చెల్లుకు చెల్లు! - పద్మావతి దివాకర్ల

tit for tot

కరోనా మహమ్మారివల్ల ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. జనాల్ని వీధిలో వెళ్ళడాన్ని నిరోధించడంకోసమో లేక ఈ విపత్కర పరిస్థితుల్లో భక్తి మార్గంలోకి మళ్ళించడంకోసమో, లేక వాటివల్ల పుణ్యం, పురుషార్థం కూడా ఉన్నాయని గ్రహించడం వల్లో కానీ టివీల్లో మళ్ళీ రామాయణం, మహాభారతాలు మొదలయ్యాయి.

టివీలో దూరదర్శన్‌చానల్లో ‘మహాభారతం’ సీరియల్ వస్తోంది. భానుమతి సోఫాలో కూర్చొని సీరియల్ చూస్తోంది. బాబూరావు వంటింట్లోకెళ్ళి కాఫీ కలుపుకొచ్చి భానుమతికి ఓ కప్పు అందించి తనొకటి తీసుకున్నాడు. కాఫీ అందుకుంటూ "రాత్రికి భోజనంలోకి కూరలేం చేసారు?" అని అడిగింది భానుమతి టివీనుండి చూపు మరల్చకుండా. చెప్పాడు బాబూరావు.

కరోనా మహమ్మారి వలన నలభై రోజులుగా లాక్ డౌన్‌లో మగ్గుతున్న బాబూరావు మొదట్లో ఏమీ తోచక భార్య భానుమతికి వంటపని, ఇంటిపనుల్లో సహాయం చేసాడు. పనిలోపనిగా మెల్లమెల్లగా వంటపని నేర్చుకున్నాడు. అయితే రోజులు దొర్లి క్రమంగా లాక్‌డౌన్ 2.00 లోకి వచ్చిన తర్వాత వంటపని, ఇంటిపని బాబూరావు ముఖ్య బాధ్యత అయి కూర్చుంది. ఎప్పుడీ లాక్ డౌన్ పూర్తవుతుందా, భార్య బారినుండి తప్పించుకొని ఆఫీస్‌కి వెళ్తానా అని ఎదురు చూస్తూండగానే మూడో విడత లాక్‌డౌన్ కూడా అమలయ్యింది. త్వరలో లాక్ డౌన్ 4.0 కూడా ఎదురు రానున్నది. త్వరలో లాక్‌డౌన్ అర్ధశతదినోత్సవం జరుపుకోబోతోంది. ముందుముందు ఇలా ఇంకెన్ని లాక్ డౌన్లు చూడాలో అని రోజురోజుకీ బెంబేలెత్తిపోతున్నాడు పాపం బాబూరావు.

రాత్రి భోజనం చేస్తూ అంది భానుమతి, "ఈ లాక్ డౌన్ ఎప్పుడు పూర్తవుతుందో ఏమో?"

"అవును! నేను కూడా అందుకోసమే వెయిటింగ్! ఈ లాక్ డౌన్ ఎత్తేస్తే ఎంచక్కా ఆఫీస్‌కి వెళ్ళపోవచ్చు." అన్నాడు బాబూరావు.

"ఏం! ఇంట్లో పని తప్పించుకుందామనే!” అని బాబూరావువైపు ఉరిమిచూసి, "నా ఉద్దేశ్యం అదికాదు. నేను మాత్రం అందుకనలేదు. లాక్ డౌన్ ప్రకటించక ముందు నా పుట్టినరోజుకి మీరు రవ్వల నెక్లెస్ కొనిస్తానన్నారు కదా! ఇప్పుడెలాగూ బంగారం షాపులు తెరిచిలేవు. లాక్ డౌన్ ఎత్తేయగానే కొనాలి సుమా!" అందామె.

"నేనా! నేనెప్పుడు కొని ఇస్తానన్నాను?" కళ్ళు తేలేసాడు బాబూరావు.

"ఈ లాక్‌డౌన్‌వల్ల మీకు మతిమరుపు వచ్చేసినట్లుంది. బాగా గుర్తుచేసుకొండి. ఈ లాక్‌డౌన్‌లు ఒకటి తర్వాత ఒకటి వరసగా నాలుగువిడతలుగా రావడంవల్ల మీరు అన్నీ మర్చిపోయినట్లు ఉన్నారు. సరే, మొత్తం ప్లాష్‌బ్యాక్ మీకు గుర్తు చేస్తాను. సరిగ్గా ఐదేళ్ళ క్రితం పాత నోట్లు రద్దైన సమయం గుర్తుకుతెచ్చుకొండి. మీ వద్ద డబ్బులు లేక, బ్యాంక్‌క్యూ, ఏటిఎం క్యూల్లో నిలబడలేకపోతే నా పోపుల డబ్బాల్లోంచి డబ్బులు తీసి మీకియ్యలేదా? అదీ తక్కువ మొత్తమేమీ కాదు, యాభైవేలపైనే తీసుకున్నారు. దాని బదులుగా మీరు నాకు నెక్లెస్ కొంటానని అప్పట్లో వాగ్దానం చెయ్యలేదా? ఈ ఐదేళ్ళుగా ప్రతీసారి దాటవేస్తూ చివరకి మార్చ్ నెలలో నా పుట్టిన రోజుకి తప్పకుండా కొనిస్తానని మాట ఇచ్చారు. తీరా ఆ సమయానికి ఈ మాయదారి కరోనావల్ల లాక్ డౌన్ దాపురించిందాయె మరి! తీరా ఇప్పుడేమో నాకేమీ తెలియని బుకాయిస్తున్నారు." అందామె మూతి ముడుచుకుంటూ.

అప్పుడు గుర్తుకువచ్చింది బాబూరావుకి. నిజమే! ఈ లాక్ డౌన్ గందరగోళంవల్ల ఏదీ సరిగ్గా గుర్తు ఉండటం లేదు. పైగా ఇంట్లో పని పెరిగిపోవడం వల్ల, వర్క్ ఫ్రం హోం వల్ల కూడా అంతా గజిబిజిగా, తికమకగా తయారయింది. అయితే భానుమతికూడా ఈ విషయం అప్పుడే మర్చిపోయి ఉంటుందిలే అనుకున్నాడు మరి. తనకైతే జేబుకి చిల్లుపడుతుందని మర్చిపోతాడు కాని, ఆమె ఎందుకు మర్చిపోతుంది తన పిచ్చిగానీ? పైగా ఆమెకి నగలంటే పిచ్చి వ్యామోహం కూడా. అప్పుడు డబ్బులు అవసరమై తీసుకున్నపుడే తెలిసింది మరి ఆమె పోపులడబ్బా సామాన్యమైన పోపులడబ్బా కాదని, పుష్పక విమానంలాంటిదని. తీసేకొద్దీ దాంట్లోంచి అలా డబ్బులు వస్తూనే ఉన్నాయి మరి. అది చూస్తూనే ప్రపంచంలోని నల్లధనమంతా ఈ పోపుల డబ్బాలోనే ఉన్నట్లుంది అనుకున్నాడు అప్పుడు. అప్పటికీ అది తను ఇంటి అవసరాలకోసం ఇచ్చిన దాంట్లో కొట్టేసిన బాపతు కదా అని అందుకే అది తన డబ్బేనని వాదించాడు బాబూరావు. దానికి భానుమతి ఒప్పుకోలేదు. తన తెలివితేటలతో మిగిల్చిన డబ్బు కాబట్టి అది తనదేనని, అది ఇచ్చేముందు తనకి రవ్వల నెక్లెస్ కొనాలని షరతు పెట్టింది. విధిలేక బాబురావు ఒప్పుకోవలసి వచ్చింది. అయితే, అసలు తనెందుకు నోట్లు రద్దు సమయంలో ఆమె వద్ద డబ్బులు తీసుకోవాలి? పోనీ తీసుకున్నాడు, ముందూవెనకా ఆలోచించకుండా దశరథుడు కైకేయికి మాట ఇచ్చినట్లు నెక్లెస్ కొంటానని బుర్రలేని మాట ఇచ్చేయడమేనా? ఇప్పుడు కాకపోయినా, ఈ లాక్ డౌన్ ఎత్తేసాకైనా తను ఆమె కోరిక తీర్చక తప్పదు కదా. ఈ ప్రమాదాన్ని తప్పించుకోవడమెలా అని తీవ్రంగా ఆలోచించుకోసాగాడు బాబురావు.

బాబురావు మదిలోని ఆలోచనలని పసిగట్టేసిందామె. "మళ్ళీ ఎలా ఎగ్గొడుదామనా మీ ఆలోచన! మీ ఎత్తులు నాకు బాగా తెలుసు. ఆ పప్పులేమీ ఉడకవు! ఈ లాక్ డౌన్ ఎత్తేయగానే తక్షణం నాకు రవ్వల నెక్లెస్ కొనాల్సిందే!" అందామె కరాఖండీగా.

"పప్పు ఇంకా స్టవ్ మీద పెట్టందే ఉడుకుతుందెలాగ?" బలవంతంగా నవ్వుతూ జోకేసాడు బాబూరావు వాతావరణం తేలికచేయడానికి.

"మీ కుళ్ళు జోకులు ఆపండి. మీరీసారి రవ్వల నెక్లెస్ కొనకపోతే మాత్రం మా పుట్టింటికి వెళ్ళిపోతా!" అందామె బెదిరిస్తూ.

"ఎక్కడికెళిపోతావు ఈ లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పుడు, అసలే బస్సులు, రైళ్ళేకాదు, ఆటోలు కూడా లేవు కదా." గబుక్కున అనేసి తీరిగ్గా నాలిక కరుచుకున్నాడు, తన అత్తవారిల్లు పక్క ఎపార్ట్‌మెంట్‌లోనే అన్న సంగతి గుర్తుకివచ్చి.

'ఈ తింగరిది అన్నంత పని చేసినా చేస్తుంది. పైగా తనమీద లేనిపోని చాడీలు చెప్పొచ్చుకూడా. ఆనక కౌరవుల చేతికి ఒంటరిగా చిక్కిన అభిమన్యుడిలాగ అవుతుంది తన పని.' అని మనసులో అనుకొని, “ ఈ సమావేశం ప్రస్తుతానికి వాయిదా వేయడమైనది. ఈ విషయమై తదుపరి సమావేశం మళ్ళీ రేపు ఉదయమే!" పక్కా రాజకీయనాయకుడిలాగా భానుమతితో అని తన కర్మభూమివైపు అదేనండీ, వంటింటివైపు నడిచాడు బాబూరావు.

"మీరు వాయిదాలమీద వాయిదాలేస్తే మాత్రం ఊరుకునేది లేదు!" అందామె వార్నింగ్ ఇస్తూ.

ఆ విషయమే తీవ్రంగా ఆలోచిస్తూ ఆ రాత్రంతా గడిపాడు పాపం బాబూరావు. చివరికి ఫ్లాష్‌లాగ ఒక ఉపాయంతట్టి తెల్లారి చూసుకోవచ్చని నిశ్చింతగా నిద్రపోయాడు బాబూరావు.

మధ్యాహ్నం భోజనం సమయంలో మళ్ళీ రవ్వల నెక్లెస్ ప్రసక్తి తీసుకువచ్చింది భానుమతి భర్త చేసిన బీరకాయకూర తింటూ.

వెంటనే బాబారావు జవాబిస్తూ, "నేను నీవద్దనుండి డబ్బులు తీసుకున్నందుకే కదా రవ్వల నెక్లెస్ కొనమంటున్నావు?" అన్నాడు.

"అవును!" అందామె భర్త వైపు చూస్తూ ఏమనబోతున్నాడో తెలియక.

"ఆ యాభైవేల అప్పు ఎప్పుడో తీరిపోయింది కదా!" అన్నాడు బాబూరావు.

"అదెలాగా?" అందామె తెల్లబోతూ.

"మరి ఈ యాభై రోజులగా నేను ఇంటిపని, వంటపని చెయ్యట్లేదా మరి. దానికి ఇది చెల్లు. చెల్లుకి చెల్లు. పైగా నువ్వే నాకు బాకీ పడతావు సుమీ!" అన్నాడు.

బాబూరావుచేత వారం క్రితం పెట్టించిన ఆవకాయ కలుపుకొని నోట్లో ముద్ద పెట్టుకోబోతున్న భానుమతికి ఒక్కసారి పొలమారింది. మంచి నీళ్ళు తాగి తేరుకుంది. ఆ తర్వాత బాబురావు చెప్పిన లాజిక్‌కి తెల్లబోయింది భానుమతి.

ఈ లాక్‌డౌన్‌వల్ల బాబూరావు తెలివితేటలు పెరిగిపోయాయేమోనని మొట్టమొదటిసారిగా డౌట్ కలిగింది భానుమతికి. అయితే వెంటనే తేరుకుని కౌంటర్ ఇచ్చింది గట్టిగా, "భలే చెప్పారే! ఏమిటి, యాభై రోజుల పనికే మీ యాభైవేల రూపాయల బాకీ చెల్లుబాటు అయిందా? చెల్లుకి చెల్లా? ఈ లాక్‌డౌన్ ముందు మూడున్నరేళ్ళు నేను చేసిన పనికి కూడా లెక్క కట్టండి అదే రేట్‌లో మరి! మీ పనిబాకి పోగా ఇంకా పది లక్షలు మీరే నాకు బాకీ పడ్డారు సుమా! ఈ లెక్కన మీరు నాకు రవ్వల నెక్లెస్ కొనిస్తే సరిపోదు. మీరు ఏకంగా వడ్డాణమే బాకీ పడ్డారు నాకు. మరి అది ఎప్పుడు కొంటారో తేల్చండి ముందు?"

ఆ మాటలు వింటూనే గుడ్లు తేలేసాడు బాబూరావు, నేరకపోయి కొరివితో తల గోక్కున్నానే అని. నెక్లెస్‌తో పోయేదానికి వడ్డాణం తలమీదకు తెచ్చుకున్నానే అని బేర్‌మంటూ బెంబేలేత్తిపోయాడు పాపం బాబూరావు, ఈ లాక్‌డౌన్‌వల్ల పనిలేకుండా పెరిగిన తిండివల్ల రెండురెట్లైన ఆమె నడుమువంకే చూస్తూ.

-పద్మావతి దివాకర్ల

……………………

మరిన్ని కథలు

Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు