పొట్టోడికి భయంపురం పేరు సరదాగా అనిపించింది. ఈ పేరు వెనుక కారణం తెలుసుకుందామని అనుకున్నాడు. మధ్యాహ్నానికి భయంపురం చేరాడు. పూటకూళ్ళమ్మ ఇంట్లో భోజనం చేసి చింతపండు కొనటానికి బజారుకేళ్ళాడు.
మిట్టమధ్యాహ్నం బజారు అంతా కొనుగోలుదారులతో నిండి పోవటం చూసి ఆశ్చర్యపోయాడు పొట్టోడు. రేపు ఏమైనా పండుగనా అందరు మధ్యాహ్నం బజారుకు వచ్చి సరుకులు కొంటున్నారు అని అడిగాడు చింతపండు అమ్మే చిట్టయ్యని దానికి చిట్టయ్య "ఈ భయంపురంలో పండగ కూడానా నయనా..." అంటూ నిట్టూర్చాడు.
దానికి పొట్టోడు " ఏమి చిట్టయ్య? మీ ఊరులో పండగలు చేసుకోరా? అసలు మీ ఊరికి భయంపురం అని పేరు ఎందుకు వచ్చింది" అంటూ ప్రశ్నించాడు. "ఏమి చెప్పమంటావు నాయనా మా ఊరికి దక్షిణ దిక్కుగా ఒక పెద్ద కారడవి ఉన్నది. సాయంత్రమైతే చాలు అందులోంచి ఒక పెద్ద పులి రోజూ మా ఊరి మీద పడి జంతువులను మనుషులను చంపి తింటోంది. అందుచేతనే మా ఊర్లో సాయంత్రమయ్యాక ఎవ్వరూ బయటకు రారు. ఈ విషయం తెలిసి మా ఊరికి భయంపురం అని పేరు పెట్టారు చుట్టుపక్కల ఊర్ల వారు" అంటూ వివరించాడు చిట్టయ్య.
భయమంటే తెలియని పొట్టోడికి ఈ కథ విని భలే నవ్వొచింది. సరే ఈ పులి సంగతేంటో చూద్దామని తిరుగు ప్రయాణం మానుకుని ఊరి రచ్చబండ మీదకెక్కి కూర్చున్నాడు.
సాయంత్రంయ్యింది, సూర్యుడు మెల్లిగా అస్తమించాడు గాని వెలుతురు పూర్తిగా మందగించలేదు. భయకరమైన గాండ్రింపు తోను, ఆకలి తోను, జంతువుల, మనుషుల మాంసాల రుచి బాగా మరిగిన ఒక పెద్ద పులి ఊరిలోకి వచ్చింది. వస్తూనే రచ్చబండ మీద కూర్చున్న పొట్టోడు ని చూసింది. ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే ఊర్లో ఒక మనిషిని చూసేసరికి పులికి ఆకలి రెట్టింపైంది.
భయంకరంగా గర్జిస్తూ పొట్టోడి వైపుకి పరుగెత్తుకుంటూ వస్తోంది. ఆ పులి గాండ్రింపు విని ఎవరి జంతువు బలి అవుతోందా అని ఆ ఊళ్ళో ప్రజలు కిటికీలు తెరిచి జరుగుతున్నది చూడ సాగారు. ప్రచండ వేగంతో పరిగెడుతున్న పులిని, దాని వైపు చిరుమన్దహాసంతో నిర్భయంగా చూస్తున్న పొట్టోడుని చూసి ఆ ఊరి ప్రజలు ఆశ్చర్యపోయారు.
పులి పరిగెడుతూ వస్తోంది పొట్టోడు ఆఖరు సెకనులో ఒక్క ఉదుటున పక్కకు ఎగిరిపోయాడు. అంతే పులి తన ప్రచండ వేగాన్ని నియంత్రించుకోలేక వేగంగా వచ్చి రచ్చ బండ మీద ఉన్న మర్రి చెట్టుని బలంగా గుద్దుకుని కింద పడి పోయింది. వెంటనే పొట్టోడు తన జేబులో మత్తుమందు జల్లి సిద్దంగా ఉన్న ఒక బట్ట ముక్కను పులి మొహం మీదకు విసిరి దాని మీదకు ఎక్కి గట్టిగ దాని చేత వాసన చూపించాడు. అంతే పులి స్పృహ తప్పి పక్కకు ఒరిగి పోయింది.
ఒకొక్కరుగా ఆ ఊరులోని ప్రజలు బయటకు రాసాగారు. తాము చూసిన సంఘటన నిజమా కాదా అనే ఆలోచనలతో అందరూ సంభ్రమాస్చర్యానికి లోనయ్యారు. ఆ ఊరి పెద్దైన వెంకయ్య గారు పొట్టోడు ని పిలిచి చేసిన మేలుకి కృతజ్ఞత తెలిపాడు. అంత పెద్ద పులి ఎదురుగ వస్తుంటే ధైర్యంగా ఎలా నిలబదగాలిగావ్ అని అడిగారు. అందుకు పొట్టోడు "నాకు భయం లేదు. బహుశా దాన్నే ధైర్యం అంటారేమో" అని బదులిచ్చాడు.
నీతి: జీవితంలో ప్రతి సమస్య ఒక పెద్దపులి లాంటిదే.. దాన్ని చూసి భయ పడుతూ ఉంటె అది మనల్ని ఇంటి బయటకు కూడా రాలేనంత గా భయపెడుతుంది. ఎటువంటి సమస్య కైనా సరే పక్క ప్రణాళిక తో ధైర్యంగా ఎదిరిస్తే ఆ పెద్దపులి లానే సమస్య కూడా మనుషులకి దాసోహమవుతుంది. భయాన్ని దూరం చేసుకోవటమే ధైర్యం.