సుబ్బారావు, అప్పారావు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు. వాళ్ళ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గున మండిపోయేది. వాళ్లకు ఒక్క నిముషం పడేదికాదు. ప్రతి చిన్న విషయానికీ గొడవలు పడుతుండేవారు. విచిత్రమేమిటంటే అప్పారావు. సుబ్బారావు భార్యల మధ్యమాత్రం మంచి స్నేహం, అనుబంధం, ఆప్యాయత ఉండేది. ఉన్నదానికీ,లేనిదానికీ భర్తలు కాట్లాడుకున్నా భార్యలు మాత్రం సఖ్యతగా ఉండేవారు, అయితే అప్పారావు, సుబ్బారావుల ముందు మాత్రం వాళ్ళ భార్యలు "తమ మధ్య కూడా విభేదాలు ఉన్నాయి" అన్నట్లు ఎడమోహం పెడమోహంగా ఉండేవారు. అసలు సుబ్బారావు, అప్పారావుల మధ్య సంబంధం ఏమిటని ఆరా తీస్తే ఇద్దరూ స్వయానా తోడి అల్లుళ్ళన్న విషయం తెలిసింది.
ఒకే ఇంటి అల్లుళ్ళ మధ్య గోడవలేంటి అని అందరూ ముక్కున వెళ్లేసుకునేవారు,ఇంతకీ వీళ్ళ మధ్య గిల్లికజ్జాలు దేనికని గుసగుసలాడుకునేవారు కొందరు.తీరా వీళ్ల భార్యలని అడిగితే అసలు సంగతి చెప్పారు. "మొదట్లో అప్పారావు, సుబ్బారావు ఒక్కటైపోయి సొంత మామని అదనపు కట్న కానుకలు గురుంచి నిత్యం వేధించేవారట, అందుకే అతను తన తదనంతరం తన కూతుళ్ళకి భర్తల వేధింపులు వుండకూడదని తాను చనిపోయేముందు అల్లుళ్లు అప్పారావు సుబ్బారావులను వేరువేరుగా పిలిచి "నాకు ఉన్న గుప్త ఆస్తి రహస్యం సుబ్బారావుకి తెలుసు"అని అప్పారావుకి చెప్పి, అలాగే "నీకు తెలియని నా ఆస్తి పత్రాలు అప్పారావు గుప్పెట్లో ఉన్నాయి"అని సుబ్బారావుకి చెప్పాడు. మామ చనిపోయిన తరువాత తోడి అల్లుళ్లు మధ్య విభేదాలు మొదలయ్యాయి, ఒకరి మీద ఒకరికి అనుమానం అపనమ్మకం కలిగి నిత్యం టామ్ అండ్ జెర్రీ మాదిరీ కామెడీ తగువులు పడుతున్నారు"అని వాళ్ళ భార్యలు నవ్వుతూ చెప్పారు.
ఒక్కోసారి అప్పారావు, సుబ్బారావుల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారుతుండటంతో, కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుకే ఊడిపోయేటట్లు ఉందని వాళ్ళ భార్యలు భయపడి ఒకరోజు సుబ్బారావుని అప్పారావుని కూర్చోబెట్టి,"మా నాన్న రహస్య ఆస్తులు గురుంచి మీకెందుకు గొడవలు, మా నాన్న రోజూ రాసుకునే డైరీలు చూస్తే ఆ రహస్యాలు ఇట్టే తెలిసిపోతాయి కదా"అని అన్నారు. వెంటనే మామ రాసుకున్న డైరీలు తిరగేసారు అప్పారావు, సుబ్బారావు. మామ చనిపోయేముందు రోజు తన డైరీలో స్పష్టంగా ఇలా రాసాడు"నా కంటూ గుప్త ఆస్తులు, రహస్యాలు ఏమీ లేవు నాకు ఉన్న ఇద్దరు కూతుళ్లనూ వాళ్ళ తల్లి లేకపోయినా మంచిగా పెంచి పెద్ద చేసి, పెళ్లిళ్లు జరిపించి, ఉన్న ఆస్తిని, ఇళ్ళను ఇద్దరికీ సమానంగా ఇచ్చాను, అయినా అల్లుళ్లు నా దగ్గర ఇంకేదో రహస్య ఆస్తి ఉందని, అదనపు కట్న కానుకలు అంటూ నన్ను వేధించేవారు, అందుకే అల్లుళ్లు పాళ్లూ నీళ్లులా కలిసిపోయి నా తదనంతరం కూడా నా కూతుళ్ళను ఇబ్బందులుపాలు చెయ్యకుండా అల్లుళ్లు మధ్య చిచ్చు పెట్టాను, కూతుర్లకు మాత్రం కలకాలం సఖ్యతగా ఉండండని చెప్పాను, మాయామర్మం లేని మామని అకారణంగా వేధించిన అల్లుళ్ళకు నేను వేసే జీవిత కాల టామ్ అండ్ జర్రీ శిక్ష అది అయితే పిల్లల్ని ఇచ్చిన మామగా అల్లుళ్లు మధ్య, రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధాన్ని, ఆప్యాయతల్ని కోరుకుంటున్నాను, ఏదో ఒక సమయంలో కాలమే వాళ్లకు బుద్ధి చెప్పి అల్లుళ్లు మనసుల్లో మలినాళ్ళు తొలగించి మంచివారిగా మార్చుతుందన్న నమ్మకం నాకు ఉంది"అని డైరీని ముగించాడు.
మామ డైరీలో చివరి వాక్యాలు చదివిన తరువాత అప్పారావు, సుబ్బారావు సిగ్గుతో తలదించుకున్నారు. తండ్రిలాంటి మామని మానసికంగా హింసించి చంపాము అని మదన పడ్డారు, ఇద్దరూ చేతులు కలుపుకొని అధిక విద్యావంతులం,ఉన్నత స్థాయి ఉద్యోగులం, కుటుంబాల పోషణకు సరిపడా అస్తిపాస్తులు ఉన్నవారం అయినప్పటికీ మూర్ఖుల్లా తన ఆస్తినంతా మనకే ధారాదత్తం చేసిన మామను వేధించాము, ఇకపై మనలో మనకి గొడవలు వద్దు, మనం మనం బరంపురం అని సరదాగా జోక్స్ వేసుకొని హాయిగా నవ్వుతూ కలిసిపోయారు. వాళ్ళ భార్యలు, పిల్లలు "డైరీ దిద్దిన కాపురాలు" అంటూ చక్కగా నవ్వుకుంటూ అందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు.డైరీలో తన గుండెగుట్టు అస్తిపాస్తులు దాచి తద్వారా ఇరు కుటుంబాలకూ అనుబంధం ఆప్యాయత పంచి మంచిచేసి తాను చనిపోయిన తరువాత కూడా చక్కని సంబరాన్ని ప్రకటించిన ఇంటి పెద్ద చిత్రపటానికి రంగు రంగుల పూలమాలలు వేసి మొక్కుకున్నారు.
...........మీగడ.వీరభద్రస్వామి
7893434721