అనగనగా ఒక ఊరిలో విశ్వేశ్వరయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు. ఒక సాయంత్రం అతను చనిపోతూ కొడుకులిద్దరినీ పిలిచి, "నేను మీ ఇద్దరికి రెండు మొక్కల్ని ఇస్తాను. అవి--" అని చెప్తుండగా మధ్యలో ఆపి పెద్దవాడు, "ఏందయ్య నీ బోడి మొక్కలు మాకిచ్చేది. చచ్చేముందు దగ్గరకు పిలిచి చెప్తుంటే ఎదో బంగారపు మూట గురించి చెప్తావనుకున్నా!" అని వెటకారంగా అన్నాడు. చిన్నవాడు మాత్రం ఏమీ మాట్లాడకుండా తండ్రి మాటలను జాగ్రత్తగా వింటున్నాడు. "అదే చెప్తున్నా వినరా!" అని తండ్రి చెప్పసాగాడు. "ఇది అన్ని మొక్కల మాదిరి కాదు. దీనిలో చాలా విశేషం ఉంది. దీనిని ఒక్కసారి నాటిన తరువాత ఏదో ఒక సారి, నాటినవాడు ఆ మొక్కని ముట్టుకుంటూ ఒక కోరికను అడగవచ్చు. ఆ కోరికను అది తీర్చుతుంది. అయితే ఆ కోరిక తీర్చిన వెంటనే ఆ మొక్క మరణిస్తుంది. కనుక కోరిక ఆడిగేముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి అడగండి. తెలివిగా అడగండి." అలా చెప్పి వారిద్దరి చేతిలో ఒక్కొక్క మొక్క పెట్టి అతను నవ్వుతూ మరణించాడు. దహన కార్యక్రమాలన్నీ పూర్తి చేసేసరికి రాత్రి అయ్యింది. చిన్నవాడు తనకిచ్చిన మొక్కను తన ఇంటి పెరట్లో నాటి తన భార్యతో ఇలా చెప్పాడు, "చూడు భారతి, ఈ మొక్కను నాన్నగారు చనిపోతూ నాకు ఇచ్చారు. ఇది అతని జ్ఞపకం. కనుక దీనిని మనం జాగ్రత్తగా చూసుకుందాం." వెంటనే ఇద్దరూ నిద్రపోయారు. పెద్దవాడు కూడా అతని మొక్కను అతని పెరట్లో నాటి అతని భార్యతో ఇలా అన్నాడు, "చూడు లక్మి, నీవు బోడి లక్మివి, కానీ ఈ మొక్క మన ఇంటికి నిజమైన లక్మిని తీసుకురాబోతుంది." "ఏమి చెబుతున్నారండి?" ఆశ్చర్యంగా అడిగింది లక్మి. "ఈ మొక్క మన కోరికను తీర్చుతుంది. కాకపోతే మనం కోరిక అడిగిన వెంటనే అది తీర్చి చచ్చిపోతుంది." "అయ్యో! ఇది మీ నాన్నగారు చనిపోతూ మీకు ఇచ్చిన బహుమానం. దీనిని అతని జ్ఞాపకార్థంగా ఉంచుకుందాం. మనం ఎప్పుడూ మన కోరికల్ని దానిని అడగొద్దు." అంటూ ఆ మొక్కకు నీరు పోసింది. "నీ బోడి సలహా ఎవడడిగాడు!" అంటూ పెద్దవాడు తన పడక గదికి పోయి మంచంపై వాలాడు. అతడికి ఏంతసేపైనా నిద్రపట్టడంలేదు. ఆ మొక్కను ఏమడగాలా అని ఒకటే ఆలోచన. అలా ఆలోచనతోనే అర్ధరాత్రి దాటింది. ఇక లాభంలేదని వెంటనే ఎదో ఒక కోరికను ఆ మొక్కను ఆడిగేయ్యాలని నిశ్చయించుకున్నాడు. గదినుంచి బయటకు వెళ్తూ నిద్రపోతున్న భార్యను చూస్తూ, తనని నిద్రలేపి ఏమి కోరిక కోరితే బాగుంటుందని అడిగితే బాగుంటుందని అనుకున్నాడు. కానీ ఆమె ఇచ్చిన సలహా గుర్తొచ్చి ఎలాంటి శబ్దం లేకుండా పెరట్లోనికి చేరుకున్నాడు. ఆ మొక్కను పట్టుకుని తనకు వంద కిలోల బంగారం ఇవ్వమని అడుగగా, ఆ మొక్క తానడిగింది ఇచ్చి వెంటనే చనిపోయింది. ఆ మొక్కను బయటకు విసిరేసి బంగారాన్ని సంచుల్లో ఇంటి లోపలకి తీసుకుపోయి అటకు పైన దాచాడు. మరుసటి రోజు పెరట్లో మొక్క లేకపోయేసరికి లక్మి భర్తకి ఎన్నో చీవాట్లు పెట్టింది. కానీ అవేవి అతను పట్టించుకోకుండా ఎంతో ఆనందంగా పొలానికి పోయాడు. వారానికొకసారి కొంత బంగారం అమ్ముతూ కొన్ని నెలల్లోనే చాలా ధనవంతుడయ్యాడు. తన ఒక్కగానొక్క కొడుకు అశోక్కి ఏది కావాలంటే అది కొనిచ్చేవాడు. అలా కొంత కాలానికి కష్టపడుతూ పనిచేసే అశోక్ కావాల్సిందంతా సులభంగా దొరుకుతుండటంతో సోమరిపోతుగా తయారయ్యాడు. అది చూసి అతని తల్లి చాలా బాధపడుతూ అతడికి బోధపడేలా చెప్పడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. గర్వం, అసహనం, అమర్యాద వంటి దుర్గుణాలన్ని అశోక్ చెంతలో చేరాయి. చిన్నవాడికి కూడా ఒక్కడే కొడుకు. అతడి పేరు మన్విత్. అతడు తన తల్లిదండ్రుల బాటలోనే ఎప్పుడు నడుచుకునేవాడు. ఒక మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. కొంత కాలానికి ఇద్దరు పిల్లలు పెద్దవారయ్యారు. అశోక్ కి ఎటువంటి ఉద్యోగం లేదు. ఉన్న డబ్బులనంతా ఖర్చుపెట్టేసాడు. రోజులు మారాయి. ఉద్యోగం ఉంటేనే పిల్లనిచ్చే రోజులవ్వటంతో అశోక్ కి నలభై సంవత్సరాలొచ్చినా పెళ్లి అవ్వలేదు. మన్విత్ మాత్రం ఎంతో కృషితో కలెక్టర్ అయ్యాడు. పెళ్లి చేసుకుని తన కూతురితో ఎంతో సంతోషంగా ఉంటున్నాడు. ఇంతలో, చిన్నవాడికి స్వర్గానికి పోయే సమయం వచ్చిందని అర్థమవ్వటంతో, తాను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న చెట్టు వద్దకు వెళ్లి దానిని ముట్టుకుని, "నా తండ్రి నాకు ఇచ్చిన మొక్క ఒకటి నాకు ఇవ్వు!" అని చెప్పగా ఆ చెట్టు నవ్వుతూ ఆనందంగా అతడి చేతిలో ఆమె బిడ్డ అయిన చిన్న మొక్కని పెట్టి ఆనందంగా మరణించింది. ఆ చెట్టుని పాతిపెట్టి ఎంతో గొప్పగా అంత్యక్రియలు జరిపించాడు చిన్నవాడు. ఆ తరువాత, ఆ చిన్న మొక్కను తన కొడుకైన మన్విత్ కి ఇచ్చి, తన తండ్రి తనకి ఏమైతే చెప్పాడో, అవే మాటల్ని అతనికి చెప్పి, ఎంతో ఆనందంగా కన్ను మూసాడు. ఇదంతా చూసిన పెద్దవాడు, తాను చేసిన తప్పేంటో, తన ఆలోచన ఎంత మూర్ఖమైనదో తలచుకొని ఏడ్చాడు. ధనం గొప్పదే! కానీ దాని కంటే తల్లిదండ్రుల జ్ఞాపాకాలు ఇంకా గొప్పవని, సమయంతో ధనం విలువ క్షీణించొచ్చు, కానీ తల్లిదండ్రులు ఇచ్చిన జ్ఞాపకాలకు ఎప్పటికీ క్షీణత ఉండదని అప్పుడు తెలుసుకున్నాడు. కానీ అప్పటికే సమయం దాటిపోయింది.