నాకు పిచ్చెక్కుతున్నది. పాతిక సంవత్సరాల సర్వీసులో ఇంత కష్టమైన సీటు ఎప్పుడూ చేయలేదు. అసలే ఆంగ్లంలో ప్రావీణ్యం అంతంత మాత్రంగానే ఉన్నది. ఇప్పటిదాకా దాని అవసరం గాని, పట్టు సాధించాలనే ఆలోచన గాని రాలేదు. ప్రమోషన్ రాగానే అందరూ అభినందించారు. ఇది సామాన్య విషయం కాదన్నారు. ఈ సీటు కేటాయించారనగానే అందరిలో ఏదో తెలియని ఆశ్చర్యం. అది చాలా ప్రత్యేకమైన సీటని, అతికొద్ది మందికి దొరికే అదృష్టమని చెప్పారు. నిజమేనేమోనని పొంగిపోయాను. నా ట్రాక్ చూసి ఇచ్చిన సీటుగా తెగ సంబరపడిపోయాను. తీరా కూర్చున్న తరువాత తెలిసింది. ఇది అందరూ చెయ్యలేని సీటని, దీనికి చాలా నాలెడ్జి కావాలని.
ఇప్పటి దాకా నా కింద పనిచేసే వారు ప్రపోజల్ తెచ్చిపెడితే, దానిలో తప్పులు సరిచేసి పంపేవాడినే కాని, ఏనాడూ స్వంతగా ప్రపోజల్ చెయ్యలేదు. దాని ఫలితమే ఈ రోజు నా అవస్థకు కారణం. అన్నిటికంటే నాకు ఇబ్బందనిపించేది, నేను నేరుగా రిజర్వుబ్యాంకుకు రిపోర్టు చేయవలసి రావడం. మన బట్లర్ ఇంగ్షీషు వారు చూసి ఎక్కడ పై అధికారులకు ఫోను చేసి నన్ను చెడామడా దులిపేస్తారో నని, నా ఉద్యోగం ఊడిపోతుందోనని. ఒకపక్క ఉద్యోగం పరిస్థితి ఇలా వుంటే మరోపక్క లాక్ డౌన్ వల్ల మా ఆవిడ, పిల్ల, మా వదిన గారి ఇంటికి వెళ్ళి బెంగుళూరులో ఇరుక్కుపోయారు. ఇక్కడ బ్యాంకు కాంటిను మూసివేశారు. చెయ్యి కాల్చుకోక తప్పడం లేదు. ఛ. నా జాతకం బాగలేకనే ఈ ప్రమోషన్ తీసుకున్నాను. ఎటుచూసినా ఈతిబాధలే తప్ప ఉపశమనం కలిగించే దారి కనబడడం లేదు. రోజు రోజుకు పరిస్థితి క్షీణిస్తున్నది. ఛార్జి తీసుకుని పదిహేను రోజులైనా ఒక్క ఫైలు కూడ కదపలేకపోయాను. మా జనరల్ మేనేజర్ తెలుగువాడే, అయితే ఏం లాభం. ఎంత బ్రతిమలాడినా సీటు మార్చడం లేదు. పాపం ఆయన మాత్రం ఏంచెయ్యగలడు. నా సీటు మార్చగలిగేది మా డైరక్టరు మాత్రమే. నా పోడు పడలేక నన్ను నేరుగా డైరక్టరు దగ్గరకు తీసుకువెళ్ళాడు. కానీ ఫలితం శూన్యం. నాకిచ్చిన బదిలీనే చివరిదట. తరువాత కరోన వలన ఈ సంవత్సరం మొత్తం బదిలీలు ఆపారట. కాబట్టి సీటు మారడం కష్టమట. ఆ ముచ్చటా తీరిపోయింది. తినబుద్ది కావడం లేదు, నిద్రపట్టడం లేదు.
'అంభంలో కుంభం ఆరిగకూట్లో గోంగూర' అన్నట్లు ఈ నెలాఖరుకు మా జనరల్ మేనేజర్ సిద్దారెడ్డి గారు పదవీ విరమణ చేస్తున్నాడు. అతని స్థానంలో వచ్చే ఆఫీసరు ఇన్ ఛార్జి ఛండశాసనుడట. బదిలీలు లేవు గనుక ఇతనికి అదనపు ఛార్జి ఇచ్చారట. అతని గురించి మా ఆఫీసులో వాళ్ళు చెప్పుకుంటుంటే దడ పుడుతున్నది నాకు. కానీ ఏం చేసేది తప్పదు. రోకట్లో తలపెట్టి రోకటి పోటుకు భయపడితే ఎలా'
పరిపరివిధాల ఆలోచిస్తున్న నేను ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు.
******
" దశరథ్ గారు, నేను ఈ రోజే రిటైరయి వెళ్ళిపోతున్నాను. మీ గురించి కొత్త జనరల్ మేనేజర్ గారికి చెప్పాను. వీలున్నంత వరకు సీటు మారుస్తారు. మీ భయం గురించి కూడ చెప్పాను. ఫీల్ అవకండి" చెప్పాడు సిద్దారెడ్డి గారు.
"మంచిపని చేశారు. ఫీలవడమెందకు సర్. ఈ సీటు నా వల్ల కాదు. శుభాభినందనలు సర్. ఈ చెరనుండి బయటపడుతున్నారు" అని విషెస్ చెప్పాను.
" ఆల్ ది బెస్ట్" అని చెప్పి వెళ్ళిపోయారాయన.
సాయంత్రం ఫంక్షన్లో అందరినీ కొత్త సార్ కు పరిచయం చేశారు సిద్దారెడ్డి గారు.
ఆయన పేరు రామస్వామి మొదలియార్. తమిళియన్. పచ్చటి పసిమి, కొంచెం పొట్టిగా చాలా హుషారుగా ఉన్నాడు. అందరినీ నవ్వుతూ పలకరించాడు. వయసులో నా కంటే చిన్నవాడే. బాగా షార్పేమో అంత త్వరగా జనరల్ మేనేజర్ అయారనుకున్నాను. ఆయనెలా వుంటేనేం నాకు ఇక్కడి నుంచి మోక్షం కలిగిస్తే చాలనుకున్నాను.
*****
వారం రోజులు బదిలీ కోసం ఎదురు చూడడమే సరిపోయింది నాకు. నెలరోజుల క్రితం తీసుకున్న కూకట్ పల్లి ఫైలును కిందా మీద పడి ఏదో రకంగా నా అభిప్రాయాన్ని తయారుచేసి జనరల్ మేనేజర్ టేబుల్ మీదకు పంపాను.
ఎప్పుడో పిలుపు వస్తుంది నాకు. చెడామడా తిట్లు కూడ పడతాయి. ఏం చేద్దాం ఖర్మ. ఇదీ ఒకందుకు మంచిదేలే. మన తెలివితేటలు బయటపడి, ఆయనకు ఆయనే నన్ను బయటకు తోలేస్తాడు అనుకున్నాను.
అనుకున్నంతా అయింది. పిలుపు రానే వచ్చింది.
గుండె దిటవు చేసుకుని ఛాంబర్ లోకి అడుగుపెట్టాను.
" మే ఐ కమిన్ సర్"
" ఓ దశరథ్. కమిన్ " నవ్వుతూ ఆహ్వానించాడు
" టేక్ యువర్ సీట్ " అని కుర్చీ చూపించాడు
వెళ్ళి కూర్చున్నాను.
" ఇప్పుడే మీరు పంపిన ఫైల్ చూశాను. ఎందుకో మీరు ఆ కేసును పూర్తిగా స్టడీ చెయ్యలేదనిపించింది. అదీగాక ప్రజంటేషన్ లో కూడ క్లారిటీ లోపించింది. ఎనీ ప్రాబ్లమ్" తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతున్నాడు.
" అదీ...అదీ.."
" సీ దశరథ్. మీ సమస్య ఏమిటో చెబితే పరిష్కారం చెబుతాను. కానీ నిర్లక్ష్యంగా పనిచేస్తే మాత్రం సహించను. మీకు భాష రాకపోయినా నేను సరిదిద్దగలను. కానీ ధ్యాసపెట్టకుండా పనిచేస్తే మాత్రం, మీకు నా గురించి వచ్చిన ఫీడ్ బ్యాక్ నిజమవుతుంది"
" సర్. నేను ఈ సీటు వర్క్ ఎక్కడా ఎప్పుడూ చేయలేదు. అదీగాక నాకు ఆంగ్లభాష మీద అంత పట్టులేదు. నిజం చెప్పాలంటే బ్రాంచి నుంచి వచ్చిన ఫైల్ చదవడమే నావల్ల కావడం లేదు. అందుకే సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. ఫ్రాడ్ కేసులలో అకౌంటబిలిటీ నిర్ణయించడం నాకు అలవిమాలిన పని అవుతున్నది సర్. ఈ సీటు చెయ్యడం నా వల్ల కాదు సర్. వేరే సీటుకు అలాట్ చెయ్యండి" ఏడ్చినంత పని చేశాను.
" కూల్ మిస్టర్ దశరథ్. నేను తమిళియన్ ను, తెలుసు కదా. నేనిప్పుడు తెలుగు మీ అంత బాగా మాట్లాడగలుగుతున్నాను. నేను వ్రాయగలను కూడ. నేను ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఆరు సంవత్సరాలయింది. మీ కాడర్ లోనే వచ్చాను. నన్ను రూరల్ బ్రాంచిలకు హెడ్ గా వేశారు. ఒక ఆరు నెలలు చాలా కష్టపడ్డాను. నాకు తెలుగు రాదు. పల్లెలలో ఉండే కస్టమర్ లకు తెలుగు తప్ప వేరే భాష రాదు. చాలా వరకు బ్రాంచి మేనేజర్లు తర్జుమా చేసి చెప్పేవారు. నాకే అవమానమేసింది. పట్టుదలగా నేర్చుకున్నాను, కొంత పుస్తకాల ద్వారా, మరికొంత ఆన్ లైన్ క్లాసుల ద్వారా. ఇప్పుడు మీరే చూస్తున్నారుగా. బేస్ తెలియని నాకే, కష్టమైన తెలుగు వస్తే, చిన్నతనం నుంచి మీరు ఒక భాషగా చదువుకున్న ఆంగ్లం మీద మీకు పట్టు సాధించడానికి ఎంత సమయం కావాలి? ముందు మీరు భయాన్ని వదిలిపెట్టండి" కృష్ణ భగవానుడు గీతోపదేశం చేసిన రీతిలో సాగుతున్నది సార్ ఉపన్యాసం. కొద్దిసేపు ఆగి నా వైపు చూశాడు. నా ముఖంలో ఎటువంటి ఫీలింగ్స్ కనిపించలేదేమో ఆయనకు.
" నా గురించి ఎక్కువగా చెప్పుకుంటున్నానని అనుకుంటున్నారా.. లేక..బోరు కొట్టిస్తున్నానా" నా వైపు చూసి అడిగారు.
ఉలిక్కిపడ్డాను.
" అదేమీ లేదు సర్. జాగ్రత్తగా వింటున్నాను. అంతే" కాస్త తడబడ్డాను.
" మీరెలా అనుకున్నా చెప్పడం నా విధి. నేను మీ టీమ్ లీడరు కనుక అది నాకు అవసరం. ఈ సమయంలో మీకొక మాట చెప్పాలి. నేను అంత పట్టుదలగా తెలుగు నేర్చుకోవడానికి కారణం, ఒక చిన్న బ్రాంచి బ్రాంచి మేనేజర్. ఆయన వయసు అప్పటికే యాభై ఎనిమిది ఉండవచ్చు. నేను తెలుగులో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ, ఒక దశలో మానేద్దామనుకున్నాను. వాళ్ళ బ్రాంచి విజిట్ కు వెళ్ళినపుడు, అతని పనితనం చూసి ఆశ్చర్యమేసింది. అతని దగ్గర వున్న సిబ్బంది మొత్తం నలుగురు. అతనికి ఆ నలుగురు నాలుగు స్తంభాలై నిలిచి బ్రాంచికి హై రేటింగ్ వచ్చేలా చేశారు. దానికి కారణం అతని దీక్ష, అతను వాళ్ళకిచ్చే ఎంకరేజిమెంట్. అతనితో మాట్లాడుతూ తెలుగు నా వల్ల కావడం లేదు మానేద్దామనుకుంటున్నానన్నాను. దానికి ఆయన "అవకాశం వచ్చినపుడు దేన్నయినా వినియోగించుకోవాలి. కష్టమని వదిలివేయకూడదు. వేమన గారు చెప్పినట్లు ' సాధనమున పనులు సమకూరు ధరలోన', అందుకని వదిలి పెట్టకండి. ఇంకొంచెం కష్టపడండి. కొంతకాలానికి ఆ విద్య మీ వశమై, మీకు ఎంతో ఉపయోగపడుతుంది " అన్నాడు.
ఆయన మాటను వేదంగా తీసుకుని శ్రమపడ్డాను. ఈ రోజు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాను. ఇది నా అనుభవం. నా మనసులో భావం అర్థమయిందనుకుంటాను" ఆపి నా ముఖంలోకి చూశాడు.
నాకు అర్థమయిపోయింది. ఇతడు నన్ను ఈ సీటులోనే కూర్చోబెట్టి నా చేత కుక్క చాకిరీ చేయించేటట్టున్నాడు. పైగా పెద్ద ఉపోద్ఘాతం కూడ ఇచ్చాడు. ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్నాను.
" సో దశరథ్ ముందు మీ సీటు పనిని అవగాహన చేసుకోను ప్రయత్నించండి. పాత ఫైల్స్ అన్నీ తీసి చదువండి. ఏ కేసును ఎలా డీల్ చేశారో అర్థమవుతుంది. మన బ్యాంకులలో అసాధ్యమైన పని అంటూ ఏదీ ఉండదు. కాకపోతే మొదట్లో కొంచెం కష్టపడాలి. అంతే. ఇప్పటికీ అంత రిస్క్ నాకెందుకు అనుకుంటే, డైరెక్టరు గారికి చెప్పి సీటు మార్పిస్తాను. కాకపోతే అది మీ కెరీర్ లో ఒక మచ్చగా మిగిలిపోతుంది. అవసరమంటారా?" ఇగో మీద దెబ్బకొట్టాడు.
ఉడుక్కున్నాను. పాతికేళ్ళుగా మచ్చలేని నాకు మచ్చపడుతుందా. నా అహం దెబ్బతిన్నది. పౌరుషం పొడుచుకొచ్చింది.
" వద్దు సర్. కష్టపడతాను. నేర్చుకుంటాను" సీరియస్ గా అన్నాను.
" డోంట్ బి ఎమోషనల్. బి కూల్. ముందుగా మీ డిక్షనరీలో నుంచి ఇంపాజిబిల్ అన్న పదం తీసేయండి. ఏకాగ్రతో పనిచయండి. పొరపాట్లు సరిదిద్దడానికి ఎలాగు నేనున్నాను. నా టీమ్ లో వ్యక్తులకు బలహీనత ఉండకూడదు. మహాత్మాగాంధీ గారు చెప్పినట్లు "సాధ్యమనుకుంటే ప్రతి పని సులువుగా నెరవేరుతుంది". ఆ బాటలో నడువండి. నా సపోర్టు మీకెప్పుడూ ఉంటుంది" గీత చివరి వాక్యం చెప్పి నన్ను యుద్ధానికి సిద్ధం చేసినట్లనిపించింది.
ఫైల్ చేతిలోకి తీసుకున్నాను.
" నేను సీటు మారను సర్. ఎందుకు చేయలేనో చూస్తాను. వెళ్ళేముందు ఒక్కమాట సర్. నా బ్యాంకు
అనుభవంలో మొదటిసారిగా ఒక నిజమైన నాయకుడిని చూశాను. మీ లీడర్ షిప్ లో పిల్లికూడ పులి అవుతుంది సర్. అందరూ మీగురించి చెప్పి భయపెట్టారు. పనిచెయ్యమని ప్రోత్సహించే మీ అంకితభావానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను సర్. ఇప్పుడు నాలో మొండి ధైర్యం ప్రవేశించింది. నన్ను నేను మలుచుకుంటాను. ఇక భవిష్యత్తులో కూడ నా వల్ల కాదు అన్న మాట నా నోటినుంచి రానివ్వను సర్. థాంక్యూ సర్" అని నమస్కరించి ఫైల్ చేతిలోకి తీసుకున్నాను.
" గుడ్ దశరథ్. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యు. కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్" అని నన్ను అభినందించారు రామస్వామి గారు.
వెనుతిరిగాను. పని చెయ్యలేను అంటే గేలి చేసేవారే గాని, ప్రోత్సహించేవారే లేని ఈ రోజులలో ఇలాంటి నాయకుడు దొరకడం నా అదృష్టం. నాలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. గీతోపదేశం నా మీద బాగా పనిచేసింది. అన్ని ఆలోచనలు మాని చదువుదామని బీరువాలోనుంచి పాత ఫైలొకటి తీసి చదవడానికి ఉపక్రమించాను.