వీధి మలుపు - భాస్కర్ కాంటెకర్

street turning

బాగా రాత్రి అయ్యింది.రోడ్డంతా నిర్మానుష్యంగా వుంది.పురుగు కూడా కనిపించట్లేదు. ఇంకా ఓ కిలోమీటర్ దూరం నడిస్తే చాలు , అటునుంచి మా వీధి మొదలవుతుంది.వచ్చిన బయమెల్ల అవీధీ మలుపు దగ్గరే. ఎందుకో అక్కడికి రాగానే నాకు ఎప్పుడు భయం వేస్తుంది.ఈ రోజు కూడా అంతే. కానీ ఏం చేస్తాను, ఇంటికి వెళ్ళక తప్పదు. బయపడి వెనుతిరగలేను కూడా. . భయపడాల్సిన ప్రదేశం రానే వచ్చింది.వీధి మలువు చేరుకున్నాను. ఉన్నట్లుండి, కరెంటు పోయింది.ఇంకా చీకటయి పోయింది. గాఢాంధకారం అంటే ఇదేనేమో. ఇక్కడ ఏదో మెదలిన ఆకారం ,ఇప్పుడైతే కనిపించట్లేదు. దొరికిందే అదనుగా పరుగు లాంటి నడకతో ముందుకు సాగాను.

ఇంకా ఐదు నిముషాలు నడిస్తే మా అపార్ట్మెంట్ వస్తుంది. కొంచెం దూరంలో అపార్ట్మెంటు కనిపించింది.ప్రాణం వొచ్చినట్లయియింది.గబ గబ నడచి అపార్ట్మెంట్ గేట్ వద్దకు చేరుకున్నాను. లిఫ్ట్ లో నాలుగో ఫ్లోర్ చేరుకునేసరికి, మనసు కాస్త కుదుటపడింది. లిఫ్ట్ నుండి ఫ్లాట్ వరకు కెరిడార్ లో నడుచుకుంటు వచ్చి , డోర్ తట్టాను. అత్తగారు వచ్చి తలుపు తీసారు.నేను లోనికి రాగానే మళ్ళీ తలుపు వేసి ,డోర్ లాక్ చేసి తాను తన బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. అది త్రి బెడ్ రూమ్ ఫ్లాట్.ఒక బెడ్రూమ్ మాకు,మరోటి అత్తమామలకు, మరియు మూడవది గెస్ట్ కోసం. వాళ్ళ రూమ్ లో టీవీ శబ్దం వస్తుంది.అంటే వాల్లింకా పడుకోలేదన్నమాట.

అంతటా లైట్స్ వెలుగుతూనే ఉన్నాయి.కోడలు ఆఫీస్ నుండి ,ఒక్కతే చీకట్లో ,ఎలా వస్తుందో అన్న ధ్యాసే లేదు. వచ్చి యాంత్రికంగా డోర్ తెరువడమే కానీ, ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. నేను నా బెడ్ రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకున్నాను. రూమ్ అంత చిందరవందరగా ఉంది. రూమ్ లోని బెడ్ ను, కబోర్డ్ లోని బట్టలు సరిది, వాష్ రూమ్ లోకి వెల్లి ఫ్రెషప్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాను. అక్కడ ఉన్న రైస్, పప్పు సాంబారు తో భోజనం ముగించాను. అత్త మామలకు నేను బయటికి వెళ్లి జాబ్ చేయడం ఇష్టం లేదు.

పెళ్లి కి ముందేమో అమ్మాయి ఇంకా చదువుకున్న లేదా ఉద్యోగానికి వెళ్లిన మాకేమి అభ్యంతరం లేదన్నారు. ఇప్పుడేమో ఇలా వ్యవహరిస్తున్నారు.ఎవరు సరిగ్గా మాటాడటం లేదు.ఇంట్లో అందరూ ముభావంగా వుంటారు. ఆఫీస్ కి వెళ్ళటం , తిరిగి ఇంటికి రావడం ,తినటం ,అలసి పడుకోవడం.రొటీన్ లైఫ్. మా వారూ, ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ , వాళ్ళది మల్టినేషనల్ కంపెనీ.మన ఇండియా కి భిన్నంగా ఉంటాయి వాళ్ల టైమింగ్స్.ఈ వీక్ మొత్తం నైట్ షిఫ్ట్స్.పొద్దునే ఎయినిమిదింటికి కాని రాడు. నాదేమో కాల్ సెంటర్ జాబ్ .

నేను షిఫ్ట్ పద్దతిలో పనిచేయాల్సి ఉంటుంది. మొదటి షిఫ్ట్ లో అంత ప్రాబ్లెమ్ ఉండదు కానీ, ఈ సెకండ్ షిఫ్ట్ లో మాత్రం కష్టంగా వుంటుంది. అయినా, టూ వీలర్ మీద వెళ్లి వచ్చేటప్పుడు అంత ప్రాబ్లెమ్ ఉండదు.కానీ ఏదో కారణాల వల్ల బైక్ చేతిలో లేక ,పబ్లిక్ ట్రాస్పోర్ట్ లో వెళితే మాత్రం , రావడం చాలా కష్టంగా ఉంటుంది. రెపటికైతే రిపేరుకి ఇచ్చిన బైక్ చేతికి వస్తుంది.ఈ లేట్ కావడాలు, బయపడటాలు ఉండవు. ఇలా ఏదో ఆలొచిస్తూ ఎప్పుడు నిద్రలోకి జారిపోయానో....

@@@@ @@@@@

ఇట్లా నిద్ర పట్టిందో లేదో, ఎవరో పిలుస్తున్న చప్పుడయ్యింది. అత్తగారు తలుపు బాదుతూ ,అరుస్తున్నట్లుగా పిలుస్తుంది.గొంతులో ఏదో కంగారు. వెంటనే లేచి డోర్ తీసాను. అత్తమ్మ ఏడుస్తూ "అమ్మ మీ మామ గారికి ఛాతీలో నొప్పట, ఆయాస పడుతున్నాడు.అబ్బాయికి కాల్ చేయి అంది." బెడ్ రూమ్ లోకి వెళ్లి చూస్తే,మామగారు ఆయాసంతో రొప్పుతున్నారు.వొళ్ళంతా చెమటతో తడిసిపోయింది. అత్త గారు మీరూ కంగారు పడకండి అంటూ అంబులెన్స్ కై 108 కు కాల్ చేసాను. అబులెన్సు కనఫర్మ్ కాగానే,ఆయనకి కూడా కాల్ చేసి చెప్పాను. "నేను ఆఫీస్ వెహికల్ తీసికొని బయలుదేరుతున్నాను,అంత వరకు జాగ్రత్తగా చూసుకో"మని చెప్పాడు. ఇంతలోనే అంబులెన్స్ రావడం ,దగ్గర్లో హాస్పిటల్ కి తీసుకెల్లడం జరిగింది.వైద్యులు పరీక్షలు చేసి,ప్రమాదమేమి లేదని చెప్పారు.సమయానికి తీసుకొచ్చి మంచి పని చేసారు అని డాక్టర్ అనడంతో, అత్తమ్మ నా వైపు కృతజ్ఞతా భావంతో చూసింది.అంతలోనే అతను కూడా వొచ్చేశారు. అంత వివరంగా చెప్పి అతని కంగారుని , భయాన్ని పోగొట్టను.ఎంతైన కన్నా తండ్రి కదా , కంగారు పడకుండా ఎలా వుండగలడు! మొత్తమ్మీద ,హాస్పిటల్ లో వైద్యులు ఓ రెండు గంటలు పర్యవేక్షణలో ఉంచుకుని, తెల్లవారు జామున డిశ్చార్జ్ చేసారు. రాత్రి సరైనా నిద్ర లేదు.పొద్దున్నే లేటుగా లేవాల్సి వొచ్చింది. బైక్ ను ఈ రోజు తీసుకు రావడం కుదరదు.అందుకని నిన్నటి లాగే ఈ రోజు పబ్లిక్ ట్రాన్స్పోర్టె గతి.మావారు బస్ స్టాండ్ వరకు వొచ్చి ఆటో ఎక్కించి వెళ్ళిపోయారు. #### #### ####### మళ్ళీ అదే గొడవ.ఆఫిసు పనివేళలు అయిపోయాయి. టాక్సీ బుక్ చేసాను కానీ, రాలేదు.రెండు సార్లు క్యాన్సల్ చేయాల్సి వొచ్చింది. అప్పటికే చీకటి పడుతుంది. నా కొలీగ్ ఆటువైపే వెళుతుంది,లిఫ్ట్ అడిగాను. ఇక నేను డిగాల్సిన చోటు రాగానే , దించేసి తుర్రున వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిపోగానే ఒకింత భయం వేసింది. ఒంటరి దాన్నీ అన్న ఫీలింగ్ రాగానే , భయం వేయడం సహజం. మళ్ళీ అంతా మాములే, నిర్మానుష్య ప్రధేశం. ఎవ్వరూ లేరు. మరి అంత పొద్దు పోనప్పటికీ ,జన సంచారం లేని కారణంగా, చాలా చీకటి పడ్డ భావన కలుగుతుంది. మెయిన్ రహదారి దాటి, మా వీధి కి వెళ్లే మార్గానికి వొచ్చాను. నేనెప్పుడూ భయపడే వీది మలుపు రానే వొచ్చింది. బిక్కు బిక్కు మంటూ అడుగులు వేయసాగాను. ఆ వీధి మలుపు దగ్గర ఎవరో కదులుతున్నట్లనిపించింది , ఏదో తెల్లని ఆకారం. దయ్యం అయితే పర్లేదు, మృగం అయినా పర్లేదు. కాని మనిషి అయితేనే భయం.

