అపరిచితులు - పద్మావతి దివాకర్ల

unknown persons

'అమ్మయ్య! ఇప్పటికి విముక్తి దొరికింది! ఈ కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల రెండునెలలుగా ఇంటిముఖం వైపు చూడటమే కుదరలేదు. ఇన్నాళ్ళుగా కరోనా తనని ఇంటికి చాలా దూరంలో బంధించి ఉంచింది. లాక్‌డౌన్ సడలించడంవల్ల ఇప్పటికైనా తను ఊరికి తిరిగి వచ్చాడు. ఇంటిని, ఇల్లాలిని చూసి ఎంతకాలమైందో?! పాపం, మమత ఇన్నాళ్ళగా ఎంత ఒంటరితనం ఫీలవుతోందో?' అని మనసులో అనుకున్నాడు ప్రత్యేక రైల్లో న్యూ ఢిల్లీ నుండి అప్పుడే దిగిన మనోహర్. హఠాత్తుగా ఇంటికి వెళ్ళి భార్య మమతని ఆశ్చర్యంలో ముంచెత్తాలని భావించాడు. అవును మరి, ఇన్నాళ్ళ తర్వాత ఆమె తనని చూసి ఎంతో సంతోషిస్తుంది. ఎంత వేగం ఇంటికెళ్ళి భార్యముందు వాలతానా అన్న ఉద్వేగంలో ఉన్నాడు మనోహర్.

క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి బయలుదేరిన మనోహర్ మదిలో బోలెడన్ని ఆలోచనలు!

ఆఫీస్ పనిమీద దేశ రాజధాని న్యూఢిల్లీ బ్రాంచికి వెళ్ళిన మనోహర్ ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్ మూలంగా అక్కడే చిక్కుకుపోయాడు. లాక్‌డౌన్ ప్రకటించడం ఒకందుకు అందరికీ మంచిదే అయింది, లేకపోతే అందరూ ఈ మహమ్మారి కరోనాకి చిక్కిపోయి ఉండేవారు. మనోహర్‌లాగే చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడో దేశవిదేశాల్లో కూడా చిక్కుకుపోయిన వారున్నారు. తనకింకా నయం, ఆఫీస్ అతిథి గృహంలో హాయిగా విశ్రాంతి తీసుకున్నాడిన్నాళ్ళూ. భోజనానికి కూడా ఇబ్బందేమీ లేదు. చాలా మందికైతే ఈ లాక్‌డౌన్‌వల్ల అటు చేతిలో పనిలేక, తిండిలేక, ఇంటికి తిరిగి వెళ్ళలేక చాలా అవస్థలు పడుతున్నారు మరి. వారందరికన్నా తను నయమే! అయితే ఇన్నాళ్ళూ ఇంట్లో ఒంటరిగా ఉండిపోయిన భార్యతో ఫోన్లో మాట్లాడటం చేస్తూనే ఉన్నాడు. ఒంటరిగా ఆమె ఉందన్న మాటేగాని, ఇంటి వద్దకే కూరగాయల బండి వస్తూ ఉండటంతో, ఆర్డర్ ఇస్తే ఇంటికి వెచ్చాలు కూడా రావడంతో ఆమెకింతవరకూ ఏ సమస్యా లేదు. తను ఇక్కడికి వచ్చేముందు సరిపోయినంత డబ్బులు కూడా ఇచ్చి వచ్చాడు మరి. పోనీ, ఆమెకి తోడుగా ఉండటానికి రిటైరైన ఆమె తల్లితండ్రులు రావాలన్నా కూడా ఈ లాక్‌డౌన్ వల్ల ఎలాంటి ప్రయాణ సాధనాలు లేవు కూడా. ఈ లాక్‌డౌన్ వేళ టివి, స్మార్ట్ ఫోన్లే ఆమెకి శరణ్యమయ్యాయి.

ఇప్పుడు లాక్‌డౌన్ సడలించి, ప్రభుత్వం రైళ్ళు నడపడంతో ఇప్పటికైనా తిరిగి వచ్చాడు.

మనోహర్‌ మమతలకి పెళ్ళై ఆర్నెల్లయ్యింది. వివాహమైన తర్వాత ఇదే మొట్టమొదటి పెద్ద ఎడబాటు. ఎప్పుడో ఒకటి రెండు సార్లు పనిమీద బయటకి వెళ్ళినవాడు ఒకటి రెండు రోజుల్లోనే తిరిగి వచ్చేవాడు. ఈ సారి విరహం భరించరానిదైంది. మరి రెండు నెలల విరహం అంటే మాటలా! తనలాగే మమత కూడా తన రాక కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉంటుందన్న భావన మనోహర్ మనసుని పులకింపజేసింది. ఈ లోపున క్యాబ్ ఇంటిని సమీపించడంతో మనోహర్ ఆలోచనలు తెగిపోయాయి. క్యాబ్ అతనికి డబ్బులు చెల్లించి ఇంట్లోకి అడుగు పెట్టాడు ఆత్రతగా.

దగ్గరగా చేరవేసిన తలుపులు తట్టగానే తెరుచుకున్నాయి. హాల్లో ఎవరో అపరిచితురాలు సోఫాలో కూర్చొని కనిపించింది. అలా అపరిచితురాలిని చూడగానే మనోహర్ గతుక్కుమన్నాడు. తను మర్చిపోయి తన ఇల్లు కాక ఇంకెవరి ఇంట్లోకి పొరపాటున ప్రవేశించానేమోనని అనుమానించాడు. వెంటనే మళ్ళీ వీధిలోకి వెళ్ళి డోర్ నెంబర్ చూసాడు. సరిగ్గానే ఉంది. అది తన ఇల్లే మరి! ‘మరి ఆ హాల్‌లో ఉన్న ఆ అపరిచితురాలు ఎవరు చెప్మా?’ అని అనుకున్నాడు.

అప్పుడే అలికిడి విని వెనుదిరిగిన ఆమెని పరిశీలనగా చూస్తూనే మనోహర్ మొహం తిరిగినట్లైంది. అంత అనాకారి ముఖం అతనెప్పుడూ చూడలేదు. అస్తవ్యస్తంగా ఉన్న కురులు, జిడ్డోడుతున్న మొహం, లావుగా ఉన్న అమె ఎవరో ఎంత ఆలోచించినా తెలియలేదు. బహుశా, ఆమె తన భార్య తరఫు చూట్టమో లేక భార్య స్నేహితురాలో మరి, ఈ లాక్‌డౌన్ సమయంలో తనకు తోడుగా మమత తెచ్చుకుందేమో మరి. అలా అయితే తనకెందుకు చెప్పలేదు మమత! లేక, కొత్తగా పనిమనిషి పెట్టుకుందేమో? అయినా ఈ కరోనా కాలంలో కొత్తగా పనిలో చేరడానికి ఎవరు ముందుకొస్తారు? అందరికీ కరోనా అంటే భయమే కదా! మరెవరు ఈ అంధవికారమైన అపరిచితురాలు మరి, అనుకున్నాడు మనోహర్ ఆలోచిస్తూనే గుమ్మంలో నిలబడి.

ఇంటి గుమ్మం వద్ద ఎవరో వచ్చిన అలికిడి విన్న ఆమె లేచి నిలబడి మనోహర్‌ని చూస్తూనే కొయ్యబారిపోయి భయంతో కెవ్వున అరిచింది. ఆమెకి కూడా ఆ వచ్చిందెవరో తెలియలేదు. ఆమె అరిచిన అరుపులకి జంకి ఒక్కడుగు వెనక్కి వేసాడు మనోహర్.

"దొంగ! దొంగ!! ఎవరో దొంగ ఇంట్లో జొరబడ్డాడు!" ఇరుగు పొరుగుకి వినిపించేట్లు కేకలు వేయసాగిందామె.

ఆమె ఎవరో తెలియదు, తనింట్లో ఎందుకు ఉందో కూడా తెలియదు. పైగా తనని దొంగ అని అనుమానించి కేకలు వేస్తోందని ముందు ఆశ్చర్యం కలిగినా, ఆ తర్వాత వెర్రి కోపం వచ్చింది.

వెంటనే కర్తవ్యం గుర్తుకు వచ్చి, "నేను దొంగను కాను. ఈ ఇంటి యజమాని మనోహర్‌ని. రెండు నెలల తర్వాత ఇప్పుడే ఢిల్లీ నుండి తిరిగివచ్చాను. ఇంతకీ నువ్వెవరు? మా ఇంట్లో ఉన్నది చాలక, నన్నే దొంగని అంటున్నావా?" అన్నాడు కోపంగా మనోహర్ పెరిగిన తన గడ్డం నిమురుకుంటూ.

ఆ మాట వింటూనే, అప్పుడు గతుక్కుమందామె. వెంటనే మనోహర్‌వద్దకు రాబోయిందామె.

"నువ్వెవరో చెప్పకుండా ముందుకు వస్తావేమిటి? అసలు ఎవరు నువ్వు? మా ఇంట్లో ఎందుకున్నావు? నా భార్య మమత ఏది? నువ్వే ఆమెని ఏదో చేసి ఉంటావని అనిపిస్తోందిప్పుడు! నిజం చెప్పు?" అన్నాడు మనోహర్ మరింత కోపంగా.

అతని మాటలకి ఆమె ఫకాలుమని నవ్వుతూ, "అదేమిటండీ! నన్ను మీరు గుర్తు పట్టలేకపోతున్నారా? నేనండీ, మీ భార్య మమతని. అవును లెండి, రెండు నెలలు నేను దూరంగా ఉండేసరికి నన్ను పూర్తిగా మర్చిపోయారు! అంతేకదూ?" అందామె మూతి మూడు వంకర్లు తిప్పుతూ.

ఆమె వంక చూస్తూ ఆశ్చర్యపోయాడు. అప్పటికి ఆమె గొంతు పోల్చుకొని, ఆమెని నిశితంగా గమనించాక ఆమె మమతే అని నిర్ధారణ చేసుకున్నాక, అప్పుడు ఆమెలో మమత పోలికలు కనిపించాయి.

"ఆఁ...నువ్వు మమతవా?" అన్నాడు ఆశ్చర్యపోతూ.

"అవును మహాశయా! నేను మమతనే! మీ అనుమానం ఇప్పుడు తీరిందా? అవును మీరేంటి ఆ జుట్టు, గడ్డంగట్రా అలా పెంచి బూచాడులా తయారయ్యారు? నేను ఎవరో అపరిచితుడు వచ్చాడనుకున్నాను. అసలే సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య లాక్‌డౌన్ వల్ల ఉపాధి లేక కొంతమంది ఇళ్ళల్లో జొరపడి దోపిడికి, దొంగతనానికి పాల్పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. మిమ్మల్నిలాగ హఠాత్తుగా చూడటంతో జడిసిపోయి కేకలు పెట్టాను. క్షమించండి." అని చుట్టూ చూసి, "ఇంకా నయం! నా కేకలు విని చుట్టుపక్కల వాళ్ళెవరూ రాలేదు." అందామె.

అప్పుడు తెలిసింది మనోహర్‌కి. అవును మరి, ఈ లాక్‌డౌన్ వల్ల బ్యూటీ పార్లర్లు, మాల్‌లు అన్ని మూసివేసిన కారణంగా ఆమెకి మేకప్ లేదు. అయితే మేకప్ లేకపోతే ఆమె ముఖం ఇంత అందవికారంగా ఉంటుందా? పెళ్ళైన ఇన్నిరోజుల్లో తనెందుకు ఆ విషయం గ్రహించలేకపోయాడు? అవును మరి, పెళ్ళి చూపులకి, పెళ్ళికీ భారీగానే మేకప్ వేసుకొని ఉంటుంది. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా బ్యూటీ పార్లర్లు పావనం చేస్తూ ఉంటుంది మరి. తనా విషయం ఇంతవరకు గ్రహించలేదు మరి. ఇంత అనాకారినా తను పెళ్ళి చేసుకుంది! ఆమె నిజ స్వరూపం ఇదా! తన భార్య అందగత్తెని ఎంతో మురిసిపోయాడే! అంతా మిథ్యేనా అన్న విషయం ఇంకా మింగుడు పడలేదు మనోహర్‌కి. మేకప్ ఎంత పని చేసింది? అంతేకాకుండా, ఈ లాక్‌డౌన్‌వల్ల తిని కూర్చొని వొళ్ళు చేసింది కూడా మరి! అందుకేనన్నమాట, తను వీడియో కాల్ చేసేది కాదు, పైగా తను చేసినా ఎత్తేది కాదన్నమాట. ఎమైనా అంటే నెట్‌వర్క్ సరిగ్గా లేదని ఫోన్‌లో మాత్రం మాట్లాడేది.

నిజం తెలియగానే మనోహర్ మొహం నల్లగా మాడిపోయింది. కళతప్పిన మొహంలో లేని నవ్వు తెచ్చుకొని, "నీలాంటి వాళ్ళకి బ్యూటీ పార్లర్లు లేనట్లే, ఈ లాక్‌డౌన్‌లో మా కోసం సెలూన్‌లు కూడా తెరిచిలేవు. మరి ఇన్నాళ్ళుగా జుట్టు, గడ్డం పెరిగితే మరి ఎలా ఉంటాను?" అన్నాడు.

"సరే! ప్రయాణం చేసి బాగా అలసిపోయారు. ముందు కాఫీ తాగి, బాత్‌రూముకి వెళ్ళి స్నానం చేసి అలసట తీరిన తర్వాత వెంటనే సెలూన్‌కెళ్ళండి. లేకపోతే మిమ్మల్ని చూడలేకపోతున్నాం బాబూ. ఎవ్వరూ పోల్చుకోలేరు మిమ్మల్ని ఈ గెటప్‌లో. నేను కూడా బ్యూటీపార్లర్ వెళ్ళాలి. నిన్నే బ్యూటీ పార్లర్ తెరిచారని పక్కింటి అంటీ చెప్పింది." అందామె కాఫీ కలిపి తేవడానికి వంటిట్లోకి వెళ్తూ.

"త్వరగా వెళ్ళు! నువ్వు ముందు ఆ పని పూర్తి చేసుకు రా!" అన్నాడు మనోహర్ అపరిచితురాలిలా కనిపిస్తున్న భార్య ఇచ్చిన కాఫీ తాగి బాత్‌రూములోకి వెళ్తూ.

అవును మరి! ఈ లాక్‌డౌన్‌వల్ల జరిగే కష్టాల్లో ఇదికూడా ఇకటి మరి. బ్యూటీ పార్లర్లు, సెలూన్లూ లేకపోసరికి ఒకరికొకరు అపరిచితులవుతున్నారు మరి!

మరిన్ని కథలు

Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు