శేషుబాబుకి చీమల దండు ప్రయాణమంటే చాలా ఇష్టం.బడిలోగానీ బడిబయటగానీ చీమల దండు కనిపిస్తే అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని చీమల రాకపోకలను తదేకంగా చూస్తూ లోకాన్ని మర్చిపోతాడు.
శేషుబాబు చిన్నాన్న దుబాయి నుండి వచ్చాడు. బాబాయి వచ్చీరాగానే శేషుబాబుని 'ఏమోయ్ ఎర్రదండు శేషుబాబు నీ చీమలు ఎలావున్నాయి! ఆ చీమలు ఎందుకలా హడావుడిగా అటూఇటూ తిరుగుతాయో ఇప్పటికైనా నీకు అర్ధమయ్యిందా!' అని నవ్వుతూ అడిగాడు శేషుబాబుని.
'ఓ అర్ధమయ్యింది బాబాయ్,చీమలకి కాళ్ళు నిలవవు,అవి ఒక దగ్గర కుదురుగా వుండలేవు,అందుకే అటూఇటూ కాళ్ళు కాలిన పిల్లులులా తిరుగుతూనే ఉంటాయి,వాటికి పనీ పాటూ ఉండదు,ముఖ్యంగా బడికి వెళ్లడం,చదవడం,రాయడంలాంటి పనులులేవు కదా వాటికి అందుకే అలా తింటూ తిరుగుతుంటాయి!'అని అన్నాడు శేషుబాబు చిలిపిగా నవ్వుతూ....
'శేషుబాబూ నీకు ఊహ తెలిసినప్పటి నుండి చీమల దండు ప్రయాణాలు గమనించడం నాకు తెలుసు అయితే నువ్వు వాటి కదలికల అసలు ఉద్దేశం తెలుసుకోలేదన్న మాట!అని అన్నాడు బాబాయి సందేహం వ్యక్తంచేస్తూ....
'బాబాయ్! చీమలు హడావుడి కదలికల ఉద్దేశ్యాలు ఎలావున్నా... అవి బడిపిల్లలు ప్రార్ధనా సమయంలో పాటించే క్రమశిక్షణలా వరసల్లో వెళ్లడం, ఎదురెదురుగా తారసపడిన చీమలు మూతులు కొరుక్కొని గుసగుసలాడుకోవడం బలే గమ్మత్తుగా ఉంటుంది,అందుకే వాటి ఉరుకులు పరుగులను మైమరిచిపోయి చూస్తుంటాను'అని అన్నాడు శేషుబాబు కొంచెం నిర్లక్ష్యంగా...
శేషుబాబుకి చీమల క్రమశిక్షణ గురుంచి చెప్పి వాడిని ఈ చిన్న వయసు నుండే చీమల శ్రమ జీవన విధానం,పొదుపుసూత్రాలు,ముందుచూపు జాగ్రత్తలు గురుంచి చెప్పాలనుకున్నాడు బాబాయ్.
ఒక సెలవురోజు శేషుబాబుని వాళ్ళ పంచదార గిడ్డంగి వద్దకు తీసుకొని వెళ్ళాడు బాబాయ్.అక్కడ చీమల మందు జల్లవద్దని అక్కడ మనుషులతో ముందుగానే చెప్పాడు బాబాయ్,అంతే చీమలు పంచదార గిడ్డంగి చుట్టూ బారులు తీరి ఉన్నాయి.శేషుబాబుకి బూతద్దాలు ఇచ్చి,చీమల్ని చెదరగొట్టకుండా చీమల బారులను క్షుణ్ణంగా పరిశీలించమన్నాడు బాబాయ్.
శేషుబాబు ఒక తెల్లకాగితాల పుస్తకం తెచ్చుకొని అందులో చీమల బారులు వింతలు ఇలా రాసుకున్నాడు.
'చీమలు ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోవడం లేదు, నిరంతరం శ్రమిస్తూ ఆహారాన్ని గిడ్డంగినుండి పుట్టలలోనికి మోసుకొని వెళ్తున్నాయి,చీమలు వాటి బరువుకన్నా చాలా ఎక్కువ బరువువున్న ఆహారాన్ని దొర్లించుకొని తీసుకువెళ్లిపోతున్నాయి.వాటి మధ్య ఎక్కడా గొడవలు లేవు,ఎవరు ఎక్కువ పని చేస్తున్నారు.ఎవరు తక్కువ పని చేస్తున్నారు, ఎవరు విశ్రాంతి తీసుకుంటున్నారు అనే వాటాలు వంతులాటలు వాటి మధ్యలేవు,మధ్యలో ఎదురుపడిన చీమల ముఖాలు వద్ద ముఖాలు పెట్టి,ఏవో సమాచారాలు ఇచ్చి పుచ్చుకున్నట్లు అవి కన్పిస్తున్నాయి, ఎక్కడా సమయం వృధా లేనట్లు కన్పిస్తుంది,వాటి వద్ద ఆహార నిల్వలు ఎంత ఎక్కువ వున్నా వెలుతురు ఉన్నంత వరకూ ఆహార సేకరణలోనే చీమలు ఉన్నాయి.ఆహార వినియోగంలో పొదుపు పాటిస్తున్నాయి.ఎర్రని రంగులో చూడముచ్చటగా మిలటరీ సేనలులా బారులు తీరి, ఎక్కడా క్రమశిక్షణ దాటకుండా నడుస్తున్నాయి.చీమల నాయకులు కూడా అక్కడక్కడ ఉన్నట్లు అనిపిస్తుంది. వాటి ఆదేశాలతో తూచా తప్పకుండా చీమలు నడుస్తున్నట్లు,పని చేస్తున్నట్లు కనిపిస్తుంది'.
శేషుబాబు రాసుకున్న చీమదండు విషయాలు చూసి,'దీన్ని బట్టి నువ్వు తెలుసుకున్నది ఏమిటి!' అని అడిగాడు బాబాయ్. చీమల దండు విశేషాలు చూసి నేను చాలా నేర్చుకున్నాను.శరీర శక్తి, ఓపిక ఉన్నప్పుడే చీమల్లా శ్రమిస్తే భవిష్యత్తు బంగారం అవుతుంది.చీమలు తీరు తెలుసుకొని,ఆ తీరుని పాటిస్తే ఈ ప్రపంచం ఒక మంచి వసుధైక కుటుంబం అవుతుంది'అని అన్నాడు శేషుబాబు.
బాబాయ్ సంతృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్పటి నుండి శేషుబాబు చీమల బారులు చూడటానికి సమయం వృధాచెయ్యకుండా ఒక చక్కని చైతన్యవంత చీమలా క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకుంటూ పెరిగి పెద్దవ్వాలని నిర్ణయించుకున్నాడు.శేషుబాబులో చీమల దండు తెచ్చిన మార్పుకి బాబాయ్ సంతోషించాడు.