గోవిందు, గోపయ్య అనే స్నేహితులిద్దరూ ఒకే గురువువద్ద ఇంద్రజాలవిద్య అభ్యసించారు. ఆ విద్యలో పూర్తి మెలుకువలు తెలుసుకున్నాక ఇంద్రజాలమే తమ జీవనాధారం చేసుకొని ఇద్దరూ ఒకరికొకరు పోటీకాకుండా ఉండేందుకు వేర్వేరు ప్రాంతాల్లో తమ విద్య ప్రదర్శించడానికి బయలుదేరారు.
ఈ లోపున అయిదేళ్ళు గడిచాయి. ఈ అయిదేళ్ళలో ఎన్నో ఊళ్ళు తిరిగి తన ప్రదర్శనలిచ్చి శభాషనిపించుకున్నాడు గోవిందు. అయితే ఎన్ని ప్రదర్శనలిచ్చినప్పటికీ సంపాదన మాత్రం అంతంత మాత్రమే.
గోవిందుని ఎరిగినవాళ్ళు కొంతమంది అతన్ని పట్టణం వెళ్ళి ఇంద్రజాల విద్య ప్రదర్శించమన్నారు. కొంతమంది అతన్ని రామాపురం జమీందారుని కలసుకొని అతనికి ఇంద్రజాల విద్య ప్రదర్శించి ధనం సంపాదించుకోవచ్చని సలహా ఇచ్చారు. గోవిందుకి ఆ సలహా బాగా నచ్చింది, ఎందుకంటే ఆ జమీందారుకి వివిధ కళలంటే మంచి అభిరుచి ఉంది. కళాకారులను ఆదరిస్తాడని పేరు కూడా ఉంది.
అందుకే ఒక మంచి రోజు చూసుకొని రామాపురం బయలుదేరాడు గోవిందు. రామాపురం అతని ఊరినుండి చాలా దూరం ఉండటంవలన ప్రయాణానికి రెండు రోజులు పట్టింది. తీరా రామాపురం చేరుకున్నాక తెలిసినదేమిటంటే జమీందారు కొద్ది దూరంలో ఉన్న ఒక ఆశ్రమంలో ఉన్నస్వామీజిని దర్శించుకోవడానికి వెళ్ళాడని, ఇంకో రెండురోజులకిగాని తిరిగి రాడని తెలుసుకున్నాడు.
ఆ రెండురోజులు అక్కడ ఉండి ఏం చేయాలో తెలియక గోవిందు తనుకూడా ఆ స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళడానికి సిద్ధమై రామాపురం వాస్తవ్యులద్వారా అక్కడకి వెళ్ళడానికి దారి కనుక్కున్నాడు.
ఆ మరుసటి రోజు ఉదయమే ప్రయాణమై సాయకాలానికల్లా అక్కడకి చేరుకున్నాడు.
అక్కడ స్వామీజీ ఆశ్రమం వెలుపల బారులుతీరిన జనాల్ని చూసి ఆశ్చర్యపోయాడు. వాళ్ళందరూ స్వామీజీ దర్శనం చేసుకొని తమ కోరికలు వెల్లడించడానికి వచ్చినట్లు తెలుసుకున్నాడు. మరికొంతమందైతే వాళ్ళ కోరికలు తీరినందుకు, వ్యాధులు నయమైనందుకుగానూ తమ ముడుపులు చెల్లించుకోవడానికి వచ్చారు. అక్కడున్న ఒక భక్తుడ్ని స్వామీజీ గురించి అడిగాడు.
"గోకులానందస్వామి చాలా మహిమగలవారు. రకరకాల అద్భుతాలు చేయగలరు. స్వామీజీ శూన్యంలోంచి చందనం, కుంకుమ సృష్టించి భక్తులకిచ్చి ఆశీర్వదిస్తారు. మన ఆపదలు తొలగిస్తారు. స్వామి మంత్రించి ఇచ్చిన ప్రసాదం స్వీకరిస్తే ఎలాంటి వ్యాధి అయినా చిటికెలో నయం కావలసిందే! మన భూత భవిష్యవర్తమానాలు కూడా ఏ మాత్రం తేడా లేకుండా చెప్పగలరు. స్వామి దైవాంశ సంభూతుడు మరి!" అన్నాడు ఆ భక్తుడు.
ఆ మాటలు వినగానే, గోవిందుడికి కూడా స్వామీజీ దర్శనం చేసుకొని, ఆశీర్వాదం పొందాలని అనిపించింది. తన భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని కోరిక పుట్టింది. ధనం సంపాదించాలనే తన కోరిక నెరవేరిస్తే తగిన ముడుపులు చెల్లించాలని మనసులోనే అనుకున్నాడు. తను కూడా భక్తులు ఉండే వరసలో నిలబడ్డాడు. అయితే, స్వామిజీని దర్శించుకోవడానికి దగ్గరకెళ్ళిన గోవిందుకి అంతులేని ఆశ్చర్యమేసింది, ఎందుకంటే దైవాంశ సంభూతుడిగా అక్కడి ప్రజలద్వారా కొలవబడుతున్న గోకులానందస్వామి మరెవరో కాదు, తన మిత్రుడు గోపయ్యే. తనతో కలిసి ఒకే గురువువద్ద ఇంద్రజాల విద్యలు నేర్చుకున్న గోపయ్య ఈ అవతారం ఎప్పుడెత్తాడో అర్థం కాలేదు. అతను ప్రదర్శించిన మహిమలైతే తను కూడా ఇంద్రజాలవిద్యవల్ల ప్రదర్శించగలడు. అయితే, రోగులకెలా స్వస్థత చేకూరుస్తున్నాడో, అందరి భూత భవిష్యత్తులెలా చెప్పగలుగుతున్నాడో ఏ మాత్రం తెలియలేదు. సాధన చేసి మహత్తులేవైనా సాధించాడేమోనని మనసులో అనుకున్నాడు గోవిందు.
వరసలో తనవంతు వచ్చినా కూడా స్వామీజీని కలవకుండా భక్తులందరూ వెళ్ళిపోయేదాకా వేచిఉన్నాడు గోవిందు.
అందరూ వెళ్ళిపోయాక స్వామీజి అవతారమెత్తిన గోపయ్యను ఏకాంతంగా కలుసుకున్నాడు గోవిందు. హఠాత్తుగా చాలారోజుల తర్వాత అక్కడ తన స్నేహితుడు గోవిందుని చూసిన గోపయ్య చాలా ఆనందం చెందాడు.
"గోవిందూ! ఎలా ఉన్నావు నువ్వు?" అని స్నేహితుడ్ని పలకరించాడు.
"సరైన సంపాదనలేక రామాపురం జమీందారుని ఆశ్రయించాలని బయలుదేరాను. మరి నువ్వు ఎప్పుడు తపస్సు చేసావు? ఎలా మహిమలు సాధించి ప్రజల రోగాలు పోగొట్టడమేకాక, వాళ్ళ భవిష్యత్తు చెప్పగలుగుతున్నావు? నువ్వు ఈ ప్రజలచేత దైవంగా పూజలు, మన్ననలు ఎలా అందుకుంటున్నావు?" ప్రశ్నించాడు గోవిందు ఆశ్చర్యంగా.
అప్పుడు గోపయ్య తన కథ గోవిందుకి వివరంగా చెప్పాడు. మొదట గురువు వద్ద ఇంద్రజాలవిద్య అభ్యాసం పూర్తైన తర్వాత చాలా చోట్ల తన ప్రదర్శనలిచ్చాడు. చాలామంది పలుకుబడిగలవారి ముందు, జమీందారుల ముందు తన విద్య ప్రదర్శించినా భుక్తి గడవడం కూడా కష్టమైంది. ఇంద్రజాలవిద్య ధనసముపార్జనకి సహకరించని కారణాన గోపయ్య ఆ తర్వాత ఓ ప్రముఖ జ్యోతిష్యుడివద్ద కొన్నాళ్ళు జ్యోతిషశాస్త్రం అభ్యసించాడు. అయితే అందులోనూ గోపయ్యకి చుక్కెదురైంది. జ్యోతిషం చెప్పుకోవడానికి ఎవరూ పెద్దగా అతని వద్దకు రాలేదు. ఎవరిని ఆశ్రయించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. మళ్ళీ జరుగుబాటుకు ఇబ్బంది అవసాగింది. అందుకని ఆ తర్వాత కొన్నాళ్ళు మరో గురువు వద్ద కొన్నాళ్ళు వైద్యం అభ్యసించి వైద్యవృత్తి చేపట్టాడు. కొత్తలో కొన్నాళ్ళపాటు వైద్యవృత్తిలో బాగానే సంపాదించినా తనకు పోటిగా ముందునుండే ఆ వృత్తిలో లబ్ధప్రతిష్ఠులైన వైద్యులముందు నిలబడలేకపోయాడు.
వైద్యవృత్తిల్లోనూ రాణించలేక ఆ తర్వాత చాలా ఆలోచించిన మీదట ఈ గోకులానందస్వామి అవతారమెత్తాడు. తను అభ్యసించిన వైద్యశాస్త్రం ప్రకారం రోగులకు ఇవ్వవలసిన ఔషధాలు ప్రసాదరూపంలో ఇచ్చి వాళ్ళకు స్వస్థత చేకూరుస్తున్నాడు. అలాగే జ్యోతిషశాస్త్రం అభ్యసించడంవలన వచ్చినవారి భూత, భవిష్యత్తులు చెప్పగలుగుతున్నాడు. స్వామీజీగా ఇంద్రజాలవిద్యవల్ల ప్రజలని ఆకట్టుకొనే మహిమలు ప్రదర్శించగలుగుతున్నాడు. అందుకే ఇప్పుడు అందరికీ అతని మీద అంతులేని గురి. ఇంతకుముందు తను నేర్చుకున్న ఇంద్రజాలవిద్యవలన గానీ, వైద్యంవల్లగానీ, లేక జ్యోతిషంవల్లగానీ సాధించలేనిది ఇప్పుడు ఈ రూపంలో సాధించగలుగుతున్నాడు. ప్రస్తుతం అతని రాబడి చాలా బాగుంది. విడివిడిగా ఆ విద్యలు ఎవరైతే నిరాదరించారో ఇప్పుడు వాళ్ళే అతనిముందు మోకరిల్లుతున్నారు. జమీందారులు సైతం అతని దర్శనంకోసం గంటలతరబడి, రోజులతరబడి వేచి ఉంటున్నారు. ఇదీ గోకులానందస్వామి రహస్యం.
గోపయ్య చెప్పింది విని నిర్ఘాంతపోయాడు గోవిందు.'అవును! విడివిడిగా గోపయ్య నేర్చుకున్న విద్యలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. ఇప్పుడు అవే విద్యలు కొత్త అవతారమెత్తినందువల్ల అతనికి బాగా లాభించాయి.' అని అనుకున్నాడు గోవిందు.
ఆ తర్వాత గోపయ్య సలహా గ్రహించి గోవిందు కూడా ఇంకో ప్రాంతంలో 'గోవిందానందులస్వామీజి 'గా అవతారమెత్తాడు. అ తర్వాత గోవిందుకి కూడా ఎన్నడూ ఏ విషయంలో లోటు జరగలేదు.