అంతరంగం - కొమ్ముల వెంకట సూర్యనారాయణ

the inside

"ఏవండీ! అత్తయ్య మన దగ్గరకు రానంటున్నారండి,ఇక్కడే ఉంటారంట,ఓపికున్నంతకాలం ఏదో వండిపడేసుకుంటాను,అప్పటికీ కాలు,చేయి ఆడకపోతే ఏదో పనిపిల్లను పెట్టుకుని కాలక్షేపం చేస్తాను,ఈ ఇంటిని మావగారి జ్ఞాపకాలను,ఉన్న పొలాన్ని విడిచి రాలేనంటున్నారండి” అంది నా శ్రీమతి ఇందిర.

నాన్నగారు గుండెపోటుతో చనిపోయి ఇరవై రోజులు కావస్తుంది. నాన్నగారి పెదకార్యం,తలంట్లు అన్నీ పూర్తయ్యి బంధువులందరు ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. చెల్లి, బావగారు,మేనల్లుడు,మేనకోడలు మొన్న వెళ్ళిపోయారు.ఇంట్లో అమ్మ,నేను, ఇందిర,పిల్లలు ఉన్నాం.పెట్టిన సెలవులు పూర్తి కావడంతో నేను కూడా రేపు వెళ్ళి ఆఫీస్ లో జాయిన్ అవ్వాలి.అత్తాకోడళ్ళు చాలా అన్యోన్యంగానే ఉంటారు.పిల్లలు కూడా నాన్నమ్మ,నాన్నమ్మా అంటూ అమ్మ కొంగు విడిచిపెట్టరు,మా పిల్లలే కాదు మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా అమ్మమ్మ,అమ్మమ్మా అంటూ అమ్మ కూడా కూడా తిరుగుతారు. ఇల్లు పాడవకుండా మా బంధువులు ఎవరో ఒకరిని ఇంటిలో ఉండమని, పొలాన్ని కౌలు కిచ్చి అమ్మను మాతో మా దగ్గరకు తీసుకెళదామని నేనూ,ఇందిర రాత్రే అనుకున్నాం. అందుకే కాబోలు అమ్మని తను అడిగింది.

సరే, నేను అడుగుతానులే అన్నాను.

“మా దగ్గర ఉందువు గానీ రమ్మంటే రానంటున్నావంట,ఇందిర చెప్పింది,ఒంటరిగా ఒక్కదానివు ఇక్కడ ఎలా ఉంటావు,పైగా నాన్న జ్ఞాపకాలు మరింతగా బాదిస్తాయి కదా ” అన్నా అమ్మతో

“ పక్కపక్కనే మీ పెదనాన్న,చిన్నాన్న కుటుంబాలు లేవా, ఎవరో ఒకరు వస్తూ పోతుంటారు.అందరూ కలివిడిగా ఉంటారు,సందడిసందడిగానే ఉంటుంది కదా, మీరుండేది పెద్ద దూరం కాదు కదా, వారం వారం వస్తూండండి,పెద్ద బెంగుండదు” అని సర్ది చెప్పేసింది,ఇక తప్పలేదు బయలుదేరి వచ్చేసాం.

*** *** *** *** *** *** ***

ముందులో ప్రతి వారం వారం మేమంతా అమ్మ దగ్గరికి వెళ్ళే వాళ్ళం.పని అమ్మాయినెవరిని పెట్టుకోకుండా పనులన్నీ తనే చక్కబెట్టుకునేది.మేమెళ్ళేసరికి ఇంటిలో మా పెద్దమ్మ కోడళ్ళో,మా పెద్దమ్మో ఉండేది.ఇంటిలో అమ్మ ఒక్కత్తే ఉందనే లోటు లేదనిపించేది.కాలం గడిచే కొలదీ నాన్నగారి జ్ఞాపకాలు కొద్దికొద్దిగా మనసు పొరల్లోంచి వెళిపోతూ అమ్మ తిరిగి మామూలు మనిషి అయ్యింది. ఆ తర్వాత ఒక్కోసారి అమ్మే మా ఇంటికి వచ్చి ఒక రెండు మూడు రోజులు మాత్రమే ఉండి వెళ్ళిపోయేది. అమ్మ దగ్గరకి మేమెళ్ళినా,అమ్మ మా దగ్గరకు వచ్చినా సరదా సరదా గానే అమ్మతో ఇందిర,పిల్లలు,నేను గడిపేవాళ్ళం.అతిశయోక్తి కాదు కానీ అమ్మా,ఇందిర అత్తాకోడళ్ళలా కాకుండా తల్లీ కూతుళ్ళలా ఉండేవారు.వారిద్దరి మధ్య పొరపొచ్చాలన్నవే ఎప్పుడూ కనిపించలేదు. వెళ్ళిన ప్రతిసారీ అమ్మను మా ఇంటికి వచ్చేయమనడం,లేదా అమ్మ మా ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇక్కడే ఉండిపోమనడం,,తనేమో ఇంకా ఒంట్లో ఓపికుంది కదరా , ఓపిక సన్నగిల్లిన తర్వాత చూద్దాంలేరా అంటూ తిరస్కరింఛడం జరిగేది.

