పట్టణం లో పని లేక, వెళ్ళడానికి వాహనాలు లేక నడిచి సొంతూళ్లకు వలస పోతున్న లక్షలాది కూలీలలో ఒక కుటుంబపు అంతరంగం.
ఓ తల్లి ఆక్రందన :
కడుపులో బిడ్డతో, పక్కనే వేలు పట్టుకు నడుస్తున్న పిల్లాడి కబుర్లతో ఇప్పటికే చాలా దూరం వచ్చేసాము పట్నం నుండి.ఎన్నో ఆశలతో పిల్లల భవిష్యత్తు కోసం , పిల్లలకి మన కష్టం రాకూడదని ఉన్నంతలో ప్రయోజకుల్ని చేయాలని కలలు కన్నాము.కడుపులో బిడ్డని దాచుకుని ఎంతదూరం నడిచిన గమ్యమే కనపడట్లేదు.రేపటి కోసం, పుట్టబోయే వాడికి ఈ ప్రపంచాన్ని అందంగా చూపించడానికి ఏమి చెయ్యాలి??
పిల్లాడి మనోగతం :
చక్కగా ఆడుకుంటూ, పుట్టబోయే చెల్లి కోసం కలలుకంటుంటే అమ్మానాన్నలు ఉన్నపళంగా ఎక్కడికో తీస్కెళ్ళిపోతున్నారు.బోలెడు దూరం వచ్చేసాము ఇంటినుండి.ఎవరైన అన్నం పెడితే తింటున్నాం.లేకపోతే నడుస్తున్నాం.నాన్నని ఏదైనా తినడానికి కొనమంటే పాపం డబ్బులు లెక్కచూస్కుని కొంటున్నాడు.చాలా ఊర్లు దాటేసాం.ఎక్కడా మా ఇల్లు లేదు.ఇంకా ఎంత దూరం నడవాలో..!ఆకలేస్తోంది..ఇప్పుడేం చెయ్యాలి??
తండ్రి ఆవేదన :
చెల్లి పెళ్లికి డబ్బు కోసం సొంతూర్లో అమ్మని, చెల్లి ని వదిలేసి ఉన్న ఊరిలో పని దొరక్క ఇక్కడికి వచ్చేసాము.ఇంకొక ఏడాది గడిస్తే కొంత డబ్బు మిగులుతుంది దాంతో పెళ్లి చేసేద్దామనుకున్నాను. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందన్నట్టుగా ఈ జబ్బేదో ఇప్పుడే అంటుకుంది ప్రపంచానికి.ఇక్కడ పని లేదు,చేతిలో డబ్బులు అయిపోతున్నాయి.బిడ్డని,కట్టుకున్న భార్య ని వందల మైళ్ళు నడిపిస్తున్నాను.ఏమి చేయలేని అసహాయుడినైపోయాను.రేపటి కోసం ఏం చెయ్యాలి??
కడుపులో బిడ్డ ఆలోచన :
మా అమ్మ ఎందుకో చాలా దూరం నుండి నడుస్తూనే ఉంది నన్ను బొజ్జలో ఉంచుకుని! పైగా చాలా నీరసపడిపోయింది.!దేనిగురించో చాలా బాధ పడుతోంది పాపం.!దేవుడా..అమ్మ బాధ పడకుండా చూడు తండ్రి.!నేను పుట్టేనాటికి ఈ రంగుల ప్రపంచానికి ఏ బాధలు లేకుండా చెయ్యి తండ్రి..!