ఎవరి ప్రేమ గొప్పది? - డాక్టర్ చివుకుల పద్మజ

who's love is great

సాయంత్రం పొద్దు వాలుతోంది. ఎండాకాలం కనుక కాస్త తీవ్రం గానే వుంది. కార్ రోడ్ పక్కకి ఆపాడు శశిధర్. పక్క సీట్ లోని బాగ్ తీసుకోని అందులోంచి స్క్రిబ్లింగ్ పాడ్ తీసి ఎదో రాసాడు. వెనక సీట్ కవర్ తీసుకుని దిగి కార్ లాక్ చేసి తాళాలు జేబులో వేసుకొని అడ్డరోడ్డు లోకి దిగి నడవడం ప్రారంభించాడు. పడమట దిక్కు కేసి నడుస్తున్నాడేమో, ఎండ చిర చిర కి కళ్ళు చిట్లించుకుని తలవంచుకుని సూటిగా నడుస్తున్నాడు. ఊరికి దూరంగా వున్న పొలాలు అక్కడంతా. పొలాల్లోకి దిగి కొంత దూరం నడిచాక ఒక చోట ఆగి చుట్టూ చూసాడు. కోతలన్నీ అయిపోయినట్లున్నాయి, వ్యవసాయదారులు ఎవరూ లేరు. దూరంగా ఒకటి రెండు పశువులు కనిపిస్తున్నాయి కానీ మనిషి అలికిడి లేదు. నిలబడిన చోటున వున్న పొలం తనదే. లోపలి కి నడిచి ఒక మూలగా వున్న చెట్టు కింద కూర్చున్నాడు. ఊళ్లోకి వచ్చి వెళ్లే వాళ్ళకి కనపడే అవకాశమే లేదు. జేబులోని పర్సు తీసి చూసాడు, కాంతి నవ్వుతోంది ఫొటోలో. కళ్ళనీళ్ళతో అలాగే చూస్తుండి పోయాడు.

***

రెండెకరాల చిరు రైతు శశిధర్ తండ్రి. తల్లి చిన్నప్పుడే పోవటం తో, కొడుకును కళ్ళలో పెట్టుకు పెంచుకుంటూ చాలీచాలని వ్యవసాయం పై ఆధారపడి రోజులు కష్టం మీద వెళ్లదీశాడు తండ్రి. శశిధర్ పదవ తరగతి లో వున్నప్పుడు పొలం లో నే పాము కాటేసి చనిపోయాడు తండ్రి. అనాధ గా మిగిలిన శశిధర్ ను చూసి జాలిపడి తన ఇంట్లోనే వుంటూ పనిపాటలు చేస్తూ చదువుకునే అవకాశం కల్పించాడు ఆ వూరిలోకెల్లా స్థితిమంతుడైన వెంకట్రామయ్య. శశిధర్ పొలం కూడా తన పాలెగాళ్ళ తోనే సాగు చేయించసాగాడు.

పదవ తరగతి లో జిల్లా లోనే ఫస్ట్ రావటం తో వెంకట్రామయ్య ముచ్చట పడి శశిధర్ ని తన కొడుకు రఘునాథ్ దగ్గరకి పంపాడు. రఘునాథ్ సిటీ లో స్థిరపడి వివిధ వ్యాపారాల్లో కోట్లు గడించాడు. ఇంటి ముందు పెద్ద గార్డెన్, ఒక పక్కగా అవుట్ హౌస్ వుండే పెద్ద బంగ్లా వాళ్ళది.

శశిధర్ చదువు, ప్రవర్తన చూసి రఘునాథ్ కూడా ముగ్ధుడై తన అవుట్ హౌస్ లో ఉండమని, ఇంటర్మీడియట్ లో చేర్పించాడు. అటు చదువుకుంటూ, ఇటు ఖాళీ వున్నపుడు ఇంట్లోనూ, రఘునాధ్ ఆఫీస్ లోను చేదోడు వాదోడు గా ఉండసాగాడు.

రఘునాధ్ కు ఒక్కతే కూతురు, కాంతి. శశిధర్ తో పాటుదే. ఇంటర్ తర్వాత ఎంసెట్ లో మంచి రాంక్ తెచ్చుకున్నాడు శశిధర్. దాంతో, శశిధర్ ని కాంతి ని ఒకే ఇంజనీరింగ్ కాలేజీ లో చేర్చాడు రఘునాధ్. వాళ్ళు ఎంత మంచితనo గా తనను ఆదరించారో, శశిధర్ కూడా అంతే విధేయం గా వుంటూ వచ్చాడు. తన పనేదో తనది, తన చదువేదో తనది. అంతకు మించి ఎందులోనూ అనవసరం గా కల్పించుకోడు.

ఒక రోజు రాత్రి ఏడు గంటలప్పుడు కాంతి శశిధర్ కోసం అవుట్ హౌస్ కి వచ్చింది. శశిధర్ అప్పుడే రఘునాధ్ కోసం ఇంటికి వద్దామని బయటకు వస్తున్నాడు. ప్రోగ్రామింగ్ లో డౌట్స్ ఉంటే వచ్చానంది కాంతి.

"అయ్యో. నన్ను పిలిపించితే నేనే వచ్చే వాడిని కదా" మొహమాటం గా అన్నాడు శశిధర్.

"పర్లేదులే, నాకు అవసరమైంది కనుక నేను వచ్చాను" అంటూ లోపలి కి దారితీసింది కాంతి.

తన సందేహాలు తీర్చాక ఇద్దరు కలిసి ఇంటి కేసి నడుస్తున్నారు. నవ్వుతూ కాలేజీ విషయాలు మాట్లాడుతోంది కాంతి. తలవంచుకుని వింటూ నడుస్తున్నాడు శశిధర్.

ఇదంతా పైన బాల్కనీ లో నుంచుని గమనించింది కాంతి తల్లి. కాంతి లోపలి కి రాగానే కాస్త కటువు గా "కాస్త అంతరాలు తెల్సుకుని మసలుకో" అంది.

కాంతి ఉక్రోషం గా "ఏంటి మమ్మీ, డౌట్స్ చెప్పించుకుని వస్తున్నాను. రేపు అసైన్మెంట్ సబ్మిట్ చెయ్యాలి" చెప్పి విసురుగా పైకెళ్ళి పోయింది.

ఆ తరువాత ఒకటీ రెండు సార్లు శశిధర్ తో మాట్లాడే సందర్భాలు వచ్చాయి కాంతి కి, దీనితో మరోసారి తల్లి నుంచి మందలింపులు ఎదురయ్యాయి. వద్దు అన్న వాటి మీదే మనసెక్కువ అంటుంటారు కదా, అలాగే వద్దు అనేసరికి అప్పటి వరకు లేని ఆసక్తి, ఆలోచన, ఆకర్షణ కలగసాగాయి కాంతికి శశిధర్ మీద.

అప్పటినుండి అతని పై ఆరాధన పెంచుకుంది కాంతి. కాలేజీ లో నూ, ఇంట్లో ఎవరూ చూడనప్పుడు చనువు గా ప్రవర్తిస్తోంది. శశిధర్ కూడా చలించిన మాట నిజమే కానీ, వాళ్ళెక్కడా తానెక్కడా అని మనస్సుని వెనక్కి లాగేవాడు. కానీ కాంతి పై ప్రేమ నుంచి తప్పించుకోలేకపోయాడు.

ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అప్పుడు ఒక రోజు కాలేజీ బయట గార్డెన్ లో కూర్చున్నారు ఇద్దరు.

"మమ్మీ కి అనుమానం వచ్చింది. వాళ్ళు అనవసరం గా ఎదో అనుకోకముందే చెప్పేద్దాం" అంది కాంతి.

"కాంతీ, నాకెందుకో భయం గా వుంది ఈ విషయం లో" సందేహంగా అన్నాడు శశిధర్.

"ఎందుకు భయం" విచిత్రం గా కళ్ళు తిప్పింది కాంతి.

"నేను మీ నాన్నగారు చదివిస్తే చదువుకున్న వాడిని. అలాంటి తన కూతుర్నే ఇవ్వమని ఎలా అడగను? అడిగినా మీ వాళ్ళు వూరుకుంటారా?"

"అబ్బా శశీ, డాడీ ఏమనరు. చిన్నప్పటి నుంచి నేను ఏది కావాలంటే అది తెస్తారు. పైగా నిన్ను ఎంతో అభిమానిస్తారు కదా! ఒకవేళ అలా అయితే మనమే వెళ్ళిపోదాం" శశి చేయి పట్టుకుంటూ అంది కాంతి.

"అయినా..." నసుగుతున్నాడు శశిధర్.

"అయితే ఏం చేద్దాం? నన్ను వదిలేస్తావా?" కోపంగా అడిగింది కాంతి.

"లేదు. లేదు. నిన్ను వదులుకోలేను" బేలగా అన్నాడు శశిధర్.

"మరింకేం. ఆడపిల్లలాగా భయపడతావ్. నేను చూడు ఎంత ధైర్యం గా ఉన్నానో" తల మీద చిన్న మొట్టికాయ వేసింది నవ్వుతూ.

ఆ రాత్రి భోజనాల సమయం లో విషయం కదిపింది కాంతి. అదిరి పడ్డాడు రఘునాథ్. తల్లి మాత్రం "అనుకుంటూనే ఉన్నానే. ఇలాంటిదేదో చేస్తావని" మొత్తుకోవటం మొదలు పెట్టింది.

రఘునాథ్ నిశ్శబ్దం గానే వున్నా అతని మనసు అల్లకల్లోలం గా వుంది. చేతుల మీద ఎత్తుకొని పెంచిన కూతురు ఇవ్వాళ తన పెళ్లి తానే నిర్ణయించుకునేంత పెద్దదైందా? జీర్ణించుకోలేక పోతున్నాడు.

"కాంతీ, నువ్వు ఇది సరైనదే అనుకుంటున్నావా?" గంభీరం గా అడిగాడు.

"ఎస్ డాడీ, ఇన్నేళ్ళుగా శశిధర్ ని చూస్తున్నావు గా. చాలా మంచి వాడు. అతన్ని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను" రఘునాధ్ పక్క కి వచ్చి కూర్చుని గారం గా అంది. ముద్దుగానే చెప్పినా దృఢత్వం వినిపించింది కాంతి గొంతులో.

నిట్టూర్చి "ఒకే, నాకు కాస్త టైం ఇవ్వరా" బయటపడకుండా అడిగాడు రఘునాథ్.

"నేనేమడిగానా వద్దనవు. ఐ లైక్ యు డాడీ"

ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాడు రఘునాధ్. కూతురు పైన కోపం శశిధర్ మీదకి తిరిగింది. అసలు వాడే దీనికి కారణం. నా బంగారు తల్లి ని మాయ చేసింది వాడే. భార్యా, కూతురు పడుకున్నారని నిశ్చయించుకుని శశిధర్ కి ఫోన్ చేసాడు ఆఫీస్ రూమ్ కి రమ్మని. వచ్చిందే తడవు అతని మీద విరుచుకు పడ్డాడు.

"విశ్వాస ఘాతకుడా. తల్లి తండ్రి లేరని, చేర దీసి చదివిస్తే ఇంత ద్రోహం చేస్తావా?"

ఒణికి పోయాడు శశిధర్. కష్టం మీద మాటలు కూడ తీసుకుని - "నేను చేసింది తప్పే, మీకు ద్రోహం చెయ్యలేను సర్, మీరెలా చెప్తే అలా చేస్తాను" అన్నాడు.

శశిధర్ ఎదురు తిరుగుతాడేమో అనుకున్నాడు మొదట రఘునాథ్. కానీ అతని పరిస్థితి చూసి కొంచెం చల్లపడ్డాడు. శశిధర్ తో తనకు సమస్య లేదు, కానీ విషయం మొత్తం కాంతి మీద ఆధారపడి వుంది. కూతురి మొండితనం తనకు తెల్సు. తాను కాదంటే ఎంతటి అఘాయిత్యం అయినా చేస్తుంది. కూతుర్ని ఎట్టి పరిస్థితి లోనూ వొదులుకోలేడు తాను. చాలా సేపు అలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.

అప్పటికీ అలానే నిలబడి వున్న శశిధర్ కేసి తిరిగి "నేను చెప్పినట్లు చేస్తావా?" అడిగాడు రఘునాథ్.

తల వూపాడు శశిధర్.

***

కాంతి, శశిధర్ ల పెళ్లి చాలా నిరాడంబరంగా జరిగింది. కాంతి ఎంత అడిగినా శశిధర్ ఒప్పుకోలేదు గ్రాండ్ గా చేసుకోటానికి. రఘునాథ్ కూడా "శశి కాదంటున్నాడు" అని చేతులెత్తేశాడు. వేరే ఫ్లాట్ అద్దెకు తీసుకుని అందులోకి మారారు, ఇది కూడా శశిధర్ నిర్ణయం మీదే. క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన జాబ్ సిటీ లోనే వచ్చింది. కాంతి ని జాబ్ చేరద్దన్నాడు శశిధర్. ఇవ్వన్నీ తాను కాదన్నవే అయినా శశిధర్ కు విలువ ఇచ్చి అన్నీ ఫాలో అయిపోయింది కాంతి. శశిధర్ అన్ని నిర్ణయాల వెనక వున్నది రఘునాథ్ అని ఎవ్వరికి తెలీదు.

శశిధర్ ఆఫీస్ కి వెళ్తే, కాంతి కి కాలక్షేపం ఫ్రెండ్స్ తోను, షాపింగ్ తోను. పెళ్లయ్యాక మొదటి నెల క్రెడిట్ కార్డు బిల్ తండ్రి ని పే చెయ్యమంది ఎప్పటిలాగే. కాంతి అకౌంట్ లో చాలా డబ్బు ఉంటుంది కానీ, ట్రాన్సాక్షన్స్ అన్నీ రఘునాథే చూస్తాడు. రఘునాథ్ తర్వాత కాల్ చేసి "బిల్ మీ ఆయనే కడతా అన్నాడమ్మా, నన్ను వద్దన్నాడు" చెప్పాడు కాంతికి.

రాత్రి ఇంటికొచ్చాక శశిధర్ ని అడిగింది కాంతి. శశిధర్ సౌమ్యం గా "అవును కాంతీ, పెళ్లయ్యాక అయన మీద ఆధార పడటం బాగోదు. మనమే చూసుకుందాం. నేను పే చేశాను" చెప్పాడు. అప్పటికి వూరుకుంది కాంతి.

క్రమంగా ఖర్చులు పెరగటం, కొత్త జాబ్ కనుక ఇంకా శాలరీ పెరగకపోవడం వల్ల శశిధర్ కి తలకి మించిన పనౌతోంది డబ్బు విషయాలలో. కాంతి ని కట్టడి చెయ్యలేడు, అప్పటికీ తనంతట తానే కాస్త అర్ధం చేసుకుని ఖర్చులు తగ్గిచింది కాంతి.

అయినా వల్ల కాక మెల్లగా "కాస్త చూసి ఖర్చు చేస్తూవుండు కాంతీ " అన్నాడు. అప్పటికే అడ్జస్ట్ అవుతూ ఉందేమో, ఆ మాటకి మండిపడింది కాంతి. "డాడీ ఇస్తాను అన్నప్పుడు తీసుకోవు, డబ్బుల్లేవో అని గోల పెడతావు" అరిచింది.

ఏమి మాట్లాడలేకపోయాడు శశిధర్. తనని అంత కోరుకుని వచ్చిన కాంతి ని ఇబ్బంది పెట్టడం చాలా బాధ గా వుంది. కానీ పెళ్ళప్పటినుంచి అన్ని విషయాల వెనుక వాళ్ల నాన్నే ఉండి ఆడిస్తున్నాడని చెప్పలేడు కాంతికి. కాంతికే కాదు ఎవరికీ చెప్పలేడు. వెంకట్రామయ్య గారు అన్నా ఉండి ఉంటే బాగుండేది. రెండేళ్ల క్రితమే అయన కాలం చేశారు. నిస్సహాయం గా కుమిలిపోతున్నాడు శశిధర్.

