ముంబాయి రైలు స్టేషన్ లో కూర్చున్న సాయి కుమార్ కు కునుకు పట్టింది. వ్యాపారం పని మీద వరం కిందట హైదరాబాద్ నుంచి ముంబాయికి వచ్చాడు. ఆ రోజునుంచి తుఫాను. వచ్చిన పని జరగలేదు. ఇంటి ముఖం పట్టాడు. రైలు ఆరు గంటలు ఆలస్యం. ఎప్పుడు వస్తుందో అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. రైలు పట్టాలు మునిగి రెండు రోజులు. చాలా రైళ్లు రద్దయ్యాయి.
కునుకు తీస్తున్న సాయి పొరపాటున తననే కన్ను ఆర్పకుండా చూస్తున్న మహిళను చూశాడు. ఆమె అమలలాగే ఉంది. ఉలిక్కిపడ్డాడు. ఆమె అమలనే. కొంచెం లావెక్కింది. ఆమె చంకలో పాప. పరాయి మగాడిని అలా చూడడం తప్పు అన్నట్లు ఆమె వెంటనే చూపు తిప్పుకుంది. పైటను నిండుగా కప్పుకుంది.
సాయి మాత్రం ఆమెనే చూస్తున్నాడు. ఆమె సంసారం పక్షంగా, నిండు ముతైదువలా చూడ ముచ్చటగా ఉంది. వయసు 30. మంచి అందెగత్తె. మనిషి నిండుగా, ఎత్తు, బలంగా ఉంటుంది. ఆమె రోడ్డు మీద నడుస్తుంటే ఆమెను ఓరకంట చూడమని మగాడు లేదు.
మరిచిపోయిన గతం అతని కాళ్లను కప్పేసింది. అతనిని కాలం ఐదేళ్లు వెనక్కి గొరగొర లాక్కెళ్లియింది.
000
అమల షేవింగ్ బ్లేడ్ పట్టుకుని రాగానే సాయి భయంతో బాత్రూం తలుపు వేసుకోబోతు ''వద్దు. నువ్వు షేవింగ్ చేస్తే తెగుతుంది. వద్దు'' అరిచాడు.
ఆమె గారాలుపోతూ ''నీటుగా ఉండాలని నీకు చాలా సార్లు చెప్పను. నేను షేవింగ్ చేస్తాను. గమ్మున నిలుచోండి'' ప్రేమతో ఆదేశించింది.
అతను చీదరించుకుంటూ ''మగాడికి షేవింగ్ చేయడానికి సిగ్గులేదు?" కసిరాడు.
''నా మొగుడికి నేను షేవింగ్ చేస్తే తప్పేమిటి? ఐనా నా ముందు నీకు సిగ్గేమిటండి?'' మొట్టికాయలు వేసి, ఆ తరువాత బాత్రూం తలుపు వేసింది. అతనికి బ్రష్ తో సబ్బు నురగ పూసి షేవింగ్ చేయడం మొదలు పెట్టింది. తరువాత షవర్ ఆన్ చేసి ఆమె తడిసి. అతనిని తడిపి పులకించింది. వారంలో రెండుసారు తడుస్తూ సుఖపడడం ఆమెకు చాలా ఇష్టం.
వర్షంలో తడిసినప్పుడు ఆమెకు విపరీతమైన మూడ్ వస్తుంది. ఆమె సిగ్గు పడకుండా ఆ విషయం చెప్పింది.
ఆడాళ్ళు హీరోయిన్లా ఎక్సపోసింగ్ చేయడం సాయికి చాలా ఇష్టం. అందుకే అమలకు ఎక్సపోసింగ్ డ్రెస్సులు తెచ్చి ఇస్తాడు. ఆమె వాటిని వేసుకుని పడక గదిలో హీరోయిన్లా సెప్పులు వేస్తుంది. నా మొగుడి ముందు నాకేంటి సిగ్గని డాన్స్ కూడా నేర్చుకుంది. 'పోకిరి' సినిమాలో మోమాద్ ఖాన్ డాన్స్ చేసిన 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే' పాట మీద రెచ్చిపోతుంది. ఆ రోజు అతను మహేష్ బాబులా రెచ్చిపోతాడు.
