"హలో...హలో"
"హలో..ఎవరు? "అన్నాడు వలసయ్య.
"నేను ప్రిన్సిపాల్ ని."
"ఎక్కడనుండి ఫోన్?"
"శ్రీకాకుళం."
"ఏమిటిసార్?"
"మీ అబ్బాయి కాలేజీకి సరిగా రావడం లేదు"
"రోజూ వస్తున్నాడే?"
"నాకు అబద్దం చెప్పవలసిన పనేం ఉంది?"
"సార్ సార్ కోప్పడకండి. ఆడ్ని కారేజెట్టి రోజూమాయమ్మ
పంపుతోంది."
"అక్కడ బయల్దేరి ఉండొచ్చు ఇక్కడికి రావాలికదా?"
"రాడం లేదా సార్?"
"రాకపోవడం వల్లే కదా మీకు ఫోన్?"
"ఇదేనా మీ నెంబర్..?"
"అవును సార్"
"మీ వాడు ఇంకో నెంబర్ ఇచ్చాడే.. "అని నెంబర్ చెప్పాడు ప్రిన్సిపాల్.
"అది వాళ్ళ మామది లెండి"
"ఏమో మరి..అతడు మాత్రం ప్రతిదానికి వెనకేసుకొస్తున్నాడు మీ వాడ్ని."
"చిదగొట్టేయ్యండి నా కొడుకుని.."కోపంగా అన్నాడు వలసయ్య.
"అలా తిట్టడం కొట్టడం చెయ్యడం నేరం"
"ఆడు మాకూ లొంగక, మీకూ లొంగక మరెలాగా..."
స్వగతంలో అనుకున్నట్టు పైకే అన్నాడు.
"మీరే ఆలోచించి నచ్చజెప్పి దారిలో పెట్టండి."
"గాడిద కొడుకు నెలకు ఐదొందలు అవసరం అని ముసల్దాన్ని పీక్కుతినేసి పట్టుకు పోతున్నాడు.ఏమంటే ఫీజు కట్టాలంటాడు.."
"మీరు అలా డబ్బులిచ్చే ముందు ఆ ఊళ్ళో మా దగ్గర
చదువుతున్న మరెవరినైనా కనుక్కోండి."
"అలాగే సార్.."
"వాడు చదవడం లేదు. సిగరెట్లు తాగుతున్నాడట.
అమ్మాయిలని ఏడిపిస్తున్నాడని వాళ్ళ అమ్మ నాన్నల కంప్లెయింట్.."
"బాబ్బాబు. పెద్దోరు మీరు వాడ్ని దార్లో పెట్టి పున్నెం కట్టుకోండి. మా ఆడది కూడా సచ్చిపోనాది. ఈడెనక
నాకు ఇద్దరు అడకూతుళ్ళు.. ఈడేదో ఉద్దరిస్తాడనుకొంటే ."
"కొంచెం జాగ్రత్త.."
"సారూ.. మీరే తల్లితండ్రిలా కొంచెం కనిపెట్టండి."
"మా ప్రయత్నంలో మేముంటాం. మీరు కూడా..."
"కాళ్ళకి జోడు లేకుండా తువ్వాలు ముక్కతో ఎర్రటి ఎండలో కూలిపని సేసుకొని అర్దా రూపాయి కూడెట్టి ఆడక్కడ యేటి ఇబ్బంది పడిపోతన్నాడో అనుకొని ఇక్కడ రెక్కలు ముక్కలయ్యేట్టు గొడ్డుసాకిరీ సేట్టుంటే
ఆడికి అగుపడ్డం లేదు..."తిడుతున్నాడు కొడుకుని ఎదురుగా ఉన్నట్టే భావిస్తూ....
"సరే..చెడిపోకుండా జాగ్రత్త గా చూసుకోండి."
"ఆ నాకొడుకు సరిగ్గా సదవకపోతే నాలాగే కూలిబతుకు బతకాలి..."
"మీ ఇష్టం..మేము చదువు మాత్రం చెప్పగలం ..కాలేజీకి వస్తే...అంతకు మించి స్వంత విషయాల్లో దూరలెం కదా.".
"సెల్ ఫోన్ కొనమన్నారు అంటే అప్పోడి డబ్బు తోలానూ
పోరంబోకోడికి.."
"మెమెప్పుడూ సెల్ ఫోన్ తెమ్మనలేదే..."
"అవసరం అన్నాడు పనికిమాలినోడు."
"జాగ్రత్త. వాడికి ఈ సెలవుల్లో బాధ్యత నేర్పండి."
"అట్టాగే సారూ.. నమస్కారం.."
సెలవులకు ముందే శవం వచ్చింది..వలసయ్యది.
సెలవుల్లో బండి వచ్చింది...పళ్లు అమ్ముకొంటూ..
కాలేజీ గేటు ముందు .
వలసయ్య కొడుకు మునెయ్యది.
జీవితం నేర్పే కొత్త పాఠాలకు ఓనమాలు దిద్దుతూ...
***