"ఏమండీ! బాగున్నారా!" బస్టాండులో
బస్సుకోసం ఎదురుచూస్తున్న నన్ను ఎవరో పలకరించినట్లనిపిస్తే ,వెనుదిరిగిచూసా
ఎక్కడో చూసానే! ఆశ్చర్యం నువ్వు అనబోయి "మీరు 'వసూ' వసుంధర కదూ! ఎక్కడుంటున్నారూ? ఏం చేస్తున్నారూ?
అప్పటికీ, ఇప్పటికీ ఏం మారలేదు మీరు"
ఇంకేదో అడగాలనుకున్నాను. 'వసుంధర' కల్పించుకుని, నన్ను మీరూ అని గౌరవించక్కరలేదు. ఇక మేం హైదరాబాదు లో ఉంటున్నాం,ఈయన మా వారు ధీరజ్ సాఫ్టువేర్ ఇంజనీర్ విలార్ ఎలక్ట్రానిక్స్ లో. నమస్కారం చేసాడు అతను. అన్నట్లు
ఇదిగో ఇది మా అమ్మాయి నైన్త్ క్లాస్ చదువుతోంది. పాపని
చూపించింది. ఆంటీకి నమస్కారం చేయ్ కూతురికి చెబుతోంది వసుంధర .కుశల ప్రశ్నలు అడుగుతూనే సెల్ తీసి ఇద్దర్నీఫోటో తీసాను. తీస్తూనే ఆలోచించా ఈ ఫొటో తీసి నేను ఏం సాధించాలనీ? ఈసారి హైదరాబాదు వస్తే మాఇంటికి
తప్పక రావాలి మీరు. అని ఇద్దరూ ఏదో మాట్లాడుతూ ఉన్నారు గలగలా! నేనూ నవ్వుతూ వింటుండగా బస్సు వచ్చింది.
వారికి వీడ్కోలు చెప్పి, బస్ ఎక్కబోతూ మళ్లీ వెనుదిరిగి చూసా.తల్లీ కూతురూ నవ్వుతూ ,చేయి ఊపుతూ కనిపించారు.
స్త్రీ సాధికారత మాటల్లో కాదు, చేతల్లో చూస్తున్నట్లు అనిపించింది.
వసూ ఉరఫ్ వసుంధర నా జీవితంలో అతిముఖ్యమైన వ్యక్తి.బస్ తో పాటుగా నా ఆలోచనలు పరుగులు తీసినాయ్.
*****************
బాబు నాకు చిన్నప్పటినుండీ తెలుసు. పెద్దమ్మ కొడుకు. నాకు తమ్ముడి వరుస. చాలా నిదానస్థుడు. నింపాది.ఆటాపాటా
మానేసి మౌనంగా కూర్చునే బుద్దావతారం. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, శెలవులు ఇస్తే చాలు అందరం అమ్మమ్మ వాళ్ళింటికెళ్ళి, అక్కయ్య,అన్నయ్యలూ తమ్ముళ్ళూ, ఆటా పాటతో మురిసిన ఆరోజులే వేరు. చదువు సంధ్యలయిపోయి ఓ వయసు కు వచ్చేసాక,ఆలోచనలూ మారతాయ్. వ్యాపకాలూ, స్నేహితులూ, పద్దతులూ ఒకటనేమిటీ, మనిషికీ మనిషికీ మధ్యన ఎన్నో అడ్డుగోడల్లాంటి మార్పులు. మనుషుల్ని అంచనావేయటం దగ్గరనుండి వాళ్ళతో మెలగటం వరకూ జీవితం,
పరిస్థితులూ ఎన్ని నేర్పుతాయనీ ~ఒక్కోసారి మనుషుల మీద అభిప్రాయాలు కూడా మార్చేస్తాయేమో! తెలీదు. మధ్యతరగతి కుటుంబాల్లో ప్రేమా, ఆప్యాయత ఎంత ఉంటాయో, అపార్థాలకూ అంతే తావుంటుంది.
బాబు అసలుపేరు సూర్యనారాయణ. మేం చిన్నవాడుకాబట్టి బాబూ అని పిలుస్తాం స్నేహితులకు సూర్యం .
పెళ్ళికి చిన్నచదువూ, అరకొర సంపాదన వల్లఏ సంబంధమూ కుదరలా? ఉద్యోగం పురుషలక్షణం, పెదనాన్నకున్న గంపెడాస్తి
లేకపోతే బాబుది చిన్న సంపాదన అని పిల్లనిచ్చే వాళ్ళ ఆలోచన. చివరికి ఓ సంబంధం కుదిరింది.
అమ్మాయిపేరు వసుంధర కంప్యూటర్ సైన్స్, బాగా పొడవు. ముగ్గురు ఆడపిల్లలు, ఈ అమ్మాయిరెండోది లక్షకట్నం ఇచ్చేటట్లు, మిగతా లాంఛనాలు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని అన్నవరంలో పెళ్ళి చేసేటట్టు డిసైడ్ అయ్యారు.
ఇరుపక్షాల వారందరం తరలి వెళ్ళి అన్నవరం దైవసన్నిధలో వివాహం జరిపించి వధూవరులను ఇంటికి తీసికొచ్చాం.
సరదాలతో, సరసాలతో, వధూవరులపేర్లు చెప్పించటం దగ్గరనుంచీ ,బిందెలో ఉంగరాలు తీయటం దగ్గరనుంచి, రిసెప్షన్
గ్రాండ్ గా చేసాం,
నెలగడిచింది, బాంబు పేలింది. బాబుకి మెుగతనం లేదు, దుమారం రేగింది.అమ్మాయి వసుంధర పుట్టింటి కెళ్ళింది.
వెంటనే తల్లీ దండ్రీ వచ్చారు. ఇంకో మాటలేదు, "మాకు విడాకులు కావాలీ" "ఎందుకూ^? పెదనాన్నగారి ప్రశ్న
"మీవాడు మెుగవాడు కాదుట తిండి కోసమైతే మేంపెట్టలేమా? మీరెందుకు " పెదనాన్న గారు '"ఏరాబాబూ! ఇలారా!
ఏం చేయమంటావ్?!" అడిగారు.
" విడాకులు ఇచ్చేద్దాం నాన్నా "! అన్నాడు బాబు అంతే . ఎవరికీ ఇవ్వనంత స్పీడ్ గా విడాకులు
ఇచ్చేసింది కోర్ట్. పెదనాన్న గారు దగ్గర కూర్చోబెట్టుకుని "ఏంటి నాన్నా! సంగతీ ఏంటీ ప్రాబ్లెమ్" అడిగారు. బాబు వెక్కి వెక్కి ఏడ్చాడు, "మెుదటిరోజే తెలిసిందినాన్నా! కానీ టెన్షన్ వల్లనేమో అనుకున్నా! ఆ తర్వాత చాలా ప్రయత్నించా !నీకు తెలీకుండా చాలా హాస్పటల్స్ తిరిగాను. కానీ "~~ చెప్పాడు కొన్నాళ్ళ తర్వాత ,బాబుకీ నాకూ మధ్య ఉన్న సాన్నిహిత్యం .బంధుత్వం వలన పలకరించాలని నేను వెళ్ళాను. "బాబూ !ఏమిట్రా ఇదంతా?" అంతే ఆ తర్వాత బాబు మాట్లాడిన మాటలూ నాలో నాకే ఎన్నో ప్రశ్నలూ ,జవాబులూ ~ "అది ఆడదికాదే ముదనష్టపుది" అన్నాడు
'ఎవరురా?" నా ప్రశ్న "దాని పేరు పలకటానికే నాకసహ్యం" బాబు అన్నాడు.
"ఎందుకు "?నాప్రశ్న
"మోసంచేసిందే " అన్నాడు.
"ఏరకంగా? ఎవర్నన్నా?" నాప్రశ్న
బాబు " పెళ్ళయ్యాక మేం సరదాగా విశాఖపట్నం వెళ్ళాం కదా! అప్పుడు నేను ఫెయిల్ అయ్యానుకదా! డాక్టర్ లకు చూపించింది నేను జరిగిందేదో జరిగింది, మనిద్దరం ఈ విషయం బయటికి తెలీనీయవద్దు, జీవితాంతం స్నేహితుల్లా ఉందాం (?)అన్నాను. సెక్స్ అనేదే ముఖ్యంకాదుగా ఇలాగే ఉందాం అన్నాను" అన్నాడు
^ముఖ్యం కాదు అని సరిపెట్టుకునే వయసా యిదీ" ? నా ప్రశ్న " మాయరోగమా? ఇంత ఆస్థి ని ఇంటిని
వదిలేసి " బాబు అర్ధోక్తి. "ఇది ఎవరి ఇల్లూ, ఎవరి ఆస్థి?" నాప్రశ్న నామీద ఇంత నిందవేసీ (నిందేనా?నిజంకాదా?) ఆడవాళ్లంతా" అంటూ తిట్ల పెం~~బూతులపంచాంగం వినలేకపోయా!
"అవును బాబూ! అది నిందేనని బుుజువు చేసి, చక్కటి ట్రీట్మెంటు తీసుకుని, ముఖంమీద కొట్టినట్టు మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చుగా? " నాప్రశ్న
"దానికిగానీ, , ఎవరికైనాగానీ "బుుజువుచేయాల్సిన అవసరం నాకేంటి?" సూర్యం బాబు జవాబు చెప్పాడు.
"నీకోసం నువ్వు" నామాట పూర్తికాలా
అక్కర్లా ఆడదాన్ని నమ్మి మళ్ళీ బురదలో ~
బాబు మాట పూర్తికాలా ,
"ముందు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకో అది సక్సెస్ కాలేదనుకో .సమాజంలో ఇలాగే మెుగవాళ్ళ చేతుల్లో మోసపోయినవాళ్ళూ,
అలాగే నీలాగే ~ఏ సమస్యకు ఆసమస్య
సమాజంలో దొరుకుతుంది ఆలోచించు " చెప్పబోయా నేను.
పెదనాన్న గారు మెుదలెట్టారు. "అంటే ఏ సెకండ్ హ్యాండో, లేక వీడి పక్కన ఆంటీ లాంటిదాన్నో, తేవాలనా నీ ఉద్దేశ్యం!
వచ్చింది మాత్రం నిర్వాకం చేస్తుందనా?
ఇప్పుడు ఇది కంపుచేసి పోయిందిగా ఇక చాల్లే, అయినా అది ఆడదికాదే! 'మాసకమ్మ సంసారానికి పనికిరాదూ! అక్కడ ఎవణ్ణో మరిగింది, వీడిమీద నిందవేసి పోయింది .
పైగా ఎంత మంది డాక్టర్స్ దగ్గర నుండైనా సర్టిఫికేట్ తేగలను ,మీ అబ్బాయి పనికిరాడని, ఛాలెంజ్ మీ అబ్బాయి ని చూస్తే జాలేస్తోంది అని అన్నదే ఆ అమ్మాయి " వీడికి చస్తే పెళ్ళి చేయను. వీడు ఇలాగే ఉంటాడు" . మళ్ళీ పెదనాన్న తిట్లు.
నాకుబుఱ్ఱ తిరిగిపోయింది. ఆడపిల్లలున్న పెదనాన్నేనా ఇలా మాట్లాడటం
వీడికి చదువులేదు, సరైనఉద్యోగంలేదు. మగాడు కాదు, ఐనా వీడికి కన్నెపిల్లకావాలి
పైగా అత్తామామకి సేవచేసుకుంటూ ఇంట్లో పడుండాలి. వీడి లోపాన్ని మరిచిపోవాలి
ఆ అమ్మాయి. ఏం జరుగుతోందిక్కడ? సమాజంలో స్త్రీల మీద జరిగే దురాగతాల్లో ఇదో కోణమా?
వసుంధర ఇన్నిరోజులూ ఇక్కడున్నట్లయితే ఉత్తమ మహిళగా అవార్డ్ ఇచ్చి సన్మానించేవారా వీళ్ళు ?
స్త్రీ సాధికరత పేరుతో గొంతుచించుకునే నా లాంటి వాళ్ళు ఇక్కడ దీనికి ఏ పేరు పెట్టాలో? అకృత్యమా ,దురాగతమా?
వరకట్న వేధింపా? గృహహింసా? ఈకోణం వ్యక్తిగతమైన కుటుంబసమస్యే కావచ్చు.సమాజంలో ఇంకా ఎంతమంది మగాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారో! ఇదో కొత్త కోణం ఓ సారి పెళ్ళయ్యాక వీడు పనికిరాడని తెలిసినా తను మళ్ళీపెళ్ళిచేసుకోవాలంటే? అవతల వాడు నీలాగానే సెకండ్ హాండ్ అనే ఆలోచిస్తాడు గా!
మహిళా సంఘాలు దీనికేం పేరు పెట్టాలి ? మనసు శూన్యమై పోయి కొన్ని ప్రశ్నలు
అడిగా, కొన్ని అడగాలనుకున్నా, పెద్దమ్మ వంక చూసా, నిస్తేజంగా చూస్తోంది. జరిగిన దానికి మతిచలించిందేమో అనిపించింది. కానీ వీళ్ళ బారిన పడకుండాఆడపిల్లజీవితం కాపాడబడింది, అనే రిలీఫ్ ఓవైపు, అయ్యో! తమ్ముడి జీవితం ఇలా అయిందే బాధ మరోవైపు ఇంటికి వచ్చినా వసుంధర ఙ్ఞాపకం నన్ను వీడలేదు. పెదనాన్న, బాబు ,'వసుంధర'ను
తిట్టి పోస్తూమాట్లాడిన మాటలు నా చెవిలో మార్మోగుతున్నాయ్. సమాజంలో స్త్రీ పట్ల ప్రతీ మగాడి దృక్పథం ఇలాగే ఉందా?
ఆలోచిస్తున్నాను.
కొడుకును జీవితం బాగుచేసే మార్గం చూడకుండా, పరాయిఆడపిల్లని దుమ్మెత్తిపోయటం, సిగ్గుగాలేదూ! ఐనా
జరిగిన సంఘటనకు తట్టుకోలేక అలా మాట్లాడుతున్నారేమోలే సరిపెట్టుకున్నాను
రెండేళ్ళు గడిచాయ్ .సూర్యంబాబు విషయాలు తెలుస్తూనే ఉన్నాయి
ఆడవాళ్ళని తిడుతూనే ఉన్నాడని తెలుస్తూనే ఉంది.మిగతాఅన్నివిషయాల్లో చక్కగా మాతో మర్యాదగానే మాట్లాడేవాడు.
ఓ రోజు నేనే ఫోన్ చేసాను, " బాబూ!మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నావా? పిల్లను చూస్తా పెళ్ళి చేసుకోరాదురా "అన్నాను.
మళ్ళీ మెుదలెట్టాడు, "నేనెందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలే నీక్కూడా మతిపోయిందా?
నేను మగాణ్ని కాదు ఐతే ఏంటీ? ఇలాగే ఉంటా?" అన్నాడు.
"సరే ఉండూనీకు పెళ్ళి కాకపోతే సమాజానికీ, దేశానికీ నష్టమేం లేదు .
తమ్ముడివి కదా! అనీ!" ~~పిల్లని చూద్దామనీ ~~
" చూడూ పిల్లని. నాలోపం నీకు తెలుసుగా
ఈలోపం సరిపెట్టుకుని ఇంట్లో ఉండి నన్ను ,అమ్మా, నాన్ననీ చక్కగా చూసుకునే
సాంప్రదాయ బద్ధమైన అమ్మాయైతే ఓకే ఐతే ఆ అమ్మాయి కి ఇదివరకే పెళ్ళి కాకుండా చూడు " .మళ్ళీ షాక్ కి గురయ్యాను. ఇదెక్కడిది అన్యాయం? అన్నాను నేను.
వాడు " ఎప్పుడైనా సరే మగాడికి అణిగిమణిగి ఉండేదే ఆడది.మగాడు
నోరువిప్పగానే ఆడది నోరు మూసేయాలి. ఎదురుప్రశ్న వేయకూడదు. కుక్కినపేనల్లే ఉండాలి. చెప్పకింద తేలల్లే ఉండాలి.
అదే సరైన పెళ్ళాం, ఆడదీనూ "
కెవ్వున అరచి "వామ్మో! ఇదేమిటిరా?
నువ్వు మారలా? ముందు ఏ మెంటల్ హాస్పిటల్ లో నైనా పేషెంట్ గా జేరి ట్రీట్మెంటు తీసుకో!మెంటలెక్కిందేమో!"
అన్నాను విసురుగా .
వాడు "చూసావా! నీకు కూడా గొంతు లేస్తోంది? ఆడవాళ్లని నోరెత్తి మాట్లాడనీయకూడదూ! బావకు చెబుతానుండు. మాట్లాడనీయెుద్దని.
ఆడవాళ్ళ మాటవినకూడదనీ " అన్నాడు
నేను అవాక్కయిపోయాను కాసేపటిదాకా .
అంటే ఆయన వచ్చి " ఏంటోయ్ అలా
ఉన్నావ్ "అని పిలిచేవరకు.నేను బ్రతికే ఉన్నాననే సంగతే మర్చిపోయా.
ఏమంటున్నాడూ మీతమ్ముడూ మళ్ళీ
అడిగారు. "తాచెడ్డ కోతి వనమల్లా చెరిచిందనీ " నీరసంగా పలికింది నాస్వరం .
అర్ధమయినట్లుగా నవ్వారాయన.
######
ఇదంతా జరిగి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలయింది. నాకు బాబు మీద కోపం లేదు ఇప్పటికీ ,సానుభూతి తప్ప.
నేను ఇప్పుడు బాబు దగ్గరనుండే వస్తున్నాను. కాలం మారుతూ తనతో ఎన్నో మార్పులూ తెస్తుంది కాబోలు.
బాబుకి ఇంకో కోణంతెలుసుకున్ననేను
ముగ్ధురాలనైచూడటానికి వెళ్ళాను.
ఆశ్చర్యపోయాను .
"బాబూ ఏమిట్రా! ఇదీ!"
"అవునే !అందరూ అనుకున్నట్లు నీ తమ్ముడు అసమర్థుడేం కాదు.
అమ్మ, నాన్న ఇంత ఆస్థి లంకంత ఇల్లూ వాకిలీ ఇచ్చి వెళ్ళిపోయారు . పైగా ఒంటరిగాణ్ణి. సమాజానికి
పనికి వచ్చే ఏదైనా ఆదర్శవంతమైన పని
చేయాలన్పించింది. నేను శాశ్వతం కాదు.కానీ నా తదనంతరం కూడా ఇది ఇలాగే కొనసాగాలని అన్ని ఏర్పాట్లూ చేసేసాను. నేను చేసింది సరైనదేనంటావా ?"
బాబు ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది.
బాబు పెదనాన్న గారు ఇచ్చిన
లంకంత *బాబు బిల్ఢింగ్స్* లో ఎంతో మంది అనాధపిల్లలకు ఆశ్రయం కల్పించి
తల్లీ దండ్రులు లేని వారికి తానే తండ్రై
సమాజానికి ఆదర్శప్రాయమైన జీవితం
తన సొంతం చేసుకోటం చాలా గర్వంగా
అనిపించింది.
ఎందుకో ~వసుంధర నాకు
కనిపించినట్లు బాబుకి చెప్పాలనిపించలా.
ఫోన్ ఆన్ చేసి మళ్ళీ ఫొటో వంక చూసాను
సాలోచనగా, నాపెదవులపై సన్నని నవ్వు
విరిసింది.