వాళ్ళ ఐదేళ్ల దాంపత్యంలో ఎలాంటి దాపరికాలు లేవు. అది పెద్దలు చేసిన పెళ్లే. కానీ గొప్ప ప్రేమికుల్లా పాలు - తేనెలా కలిసి కాపురం చేస్తున్నారు. ఆమెను అపురూపంగా చూసుకున్నాడు. ఎండకు కందిపోతుందని ఉద్యోగం మనిపించి ఇంట్లో ఉంచాడు.
ఉత్తమ దంపతులకు ఆ జంట ఆదర్శం. ఐదేళ్లలో వాళ్ళ మధ్య గొడవ అన్నే పదానికి తావులేదు. ఎలాంటి రహస్యాలు లేవు. మనసులో ఉన్నది నాలుక మీదికి వస్తుంది. అది మంచా - చెడ్డా అన్నది అనవసరం. ఇంకా పిల్లలు పుట్టలేదు అనే చిన్న లోపం మినహా మరే లోపం లేదు.
అలాంటి దాంపత్యంలో చిన్న అలజడి. అమల చెల్లికి నాలుగు నెలల కిందటే పెళ్లయింది. నెల తిరగకుండానే ఆమె నీళ్లు పోసుకుంది. అమల కళ్ళు కన్నీళ్లు పోసుకున్నాయి. మరిది అమలను చిన్న చూపు చూస్తూ '' పెళ్ళై ఐదేళ్లు నిండినా మీకు నెలలు నిండలేదు. సాయి గారికి బలమైన నాటు మందులు ఇవ్వు వదినా. లేక నన్ను సహాయం చేయమంటావా వదినా?'' కన్ను గీటాడు.
ఆమె బాగా చెలించింది. ఆమెను గొడ్రాలు అంటే భరించేది. కానీ ప్రాణప్రదంగా ప్రేమించే తన భర్తను కించపరిచే సరికి సహించ లేకపోయింది.
ఆ విషయం సాయికి చెప్పి మొదటిసారి అమల ఎడ్చండి.
సాయి కూడా బాధపడి ''నువ్వు ఆ ఎదవ మాటలు పట్టించుకోడు. మనకు ఎలాంటి లోపాలు లేవు. టైం రావాలి అంతే'' లోలోన బాధపడుతూనే పైకి ఓదార్చాడు.
ఆమె ఏడుస్తూ ''నా మరిదికే కాదండీ - పిల్లలు లేని దంపతులు అందరికి లోకువే. ఆ ఎదురింటి నీలకంఠగాడికి ఇద్దరు పిల్లలు. పెళ్ళాం ఈ మద్యే చనిపోయింది. అడగాలి లేని ఆ ఎదవ కూడా నాతో ఎప్పుడు మాట్లాడినా 'మీ కింకా పిల్లలు ఎందుకు పుట్టలేదు? మీ వారిని ఓ సారి డాక్టర్ కి చుపించలేక పోయారా?’ అని మీసం తిప్పుతాడు. వాడి దొంగ చూపంతా నా మీదే ఉంటుంది. వాడిని ఎన్నిసార్లు తిట్టినా ఎదో ఒక వంకతో మాట్లాడుతుంటాడు సచ్చినోడు'' బాధ పడింది.
ఆమెనే కాదు - దగ్గరి బంధువులు సాయిని కూడా ఇదే విషయం లో గుచ్చిగుచ్చి అడుగుతారు. ఊరపిచ్చుకల కూర తినమని కొందరు, మునక్కాడల కూర తినమని మరికొంద సలహాలు ఇస్తున్నారు.
''నిజమే. మనం ఓసారి డాక్టర్ కి చూపించుకుంటే?'' అడిగాడు.
ఆమె చిన్నబోయి '' వద్దు. మా పిన్నికి కూడా పిల్లలు పుట్టలేదు. ఎనిమిదేళ్లుగా ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. ఆరు లక్షల వరకు ఖర్చు చేశారు. చివరికి పిల్లలు పుట్టారని తేల్చి 'సరోగసి' పద్దతిలో పాటించామన్నారు. అది కూడా గ్యారంటీ కాదని చెప్పారు. దానికి మరో ఐదు లక్షలు తగలెయ్యాలని చేతులు ఎత్తేసారు. ఈ డాక్టర్లను నమ్ముకుంటే పని కాదు'' అని తల పట్టుకుంది.
''పోనీ ఆ స్వామీజీని దర్శించుకుంటే?"
''మా పిన్ని వెళ్ళితే - రాత్రికి నా గదికిరా అన్నాడని తెలిసింది'' భయంగా అన్నది.
అతను నవ్వి అతను ఆమెను దగ్గరికి తీసుకుని ప్రేమతో లాలించాడు. పిల్లలను కనాలనే ఆరాటం వాళ్ళకులేదు. సమాజం సూటిపోటి మాటలకూ భ్యయపడి కనాలి అనే తొందర మొదలయింది.
000
అమల చెల్లికి పాప పుట్టింది. బారసాలకు అమల, సాయి వెళ్లారు. చెల్లి, మరిది ఆనందం చూసి అమలకు కన్నుకుట్టించింది. పిల్లలు లేని ఇల్లు ఎడారి కొంపలంటిది అని చాలా బాధ పడింది. పిల్లలు లేని లోటు ఆమెను వెంటాడుతోంది. అది రోజురోజుకు పెరుగుతోంది. పిచ్చిదానిని చేస్తోంది.
ఓ రాత్రి అమల సాయి గుండెల మీద వాలి ''ఇది తప్పో - ఒప్పో నాకు తెలియదు. కానీ నాకు తోచింది చెపుతాను. నీకు ఇష్టముంటే చేస్తాను'' అన్నది.
''అనాథను పెంచుకుందామా?'' అడిగాడు.
''వద్దు. ఎవరికో పుట్టిన పిల్లలను మనం పెంచుకోవడం ఎందుకు? వద్దు.''
''ఐతే ఏంచేద్దాము?" ప్రేమతో ఆమె తలా నిమిరాడు. వాళ్ళ మధ్య దాపరికాలు ఉండవని అతనికి తెలుసు.
''నిన్ను తండ్రిని చేయాలని ఉంది. అందుకే పక్కింటి నీలకంఠతో ట్రై చేయనా?'' సిగ్గుపడుతూ మెల్లిగా అడిగింది.
ఊహించని ఆ ప్రశ్నకు తన చెవులను తానే నమ్మలేక పోయాడు. ఒక్కసారిగా కట్టలుతెగిన కోపంతో మొదటిసారి ఆమె చెంప పతులగొట్టి ''ఏం కుశావే? అంటే నేను మగాడిని కాదనేగా? వాడితో కూలికి నన్ను తండ్రిని చేస్తావా? అసలు నువ్వు ఆడదానివేనా? కొంపదీసి వాడితో కమిట్ అయ్యావా ఏంటి?'' భయంగా అడిగాడు.
ఊహించని ఆ తిరుగుబాటుకు ఆమె షాకై ''నేను ఇంకా ఏ తప్పు చేయలేదు. నీ సలహా అడిగాను. వద్దంటే మనుకుంటాను. అంతే'' అరిచింది.
మరో రెండు దెబ్బలు వేసి ''అసలు నీకు ఇంత నీచమైన ఆలోచన ఎందుకు వచ్చింది? ఓ సంసారికి రావలసిన ఆలోచన అదేనా?" ఆమెను మరో దెబ్బ వేయబోయాడు.
ఏ తప్పు చేయని తనను అలా తిడుతూ, పశువులా కొడుతుంటే ఆమె భరించలేక పోయింది. ఆమె కూడా తిరగబడి ఒక్కటి పీకింది. ఇద్దరు కొట్టుకున్నారు. వాళ్ళ దాంపత్యంలో పగుళ్లు పట్టాయి. ఆ గొడవ వారం, నెల రోజుల్లో సర్దుకుంటుందని అనుకుంది. కానీ అది ఇంకా ఎక్కువయ్యింది.
అప్పటివరకున్న అద్దాల కాపురం సౌధం కూలిన చేల్లా చెదురయ్యింది. తీపి గుర్తుల కట్టడాలు తునాతునకలు అయ్యాయి. చెదిరిన కలల అంతా కల్లోలం. మునుపటి ప్రేమలు లేవు. పడక గదులు వేరయినాయి.
అనుమానం పురుగు సాయి పుర్రెను తొలిచేస్తోంది. ఏ మిట్ట మధ్యానమో రైడింగ్ చేస్తున్నట్లు ఇంటికి వచ్చి గదులను చెక్ చేస్తున్నాడు. ఆమె మీద ఓ కన్ను. మరో కన్ను నీలకంఠ మీది వేశాడు.
ఓసారి అమల వాకిట్లో నిలుచుని నీలకంఠతో మాట్లాడుతోంది.
రైడింగ్ కి వచ్చిన సాయి అందరు చూస్తుండాగానే అమలను కొడుతూ ''వాడితో నీకు పనేమిటి? ఎంతకాలంగా సాగుతోంది?'' పచ్చిగా తిడుతూ పరువు తీశాడు. బస్తీలో ఆమె పరువు నిండా మునిగింది.
ఇక ఆ మనిషితో కాపురం చేయడం అసంభవం అని ఆమె ఓ నిర్ణయానికి వచ్చింది.
000
కులం పంచాయితిలో రెండు కుటుంబాల పెద్దలు, బంధువులు జరిగినదంతా విన్నారు.
సాయి చాలా గంభీరంగా ''పెళ్లికి ముందే నాకు ఓ అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది. ఆమెకు కడుపు చేశాను. కానీ వాళ్ళ అమ్మానాన్న ఒప్పుకోలేదు. నేను మగాడిని అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం మరొకటి లేదు'' దేవుడి మీద ప్రమాణం చేస్తూ అన్నాడు. అది ఎంతవరకు నిజమో ఆ దేవుడికే తెలియాలి.
కానీ ఆ మాటలను ఆమని నమ్మలేదు.
సాయి కోపంతో ఊగిపోతూ ''అమలకు పిల్లలు పుట్టలేదని పక్కింటి నీలకంఠం గాడితో కూలికేందుకు నా అనుమతి కోరింది. అల్ రెడీ వాళ్ళ మధ్య అక్రమసంబంధం ఉందని నాకు తెలిసింది'' అని పచ్చిగా చెప్పాడు.
అమల గుండె ముక్కలయింది. తెలిసినవాళ్లలో, ఐనవాళ్ల ముందు ఉరి వేసినట్లు విలవిలలాడింది. ఆమె కూడా దేవుడి మీద ప్రమాణం చేస్తూ ''అవును. నీలకంఠతో కూలికేందుకు పర్మిషన్ అడిగాను. అది నిజమే. కానీ నేను ఇంకా తప్పు చేయలేదు. నిజంగా తప్పు చేయాలనుకునేది మొగుడి అనుమతి తీసుకోదు. సంసారానికి పనికిరాని ఈ సన్నాసిని తండ్రిని చేసి, నా వంశాన్ని కాపాడుకోవాలని అనుమతి అడిగాను. ఎందుకంటే ఇతను అసలు మగాడే కాదు'' అని ఏడ్చింది.
అబద్దాలు అతనికే కాదు - ఆమెకు వస్తాయి. సాయికి మగతనం లేదని చెపితే ఆ తప్పును పెద్దలు అర్థం చేసుకుంటారని దింపుడుకాళ్ళ ఆశ. ఆమె ఇంకా కన్నె అని కొందరైనా నమ్ముతారని ఆశ. కొంతలో కొంత గౌరవం, పరువు దక్కుతుందని ఆమె ఆరాటం.
ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు. ఆమె గొడ్రాలని అతను, అతనికి మగతనం లేదని ఆమె బురద చల్లుకున్నారు. ఎవరి పరువు వాళ్ళు కాపాడుకోవాలని ఎదుటి మనిషి మీద బురద చల్లారు.
ఆ స్థాయిలో గొడవ జరిగాక ఆ దంపతులను కలపడం అసాధ్యమని పెద్దలు భావించారు. వాళ్ళను ‘పెద్దమనుషుల ఒప్పందం’ ప్రకారం విడగొట్టారు. ఎవరిదారి వాళ్ళదయ్యింది.
ఆ కులానికి చెందిన నాగమణిని సాయి రెండో పెళ్లి చేసుకున్నాడు. సాయి మగాడు కాదని ఏ కులంలో అమల నిందలు వేసిందో - ఆ కులానికి తెలిసేలా ఇద్దరు పిల్లను కని మీసం తిప్పాడు. ఆ విషయం బంధువుల ద్వారా అమలకు తెలిసింది.
అమల కూడా దగ్గరి బంధువును రంగనాథ్ అనే కుర్రడిని పెళ్లి చేసుకుని బెంగుళూరుకు వెళ్ళిపోయింది. గొడ్రాలని ఏ కులంలో సాయి నిందలు వేశాడో - ఆ కులానికి తెలిసేలా అమల ఓ పాపను కని తొడగొట్టింది. ఆ విషయం బంధువుల ద్వారా సాయికి తెలిసింది.
ఇది జరిగి దాదాపు ఐదేళ్లు గడిచాయి. ఈ ఐదేళ్లలో ఆనాటి కోపతాపాలు తగ్గయి. ఎవరి సంసారంతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ ఇద్దరు ఎప్పుడూ ఎదురుపడలేదు.
000
ఐదేళ్ల తరువారా అమలను చూడగానే సాయి మనసులో తడి ఊరింది. అమల ప్రతి అణువు తనది అనుకున్నాడు. కానీ ఆమె ఇలా పరాయిదానిలా మారుతుందని కలలో కూడా అనుకోలేదు. అతను ఆమెనే గుచ్చి గుచ్చి చూస్తున్నాడు.
ఆమె దిక్కులు చూస్తూనే, ఓరకంట సాయినే చూస్తోంది. అతను పలకరింపుగా చిన్నగా నవ్వాడు. ఆమె నవ్వలేదు. తల తిప్పుకుంది. కాసేపటి తరువాత మళ్ళి చూసింది. అతను మళ్ళి నవ్వాడు. కానీ పలకరింపుగా నవ్వలేదు. ఆమె పక్కన ఆమె భర్త లేదు. ఆమె కూడా పాపతో వంటరిగా ఉంది. పాప లేత బుగ్గలతో చూడముచ్చటగా ఉంది. ఎక్కడా ఆమె పోలికలు లేవు. బహుశా తండ్రి పోలికలు కావచ్చు. పాప ఏడుస్తూ పాలు కావాలి అన్నట్లు ఆమె పైట లాగుతూ జాకెట్ ను లాగుతోంది.
సాయి కంటి రెప్ప వేయకుండా చూస్తున్నాడు. కాబట్టి పాలు ఇవ్వడానికి ఆమె ఇష్టపడకుండా పాపను ఆడిస్తోంది. అతనికి నవ్వొచ్చింది. ఈలోగా టి వచ్చింది. సాయి ఒక టి తీసుకుని డబ్బులు ఇచ్చి ''ఒక ‘టి’ ఆమెకు ఇవ్వు. పాలు ఉంటే పాపకు ఇవ్వు'' అన్నాడు.
సాయికి పది మీటర్ల దూరంలో కూర్చున్న ఆమె దగ్గరికి టి వాడు వెళ్లి టి ఇచ్చాడు. ఆమె వద్దు అన్నది.
''సార్ డబ్బులు ఇచ్చాడు'' అన్నాడు. ఆమె కాదనలేకపోయిది. టి తీసుకుంది. పాలు వద్దు అన్నది. అప్పటికే పాప ఏడుపు మొదలు పెట్టింది. ఆమె అటు తిరిగి, పాప మీద పైట కప్పి రొమ్ము అందించింది.
గంట గడిచింది. పాప నిదుర పోతోంది. మధ్య మధ్యలో ఒకరిని ఒకరు దొంగచూపులు చేసుకున్నారు. రైలు రావడానికి మరో రెండు గంటలు పట్టవచ్చని ప్రకటన వినిపిస్తోంది.
చాలాకాలం తరువారా సాయికి మనసు అల్లకల్లోలంగా మారింది. ఆగలేక పోయాడు. ఆమెతో నాకు దాపరికం ఏమిటి అన్నట్లు తన బ్యాగ్ తీసుకుని మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె సీట్లు దొరక్క ఫ్లాట్ ఫారం మీద కూర్చుంది. ఆమె పక్కన కూర్చున్న సాయి మెల్లిగా ''బాగున్నావా అమలా?'' అడిగాడు. ఆ పిలుపులో ఎలాంటి ప్రేమానురాగాలు లేవు.
అతనితో మాట్లాడం ఇష్టం లేనట్లు 'బాగున్నాను' అన్నట్లు ఆమె తల ఆడించింది.
''మీవారు రాలేదా?'' అడిగాడు.
'రాలేదు' అన్నట్లు ఆమె తల ఆడించింది.
'' పాప....... ?" కావాలనే వాక్యం పూర్తి చేయలేదు.
''నా కూతురు. నేను నవమాసాలు మోసి కన్న కూతురు'' గబిక్కిన జవాబు చెప్పింది. పౌరుషంగా జవాబు చెప్పింది.
సాయి చిన్నగా నిట్టూర్చి ''కంగ్రాట్యులేటిన్స్. మొత్తానికి తల్లి వయ్యావు'' అన్నాడు. అందులో వెటకారం లేదు.
ఆమె పౌరుషంగా అతనిని చూసింది. ఆ చూపులో చాలా అర్థాలు ఉన్నాయి. ‘అసలు సిసలైన మగాడు నన్ను తల్లిని చేశాడు అనే అహం అందులో’ తళుక్కుమంది.
''నీకు పెళ్లి అయ్యిందని విన్నాను. నిజమేనా?'' ఉండబట్టలేక అన్నది.
''అవును.''
''ఎంతమంది పిల్లలు?'' కావాలనే అడిగింది.
''ఇద్దరు. పాపా, బాబు'' అతను కూడా పౌరుషంగానే జవాబు చెప్పాడు.
ఆమె నమ్మలేదు. అనుమానంగా చూసింది. ‘నువ్వు తండ్రివి కావడం ఏంటి? నా పిండాకూడు' అన్నట్లు హేళనగా చూసింది. అది అతను గమనించి వెంటనే తన సెల్ ఫోన్ ఆన్ చేసి, తన భార్య నాగమణి, ఇద్డురు పిల్లలతో దిగిన ఫోటో చూపాడు.
ఆమె శ్రద్దగా చూసింది. అతని పోలికలు ఆ పిల్లలకు రాలేదు. తల్లి పోలికలు కొన్ని కనిపించాయి.
ఆమె అతనిని అదోలా చూసి చిన్నగా నిట్టూర్చి ''కంగ్రాట్యులేటిన్స్. మొత్తానికి మీరు కూడా తండ్రి అయ్యారు’’ అన్నది. అందులో వెటకారం లేదు.
అతను మీసం తిప్పాడు. ఆమె అతనిని తీక్షణంగా చూసింది ''ఎలా ఉన్నారు?" అనుమానంగా అడిగింది.
''నాకే.... నా భార్యతో, ఇద్దరు పిల్లలతో సుఖంగా, సంతోషంగా ఉన్నాను'' అన్నాడు.
ఆమె ''పోనిలే. మీరు సంతోషంగా ఉంటే చాలు'' అన్నది. నువ్వు అనే పదం వాడలేక పోతోంది.
''నువ్వు ఎలా ఉన్నావు?'' కావాలనే అడిగాడు.
ఆమె సంతోషంతో ''నాకే. నా భర్తతో, పాపతో చాలా సంతోషంగా ఉన్నాను. అయన నన్ను చాలా బాగా చూసుకుంటారు'' అన్నది.
మరో మూడు గంటలల వరకు ఏ రైలు రాదని ప్రకటన వినిపించింది.
ఇద్దరు పెదవి విరిచాడు. కానీ బాగా టైంపాస్ అవుతోంది.
''బ్యాగులను లాకర్లో పెట్టి హోటల్ కి వెళ్లి భోంచేసి వద్దామా?'' సాయి అడిగ్గాడు.
''వద్దు. ఆకలిగా లేదు'' అన్నది.
''నీకు షుగర్ ఉన్నది. సమయానికి భోంచేయకపోతే షేవరింగ్ వస్తుంది. పదా'' మునుపటిలా మొగుడిలా ఆదేశించాడు. ఆమె కాదనలేక లేచి నిలుచుంది. ఆమె పాపను ఎత్తుకుంది. అతను ఆమె బ్యాగ్ ఎత్తుకెళ్ళి లాకర్లో పెట్టి వచ్చాడు. ఇద్దరు కలిసి స్టేషన్ బయటికి వచ్చారు.
000
అది తెలుగువాళ్ళ హోటల్. అమలకు ఇష్టమైన రొయ్యల పులుకు, చికెన్ ఫ్రై తెప్పించాడు సాయి. ఆమె మురిసిపోయింది. అతను కొసరి కొసరి వడ్డిస్తుంటే మునుపటి ప్రేమ గుర్తుకు వచ్చింది. ఆమె ఇంకా మురిసిపోయింది. ఆమె కూడా అతనికి కొసరి కొసరి వడ్డించింది. ఆమె కడుపేకాడు – మనసు కూడా నిండిపోయింది.
టివిలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారు' పాట వస్తోంది.
అది చూసి సాయి నవ్వుకున్నాడు. ఆమె సిగ్గుపడింది పైటను నిండుగా కప్పుకుంది. అది అతను తాకని చోటుకాదు. అక్కడ ఎన్ని కణాలు ఉన్నాయో, ఎన్ని నరాలు ఉన్నాయో అతనికి తెలుసు. అతని కళ్ళలోకి చూడలేకపోతోంది. ఎంతైనా ఇప్పుడు పరాయివాడుగా!
సాయి బిల్ కట్టక ''కాసేపు స్నేహితుల్లా మనసు విప్పి మాట్లాడు కుందామా?'' మెల్లిగా అడిగాడు.
తలవంచి కూర్చున్న ఆమె సరే అన్నట్లు తలా ఆడించింది.
''నిజంగా నువ్వు సంతోషంగా ఉన్నావా?'' అడిగాడు.
ఆమె జవాబు చెప్పలేక పోయింది. ఏమనుకుందో ఏమో చివరికి ''లేను'' ఆమె అతనితో ఎప్పుడు అబద్దాలు చెప్పాడు.
''ఏ?''
''నా మొగుడు పచ్చితాగుబోతు. నా కష్టార్జితం మీద బతుకుతాడు. డబ్బులు ఇవ్వకపోతే తంతాడు. అందుకే ఉద్యోగం చేస్తూ పోషిస్తున్నాను. నాలాంటి సెకండ్ హ్యాండ్ దానికి బుద్దిమంతుడు ఎలా దొరుకుతారు?" అన్నది. అప్పటికి ఆమె తల ఎత్తలేదు.
సాయి నిట్టూర్చి '’ఆ పాప నీకు పుట్టలేదు కాదు?'' అడిగాడు. ఇంకా అతని అనుమానం వెంటాడుతోంది.
ఆమె చిన్నగా ఏడుస్తూ ''నా చెల్లికి వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. అబ్బాయి పుట్టలేదు. నాలుగో కాన్పులో పుట్టిన పాపను నేను దత్తత తీసుకున్నాడు. కులంలో, బంధువుల్లో నా పరువు నేను కాపాడుకున్నాను. మీ మీద గెలవాలని ఈ పాప నాకు పుట్టినట్లు దొంగ కడుపు పెట్టుకుని అందరిని నమ్మించాను'' నిర్మొహమాటంగా అన్నది.
అతని అనుమానం ఇప్పుడు తీరింది. ''ఏ! నీ మొగుడు మగాడు కాదా?..... " కావాలనే ఆగాడు.
''మగాడే. నాలోనే లోపం ఉందని తరువాత తెలిసింది. నాకు గర్భసంచి రెండుగా చీలి ఉందని డాక్టర్ చెప్పారు. నా అహంకారం నాకు గొప్ప గుణపాఠం నేర్పింది. నేను గొడ్రాలిని అని అప్పుడే తెలిసి ఉంటే నా జీవితం ఇలా నాశనం అయ్యేదికాదు'' మనసులోని బాధను చెప్పుకుంది. ఆ మాటలు విని అతను ఎం సంతోషిచలేదు. ఆమె ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు.
ఆమెను జాలిగా చూశాడు. కొందరు అంతే. చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటారు.
చాలా సేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం.
''మీరు ఎలా ఉన్నారు?'' ఆమె ఉండబట్టలేక కూడా అనుమానంగానే అడిగింది.
ఆమె నిజం చెప్పాకా తాను అబద్దం చెప్పడం ముర్కత్వం అవుతుందని నిట్టూర్చి ''నీకంటే భయంకరంగా ఉంది నా పరిస్థితి. నా భార్య గయ్యాళిగంపా. ప్రతిచిన్న విషానికి రాచి రంపాన పెడుతుంది. డబ్బుకావాలని నరకం చూపుతోందో'' అని బాధ పడ్డాడు.
ఆమె అతనిని జాలిగా చూసి ''మరి ఆ పిల్లలు?''
అతను ఇంకా బాధతో విలవిల్లాడుతూ ''నేను పెద్ద పుడింగిని అనుకున్నాను. కానీ ఆమెకు కూడా కడుపు రాలేదు. నేను డాక్టర్ కి చూపించుకున్నాను. నా వీర్యంలో జీవకణాలు లేవని, తండ్రిగా మారే యోగం లేదని డాక్టర్ చెప్పాడు. నా అహంకారం నాకు గొప్ప గుణపాఠం నేర్పింది. నేను మగాడిని కాదనీ అప్పుడే తెలిసి ఉంటే నా జీవితం కూడా ఇలా నాశనం అయ్యేదికాదు'' మనసులోని బాధను చెప్పుకుంది.
ఆమె ఏమాత్రం విస్మయం చెందకా ''అంటే ఆ ఇద్దరు పిల్లలు నీలకంఠకు పుట్టారా?" మెల్లిగా అడిగింది.
అతను కటతడితో ''అవును. నేనే వాడిదగ్గరికి పంపాను. ఎందుకంటే ఆమెకు పిల్లలు పుట్టకపోతే నువ్వు గెలుస్తావు. అందుకే కులంలో, బంధువుల్లో నా పరువు నేను కాపాడుకున్నాను. మీ మీద గెలవాలని ఒక్కడిని కనమన్నాను. ఆమె ఇద్దర్ని కన్నది. అది వేరే విషయం'' కన్నీళ్లు తుడుచుకున్నాడు.
ఆ మాటలు విని ఆమె ఎం సంతోషిచలేదు. అతను ఎక్కడున్నా పిల్లల్లా, పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంది.
చాలా సేపటివరకు ఇద్దరు మాట్లాడలేక పోయారు. ఇద్దరి మనసు వికలమైంది. అతను గెలవలేదు. ఆమె ఓడిపోలేదు.
ముందుగా అతను కోలుకుని ''ఇప్పట్లో రైలు వచ్చేలా లేదు. హోటల్లో గాది తీసుకుని..... '' మెలిగా అడిగాడు.
ఆమె చిరాకుగా ''వద్దు. మీరు అదుపు తప్పుతారు. నా మొగుడు తాగుబోతే కావచ్చు. నేను అతనికి ద్రోహం చేయలేను. పదండి'' అని లేచి నిలుచుంది.
అతను నమ్మలేకపోయాడు. ఆమె ఆకలితో ఉన్నది. ఐనా - ఆమె అణువు అణువును జల్లెడ వేసి అనుభవించిన మాజీ మొగుడిని తాకడానికి ఇష్టపడడం లేదు. ఇక పరాయివాడితో ఎలా తాకనిస్తుంది? అప్పుడు ఆమెను నమ్మాడు - ఆమె నీలకంఠ తో ఏ తప్పు చేయలేదని.
000
అమల, సాయి ఫ్లాట్ ఫారం మీదికి వచ్చారు. ఆమె ఎక్కాల్సిన బెంగుళూరు రైలు వచ్చింది. ఆమెను ఎక్కించాడు.
''నీ ఫోన్ నెంబర్ చెపుతావా?'' ఆశగా అడిగాడు.
''చెప్పను. మీ నెంబర్ కూడా నాకు చెప్పకండి. గతాన్ని, పాతిపెట్టిన శవాన్ని తొవ్వి బయటికి తీయకూడదు'' నిర్మొహమాటంగా అన్నది.
అది కూడా నిజమే అనుకున్నాడు. మారు మాట్లాడలేదు. ఆ రైలు వెళ్ళిపోయింది. ఆమె గతంలోకి జారుకుంటోంది.
అతను ఒక్కడే అక్కడ వర్తమానం తోడుగా మిగిలాడు.
గతం ఎంత విచిత్రమైనది? ఆమె నోరు జారింది - అతను చేయి జారాడు. ఇద్దరి జీవితాలు చెలారా చేజార్చుకున్నారు. ఇద్దరు తప్పు చేశారు. ముందు ఎవరు తప్పు చేశారు అన్నది అనవసరం. ఇద్దరు తొందర పడ్డారు. ఇద్దరు గోతిలో పడ్డారు. ఇద్దరు తమ తప్పులను తెలుసుకున్నారు. కానీ అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది.
ఆమె జీవితం రైలు బండి గతంలోకి వెళ్ళిపోయింది. అతను ఎక్కిన రైలు బండి కోసం భవిషత్తును ఎదురు చూస్తున్నాడు. భవిషత్తు ఎప్పుడూ ఆశాజనకమే. కానీ ఆ ఆశ అత్తనికి లేదు. అతను ఎక్కిన రైలు బండి ఎప్పుడో పట్టాలు తప్పి పొలాల మధ్య కొట్టుకు పోతోంది.
ఇక ఆ ఇద్దరు ఎక్కిన రెండు రైళ్లు మళ్ళి ఎప్పడు - ఎక్కడ, ఏ జంక్షన్ లో కలుస్తాయో తెలియదు. కలవవచ్చు - కలవకపోనూవచ్చు. కాలానికే తెలియదు.