అమ్మమ్మ తాతయ్యలతో కలిసి ఆ ఊరిలో ఉన్న రామాలయానికి వెళ్ళాడు చిన్ను. అప్పటికి అక్కడ ఒక తాపీ మెస్త్రి సగం కట్టి ఉన్న ప్రహరీ పైన అరబస్తా సిమెంట్ కి ఇరవై బస్తాల ఇసుక కలిపిన మోర్టార్ కలిగిన తాపీ వేసి తాపీగా పాముతున్నాడు. పంతులుగారు భక్తుల్లేక తన శఠగోపం తనకే పెట్టుకుంటున్నారు. నలుగురికి నీతులు చెప్పే పెద్దమనిషి ఒకడు చెప్పులేసుకుని గుడిప్రాంగణంలో తిరుగుతున్నాడు. దేవుడు దిక్కులేనివాడిలా పడిఉన్నా, దిక్కులు చూడకుండా నిక్కచ్చిగా ఉన్నాడు. "తాతయ్య, ఈ గుడిని ఐదు సంవత్సరాల క్రితం పునర్నిర్మించడానికి ఇరగ్గొట్టారు కదా! ప్రతి సంవత్సరం నేను ఇక్కడికి వచ్చి ఇలాగే చూస్తున్నాను, ఈ గుడి నిర్మాణం అలానే జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పటికీ అవ్వదా?" అని అన్నాడు చిన్ను. "ఏమో నాయనా! ఆ బాగవంతుడికే తెలియాలి!" అన్నాడు తాతయ్య.
తనకు తీర్థం ఇవ్వటానికి వచ్చిన పూజారిని కూడా అదే ప్రశ్న అడిగాడు చిన్ను. "ఏమో నాయనా! ఆ బాగవంతుడికే తెలియాలి!" అన్నారు పూజారిగారు కూడా. అప్పుడు దేవుడిముందు నిల్చుని విగ్రహాన్ని చూస్తూ అడిగాడు చిన్ను, "ఈ గుడి పనులు ఎప్పటికి అవుతాయి దేవుడా!" అని. "ఈ దేవుడ్ని కాదు నాయనా అదిగో అక్కడ ఉన్నాడే తెల్లపంచ కట్టుకుని నల్లచెర్మంతో మెరిసిపోతూ ఒక పెద్దమనిషి, ఆ దేవుడ్ని అడుగు!" అని చెప్పారు పూజారిగారు. చిన్ను అతనివైపు కాసేపు చూసాడు. అతడి చేతినిండా ఉంగరాలు, మెడలో దలసరి గొలుసు ఉన్నాయి. "గుడి సొమ్మేకదా!" అని మనసులో అనుకున్నాడు. ఈలోగా, "అయ్యా శఠగోపం పెట్టాలా?" అంటూ తాతయ్యను అడిగారు పంతులుగారు.
"ఎందుకు? అతను ఏళ్లతరబడి వీళ్ళందరికి పెడుతున్నారుకదా శఠగోపం!" అన్నాడు చిన్ను ముగ్గురినీ ఆశ్చర్యపరుస్తూ. ఇంటికి వెళ్ళాక, "ఏంట్రా చిన్ను అలా అనేసావ్?" అడిగింది అమ్మమ్మ. "పంతులుగారు వాడికి చెప్తే ఇంకేమైనా ఉందా! వాడసలే మనఊరికి పెద్దమనిషి!" "ఎడిచాడులే అమ్మమ్మ! ముందు అసలు ఆ గుడి సంగతేంటో తెలుసుకోవాలి తాతయ్య!" అన్నాడు చిన్ను తాతయ్య వైపు తిరిగి. "సరే తెలుసుకుందాం! ముందు ఈ కారప్పూస తిను. మీ అమ్మమ్మ గతవారం నీకోసమే చేసి డబ్బాలో ఉంచింది," అన్నాడు తాతయ్య ప్లేటు నిండుగా కారప్పూస వేసి అందిస్తూ. "అదేంటో తాతయ్య! అమ్మమ్మ వంట ఎంత తిన్నా నాకు తనివితీరదు! గుడి సొమ్ము ఎంత తిన్నా వాడికి తనివితీరదు!"
ఆ మాట వినగానే అమ్మమ్మ తాతయ్య ఒక్కసారి చిన్ను వైపు చూసారు. "తాతయ్య ఇవాళే వెళ్లి వాడికి గుడి లెక్కలు అడుగు?" అన్నాడు చిన్ను. "ఒరేయ్ నువ్వు మీ తాతని బుక్చేసేసేలా ఉన్నావ్!" అని చెప్పింది అమ్మమ్మ సగం నవ్వు నవ్వుతూ. "హహహ... ఊరికే అమ్మమ్మ! తాతయ్యకి తెలుసు ఆ గుడి భాగోతం ఏంటో! నాకు చెప్తానన్నారు." "నేనెప్పుడన్నానురా!" అంటూ ఆశ్చర్యంగా అడిగాడు తాతయ్య. "అదిగో దొరికిపోయావ్! 'నాకేంటి తెలుసురా!' అనకుండా 'నేనెప్పుడూ అన్నానురా!' అని నా మొదటి స్టేట్మెంట్ ని వదిలేసి రెండో స్టేట్మెంట్ కి 'లేదు' అని అన్నావంటే, మొదటి స్టేట్మెంట్ ని నువ్వు ఒప్పుకున్నట్టే కదా తాతయ్య!" "నువ్వు మీ అమ్మకంటే ముదురులా తయ్యారయ్యావు! అది కూడా ఇంతే! చిన్నప్పుడు ఎవరిదో పెన్షన్ సొమ్ము ఒక పెద్దమనిషి వారికి ఇవ్వకుండా తాను ఉంచేసుకుంటున్నాడని తెలిసి, వాడి ఇంటి ముందుకెళ్లి అరిచింది! ఇప్పుడు నువ్వు తయ్యారయ్యావు!" అని చెప్పింది అమ్మమ్మ. "అన్నీ తాతయ్య పొలికలే మావి!" అన్నాడు చిన్ను మళ్ళీ ప్లేటునిండా కారప్పూస వేసుకుంటూ. ఆ సాయంత్రం తాతయ్యతో కలిసి ఎప్పటిలాగానే తోటవైపు వెళ్ళాడు. "నువ్వనుకున్నది నిజమేరా చిన్ను! మన ఊరి గుడి సొమ్ముని వాడు, వాడితో పాటు ఇంకో ఏడుగురు పెద్దమనుషులమని చెప్పుకునే వారు కలిపి దోచుకుంటున్నారు.
నిజం చెప్పాలంటే ఆ గుడి పునర్నిర్మాణానికి పాతిక లక్షలకంటే ఎక్కువ అవ్వదు. అయితే మన ఒక్క ఊరిలోనే ఆ గుడికోసం జనం వద్ద కలెక్ట్ చేసిన సొమ్ము అక్షరాలా ముప్పైఐదు లక్షలు. కానీ గుడి పూర్తికాలేదు. ఇక బయటనుంచి వచ్చిన విరాళాలు కోకొల్లలు. మరి గుడి పని ఎందుకు పూర్తిచేయ్యట్లేదంటావా! అలా చేసేస్తే ఇంకా విరాళాలు ఎవరిస్తారు? అందుకే ఆ గుడి పని ఎప్పటికీ అలానే అవుతూ ఉంటుంది. వచ్చిన విరాళాలు అలానే వారి జేబుల్లోకి పోతుంటాయి. ఈ విషయం ఊరిలో ఉన్న అందరికీ తెలుసు. కానీ ఎవరూ అడగరు. ఎందుకంటే ఎవరికీ అంత ఖాళీలేదు," అన్నాడు తాతయ్య. "మనమున్నాం కదా తాతయ్య ఖాళీగా! ఏదో చేద్దాం!" అన్నాడు చిన్ను. మరోసారి చిన్నుకి ఆలోచనల్లో ఒక రాత్రంతా నిద్రలేకుండా అయ్యింది. 'ద అల్కెమిస్ట్' పుస్తకంలో పౌలో కోయిలో చెప్పినట్టు చిన్ను కోరిక మరీ దృడంగా ఉండటంవలనేమో ఆ అబ్బాయికి ప్రకృతి సాయం చేసినట్టుంది! లేక ఇంకేమి జరిగిందో కానీ మరుసటి రోజు ఆ గుడిసొమ్ముని గుటకేసిన పెద్దమనిషి గుండెపోటుతో చనిపోయాడు.
ప్పుడో వేకువజామున నిద్రపోయిన చిన్ను, తాను నిద్రలేవగానే అమ్మమ్మ నోటివెంట విన్న మొదటి కబురు అదే. వెంటనే లేచి అమ్మమ్మ వద్దంటున్నా వినకుండా తాతయ్యతో కలిసి శవం దగ్గరకు వెళ్ళాడు చిన్ను. అదే సమయంలో, "అమ్మా! ఎంతపనయ్యింది?" అంటూ ఏడుస్తూ వచ్చారు మిగతా ఏడుగురు పెద్దమనుషులు ఆ శవం దగ్గరికి. అందులో ఒకడు శవం వద్ద రోధిస్తున్న చనిపోయినవాడి భార్యను పక్కకు పిలిచాడు. అది చూసిన చిన్ను నెమ్మదిగా ఒక గోడపక్కకు చేరి వినడానికి ప్రయత్నిస్తున్నాడు. "గుడి సొమ్ము ఇరవై లక్షలు, మీ ఆయన ఎక్కడ పెట్టారో తెలుసా?" అని అడిగాడు ఆ పెద్దమనిషి. "తెలీదండి! ఆయన ఆ గుడికి సంభందించిన ఏ విషయం కూడా మాకు చెప్పరు!" అని ఏడుపుని కొనసాగిస్తూ శవం దగ్గరకు వెళ్ళింది.
ఇంతలో మిగతా ఆరుగురు పెద్దమనుషులు వాడిదగ్గరకు వచ్చి, "ఎక్కడున్నాయంట?" "ఎక్కడ దాచాడంట?" అని అడిగారు. ఆమె ఏమీ చెప్పలేదనేసరికి అందరూ బాగా అప్సెట్ అయ్యారు. "ఛా! అది ఈ సంవత్సరంలో వచ్చిన విరాళాల మొత్తం. అనవసరంగా లేట్ చేసాం! ముందే వాటాలు వేసుకుని పంచుకోవలసింది!" అన్నాడు ఒకడు. "సరిలే! అయిపోయిన విషయం ఎందుకు? వాడు ఇంట్లోనే ఎక్కడో దాచుంటాడు! మనం వెతుకుదాం!" అన్నాడు వేరొకడు. "కచ్చితంగా ఇంట్లో దాయడు. అలాగని బ్యాంకులో వెయ్యడన్న విషయం మనకెలాగో తెలుసు. ఇక మిగిలింది వాడి పొలం వద్దున్న బోరు షెడ్! నాకు తెలిసి అక్కడే డబ్బులు దాచుంటాడు. గత సంవత్సరం కూడా అక్కడే దాచాడు. పదండి వెతుకుదాం!" అన్నాడు మూడోవాడు. అందరూ కలిసి నెమ్మదిగా ఆ చోటు నుంచి జారుకుని చనిపోయిన పెద్దమనిషిగల పొలాలవైపు వెళ్తున్నారు.
ఈ విషయాన్నంతా చిన్ను అక్కడకు వచ్చిన జనానికి చెప్పాడు. కానీ ఎవరూ అతడిని పట్టించుకోలేదు. ఆఖరుకు పొదల వెనుక దాక్కుంటూ, ఆ పెద్దమనుషులని అనుసరిస్తూ వెళ్ళాడు. "ఒకవేళ ఆ షెడ్లో డబ్బులు ఉంటే పరిస్థితేంటి?" అని కంగారుపడ్డాడు. ఆ ఏడుగురు పెద్దమనుషులు ఆ షెడ్ దగ్గరకు చేరుకుని చుట్టూ చూసారు. చిన్ను కొంచం దూరంలో ఒక పొదవెనుక దాక్కుని వారివైపు ఆతృతగా చూస్తున్నాడు. ఆ చిన్న షెడ్ కి ఒకటే తలుపు ఉంది. దానికి తాళం వేసి ఉండటంతో, వారిలో ఒకడు ఒక రాయి తీసుకుని తాళాన్ని బద్దలుకొట్టి తలుపును తీసాడు. ఇంతలో షెడ్ లోపల ఉన్న అరడజను పాముల్లో ఒక పెద్ద పాము అతడిని కాటేసింది. మిగతా పాములన్నీ ఒకేసారి బయటకు వచ్చేసరికి భయపడి మిగతా ఆరుగురు అతడిని విడిచిపెట్టి ఊరివైపు పరుగులు తీశారు. చిన్ను ఆ పొదల వెనుక కాసేపు దాక్కుని వాళ్లంతా వెళ్ళిపోయాక ఆ షెడ్ దగ్గరకు వెళ్లి చూసేసరికి ఆ పెద్దమనిషి అరుస్తూ అక్కడ పడి ఉన్నాడు. చిన్ను అతడి కాలిని ఒక తాడుతో గట్టిగా కట్టి చెయ్యపట్టుకుని త్వరగా ఊరిలోనికి తీసుకొచ్చాడు. అతడిని వెంటనే నాటు వైద్యం చేసి విషాన్ని తీసి ఆ ఊరి నాటువైద్యుడు మెహార్వాన్ ఆ పెద్దమనిషి ప్రాణాన్ని కాపాడాడు. ఆ పెద్దమనిషి చిన్నుకి ధన్యవాదాలు తెలియజేసి, ఊరి జనాలకు గుడి విషయంలో వారు చేసిన మోసమంత చెప్పేసాడు. ఆ షెడ్లో ఒక మూల గొయ్యిలో దాచిపెట్టిన ఇరవై లక్షలు తీసి, గుడిని త్వరగా పూర్తి చేశారు. అంతే కాకుండా మోసం చేసిన పెద్దమనుషులందరి దగ్గరా చెరో ఐదు లక్షలు వసూలు చేసి ఊరికి మంచి గ్రేవ్యార్డుని కట్టించారు.
ఎక్కడ బడితే అక్కడ శవాలను కాల్చడం చూసిన చిన్నునే ఆ సలహా కూడా ఇచ్చాడు. చిన్నవయసుగల చిన్ను మైండ్ మెర్చుర్టీ లెవెల్స్ చూసి ఊరి జనమంతా అతడిని మెచ్చుకున్నారు. అంతే! చిన్ను నిద్రలో నవ్వుకుంటున్నాడు. అమ్మమ్మ దేవుడి గదిలో కొడుతున్న గంటశబ్దం వినిపించి తులుక్కుపడి లేచాడు. చుట్టూ చూసాడు. ఎవరూ లేరు. అదంతా కలని అర్ధమైంది. బాగా అప్సెట్ అయ్యాడు. కానీ ఇంతలో అమ్మమ్మ వచ్చి, "అరేయ్ చిన్ను! నువ్వు వాడి గురించి ఏమి కోరుకున్నావోగాని, ఆ గుడి సొమ్ము తిన్న ఆ నల్ల పెద్దమనిషి గుండెపోటు వచ్చి అరగంట క్రితం చనిపోయాడంట! పాపం!" అని చెప్పింది. చిన్నుకి మబ్బు విడిపోయింది.