆ పాపకి. తపస్వి పెద్దవాళ్ళందరిముద్దు మురిపాలతో, అతి గారాబంతో పెరగడం వలన మొండిగా తయారవుతుంది. ఇంట్లో ఆమెఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతుంది. తపస్విని తల్లితండ్రులు ఎంత క్రమశిక్షణలోపెడదామన్నా పెద్దవాళ్ళు సాగనివ్వరు. అనూష, హేమంత్ లు ఎంత చెప్పినా పిల్లలిద్దరి మధ్యాపెద్ద వాళ్ళు వ్యత్యాసం చూపించకుండా ఉండలేరు. పెద్దవుతున్న కొద్దీ ఉషశ్రీకి ఆ తేడా బాగాతెలుస్తుంది. ఎందుకు అందరూ తపస్విని అంత గారాబం చేస్తారో, తనంటే ఇష్టపడరో అర్ధమయ్యేది కాదు ఆ చిన్న బుర్రకి.
తపస్వికి అక్క అంటే ప్రాణం. తను ఏది చెపితే అదే వేదం. ఉషశ్రీ చెల్లిని అపురూపంగాచూసుకుంటుంది. మంచి చెడు చెపుతూ ఉంటుంది.
సావిత్రమ్మకి మాత్రం తపస్వి ఉషశ్రీ ని ఇష్టపడటం కంటికింపుగా ఉండేది. నా మనుమరాలిని నీచెప్పుచేతలలో పెట్టుకుందామనుకుంటున్నావా?? అది ఎప్పటికి జరగనివ్వను అని తిడుతుందిఉషశ్రీని.
చుట్టుప్రక్కల వారి వలన ఆమె పుట్టుక విషయం తెలిసి ఎక్కడ ఉషశ్రీ మనసు బాధపెట్టుకుంటుందోనని సొంత ఇల్లు వదులుకుని వేరే సిటీకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడుహేమంత్.
హేమంత్ బెదిరింపుల వలన సావిత్రమ్మ ఉషశ్రీ గురించి చెడుగా మాట్లాడటం ఆపుతుంది కానీతన మనుమరాలు కంటే అందంగా ఉంటుందని, తెలివైనదని, సమర్థురాలని మనసులోఎప్పటికి ఆమె అంటే అక్కసే. చెత్తకుప్పల నుంచి ఎత్తుకొచ్చిన అమ్మాయి అన్ని విషయాలలోనూఉన్నతంగా ఉండటం ఆవిడ జీర్ణించుకోలేక పోతుంది.
ఉషశ్రీకి టెన్త్ క్లాస్ లో స్టేట్ ఫస్ట్ వస్తుంది. ఇంజనీరింగ్లో యూనివర్సిటీ ఫస్ట్ తెచ్చుకుని గోల్డ్ మెడల్సంపాదించుకుంటుంది. అనూష హేమంత్ లు చాలా సంతోష పడతారు. తపస్వి టెన్త్ క్లాస్అత్తెసరు మార్కులతో పాస్ అయి కాలేజీ లోకి అడుగు పెడుతుంది.
ఉషశ్రీ ఇంట్లో ఉన్నంత సేపు తల్లికి అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ చెల్లికి చదువులోసహాయం చేస్తుంటుంది. అనూషకి ఎనీమియా కావడంతో ఎక్కువ పనులు చేయలేక పోతుంది. దానితో ఇంట్లో పెద్దవాళ్ళందరి బాధ్యత ఉష మీదే పడుతుంది.
సావిత్రమ్మకి పక్షవాతం వస్తుంది. ఆమె దగ్గర దుర్వాసన వస్తుందని తపస్వి ఆ ఛాయలకి కూడావెళ్ళేది కాదు. ఆవిడకేమో తపస్వి నామ జపమే
ఎప్పుడూ. ఏయ్, ముసలీ!! నన్ను పిలవమోకు. నీ రూములో వాసనకి నాకు వాంతి వస్తుందిఅని విసుక్కుంటుంది తపస్వి. తప్పమ్మా, పెద్దవాళ్ళని అలా అనకూడదని ఉషశ్రీ ఎంత నచ్చచెప్పినా “ నీలాగా నేను మదర్ తెరీసాని కాదక్కా” అని వేళాకోళం చేస్తుంది తపస్వి.
ఉషశ్రీ ఎం.బీ. ఏ లో జాయిన్ అవుతుంది. చెస్ లో స్టేట్ లెవెల్ ప్లేయర్ అవుతుంది. నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ కి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. తపస్వికి నేర్పుదామని ఎంతప్రయత్నించినా “ అక్కా, అది నీలా తెలివైన వాళ్ళు ఆడే గేమ్ కానీ నా లాంటి వాళ్ళకి కాదు” అనినవ్వుతు అంటుంది. ఉషశ్రీ కాలేజీకి వెళ్ళే ముందు రోజూ బామ్మకి స్నానం చేయించడం, టిఫిన్తినిపించి మందులు వేయడం చేసేది. మిగతా పనులు అనూష చూసుకొనేది.
సావిత్రమ్మకి చనిపోయే ముందు రోజుల్లో పశ్చాత్తాపం మొదలవుతుంది. తన సొంతం అనుకునిఎంతో గారాబంగా పెంచుకున్న మనవరాలేమో తనని చూడటానికి కూడా ఇష్ట పడటం లేదు. తను అంటరానిదనుకున్న ఈ పరాయి పిల్లేమో ఎన్నో సేవలు చేస్తోంది. ఏ జన్మలో ఋణమో అనిబాధ పడుతుంది.
ఉషశ్రీ బామ్మకి తినిపిస్తుండగా హేమంత్ వస్తాడు అక్కడికి. బామ్మా !! ఎలా వుంది నీకు?? అనిఅడిగి నా బిడ్డ ఎంత బంగారు తల్లో!! అని ఉష తల మీద నిమిరి నేను తినిపిస్తాలే అమ్మా........ నువ్వు కాలేజీకి వెళ్ళు అంటాడు. ఉష సరేనని అక్కడి నుండి వెళుతుంది.
బామ్మా!! చూశావా!! నువ్వు తాకడానికి కూడా ఇష్టపడని పిల్ల నీకు ఎన్ని సేవలు చేస్తోందో. చెత్తకుప్ప నుంచి తెచ్చామని అనరాని మాటలు అన్నావు. కులం, గోత్రం లేవంటూ ఎన్నో తిట్టావు. చివరికి ఆ పిల్లే ఈనాడు ఇంట్లో అందరిని సమర్ధించుకుంటూ వస్తోంది. ఆ రోజు మా నిర్ణయంసరైనదేనని అడుగడుగునా నిరూపిస్తోంది. సంఘంలో నీ మనుమడు ఇప్పుడు ఉషశ్రీ తండ్రిగానేఅందరికి తెలుసు.
అవునురా హేమంత్...... నాది తప్పే.... “చిన్నపిల్లే అయినా ఉషకి చేతులెత్తినమస్కరిస్తున్నానురా” అంటుంది బామ్మ. ఆమె ఎడల తను ప్రవర్తించిన తీరుకి సిగ్గుపడుతున్నాను అంటుంది. కన్నబిడ్డ పుట్టినా ఏ విధమైన వ్యత్యాసం చూపించకుండా, పెంచినబిడ్డ కోసం ఉన్న ఊరు, సొంత ఇల్లు కూడా వదులుకుని వచ్చిన మీ ఇద్దరి ఉదార స్వభావానికికూడా జొహార్లురా.......... అని చిన్నవాళ్ళైనా పెద్ద మనసుతో తనని అర్ధం చేసుకుంటూ, చాదస్తంతో ఎంత సతాయించినా భరించి, అందరిలా వృధాశ్రమంలో పడేయకుండా చంటిపిల్లలా తనని సాకుతున్నందుకు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. బామ్మని బాధ పెట్టినందుకు నొచ్చుకుంటాడు హేమంత్.
బామ్మకి ఇప్పటికైనా ఉష విలువ తెలిసొచ్చినందుకు సంతోష పడతాడు.
నాన్నని ఏదో అడగాలని వచ్చిన ఉషశ్రీ ఈ సంభాషణ అంతా విని నిశ్చేష్టురాలై నిలబడి పోతుంది. కాళ్ళ క్రింద భూమి కదిలి పోయినట్లవుతుంది ఆమెకి. చిన్నప్పటి నుండి జరిగిన విషయాలన్నీసినిమా రీల్ లా ఆమె కళ్ళ ముందు తిరుగుతాయి . ఇంట్లో పెద్దవాళ్ళందరూ తనతో అలాఎందుకు ఉంటారో ఆమెకి అర్ధం అవుతుంది.
తన తల్లితండ్రులు ఎంత ఉన్నత మనస్కులో కదా!! అనుకుంటుంది.
చెత్త కుప్పలో దొరికిన తనని ఇంట్లో పెద్దలని, సొసైటీని ఎదిరించి అడాప్ట్ చేసుకున్నారని తెలిసివిచలితురాలవుతుంది. తనకీ విషయం తెలీకూడదని వాళ్ళు చేసిన త్యాగానికి ఆశ్చర్య పోతుంది.
నేషనల్ చెస్ కాంపిటీషన్ లో విన్ అవుతుంది ఉషశ్రీ. అవార్డు ఫంక్షన్ లో తన జన్మ రహస్యంఅందరి ముందు వెల్లడి చేసి, మా అమ్మ నాన్నలే ఈ అవార్డుకి నిజమైన అర్హులని ఆ రోజువాళ్ళు....... ఎవరో అక్కరలేదనుకుని చెత్తకుప్పల దగ్గర పడేసిన పిల్ల, మనకెందుకీ జంజాటం అనివదిలేస్తే ఈనాడు తన అస్తిత్వమే ఉండేది కాదని వారిది ఎంత గొప్ప మనసో అని అందరికితెలియ చేస్తుంది. తనకీ విషయం తెలిస్తే బాధ పడతానని తెలీకుండా జాగ్రత్త పడ్డారని కూడాచెప్తుంది. తను ఏమిచ్చినా ఈ జన్మలో వారి ఋణం తీర్చుకోలేనని వారికి కృతజ్ఞతలుతెలుపుకుంటుంది. ఇలా అందరూ ఉన్నతంగా ఆలోచిస్తే ఎవరూ అనాధలుగా మిగలరనిచెప్తుంది.
అందరి కరతాళధ్వనుల మధ్య అనూష హేమంత్ ల కళ్ళు చెమర్చగా ఆనందంతో ఆ అవార్డు తమచేతుల మీదుగా ఉషశ్రీకి అందచేస్తారు. ఆమె వారికి పాదాభివందనం చేస్తుంది.