"అసలే లాక్‌డౌన్ అమలులో ఉంది. ఎక్కడికి వెళ్తున్నారు ఈ వేళలో? ఇవాళా, రేపూ ఎలాగూ ఆఫీసు లేదు, హాయిగా ఇంట్లో కూర్చొని టివిలో సినిమాలు చూస్తూ గడపవచ్చు కదా!" అంది విమల ముఖానికి మాస్క్ పెట్టుకొని వీధిలోకి బయలుదేరబోతున్న భర్త మురళిని.
"హుఁ...ఎంతసేపని అలా టివి చూస్తూ రోజంతా గడపడం? నాకు చాలా చిరాగ్గా ఉంది. ఓ సారి అలా బయటికి వెళ్ళి వస్తాను." చెప్పాడు మురళి చేతిలో సంచీతో వీధిలోకి దారితీసూ.
"కూరలు వీధిలోకి వస్తే నేను ఇప్పుడే వారానికి సరిపడా కొనేసాను. నెలవారీ సామానుకూడా వారం ముందు మీరే తెచ్చారు కదా. మరి సంచి ఎందుకు తీసుకెళ్తున్నారు?" అని అడిగింది.
"ఏం లేదు. సంచి చేతిలో ఉంటే నిత్యావసరాలకని పోలీసులు వదిలేస్తారు. అదే వట్టి చేతులతో వెళ్తే మాత్రం జాడిస్తారు. అందుకే ఈ ముందు జాగ్రత్త! ఏ దుంపలో, టమటాలో అరకేజి సంచిలో వేసుకొని తిరిగితే పోలీసులతో బెడద ఉండదు." జవాబిచ్చాడు మురళి.
అతని అతితెలివికి నివ్వెరపోయింది విమల. "మీరు పోలీసులని మోసగిస్తున్నానని అనుకుంటున్నారు గానీ, కరోనాని మాత్రం మోసగించలేరు కదా! అయినా ఎందుకీ అజాగ్రత్త! ప్రభుత్వం అనవసరంగా ఎక్కడకీ వెళ్ళవద్దన్నా వినరే?" అని ఆమె గొంతుచించుకొని అరిచినా తనకేమీ వినబడనట్లు ముందుకే అడుగేసాడు మురళి. అలా నడుస్తూ రాజారావింటివైపు బయలుదేరాడు.
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మురళికి ఆ ఊళ్ళో చాలామందే స్నేహితులున్నారు. ఆ ఊళ్ళోనే పుట్టిపెరిగిన మురళికి అంతమంది స్నేహితులుండడంలో విడ్డూరం లేదు. చిన్నప్పుడు స్కూల్‌లో చదివేటప్పుడు స్కూల్ స్నేహితులు, పెద్దయి కాలేజీకి వెళ్ళాకా కాలేజి స్నేహితులు, ఆ తర్వాత ఉద్యోగంలో చేరాక సహోద్యోగులు, ఇలా చాలామందే స్నేహితులున్నారు మురళికి. అతను చాలా కలివిడి మనిషవడంవల్ల కాలనీలోనే చాలా మంది కాలనీ స్నేహితులున్నారు. ఉదయం దగ్గరున్న స్టేడియంలో మార్నింగ్ వాక్ చేసే మురళికి చాలా మందితో పరిచయం ఏర్పడి మార్నింగ్ వాక్ స్నేహితులు కూడా ఉన్నారు. అంతేకాకుండా మురళికి ప్రత్యేకంగా పేకాడ్డం కోసం పేకాట స్నేహితులు, మందు కొట్టేటప్పుడు మందు స్నేహితులు, ఇంకా ఇలా చాలా బాపతు స్నేహితులు కూడా కోకొల్లలు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల తన స్నేహితులను కలసి చాలా రోజులైంది, ముఖ్యంగా పేకాట స్నేహితులని. ఆఫీసు పని పూర్తైయాక ఓ గంటో రెండు గంటలో పేకాడకపోతే మనసు ఊరుకోదు. ఈ లాక్‌డౌన్ లో పేకాడడానికే వీలవలేదు. ఎప్పుడు ఈ లాక్‌డౌన్ సడలిస్తారా, ఎంత త్వరగా పేకాడుదామా అని ఎదురు చూసాడిన్నాళ్ళూ. తన కోరిక తీరేదెలా? అప్పటికే చాలారోజులైంది పేకాట లేక చేతులు తెగ దురద పెడుతున్నాయి మురళికి. ఓ సారి పేకాడితేనే ఆ చేతుల తీట తగ్గేది! ఆఖరికి ఉండబట్టలేక తన పేకాట స్నేహితులైన రాజారావు, రమణారావు, గోవిందరావులని లైన్లో పెట్టాడు ముందురోజు రాత్రే. రాజారావు భర్య లాక్‌డౌన్ ముందే పుట్టింటికెళ్ళింది. అతనొక్కడే ఇంట్లో ఉన్నాడు. అందుకే అతనింట్లోనే పేకాట సాగిద్దామని నిర్ణయించుకున్నారు మిత్ర చతుష్టయం. అలా మెల్లగా అవకాశం సృష్టించుకొని ఆ రోజు రాజారావు ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు చాలాసేపటి వరకు వాళ్ళ ఆట కొనసాగింది ఎటువంటి అంతరాయం లేకుండా.
ఆ విధంగా పేకాట ఆడాలన్న కోరిక తీరడంతో చాలా ఆనందించాడు మురళి. మరి రెండురోజుల వరకూ ఏ విధమైన ఆలోచన లేకుండా గడిపాడు. అయితే, రెండు రోజుల తర్వాత మురళిలోని ఆలోచనల తేనెతుట్టెని కదిలించాడు ఇంకో మిత్రుడు జగన్నాధరావు. ఆ రోజు ఉదయం టివిలో రామాయణం చూస్తున్న మురళిలోని కోర్కెలు ఒక్కసారి గా రగిల్చాడు జగన్నాధరావు.
"ఒరే!...మురళీ!...ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళైందిరా మనం కలసి? చాలా రోజులైంది కదరా మందు రుచి చూసి కూడా. నేను కష్టపడి సంపాదించానులే. కంపెనీ లేక బోర్ కొడుతోంది. గోపాల్రావు భార్య పుట్టింటికెళ్ళింది లాక్‌డౌన్ ముందే. వాడి ఇంట్లో మనం మన ప్రోగ్రాం పెట్టుకోవచ్చు. మనం ముగ్గురే కాక ప్రభాకర్రావు, మోహన్రావు కూడా వస్తారు. సాయంకాలం నాలుగుకల్లా ఎలాగోలా గోపాల్రావు ఇంటికి వచ్చేయ్! మొత్తం మన బ్యాచంతా ఉంటే మంచి రంజుగా ఉంటుంది ప్రొగ్రాం." అని చెప్పి మురళిలో కోర్కెలు ఎగదోసాడు జగన్నాధరావు.
మరి ఉండబట్టలేక ఆ రోజు సాయంకాలం మళ్ళీ బయటకు వెళ్ళాడు మురళి భార్య విమల వారిస్తున్నా వినకుండా. పోలీసుల నుండి రక్షణ కోసం ఆ రోజు ఉదయం తను బీపీ కోసం తీసుకున్న మందుల బిల్లు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ జేబులో పెట్టుకున్నాడు. పోలీసులెవరైనా ఎదురుపడితే మందులకోసం వచ్చానని చెప్పొచ్చని అతని ఉద్దేశ్యం. తను ఎలాగూ మందు కోసమే కదా వెళ్తున్నాడు, కాకపోతే ఆ మందు వేరు, అదే తేడా!
ఇలా లాక్‌డౌన్ ఉన్నన్నాళ్ళూ మధ్యమధ్య ఏదో వంక పెట్టుకొని బయటకు వెళ్తూనే ఉన్నాడు, తన స్నేహితులని కలుస్తూనే ఉన్నాడు మురళి. ఈ మధ్యే పాత మార్నింగ్ వాక్ స్నేహితులతో కలసి చిన్న పార్టీ కూడా చేసుకున్నాడు.
