శ్రేష్ఠ మరియు విశిష్ట అక్క చెల్లెళ్లు. కవల పిల్లలు. వాళ్ళ తల్లి తండ్రులది ప్రేమ వివాహం.
తండ్రి శివాజీ రావు మహారాష్ట్రకు చెందిన శాఖాహారి. తల్లి శివాని తెలంగాణా ఆడబడుచు. శాఖాహారి కాదు. భిన్నమైన వైవిధ్యమైన శివాని,
శివాజీ రావులను వాళ్ళ దైనందిన జీవితం కలిపింది. ముంబాయి నగరంలోని డోంబివిలిలో తొలి పరిచయం.
శివాజీ రావు ప్రఖ్యాత భారత ప్రభుత్వ సంస్థలో ప్రధానాధికారి. సాంకేతిక శాస్త్రంలో పట్టభద్రుడు. ఉద్యోగంలో ఎదగాలని కుతూహలం. కొన్ని సంస్థాగతమైన పరీక్షలున్నాయి . వాటిలో విజయం సాధించడానికి శ్రమ పడుతున్నాడు.
వయసొచ్చినా వివాహం మీద ఆశక్తి లేదు. ఎవరడిగినా ఇంకా ఎదగాలంటాడు.
శివానిది మధ్య తరగతి కుటుంబం.
తండ్రి పశ్చిమ రైల్వే అధికారిగా ఉద్యోగ విరమణ చేసి ముంబాయిలో స్థిరపడ్డాడు. శివాని ఏకైక సంతానం . సామాన్యమైన విద్యావంతురాలు. మొత్తం మీద పట్టభద్రురాలైనది. పుస్తక ఙ్ఞానం కన్నా లోక ఙ్ఞానం ఎక్కువ.
శివాని మేనమామ శివరావు చాలా మంచివాడు. అనేక విషయాల్లో మంచి సలహాలిస్తాడు . అతని ప్రోత్సాహంతో ఉద్యోగావకాశాలు వున్నాయని మానవ వనరులు మరియు ప్రజా సంబంధాల విభాగంలో శిక్షణ తీసుకుంది . కంప్యూటరు వాడటం నేర్చుకున్నది .
అదృష్టం కలిసొచ్చింది .పేరున్న ప్రైవేటు సంస్థలో జనరల్ మేనేజర్ కి ఆంతరంగిక కార్యదర్శిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించింది. పేరుకు తగ్గట్టు జీతభత్యాలు బాగున్నాయి. స్వతహాగా శివాని అల్పసంతోషి. పూర్వ చరిత్రను బట్టి ఇంతటి స్తాయి చూస్తుందనుకోలేదు.
శివాని మరియు శివాజీ రావు 'డోంబివిలి'లో వుంటారు. డోంబివిలి రైల్వే స్టేషన్ కి ఆటోలో వచ్చి రైలెక్కాలి . ఇద్దరికీ రైలు పాసున్నది.
ఒక రోజు ఊర్లో గొడవగా వుంది .ఆటోలు సరిగ్గా తిరగడం లేదు. అంతా గందరగోళ వాతావరణం. రైలొచ్చే సమయమైంది.
ఇంతవరకు శివాని ఆటో సీటు పంచుకుని ప్రయాణం చేయలేదు. ఒక్కతే కూతురవ్వటంతో తండ్రి చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఇంతలో ఒక ఆటో వచ్చి ఆగింది. అది తను రోజూ ఎక్కి వెళ్ళే ఆటోనే. కానీ అందులో మరో వ్యక్తి కూర్చున్నాడు . ఆటో డ్రైవర్ అన్నాడు ' ఇవాళ ఆటోల సంఖ్య తక్కువున్నది, ఎమనుకోకండా ఎక్కండి' అని.
రోజూ అదే ఆటో డ్రైవర్ మొదటి రైలుకి శివాజీ రావును,రెండవ రైలుకి శివానిని తీసుకెళ్తాడు. ఈ రోజు గొడవల కారణంగా శివాజీ రావు రెండవ రైలుకి వెళ్తున్నాడు .
శివాని ఒక్క క్షణం ఆలోచించి ఆటో ఎక్కింది విముఖంగా, వేరే గత్యంతరం లేక. ఆటోలో ఒక పక్కగా వొబ్బిడిగా కూర్చుంది. అది గమనించి శివాజీ రావు తనలో తాను నవ్వుకొన్నాడు ఈ ముగ్ధ ముంబాయి నగర నివాసా లేక కొత్తగా గ్రామప్రాంతనుండి వచ్చిన గ్రామ సుందరాని.
సమయం మించింది కాబట్టి వేగంగా ఆటో వాళ్ళని గమ్యం చేర్చింది. నెల సరి ఖాతాలవ్వటంతో ఆలస్యం చేయకుండా గబగబ ఆటోదిగి అప్పటికే వేచున్న రైలెక్కి కూర్చున్నారు.
మామూలుగా రైలు బాగా రద్దీగా వుంటుంది. కనీ ఈ రోజు సామాజిక గొడవలు వలన ఇద్దరికీ పక్క పక్క సీట్లు దొరికాయి. శివాజీ రావు తన పరిచయం చేసుకున్నాడు. మర్యాదకి శివాని కూడా తన పరిచయం పూర్తి చేసింది.
గమత్తు ఏమిటంటే ఇద్దరి కార్యాలయాలు ఇంచుమించు రెండు కిలోమీటర్లు దూరంలో వున్నాయి.ఈ విషయం మాటలకు దారి తీసింది . శివాని కలగజేసుకుని అన్నది ' నేను రోజూ ఈ రైల్లో వెళ్తాను, ఎప్పుడూ మిమ్మల్ని చూడలేదు ' అని. 'నేను దీని ముందు రైలుకి వెళ్తాను 'అని ముక్తసరిగా శివాజీ రావు బదులు చెప్పాడు. గమ్యం వచ్చింది. గబగబా రైలు దిగి ఎవరి కార్యాలయానికి వాళ్ళు వెళ్ళారు.
శివాజీ రావు సహజంగా స్త్రీలతో పరిచయం పెంచుకోడు. కానీ ఈ రోజు అతని మనసు కలవరమైంది. కార్యాలయానికి వెళ్ళాడు కానీ పని మీద ఏకాగ్రత కుదరలేదు.
కొంచెం మార్పుకి వీధిలోకి వేళ్ళి వేడి కాఫీ తాగుదామని నాలుగు రోడ్ల కూడలి వద్దకు వచ్చాడు .ఓ పెద్ద ఫలహారశాల ముందు నిలబడ్డాడు.
వెనకనుండి ఖరీదైన కారు వేగంగా వచ్చి ఆగింది. ఆశ్చర్యం ! శివాని కారులోంచి వయ్యారంగా దిగింది. ఇద్దరూ అవాక్కైయ్యారు. ఇక్కడ ఏమిటి,ఇలాగ ఏమిటని. వాళ్ళ చూపులు కలసాయి. ఈలోగా కార్లోంచి సూట్ వేసుకుని హుందాగా శివాని జనరల్ మేనేజర్ దిగాడు. అప్పటికే అతను వీళ్ళ పరిస్థితి గమనించాడు. అందుకే అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడేమో.
శివానికి లోక ఙ్ఞానం ఎక్కువ. వెంటనే చున్నీ సర్దుకుని శివాజీ రావుని పరిచయం చేసింది ఎన్నాళ్లగానో తెలిసిన వ్యక్తిలా.
శివాని అధికారి ఆధునిక నాగరిక జీవనానికి ప్రతీక.
పరస్పర మర్యాదల తర్వాత 'శివరావు గారు మీకు అభ్యంతరం లేకపోతే కాఫీ తాగుదాం రండి ' అన్నాడు జనరల్ మేనేజర్. శివాని ఆశ్చర్యపడింది . మొత్తం మీద అందరూ వర్తమానంలోకి వచ్చి ఫలహారశాలకు చేరుకుని కాఫీతో పాటు ఫలహారం తీసుకుని ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళారు .
అన్నట్టు ఇంతవరకూ శివాని జనరల్ మేనేజర్ పేరు చెప్పలేదు కదా. అతని పేరు విశ్వనాథ పటేల్
గుజరాత్ లో పుట్టి పెరిగాడు. ఐ. ఐ. ఎమ్. అహ్మదాబాద్ విద్యార్థి. వ్యాపారంలో మెలకువలు
తెలుసు. వ్యవహర ఙ్ఞానమున్నది. పరిపాలనా దక్షతున్నది. పొడగరి, ఆరు అడుగుల అందగాడు మరియు చమత్కారి. ఎదుటి వారిని వెంటనే ఆకర్షించే సంభాషణ చాతుర్యం. ఇంకేమికావాలి ఎవరికైనా జీవితంలో ఎదగడానికి.
విశ్వనాథ పటేల్ తండ్రి పెద్ద వ్యాపారి. అతనికి చాలా వ్యాపారాలున్నాయి. కొన్ని సంస్థలకు యజమాని. కొడుకు తన దగ్గరే వుండి తన కార్యాలయాలు వృద్ధి చేయాలంటాడు. విశ్వనాథ్ పటేల్ దానికి భిన్నంగా ఆలోచిస్తాడు.
విశ్వనాథ్ పటేల్ కి తండ్రి చాటు బిడ్డగా కాకుండా తనకై తాను ఏదైనా సాధించాలన్న తపన. దానికి తగ్గట్టు ప్రధాన మంత్రి 'స్టార్ట్ అప్' , నినాదానికి ప్రభావితుడైనాడు . మొత్తం మీద
ముంబాయిలో స్థిరపడ్డాడు. అనతికాలంలో
సంస్థ వృద్ధి చెందింది . సంస్థని స్టాక్ ఎక్ఛైంజ్ లో నమోదు చేసే ఉద్దేశంతో వున్నాడు. సొంత సంస్థే అయినా జనరల్ మేనేజర్ హోదాలోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఎందుకంటే అందులో వ్యవహార సౌలభ్యమున్నదని .
విశ్వనాథ్ పటేల్ తన సంస్థలోని ఉద్యోగులను సొంత వాళ్ళ లాగా చూస్తాడు .వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం చూపిస్తాడు . అందుకే వాళ్లు అతన్ని వదలరు . శివాని అంటే అతనికి మంచి అభిప్రాయం .
శివాని వాళ్ళది సామాన్య కుటుంబ మైనప్పటికి ఆమె ఆహభావాలూ అసామాన్యం.
శివాజీ రావు పరిచయమైన తర్వాత ఆమెలో మెల్లమెల్లగా కొన్ని మార్పులు వచ్చాయి. ఇదివరకు డ్రస్ వేసుకొనేది. శిరోజాలంకరణకు సమయం కేటాయించడానికి ఇష్ట పడేది కాదు. మామూలు చెప్పులు వేసుకొనేది.
ఇప్పుడు చీర కట్టుతోంది. బొడ్డు కిందగా. చేతులు లేని జాకెట్, ఎత్తు మడమల చెప్పులు అలవాటు చేసుకొంది. తరుచుగా సౌందర్యశాలకు వెళ్తుంది. ఆమె వ్యవహార శైలి కూడా మారింది. అచ్చంగా ఆధునిక వనితలాగున్నది.
ఇదంతా తన కోసమని విశ్వనాథ్ పటేల్ మనసులో
మురిసి పోతున్నాడు.
శివాని పరిచయం తర్వాత శివాజీ రావులో కూడా కొన్ని మార్పులొచ్చాయి. ఇదివరకు తెల్లని చొక్కా తెల్లని పాంటు వేసుకొనేవాడు. చొక్కా పాంటు పైన వేసుకొనేవాడు. సామాన్య మైన చెప్పులు అలవాటు. గడ్డం పెంచెవాడు.
ఇప్పుడు రంగు రంగుల బట్టలు వేస్తున్నాడు. చొక్కా పాంటు లోపల దూర్చి టక్ చేస్తున్నాడు. బాటా దుకాణం వెళ్ళి ఖరీదైన పాదరక్షలు కొన్నాడు. రోజూ గడ్డం గీస్తున్నాడు . ఖరీదైన నీలి సులోచనాలు కొన్నాడు. తను ఎటువైపు చూస్తున్నాడో తెలియ కుండా. మొత్తం మీద శివానిని ఆకర్షించేప్రయత్నం
చేస్తున్నాడు .
ఇద్దరూ ఒకే ఆటోలో ,ఒకే రైల్లో, ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి.
వాళ్ళ మధ్య స్నేహం పెరిగింది కానీ సాన్నిహిత్యం లేదు. ఇదే శివానికి అంతుబట్టని విషయం.
శివాని దృష్టిలో శివాజీ రావు ఒక పప్పుసుద్ధ. లోకం లోని విషయాలన్నీ మాట్లాడతాడు. అసలు సంగతి తప్ప. ఎంత లేదన్నా ఆమె భారత ఆదర్శ నారీమణి.
తనకై తాను నోరు విప్పి ఎలా చెప్పుతుంది.
శివాజీ రావుకి శివాని మీద ఆశ వున్నది.
కానీ వివాహనికి సుముఖంగా లేడు. ఎందుకంటే అతని దృష్టిలో తాను ఇంకా ఎదగాలి. ఇంకా పెద్ద ఉద్యోగం చేయాలి. అందుకనే స్నేహం వీడటం లేదు. సాన్నిహిత్యం కోరటం లేదు.
ఒక రోజు శివాని తన సహజ మైన స్త్రీ సిగ్గులను
పక్కన పెట్టి తన మనసులోని మాట చెప్పి అతని అభిప్రాయం అడిగింది. వెంటనే శివాజీ రావు ఇలా అన్నాడు ' నాకు మీరంటే చాలా ఇష్టం. మిమ్మల్ని వివాహం చేసుకోవాలని మనసులో వుంది. కానీ నేను వివాహం చేసుకోవాలంటే ఇంకా ఉద్యోగంలో ఎదగాలి.' వెంటనే శివాని అందుకొని అంటే ఎప్పుడండి మీరు ఛైర్మన్ అయ్యాక. ఆ వయసులో మీకు ఎవరూ పిల్లనివ్వరు. మీరు బ్రహ్మచారిగా ఉంటారు .'అని పకపకా నవ్వింది . శివాజీ రావుకి కూడా నవ్వాడు.
శివాని ఇంకా ముందుకెళ్ళి . 'చూడండి
శివాజీ రావు గారూ, ఉద్యోగమన్నది జీవితంలో
ఒక భాగం. ఉద్యోగమే జీవితం కాదు. మనమిద్దరం మంచి స్తాయిలో వున్న ఉద్యోగాలు చేస్తున్నాము.
మన సంపాదనతో ఎంతో హాయిగా సుఖంగా బతకవచ్చు . మన అభిప్రాయాలొక్కటే. దానికి తోడు మరీ పెద్ద ఉద్యోగం చేస్తే సంసారం చేయటానికి సమయముండదు ' అని మళ్ళీ పకపకా నవ్వింది.
శివాజీ రావుకు శివాని అంటే మొదటి నుంచి చాలా ఇష్టం. ఇప్పుడు ఆమె సంభాషణా చతురత హాస్య ప్రస్తావన చాలా నచ్చాయి. నచ్చటమేంటి ముగ్దుడయ్యాడు.
హటాత్తుగా శివాని సిగలోంచి ఒక పువ్వు తీసుకొని
ఒక మోకాలిని నేలకానించి ఇంకో మోకాలిని తిన్నగా వుంచి ' నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను వివాహం చేసుకుంటావా ' అని ఆంగ్ల బాష లో అడిగాడు.
ఒక్కసారి శివానికి మతి భ్రమించింది. ఇది తాను ఆశించిన సంఘటనే కానీ తన పప్పుసుద్ద ఇంతటి
శృంగార పురుషుడా అని ఆశ్చర్యం.
'మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని వివాహం చేసుకుంటాను ' అని ఆంగ్ల బాష లో చెప్పి అతని చేతిలోని పువ్వు తీసుకొని ముద్దు పెట్టుకొని తిరిగి తన సిగలో అలంకరించింది శివాని.
శివాని ఎన్నోసార్లు తలలో పువ్వులు పెట్టుకుంది. కానీ ఇంతటి తియ్యటి అనుభూతి ఎప్పుడూ పొంద లేదు . ఇద్దరూ తొలి సారి కరచాలనం చేసుకుని గృహోన్ముఖులైనారు.
ఇద్దరికి దారిలో ప్రకృతి స్తంభించిందన్న భావన. ఇదివరకులా మాటలు లేవు. గుసగుసలు అసలే లేవు. గుండె వేగంగా కొట్టుకుంది. హృదయ ధ్వని లబ్ డబ్ అనటంలెదు. లవ్ యూ లవ్ యూ అంటోంది.
మొత్తం మీద ఎవరింటికి వాళ్ళు చేరుకున్నారు. పెద్దలకు విషయం చెప్పారు.
శివాజీ రావు తల్లి తండ్రులు తొలుత ఇష్టపడలేదు.
కానీ వాళ్ళకు శివాజీ రావు నచ్చ చెప్పాడు. మొత్తానికి ఒప్పుకున్నారు.
శివాని తల్లి తండ్రులకు అసలిష్టం లేదు. చూడు
శివాని ' మాతృభాష వేరు. సంప్రదాయం వేరు. ఆచార వ్యవహారాలు వేరు ఆహార అలవాట్లు వేరు. ఎలా కలసి కాపురం చేస్తారు ' అని తండ్రి నిలదీసి అడిగాడు. తల్లి కూడా అదే మాట ఇంకోలా చెప్పింది. మనకి వాళ్ళకి పొసగదు, తర్వాత కష్టపడాలని.
అక్కడే వున్న శివాని మేనమామ శివరావు కలగజేసుకుని అన్నాడు. ' బావగారు ఈ కాలంలో కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు సహజం . అలా అని నేను వీళ్ళని సమర్ధించడం కానీ ప్రోత్సహించడం కానీ చేయటం లేదు. వాళ్ళు ఒకరినొకరు అర్ధం చేసుకున్నారు, ఇష్టపడుతున్నారు. ఇష్టాయిష్టాలు పరస్పరం తెలుసు కున్నారు. తర్వాత బాధ్యతాయుతమైన పదవుల్లో వున్నారు. వాళ్ళకి సొంత నిర్ణయం తీసుకునే ప్రజ్ఞ వున్నది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం కాళ్ళు అరిగేలాగా తిరిగినా ఇంత కన్నా మంచి సంబంధం తీసుకొని రావడం చాలా కష్టం '.
ఈ మాటలతో శివాని ధైర్యం పుంజుకుంది. శివాని తల్లి తండ్రులు అయిష్టంగానే ఈ సంబంధం ఒప్పుకున్నారు. శివాని ఏకైక సంతానం. ఆమె సంతోషం కన్నా వాళ్ళకి కావలసినదేముంది.
కానీ చివరగా ఒక మాట చెప్పారు. అమ్మా చూడు నీకిష్టమైన వానితో పెళ్ళి చేస్తున్నాము. కాపురం ఆనందంగా వుంచుకోవటం నీ బాధ్యత అని.
నెమ్మదిగా అందరి అభిప్రాయం కలిసింది. ఆనందాలు పొంగాయి. చిరు నవ్వులు చిందాయి.
ఒక శుభ ముహూర్తంలో వివాహం జరిగింది. క్లుప్తంగా చేసారు. దగ్గర బంధుమిత్రులను
మాత్రమే పిలిచారు. ఆటో డ్రైవర్ చాలా ఆనందించాడు.
డోంబివిలిలో రెండు పడకల వసతిని దగ్గరగా వున్న గృహ సముదాయంలో అద్దెకు తీసుకొన్నారు. ఇరువైపుల పెద్ద వాళ్ళకు చేరువగా వుండాలని.
శివాని, శివాజీ రావు దంపతుల దిన చర్యలో మార్పు లేదు. ఒకటే ఆటో, ఒక్కటే రైలు, ఒక్కటే బాట,ఒక్కటే మాట. ఒకే ఒక మార్పు, సరదాగా సన్నిహితంగా సరసాలాడుతూ కమనీయంగా కాపురం చేస్తున్నారు.
కాల గమనం ఆగదు. వాళ్ళ వివాహ జీవితంలో
రెండు వసంతాలు గడిచాయి.
ఒక నడి రేయి ఏకాంత సమయంలో శివాని అన్నది 'మన పెద్ద వాళ్ళు మనుమడు కావాలంటున్నారు. ' అని .వెంటనే శివాజీ రావు తన పాత పాట పాడాడు. చూడు శివాని నేను తండ్రి నవ్వటానికి సిద్ధంగా లేను. ఉద్యోగంలో ఎదిగాక ఆలోచిస్తాను ' అని. శివాని సమయ స్ఫూర్తి గల ఇల్లాలు. సమయానుకూలంగా ప్రవర్తించడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఈ మధుర సమయంలో మాటలు పెంచటానికి బదులు ప్రేమను పంచటం మంచిదని మారు మాట్లాడకుండా అతని వెచ్చని కౌగిలిలో ఒదిగింది.
ఇంకొన్ని నెలలు వారి కాపురం మధురంగా సాగింది. ఒక ఆదివారం మధ్యాహ్నం ఇద్దరూ కలసి భోజనం చేస్తున్నారు. భోజనం మధ్యలో శివానికి వికారం వచ్చింది. కళ్ళు తిరిగాయి. ఓపిక తెచ్చుకుని స్నానాలగదికి వెళ్ళి వాంతి చేసుకుంది. శివాజీ రావు మెరుపులా వెళ్ళి ఆమెను గట్టిగా పట్టుకుని గదిలో పడుకోబెట్టాడు. శివాజీ రావు వెంటనే తమాయించుకొని దగ్గరలో ఉన్న ప్రఖ్యాత డాక్టరు శ్రీలక్ష్మి గారిని పిలుచుకు రావటానికి వెళ్ళాడు.
శ్రీలక్ష్మీ గారు పక్కా ఆంధ్ర ఆడబడుచు. విశాఖ పట్నంలో నౌకా దళ వైద్యశాలలో పనిచేసేది .
బదిలీ మీద ముంబాయి వచ్చింది. ఉద్యోగ విరమణ తర్వాత డోంబివిలిలో ప్రసూతి వైద్యశాల
ప్రారంభించింది. అమె హస్తవాచ మంచిది.
మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. మామూలుగా అమె ఇంటికి వచ్చి వైద్యం చేయదు. ఆదివారం చరవాణిలో కూడా మాట్లాడదు.
కానీ ఆమెకు శివాని అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఇంతకు ముందు రెండు మూడు సార్లు
వైద్య పరీక్షలు చేసింది. శివాని తన ప్రత్యేకమైన
ఆహభావాలతో ఎంతటి వారినైనా ఆకర్షిస్తుంది. ఆనమ్మకంతోనే శివాజీ రావు హుటాహుటిన వెళ్ళాడు.
అప్పుడే మద్యాహ్నము భోజనం చేసి దూరదర్శిని కార్యక్రమాలు చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్నారు శ్రీలక్ష్మీ గారు. శివాజీ రావు ద్వారా విషయం తెలుసుకుని వెంటనే బయల్దేరారు శ్రీలక్ష్మీ గారు.
ప్రాధమిక పరీక్షలు చేసి ' శుభాకాంక్షలు, నీవు తల్లివి కాబోతున్నవు ' అన్నారు ప్రఖ్యాత వైద్యురాలు
శ్రీలక్ష్మీ గారు. ఈ మాటకు అందరూ సంతోషించారు.
యథావిధిగా వైద్యురాలిని సాగనంపి శివాని దగ్గర సన్నిహితంగా కూర్చున్నాడు శివాజీ రావు. ఇద్దరి కళ్ళలో ఆనందాశృవులు. చాలా సమయం అలా వుండిపోయారు .
శివాని బాగా సంతోషంగా వున్నది. తన భర్త ఆలోచన మారిందని.
కానీ శివాజీ రావు శివాజీ రావే. మనసు లో అనేక విధాల ఆలోచిస్తున్నాడు. తాను తండ్రయ్యేంత ఎదిగానా అని. ఈ ప్రస్తావన శివాని ముందు తెచ్చాడు . శివాని ఉలిక్కి పడింది. 'ఇందాక సంతోషంగా ఉన్నారు కదండీ. ఇప్పుడు ఈ మాటలు ఏమిటి 'అని అన్నది . 'నిజమే తండ్రి అవ్వటం నాకు ఇష్టమే కానీ ఇప్పుడు అవటం ఇష్టం లేదు . ఇంకొంచెం ఎదిగాక తండ్రి నవ్వాలనుకొంటున్నాను' అన్నాడు. 'ఐతే ఇప్పుడేమిచేద్దామని మీ ఉద్దేశం ' అడిగింది శివాని.
'ఏమీ అనుకోకపోతే ఈ సారికిది తప్పించి రెండు సంవత్సరాల తరువాత మళ్ళీ ప్రయత్నించుదాము.'
అన్నాడు శివాజీ రావు తడబడుతు.
శివాని అవాక్కైయింది . ఎటువంటి జటిలమైన సమసైనప్పటికీ బుద్ధి బలం, వాక్ ప్రతిభతో ఎదుర్కొనే సామర్థ్యంగల వ్యక్తి శివాని.
'చూడండి మీరు ఏదో ఎదగాలంటారు , ఎదగటమంటే ఏమిటండీ. పై పదవులు పొందటం.
మరింత ధనార్జన చేయటం. అంతే కదా. ఇప్పుడు మనకు శిశువు పుట్టితే వెంటనే లక్షలు లక్షలు ఖర్చేమి లేదు. చిన్న వయసులోనే
పిల్లలని కంటే మనం ఉద్యోగ విరమణ చేసేసరికి వాళ్ళు ప్రయోజకులై చేతికందుతారు . మీరు ఎదిగాక పిల్లలను కనటం మొదలు పెడితే మన ఉద్యోగానంతరము కూడా వాళ్ళని చదివించాలి.
ఇంకో ముఖ్యమైన విషయం. నా గర్భం లో వున్నది
పిండమే కాదండి. ఒక జీవి. ఒక ప్రాణి. గర్భం బలవంతంగా తీయించుకోవటం మహా పాపమండి. సంతానం దైవానుగ్రహం అమ్మాయి గానీ అబ్బాయి కానీ దైవ ప్రసాదం.' అని గుక్క తిప్పుకోకుండా మనసులోని మాట చెప్పి అతనికి కనువిప్పు కలిగేలా ప్రభావితం చేసింది.
ఈ మాటలకు శివాజీ రావు నిశ్చేష్టుడైనాడు . తన తప్పు తెలుసుకుని శివానిని హత్తుకున్నాడు.
కాలం సాగుతున్నది . శివాని గర్భంలో కొత్త రకం అలజడి . వెంటనే వైద్య పరీక్షలు చేయించారు. అల్ట్రాసౌండ్ స్కాన్ ఫలితం వచ్చింది.
అత్యంత ఆశ్చర్య కరమైన విషయం. శివాని
గర్భంలో ఇద్దరు శిశువులు పెరుగు తున్నారు.
మళ్ళీ శివాజీ రావుకు సమస్య. ఒక శిశువుకే తండ్రి అవ్వటానికి సుముఖంగా లేడు. ఇప్పుడు కవల పిల్లలంటే ఎలా భరించడం. దిగులుగా కూర్చొని ఆలోచిస్తున్నాడు . శివాని సూక్ష్మ గ్రాహి. 'ఎమిటో సంగతి ' అని అడిగింది. శివాజీ రావు అమాయకపు భర్త. తన మనోభావాలు చెప్పాడు.
శివాని మనసులో అనుకున్నది ' ఈ రకం భర్త తో ఎలాగ కాపురం చేయాలి'. వెంటనే తనదైన శైలిలో అందుకుంది. 'చూడండి ఒక రకంగా కవల పిల్లలూ అదృష్టమే. వీరిద్దరిని పెంచి పెద్ద వాళ్ళను చెస్తే సరిపోతుంది. ఒక బాణానికి రెండు పిట్టలు. ఇంతటితో సరనుకుంటే మళ్ళీ మనం పిల్లలను కనక్కర్లేదు . రెండు మూడు సంవత్సరాల వ్యవధిలో ఇద్దరు పిల్లల్ని కనేకన్నా ఇదొక విధంగా మంచిది కదా. శరీర శ్రమ తగ్గుతుంది, చేతి ఖర్చు తగ్గుతుంది. మనం ఉద్యోగవిరమణ చేసేసరికి వీళ్ళు ప్రయోజకులవుతారు.'అని ముగించింది.
శివాజీ రావుకు శివాని మీద వున్న ప్రేమ వలన కొంచం, ఆమె మాటల ప్రభావం వలన కొంచెం
వెంటనే తన ప్రియ సఖికి లొంగిపోయాడు .
రోజులు గడుస్తున్నాయి. శివానికి నెలలు
నిండుతున్నాయి. అట్లాగే కింద మీద బడుతు ఇంట్లోను కార్యాలయంలోను నెట్టుకొస్తున్నది.
పురుడు తర్వాత ఎక్కువ సెలవులు తీసుకొవాలని ఆలోచన.
శివాజీ రావు ఎప్పుడూ శివానికి దగ్గరగా కూర్చుంటాడు. ఈ రోజు దూరంగా ఒంటరిగా
కూర్చున్నాడు.
' ఏమిటి అలా ఉన్నారు '. శివాని
'నాకు ఒక ఆలోచన తెగటం లేదు ' శివాజీ రావు
'ఆనుకున్నాను ఏదో మడత పేచీ వేస్తారని' శివాని
'ఇప్పుడు ఇద్దరూ ఆడ పిల్లలా, ఇద్దరూ మొగ
పిల్లలా లేక ఆడా మొగా ' శివాజీ రావు.
'ఎవరైనా మన పిల్లలే కదా. ముద్దుగా పెంచుదాము.
ఇక వెళ్ళి లైట్ ఆపి కళ్ళు మూసుకుని పడుకొంటే
బాగుంటుంది ' శివాని.
ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రసంగం అందుకుంటుందని లైట్ ఆపి కళ్ళు మూసుకుని పడుకొన్నాడు శివాజీ రావు.
మంచి రోజు చూసుకుని ఆసుపత్రిలో చేరింది.
ప్రసవించింది. ఇద్దరు చక్కటి ఆడ పిల్లలు పుట్టారు.
ఇంటికి వచ్చారు. పుణ్య వచనం తర్వాత వాళ్ళకి
శ్రేష్ఠ మరియు విశిష్ట అని నామకరణం చేశారు.
శ్రేష్ఠ మరియు విశిష్ట శుక్ల పక్ష చంద్రుడులా దినదినాభివృద్ధితో ఎదుగుతున్నారు.
మరొక రోజు శివాజీ రావు మళ్ళీ దిగులుగా కూర్చున్నాడు . శివాని కాఫీ అందిస్తూ 'ఏమిటి సమాచారం ' అన్నది. 'ఏమీ లేదు శివాని ఇద్దరిలో ఒకరు మొగ పిల్లాడు అవుతాడేమో అని ఆశించాను' అన్నాడు.
'ఇంకా మీరు పాత కాలంలో ఉన్నారు. ఈ రోజుల్లో
అమ్మాయిలకి అబ్బాయిలకి ఏమి తేడా లేదు. అందరూ చదువు తున్నారు. పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. విమానం కూడా నడుపుతున్నారు.
మీరు మీ పిచ్చి ఆలోచనలు మాని ఆనందంగా పిల్లలతో గడపడం నేర్చుకోండి 'అన్నది శివాని.
శివాజీ రావు జ్ఞానోదయం కలిగిన వాడిలా
మొహం పెట్టి ఒక చిరు నవ్వు విసిరాడు.