రామయ్య ఒకపేద రైతు.తనకున్న ఒక్క గుర్రంతో పొలంపనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తుండే వాడు.రామయ్య ఇరుగు పొరుగున వీరయ్య, సోమయ్య అని ఇద్దరు గృహస్థు లుండేవారు . వీళ్లద్దరు అంతొ ఇంతొ ఉన్న వాళ్ళే .కాని ప్రతి చిన్న విషయానికి కంగారు పడి పోతుంటారు. పేద వాడయిన రామయ్య అంత ప్రశాంతంగ ఉం డటంవాళ్లకి కంటగింపుగా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు రామయ్య గుర్రం అడవులెంబట పడి కనిపించకుండా పోయింది. విషయం తెలిసిన వీరయ్య, సోమయ్య లుఇదే మంచి సమయమని,రామయ్య ను పరామర్శించను వెళ్లారు,"అయ్యో రామయ్యా నీగుర్రం కనిపించకుండా పోయిందటగా..ఎంత దురదృష్టం ," అన్నారు లేని విచారం నటిస్తూ.
రామయ్య తాపీగా,"దురదృష్టమో,అదృష్ట మో ఎవరికి తెలుసు,ఎలా జరగాలని వుంటే అలా జరుగుతుంది,"అన్నాడు నిర్లిప్తంగా . వీరయ్య, సోమయ్య లు బయటికొచ్చి ," వీడిదుంపతెగ,గుర్రంపోయినందుకు వీసమెత్తు విచారం లేదు వెధవకి ,"అనుకున్నారు దుగ్ధగా.
ఒక వారంరోజుల తర్వాత రామయ్య గుర్రం అడవి నుండి తిరిగి వచ్చి ఇల్లు చేరింది.అది వస్తూవస్తూ మరొకమూడు గుర్రాలను వెంట పెట్టుకుని వచ్చింది.చూసిన వాళ్లందరు అదృష్ట మంటే రామయ్య దే అను కున్నారు.కుళ్లు బోతులయిన వీరయ్య,సోమయ్య లు పనికట్టుకుని రామయ్య దగ్గరకి వచ్చి,"నీపంటపండింది రామయ్యా..నీది అలాటీలాంటి అదృష్టం కాదు సుమీ, ఒక్క సారిగా నాలుగ్గుర్రాలకు యజమానివయ్యావ్,"అన్నారు మనసులోని కుళ్లు బయటకి కనపడ నీయకుండా.రామయ్య మాత్రం,"ఇది,అదృష్టమో దురదృష్టమో ఎవరికి తెలుసు.నాకున్నది మాత్రం ఒకగుర్రమే "అన్నాడు తాపీగా
ఒకరోజు రామయ్య కొడుకు ఆ కొత్త మూడు గుర్రాల్లో , ఒక గుర్రం ఎక్కి స్వారీ చేయడానికి ప్రయత్నించపోగా అది విదిలించి అంతదూరం విసిరి పడేసింది.దాంతో అతని రెండు కాళ్లు విరిగి పోయాయి.విషయంతెలిసిన వీరయ్య,సోమయ్యలు , రామయ్యని కలిసి, "గుర్రాలు రావడం దురదృషటమో అదృష్ట మో అన్నావుగా,చూడు ఎంత పని జరిగిందో. ఎదిగిన కుర్రాడు మూలనపడ్డాడు.దురదృష్టవంతుల్ని మార్చేదెవరూ ?" అన్నారు.అప్పుడు రామయ్య తనసహజధోరణితో, ఎప్పట్లా , " వాడికలా కావడం అదృష్టమో.. దురదృష్టమో ఎవరికి తెలుసు,"అన్నాడునింపాదిగా.
వీరయ్య సోమయ్య లు బయటికొస్తూ ,"వీడికీ ,ఆ బయటున్న బండరాయికి ఏమాత్రం తేడాలేదు.చెట్టంత కొడుకు కాళ్లు విరగొట్టుకున్నాడుకదా ఇప్పుడైనా వాడి మొహం లో విచారంచూద్దామంటే కనపడదేం.పైగాఇలాజరగడం అదృష్టం అనుకున్నాడేమిటీ... పిచ్చివాడు" అనుకున్నారు మంటగా.
సరిగ్గా ఇది జరిగిన కొన్ని రోజులకి,ఆదేశానికి పొరుగున ఉన్న శతృరాజొకడు తనపరివారంతో దండెత్తి రాబోతున్నాడన్న వార్త వేగుల ద్వారా తెలిసింది .అసలే సైనికులకొరతతో ఉన్న రాజు ఇంటికొకయువకుడు తక్షణం తన పరివారంలో చేరాలని చాటింపు వేయించాడు. ఇంకేముంది ఊళ్ళో ఉన్న అన్ని ఇళ్లనుండి యువకులు , ఆఖరికి వీరయ్య సోమయ్య ల కొడుకులతో సహా సైన్యం లో చేరారు,ఒక్క కాళ్లు విరిగిన రామయ్య కొడుకు తప్ప!
వీరయ్య సోమయ్య ల విచారం అంతాఇంతా కాదు. తమ తప్పిదం తెలిసి ,వాళ్లు రామయ్య దగ్గరకొచ్చి,"ఎప్పటికప్పడు నువ్వు అన్న ప్రతి మాట అక్షర సత్యాలు.నిజంగా నీలాటి స్థిత ప్రజ్ఞ త అందరి కుండదు.నువ్వు దుఖః పడుతుంటే చూసి సంతోషించాలనుకున్నాంమమ్మల్ని క్షమించు,"అన్నారు.
రామయ్య వారితో ఇలా అన్నాడు నెమ్మదిగా, "జీవితమనేది ఒక హెచ్చు తగ్గుల కొండ బాట దానిమీద, విజయాలు అపజయాలు, మితృలు, శతృవులు, సుఖదుఖాఃలు, అదృష్ట, దురదృష్టాలూ ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి తారుమారు అవుతుంటాయి.మనంవ్యక్తిగతంగావాటికి ప్రతి స్పదించకుండా ముందుకు నడిచి పోవడమే జీవిత పరమార్ధమని , నేను భావిస్తుంటాను. ఇప్పటికీ చెప్తున్నా... నాకున్నది ఒక గుర్రమే. మిగిలినగుర్రాలు ఏదో ఒక రోజు అడవిలోకి వెళ్లిపొవచ్చు, నాకొడుకు స్వస్థు డయ్యాక సైన్యం లో చేరవచ్చు .ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు, కదా ..! "అన్నాడు.
ఇంత కు మించిన నెమ్మదస్తుడు మరొకడు లేడు అని, వీరయ్య, సోమయ్య లు తమ అజ్ఞానానికి లెంపలేసుకుని ఇంటి దారి పట్టారు.