అయితే ఈ లోపున లాక్‌డౌన్ కూడా చివరిదశకి వచ్చేసింది. అయితే కారోనా మాత్రం ప్రారంభ దశ నుండి ముందడుగు వేసి, విజృంభిస్తోంది. లాక్‌డౌన్ ముందున్న కరోనా కేసులకి ఇప్పటికీ పోలికే లేనంతగా పెరిగిపోయింది. ఈ లోపున నాలుగోదఫా పూర్తై, అయిదో చరణంలోకి ప్రవేశించింది లాక్‌డౌన్. దాదాపు అన్ని రకాల సడలింపులు చేసింది ప్రభుత్వం. మరిక లాక్‌డౌన్లు లేవేమో మరి, అందుకే లాక్ఆన్ ప్రారంభమయింది. ఇలాంటి సడలింపులు కోసమే ఎదురు చూస్తున్నవాళ్ళు మరి ఊరుకుంటారా! అందులోనూ మురళిలాంటి వాళ్ళు.
సరిగ్గా అలాంటి సమయంలోనే మురళికి ఓ ఫోన్ వచ్చింది ఓ అఙాత వ్యక్తి నుండి.
"హల్లో! మురళిగారేనా! మీకు శంకరంగారు తెలుసునా? అతన్ని మీరెక్కడ కలిసారు? ఎప్పుడు కలిసారు? అతన్ని కలిసిన తర్వాత మీరు ఇంకెవర్ని కలిసారు? వివరాలు కావాలి. హాఁ...ఇంకో విషయం మీకు జ్వరం, పొడిదగ్గు, జలుబూ వగైరా లక్షణాలేమైనా ఉన్నాయా?" అని ప్రశ్నల వర్షం కురిపించాడు అవతలవైపు నుండి ఆ అఙాత వ్యక్తి.
ఒకేసారి ఇన్ని ప్రశ్నలు ఆ వ్యక్తి సంధించేసరికి ఒక్కసారిగా బిత్తరపోయాడు మురళి. రెండు నిమిషాలు ఆలోచించినా ఆ సదరు శంకరం ఎవరో మాత్రం బోధ పడలేదు. తనకి ఎంతో మంది మిత్రులున్నారు, రకరకాల మిత్రులున్నారు, కానీ ఈ పేరుతో ఎవరూ లేరే! బంధువుల్లో కూడా అలాంటి పేరున్నవాళ్ళెవరూ లేరే! పోనీ, పొరబడి ఆ వ్యక్తి తనకి ఫోన్ చేసాడనుకుంటే తనని మురళి అని సంబోధించే చేసాడు కదా మరి.
ఆత్రత ఆపుకోలేక, "శంకరం ఎవరో నాకు గుర్తుకు రావడంలేదు. ఆ పేరుగల స్నేహితులుగానీ, బంధువులుగానీ నాకెవరూ లేరే! బహుశా మీరు పొరపాటున నాకు ఫోన్ చేస్తున్నారేమో? ఇంతకీ మీరెవరు? ఎందుకు ఈ వివరాలడుగుతున్నారు?" అన్నాడు మురళి.
"నేను జిల్లా కోవిడ్ అధికారిని. మీరే గజపతినగర్ కాలనీలో ఉన్న మురళికదా, నేనేమీ పొరబడలేదు. నేను చెప్పిన శంకరం అనే అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతన్ని విచారించగా మీరు కూడా అతని కటాక్ట్ లిస్ట్‌లో ఉన్నట్లు తేలింది. అందుకే మీకు ఫోన్ చేసాను. అతనికి కరోనా సంక్రమించిన తర్వాత మీతో కలిపి అరవై మందికి ఇప్పటివరకూ ఫోన్ చేయడం జరిగింది. అందరూ శంకరంతో ఈ మధ్య టచ్‌లో ఉన్నవారే. అందుకే మీరు హోం క్వారంటైన్‌లోనైనా ఉండాలి లేక, క్వారంటైన్ సెంటర్‌కైనా రావల్సి ఉంటుంది. అది మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది." అని మురళికి కొన్ని జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసాడు అతను.
ఈ వార్త విన్న తర్వాత తలపట్టుకు కూర్చున్నాడు మురళి. అయితే ఎంత ఆలోచించినా ఆ శంకరం ఎవరో మాత్రం గుర్తుకు రాలేదు. రాజారావింట్లో కొన్నాళ్ళు స్నేహితులందరూ కలసి పేకాట ఆడారు ఆ పేకాట స్నేహితుల్లో కానీ, తన మందు స్నేహితుల్లో కానీ ఎవరూ అలాంటి పేరుగలవారు లేరే! ఆట మధ్యలో టీ, మంచినీళ్ళు తెచ్చిన అబ్బాయి పేరు గుర్తు చేసుకున్నాడు మురళి. వాడిపేరు చిట్టిబాబు. అలాగే గోపాల్రావు ఇంట్లో మందుపార్టీలో మధ్యమధ్య జీడిపప్పు, చిప్స్ లాంటివి తెచ్చి అందించినవాడు గోపాల్రావు ఇంట్లో పని చేసే పని కుర్రాడు గోవిందు. ఇలా పేరుపేరునా అందర్నీ, తనకున్న స్నేహితులందర్నీ, తను ఈ మధ్య కలసిన వాళ్ళందర్నీ గుర్తు చేసుకున్నాడు. ఆఖరికి ఇంటికి వచ్చి పాల పేకట్లు ఇచ్చేవాడిని, దినపత్రిక అందించే వాడిని, తను వెచ్చాలు తీసుకొనే కిరాణా షాపు యజమాని కిరణ్‌బాబు, ఆ కొట్లో పనిచేసే వీరయ్య కూడా ఈ సందర్భంలో గుర్తుకు వచ్చారు. తనకి తెలిసిన తనతరఫు బంధువులనీ, విమల తరఫు బంధువుల్నీ కూడా తలచుకున్నాడు కానీ ఆ పేరు గల వాళ్ళెవరూ ఎంత ఆలోచించినా స్పురించలేదు మురళికి. ఆ శంకరం ఎవరో ఎంత మాత్రం అంతుబట్టలేదు. ఎంత ఆలోచించినా 'అతను ఎవరు?' అన్న ప్రశ్నకి సమాధానం దొరకలేదు.
'ఇంతకీ ఆ కరోనా సోకిన శంకరం ఎవరు? చిత్రంగా ఉందే? తనెలా అతని కంటక్ట్ లిస్ట్‌లోకి వచ్చాడు ఇంతకీ?' ఇలా ఆలోస్తూనే ఉన్నాడు.
"ఏమండోయ్! ఇదివిన్నారా?" అన్న భార్య విమల కేక విని ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి బయటపడి వాస్తవ లోకానికి వచ్చాడు.
"ఏమిటి?" అని పరధ్యానంగా అడిగాడు. అతని మనసు ఇంకా ఆ కరోనా సోకిన శంకరం చూట్టూనే పరిభ్రమిస్తోంది.
"మన శంకరం లేడూ!... అదేనండీ... మా అన్నయ్య, మా పెద్దనాన్న కొడుకు, వాడికి కరోనా పాజిటివ్ వచ్చిందట. నిన్నే ఆస్పత్రిలో చేరాడట. ప్రస్తుతం అతని భార్యా, పిల్లలు, మా పెద్దనాన్న, పెద్దమ్మ అందరూ పాపం క్వారంటైన్‌లో ఉన్నారట. ఏమవుతుందో ఏమో? వాడి వల్ల ఇంకా చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చిందట. ఇంకా నయం, వారం రోజూలక్రితం మన ఇంటికి వస్తానని అంటూ ఉండేవాడు. వచ్చి ఉంటే మనకీ ఇబ్బంది అయిఉండును." అందామె.
విమల చెప్పిన మాట వినగానే నిటారుగా అయ్యాడు మురళి. హఠాత్తుగా అప్పుడు గుర్తుకువచ్చింది తనకు వరసకు బావమరిదైన శంకరంగురించి. అతన్ని అందరూ 'తిక్క శంకరయ్య ' అనే ముద్దుపేరుతో పిలవడంవల్ల ముందు అతని అసలు పేరు గుర్తుకురాలేదు. శంకరం విమలకి పెద్దనాన్న కొడుకు. అదే ఊళ్ళో నీలకంఠనగర్‌లో ఉంటున్నాడు. శంకరం అంటే ఎవరికీ పెద్దగా తెలియదు. కాకపోతే 'తిక్క శంకరయ్య ' అంటే అతని స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు అందరూ కూడా గుర్తుపడతారు. ఎందుకంటే అతనికో తిక్కుంది. లెక్కలేని ఆ తిక్కపేరే కవిత్వం. అతనికి తనో పెద్ద కవి అని అపారమైన నమ్మకం. అతని కవిత్వం ఏ పత్రికలో అచ్చయిందో అదెవరికీ తెలియదు కానీ, ఎవరు ఎదురుపడినా కూడా తన కవిత్వం వినిపించి ఎదుటి వాళ్ళు సొమ్మసిల్లిపోయేదాకా ఊపిరి పీల్చుకోడు. అందుకే అతని పాల్బడకుండా ఉండటానికి ప్రతీవారూ శతధా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే, ఒక రోజు మురళి ఖర్మకాలి అతని పాల్పడ్డాడు. విమల కాలనీలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళిన రోజు ఇంటికి వచ్చాడు. మురళిని ఒంటరిగా చూస్తూనే శంకరంలోని కవి రెచ్చిపోయాడు. ఆ తిక్క కవిత్వం విని బిక్కచచ్చిపోయాడు మురళి. ఇంతలో అతనికి ఇంటినుండి ఫోన్ రావడంతో, తన కవిత్వాన్ని మురళికి పూర్తిగా వినిపించలేకపోయానే అన్న బాధతో నిష్క్రమించాడు. దాంతో 'తిక్క శంకరయ్య ' తిక్క నుండి ఆ రోజు అనూహ్యంగా బయటిపడి బతికిపోయాడు. కాని ఇప్పుడనిపిస్తోంది 'తిక్క కవిత్వం'నుండి ఆ రోజు బతికి బట్ట కట్టినా, ఇప్పుడు ఈ కరోనాకోరల నుండి ఎలా బయటపడగలడోనని. ఆ ‘తిక్క శంకరయ్య ‘ ఇంత పని చేస్తాడనుకోలేదు. అతనికి కరోనా సోకిన తర్వాత తనకి తిక్క కవిత్వం చెప్పి తనకి తిక్కతో పాటు కరోనా కూడా అంటిస్తాడనుకోలేదు మురళి. ఇప్పుడు తను మాత్రమే క్వారంటైన్‌లో ఉంటే సరిపోదు, విమల కూడా క్వరంటైన్‌లోనే ఉండాలి. మొత్తం మీద తమకి కూడా బాగా తిక్క కుదిరింది ఈ సంఘటనతో అనుకొని ఈ విషయమే చెప్పాడు విమలతో.
"మీ తిక్క అన్నయ్య, మనల్ని కూడా వదలలేదే! ఆ రోజు నువ్వు మన కాలనీలో నీ స్నేహితురాలి ఇంటికి వెళ్ళినప్పుడు తన తిక్క కవిత్వం వినిపించడానికి ఇక్కడకి వచ్చి మనల్ని కూడా బుక్ చేసాడే మీ తిక్క అన్నయ్య! తన కవిత్వం తిక్కతో పాటు నాలాగ పాపం ఇంకెంతమందికి కరోనా అంటించాడో మీ 'తిక్క శంకరయ్య ' అన్నయ్య. ఇప్పుడు మనం కూడా క్వారంటైన్లో ఉండాలి." అంటూ బావురుమన్నాడు మురళి.
ఇది ఊహించని విమల ఖంగుతిన్నది.