అమ్మకు అంకితం - Bhaskar Kantekar

dedicated to mom

లోకం అనుకునేది తప్పో ,వప్పో నాకనవసరం. నేను ఈ కార్యం చేయాలని నా మనస్సాక్షి చెప్పింది.నేను చేస్తాను.

లోకంతో పాటే నేను.

అందరూ వెళ్లిన దారిలోనే, కొంచెం భిన్నమైన పిల్లదారుల సహాయంతో గమ్యం చేరాలనుకున్నాను. విధి ఆడే ఆటలో అందరం కీలు బొమ్మలం.

అందరి లాగే నేను విధికి తలవంచాను.అందరి లాగే నేను ఒడిపోయాను. ఓడి గెలిచానో లేక గెలిచి ఓడానో నా ఆత్మ సాక్షి కె తెలియాలి.

అమ్మా నన్ను క్షమించు!

***** ******

అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి పెద్దచేసింది.నాన్నకాలంచేసిన తరువాత నాన్నైనా , అమ్మైనా అన్నీ అమ్మే.కాలంచేసిన గాయాలకు తలొంచకుండా ,మమ్మల్ని ఒక దారి లోకి తెచ్చింది.
అన్నింటా ముందుండి,జీవితపు ఎడ్ల బండిని అలుపెరుగకుండా లాక్క్కొచ్చింది. మాకు నాన్న లేడన్న భావన రానీయకుండా ,అన్ని మౌఖిక సదుపాయాలు కల్పిస్తూ మమ్మల్ని ప్రయోజకులని చేసింది.

చిన్నప్పటినుంచీ గ్రామీణ జీవితం గడిపిన అమ్మకి నగర జీవితం అంటే అంత ఇస్టముండేది కాదు. అందుకని ఎల్లపుడు గ్రామం లో అన్నయ్య దగ్గర ఉండేది కాదు. అలా అని ఎప్పుడూ నా దగ్గరే సిటీ లోను ఉండేది కాదు. నా దగ్గర కొన్ని రోజులు,మరికొన్ని రోజులు అన్నయ్య దగ్గరా ఉండేది.కానీ నిజానికి, నగరంతో,నగర వాతావరణం మరియు ఇక్కడి పరిస్థితులతో ఇమడ లేక , అమ్మ చాలా ఇబ్బందులు ఎదుర్కొనేది.

ఒకరోజు సాయంత్రం ఫ్లాటు విడిచి బయటకు వెళ్లి దారి మరిచిపోయిన సంఘటన తలచుకొంటే, ఇప్పటికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది.మా సమయం బాగుండి, మా పక్క ఫ్లాట్ అతను గుర్తించి ,మా ఇంటికి చేర్చాడు. లేకుంటే ఎంత ఇబ్బందిగా ఉండేదో! పెద్దవాల్లను ఎలా చూసుకోవాలో ముందు నేర్చుకొండి అని సదరు వ్యక్తి పెట్టిన చివాట్లు కూడా మరచిపోలేను.

మొన్నప్పుడో మేమందరం గుడికి వెళ్ళినప్పుడు, అక్కడ ఓ ముసలావిడ కప్పుకోవడానికి బట్టలు లేక, చలికి గజ గజ వణుకుతూ అమ్మ దృష్టిలో పడిందట.ఇంట్లో ఓ పాత దుప్పటి ఉంటే,అది ఆ ముసలావిడకు ఇవ్వాలని ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా బయలుదేరింది.అంతే, ఆ గుడి వరకు వెళ్లగలిగింది కానీ వొచ్చేటప్పుడు దారి తప్పింది. కాలనీ లో అన్ని వీదులు ఒకే లాగా కనిపించడం కూడా అమ్మ దారి కాటుపడటానికి కారణము కావచ్చును.

నగర వాసులు చిన్నగా మాటాడుకొంటారు. అదే ఊళ్లల్లో అయితే పెద్దగా మాటాడుకొంటారు.దానికి కారణం లేక పోలేదు.ఊళ్లల్లో ఇల్లు పెద్దవిగా ఉంటాయి. ఇంటింటికి ఎడం కూడా ఎక్కువే. మన ఇంట్లో మనం దగ్గుకున్నా, తుమ్ముకున్నా అది మన ఇంట్లో అందరికి వినపడటమే కష్టం.అక్కడ వీటన్నిటికీ అంతగా ఇబ్బంది ఉండదు.కానీ ఇక్కడ నగర అపార్టుమెంట్లు, అగ్గిపెట్టెల్లా ఉంటాయి.ఈ ఇంట్లో చీమ చిటుక్కుమంటే, ఆఇంట్లోకి వినబడుతుంది.

ఇక పల్లె జనానికి భయం ,భక్తి భావన,నీతి నిజాయితీ ధర్మాధర్మాలన్న ఒకింత గౌరవం మరియు నమ్మకం.

కోడలు వేసే డ్రెస్సులు అమ్మకి నచ్చేవి కాదు.పక్క ఫ్లాటు వారు వొచ్చినప్పుడు అమ్మ మాటాడే తీరు,కూర్చొనే విధానం నా భార్య కి నచ్చేది కాదు.
ఇవే కాకుండ, ఇంకొన్ని విషయాలు చాలా అమాయకంగాను కొన్నిసార్లు కోపాన్ని తెప్పించేవిగా ఉండేవి.

ముఖ్యంగా, ఇంటికి ఎవరైనా వోస్తే వారికి తినడానికి ఏదో ఒకటి ఇచ్చి పంపించడం అమ్మకు అలవాటు.గ్రామంలో ఇంటికి వొచ్చే పని అమ్మాయికి, బట్టలు తీసుకుపోవడానికి వొచ్చిన వాళ్ళకి, ఇంకా ఏవేవో పనుల మీద ఇంటికి వొచ్చి పోయే వారికి ఏదో ఒకటి ఇచ్చి పంపటం అమ్మకు అలవాటు. కొందరికైతే ఇంట్లో ఉన్న ఊరగాయ, మూలన పడి ఉన్న మామిడికాయలో ఏదో ఒకటి , ఏది అందుబాటులో ఉంటే అది ఇచ్చి పంపడం అమ్మకు బాగా అలవాటు. అమ్మ వాళ్ల నాన్న అంటే మా తాత గారు ఊరిలో పేరొందిన మోతుబరి ఉండేనట. ఆ గుణ గణాలు ఎక్కడికి పోతాయి. ఏదో మా నాన్నను కట్టుకున్నందుకు, అతను నడీడులో వెళ్లిపోవడం,అమ్మకి తాతయ్య కి మనస్పర్ధలు రావడం,అవన్నీ ప్రస్తుతం అప్రస్తుతం.

అయితే అదే విధానాన్ని ఇక్కడ నగరంలో కూడా అమలుపరచాలని చూసేది.ఇంటికి పొద్దునే వొచ్చి చెత్త తీసుకుపోయే మున్సిపల్ సిబ్బంది, పేపర్ బాయ్, కొరియర్ బాయ్,పని మనిషి,పాల ప్యాకెట్లు సరఫరా చేసే వాళ్ళు ఇలా వొచ్చే వాలన్దరితో ఆత్మీయంగా మాట్లాడటం , వారికి ఏదో ఒకటి చేతికందినది ఇవ్వచూపేది.

ఇక సిటీ లో నాగరికుల మనస్తత్వాలే వేరు గదా.
ఇవన్నీ ,అంతే కాదు ఈ సంఘటనలు అత్తా కోడళ్లు పోటా పోటీగా మాటాడుకొనే వరికు తీసుకెళ్ళేవి. చిన్న చిన్న విషయాలే ,చిలికి చిలికి గాలి వానలా మారెవి.

ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు ఉన్న ప్రసన్న వధననాలు , ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఉండేవి కావు.అయస్కాంత సజాతి దృవాలుగా మారెవి వారి మనసులు మరియు ముఖాలు.

ఒకరూ తింటే మరొకరు ఉపవాసం.ఒకరిని బుజ్జగిస్తే మరికరికి కోపం.కోడలిని బుజ్జగిస్తే అమ్మ కి కోపం.అమ్మకు నచ్చ చేప్పితే భార్యకు కోపం.

'విడవమంటే పాము కు కోపం , కరవమంటే కప్పకు కోపం' అన్నట్లుగా మారిపోయేది నా పరిస్థితి. ఒక సారి అమ్మ , ఒక సారి భార్య మరోసారి ఇద్దరు నాపై కారాలు మిరియాలు నూరేవారు.

అమ్మ ,ఆలీ ఇద్దరూ స్త్రీ మూర్తులే.ఇద్దరిని సమాధాన పరచాల్సిన బాధ్యత నా పై ఉండేది.


పొద్దస్తమానం ఆఫిసు లో టెన్షన్.ఇంటికి వోస్తే ఇక్కడ మరో టెన్షన్.ఈగోడవల్లో పడి ఆఫీస్ పనుల్లో తప్పిదాలు,చివాట్లు చివరకు మెమోలు.


******* ******* ********


ఓ రోజు, ఆఫీస్ నుండి రాగానే ,అమ్మ నా దగ్గరకు వొచ్చి,తనని వూళ్ళో వదలిపెట్టమని పట్టుబట్టింది.

అమ్మ కళ్ళు అప్పటికే ఎర్రబడి ఉన్నాయి.బహుశా ఏడ్చి ఉంటుంది. ఇద్దరూ ఏదో విషయం లో గొడవ పడివుంటారని పరిస్థితి చూస్తే అర్థం అవుతుంది. .

అమ్మ మాత్రం ఏం చేస్తుంది, ఉంటే నీవైన ఉండాలి లేదా నేనైనా అని కోడలు పట్టుపడితే.కోడలు మాత్రం ఎం చేస్తుందని, చెప్పిన మాట అత్తా వినదు.అత్తను అదుపులో పెట్టే సామర్థ్యం తనకూ లేవు.

సాయంత్ర ఏడింటికి మూట ముల్లె సర్దుకుని వెళ్లాడని రెడీ అయ్యి కూర్చుంది అమ్మ.

అటు అమ్మ కళ్లల్లో కన్నీరు.

అమ్మకి నిజానికి వూరంటేనే ఇష్టం.అక్కడి ఇల్లన్న, అక్కడి మనుషులన్న, వారు తినే తిండి అన్నా ఎంతో ఇష్టం.ఆక్కడైతే పొద్దున్నా గ్లాస్ నిండా టీ , డబల్ రొట్టెలు (బన్ను), లేదా జొన్న రొట్టెలు , చిక్కని పాలు,గడ్డ పెరుగు,చింతకాయ పచ్చడి. అలాంటి తిండి తిని ,ఇక్కడి ఇడ్లీలు, పాస్తాలు, రోస్ట్ బ్రెడ్లు ,చప్పని పప్పు కూరలు తినాలంటే అమ్మకి అసలు రుచించేవి కావు.ఇక్కడ మేము తాగే కప్ టీ అంటే కూడా విసుక్కునేది.అక్కడి గ్లాస్ టి అంటే మన రెండు మూడు కప్పులు మరి.

అక్కడ అయితే ఈ టిఫిన్ గోల ఉండదు, గడియారం చూసి తినే అవసరం ఉండదు.

మధ్యాహ్నం పూట ఇంటి పక్కన ఉన్న ముసలమ్మల తో మాట మంతి చేసుకోవడం. కాసేపు విశ్రాంతి . ఒక్క కునుకు తరువాత సాయంత్ర వేల కాఫీ తో మళ్ళీ రెండవ దఫా రచ్చబండ. ఇంటింటి రామాయణాన్ని చర్చిస్తారు.ఆరిపోసుకొనే వారిని ఆరిపోసుకోవడం , ఆకాశానికి ఎత్తేవాళ్ళని ఆకాశానికి ఎత్తేయడం అన్ని జరుగుతూ ఉంటాయి అక్కడ.

అమ్మకి వూరంటే భూతల స్వర్గం. వూర్లో ఉన్న అన్నయ్య వదిన కంటేను, అన్నయ్య పిల్లలు అంటే ఎనలేని ప్రేమ అమ్మకి.

మా పిల్లల పైన అంత ప్రేమ లేదేమో అనిపిస్తుంది. అది నా భావన ఆ కావచ్చు.రెండు కళ్ళలో ఏ కన్నంటే ఇష్టమని అడిగినట్లు ఉంటుంది , అయిన అన్నయ్య పిల్లల మీద ఎక్కువ మమకారం అని చెప్పటానికి కారణాలు లేకపోలేవు.అమ్మ రాగానే నాయనమ్మ అంటూ అల్లుకు పోతారు.నాయనమ్మ అది కావాలి ఇది కావాలి అని సతాయిస్తారు ఆ సతాయింపు లోనే ఆనందం ఉంటుంది. ఆ ఆనందాన్ని ఆస్వాదించేది అమ్మ.

రాత్రైతే చాలు నాయనమ్మ చెంత వాలిపోయేవారు.ఆ కథ ఈ కథ చెప్పమని పిల్లలు చేసే గోల ,అన్నయ్య కోపించుకోవడం, అమ్మ ఆన్నయ్యని దబాయించడం జరుగుతూ ఉండేవి.

అన్నయ్య ఎప్పుడైనా పిల్లల మీద కోప్పడితే, నీకు చాలా తెలుసు లేరా అంటూ అన్నయ్య కే చీవాట్లు పెట్టడం, పిల్లలు అన్నయ్య ఒంక అదోలా చూస్తూ ,మాకు నాయనమ్మ అండ ఉందనే ధీమాను వ్యక్త పరచడం ,అవన్నీ అమ్మ అనుభవించే ఆనందాలు. మళ్ళీ అలాంటి వాతవరణంలోకి వెళ్లి అక్కడి ఉండాలని ఏ వయసు పై పడిన అమ్మ అనుకోదు.

అన్నీ మనం అనుకున్నట్టుగా ఉంటే అది జీవితం ఎలా అవుతుంది. అక్కడకూడా కొన్ని సాధక భాదకాలుండేయి అమ్మకి.

ఇల్లు , కుటుంభం అన్నాక చిన్న చిన్న పంచాయతీలు కాకుండా ఉంటాయా?!!.

అక్కడ ఇంటి పని ,వంట పని అంతా వదిన గారే చేస్తారు.అన్నయ్య ఇంటికేమో పెద్ద.పిల్లలు పిల్లలే.అమ్మ వయసు పైపడిన పెద్దమ్మ.ఇక పని చేయడానికి మిగిలిందేవరు, వొదినే కదా!

పని భారం మొత్తం వదిన మీద పడేది .

వయసు పై బడిన తరువాత వొచ్చే రక్తపు పోట్లూ, మధుమేహం లాంటి వ్యాధులతో పాటె నోరు పెరగడటం,కోపం రావడం,వండిన వంటలు రుచించక పోవడం అందరికి జరుగుతాయి.ఆ అవస్థలో అమ్మ ,వదిన చేసిన వంటకాలకు పేరు పెట్టడం ,అది వదిననకి నచ్చక పోవడం , చిన్న పొట్లాట కు నాంది కావటం..ఇంకేముంది అక్కడ అదే గొడవ.


ఇంతకు మించి ఇంకో గొడవ కూడా అయ్యేది చాలా సార్లు.అదేమిటంటే. ..అమ్మది కొంచం ఉదార గుణం.వదినకి తెలియకుండా అవి ఇవి దానం చేస్తూ ఉండేది. ఇంట్లో మిగిలిన వంటకాలు పక్కింటి వాళ్లకు, పిలిచి పంచి పెట్టడం ,గ్రామంలో ఎవరైనా గడప ముందు కి దేహీ అని వోస్తే లేదనకపోవడం లాంటివి.అప్పుడప్పుడు ఇంట్లో వృధాగా పడి ఉన్న బట్టలను ,అవసరం ఉన్న వారికి ఇచ్చేది. ఎవరైనా అవసరముందని డబ్బులు అడిగితే ఎలాగైనా చేసి సరిదేది. ఇలా చేసే పనులు ,తీసుకున్న నిర్ణయాలు కొన్ని అన్నయ్యకు కూడా తెలియనిచ్చేది కాదు. ఒకసారి మా ఒదిన పాత చీర ఒకటి కనిపించాకుండా పోయింది. మరునాడు అదే చీర కట్టుకొని మా ఇంట్లో పనిచేసే అమ్మాయి దర్శనమిచ్చింది. చీర ఎవరిచ్చారో, ఏం జరిగిందో అందరికీ అర్థమైపోయింది . అమ్మ మాత్రం తానూ చేసింది మంచి పనేగా అని అమాయకంగా తనని తాను సమర్థించుకొంది.

ఇలాంటి విషయాలపైనే వదినకి, అమ్మకి గొడవలు అయ్యేవి.

అమ్మకి పుట్టుకతో వొచ్చినది దాన గుణం, అంత తొందరగా పోదు కదా!

అమ్మకు చాలా పెద్ద మనసు ఉండేది.

ఎంతో అనుభవమున్న పెద్ద మనిషి. అన్నిటికి మించి పెద్ద దాయాగుణశీలిగా జీవించినది.

ఎన్నో కష్టాలు సుఖాలు చూసి అనుభవించినది.

అలాటి ఒక విషయంలోనే వదిన తో గొడవ పడి , ఆ గొడవ కాస్త ముదిరి చిన్నపాటి జగడం అయ్యింది. ఒకరినొకరు తిట్టుకున్నారు. కొన్నిరోజుల వరకు ఇద్దరికీ మాటలు కూడా ఉండేవి కావు అదే తడవుగా , ఒక రోజు మూట ముల్లె సర్దుమోని నన్ను తమ్ముని దగ్గర వదిలేయమని అన్నయ్య ని విసిగించడం, అన్నయ్య వొచ్చి అమ్మని నా దగ్గర వదిలి వెళ్లడం జరిగింది .

అమ్మని,ఒక సారి మా ఆవిడా వద్దంటుంది మరోసారి వదిన వొద్దంటుంది. అమ్మ పరిస్థితి ఎలా చక్కబెట్టాలో అర్దమయ్యేది కాదు మాకు . తమ తమ పరిస్థితులలో వారు చేసే పనులు, తీసుకొన్న నిర్ణయాలు సరైనవే అనిపిస్తుండేవి.

కానీ ఇవేవి అమ్మకి మాత్రం నచ్చనివిగానే ఉండేవి. అమ్మ స్థానంలో నిలబడి ఆలోచిస్తే నిజమే మేము ఎందుకు మా'భార్యలను గద్దించి , 'అవును అమ్మ చెప్పిందే సరైనది 'అని ఎందుకు అనలేకబోతున్నాము. మాలో పరిపక్వత లోపమా లేక అమ్మనే మమ్మల్ని అర్థం చేసుకో లేకపోతుందా.

"అమ్మా మమ్మల్ని క్షమించు, ఇకపైనా నీకు అలాంటి ఇబ్బంది కలగ నీయకుండా చూసుకొంటాను" అని ఆ రోజు స్వగతంగా అనుకొన్నాను.

అమ్మను కార్లో ఎక్కించుకుని వూరుకి బయలుదేరాను.సిటీ నుండి రెండు గంటల ప్రయాణం .

చేతులు స్టీరింగ్ పై ఉన్నావన్నమాటే కాని మనసంతా ఆలోచనలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది.

అన్నా వొదినలకి ఎలా నచ్చ చెప్పాలి. భార్యకు ఏమి చెప్పాలి. అమ్మకు ఇక నీకిక ఇలాంటి పరిస్థితులెదురవవని భరోసా ఎలా తెప్పించడం. లేదంటే జరుగుతున్నదంతా చుస్తూ , కాలం మీద బారం వేసి , ఓడి పోయానని పరిస్థితికి తలవంచడమేనా. లేదు ఏదో ఒకటి చేయాల్సిందే. ముందుగా అమ్మని ఆర్థికంగా బలంగా చేయాలి. తాను చేసే దానధర్మాలకు ఈ ఆర్థిక ఇబ్బందులు అడ్డంకులు కాకూడదు. అంతే కాదు , ఆర్థికంగా బలంగా ఉంటే ,ఎవరైనా ఏదైనా మాటాడేముందు, ముందు వెనుక ఆలోచిస్తారు. మొత్తంమీద ఈ సమస్యకు తాత్కాలిక పరిస్కారం దొరికినట్లు మనసు కొంచం కుదుటపడింది.

నా దృష్టి స్టీరింగ్ పైన ఉన్న నా ఎడమ చేతి వేళ్ళ పైకి వెళ్ళింది .చిటికెన వేలు మీద ఉన్న కొడవలి గాట్లు, చిన్నప్పుడు అమ్మ, నేను కలసి వరి పంట కోస్తూవుంటే , కొడవలి చిటెకెన వేలుపైవొచ్చి చేసిన గాయం తాలూకు గాట్లవీ. నేనెంత ఎదిగినా, నా గత జీవితాన్ని ఈ గాట్లు గుర్తు చేస్తునేఉంటాయి. అవి గుర్తుకోచినప్పుడల్ల అమ్మ మీద గౌరవం పెరుగుతుంది. అమ్మెంటో, ఆమె పడ్డ కష్టాలేంటో మాకు తెలుసు. నిన్న గాక మొన్న వొచ్చిన ఈ కోడళ్ళు, అనుభవ రాహిత్యంతో అమ్మను అర్థం చేసుకోక పోవడం,అమ్మ భావాలను గౌరవించక పోవడం తప్పే. ఆ తప్పు జరుగుతున్నప్పుడు, అమ్మవైపు మొగ్గు చూపి సమర్ధించకపోవడం మేం చేసిన ,చేస్తుండిన పొరపాటే.

తన రక్తాన్ని చెమట ధారపోసి మమ్మల్ని కష్టాల కడలి నుండి గట్టెకించిన మాతృమూర్తికి ఏమిచ్చి ఆ ఋణం తీర్చుకోగలం.

మనం ఏమేమో చేయాలనుకొంటాం విధాతా మరోటి చేస్తాడు. మనమొకటి తలచితే దైవం మరోటి తలుస్తాడే,అదే జరిగింది.

అదే అమ్మతో కలిసి చేసిన ఆఖరి ప్రయాణంఅయ్యింది.. .


######## #####$# ######

అమ్మ పోయి సంవత్సరం అయిన సందర్భంగా, మొదటి సంవత్సరీకాన్నీ గ్రామంలో ఏర్పాటు చేసాము. బతికున్నప్పుడు అమ్మను ఎలా చూసుకునేవారమో ఊర్లో అందరికి తెలుసు. అమ్మ ఉన్నప్పుడు చేసివుండాల్సిన కొన్ని పనులు , కనీసం ఇప్పడైన చేయాలి అనిపించింది.
అమ్మకు చాలా ఇష్టమైన పని 'దానం' చేయడం. అందుకే దానంతో మొదలు పెట్టాలనుకున్నాము
.
దానికి అయ్యే ఖర్చు కూడా నేనోక్కడినే భరించాలనుకొన్నాను.ఆర్థికంగా కూడా నేనే కొంచం మెరుగైన స్థితిలో ఉన్నాను. అన్నయ్య తో చర్చిస్తే సరే అన్నాడు.

అమ్మతో రోజు మధ్యాహ్నం,సాయంత్రము వొచ్చి మాట్లాడే వారందరిని పేరు పేరునా పిలిపించి అందరికి చీరలు, కండువాలు, శాలువాలు మరియు చిన్న నగదును బహుకరించాలని నిర్ణయించుకొన్నాం. ఒక ఇరవై చీరలు ,శాలువాలు మాత్రమే కాకుండా అదనంగా ఇంకా ఇరవై కండువాలతో కూడిన బట్టల జతలు సమకూర్చుకొని ,వూరిలో వయసుపై బడిన వారందరికీ పంచాలని నిర్ణయించాము.

అనుకున్నట్లుగా వూరిలోని వృద్ద మహిళలు , వయోధికులు అందరూ వొచ్చారు. అందరికి భోజనాలు పెట్టి , ఆన్న వదినల చేతుల మీదుగా బట్టలు పంచాము. ఒదిన ఒకింత ఉగ్వేదానికి గురై అందరి ముందు బోరున ఏడ్చేసింది.ఏడుస్తూ కానుకలు పంచవద్దని ఎవరో అనగా, తనను తాను సాంబాలించుకొని బట్టల్ని పంచడం మొదలెట్టింది.
బ్రతికున్నప్పుడు చిన్న చిన్న తగాదాలు పడటం,అలగటం మల్లి మాములుగా మారటం ,ఇవన్నీ జన జీవన స్రవంతి లో సాధరణమే.

మనం ఎమి చేసినా చేయకపోయినా విమర్శించే వాళ్లు విమర్శిస్తూనే ఉంటారు. బతికి ఉన్నప్పుడు గంజైన పోయని పిల్లలు, చనిపోయాక మాత్రం అన్నదానాలు వారి పేరిట సత్రాలు. ఇంకాస్త కలిగి ఉంటే చారిటీలు పెడతారని జనాలు అంటూనే వుంటారు.లోకులు పలు గాకులు. ఎవ్వరి నోరని మూయగలం.

అందుకని పోయిన తరువాత ఇలా చేస్తే ఏమనుకుంటారో అని ఏమి చేయకుండా తటస్తంగా ఉండటంలో కూడా అర్థం లేదు. అందుకే నా మనస్సాక్షి చ్చెప్పింది నేను చేసాను.

అక్కడ గోడకు తగిలించి ఉన్న ఫోటో లోని అమ్మ పెదవులపై ఇంతకు ముందు లేని చిరునవ్వేదో వొచినట్లనిపిచింది.

నిజమో లేక బ్రమనో ఈశ్వరుడే చెప్పాలి

***********************

భాస్కర్ కాంటేకర్

మరిన్ని కథలు

Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు