సాయంకాలం ఆరు దాటింది. ఇంట్లో పెద్దవాళ్ళందరూ టివీ ముందు కూర్చొని భక్తి ఛానల్ చూస్తూ విష్ణుసహస్రనామ పారాయణంలో నిమగ్నమై ఉన్నారు. ఈ లాక్‌డౌన్‌వేళ ఆ ఛానల్‌వారు ప్రతీరోజూ సాయంకాలం ఆరుగంటలకల్లా పెద్దవాళ్ళందరినీ టివీవద్ద కట్టిపడేసి ఉంచుతున్నారు. భక్తి పారవశ్యంలో మునిగితేలుతూ కోటిగొంతుకలతో గొంతుకలిపి పారాయణం చేస్తున్నారు సీతారాం, జానకి దంపతులు. సీతారాం తల్లి సుభద్రమ్మైతే కళ్ళుమూసుకొని పారాయణం చేస్తోంది. కొడుకు రఘు, కోడలు రమ్య ఇంకా ‘వర్క్ ఫ్రం హొం’లో బిజీగా ఉన్నారు. మనవడు చింటూ వీళ్ళకి దూరంగా కూర్చొని ఐపాడ్‌లో కార్టూన్లు చూస్తున్నాడు. చింటూకెలాగూ స్కూల్ లేదు. రోజంతా ఆట పాటలతోనే గడిచిపోతోంది.
కరోనా వచ్చి ఇప్పటికి దగ్గరదగ్గర మూడు నెలలైంది. అది వచ్చిన దగ్గరనుండే ఈ లాక్‌డౌన్ మొదలైంది. ఈ లాక్‌డౌన్‌వల్ల బయటికి ఎక్కడికీ వెళ్ళడానికి లేదు. నిత్యావసరాలు తప్ప అన్నీ మూతపడ్డాయి. ఈ కరోనా మహమ్మారినెలా తరిమికొట్టాలో తెలియక ప్రపంచమంతా గందరగోళానికి లోనవుతోంది. మహమ్మారి కరోనాబారినుండి ఈ ప్రపంచాన్నిరక్షించమని కోటిదేవుళ్ళని ప్రతీ రోజూ మొక్కుకుంటున్నారు ప్రజలందరూ. దేశదేశాల మధ్య అపనమ్మకం పెరిగింది. ప్రతీ మనిషీ ఒకళ్ళనొకళ్ళు దూరం పెడుతున్నారు. సీతారాం కుటుంబానికైతే ‘కరోనా’వల్ల చాలా ఇబ్బంది ఏర్పడింది. అందరికన్నా కూడా వాళ్ళకి కరోనా వల్ల ఇంకొంచెం ఎక్కువ బెడద ఏర్పడింది. ఆ కరోనా బెడద ఎలా తీరుతుందోనని సీతారాంకి చాలా బెంగగా ఉంది. కరోనా ప్రవేశించిన రోజు నుండి ఇంట్లో పెద్దవాళ్ళెవరికీ మతి స్థిమితం లేకుండా పోయింది. అసలే లాక్‌డౌన్‌వల్ల దినచర్య అస్తవ్యస్తమైంది. ఏ పనిమీద మనసు లగ్నం కావడంలేదు. ఇలాంటి సమయంలో టివీలో భక్తి కార్యక్రమాలు కొద్దిగా మనసుని అదుపులో పెడుతోంది. అందుకే రోజూ ఆరుగంటలకల్లా టివీ ముందు తప్పనిసరిగా కూర్చుంటున్నారు.
భక్తిగా పారాయణం చేస్తున్న సీతారాం మనసు ఎందుకో అప్రయత్నంగా కరోనావైపు మళ్ళింది. కరోనా మనసులోకి ప్రవేశించగానే ఒక్కసారిగా భయంతో ఒళ్ళు జలదరించింది. కరోనా గురించి తలచుకుంటేనే కంపరమెత్తిపోతోంది. ఈ కరోనా తమ కుటుంబంలో ప్రవేశించిననాటి నుండీ ఎంతో కష్టనష్టాలు ఎదుర్కుంటున్నారు. ఇంటి చుట్టుపక్కలవాళ్ళతోనే కాకుండా ఆ కాలనీవాళ్లందరితోనూ కూడా ఈ కరోనా కారణంగా విరోధం విపరీతంగా పెరిగిపోయింది. వీళ్ళ కుటుంబాన్ని దాదాపు వెలివేసినంత పని చేసారు. ఈ కరోనా ఇంత పనిచేస్తుందని భావించలేదు మొదట్లో. అలా భావించి ఉంటే మొదటే ఏమైనా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని ఉండేవాడు తను.
ఈ లాక్‌డౌన్ కారణంగా కాలనీలోనే మార్నింగ్‌వాక్ చేసే సీతారాం అయితే ఏకంగా మార్నింగ్‌వాక్ కోసం వెళ్ళడమే మానుకున్నాడు. వీధిలో ఎదురుపడిన వాళ్ళందరూ ఈ కరోనా గురించి టివీల్లో చర్చావేదికలో పాల్గొన్నవాళ్ళల్లా తనపై ఎగిరిఎగిరి పడుతున్నారు. వాళ్ళ తాకిడి రోజురోజుకు ఎక్కువైపోతోంది.
కాలనీ సెక్రెటరీ మాధవరావైతే సీతారాంకి దూరంగా నిలబడి, "సీతారాంగారూ, మీరు పెద్దవారని మీకు ఇప్పటివరకూ చెప్పలేదుకానీ, మీ ఇంట్లో ఉన్న కరోనావల్ల మీ మీద ఫిర్యాదులెక్కువ అవుతున్నాయి. మీ అబ్బాయి వలన వచ్చిందో, లేక మీ మనవడే వెంట తీసుకొచ్చాడో అది మాకు అనవసరం. మీ ఇంట్లో ఉన్న కరోనావల్ల అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. మన కాలనీలోకి రావడానికి కూరగాయల బళ్ళవాళ్ళూ, పాలపేకట్లు ఇచ్చే అబ్బాయి సైతం ఈ కరోనా వల్ల జంకుతున్నారు. అసలే లాక్‌డౌన్ ఉన్నవేళ. కూరగాయల కోసం బయటకి వెళ్తే పోలీసులు ఒప్పుకోవడం లేదు. మీరీ కరోనాని ఇంట్లోంచి తరమకపోతే, మిమ్మల్నే కాలనీనుండి తరమమని అందరూ డిమాండ్ చేస్తున్నారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. వాళ్ళకి వెంటనే కరోనా బెడద దూరం చేస్తానని మాట ఇచ్చాను." అని మెత్తమెత్తగా చీవాట్లేసాడు.
మాధవరావు చీవాట్లు విన్న సీతారాంకి జవాబేమి ఇవ్వాలో అర్థమవలేదు. చివరికి, "మీ అందరికీ ఈ కరోనా బెడద లేకుండా చేస్తాను త్వరలో. కొంచెం గడువివ్వండి." అని ప్రాధేయపడక తప్పింది కాదు.
"ఇప్పటికే చాలాగడువు తీసుకున్నారు. త్వరగా ఏదైనా చేయండి. లేకపోతే, నన్ను, మిమ్మల్నీ మన కాలనీ వారు బతకనివ్వరు." ఈ సారి ప్రాధేయ పూర్వకంగా చెప్పాడు మాధవరావు.
అలాగేనని చెప్పి అప్పటికి తప్పించుకున్నాడు సీతారాం. అయితే ఎంత ఆలోచించినా ఇంట్లో తిష్ఠ వేసుకున్న కరోనాని ఎలా తరిమికొట్టాలో ఎంతమాత్రం బోధపడలేదు. భార్యకి కూడా చెప్పి చూసాడు, ఈ కరోనాని వదిలించుకోవడానికి ఉపాయమేదైనా చెప్పమని. ఆవిడ చెప్పిన విధానాలేమీ పని చేయలేదు. దీనికి పరిష్కారం ఏమిటో ఎంత ఆలోచించినా తట్టలేదు.
జరిగినదంతా కూడా గుర్తుకొచ్చింది సీతారాంకి. మెల్లగా నిట్టూర్చి బలవంతంగా మళ్ళీ పారాయణం మీద దృష్టి కేంద్రీకరించాడు.
అంతవరకూ పారాయణంపై మనసు లగ్నం చేసిన జానకికి కూడా కరోనా వల్ల ఏకాగ్రత చిక్కలేదు.
'పాడు కరోనా!... ఏం ముహుర్తాన తమ ఇంటిలో ప్రవేశించిందో తెలియదు కాని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే ఉన్న బిపి, షుగర్‌లాంటి వాటితో పాటు ఈ కరోనా వచ్చి చేరడం వల్ల కొత్తజబ్బులేమైనా వస్తే ఇంకేముందా? దీని పీడ ఎలా వదిలించుకోవాలా దేవుడా? కొడుకూ, కోడళ్ళకి ఎంత చెప్పినా అసలు పట్టించుకోవడమేలేదు. ఎప్పుడూ తమ అఫీస్ పనిలో బిజీగానే ఉంటారు. ఏమి చెప్పినా తేలికగానే తీసుకుంటారు కాని, అసలు సీరియస్‌గా తీసుకోరు. మనవడేమో ఎంతచెప్పినా వినకుండా వీధిలోకి ఆడుకోవడానికి వెళ్తాడు. మందలించినా వినడు, అవును మరి తన కొడుకు కోడలికి వాడంటే చాలా ముద్దు. తనకి కూడా ముద్దే మరి! అందుకే వాడినేమీ అనలేక పోతోంది. వాడివల్లే అసలు ఇంట్లోకి కరోనా ప్రవేశించింది. ఇప్పుడు తనేం చేయగలదు? ఎవరు తన మాట వింటారు? అత్తగారికి కూడా కరోనా అంటే భయమే. అసలే పెద్దావిడ. వయసు దగ్గరదగ్గర ఎనభై ఏళ్ళు. ఆరోగ్యంగానే ఉన్నా కరోనాకి అనుక్షణం భయపడుతూనే ఉన్నారు. అయినా భయపడరా మరి! ఇంట్లో అందరికీ ఈ కరోనా అంటే అంతులేని భయమే, ఒక్క చింటూకి తప్ప. వాడైనా చిన్నపిల్లవాడు కాబట్టే వాడికేమీ తెలియదు. అసలు మనవడు చింటూ వల్లే ఈ ఉపద్రవం దాపురించింది. కరోనా నుండి ఎప్పుడు విముక్తి దొరుకుతుందో ఏమో? ' అని ఆమె మనసులోనే బెంబేలెత్తిపోయింది. ఆ కరోనావల్ల ఆమె మనసు పారాయణంపై లగ్నం కాలేకపోతోంది. అయితే మనసు కరోనా ఆలోచనల్లో తేలుతున్నా, పైకి మాత్రం పారాయణం చేస్తూనే ఉందామె సహస్రనామం అలవాటైన కారణంగా.
ఇలా ఎవరి అంతర్మధనాల్లో వాళ్ళుండగానే విష్ణు సహస్రనామ పారాయణ పూర్తైంది.
జానకి అందరికీ కాఫీ కలిపి తేవడానికి వంటింట్లోకి వెళ్ళింది. కాఫీ కలిపి అందరికీ ఇచ్చి తనొకటి తీసుకుంది. ఈ లోపు కోడలు ఆఫీస్ పని ముగించి రాత్రి వంటకు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది. కాఫీ తాగుతున్న సుభద్రమ్మ మనసునిండా కూడా కరోనా గురించిన ఆలోచనలే. 'తనకు వయసు పైబడటంతో ఈ మధ్యే కొత్తగా గుండెదడ కూడా వస్తోంది. పైగా ఈ కరోనా బాధ ఒకటి. దీనివల్ల ఇంకేం ఆపద ముంచుకొస్తుందో ఏమిటో?' అని ఆమె మనసులో ఆవేదన.
ఈ కరోనావల్ల పక్కింటి వారితోనూ, ఎదురింటి వారితో కూడా రోజూ తగువే సీతారాం కుటుంబానికి.
"మీ ఇంటినుండి కరోనా ఎప్పుడు మా ఇంటివైపు వస్తుందో ఏమిటో? మాకు తెలియకుండా ఎప్పుడు మా ఇంట్లోకి దూసుకొస్తుందో? మీ ఇంట్లో అయితే మీ ఇష్టంగాని, మా ఇంట్లోకి కూడా ప్రవేశించాలని ప్రయత్నిస్తే మాకెలాగా? దానివలన మేం ఈ ఎండకాలంలో సైతం రోజంతా తలుపులు మూసుకు కూర్చోవలసి వస్తోంది." అని భౌతిక దూరం పాటిస్తూనే ఎదురింటి కనకమ్మ కయ్యానికి దిగింది.
పక్కింటి పంకజం అయితే, "మీ ఇంట్లో ఉన్న కరోనా వల్ల మేమే కాదు ఈ వీధి వీధంతా బాధపడాల్సి వస్తోంది. మీరు దీన్నైనా వదిలించుకోవాలి లేకపోతే ఇంకో కాలనీకైనా మారాల్సిందే." అని దూరంగా నిలబడే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది, దగ్గరగా నిలబడితే ఎక్కడ కరోనా మీద పడుతుందోనని భయపడి.
ఇరుగుపొరుగు వాళ్ళేకాక, వీధిలో చాలామంది వీళ్ళమీద అసంతృప్తితో ఉన్నారు. ఉట్టిపుణ్యానికి ఈ కరోనావల్ల అందరితో మాటలు పడవలసి వస్తోంది. 'ఎప్పుడు ఇది ఇల్లు వదిలిపెడుతుందో కాని దీని బెడద పడలేకపోతున్నాం భగవంతుడా' అని మనసులోనే గొణుగుతూ అనుకోసాగింది సుభద్రమ్మ.
'ఈ కరోనా వల్ల ఇన్ని ఇక్కట్లు ఉన్నా ఒకవిధంగా మేలు కూడా జరిగింది. కరోనా వచ్చిన తర్వాత ఊళ్ళో ఉన్న చుట్టాలైనా మొహం చాటేస్తున్నారు. ఈ కరోనా వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు పంచదార, టీ పొడి లాంటివి అరువు అడగడం మానుకున్నారు. ఇదో విధంగా బాగుంది, కానీ ఈ కరోనా బాధ పడలేక పోతున్నమే!' అన్న బాధ కోడలు రమ్యది. పైకి లైట్‌గా తీసుకున్నా ఆమెకీ మనసులో వెలితిగా ఉంది.
అందరూ ఇన్ని విధాలుగా ఆలోచిస్తూంటే రఘు మాత్రం ఈ విషయానికి ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే ఈ గందరగోళానికంతటికీ కారణమైన చింటూ మాత్రం హాయిగా తన ఆటపాటలతో సమయం గడిపేస్తున్నాడు.
చివరికి ఈ విషయమై సీతారామే ఓ నిర్ణయానికి వచ్చి చింటూని దగ్గరికి పిలిచి లాలించాడు. చింటూని పిలిచి ఫైవ్‌స్టార్ చాకలైట్ ఇచ్చి బుజ్జగించాడు. తనని తాత అలా బుజ్జగించడం చూస్తూనే ఇందులో ఏదో మతలబు ఉందని గ్రహించాడు కాబోలు చాకలైట్ తీసుకోకుండా, "తాతయ్యా! మీరెన్ని ఇలాంటి తాయిలాలు ఇచ్చినా నేను మాత్రం ఈ కరోనాని మన ఇంటినుండి బయటకి తరమడానికి ఒప్పుకోను. మీరేం చేసినా అది కూడా నన్ను వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు. నేను ఒక్క క్షణం కూడా వదలలేను. మీ ప్రయత్నాలన్నీ మానుకోండి తాతయ్యా!" అన్నాడు తను పెంచుకుంటున్న కుక్కపిల్ల బొచ్చు చేత్తో నిమురుతూ. అది కూడా 'భౌభౌ...' మంటూ ముద్దుగా మొరుగుతూ చింటూతో సరదాగా ఆడుకుంటోంది.
సీతారాం వాడికి ఎంత నచ్చచెప్పినా ఏం లాభలేక పోయింది. దాంతో చింటూ చేతిలో ఉన్న కుక్కపిల్ల వంక గుర్రుగా చూసాడు సీతారాం. దానికి కూడా సీతారాం మీద కోపం వచ్చి చెంగున అతని వైపు దూకింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా తుళ్ళిపడ్డాడు సీతారాం.
ఈ కరోనా లాక్‌డౌన్ ఉండగా ఎక్కణ్ణుంచి వచ్చిందో తెలియదుగానీ తల్లి నుండి వేరుపడిన కుక్కపిల్ల ఆకలికి అలమటిస్తూ కాలనీలో ఒంటరిగా తిరుగుతూ చింటూ కంటబడింది. దానికి తిండిపెట్టి ఇంటికి తీసుకువచ్చాడు. మొదట్లో వాడు చేసిన పనికి చాలా సంతోషించారు ఇంటిల్లపాదీ. వాడి భూత దయకి మెచ్చుకున్నాడు సీతారాం. ఆ కుక్కపిల్లకే కరోనా సమయంలో దొరికిన కారణంగా 'కరోనా' అని పేరు పెట్టి పెంచుకున్నాడు చింటూ. దానికి మెల్లిగా ఆ ఇంట్లో బాగా చనువు ఏర్పడింది. రానురాను, దానివల్ల అందరికీ బాగా చికాకులెదురయ్యాయి. సుభద్రమ్మ ఉదయం పూజలో ఉండగా అక్కడికి కూడా వచ్చేస్తుంది. ఆ కుక్కపిల్ల అంటే ఆమెకి విపరీతమైన భయం. దాని కారణంగానే కొత్తగా గుండెదడ పట్టుకుందావిడకి. ఇక హాల్లోకీ, వంటింట్లోకీ కూడా యధేచ్చగా రాకపోకలు సాగించింది. ఇంటికి ఎవరొచ్చినా ఊరుకోదు. మీదపడి నానా హంగామా చేస్తోంది. పక్కింటికి, ఎదురింట్లోకి కూడా యధేచ్ఛగా వెళ్ళిపోతోంది.
చింటూ వీధిలోకి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వాడితో వెళ్తుంది. ఎదురుపడ్డ వాళ్ళందరిమీదా మొరుగుతుంది. వీధిలోకి కూడా కొత్తవాళ్ళైనా, పాత వాళ్ళైనా రానీయదు. అందుకే ఆ కుక్కపిల్ల 'కరోనా' అంటే ఆ వీధి వీధంతా హడలే! అందుకే అందరూ ఆ ఇంట్లో వాళ్ళందరికీ ఒక్కసారిగా శత్రువులైపోయారు. ఈ కరోనాని నియంత్రించడం ఎవరివల్లా కావడం లేదు. సీతారాం చాలాసార్లు ప్రయత్నం చేసాడు కాని అతనికి కూడా లొంగలేదు. కరోనాని తరిమేద్దామంటే చింటూ అసలు ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ విచారంగా ఉన్న తాత వైపు చింటూ జాలిగా చూసాడు. ఎలాగైనా తాత చింత తీర్చాలన్న నిర్ణయం తీసుకున్నాడు. ఇంటిల్లపాదీ ఈ కరోనావల్ల పడిన కష్టాలు వాడు చూసాడు మరి.
ఆ రోజు ఉదయం ఎక్కడికో వెళ్ళి తిరిగివచ్చిన వాడి చేతిలో ఓ చెయిన్ ఉంది. ఆ చెయిన్‌తో ఈ లాక్‌డౌన్ వేళ అందరికీ ముచ్చెమటలు పట్టిస్తున్న’కరోనా’ మెడలో కట్టి చెయిన్ రెండోపక్క గ్రిల్‌కి బిగించాడు చింటూ. "తాతా! ఇకనుండి మీకెవరికీ నా కరోనా వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు. దాని విషయం నేను పూర్తిగా చూసుకుంటాను. ఇక నుండి మీరెవ్వరి నుండీ మాటపడరు." అని హామీ కూడా ఇచ్చాడు చింటూ. ఆ తర్వాత కరోనా తాలుకు బెడద ఇంకెవరికీ కలగలేదు. ఆ తర్వాత ఆ ఇంట్లోవాళ్ళే కాదు, వీధిలో వాళ్ళు కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.