*** *** *** *** *** ,*** ***

అమ్మని చూద్దామని వెళ్ళిన ఈ సారి మాకు ఇంటిలో పని అమ్మాయి కనిపించింది.అమ్మ కాస్త నీరసంగా కూడా అనిపించింది. అదేంటీ అంత నీరసంగా కనిపిస్తున్నావు, పనిఅమ్మాయి ని కూడా పెట్టుకున్నావు,ఏమైనా ఒంట్లో నలతగా ఉందా అని అడిగేసరికి,” ఏం లేదురా,వయస్సు కూడా మీద పడుతుంది కదా ,వార్ధాక్యం తో వచ్చే సమస్యలే లేరా,కాస్త నలతగా ఉంటే ఇక్కడ మన ఊర్లో ఆర్.ఎం.పి డాక్టర్ కి మీ పెదనాన్నకొడుకు,అదే మధు అన్నయ్య చూపించాడు,ఇపుడు బానే ఉంది,ఆ మాత్రం దానికి మరల మీకు చెప్పితే మీరు ఆందోళన పడతారని చెప్పలేదు, అందుకే నాకు కాస్త పనులలో చేదోడువాదోడుగా ఉంటుందని మనకు తెలిసిన పని అమ్మాయి ని పెట్టుకున్నాను” అని సర్ది చెప్పింది .పోనీ ఒకసారి టౌన్ లో డాక్టర్ కి ఒకసారి చూపించుకుందువుగానీ ,రా అని బలవంతం చేస్తే ఆఖరికి ఒప్పుకుంది. మా కూడా వచ్చింది.డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి ఆయన చెప్పిన పరీక్షలన్నీ చేయించా. రిపోర్ట్స్ అన్నీ చూసి ఏమీ లేదండి,కాస్త బలహీనంగా ఉన్నారు అని బలానికి మందులు రాసిచ్చారు. అవి తీసుకుని ఒకటి రెండు రోజులు ఉండి మరల మా ఊరు వెళ్ళిపోయింది.

*** *** *** *** *** *** ***

కాలం సాగిపోతుంది. కాలంతో బాటు అమ్మవయస్సు , వయస్సు తో బాటు అమ్మకి ఆరోగ్యసమస్యలు అధికమవుతున్నాయి.ఇంతకుముందులా తన పనులు తను చేసుకోవడం కూడా కష్టమవుతున్నాయి.అందుకే అమ్మని దగ్గరుండి తీసుకువచ్చేద్దామని మా ఊరు నేనొక్కడినే వెళ్ళా.

”అమ్మని బట్టలు, అవి సర్దుకో మన ఇంటికి వెళదాం,నీ పనులే నువ్వు చేసుకోలేక పోతున్నావు కదా,పెదనాన్న వాళ్ళకి ఇల్లు చూసుకోమని చెపుతాను,ఎలాగూ పొలం వాళ్ళే చూస్తున్నారు కదా” అన్నాను.

ఒక్కసారిగా బాంబు పేల్చింది.” ఒరేయ్! నువ్వు చెప్పింది నిజమే ,పని అమ్మాయి కూడా వంటపని,ఇంటిపని మాత్రమే చేసి వెళ్ళిపోతుంది,నా పనులు నేను చేసుకోవడానికి కూడా కొద్ది ఇబ్బందిగానే ఉంది. అందుకే ఒక నిర్ణయానికి కొచ్చా,మీ ఇంటికి దగ్గరలో వృద్ధాశ్రమం ఉంది కదా , అక్కడ ఉంటాను,వారం,వారం,ఇందిర,పిల్లలు,మీరు ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్ళుదురుగానీ అంది.

ఒక్కసారిగా మెదడు మొద్దుబారిపోయింది.”అదేంటమ్మా అలా అన్నావు,మేమేమైపోయాం,నువ్వు వృద్ధాశ్రమంలో ఉండటానికి,నీకేమైనా లోపం చేసామా,ఇందిరేమైనా నిన్ను అందా,లేదా పిల్లలేమైనా అన్నారా” అని నిలదీసా.దానికి “ ఒరేయ్! దాన్నేమన్నా అన్నావంటే నీ కళ్ళుపోతాయిరా అది నా కూతురురా,కోడలు కాదురా,అలాగే నువ్వు గానీ,మనవలు గానీ నన్నేనాడు వీసమెత్తు మాట అనలేదురా ,అందుకే వృద్ధాశ్రమంలో ఉంటాననేది “ అంది.అదేంటి మేమేమీ ఇబ్బంది పెట్టనపుడు మరి నువ్వు వృద్ధాశ్రమంలో ఉండవలసిన పనేంటి అని అడిగేసరికి “ఒరేయ్! ఒకే ఒక ప్రశ్న అడుగుతాను దానికి సమాధానం చెప్పు” అంది.ఏంటి అని అడిగితే అప్పుడు చెప్పింది

” ఒరేయ్! నీకు మీ నాన్నమ్మ అంటే ఇష్టమా,మీ అమ్మమ్మ అంటే ఇష్టమా సూటిగా చెప్పు” అని అడిగింది.నాకు అమ్మమ్మే ఇష్టమని చెప్పాను. మరి మీ నాన్న చెల్లెలు అదే మీ మేనత్త కొడుకులు అదే నీ బావలు ఎవరంటే ఇష్టమనేవారు అని అడిగేసరికి, “వాళ్ళకి అమ్మమ్మ అయిన మన నాన్నమ్మ అంటే ఇష్టమనే వారు” అన్నాను. అంటే ఒకే ఆవిడ ఒకరికి అమ్మమ్మయి ఇష్టమయింది,అదే ఆవిడ వేరొకరికి నాన్నమ్మయి ఇష్టం లేకుండా పోయింది ఎందుకో తెలుసా, ఒక్కటే కారణం నాకు తెలిసి దూరం. దూరాలు ఎప్పుడూ మనుషులను,మనసులను దగ్గర చేస్తాయి అందుకే ఎప్పుడూ దగ్గరుండే నాన్నమ్మ నీకు ఇష్టం కాకపోవడానికి,అప్పుడప్పుడు కలుసుకునే అమ్మమ్మ వాళ్ళకిష్టం కావడానికి.అందుకే దూరాలు మనుషులను,మనసులను మరింత దగ్గర చేస్తాయిరా ,అందుకే నేను వృద్ధాలయంలో ఉంటాననేది” అంది.

సరే! నువ్వు చెప్పింది బానే ఉంది మరి అయితే నా పిల్లలకు నాన్నమ్మవయిన నువ్వంటేను ఇష్టమే, అలాగే నా చెల్లెలి పిల్లలు అదే నా మేనకోడలు,మేనల్లుడుకి కూడా అమ్మమ్మ అయిన నువ్వంటే అంటే ఇష్టమే కదా “ లాజిక్ లాగాను.దానికి ఓ చిన్న చిరునవ్వు నవ్వి “నేనిచ్చిన సమాధానంలోనే ఉందిరా దానికి కూడా జవాబు అంటూ నువ్వు నీ ఉద్యోగం వచ్చేంత వరకు మీ నాన్నమ్మ దగ్గరే పెరిగావు,మరి నీ పిల్లలు మీ దగ్గరే పెరిగారు కానీ వాళ్ళ నాన్నమ్మ దగ్గర కాదుకదా నీ మేనకోడలు,మేనల్లుడు వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర పెరిగినట్లు లాగే ” అనేసరికి అమ్మ ఆలోచనలలో నిగూఢత,అంతరార్ధం,దూరదృష్టి అర్ధమవ్వసాగాయి.

అంతే కాదు ఇంకో విషయం కూడా ఈ సందర్భంలో గుర్తుచేస్తున్నాను,నీకు సంబంధించిందే.

” నీకు, మామయ్య వాళ్ళ ఊరిలోనే మొదట ఉద్యోగమొచ్చింది.మామయ్య వాళ్ల ఇంటిలోనే ఉండి ఉద్యోగానికి వెళ్ళివచ్చేవాడివి. శ్రీరామ భక్తుడు,పరమ సాత్వికుడు అయిన దశరధరావు మామయ్య అంటే వల్లమాలిన అభిమానం కదా నీకు , అటువంటి మామయ్య ఒకసారి, వేరే చోట ఎక్కడో ఉద్యోగం చేసుకునే మీ బావ అదే వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళి అక్కడ ఒక రాత్రి తీవ్రమైన వైరల్ ఫీవర్ తో ఆప్టిక్ నెర్వ్స్ కాలిపోయి శాశ్వతంగా అంధుడై పోతే అప్పుడు నువ్వు అక్కడి వెళ్ళి చూసి వచ్చి ఏం చెప్పావో గుర్తుంది కదా నాతో, “అమ్మా! మామయ్య తిరిగి తన సొంత ఇంటికి అదే నేను ఉద్యోగం చేసుకునే ఊరు వచ్చిన తరువాత దగ్గరుండి ఉదయం,సాయంత్రం,రాత్రి తనతో ఉండి చూసుకుంటానమ్మా జీవితాంతం వరకు” అన్నావు,మరి ఎలా చూసుకున్నావు,ఎంత కాలం చూసుకున్నావో నీకు తెలియంది కాదుకదా మొదట్లో ఉదయం,సాయంత్రం,రాత్రి దగ్గరుండి చూసుకున్నావు కానీ తర్వాత్తర్వాత మామయ్యను జీవితాంతం అలా చూసుకోగలిగావా, లేదే, నిన్ను తప్పుపట్టటానికి ఈ విషయం చెప్పటంలేదు,ఇది సహజాతిసహజం,మొదట్లో ఉండే ఆ ఆప్యాయత, ,ఆ ఎఫెక్షన్ ఇంటెన్సిటీ(అమ్మ అప్పట్లోనే ఎస్.ఎస్.ఎల్.సి ఫస్ట్ క్లాస్ లో పాసయింది) క్రమేణా తగ్గిపోతుంది.సో!ఇది అంగీకరించవలసిన వాస్తవం, వాస్తవం ఎప్పుడు చేదుగానే ఉంటుంది.ఇది దూరపు బంధువుల విషయములోనే కాదు, దగ్గర బంధువుల విషయంలో మరింతగా వర్తిస్తుంది.

నా అదృష్టం ఏమిటంటే ఇంతవరకు నువ్వన్నా,ఇందిరన్నా,పిల్లలన్నా నాకు వల్లమాలిన ప్రేమ,అలాగే ఇందిరకి,నీకు,పిల్లలకు నేనంటే మహాప్రేమ, అందుకే ఈ ప్రేమలు ఇలా నా మనసులో,మీ మనసులలో శాశ్వతంగా నిలిచిపోవాలనుకుంటున్నాను. ఆ ఆనందం,ప్రేమ నా చివరి శ్వాస వరకు నాలో,మీలో నిలిచిపోవాలంటే నేను చెప్పినట్లుగా నన్ను వృద్ధాశ్రమం లో చేర్చు, నా ఈడు వాళ్ళతో ఈ చివరి రోజులు ఆనందంగా గడిపేస్తాను.ఎటూ వారం వారం వస్తారు,ఆ జ్ఞాపకాలతో,మధురానుభూతులతో మరుసటి వారం వరకు గడిపేస్తాను. ఇక నాకు పూర్తిగా ఆరోగ్యం క్షీణించిన తర్వాత అంటావా , మీ ఇంటికి తీసుకెళ్ళినా పర్వాలేదు,తీసుకెళ్ళక పోయినా పర్వాలేదు ఎందుకంటే మీకు నా పట్ల అపారమైన ప్రేమ ఉందనే భావన నా మనసులో అప్పటికే గాఢంగా నాటుకుపోయి ఉంటుంది కదా, నాకు అప్పుడు మీరు ఎలా చూసుకున్నా” అంది.

అమ్మ మాటలు, ఒక నిండుగోదారి ప్రవాహంలా గంభీరంగా తన నిండైన వ్యక్తిత్వాన్ని తెలియచేసేలా , ఆవు-పులి కధలో ఆవు, తన బిడ్డకు చెప్పే సూక్తుల్లా,కొంతకాలానికి ఆ పాత్ర లోకి వెళ్ళబోతున్న మాకు ఏ విధంగా మసలుకోవాలో మార్గాన్నినిర్ధేశించేలా అనిపించాయి. అమ్మ మాటలు శిరసావహించా లోకమేమనుకున్నా.

మరిన్ని కథలు

Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు