తొలి స్పర్శ - భాగ్యలక్ష్మి అప్పికొండ

the first touch

‌"ఏవే మనవరాల ఇటువైపు రావట్లేదు" అంది అరుగుమీద కూర్చుని చేటలో ఊరి నుంచి తెచ్చుకున్న బొబ్బర్ల లో రాళ్లేరుకుంటున్న బామ్మ .నీరసంగా కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న అమ్మాయిని "ఏవే మనవరాల ఇటువైపు రావట్లేదు" అని మళ్ళీ అంది.

"పరీక్షలు దగ్గర కొస్తున్నాయిగా ప్రోజెక్టు వర్క్ చేసుకుంటున్నా ...అందుకే కొంచెం బిజీ" అంటూ అరుగు మీద బ్యాగు పెట్టి చతికిల పడింది రాధ.
"ఇదిగోనే పిల్లా" అని గ్లాసు నిండగా ఉన్న మజ్జిగ రాధకి ఇచ్చి "నేనింకా నీ పెళ్ళి ఏర్పాట్లు అనుకున్నానే రాధమ్మా!"


ఈ కాలం లో కూడా పెళ్లి అనగానే కన్నెపిల్ల బుగ్గల్లో సిగ్గు పూలు వికసిస్తున్నాయి.

‌‌ "ఎందుకే అంత సిగ్గు మా మనవడు వచ్చేవరకు దాయు" రాధ బుగ్గలు పుణుకుతూ బామ్మ అంది.
"దాయక ఏం చేస్తాను మా ఫ్రెండ్స్ చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ అని, చాటింగ్ ఇంకా చాలా చాలా అని తిరుగు తుంటే నేనేమో బామ్మా! ....బామ్మా! అని నీ చుట్టూ తిరుగుతున్నా" నిష్టూరంగా అంది.

"బాయ్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ నేనిస్తాలే గాని ముందు ఆ చదువేదో పూర్తి చెయ్" అని ఒక మొట్టికాయ్ వేసింది.

‌‌. "అదేంటి బామ్మా !! అలా అంటావ్... బాయ్ ఫ్రెండ్ తో ఎంటర్టైన్మెంట్ ఒకటేనేంటే బామ్మా!...ఇంకా చాలా ఉంటాయి " అని చిన్నగా కన్ను కొట్టి నవ్వింది రాధ.
"అల్లరి పిల్లా! ఆ చాలా లే వద్దనేది అదేదో రిసేర్చ్ చేస్తాను.నేనేంటో నిరూపిస్తాను, ఊడపొడుస్తాను, ఈ దెబ్బతో అందరిని ఊడ్చెస్తాను అన్నావ్ కదా!. ఎంతవరకు వచ్చింది? " అని గట్టిగా అడిగింది బామ్మ.

"చివరి వరకు వచ్చింది.....అయిపోవచ్చింది" అని సాగదీస్తూంది.

"ఈ సాగతీత లు నా దగ్గర కుదరవు సాధించి చూపించవే రాధ!" అంటూ రాధ చేతిలో కాసిని వేరుశెనగ గుళ్ళు వేసింది.

నేను సాధిస్తాను గాని నన్ను సాధించకే! ఈ రోజు సరదాగా ఏదైనా కధ చెప్పు బామ్మా!

అలాగే! అని స్మార్ట్ ఫోన్ తీసింది బామ్మ

అదేంటి బామ్మా స్మార్ట్ ఫోన్ తీశావ్...నేను చదువుకోలేనా ఏంటి నీ సొంత కథలు చెప్పు.

ఏంటి రాధమ్మా నా మీద పడ్డావ్ ! అయినా నేనేం కథ చెప్తాను

చెప్పు బామ్మా! నీ కథ చెప్పు

"నా దగ్గరేం కథలు ఉంటాయి మీ దగ్గర వుంటాయి బ్రేక్ అప్ లు, ప్యాచ్అప్ లని వేల కధలు" అంది బామ్మ మూతి తిప్పుతూ.

మరేం చేస్తాం బామ్మ! అది మా ట్రెండ్ గాని, నీ తొలిప్రేమ కధ చెప్పవే.

నా తొలి స్పర్శ కథ చెబుతా

అదేంటి బామ్మా!

మీరంటే గొప్పవాళ్ళు, మహానుభావులూను మనసులు చూసి ప్రేమిస్తారు. నేనైతే ఇప్పటికి ఆ తొలిస్పర్శనే ప్రేమిస్తానే పిల్లా.

"నాకు అర్థం కాలేదు బామ్మా! అయినా కథ చెప్పు" అని బ్రతిమిలాడింది రాధ, బామ్మ బుజాల చుట్టూ చెయ్యి వేసి.

"కధ చెబుతా గాని ఆ చెయ్యి తీయవే! అసలే పాతికేళ్ల నాటి ఉప్పాడ చీర....మీ తాత కాకినాడ" అని బామ్మ చెబుతుండగా

"బామ్మా! ఆ చీర గురించి తరువాత చెబుదువుగాని. అదేదో కథ అన్నావు గా అది చెప్పు" అంది రాధ ముద్దు గా అడిగింది .

"నేను అప్పుడు బి.ఎ. సెకెండ్ ఇయర్.
కాలేజీ కి వెళ్ళాలంటే పొలం గట్లన్నీ దాటుకుని ఊరి చివరవరకు వెళితే అక్కడ ఒక మట్టిరొడ్డు వుండేది. అక్కడకి ఒకే ఒక్క బస్సు వచ్చేది. ఆ బస్సు రోజుకి రెండు సార్లు మాత్రమే వచ్చేది. ఆ రోడ్డు కి ఆనుకుని శీను గాడి టీ కొట్టు ఉండేదీ. వాడు టీ బాగా చేస్తాడని పేద్ద పేరు. అప్పట్లో మీ అంత ఫ్రీడమ్ లేదు మాకు. కొట్టు దగ్గర కెళ్ళి టీ తాగితే ఎవరైనా ఏమైనా అనుకుంటారని అటువైపు చూసే దాన్నే కాదు.

నా జడ నల్ల త్రాచులా ఉందని కాలేజీలో అబ్బాయి లు నా చెవికి వినబడేటట్టు గుసగుసగా అనుకునేవారు. నేను దానికి బదులుగా నా గుండెల్ని అంటి పెట్టుకున్నా పుస్తకాలకు మాత్రమే వినబడేట్టు నవ్వుకునేదాన్ని.

"ఆ కళ్ళు చూస్తూ కలకాలం బ్రతికేయేచ్చురా బావ" అని ఒకడు రోజులో ఒకసారైనా అనేవాడు కాని నేనెప్పుడూ వాడిని కన్నెత్తి చూడలేదు. కాలేజీ లో అనుకోకుండా చూసి చూడక చూడాల్సి వచ్చినా మొహాం తిప్పేసుకునేదాన్ని.

మా ఊర్లో ఒక నాట్య గురువులు ఉండేవారు మా నాన్నని ఎంతో బతిమిలాడి తే " నేనెప్పుడు చెబితే అప్పుడు మానేయ్యాలి" అనే షరతు పెట్టి నాట్యం నేర్చుకోవడానికి ఒప్పుకున్నారు.

"నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాం ఈ చుట్టుపక్కల పది ఊళ్ళలో ఆసామి అయిన అప్పల నాయుడు గారి కొడుకు విశ్వనాథంతో " అని చెప్పి పొలానికి వెళ్ళిపోయిడు మా నాన్న

నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అలా అని మా నాన్నని ఎదిరించనూలేను.

ఒక రోజు నాట్యం నేర్చుకోవడానికి వెళ్ళి వచ్చేటప్పుడు. మా నాన్నకి పొడ పాముకుట్టింది అని దారిలో సుబ్బయ్య చెప్పాడు.

విషం తీసి కట్టుకట్టి మంత్రం వేసి పాములయ్య ప్రమాదం ఏమి లేదన్నాడు కాని ఆరునెలలు పథ్యం ఉండమన్నాడు మాంసాహారం ముట్టొదని చెప్పి వెళ్ళిపోయాడు.

తర్వాత రోజు నేను కాలేజ్ కి వెళ్ళలేదు .ఎప్పుడూ చలాకిగా తిరిగే మా నాన్నని అలా చూడటం వలన మనసు బాధగా అనిపించి భరించలేనంత తలనొప్పి వచ్చింది. వెంటనే ఎరుపు - నలుపు లంగా ఓణీ వేసుకొని తలంతా నూనే పెట్టుకున్నా. మా ఫ్రెండ్ బారు ఇంటికి వచ్చింది అదే భారతి నీకు తెలుసు కదా!. తెలుపు కుంకుమ రంగు లంగా ఓణీ వేసుకొని నా అంత పెద్ద జడ కాదు గాని ఉన్నంత లో బాగా జడవేసుకుని సంపెంగ లు తురుముకొని భలే అందంగా తయారయింది

మా అమ్మ అంతలో హాడావుడిగా "ఏవే పెళ్లికొడుకు వస్తున్నాడు ఇప్పుడే చూశాను మీ నాన్నని చూడడానికి అనుకుంటా, నువు కాస్త మొహం కడుక్కోవే" అని చెప్పి వంట గదిలోకి వెళ్లి పోయింది.

నాకప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగా జిడ్డావతారంలో ఉన్నా కదా! ఇదే అవతారంలో మా నాన్న గదినుంచి బయటికి వచ్చే లోపు ఏదోలా తారసపడితే అటునుంచి అటే పెళ్లి కొడుకు పారిపోతాడనిపించింది‌.

వెంటనే అమలులో పెట్టడానికి మా నాన్న గది దగ్గరే నుంచున్నా. నాతో పాటు బారు కూడా పక్కనే నుంచుంది. నేననుకున్నట్టే అతను బయటికి వచ్చాడు. నేనేదురుగా వెళ్ళి వెర్రి నవ్వు నవ్వ బోయి ఒక్కసారిగా ఎవరో మంత్రం వేసినట్టుగా ఆగిపోయాను.

మొదటి సారి ఒక అబ్బాయిని చూడాలి అనిపించింది. ఇతను నా వాడు అనిపించింది.
ఆ కొద్ది క్షణాలలోనే ఎన్నో జన్మల బంధం మళ్ళీ గట్టిగా ముడిపడ పోతుందా అనిపించింది. పక్కన ఇదెందుకు పానకంలో పుడకలాగా అని బారుని గట్టిగా కాలుపెట్టి తన్నాలనిపించింది. అతను నన్ను చూసినంత సేపైనా ప్రపంచంలోని అందమంతా నా ఒక్కదాని సొంత మైతే బాగుండు అనిపించింది. కాని తింగరి మాలోకాన్ని నేనే జిడ్డావతారంలో ఇటు కావాలని వచ్చా అని నన్ను నేనే తిట్టుకున్నా.

అతను ఒక్క క్షణమే నావైపు చూసి వెళ్ళి పోయాడు.

నాకైతే అతన్ని చూసిన తర్వాత చదువు, గిదువు ఏమి వద్దు, అతనితో జీవితాన్ని పంచుకుంటే చాలనిపించింది.

"ఏవే పద్మా! మొన్న పెళ్లి కొడుకు ని చూసావా? పదిహేను రోజుల్లో పెళ్లి. బావ గారి నాన్న గారికి బాగులేదంట మనవడి పెళ్లి చూడాలని ఆశ పడుతున్నారట.." అని అక్కడే మండువా లో వున్న నాకు వినిపించే పట్టుగా చెప్పి వెళ్ళిపోయారు నాన్న.

ఆ విషయం విని నాకు ఆనందంగా అనిపించింది. ఇంతకీ నన్ను చూసి ఒప్పుకున్నాడా? బారుని చూసి నన్ననుకున్నాడా? అసలు అతనికంటూ ఒక అభిప్రాయం ఉందా? ఎవరైతే ఏంటి తాళికడితే చాలు అనుకుంటున్నాడా? ఇన్ని ప్రశ్నలు నా మెదడులో తొలుస్తున్నాయి, నా మనసులో మట్టుకు ఆయన రూపు, నిలుచున్న తీరు...ఆ చూపులోని స్పష్టత, గాఢత ఎన్నో కబుర్లు చెప్పాయి. కాని ఇంకా ఏదో సంశయం.

రెండు రోజుల తర్వాత ఎదురింటి రావయమ్మ మనవడు చడ్డీ వేసుకొని, చీవుడి ముక్కు కార్చుకుని, ఒక నోట్లో వేలు పెట్టుకొని చీక్కుంటూ నా దగ్గర కొచ్చి ఒక చీటి ఇచ్చి , నా బుగ్గ పై ముద్దు పెట్టి పరిగెట్టి పారిపోయాడు. ఆ చిటీ తీసుకున్న ఎవరైనా చూస్తారేమో అని జాకెట్లొ పెట్టేసి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని చదవడం మొదలు పెట్టా సినిమాలో లా మంచం మీద బోర్లా పడి చదువుదామని అనిపించింది కాని మా అమ్మ తలుపు కొట్టేస్తుంది.

"ఆ అమ్మ వస్తున్నా! " అంటూ చదివా

"అరుంధతి సాయంత్రం 4 గంటలకి ఎలా అయినా శీను గాడి టీ కొట్టు దగ్గర కి రా.ఉత్తరం చివర్లో బుజ్జి గాడు ఇచ్చిన ముద్దు నాది. వెనక వైపు పెళ్లి కొడుకు విశ్వనాథం " అని రాసుంది ఆ చివరి వాక్యం చదువుతున్నప్పుడు నా ఋగ్గలు ఎరుపెక్కి, నా పెదవులపై చిరునవ్వు విరిసింది. మొదటి సారి నా అంతరాంతరాలని ఎవరో సున్నితంగా మీటుతున్న భావన కలిగింది.

చిలక ఆకుపచ్చ ,లేత గులాబిరంగు లంగా ఓణీ వేసుకొని. వాలు జడ అల్లి. ఒకే ఒక్క గులాబి పెట్టి మా అమ్మ పెట్టెలో వున్న జవ్వాది పూసుకున్నా. అందంగా కుంకుమ దిద్దుకున్నా, కాటుక పెట్టుకున్నా. అద్దంలో ఎంత సేపు చూసుకున్నా, దేవుడా! ఇంకాస్త అందం నాకిచ్చుంటే నీ సొమ్ము ఏమైనా పోయేదా అని తిట్టాలనిపించింది.

"అమ్మా ! నేను బారు వాళ్ళింటికి వెలుతున్నా" అన్నాను. మా అమ్మ నా దగ్గర గా వచ్చి "ఎక్కడికెళ్లినా నీ జాగ్రత్తలో నువ్వుండి త్వరగా ఇంటి కి రా!" అని అన్నీ తెలిసి తెలివిగా హెచ్చరించినట్టుగా చెప్పింది.

నేను బయల్దేరాను పోలాల గట్లు దాటుతుంటే ఎవరో నన్ను అనుసరిస్తున్నట్టుగా అనుమానం వచ్చింది. నా కొక్క సారి గుండెల్లో రాయి పడినట్టనిపించింది.

త్వరత్వరగా నడవడం మొదలు పెట్టాను. వెనక నుంచి ఇంకా త్వరత్వరగా అడుగులు పడుతున్నాయి. ఇంకాస్త దూరం వెళితే రొడ్డు వస్తుంది భయం ఉండదని పరిగెట్టినట్టు నడిచి ఎలా అయితేనేం రొడ్డు చేరుకున్నా.

"ఎందుకంత భయం! కనీసం వెనుక ఎవరున్నారో చూడకుండా భయపడి పరుగులు పెడతావే" అని వెనకనుంచి మార్ధవంగా ఒక స్వరం.

ఎవరా! అని వెనక్కి తల తిప్పి చూశా! అతను అతనే నా జడ వైపు చూస్తున్నాడు వెంటనే ఆ జడని ముందుకి వేసి "మీరని చెప్పొచ్చుగా "అన్నా.

"నువ్వు పరిగెడుతుంటే నీ జాడ నాతో మాట్లాడుతూ ఆ విషయం నీతో చెప్పనివ్వలేదు ....నేనేం చెయ్యను " అని వెనక్కి నుంచి చెవిలో గుసగుసగా చెప్పాడు.

ఆ గుసగుసల మాటున తగిలిన ఆ వెచ్చని ఊపిరి గిలిగింతలు పెట్టింది. అప్రమేయంగా నా భుజం పైకి లేచి నా చెవికి తాకింది. ఏదో తెలియని తమకం నాలో నేనే తమాయించుకుని అతను చూడలేదుగా, ఆ! వెనకే ఉన్నాడులే అని అనుకునే లోపు నా ఎదురు గా అతను నాకు అన్నీ తెలుసు లే అన్నట్టుగా నవ్వుతూ నిల్చుని ఉన్నాడు.

"అరుంధతి రా! టీ తాగుదాం" అన్నాడు.

"అమ్మో! ఊర్లో ఎవరైనా చూస్తే బాగోదు. అదిగో అటువైపు ఉన్న మామిడి చెట్టు దగ్గర కి రండి. నేను ముందు వెళ్తాను మీరు తర్వాత రండి. ఐదు నిమిషాలే మాట్లాడి వెళ్ళిపోతాను" అని వెంటనే ముందుకి కదిలాను.

మామిడి చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా పిందెలు ఉన్నాయి. ఎక్కడో కొమ్మ చాటు కోయిలమ్మ తియ్యగా కూస్తుంది. ఆ కూత నాకు పాటలా వినిపిస్తుంది. చల్లని వసంత గాలులకి నా పైట సైయ్యాట ఆడుతున్నట్టుంది. అప్పుడు టీ గ్లాసులతో మన్మథుడొచ్చాడు అదే అతనొచ్చాడు. ఇదిగో టీ అంటూ వేడి వేడి టీ చేతికి అందించాడు అంతకంటే వెచ్చని మునివేళ్ళ స్పర్శతో.

శీను గాడి టీ మొదటి సారి తాగటం అది కూడా నచ్చిన నా మనిషితో, నా వాడితో నాలో ఏదో గర్వం, ఆనందంతో కూడిన పారవశ్యం కాని అవేవి నా మొహంలో కనబడనివ్వలేదు.

ఎన్నో అడుగు దానుకున్నా ఏమి అడగలేకపోయా! ఎందుకంటే ఇప్పుడు అతని సాన్నిహిత్యం మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను చేరవేసింది.

"మీ నాన్నగారు మొన్న నన్నొక పెళ్లి లో చూసి నచ్చి మా ఇంటికొచ్చి పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారట" అని చెప్పాడు నా కళ్ళలోకి చూడటానికి ప్రయత్నిస్తూ.

నేను కళ్ళు ఎత్తకుండానే "ఊ" అన్నాను.

"మరి ఏ పెళ్లిలో ఎలా చూశారు అని కాస్త తలయెత్తి అడగొచ్చు కదా " అని బ్రతిమిలాడినట్టుగా అడిగాడు.

నేను తలెత్తి "ఎక్కడ? ఎలా ?" అని ముక్తసరిగా అడిగి తలదించుకోపోతుంటే.

"సంధ్య సమయంకదా! చీకటి పడేట్టు వుంది ఆ తల ఎత్తే ఉంచు" అన్నాడు అనునయంగా

ఆ భావుకత కి నాలో నాకే నవ్వొచ్చింది.

"మీ నాన్నగారు మొన్న నా స్నేహితుడి పెళ్లి లో చూశారు. నేను ఆ రోజు సూటు బూటు వేసుకన్నానులే...మీ నాన్నగారు గనుక పెళ్లి సంబంధం మాట్లాడారు...అదే నువ్వైతే? " అంటూ ఒక నువ్వు నవ్వి ఆగిపోయాడు.

"నేనైతే....ఏంటి చెప్పండి" అని నెమ్మదిగా అడిగాను.

"నా ఒళ్ళో వాలి ఉండేదానివి" అని చిలిపిగా నావైపూ చూశాడు.

నాకు మా గొప్ప ఉక్రోషం వచ్చింది నా మనసెలా కనిపెట్టాడాని కాని పైకి కాస్త కోపం నటించాను కాని అది నటనే అని తనకి తెలుసు అన్నట్టుగా నా వైపు చూసి నవ్వుతున్నాడు. ఆ నవ్వులు ఆ చూపులు క్షణాల్లో వేల ప్రేమలేఖలు అందించాయి.

నేను వెళ్ళాలి అని మూడు నిమిషాలలోనే బయల్దేరాను ఈ సారి మోయలేనంత ఆనందాన్ని ఎదలో దాచుకునీ.‌ ఎగసే కలలతో, ఎరుపెక్కిన బుగ్గల తో, లోలోపలే ముసిముసిగా నవ్వుకుంటూ" ఇదేనే నా కధ రాధమ్మా!

బామ్మా! ఏదో తొలిస్పర్శ అన్నావ్

చెప్పా కదే మునివేళ్ళ స్పర్శ అని

అదా!

"అవును అదే! ఇప్పటికీ ఆ స్పర్శ తలుచుకుంటే నా ఒళ్ళు పులకరిస్తుంది. ఆ స్పర్శే కదా! నా మొదటి తీపి జ్ఞాపకం. ఆ తర్వాత ఆ అనుబంధమే బిడ్డలని, వారి ద్వారా మనవడు, మనవరాలు, ముని మనవళ్ళు ఇలా నా వంశాన్ని వృద్ధి చేసింది.

అందుకే మన సంస్కృతి లో నమస్కరిస్తాం. అవసరమైతే నే చేయుతనిస్తాం, చేయందిస్తాం తప్ప ఊరికూరీకే షేక్ హ్యాండ్ ఇవ్వం.

మంచిదైనా, చెడుదైనా స్పర్శ యొక్క స్మృతి చిరకాలం మనతో పయనిస్తుంది .

మనం స్పృహ తో కోరుకునే స్పర్శ ఎప్పుడూ ఎదపై చెక్కిన మధుర జ్ఞాపకం, తేనే సంతకం" అని చెప్తూ డభై ఏళ్ళ మన బామ్మ అరుంధతమ్మ పద్దెనిమిది ఏళ్ళ అరుంధతిలా ఊహాలోకంలో పయనిస్తూ ముసి ముసి గా నవ్వుకుంటుంది‌.

"బామ్మా! ఇంతకీ శీను గాడి టీ రుచి ఎలా ఉందో చేప్పనేలేదు " అని చిన్న గా కన్ను గీటి అడిగి మళ్ళీ
" అయినా నీకు ఆ రుచేం తెలుసుంటుందిలే నాకు చెప్పటానికి" అని రాధ అనే లోపే

"అమ్మ అల్లరి పిల్లా! కాస్త ఆగు నీకు తెలుస్తుంది లేవే !" అని బామ్మ రాధ తల మీద మొట్టికాయ కొట్టే లోపే బామ్మ చేతికి చిక్కకుండా రాధ ఇంటి దారి పట్టింది లేలేత సిగ్గుల బుగ్గల ముసి ముసి నవ్వులతో

భాగ్యలక్ష్మి అప్పికొండ

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు