యురేకా ! - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ

yureka

ర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ పశుపతికి తల కొట్టేసినట్టుగా ఉంది. హైదరాబాద్ పంజాగుట్ట సెంటర్ లో పశుపతి డెర్మటాలజీ క్లినిక్ పెట్టి సరిగ్గా నెలరోజులైంది. భారీ పబ్లిసిటీతో క్లినిక్ ప్రారంభించిన కారణంగా రెండో రోజు నుండే పేషెంట్స్ రావడం మొదలైంది. విచిత్రం ఏమిటంటే ఈ నెలరోజుల వ్యవధిలో దాదాపు ఇరవై మంది ఒకే రకమైన చర్మవ్యాధితో అతని దగ్గరకు వచ్చారు. అందరికి ముఖం మీద ఎర్రటి దద్దుర్లు... విపరీతమైన దురద! తనకున్న పరిజ్ఞానాన్నంతా ఉపయోగించి మంచి మందులే ఇచ్చాడు. కానీ గోడకు కొట్టిన బంతుల్లా మూడో రోజే మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. తానిచ్చిన మందుల వల్ల ప్రయోజనం ఏమీ లేదనే కంప్లయింట్ తో! ఫస్ట్ ఇంప్రషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రషన్ అంటారు. వీళ్ళ రోగం కుదర్చకపోతే ఇక తన ప్రాక్టీస్ గోవిందా! అనిపించింది పశుపతికి. అతనికి ఈ మధ్యనే పెళ్ళి అయింది. కొత్త కాపురం! కొత్త క్లినిక్!! అంతా హ్యాపీ హ్యాపీగా సాగిపోతున్న సమయంలో ఈ కొత్త సవాల్ ఎదురైంది. అసలు ఈ ఎలర్జీకి కారణం అంటూ ఏమిటో తెలిస్తే మందు ఇవ్వొచ్చు. కానీ అదే అంతు చిక్కకుండా ఉంది.

ఈ స్కిన్ ఎలర్జీతో పశుపతి దగ్గరకు వచ్చిన వాళ్ళంతా ఉద్యోగస్థులు. అందరూ పంజాగుట్ట పరిసరాల్లో పనిచేస్తున్నారు. అందుకే స్కిన్ ఎలర్జీ రాగానే పక్కనే ఉన్న పశుపతి క్లినిక్ కు వచ్చారు. వీళ్ళంతా హిమాయత్ నగర్, నారాయణ గూడా, బర్కత్ పురా, విద్యానగర్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నారు. అందరికీ ఏదో ఒక ద్వి-చక్రవాహనం ఉంది. గతంలో ఈ రకమైన స్కిన్ ఎలర్జీతో బాధ పడ్డారా అంటే అదీ లేదు. ఒకేసారి వీళ్ళందరినీ ఈ మాయ రోగం ఎలా ఎటాక్ చేసిందో పశుపతి కి అర్ధం కాకుండా ఉంది. ఈ కొత్త జబ్బు గురించి పాత పుస్తకాలను తిరగేస్తుంటే భార్య పార్వతి ఫోన్ చేసింది. ఏదో పని మీద అమ్మవాళ్ళ ఇంటికి వచ్చానని, క్లినిక్ క్లోజ్ చేయగానే తనని పికప్ చేసుకుని వెళ్ళమని చెప్పింది. పశుపతి ఉండేది జుబ్లీహిల్స్. అత్తగారు ఉండేది తిలక్ నగర్ లో. మనసు బాగోకపోవడంతో వెంటనే అత్తగారింటికి బైలు దేరాడు పశుపతి.

బైకు మీద బైలు దేరాడన్న మాటే కానీ అతని మనసు మాత్రం పేషెంట్స్ కు వచ్చిన స్కిన్ ఎలర్జీ మీదనే ఉంది. అదే ఆలోచనతో సోమాజీగూడ చౌరస్తా చేరాడు. అక్కడ నుండి లెఫ్ట్ టర్న్ తీసుకుని ఫైఓవర్ ఎక్కాడు. సాయంత్రం ఆరుగంటలు కావస్తోంది. హుస్సేన్ సాగర్ మీద నుండి చల్లని గాలి వీస్తోంది. ముఖాన హెల్మెట్ కూడా లేదేమో... ఎంతో హాయిగా అనిపించింది.ఫ్లై ఓవర్ దిగగానే ఎడమ వైపు నక్లెస్ రోడ్, కుడివైపు ప్రసాద్ ఐమాక్స్... కానీ బైకును తిన్నగా పోనిచ్చాను. ఎన్టీయార్ గార్డెన్ దాటి, లుంబినీ పార్క్ ఎంటర్ అవుతుండగా చల్లటి నీటి తుంపర మొఖాన్ని తాకింది. 'ఇదేమిటీ వర్షం మొదలైందా' అనుకుంటూ పైకి చూశాడు. ఆకాశం నిర్మలంగా ఉంది. మేఘాలూ లేవు. అది వర్షం కాదని, హుస్సేన్ సాగర్ లో పర్యాటకులను ఆకర్షించడానికి పెట్టిన ఫౌంటెన్స్ నుండి వచ్చిన నీళ్ళని అర్ధమైంది. ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో త్వరగానే అత్తవారింటికి చేరాడు.

కాలింగ్ బెల్ కొట్టగానే తలుపు తీసిన అత్తగారు పశుపతిని చూసి నోరెళ్ళబెట్టింది. విషయం ఏమిటో పశుపతికి అర్ధం కాలేదు. బూట్లు విప్పి ఇంట్లోకి అడుగుపెట్టగానే భార్య పార్వతి మంచినీళ్ళతో ఎదురొచ్చింది. పశుపతిని చూడగానే... 'ముఖం నిండా ఆ ఎర్రటి దద్దుర్లేమిటీ' అని అడిగింది కంగారుగా! భార్య ఏమంటుందో పశుపతికి ఆ క్షణాన అర్ధం కాలేదు. వెంటనే బెడ్ రూమ్ లోని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కెళ్ళాడు. అద్దంలో ముఖం చూసుకుంటే నిజంగానే ముఖం మీద ఎర్రటి దద్దుర్లు! సరిగ్గా అప్పుడే పశుపతికి దురద పుట్టడమూ మొదలైంది. ఒక్క క్షణం గడిచిన కాలాన్ని రివైండ్ చేసుకున్నాడు. వెంటనే జేబులోంచి సెల్ ఫోన్ తీసి జి.హెచ్.ఎం.సి. లో పనిచేస్తున్న స్నేహితుడికి ఫోన్ చేశాడు. అటువైపు నుండి తన ప్రశ్నలకు సమాధానం రాగానే... ఇల్లు అదిరిపోయేలా 'యురేకా' అంటూ అరిచాడు పశుపతి.

మర్నాడు డాక్టర్ పశుపతి స్కిన్ ఎలర్జీ తో తన దగ్గరకు వచ్చిన పేషంట్లందరికీ కబురు పంపాడు. నెలరోజులుగా నానా బాధలు పడుతున్న వాళ్ళంతా టెంక్షన్ గా సాయంత్రం ఆరున్నరకు పశుపతి ముందు వాలారు.

వారిని ఉద్దేశించి ''డియర్ ఫ్రెండ్స్... ఒకే రకమైన స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్న మీ అందరికీ ఒక శుభవార్త. మీ వ్యాధికి కారణం తెలిసింది. నా అంచనా ప్రకారం ప్రతీ రోజు మీరు పంజాగుట్ట నుండి హుస్సేన్ సాగర్ మీదుగా ఇళ్ళకు వెళుతున్నారు. సాగర్ మీదుగా వచ్చే చల్లని గాలిని హాయిగా ఆస్వాదిస్తున్నారు. అందులో తప్పులేదు. అయితే నెల రోజుల క్రితం మన కార్పోరేషన్ వారు పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు హుస్సేన్ సాగర్ లో భారీ ఫౌంటెన్స్ ఏర్పాటు చేశారు. రోజూ సాయంత్రం ఆరు నుండి పదిగంటల వరకూ అవి పనిచేస్తున్నాయి. అవే మీ పాలిట శత్రువులుగా మారాయి. హుస్సేన్ సాగర్ లోని కలుషితమైన నీరు ఆ ఫౌంటెన్స్ ద్వారా ప్రతి రోజూ మీ ముఖాల మీద పడుతోంది. దానివల్లే మీకు స్కిన్ ఎలర్జీ వచ్చింది. ఏ పొల్యూషన్ వల్ల వచ్చే ఎలార్జీకైనా మందు ఉందేమో కానీ, హుస్సేన్ సాగర్ నీటి వల్ల వచ్చే స్కిన్ ఎలర్జీకి మాత్రం లేదు. నాకు తెలిసి దీనికి మూడు పరిష్కారాలు ఉన్నాయి. ఒకటి హుస్సేన్ సాగర్ లో కలుషితమైన నీటిని శుభ్రపరచడం. అది మన వల్ల, ప్రభుత్వం వల్ల కానీ అయ్యే పనికాదు. ఇక రెండోది మీరు లుంబినీ పార్క్ రూట్ ను అవాయిడ్ చేస్తూ, లకడీకపూల్ మీదుగా ఇంటికి వెళ్ళడం. ఇక మూడోది మీ ముఖానికి హెల్మెట్, చేతులకు గ్లవుజెస్ తొడుక్కోవడం. దట్సాల్!!' అంటూ డాక్టర్ పశుపతి గాడంగా ఊపిరి వదిలాడు. అతని ఎదురుగా కూర్చున్న పేషెంట్స్ అందరి ముఖాలలోనూ ఓ గొప్ప రిలీఫ్!!

ఇప్పుడు హుస్సేన్ సాగర్ పుట్ పాత్ మీద పల్లీలు అమ్మేవాళ్ళ కంటే హెల్మెట్లు అమ్మేవాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు.

సర్వేజనా సుఖినో భవంతు!!

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