అదృష్టం జీవితంలో ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది. అప్పుడే వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకోకుండా ఉపయోగించుకోవాలి, ఇది మన పెద్దలు చెప్పిన నానుడి. వయసు, డబ్బు, మతం, చదువు తారతమ్యం లేకుండా ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. సాగర్ విషయంలో కూడా ఇదే నిజం అయింది. కానీ వచ్చిన అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్న సాగర్ జీవితం అందరికి ఒక గుణపాఠం లా నిలిచింది అనే చెప్పాలి అన్న తలంపులో ఉండగానే సార్ పోస్ట్ అనే అరుపు తో కృష్ణ మనదయినా ప్రపంచం లోకి వచ్చి పోస్ట్ ను తన చేతులతో అందుకున్నాడు.
పోస్ట్ అందుకోగానే కృష్ణ లో ఒక్కసారిగా ఏవో ఆలోచనలు. సెల్ల్ఫోన్ లు, ఈమెయిల్, ఫేస్బుక్ లు వేగంగా పనిచేస్తున్న ఈరోజుల్లో తనకు ఉత్తరం వెంటనే అప్రయత్నంగానే తన నోటి నుండి సాగర్ పేరు. ఆతృతగా ఉత్తరాన్ని తెరచి చూసాడు. కళ్ళలో నిండిన నీటి పొర తన ఆత్రుతకు భంగం కలిగిస్తూ తనలో తడబాటును పెంచింది. కంటిలోని నీటి పొరను నెమ్మదిగా తొలగించుకుంటూ ఉత్తరం చదవడం ప్రారంభించాడు. ఉత్తరం లోని ప్రతి అక్షరాన్ని తీక్షణం గా చూస్తూ, చదువుతూ తన నలభై ఏళ్ళ జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకోవడం ప్రారంబించాడు.
ఈ నలభై ఏళ్లలో తన జీవితం లో ప్రతి సంఘటనకు కర్త, కర్మ, క్రియ గా మెలిగిన సాగర్ ను తను ఏనాడూ మరచిపోలేదు. దిగువ మధ్యతరగతిలో పుట్టిన తనకు డబ్బు కంటే చదువే ముఖ్యమని చెప్పి తన డబ్బు తో నన్ను చదివించిన సాగర్, అదే డబ్బు ఉండి కూడా చదువును కొనసాగించలేకపోవడం ఎంతో భాధాకరమయిన విషయం. దానికి ఎన్నో కారణాలు. తన ఇంటి వాతావరణం, తల్లిదండ్రుల ప్రవర్తన సాగర్ ను చదువు మీదకు దృష్టి మరల్చలేక పోయాయి, కానీ అవసరమయిన ఏ సందర్భం లోను నా చెయ్యి వదలకుండా నాతోనే నడుస్తూ నా అభివృద్ధి కి పునాది వేశాడు. డబ్బుంటేనే సరిపోతుందా, దానం చేసే గుణం ఉండాలి, అది సాగర్ లో పుష్కలం గా ఉంది. అడిగిన వాళ్లకు లేదు అనకుండా దానం చేసుకుంటూపోయి జీవితంలో తనకంటూ ఏమీలేని ఒంటరిగా మిగిలాడు. చివరకు తన వెంటే నడుస్తానని వచ్చిన అమ్మాయిని కూడా బాధపెట్టడం ఇష్టం లేక దూరం గా వెళ్ళుపోయాడు. డబ్బు ఉండి కూడా తనకంటూ ఇది నాది అని మిగుల్చుకోలేకపోయిన సాగర్ జీవితం జీవితంలో చదువు మాత్రమే కాదు, డబ్బు, హోదా కూడా అవసరమనే గుణపాఠాన్ని మనకు నేర్పిస్తాయి. చివరకు నా అన్నవాళ్ళు కూడా డబ్బు ఉంటేనే మనవాళ్ళు అన్న సత్యం సాగర్ విషయంలో రుజువయింది.
ఈ నలభై ఏళ్ళ జీవితంలో తన డబ్బు తో చదువుకుని, ఇప్పుడు సమాజంలో ఒక హోదాలో ఉన్న నేను తనకు ఎవరు ఉన్న లేకున్నా నేనున్నాను అన్న భరోసా ఇవ్వాలనుకున్న నాకు అనుకోని పరిస్థితులలో దూరమయిన సాగర్ మరల ఇప్పుడు ఈ ఉత్తరం రూపంలో అనుకుంటూ నా ఆలోచనల నుంచి బయటకు వచ్చి మరలా ఉత్తరం చదవడం ప్రారంభించాను. సాగర్ ఉత్తరం లో రాసిన మొదటి మాట ఈ ఉత్తరం చదువుతున్నంత సేపు నీలో కలిగే ఆలోచనలు, సందేహాలు నాకు తెలుసు. కానీ నేను ఈ ఉత్తరం రాయడానికి ముఖ్యమయిన కారణం నేను ఎక్కడ ఉన్నా క్షేమంగానే ఉన్నాను అని చెప్పడం ఒకటయితే, మరొకటి జీవితంలో చదువు విలువ ఏంటో చెప్పిన నేను ఈ నలభై ఏళ్ళ వయసులో నా చదువును తిరిగి ప్రారంభిస్తున్నాను. ఇప్పటికయినా నా కోసం నేను జీవించాలి అనుకుంటున్నాను అన్న సంతషకరమయిన వార్త నీకు చెప్పాలి అని., ఎందుకంటే ఇది విని సంతోషపడే మొదటి వ్యక్తివి నువ్వు మాత్రమే అని నాకు తెలుసు.
ఉత్తరం చదవడం పూర్తయిన నాలో చెప్పలేని ఆనందం, అభినందిస్తూ తిరిగి సాగర్ కు ఉత్తరం రాయాలి అనుకుని వెతుకుతుండగా చివరలో సాగర్ రాసిన మరో వాక్యం నన్ను ఎంతగానో ఆవేదనకు గురిచేసిన ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాను. నా అడ్రస్ కోసం వెతకద్దు, నేను ఎక్కడ ఉన్నానో చెప్పే సమయం ఇంకారాలేదు. ఆలా చెప్పే సమయానికి నేనే నీ ముందు ఉంటాను. ఇంత చదివిన తరువాత నీ అడ్రస్ నాకు ఎలా తెలిసింది అనుకోకు, నిన్ను కలిసిన మరుక్షణం అది కూడా తెలుస్తుంది. ఎప్పటికయినా కృష్ణ కావల్సింది సాగర్ లోనే కదా !మన కలయిక జరిగి తీరుతుంది. ఇట్లు, నీ సాగర్. ఉత్తరం చదివిన నాలో ఆశ్చర్యంతో కూడిన ఎన్నో అనుభూతులు. నా నలభై ఏళ్ళ జీవితం ఒక్కసారిగా నా ముందు కదిలినట్టయింది.
ఇక సాగర్ కోసం వేచి చూస్తూ, సాగర్ నన్ను కలవాలని మీ ఆశీస్సులతో. కృష్ణ.