క్రమంగా చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి వాళ్ళ మధ్య. తాను రఘునాధ్ చేతిలో కీలుబొమ్మ. కాంతిని కావాలని గొడవ పడి ఏడిపించలేక, మామ గారికి తాను చేసిన ప్రమాణం మీర లేక వేదన పడుతున్నాడు శశిధర్. ఒక్కక్కసారి కాంతి ని తీసుకుని ఎవరికీ తెలియని చోటుకి పారిపోదామనిపిస్తుంది. కానీ ఎంతో సుకుమారం గా పెరిగిన కాంతి ని కష్టపెట్టలేడు, వెంటనే వెనక్కి తగ్గుతున్నాడు. ఇటు మనసిచ్చిన భార్య, అటు తానిచ్చిన మాట, ఈ రెండిటి మధ్య నలిగిపోసాగాడు శశిధర్.

వీటన్నిటి మధ్య ఒక రోజు సాయంత్రం శశిధర్ ఇంటికి రాగానే కాంతి తీపి కబురు చెప్పింది. తాను ప్రెగ్నన్ట్ అయింది. చాల సంతోషం వేసింది శశిధర్ కి. తన సమస్య కి రాబోయే బిడ్డ పరిష్కారం అవుతాడేమో అని తలచి ఆనంద పడ్డాడు. అంతలోనే మామగారు ఎట్లా రియాక్ట్ అవుతాడా అని భయపడ్డాడు.

శశిధర్ అనుకున్నట్లు గానే రఘునాథ్ ఇది విని మండిపడ్డాడు. ఎప్పటిలాగే కాంతి తో చక్కగా మాట్లాడి, శశిధర్ కి ఫోన్ చేసాడు మర్నాడు ఉదయాన్నే ఆఫీస్ వెంటనే రమ్మని.

"శశీ, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి" గర్జించాడు రఘునాథ్. మాట్లాడలేదు శశిధర్, తలవంచుకున్నాడు. రఘునాథ్ రెట్టిస్తూ "నిన్నే, ఏం చెప్పాను నేను ?"

"నా మీద కాంతి అసహ్యం పుట్టేలా చెయ్యమన్నారు" నెమ్మదిగా చెప్పాడు శశిధర్.

"చేసావా మరి?"

"మా మధ్య గొడవలు అవుతూనే వున్నాయండి" బేలగా అన్నాడు శశిధర్.

"బాగా గొడవలు పడి కాంతి మనసు విరిచేయ్యమన్నాను. నీతో విడాకులు ఇప్పించి తర్వాత నా బిజినెస్ సర్కిల్ లో పెద్ద ఫామిలీ లో ఇచ్చి మళ్ళీ పెళ్లి చేద్దామనుకున్నాను. ఇప్పుడు ఇలా జరిగింది. నా ప్లాన్ అంతా పాడు చేసావు" నిప్పులు కక్కాడు రఘునాథ్.

పెళ్ళికి ఒప్పుకునే రోజే చెప్పాడు శశిధర్ కి. కాంతి ని కాదని తాను చెడ్డవాడు కాలేననీ, అలాగని ఒక అనామకుడితో తన కూతురు సంసారం చేయటం తన కిష్టం లేదనీ, కనుక తాను చెప్పినట్లు చేస్తానని కాంతి మీద ప్రమాణం చేయించాడు రఘునాథ్ శశిధర్ తో. తీరా చేసాక చెప్పాడు కొన్నాళ్లలోనే కాంతి మనసు విరిచేసి విడాకులివ్వాలని, తర్వాత మంచి సంబంధం చేస్తానని. తన బిడ్డ బంగారం లో పుట్టింది, బంగారం లోనే బతుకుతుంది అని తేల్చి చెప్పాడు ఆ రోజు.

కాసేపటి నిశ్శబ్దం తర్వాత రఘునాథ్ " సరే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇదీ ఒకందుకు మంచిదే. కాంతి కి అబార్షన్ చేయించు. ఆ వంక తో విడాకులిప్పిస్తా" అన్నాడు.

చివాలున తలెత్తాడు శశిధర్ "బిడ్డను చంపుకోవడమా, నో ..నో.." అన్నాడు. దుఃఖం సుళ్ళు తిరుగుతోంది అతని గొంతులో. ఎంత ప్రాధేయ పడ్డా రఘునాథ్ తగ్గలేదు.

"వద్దు సార్. అంత పని చెయ్యద్దు. నేనే వెళ్ళిపోతాను మీ మధ్య నుంచి" కళ్ళనీళ్ళతోనమస్కారం పెడుతూ అన్నాడు శశిధర్.

"నథింగ్ డూయింగ్. నేను చెప్పిన పని చెయ్యి" కరాఖండి గా చెప్పి అక్కడినుంచి కదిలాడు రఘునాథ్.

ప్రాణం లేనివాడిలా లేచి బయటకు వచ్చాడు శశిధర్.

పాపం కాంతి. ఎంత ధనవంతురాలు. అయినా తన మీద ప్రేమ పెంచుకుని కన్నవాళ్ళు కాదంటే తన వెంట వచ్చేయటానికి కూడా సిద్ధ పడింది. తండ్రి తో ధైర్యం గా చెప్పి ఒప్పించి తనను చేసుకుంది. మరి తనేం చేశాడు? తనను ఆదరించారన్న విశ్వాసం తో వాళ్లకు తల వంచి కాంతి కి అన్యాయం చేస్తున్నాడు. ముమ్మాటికీ ఇది తన తప్పే. కాంతి అంత ధైర్యం గా తనని ప్రేమిస్తున్నానని చెప్పినప్పుడు తాను మాత్రం ఎందుకు గట్టిగా నిలబడలేకపోయాడు? ఆయనకు సరెండర్ అయిపోయాడు గాని ఎందుకు ఎదిరించి మాట్లాడలేక పోయాడు? తన స్వామిభక్తి ని తనకి, కాంతి కి ప్రాణసంకటం గా మార్చాడు. ఇవ్వాళ తన స్వామిభక్తి కి ఫలితం తన పుట్టబోయే బిడ్డ ని బలి ఇవ్వటమా? ఆ మాటే భయంకరం గా వుంది. ఇంత జరిగినా ఇప్పటికీ కాంతి కి ఇదంతా నీ తండ్రి ప్లానే అని చెప్పలేకపోతున్నాడు, కాంతి మీద ప్రమాణం చేసాడు మరి.

ఇప్పుడెలా? .. ఇప్పుడెలా?... ఆపలేని దుఃఖం, తన నిస్సహాయత మీద కోపం పోటీ పడి శశిధర్ ని నలిపేస్తున్నాయి. ఎటు డ్రైవ్ చేస్తున్నాడో తనకే తెలీట్లేదు. చాలాసేపటి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు.

***

ఇటు కాంతి కంగారు పడసాగింది. పొద్దుటినుండి శశిధర్ ఫోన్ స్విచ్ ఆఫ్. అర్ధరాత్రి కావస్తోంది, ఇంకా ఇంటికి రాలేదు శశి అని తండ్రికి ఫోన్ చేసింది.

ఇక్కడ పని చక్కబెట్టరా అంటే.. కొంపదీసి అన్నట్లుగానే ఎటన్నా పారిపోయాడా ఏంటి ఖర్మ, ఇలాంటప్పుడు కాంతి ని ఒప్పించటం కష్టం.. మనుసులో విసుక్కుని తన ప్రయత్నాలు తాను చేయసాగాడు రఘునాథ్. ఫలితం లేదు. కాంతికి ఆదుర్దా ఎక్కువ అయిపోయింది.

మర్నాడు ఉదయం 8 గంటలప్పుడు ఊరినుంచి రఘునాథ్ ఆస్తి వ్యవహారాలు చూసే శంకరం ఫోన్ చేసాడు. "సార్, పొలం లో..." రొప్పుతున్నాడు.

రఘునాథ్ విసుగ్గా "ఏంటి పొలంలో" అన్నాడు.

"అల్లుడు గారు చనిపోయారండి" ఏడుస్తూ అన్నాడు శంకరం.

"ఏమిటీ?" అరిచాడు రఘునాధ్. అప్రయత్నం గా అడిగాడు "ఎలా?"

"చెట్టుకు ఉరేసుకున్నారండి"… సీట్ కవర్ నడుముకు కట్టుకుని ప్యాంటు తో వురి వేసుకున్నాడు శశిధర్.

"ఆ.." నిర్ఘాంతపోయాడు రఘునాథ్. భార్య, కాంతి ఆత్రం గా అడుగుతున్నారు ఏంటని. "కాంతీ...శశిధర్ సూసైడ్ చేసుకున్నాడమ్మా" చెప్పలేక చెప్పాడు. మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది కాంతి. గబగబా కూతుర్ని పట్టుకుని సోఫా లో కూర్చోబెట్టింది తల్లి.

కాంతి కంట వరద గోదావరి. దాన్ని ఆపటం ఎవరి తరమూ కాదు. కూతురి దుఃఖం చూసాక అప్పటికి వరకూ వున్న బింకం, దురాలోచన, అహంకారం ఒక్కసారిగా జారిపోయాయి రఘునాధ్ లో.

"ఎందుకిలా చేసాడు డాడీ, నిన్న నేను ప్రెగ్నన్ట్ అని చాలా ఆనంద పడ్డాడు డాడీ, ఇలా చేసి ఉండడు డాడీ.. ఏం జరిగిందో.. అసలు అది శశి ఏనా?" కంటికి మింటికి ధార గా ఏడుస్తోంది కాంతి.

కార్ లో సూసైడ్ నోట్ దొరికిందని చెప్పాడు శంకరం.

"కాంతీ, క్షమించు. నిన్ను పెళ్లి చేసుకుని సుఖపెట్టలేకపోయాను. డబ్బు కోసం నీ సరదాలని చంపేసాను. చాలా లోన్లు తీసుకున్నాను. అవి తీర్చలేక మా నాన్న పోయిన పొలం లోనే నేనూ పోవాలని నిర్ణయించుకున్నాను. అన్నీ మర్చిపోయి అమ్మా, నాన్న మాట విని జీవితం లో ముందుకెళ్లాలని కోరుకుంటూ.. నీ శశి".

విన్న రఘునాధ్ కి దుఃఖం ఆగలేదు…కేవలం గొడవలు పడి చెడ్డవాడిగా కనిపిస్తే కూతురికి విడాకులు ఇప్పించి మంచి స్థితిపరుల కుటుంబం లో ఇద్దాం అనుకున్నాడు గాని, వాళ్ళ ప్రేమ ను కొంచెం కూడా అర్ధం చేసుకోలేకపోయాడు. చిన్నవాళ్లకి ప్రేమ ముందు ముందు నిలవదు లే అని తేలిగ్గా తీసిపారేసాడు. అర్ధం పర్ధం లేకుండా ప్రవర్తించి కూతురు కాపురం కూలదోశాడు. అరచేతిలో పెట్టుకు పెంచిన కూతురి నుదిటి కుంకుమ తానే తుడిచేసాడు. అనాధ అని చేరదీసి చదువు చెప్పించామని ఎంత విశ్వాసం గా వున్నాడో, తన ప్రేమను త్యాగం చేసి తనకు దక్షిణ గా వదిలేసాడు శశి. తనేమో ఆస్తి లోనే సుఖం వుందని నమ్మాడు. ధనగర్వం తో కళ్ళు మూసుకుపోయాయి. తనకు లేదా ఆస్థి? తన తర్వాత అంతా కాంతి దే కదా. ఈ లాజిక్ మిస్ అయ్యాను. చేతులారా అల్లుడ్ని చంపుకున్నాను. ….. ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పుతున్న కూతుర్ని పట్టుకుని మరింత విలపించాడు రఘునాథ్.

ఒక తండ్రి అయి ఉండి తన కూతురి మీద ప్రేమతో వాళ్ళ బిడ్డని చంపుకోమన్నానే.. అయ్యో.. "తప్పు చేశాను శశీ.. నాయనా.. కాంతి ని వదిలేసి వెళ్ళకయ్యా" పిచ్చి పిచ్చి గా అరుస్తూ ఏడుస్తున్నాడు రఘునాథ్.

ఎంత ఏడ్చినా పోయిన ప్రాణం తిరిగి రాదు. తన బిడ్డ కోసం ఎదురు వాళ్ళ బిడ్డని చంపడానికి సిద్ధపడ్డ ప్రేమ రఘునాథ్ ది అయితే, ఎదురు వాళ్ళ బిడ్డ కోసం, తన బిడ్డ కోసం తనను తాను చంపుకున్న ప్రేమ శశిధర్ ది. ఎవరి ప్రేమ గొప్పది?

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు