ఇంకా పూర్తిగా తెల్లారిందో లేదో సూర్యారావు గారు ఆవేశంగా ఆకాశంలోకి వచ్చేసి చిటపటలాడుతూ దర్భారు మొదలెట్టాడు.
రెపరెపలాడిపోతున్నాను నేను. కుతకుతమని ఉడికిపోతోంది మనసు.
తలెత్తి ఆకాశంలోకి కోపంగా ఆకాశంలోకి చూసి " ఏంటా కోపం బాబాయ్ , ఇంట్లో పిన్నితో గాని గొడవ పడ్డావా ఏంటి , పండగకి కొత్త చీర అడిగిందా లేక కొత్త నక్లెసు కోరిందా " అన్నాను చెమట్లు కక్కలేక ఆయాసపడుతూ.
ఉసూరుమని నిట్టూర్చి "అదేలేదే అమ్మాయ్, అలకలు , గొడవలు పడే తీరిక నాకెక్కడ ఏడ్చిందే!పగలంతా డ్యూటీలో అలసిపోయి కొంపకెళ్ళి హాయిగా బజ్జుందామంటే నిద్ర పట్టడం లేదురా" అన్నాడు.
"ఎందుకని అంటావ్ , ఎప్పుడో లక్షల ఏళ్ళ నాడు పుట్టావ్ కదా బహుశా వయసైపోయిందేమో , ముసలాడివి అయ్యుంటావ్ " అన్నాను.
నీకు వయసు అయిపోయింది అంటే పాడె మీద పడుకున్నోడికి కూడా పౌరుషం పొడుచుకొస్తందన్న నిజాన్ని గ్రహించలేని అమాయకత్వం నాది.
" ఛస్, నాకేం వయసు మళ్ళలేదు , నాకంటే ఎంతో ముందు పుట్టిన నక్షత్రాలన్ళీ సుబ్బరంగా హాయిగా ఆడుతూ పాడుతూ ఉంటేనూ , నేల మీద అడ్డదిడ్డంగా పెరిగిన జనాభా చేసే అకృత్యాల వల్ల కాలుష్యం పెరిగి ఆ ప్రభావం నామీద కూడా పడుతోందని ఎవరో చెప్పుకుంటుంటే విన్నాను." అన్నాడు బెంగగా.
ష్ నీది నా బతుకేనా అనుకున్నాను.
కాసేపటికి మబ్బు పట్టి గాలి మొదలైంది.మొదట నిదానంగా తరువాత వేగంగా.
"ఏంటి మావా,ఇంత ఉక్రోషం నీకు. ఈ గోడ వెంబడి కాస్త నెమ్మళంగా ఉన్నాను అనుకుంటున్నానో లేదో వచ్చేసావే , చుప్పనాతోడివయ్యోయ్ " అన్నాను. ఆయన గారి ధాటికి తట్టుకోలేక ఎగిరి ముళ్ళ చెట్టు మీద పడుతూ.
"ఏం చేయమంటావే పిల్లా , నాకేమైనా సరదాగా ఉండి వచ్చాను అనుకున్నావా ఏంటి , బంగాళాఖాతంలో అల్ప పీడనమే , తప్పదు ఓర్చుకోవే" అన్నాడా పెద్దమనిషి నన్ను గింగరాలు తిప్పుతూ.
ఏం ఓర్చుకోమంటారు నా బొంద , శరీరమంతా ముళ్ళ గాయాలకి చీలికలౌతుంటే , మనసు రక్తం ఓడుస్తోంది , కంటికి కనపడని , చెవికి వినపడని ఘోష నాది.
గాలి వాటుగా పయనిస్తూ ,పడుతూ లేస్తూ ఓ ఖాళీ స్ధలం లోకి వచ్చి పడ్డాను.
ఎవరో చుట్టూ గోడ కట్టి వదిలేసారు. అది చాలుగా జనానికి ఇళ్ళలోని చెత్త అంతా అక్కడే పోస్తున్నారు.
ఉసూరుమంటూ పరిసరాలు గమనిస్తున్నాను. నాలాంటి వాళ్ళే కొంతమంది కనపడ్డారు నా జాతి వాళ్ళు.రకరకాల రంగుల్లో , సైజుల్లో చినిగి చీలికలై , దుర్భరావస్ధలో.
నా ప్రాణం లేచొచ్చింది తోడు దొరికినందుకు.
ఎదురుగా మొక్కని చుట్టుకుని ఒకటే కంట తడి పెట్టుకుంటోంది నా చెల్లెలు వరసయ్యే నల్ల పాలిధిన్ కవర్.
కారణం అడిగా!
నిన్ననే పుట్టిందంట. ఎంతో సరదాగా , జట్టుతో కలిసి కేరింతలు కొడుతూ ఉంటే పొద్దున్నే చికెన్ షాపులో దాన్ని ఉపయోగించారంట.
"పోనీలే ఆదివారం అందరికీ ఇష్టమైన చికెన్ కోసం నన్ను వాడుకుంటున్నారులే అని సంబర పడ్డానక్కా.ఇంటికి వెళ్ళగానే ఆ పెద్దమ్మ మాంసం అంతా గిన్నెలోకి తీసేసుకుని నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టింది.
నాకు ఇంకా బెంగ తీరక , వాళ్ళపై ప్రేమ చావక , పిల్లలు ఆడుకుంటున్నారులే కాసేపు వాళ్ళతో కలిసి ఉందామని ఇంట్లోకి వెళ్ళబోతే ఛీ ఛండాలం , దరిద్రపు కవర్ అని తిట్టి గిరాటేసిందక్కా" అని బావురుమంది.
"సరేలేవే ఏడవకు , ఏం చేస్తాం నా బతుకేమన్నా గొప్పగా ఏడ్చిందనుకున్నావా ఏంటి? కూరగాయలు తీసుకెళ్తున్నారు , బరువెక్కవై చిరిగాను , అంతే ఆ పెద్ద మనిషి పళ్ళు పటపటామని కొరికి ఎంత బూతు మాట వాడాడో తెలుసా! చెప్పుకుంటే పరువు పోతుంది అని గుటకేసుకుని ఊరుకున్నాను" అన్నాను కళ్ళు ఒత్తుకుంటూ , ఎక్కిళ్ళు పెడుతున్నారు మా జనమంతా , ఒక్కొక్కళ్ళది ఒక్కో గాధ , వ్యధ.
బట్టల కోసం , పూలూ పండ్ల కోసం , సరుకుల కోసం , ఆఖరుకు కర్రీ పాయింట్లో కూరల.కోసం వాడేయడం , విసిరేయడం , కనీస మర్యాద కూడా లేదు.
ఎవరో చిన్న మూట కాంపౌండ్ లో విదిలించారు.
విస్తర్లు , గ్లాసులు , స్వీట్ పాకెట్ కవర్లు బయట పడ్డాయి.
" ఏమే అయ్యిందా మీ భాగోతం , పుట్టినప్పుడు తెగ మిడిసిపడ్డారుగా ,అర చేతుల్లో పెట్టుకుంటారు , గుండెలకు హత్తుకుంటారు అని. అణిగిందా అదిరిపాటు అన్నాను ఈసడింపుగా.
"ఏందక్కా నువ్ కూడా! పుండు మీద కారం జల్లుతవ్ , అసలే అవమానం జరిగి మేము ఏడుస్తుంటే! " అంది విస్తరి.
"శుభ్రంగా వడ్డించుకుని తిన్నారు , విసిరి బైట పారేసారు. పక్కింట్లో పడటం నా తప్పా! వాళ్ళూ వీళ్ళూ గొడవ పడి తెగ తిట్టుకున్నారు. ముష్టి ఆకులంట , ఎంగిలాకులంట , ఎంత మాటన్నారో తెలుసా తినేప్పుడు బానే ఉన్నారుగా అయిపోయాక అంతంత మాటలెందుకు?"
అదేనే మరి నేను చెప్పింది. పని అయ్యాక మమ్మల్ని అయినా ఇంట్లో ఉంచుకుంటారేమో గాని మిమ్మల్ని మాత్రం ఓ నిముషం కూడా ఉండనివ్వరు.
అవసరం తీరాక అమ్మానాన్నల్నే ఈడ్చి బయట పడేసే రకాలు వీళ్ళు. మనల్ని గౌరవంగా చూస్తారనుకోవడం తప్పు అన్నాను.
"అవసరం కోసం సృష్టించుకుంది వాళ్ళు , విచక్షణా రహితంగా వాడి పారేస్తోంది వాళ్ళు. పర్యావరణానికి హాని అని కల్లబొల్లి కబుర్లు చెబుతోంది కూడా వాళ్ళే "ఆవేశ పడుతోంది ఓ సోదరి.
భూమిలో కలవమని జీర్ణం కామని తెలిసినప్పుడు భాధ్యతగా ఉండొచ్చు కదా , వాడకం పై నియంత్రణ , పాత వాటిని సేకరణ పునః ఉపయోగాలు చేసుకోవచ్చు కదా.
ఒక్క మమ్మల్నే కాదు హాస్పిటల్ వ్యర్ధాల్లో ఎంత ప్లాస్టిక్ ఉంటుందో తెలుసా , కుర్చీలు , తలుపులు , షోకేస్ లో అలంకరణ వస్తువులు వంటింట్లో గిన్నెలు సర్వం ప్లాస్టిక్ మయం.
వాడితే తప్పులేదు. పాడైపోయాక పారేయడమే తప్పు.
చనిపోయిన మనిషికి దహన.సంస్కారాలు చేయడం అనేది కనీసపు మానవత్వం. అది అతడి హక్కు కూడా!
మరి దీనావస్థకు చేరిన మాకు ఆ హక్కు వర్తించదా? మాకు మేముగా ఈ భూమి మీదకు రాలేదు కదా! కన్నవాడే కర్కశంగా ప్రవర్తిస్తే , కాళ్ళతో తన్నేస్తే మా బాధ ఎలా ఉంటుందో ఊహించలేరా! ఆపాటి జ్ఞానం కూడా లేదా! ఏమిటీ జనం తీరు. కళ్ళ ముందు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న మమ్మల్ని పట్టించుకోవాలని గానీ , ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలని గానీ తోచదా!
దేవుడా నీ సృష్టిలో అత్యంత విజ్ఞాని అయిన మానవుడు అజ్ఞానంలో కూడా మొదటి స్థానంలోనే ఉన్నాడయ్యా.
ఈ పాపులను క్షమించి జ్ఞానం ఒసగుమయ్యా అనుకోవడం తప్పించి ఏం చేయలేను.
మావల్ల కాలుష్యం అనే మాట వినలేక పోతున్నాను.
అక్కర్లేని , హీనమైన జీవితం గడుపుతూ చావుకై లక్ష ఏళ్ళు గడపడమెంత నరకమో ఊహించుకోండి.
"అక్కా , వాడి పారేస్తున్నారని మీరేడుస్తున్నారు. వాడకం అయిపోయినా వదలకుండా మళ్ళీ మళ్ళీ వాడుతూ మమ్మల్ని అరగదీస్తున్నారక్కా" అంది మా బుల్లి టీ గ్లాసు.
దానికి వంత పాడుతూ ముక్కులెగరేస్తోంది సెలైన్ బాటిలు , కళ్ళెర్రజేసేసింది సిరంజీ మరియు నీడిలు.
నీతులు చెప్పే వాళ్ళకు ఒకరి సూదులు మరొకరు వాడితే రోగాలు వస్తాయని తెలీక పోవడం వింతకదా!
అలాగే జరగాలి వీళ్ళకు ఎవరో గుంపులో నుండి స్వరం వినిపించారు.
"తప్పురా అలా అనుకోకూడదు. అప్పుడు మనకూ మనిషికి తేడా ఏముంటుంది " సముదాయించే ప్రయత్నం పెద్దదానిగా చేస్తున్నాను గానీ ఆ కడుపు మంట నాకూ లేకపోలేదు
నీటి ప్రవాహానికి అడ్డు పడుతున్నామని , వరదలకు కారణమని మైక్ పుచ్చుకుని మరీ అరుస్తున్నాడో మహానుభావుడు , వాళ్ళ ఇంట్లో చూడాలి ఎంత ప్లాస్టిక్ వాడకం జరుగుతుందో.
"నీకో సంగతి తెలుసా, ఊళ్ళలో పొయ్యి రాజేయడానికి కిరోసిన్.దొరక్క మనల్ని వేసి తగలేస్తున్నారంట తెలుసా" ఒకరి ఆవేదన.
అలా చేస్తే కాలుష్యం మరింత పెరుగుతుంది కదా! ఆరోగ్యానికి హానికరమేగా! ఈ మనిషి కీడెంచి మేలెంచు అనే సామెత ఎందుకు మర్చిపోతున్నాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం. ఎంత నేను బుర్ర బద్దలు కొట్టుకుంటే ఏం ప్రయోజనం. వాడికి ఉండాలి గాని.
మరల మరో ఈదురు గాలి రివ్వుమంటూ
సమావేశం అర్ధాంతరంగా ఆగిపోగా , తలా ఒక దిక్కుకి ఎగరడం మొదలెట్టాం. దిక్కులేని వాళ్ళం కదా.