మృగాలను మించి అకృత్యాలు ,అఘాయిత్యాలు ఈ మనుష్యులు చేస్తున్నారు. అందుకే బయపడవలసి వస్తుంది. భయానికి భక్తికి చాల దగ్గరి సంబంధం. బయం మొదలుకాగానే, భక్తిని మేల్కొలుపుతాము. ఇక్కడ సరిగ్గా నేను అదే చేసాను. తెలిసిన దేవుళ్లను, తెల్సిన హనుమాన్ చాలిసాను వచ్చినంత వరకు మనసులో చదువుకోసాగాను. కానీ నాకు ఓకే పెద్ద సందేహం, దేవుళ్ళు ఈ దయ్యాలను, భూతాలను పారదోలగలరేమో కానీ ఈ మృగత్వపు మనుషులనుండి నన్ను కాపాడగలడా అని. వీటన్నిటి కంటే నరక తుల్యం , అందరితో కలిసివుంటూ ఒంటరిగా జీవించడం. ఎప్పుడు ఊహాలతో భయపెట్టించే ఆ మలుపుకన్న, తమ సహజ గుణంతో తమకు తెలియకుండానే హాని చేసే క్రూరమృగాలకన్నా, సోయిలో ఉండి కూడా మృగాలను మించి అకృత్యాలు చేసే ఉన్మాదులకంటెను, మనలని ఒంటరి చేసి మానసికంగా హింసించే వాతావరణం అంటే నిజంగా నాకు చాలా భయం.

ఎందుకో నిన్న , మొన్న గత కొన్ని రోజులుగా పడుతున్న మనోవ్యధ, నివసిస్తున్న పరిస్థితుల ముందు, ఈ ఊహ జనిత భయాలు దిగదుడుపే. లేదా ఓడి పోయి, మనస్సాక్షిని ప్రతికూల పరిస్థితులకు హస్తగతం చేయడం. అలా ఆలోచిస్తూనే, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసాను. ఆశ్చర్యం. ఆ మలుపును నాకు తెలియకుండానే దాటేశాను. అది వీధి మలుపైన, జీవిత మలుపైన మనో నిబ్బరంతో ఎదుర్కొంటే అంతిమ విజయం మనదే. మనసులో ఏదో తెలియని ధైర్యం. ఇంతలోనే , టప్పున కరెంటు పోయింది.చుట్టూ చీకటి. అయినా ఈ సారి భయం అనిపించలేదు.

ఇంకో అయిదు నిమిషాలు నడిస్తే మా అపార్ట్మెంట్ వస్తుంది. ఇంకో రెండడుగులు ముందుకు వేసాను. ఇది నిజంగా నమ్మలేని నిజం. అత్తగారూ టార్చ్ లైట్ తో సెల్లారులో అటు ఇటు తిరుగుతున్నారు. ఈవెనింగ్ వాకింగ్ అయితే కాదు,ఎందుకంటే మామ గారిని ఆ పరిస్థితులలో ఒదిలి తాను వాకింగ్ కైతే రాదు.అసలు తనకు ఆ ఆలవాటే లేదు. బహుశా కరెంటు పోయినందుకు, తనకు తోడు కోసమే కిందకి వచ్చినట్లుంది. తనే రాగానే, నా చేతిలోంచి టిఫిన్ బాక్స్ తీసుకుని, మెట్ల వైవుకు టార్చి వెలుగుని పట్టింది. అత్తగారు చూపిన టార్చి వెలుగులో మెట్లు ఎక్కడం, నా వెనకాలే తాను రావడం మనసుకి ఆనందాన్నిచ్చాయి.

మరిన్ని కథలు

Amma krupa
అమ్మ కృప
- చలసాని పునీత్ సాయి
Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు