"శ్రీజ ప్లీజ్ అర్థం చేసుకో, మన పిల్లల భవిష్యత్తు కోసం మన ఆదాయం పెరగాలి. అందుకోసం ఇది చాలా మంచి అవకాశం. మనది రూపాయి పెట్టుబడి లేదు. వృధాగా ఉన్న టెర్రస్ మనకు నెలకు పది వేలు ఇచ్చే సువర్ణావకాశం. నెలకు పదివేలు, జస్ట్ ఇమాజిన్, పది వేలతో ఎన్ని పనులు చేయొచ్చో. లోన్ ఈ ఎమ్ ఐ ఎక్కువ కట్టి త్వారగా లోన్ క్లియర్ చేయొచ్చు" అన్నాడు సుదీప్.
"సుధీ ఆదాయం పెరగడం కోసమో ఆస్తులు కూడబెట్టడం కోసమో, మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదు. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాన్ని మన చెట్టుపక్కల వారి ఆర్యోగాన్ని దెబ్బతీసే టవర్ ఇంటి మీద ఉండటం ఎంత ప్రమాదకరమో ఆలోచించు" అన్నది శ్రీజ.
"శ్రీ, నా చిన్నప్పుడు టీవీ వల్ల ఆరోగ్యం పాడవుతుందన్నారు, ఇవాళ టీవీ లేని ఇల్లు లేదు. అలాగే సెల్ తో కూడా హెల్త్ పదవుతుందన్నారు, కుటుంబానికో సెల్ కాదు, మనిషికో సెల్ ఉంది ఈ రోజుల్లో. అలాగే కంప్యూటర్ల మీద పని చేస్తే రకరకాల రోగాలొస్తాయన్నారు, మరి నువ్వు నేను చేసేదేమిటి? మన ఉద్యోగమే రోజంతా కంప్యూటర్ మీద పనిచేయడం. మనకు ఏ యే అనారోగ్యలొచ్చాయ్ చెప్పు?" ప్రశ్నించాడు సుధీప్.
"సుధీ, టీవీ మనం చూసేటప్పుడు ఆన్ చేస్తాం తర్వాత ఆఫ్ చేస్తాం. సెల్ లిమిటెడ్ గా వాడుతాం. కంప్యూటర్ జాబ్స్ కూడా అంతే, లిమిటెడ్ టైమింగ్. మనం వర్కింగ్ అవర్స్ లో బ్రేక్స్ తీసుకుంటూనే ఉంటాం స్ట్రెస్ అవకుండా. అయినా టవర్ రేడియేషన్ ముందు టీవీ, సెల్, కంప్యూటర్ రేడియేషన్ ఎంత? టీవీ, సెల్, కంప్యూటర్ అవసరమైతే వాడతాం లేదంటే టర్న్ ఆఫ్ చేస్తాం. టవర్ అలా కాదు, దాని రేడియేషన్ 24 గంటలు ఇంట్లోనే ఉంటుంది. దీనివల్ల మనకి తలనొప్పి, నిద్రలేమి, డిప్రెషన్, ఆఖరికి కాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది" ఓపికగా చెప్పింది శ్రీజ.
"శ్రీ ఇవన్నీ నిజమైతే టవర్స్ ఉన్న ఇళ్ల వాళ్లందరికి కాన్సర్ వచ్చి ఉండాలి, కానీ అలా లేదు కదా, సో ఇవన్నీ ఉత్త పుకార్లేనన్నమాట. రాజేష్ ఇంట్లోను టవర్ ఉంది. డబ్బు సంపాదించడం వాణ్ణి చూసి నేర్చుకోవాలి. వాడిదీ, మనదీ రెండు వందల గజాల ఇంటి స్థలాలే. వాడేమో అద్దెలు ఎక్కువ వచ్చే విధంగా ఎక్కువ పోర్షన్స్ కట్టాడు, సో ఎక్కువ అద్దెలు వస్తున్నాయి. నువ్వేమో ఇల్లంటే స్వర్గం లా ఉండాలి, గాలి, వెలుతురు బాగా రావాలి, గదులు విశాలంగా ఉండాలి అని అనటం, అది నేను వినటం రిసల్ట్ తక్కువ పోర్షన్స్, తక్కువ అద్దెలు" బాధగా అన్నాడు సుధీప్.
"చూడు శ్రీజ మనం మిడిల్ క్లాస్ వాళ్లం. ఏదో బ్యాంక్ లోన్ రాబట్టి ఈ ఇల్లైనా కట్టగలిగాం. పిల్లలు గల వాళ్లం. లోన్ తీర్చాలి, పిల్లల్ని చదివించాలి, వాళ్ల భవిష్యత్తుకి మన భవిష్యత్తుకి సేవింగ్స్ చేయాలి. మన ఆర్థిక పరిస్థితి కూడా అర్థం చేసుకో. శ్రీ మనమెంత ప్రయత్నించినా పట్టణం లో పల్లె వాతావరణాన్ని సృష్టించలేం, అలాగే ఇక్కడి ఖర్చులూ తగ్గించలేం. మనమొక్కరం ప్రయత్నించినంత మాత్రాన పోయేది కాది కాలుష్యం. ఈరోజు మనం కాదన్నా రేపు మన పక్కింటి వారైనా టవర్ పెట్ట్టుకుంటారు, అప్పుడేమంటావ్ చెప్పు, వాళ్ళనెలా ఆపుతావ్?
ఇంకో వారంలో నేను అమెరికా వెళ్లాలి. రెండు సంవత్సరాల వరకు తిరిగి రాలేను. ఈలోపు ఇద్దరం ఒక నిర్ణయానికి వస్తే, టవర్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయొచ్చు. పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఆలోచించు" అంటూ లేచి ఆఫీసుకి వెళ్ళిపోయాడు సుధీప్.
మద్యతరగతి దంపతులైన శ్రీజ సుధీప్ ల పెళ్లి అయి పది సంవత్సరాలవుతోంది. వారికి సుధేష్ణ, శ్రీకర్ అనే ఇద్దరు ముద్దులు మూట కట్టే పిల్లలు ఉన్నారు. ఇద్దరూ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ కంపెనీలల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. శ్రీజ సుదీప్ లకు చెరి 35,000 జీతం వస్తుంది. ఇద్దరికీ కలిపి 70,000 జీతం వస్తున్నా హోసింగ్ లోన్, పిల్లల స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, స్కూల్ బస్, ఇన్సూరెన్సు, ఇంటి ఖర్చులకు బొటాబొటిగా సరిపోతున్నాయి. శ్రీజ సుదీప్ లు సంవత్సరం క్రితం 200 గజాల స్థలంలో మూడు అంతస్తులకు పర్మిషన్ తెచ్చుకొని లోన్ తో ఇల్లు కట్టడం మొదలు పెట్టారు. కానీ ఖర్చు తాము అనుకున్న దానికంటే ఎక్కువ అయి గ్రౌండ్ ఫ్లోర్ మరియు మొదటి అంతస్తు మాత్రం పూర్తి చేసి, రెండవ అంతస్తు స్లాబ్ వేసి వదిలేసారు.
శ్రీజ చిన్నప్పుడు సెలవుల్లో అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు ఆ పల్లె వాతావరణం, విశాలమైన గదులు, ఇంట్లో పచ్చని చెట్లు, పాడి ఆవులు దూడలు బాగా నచ్చేవి. తమకంటూ సొంత ఇల్లు కట్టాలనుకున్నప్పుడు అమ్మమ్మ ఇల్లు లాగే విశాలమైన గదులు ఉండాలని పట్టు బట్టి అలాగే కట్టించుకుంది. ఇంటి ముందు ఉన్న కాళీ స్థలం లో మొక్కలు నాటింది. గాలి వెలుతురూ చక్కగా వచ్చే విశాలమైన ఇల్లు కట్టగలిగారు కానీ, రెండో అంతస్తు కట్టకపోవడం వల్ల మొదటి అంతస్తు లో తాము ఉంటూ, కేవలం గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అద్దెకు ఇవ్వడం వల్ల అద్దె తాము అనుకున్న దాని కంటే తక్కువగానే వస్తోంది. అందువల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు.
సుదీప్ కి ఈమధ్య హోసింగ్ లోన్ భారం మోయలేనిదిగా అనిపించసాగింది. తన జీతమంతా లోన్ కె సరిపోతుంది. శ్రీజ జీతంతో మిగతా ఖర్చులకు సర్దుకుంటున్నారు. తనతో పాటు పని చేసే రాజేష్ తో తన గోడు చెప్పుకుంటే రాజేష్ సెల్ టవర్ ఐడియా ఇచ్చాడు. రాజేష్ డబ్బు వచ్చే ఏ అవకాశాన్ని వదలడు. రెండు వందల గజాల స్థలంలో మూడు అంతస్తుల ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టే సమయంలోనే సెల్ టవర్ గురించి ఆరా మొదలు పెట్టాడు. అద్దెలు ఎక్కువ వచ్చే విధంగా ఇరుకైనా సరే చిన్న గదులతో ఎక్కువ పోర్షన్స్ కట్టాడు. సరైన నాణ్యత కుడా పాటించలేదు . రాజేష్ ఇంటి అద్దెలు, టవర్ అద్దె గురించి తెలిసినప్పటి నుంచి తాము కూడా టవర్ పెట్టించుకుంటే తమకూ నెలకు ఓ పది వేలైనా వస్తాయి కదా అనిపించసాగింది. కానీ టవర్ కు ఉండే రేడియేషన్ గురించి అంతర్జాలంలో పరిశీలించిన శ్రీజ అందుకు ఒప్పుకోవడం లేదు. అదే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వేడి వాడి చర్చ.
తర్వాత వారం రోజులు సుదీప్ విదేశీ ప్రయాణానికి కావలసిన షాపింగ్, మరియు పలకరించడానికి వచ్చే బంధువులతో బిజీగా ఉండటం వల్ల మళ్లీ ఆ చర్చ వాళ్ల మధ్య రాలేదు. అయితే సుదీప్ వెళ్లేముందు "మనం మధ్యతరగతి వాళ్లం డబ్బు వచ్చే ఏ అవకాశాన్ని వదలకూడదు, కాబట్టి ఆలోచించు, ప్లీజ్" అని అన్నాడు. శ్రీజని ఈ మాటలు ఆలోచింపజేసాయి. డబ్బు కోసం టవర్ కి తాను కన్విన్స్ అవలేదు, కానీ ఇంకా ఏమైనా ఖర్చులు తగ్గించగలనా అని అలోచించి, ఇంటి ఖర్చుల డైరీ ముందేసుకుంది. అందులో కూరగాయల ధరలు చూస్తూ పల్లెలో తన అమ్మమ్మ, ప్రతిరోజు ఇంటి పెరడు లోని కూరగాయలు కోసి వంట చేయడం గుర్తు తెచ్చుకుంది. అమ్మమ్మ లేకపోయినా ఆ రుచిని తానూ ఎప్పటికీ మర్చిపోలేదు. తాను అమ్మమ్మ లాగే ఇంట్లోనే కూరగాయలు పెంచగలిగితే ఈ ఖర్చు తగ్గించుకోవచ్చు కదా అనుకుంది. కానీ అమ్మమ్మ కున్నంత విశాలమైన పెరడు తనకు లేదు.
అంతర్జాలంలో పరిశీలించి, పుస్తకాలు చదివి, అనుభవజ్ఞుల సలహాలతో టెర్రస్ గార్డెనింగ్ చేయాలని నిశ్చయించుకుంది. టెర్రస్ గార్డెనింగ్ కి తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ వారి సబ్సిడీల గురించి తెలుసుకొని వారిని వెళ్లి కలిసింది. అక్కడ వారు కొంత ట్రైనింగ్ కూడా ఇచ్చారు.
శ్రీజ మొదట ఆకుకూరలతో మొదలు పెట్టింది. ఎందుకంటే ఆకుకూరల దిగుబడి త్వరగా వస్తుంది. తేలికగా పండించవచ్చు. వాటితో పాటు పెద్ద కుండీలలో అడుగున కొబ్బరి పీచు వేసి రెండంచెల మరియు మూడంచల పద్దతిలో పైన టమాటా, బెండకాయ, వంకాయ వంటి కాయకూరగాయలు, అడుగున ఆలుగడ్డ, అల్లం, వెల్లుల్లి వంటివి నాటింది. వాటికి ప్రతిరోజూ పొద్దున్నే నీళ్లు అందిస్తూ ఇంట్లోనే తయారు చేసిన సేంద్రియ ఎరువు అందించసాగింది. రాత్రి సమయంలో టార్చ్ సహాయంతో చీడలు తొలగించింది. కొన్ని హైబ్రిడ్ మొక్కలు కూడా నాటింది. కింది భాగంలో పండ్ల మొక్కలు, ముందు భాగంలో పూల మొక్కలు నాటింది. తెలంగాణ హరిత హారం లో భాగంగా నర్సరీ లల్లో ఉచితంగా పంపిణి చేసే మొక్కలు కూడా నాటింది. పని పెరగటంతో పిల్లల్ని కూడా తోటపనిలో భాగస్వాముల్ని చేసింది. ఆ విధంగా పిల్లలు కూడా ప్రకృతికి దగ్గరయ్యారు. మొక్కలను పసిపిల్లలను సాకినట్లుగా
సాకసాగింది. అంతే కాదు కాలనీలోని మిగతా స్త్రీలు కూడా టెర్రస్ గార్డెనింగ్ చేసేవిధంగా ప్రోత్సహించింది. ఒక గ్రూపుగా ఏర్పడి విత్తనాలు, పండిన కూరగాయలు ఒకరికి ఒకరు పంచుకోసాగారు. ఎవరికి వారుగా ఉండేవారంతా గార్డెనింగ్ తో ఒకరికి ఒకరు అన్నట్టుగా అయ్యారు. అయితే శ్రీజ ఈ విషయాలేవీ సుదీప్ తో చెప్పలేదు.
ఇల్లంతా పచ్చని చెట్లతో ఉద్యానవనంలా అనిపించసాగింది. అలాగే కొందరు లెక్చరర్స్, టీచర్స్ తో ఒప్పందం కుదుర్చుకొని రెండో అంతస్తులో ట్యుటోరియల్ మొదలు పెట్టింది. రెండు సంవత్సరాలు తిరిగే సరికి కూరగాయల పళ్ల ఖర్చు తప్పడంతో బాటు ట్యుటోరియల్ వల్ల కొంత ఆదాయం పెరిగింది.
రెండు సంవత్సల తర్వాత ఇంటికి వస్తున్న సుదీప్ కి కాలనీ అంతా పచ్చని చెట్లతో ఆహ్లాదంగా అనిపించింది. ఉద్యానవనాన్ని తలపిస్తున్న తమ ఇంటి వాకిలి నుండి సువాసనలు వెదజల్లుతున్న పూలచెట్ల అందానికి ముగ్దుడయ్యాడు. భోజన సమయంలో వాడని తాజా కూరగాయలతో చేసిన వంటలు చాలా రుచిగా అనిపించాయి. వంటలు మెచ్చుకున్న సుదీప్ కి తమ టెర్రస్ గార్డెన్ కు తీసుకెళ్లి గత రెండు సంవత్సరాలుగా చేసిన కృషి ఫలితం చూయించింది. అలాగే ట్యుటోరియల్ గురించి కూడా చెప్పి మీరు డబ్బు వచ్చే ఏ అవకాశాన్ని వదలద్దన్నారు, నేను ఖర్చు తగ్గించడమే కాకుండా కుటుంబ ఆరోగ్యాన్ని పెంచే టెర్రస్ గార్డెన్ పెంచాను, మిగతా కాలనీ స్త్రీలను కూడా గార్డెనింగ్ వైపు ప్రోత్సహించి పట్టణంలోను పల్లె వాతావరణాన్ని సృష్టించాను. అలాగే ట్యుటోరియల్ అనే అవకాశాన్ని సృష్టించి ఆదాయం పెంచాను అన్నది.
"నువ్వు చాలా గ్రేట్ శ్రీ, నీకు ఇష్టం లేకుండా నేనెలాగూ టవర్ పెట్టించేవాడిని కాదు, అయినా మన ఆర్థిక ఇబ్బందులు గమనించి నువ్వుసృజనాత్మకంగా ఆలోచించడమే కాకుండా ఆచరణలో పెట్టావు. ఇప్పుడు మన ఇల్లు చాలా అందంగా ఉంది. నువ్వు పిల్లలు మునుపటి కంటే అందంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు" అని శ్రీజని మెచ్చుకున్నాడు.
"నీకు మరో విషయం కూడా చెప్పాలి, రాజేష్ వైఫ్ కి నిద్రలేమి, డిప్రెషన్ సమస్యలతో డాక్టర్ ని కలిస్తే వాళ్ల ఇంటి గురించి తెలుసుకొని వెంటనే ఇల్లు మార్చమన్నాడట. ఇప్పుడు మారిన ఇంటికి చాలా ఎక్కువ అద్దెట, మందులకూ విపరీతంగా ఖర్చవుతోందట, వాడు చాలా బాధ పడుతున్నాడు" అన్నాడు.
"డబ్బు పొతే పోయింది, ఆవిడ ఆరోగ్యవంతురాలైతే మంచిది" అన్నది శ్రీజ.
"అప్పుడు నువ్వు టవర్ ప్రపోసల్ ఒప్పుకోకపోవడం చాలా మంచిదయింది. నువ్వు నా స్మార్ట్ వైఫ్ మాత్రమే కాదు స్మార్ట్ హోమ్ మేకర్ కూడా" అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు సుదీప్.
కథ ఇక్కడితో కంచికి వెళ్ళలేదండి, అలా సృజనా, సుధీప్ లు సేంద్రియ పద్దతిలో పండించిన తాజా కూరగాయలు పళ్లు తింటూ ఆనందంగా ఉన్న సమయంలో ...
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ ప్రకటించబడింది. అయితేనేం కావాల్సిన కిరాణా సామాను అంతా ఒకే సారి తెచ్చుకొని, రోజువారీ కూరగాయలు పళ్లు కొనుక్కోవడం కోసం బయటికి వెళ్లకుండా తమ సొంత పంట నుండి తీసుకుంటూ, అవసరమైన వారికి కూరగాయలు ఉచితంగా ఇస్తూ, ఇంటి నుండే పని చేస్తూ సంపూర్ణ లాక్ డౌన్ పాటించి కరోనా ను అదుపు చేయడం లో తమ వంతు పాత్ర నిర్వర్తించారు. ఈ విషయం తెలుసుసుకున్న సృజనా సుదీప్ ల సహోద్యుగులు,, బంధువులు కూడా స్ఫూర్తి పొంది టెర్రస్ గార్డెనింగ్ చేయడానికి తన సలహాలతో పాటు వర్షాకాలంలో పెంచుకునేందుకు అనువుగా విత్తనాలు కూడా అందజేసింది సృజన.