మర్రిచెట్టుని కాపాడిని యశస్విని - కృష్ణ చైతన్య ధర్మాన

yashaswini who saved tree

పూర్వం దేవాది అనే గ్రామంలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. దాని పక్కనే ఒక రావిచెట్టు ఉండేది. ఆ మర్రిచెట్టు మరియు రావిచెట్టు ప్రాణస్నేహితులు. చెట్లబాషలో అవి ఎప్పుడూ ముచ్చటించుకునేవి. ఒకరోజు వారి మధ్యన సంభాషణ ఈ విధంగా సాగింది:
మర్రిచెట్టు: మిత్రమా! నీకు గుర్తుందా, మన చిన్నపుడు ఇక్కడ చుట్టూ చాలా చెట్లు ఉండేవి. ఈ జనాలు ఒక్కొక్కటి నరుక్కుంటూపోగా ఇప్పుడు ఈ ఊరిలో మనిద్దరమే మిగిలాము.
రావిచెట్టు: అవును మిత్రమా! నిజమే. ఏదో అదృష్టవశాత్తు మనల్ని బ్రతకనిచ్చారు.
మర్రిచెట్టు: అదృష్టం కాదు దురదృష్టం. మన స్నేహితులందరూ మన ఎదురుగా నరకబడటం చాలా దురదృష్టం.
రావిచెట్టు: అవును నిజమే! నా తల్లితో సహా నా బంధువులందరినీ నా కళ్లెదురుగానే నరికేశారు. కానీ నేనేమి చెయ్యలేకపోయాను.
మర్రిచెట్టు: నా తల్లిని, తండ్రిని మరియు గురువులని కూడా నా ఎదురుగానే నరికారు. నాకు ఏమీ చెత్తగాక అలా ఏడుస్తూ ఉండిపోయాను.
మరుసటి రోజు, ఆ రావిచెట్టు ఉన్న స్థలానికి ఎవరో కొంతమంది అపరిచితులు వచ్చి దాని చుట్టూ ఉన్న నేలను కొలిచారు. అదే వ్యక్తులు మళ్ళీ సాయంత్రం ఏదో యంత్రాంగంతో వచ్చారు. అది చెట్లను నరికి యంత్రాంగం. దానిని చూసి రావిచెట్టు బెంబేలెత్తిపోయింది. ముందు దాని కొమ్మల్ని నరకడం మొదలుపెట్టారు. తరువాత మోడుని నరికారు. చివరకు వ్రేళ్ళతో సహా మొత్తం పేకళించి పీకేశారు.
తన ప్రాణస్నేహితుణ్ణి చంపుతున్న దృశ్యాన్ని చూస్తున్న మర్రిచెట్టు వెక్కివెక్కి ఏడ్చసాగింది. కొనఊపిరితో తన ముందు పడివున్న దానిని చూసి ఎంతో మనస్తాపానికి గురి అయ్యింది. తనకు ఒక్కసారిగా ఎంతో కోపం వచ్చింది. భూమి నుంచి బయటకు వచ్చి తన స్నేహితుడిని చంపినవాళ్ళని ముక్కలు ముక్కలుగా చెయ్యాలనిపించింది. కానీ దానిలో ఎలాంటి కదలికలు లేకపోవటం గమనించి, "దేవుడా! మా చెట్ల జాతికేంటీ శాపం?" అని అరవటం మొదలుపెట్టింది.
తన స్నేహితుడు మరణించిన తరువాతి వారం రోజులూ నేలలోని నీటిని గ్రహించలేదు. భూమాతకు ఆ చెట్టుపైన జాలివేసింది.
"ఓ బిడ్డా! నీవు నీటిని త్రాగి ఇప్పటికే వారం రోజులైంది. చాలా నీరసంగా మారావు. ఇలా ఇంకొన్ని రోజులు కొనసాగిస్తే మరణించే ప్రమాదం ఉంది. నా మాట విని నాలోని నీటిని త్రాగు. నా కళ్లెదురుగా నా బిడ్డ ఆత్మహత్య చేసుకుంటే నేను చూడలేను!" అని ఏడ్చింది భూమాత.
"నీ బిడ్డలు మరణిస్తే చూసి తట్టుకోలేవా? చాలించు నీ ప్రేరేపణలు. గత కొన్నేళ్లుగా ఎన్నో లక్షల చెట్లను ఈ మనుషులు అమానుషంగా నరుకుతున్నారు. నేనొక్కడిని మరణిస్తే నీకు ఏడ్పు వస్తుందా?" అని చెప్పింది మర్రిచెట్టు.
"కానీ వారెవ్వరూ ఆత్మహత్యలు చేసుకోలేదు, చేతకాని మనుషుల్లాగా! నీవు అలా చేస్తే, మీ జాతిలో ఆ దరిద్రానికి శ్రీకారం చుట్టినవాడివవుతావు!"
"మరి నన్నేమి చెయ్యమంతావు? ఈ ఊరిలో మిగిలిన ఆఖరి చెట్టును నేను. నా స్నేహితులు, సన్నిహితులు మరణించిన తరువాత నేను బ్రతికితే ఎంత? చస్తే ఎంత?"
"నా మాట విను. మనం ఈ సమస్యకు ఏదో మంచి ఉపాయం ఆలోచిద్దాం. నా పైన విశ్వాసం ఉంచి ఈ నీరు త్రాగు." అని భూమాత ఒప్పించగా ఆ మర్రిచెట్టు కొంచం నీటిని గ్రహించింది.
కొన్ని రోజుల తరువాత, ఒక సాయంత్రం, అంతకు ముందు తన స్నేహితుడు ఉన్న స్థలాన్ని కొన్నవారు ఈసారి మర్రిచెట్టు ఉన్న స్థలాన్ని కొలిచారు.
"రేపు తెల్లవారుజామున వచ్చి ఈ చెట్టుని నరికేద్దాం!" అని వారిలో ఒకడు అన్నాడు.
"ఎల్లుండి నుంచి బిల్డింగ్ పనులు మొదలుపెడదాం," అని ఇంకొకడు అన్నాడు.
ఇదంతా గమనించిన మర్రిచెట్టు మరియు భూమాత ఆలోచనలోపడ్డాయి.
"నీవేమీ చింతించకు. ఈ రాత్రికి ఈ గ్రామానికి భూకంపం వచ్చేలా చేస్తా. ఇళ్లన్నీ నేలకూలుతాయి. అంతా అల్లకల్లోలంగా మారుతుంది. ఇక నీ జోలికి ఎవరూ రారు!" అన్నది భూమాత.
"వద్దు తల్లి! నీవలా చెయ్యమాకు. అందులో అమాయక ప్రజలు చాలా ఉన్నారు," అని చెప్పింది మర్రిచెట్టు.
తరువాత వాళ్ళిద్దరూ చాలాసేపు ఆలోచించారు కానీ వారికి ఎటువంటి ఉపాయం కూడా తోచలేదు. ఇంతలో అదే గ్రామానికి చెందిన యశస్విని అనే ఒక పదేళ్ల పాప కొన్ని డబ్బాలు పట్టుకుని ఆ మర్రిచెట్టు వద్దకు వచ్చింది. అప్పటికే సమయం పది దాటడంతో జనాలందరూ నిద్రపోయారు. యశస్విని అటూ ఇటూ చూసి తన డబ్బాలు తెరిచి పసుపుకుంకాలను తనకు అందినంత ఎత్తువరకూ ఆ మర్రిచెట్టుకి పూసింది. తరువాత తన తల్లి సంక్రాంతి కోసం కొనుక్కున్న కొత్త చీరని ఆ మర్రిచెట్టు చుట్టూ కట్టింది. ఒక చిన్న రాయిని తెచ్చి అక్కడ పాతి, దానిపైన కూడా పసుపు, కుంకము జల్లింది. రెండు చేతులూ జోడించి, ఆ మర్రిచెట్టుని నమస్కరించి, వెనక్కి తిరిగి చప్పుడులేకుండా తన ఇంటికి వెళ్ళింది.
ఇదంతా జాగ్రత్తగా గమనించిన మర్రిచెట్టు భూమాతలకు ఏమీ అర్ధంగాక ఒకరినొకరు చూసుకున్నారు. కొంతసమయానికి ఇరువురూ నిద్రలోకి జారుకున్నారు.
ఇంతలో తెల్లారింది. మర్రిచెట్టు ఇంకా నిద్రలోనే ఉంది. భూమాత తనని నిద్రలేపింది.
"లే బిడ్డ! లే లే! ఇటు చూడు! అటు చూడు!" అంటూ ఆశ్చర్యంలో గట్టిగా అరిచింది. భూమాత అరుపులకు బెదిరిపోతూ లేచిన మర్రిచెట్టు, "అమ్మో వచ్చేసారా! నా కొమ్మలు, నా కొమ్మలు నరికేసారా? నా వ్రేళ్ళు, నా వ్రేళ్ళు పీకేసారా?...."
"కళ్ళు నులుముకుని సరిగా చూడు...." అని చెప్పింది భూమాత.
ప్రజలందరూ ఆ మర్రిచెట్టు చుట్టూ చేరి పసుపు కుంకుమలతో పూజలు చేస్తున్నారు. చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త చీరలను కొమ్మలపైన వేసి మరల తీసుకుంటున్నారు. దీపాలు వెలిగిస్తున్నారు. సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. దానిముందు పాతిపెట్టి ఉన్న చిన్న రాయిని కూడా పసుపుకుంకుమలతో నింపేశారు.
ఇంతలో ఆ స్థలాన్ని ఖబ్జా చేసిన పెద్దమనుషులు వచ్చారు. వారిని ఆ జనాలు తరిమికొట్టారు. ఆ ఊరి మర్రిచెట్టుపైన చెయ్యివేస్తే మండిపడేసరికి, వారు అక్కడనుంచి పారిపోయారు.
ఇదంతా చూస్తూ మర్రిచెట్టు, భూమాతలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇంతలో అక్కడకు యశస్విని మళ్ళీ వచ్చి రెండు చేతులు జోడించి నమస్కరించి, "నిన్నెలా కాపాడుకోవాలో నాకు నిన్ననే ఉపాయం తోచింది," అని చెప్పి, మర్రిచెట్టుని గట్టిగా కౌగిలించుకుంది. "మిగతా చెట్లను కాపాడలేకపోయినందుకు క్షమించు!" అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
ఆ చిన్నపిల్ల ప్రేమకు మర్రిచెట్టు, భూమాతలు మంత్రముగ్దులయ్యారు. ఆమె తెలివితేటలను కొనియాడారు.
కొన్నాళ్ళకు మర్రిచెట్లను పూజించే పద్దతి అన్ని గ్రామాలకు పాకింది. ఇంకొన్నాళ్లకు జనాలు రావిచెట్లను, తులసి చెట్లను, వేపచెట్లను కూడా పూజలు చేసే ఆచారాన్ని మొదలుపెట్టడంతో గ్రామాలన్నీ ఆయా చెట్లతో ఆరోగ్యంగా ఉండేవి.

మరిన్ని కథలు

Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు