
“నేను రక్త దానం చెయ్యను మొర్రో. నన్నొదిలి ఇక్కడినుండి కదులు లలితా.”
“అలా అనకు కిరణ్.మనం చేసే మంచే మనకి ఓ పెట్టని కంచై కాపాడుతుంది.నీకూ తప్పక మంచే జరుగుతుంది.పద, అతనెవరో లారీ కింద పడ్డాడట.పరిస్థితి విషమంగా ఉందట.”
“లారీ కింద పడి బ్రతికున్నాడా?అదెలా సాధ్యం!అయితే ఇపుడు అతన్ని హాస్పిటల్‌తో పాటు గిన్నిస్ రికార్డుల్లో కూడా చేర్చాలి.”
“అలా కాదు కిరణ్.అపుడు ఆ లారీ ఆగి ఉందట.”
“అబ్బబ్బబ్బా! కాస్త సరిగా చెబుతావా.సహనం ఆవిరైపోతోంది నాలో ” చెప్పాడు చేతులు కసా ,పిసా నలుపుకుంటూ.
“ఏవుందీ.సెల్ మాట్లాడుతూ రోడ్డు దాటుతుంటే, బైక్ గుద్దిందట.దాంతో రోడ్డు పక్క ఆగి ఉన్న లారీ కిందకెళ్ళి పడ్డాడట.ఇంతలో అతని ఫోన్ మోగింది.దాంతో అతను లారీ కింద ఉన్నానన్న సంగతి మర్చిపోయి, చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని హలో అని ఒక్కసారిగా వేగంగా లేవబోయాడట.దాంతో లారీ అడుగు ఇనువు బాగం తగడంతో పరిస్థితి విషమించిందట. అతనిది రేర్ బ్లడ్ గ్రూపు కావడంతో ఎక్కడా దొరకలేదట.నీది అదే బ్లడ్ గ్రూపు కదా అని నిన్ను అడగటం.”చెప్పిందామె నసుగుతూ.
“బావుంది నీ వరస. అయినా ఏ అన్నదానమో, వస్త్రదానమో చేయమంటే సరేకానీ, ఇలా రక్తదానం చేయమంటే ఎలా.అయినా ప్రతి సారీ నీకు ఇదో అవాటైపోయింది.మొన్న నీ పుట్టినరోజుని నేను ఫైవ్‌స్టార్ హోటల్లో ప్లాన్ చేస్తే, నువ్వు ఆర్ఫనేజ్ హోంలో చేసుకుంటానన్నావ్. సరే అన్నాను.వీకెండ్‌లో శెలవు కదా అని నీతో సరదాగా గడుపుదాం అనుకుంటే, సరిగమ రోడ్డు పక్క ఉన్న బిచ్చగాళ్ళకి అన్నం పొట్లాలూవగైరా పంచుదాం అంటూ తీసుకెళ్ళావ్.పోనీలే నా ఖర్మే ఇంత అని సరిపెట్టుకున్నాను.మొన్నటికి మొన్న వారం నా తదనాంతరం,అవయవదానానికి సుముఖం అని ఓ పత్రంపై సంతకం చేయించావ్.నిన్న వారం, సర్‌ప్రైజ్ అని చెప్పి ఓల్డేజ్ హోం కి తీసుకెళ్ళి అందర్నీ పెదనాన్న,బాబాయ్, తాతయ్యా,బామ్మా అని పేదరాశి పెద్దమ్మలా పలకరించావ్.నాల్రోజుల క్రితం, మురికి వాడలకి తీసుకుపోయి నీరు మరగబెట్టుకు తాగమనీ ,దోమలు పెరగకుండా ఉండటం పై అవగాహన అంటూ నా సహనం నాశనం చేశావ్.ఇలా చాలా చేసావ్.నిన్ను ప్రేమించిన పాపానికి ఇవన్నీ భరిస్తున్నాను.ఇక ఇప్పుడు వచ్చి ఎవరో దారినపోయేవాడికి రక్తం కావాని అర్జెంటుగా నన్నింమంటున్నావ్. నేను చచ్చినా ఇవ్వను.అయినా నేనెందుకు రక్తదానం చేయడం.దానికి బ్లడ్ బ్యాంకులు అవీ ఉన్నాయిగా. అక్కడికి పోయి తీసుకుంటార్లే.”
“అలా అనకు కిరణ్.రక్త దానం చేస్తే పుణ్యానికి పుణ్యం ఆరోగ్యానికి ఆరోగ్యం .పైగా నీకు ఎంతో ఆత్మ సంతృప్తి కూడా కలుగుతుంది.“ చెప్పింది లలిత.
“నాకున్న ఈ మాత్రం తృప్తి చాలు.అయినా ఇలానే నువ్ ఎపుడో నాకు ఆత్మ సంతృప్తికి బదులు ఆత్మ శాంతి కలిగిస్తావేమో ననే భయంగా ఉంది .”
“అది కాదు కిరణ్, నా మాట నమ్ము. రక్తదానం చేయడం వలన, గుండె పోటు వచ్చే అవకాశం తగ్గి ,గుండె గూటంలా పది కాలాల పాటు గట్టిగా ఉంటుందట.అలాగే కొలస్ట్రాల్‌ని స్ట్రాతో లాగేసినట్టు కొంత వరకూ నియంత్రించగలదట.శరీరానికి కొత్త రక్తం పడుతుంది.కనుక సొద ఆపి పద కిరణ్ వెళదాం.”
“అబ్బా! ఏంటి లిలితా ఈ రుబ్బుడు. అయినా నేను కాకపోతే ఎవడో ఒకడు ఇస్తాడులే.ఏమో, ఎక్కువ రక్తం తీసి బ్లాకులో అమ్మేసినా అమ్మేసుకుంటారు.పైగా నాకిపుడు వీర నీరసంగా కూడా ఉంది. ఇపుడు రక్తం ఇస్తే ఇక అంతే నా పని” అన్నాడతను.
“అలా అనకు. అందరూ నీలానే ఆలోచిస్తే ఇక అంతే . అయినా రక్తం ఏమైనా కోలా డ్రిoక్ అనుకున్నావా? కొంచెం రంగూ, కొంచెం నీళ్ళూ కలిపేసి గిలకరించి గ్లాసులో పోసి కృత్రిమంగా తయారు చేయడానికి. రక్తం కేవలం మనలాంటి మనుషుల నుండి మాత్రమే లభ్యమయ్యో ద్రవ సంజీవిని.చదువుకున్న నీలాంటి వాళ్ళు కూడా ఇలా ముతక మాటలు మాట్లాడితే ఎలా చెప్పు.నీలా ఆలోచించబట్టే, ప్రతి ఏడాదీ రక్తం కొరత కోరలు చాచి కోటలు దాటుతోంది. బ్లడ్ బ్యాంకుల్లో కూడా రక్తం బావిలో ఊటలా ఊరదు.మనలాంటి మనుషులు ఇస్తేనే అక్కడ బద్రపరిచేది.అయినా రక్తం సమయానికి అందక ఎంతమంది యమధర్మరాజు దగ్గరకి పోతున్నారో తెలుసా.ఒక పక్క రోడ్డు మీద యాక్సిడెంట్లు, మరో పక్క డెంగ్యూ,ఇంకో పక్క అత్యవసర ఆపరేషన్లు, ప్రసవ సమయంలో,రక్త హీనత ఉన్నవారికి,ఇలా చాలా మందికి నిత్యం రక్తం కావాల్సిందే.కానీ అంత నిల్వ కూడాలంటే నీలాంటి,నాలాంటి వాళ్లే నడుం కట్టాలి కదా.”చెప్పిందామె కోపంతో అతని బుగ్గని గట్టిగా గిల్లేస్తూ.
“వద్దు లిలితా.ఇస్తే,నీరసంతో రాలిపోతానేమో.పైగా నాకు రక్తం తగ్గిపోవచ్చు కూడా.కనుక ఎందుకొచ్చిన రిస్కు చెప్పు “ అంటూ బుగ్గ రుద్దుకున్నాడు.
“అలా ఏం కాదు.నీ హిమోగ్లోబిన్ శాతం,బరువు,బీపీ లాంటివన్నీ పరీక్షించే నీ దగ్గరనుండి రక్తం తీసుకుంటారు. లేదంటే, నువ్విస్తానని రెండు చేతులూ చాచి వెల్లకిలా పడుకుని నాలుక బయటపెట్టి నాగిన్ డాన్సు చేసినా ఒక్క బొట్టు రక్తం కూడా తీసుకోరు.”
“అలా అంటావా! అయినా నాకు రక్తం చూస్తే కళ్ళు సుళ్ళు తిరుగుతాయి లలితా. దబ్బనం లాంటి సూదితో కసక్కుమని చేతికి గుచ్చేస్తారు. పైగా కష్టపడి దాచుకున్న రక్తం, మళ్ళీ నా శరీరంలో ఎప్పుడు చేరుతుందో ఏమో.”చేతులు పిసుక్కున్నాడు
“అయితే గుఱ్ఱంలా కళ్ళకి గంతలు కట్టుకో.గొడవుండదు.సూది గుచ్చినపుడు నేను గిల్లిన దానికంటే పెద్ద నెప్పి ఉండి చావదు.నీ రక్తం నీకు రెండు వారాల్లో చేరుతుంది.భయం లేదు.నాదీ అభయం ఇక వదిలై భయం.”
“పోన్లే.పోనీ డబ్బులిస్తారా.ఊరికే ఉచితంగా, ఫ్రీగా ఇవ్వడం ఎందుకూ అని.”ఇకిలించాడు
“అలా అనకు. కావాంటే నువ్ ఇచ్చిన రక్తానికి బదులుగా నీకు కావాల్సిన గ్రూప్ బ్లడ్ తీసుకోవచ్చు.ప్రస్తుతం అవసరం లేకుంటే,నీకో కార్డు ముక్క ఇస్తారు.నీకు ఎపుడైనా అవసరం అనుకుంటే అది చూపి రక్తం తీసుకోవచ్చును.కొన్ని సంస్థలు ఈ సౌకర్యం కూడా ఇస్తున్నాయి.”
“అయినా ఇద్దరికి ఒకే గ్రూపు రక్తం కావాల్సినపుడు ఒకరికొకరు నేరుగా ఇచ్చుకుంటే పోతుందిగా.ఇలా మళ్ళీ బ్లడ్ బ్యాంకుని ఎందుకు సంప్రదించడం.”తలని గోళ్ళతో బర బరా గోక్కున్నాడు.
“సినిమాల్లో మాత్రమే అలా చూపిస్తారు.కానీ నిజంగా అలా ఎక్కిస్తే ఇక అంతే, వాళ్ళ పని పగిలిన ముంతే.ఎందుకంటే, అవతలి వారికి ఏ హెపటైటిస్ బీనో,ఏ వైరస్సో, జ్వరమో మరేదైనా వ్యాధి ఉంటే అది నీకు వచ్చి చస్తుంది.కనుక నువ్వు ఇచ్చిన రక్తానికి అన్ని రకాల పరీక్షలూ చేసి ,అది సురక్షితం అనుకుంటేనే దానిని ఇంకొకరికి ఎక్కిస్తారు.దీనికి గానే మన వద్దనుండి కొంత రుసుం వసూలు చేసేది.సరే పద ఇక ఎంక్వయిరీ చేయడం ఆపి రక్త దానం చేయి.ఇంకా అడిగితే ముక్కు పగులుతుంది.”
“సరే తప్పుతుందా.పద” అన్నాడు కిరణ్ కాస్త అసహనంగా,కాళ్ళకి కేజీ రాళ్ళు కట్టుకున్నట్టు నెమ్మదిగా అడుగులు వేస్తూ.
రక్తం ఇస్తున్నంత సేపూ అతను వసపిట్టలా,నసుగుతూనే ఉన్నాడు.
రక్తం ఇవ్వడం అయిపోయాక,”నువ్ ఓ మంచి పనిని నీ సంచిలో వేసుకున్నావ్.ఈ మంచి ఊరికే పోదు” చెప్పింది లిలిత చిన్న చిరునవ్వుతో.
ఓ వారం రోజు తర్వాత, లలిత ఇంటికి వెళ్ళిన కిరణ్, ఆమె కళ్ళలోకి దీర్ఘంగా చూస్తూ, “థాంక్ యు లలితా” అంటూ ఆమెని ఆత్మీయంగా వాటేసుకున్నాడు.
“ఏమైంది!హఠాత్తుగా ఏవిటి ఈ ఎ సర్టిఫికేట్ పనులు? మా అమ్మ కానీ వచ్చిందంటే నిన్ను నా జీవితం నుండి సెన్సార్ కట్ చేస్తుంది.” చెప్పిందామె నవ్వుతూ.
“ఇది అది కాదు.వారం క్రితం ఎవరికో యాక్సిడెంట్ అయింది. రేర్ బ్లడ్ గ్రూప్,నువ్వు రక్తదానం చేయాలి అని నన్ను బలవంతంగా తీసుకెళ్ళావు చూడు.అతను బ్రతికాడు.మా ఇంటికి ఫ్రూట్సూ ,స్వీట్సూ పట్టుకు వచ్చాడు.నన్ను ప్రాణదాత అని కళ్ల నీళ్ళు పెట్టుకున్నాడు.తర్వాత కాళ్ళు పట్టుకు పిసికేసాడు.తర్వాత చేతులు పట్టుకు నలిపేశాడు .నాకు చాలా సంతోషం అన్పించింది.మనసు నిండిపోయిది. పైగా అతను నా స్నేహితుడు కూడానూ. నువ్వన్నట్టు, చేసిన మంచి ఎక్కడికీ పోదు.”చెప్పాడు కిరణ్.
“చూసావా.ఎంత సంతృప్తి కలిగిందో.నువ్వు రక్తదానం చేయడం వలన ఒక నిండు ప్రాణం నిలబడిoది” చెప్పిందామె.
“ఒక ప్రాణం కాదు రెండు ప్రాణాలు.”చెప్పాడతను రెండు వేళ్ళు చూపిస్తూ.
“అదెలాగ” అడిగిందామె అమితాశ్చర్యంగా ఒక వేలితో తల గోక్కుంటూ.
“ఆ రెండో ప్రాణం నాదే” చెప్పాడు దేబ్యపు మొహంతో.ఓ క్షణం తర్వాత, మళ్ళీ ఆమె కళ్లలోకి చూస్తూ, “ఎలా అంటే,అతను ఇదివరలో ఓ మారు అర్జెంట్ అని నా కాళ్ళ మీద పడి కన్నీళ్ళు పెట్టుకుంటే, నోటి మాట మీద, చాటుగా అతనికి ఏడు లక్షలు అప్పిచ్చాను.అతను ఆరోజు పోయింటే నా డబ్బు కూడా పోయేది.దాంతో అది తట్టుకోలేక నేనూ ఆత్మహత్య చేసుకునే వాడ్ని.కనుక నువ్వన్నదే నిజం.చేసిన మంచి ఎక్కడికీ పోదు.కంచై కాపడుతుంది.సరే పద అలా వెళ్ళి వద్దాం.”
“ఎక్కడికి”.
“దగ్గర్లో రక్తదాన శిబిరం పెట్టారట మరి.”చెప్పాడు ఆమె చేయిపట్టుకుంటూ.
“అయితే పద” అందామె చక్కగా నవ్వుతూ.