'కీ'బోర్డు ప్లేయర్ కనకారావు ఉదయాన్నే లేచి కాల కృత్యాలను తీర్చుకొని స్నానపానాదులైన తరువాత వరండాలో కొచ్చి వాలుకుర్చులో కూర్చొని రోడ్డువేపు చూస్తున్నాడు రచయిత కవిశ్రీ కోసం. అప్పుడు "ఏమండీ! ఏంటి మౌనంగా కూర్చొన్నారు?ఇంట్లో సరుకులు నిండుకున్నై.మధ్యహ్నాం మీకు భోజనం కూడా వుండదు.అంతెందుకూ ఇప్పుడెవరైనా వస్తే కాఫీ ఇవ్వటానికి కాఫీ పోడి కూడా లేదు"కాస్త గట్టిగా అంది భర్త చెవిన పడేలా భార్య కాంతం టీ.వీ.ని చూస్తూనే! "ఏంటీ అల అరుస్తున్నావ్ ! ఏర్పాటు చేస్తానులే. ఇప్పుడో తల మాసిన పిసినారి పిచ్చోడు అమ్మవారిమీద అయిదు భక్తీ గీతాలు గీసుకొని....కాదు రాసుకొని సంగీతం సమకూర్చి రికార్డింగ్ చేయించుకోవటానికి వస్తున్నాడు.వాడేనే... మీ కవిశ్రీ అన్నయ్య.ఎటూ ఓ రెండు లక్షలకు ఒప్పుకొని అందులో అంతో ఇంతో నొక్కేసి పాటలు రికార్డింగు చేసి.సిడీని ఆడి మొహాన్న కొడతా!.ఇదిగో వాడొస్తే నేను వుత్తినే కాఫీ తెమ్మంటాను.నువ్వు వుత్తినే 'అలాగేనండీ'అను.వాడు మోహమాట పడుతూ వద్దంటాడు.నువ్వు 'ఓకే అన్నయ్యగారూ'అని సింపుల్గా వూరకుండిపో టి.వి చూస్తూ. ఏం ?తెలివి ఎవడబ్బ సొమ్మనుకొంటున్నావే కాంతం!" పకపక నవ్వుతూ అన్నాడు భార్యతో. "నిజంగా మీది తెలివేనండోయ్! కుండలో కూడు కుండలోనే వుండాలి.పిల్లలైతే బొద్దుగా కనబడాలనుకునే రకం మీరు"అంటూ ముసిముసి నవ్వులతో టి.వి.వాల్యూం పెంచుకొంది. అంతలో లాల్చీ, పంచె కట్టుతో,చంకలో జోలె సంచితో టి.వి.ఎస్ .ఫిఫ్టీలో వచ్చి టపీమని దిగాడు రచయిత కవిశ్రీ. బండిని ఇంటి ముందున్న వేపచెట్టు క్రిందాపి "ఏరా'కీ'బోర్డు కనకారావ్! నా కోసమే ఎదురు చూస్తున్నట్టున్నావ్ ?"అడిగాడు కనకారావుని పేద్ద ప్రొడ్యూసర్ లా పోజు కొడుతూ కవిశ్రీ. "మరి నా పని నీలాంటి పాటల రచయితలను,పైసలు ఖర్చుపెట్టే ప్రొడ్యూసర్లను ఎదురు చూడ్డమేగా!ఇక్కడ 'నీకోసం' అనడంకన్నా నీ జేబులో వున్న పైసల కోసమంటే బాగుంటుంది. మరేం చేయనురా నేను పాపులర్ సినిమా సంగీత దర్శకుణ్ణి కాదుగా!?"పేలవంగా నవ్వుతూ అన్నాడు కనకారావు. "ఇకపై నువ్వేం భయపడకుకా!ఇలా అమ్మవారిమీద, ఈశ్వరుడి మీద నేను రాసే భక్తి పాటలకు సంగీతాన్ని సమ కూర్చావనుకో కొన్నాళ్ళకు ఆటోమ్యాటిగ్గా సినిమా ఛాన్సులు వాటంతట అవే వస్తాయ్ .అలాంటి రాశి నాది.ఆఁ!కాకపోతే ఓపిక అవసరమిక్కడ"అంటూ నవ్వాడు. "ఏమిటో అంతా నీ అభిమానం.పాటలివ్వు చూద్దాం"అంటూ చెయ్యి చాపాడు కనకారావు. జోలె సంచిలో వున్న పాటలను తీసి చేతికిస్తూ "అమ్మవారిమీద రాసిన పాటలివి. సాహిత్యం అద్భుతంగా వుంటుంది.చక్కటి స్వరాలను తగిలించావనుకో బ్రహ్మాండంగా హిట్టవుతాయి.ఇక చూస్కో నా సామిరంగా...వున్నఫలంగా నువ్వు సినిమా సంగీత దర్శకుడవై పోతావ్ .నేను శ్రీశ్రీ, ఆత్రేయ,సి.నా.రె లెవిల్లో సినిమా పాటల రచయతనై పోతాను.తరువాత నువ్వు ఇలా నేనిచ్చే వందలు, వేలను యెదురు చూసే రోజులు పోయి లక్షలను చూస్తావ్ .ఇక నా సంపాదన అంటావా.., లెక్కంటూ వుండదులే!కట్టలు కట్టలు వాటంతట అవే వచ్చేస్తాయి.ఆఁ " అంటూ పాటలు రాసుంచిన ఫైలు చేతికిచ్చాడు కవిశ్రీ నవ్వుతూ.ఆ నవ్వులో నవ్వు కలుపుతూ "ఏమేవ్ !మీ కవిశ్రీ అన్నయ్యొచ్చాడు.వెంటనే కాఫీ పట్టుకు రా!"అన్నాడు ఇంట్లోకి చూస్తూ కనకారావు.. "అలాగేనండీ!అయిదు నిముషాల్లో తెస్తాను"అంది లోపల టి.వి.చూస్తున్న భార్య కాంతం. "వద్దమ్మా.ఇప్పుడే తాగొచ్చాను.నాకోసం ప్రత్యేకించి కాఫీ పెట్టడమెందుకూ"అన్నాడు కవిశ్రీ. "అయితే సరేనండన్నయ్యగారూ!"అంది కనకారావు భార్య టి.వీ.చూడ్డంలో పీకలవరకూ కూరుకుపోయి. "సరే!మన మధ్య మొహమాటమొద్దు.అయిదు పాటలకు సంగీతం సమకూర్చి గాయకులతో పాడించి సి.డి.ని అందించే వరకూ ఎంతవ్వుద్దో ఖచ్చితంగా చెప్పు?"అన్నాడు కవిశ్రీ. అప్పటికే నోటితో 'హం'చేస్తూ, తొడమీద తాళం వేసుకొంటూ అయిదు పాటలకు అయిదు నిముషాల్లో అయిదు రకాల బాణీలను సమ కూర్చుకున్నాడు కనకారావు.ఇక కవిశ్రీ ముఖంలోకి చూస్తూ వ్రేళ్ళతో లెక్క పెట్టుకొని"రెండు లక్షలవ్వుద్దిరా!ఇచ్చావంటే బ్రహ్మాండంగా చేసి పెడతాను"అన్నాడు . కవిశ్రీ షాక్ తిన్నట్టు "ఏమిటీ...రెండు లక్షలా... వూరుకోరా!ఇదిగో... నీకులా నాకు ఇంకో ఫ్రెండున్నాడు. వాడు రికార్డింగ్ థియేటరులో పాటల కండక్టరు,లక్ష రూపాయలకే అయిదు పాటల్ను చేసి పెడతానన్నాడు.నేనే నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు పాపమని నీకివ్వ తలచాను. ఏదీ...ఇంకో మాట చెప్పు?" "ఏంటిరా చెప్పేది!థియేటర్,ఇంట్రూమెంట్లు ,వాటిని వాయించే ప్లేయర్లు,సింగర్లని రెండు మూడు రోజులకు బోలెడు ఖర్చుంది. మీ ఫ్రెండు ఒక్క లక్షకే చేస్తానన్నాడంటే అందులో ఏదో తిరకాసుంది. మోసంతో కూడికొన్న వక్రమార్గంలో రికార్డింగ్ చేయటం నాకు ఇష్టముండదు" కాస్త కటువుగానే అన్నాడు కనకారావు. "నువ్వడిగినంత ఇవ్వలేనుగానీ...ఈ డబ్బుతో చేసి పెట్టు" అంటూ బ్యాగులో,షర్టు,పేంటు జేబుల్లో దాచుకొచ్చిన తొంభై తొమ్మిదివేల రూపాయలను కనకారావు చేతిలో వుంచాడు పళ్ళికిలిస్తూ. డబ్బు లెక్కపెట్టుకున్నాడు కనకారావు.తనకు తెలుసు పధ్ధతిగా సంగీతం సమకూర్చటానికి కవిశ్రీ యిచ్చిన డబ్బులు చాలవని.అయినా తనకు డబ్బు అవసరం కనుక ఆ డబ్బుకు తగ్గట్టే ఆలోచించి ఓనిర్ణయానికొచ్చి"ఓకేరా!సి.డి.ఎప్పుడు కావాలి?"అని అడిగాడు. "నేను సబరిమలకు వెళుతున్నాను.శుక్రవారం వస్తాను.సి.డి.ని తయారుగా వుంచితే తీసుకు వెళతాను.కుదరదంటే ఇప్పుడే చెప్పు!నా ఫ్రెండు చేత చేయించుకుంటాను"మళ్ళీ అన్నాడు . "ఓకే చెప్పానుగా!.శుక్రవారం తిన్నగా డైరక్టర్స్ కాలనీకొచ్చి సి.డి.ని తీసుకెళ్ళు"అన్నాడు కనకారావు. "డైరక్టర్సు కాలనీకా...అక్కడ రికార్టింగు థియేటరు ఎక్కడుందిరా?"ప్రశ్నించాడు కవిశ్రీ. "నీకు తెలీదులే!డికార్డింగ్ థియేటరు వుంది.అయినా ఆ వివరాలు నీకెందుకూ?వచ్చి సి,డి.తీసుకు వెళ్ళు"అంటూ తన పని అయిపోయిందన్నట్టుగా లేచి చేతులు దులుపుకొని ఇంట్లోకి నడిచాడు కనకారావు, గడ్డం క్రింద చెయ్యుంచుకొని ఆకాశంలోకి చూసి ఆలోచిస్తూ తన టి.వి. ఎస్ .ఫిఫ్టీ వద్దకు నడిచాడు కవిశ్రీ. ఆటోని రిథం బాక్సు రంగనాధం ఇంటిముందాపి "రంగనాధం ...ఒరేయ్ రంగనాధం"అని కేకేశాడు కనకారావు. "ఇదిగో వస్తున్నా మామా!"అంటూ రిథం బాక్సుతో వచ్చి ఆటోలో కూర్చొన్నాడు రంగనాధం . "డైరక్టర్సు కాలనీకి పోనీయ్"అన్నాడు కనకారావు. ఆటో కదిలింది-- "ఏంటి మామా! డైరక్టర్సుకాలనీకి పోనీయ్ అంటున్నావు.అక్కడున్నది మనం ప్రాక్టీసు చేసే చిన్న గది కదా!అందులో రికార్డింగ్ ఎలా చేస్తావ్ ?"సందేహాన్ని బయట పెట్టాడు రంగనాధం. "ఈ మధ్యే ఆ గదితో మరో గదిని కలిపి సౌండు ఫ్రూప్ తో రికార్డింగ్ థియేటరుగా మలిచాడు ఓనరు. అక్కడ మనదే తొలి రికార్డింగ్.ధైర్యంగా చేస్తున్నాను."చెప్పాడు కనకారావు. "అలాగా!అంటే తతిమ్మా తబలా,ప్లూటు,వయోలిన్ ,వీణ ప్లేయర్సును డైరక్టుగా అక్కడికి రమ్మన్నావన్నమాట"అన్నాడు రంగనాధం. "లేదు.మనిద్దరమే అయిదు పాటల్ను రికార్డింగ్ చేస్తున్నాం. అదీ ఒక్క రోజులోనే!ఈ 'కీ'బోర్డులో నువ్వంటున్న ఆ ఇంట్రూమెంట్సు మొత్తం వున్నాయి.వాటిని కావలసినచోట వాడుకొందాం.నువ్వు ఈ నోట్సును వాయిస్తే చాలు" అంటూ జేబులోనుంచి మడత పెట్టుంచిన కాగితాలను తీసి రంగనాధం చేతికిచ్చాడు కనకారావు. బిత్తరపోయాడు రంగనాధం. "ఏంట్రా మామా!అయిదు పాటల్ను ఒకే రోజు రికార్డింగ్ చేస్తావా?అసలు నువ్వు చెయ్యబోయేది రికార్డింగేనా?అయిదు పాటలు రికార్డింగ్ చేయటానికి కనీసం అయిదు రోజులైనా కావాలే! ఇంతకు ఫిమేల్ సింగరెవరు మామా?"ప్రశ్నించాడు. "మీ చెల్లెలేరా!బాగానే పాడుతుంది.మన వెనుకే ఆటోలో వస్తోంది.నువ్వన్నట్టు అయిదు పాటల రికార్డింగుకు అయిదు రోజులు కావాలి. వాడిచ్చిన డబ్బు థియేటరు,ఇంట్రూమెంట్ల అద్దెకే చాలదు.ఇక ఫిమేల్ సింగర్ను పెట్టుకుంటే ఓ ఇరవై వేలు బొక్క.అందుకే రికార్డింగును మరోలా ఒకే రోజులో చేయాలన్న నిర్ణయంతోనే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను"చెప్పాడు కూల్గా కనకారావు. "మైగాడ్ !ఒకే రోజులోనా!? పైగా కోరస్ పాడే చెల్లెమ్మకు సాంగ్స్ మొత్తం పాడే చాన్సా!ఇది ధారుణం మామా!"బాధగా అన్నాడు రంగనాధం. "ఏది ధారుణం?తొంభై తొమ్మిది వేలిచ్చి అయిదు పాటల్ను రికార్డు చేసి ఇమ్మంది ధారుణమా? లేక వాడిచ్చిన డబ్బుకు తగ్గట్టు బాణీలను సమకూర్చి పాడించి సి.డి.ని తయారు చేసి యివ్వడం ధారుణమా? చూడూ!ప్రొడ్యూసర్లు అంటే నిర్మాతలు.వాళ్ళు ఇచ్చే డబ్బును బట్టి రికార్డింగ్ థియేటరూ, ఇంట్రూమెంట్స్,సింగర్లను పెట్టుకుంటాం.అంటే నా దృష్ఠిలో ఓ పాటను యాభై వేలకు చెయ్యొచ్చు. సినిమా వాళ్ళకైతే ఆ పాటనే రెండు లక్షలకు చేసి పెట్టొచ్చు. ఉధాహరణకు నువ్వున్నావ్. ఈ రిథం బాక్సును ప్లే చేసిన తరువాత రెండువేలిస్తే సంతోషంగా తీసుకొని వెళ్ళిపోతావ్ .అదే సినిమా వాళ్ళకైతే ప్లే చేసినందుకు పదివేలు ఇవ్వాలి.అదేరా తేడా! ఎంత ఒకవేళ గుళ్ళలో లౌడ్పీకర్లలో వేసుకునే భక్తి పాటలైన నేను రిచ్చిగా,పద్దతిగా చేసి పెట్టాలనుకొని రెండు లక్షలడిగాను.వాడివ్వలేదు.అందుకే వాడిచ్చిన ముష్ఠి డబ్బుకు తగ్గట్టే చెయ్యాలనుకున్నాను" అంటుండగా డైరక్టర్స్ కాలనీ వచ్చింది. ఆటోవాడికి డబ్బిచ్చి లోనికెళ్ళి పావు గంటలో అన్నీ ఏర్పాట్లు చేసుకొని తనే మేల్సింగరుగా పాటను పాడి రికార్డు చేయటంలో నిమగ్నమైయ్యాడు కనకారావు. అంతలో ఆటోలో వచ్చి దిగింది అతని భార్య కాంతం.ఆమే 'ఫిమేల్ వాయిస్ '.సాయంత్రం అయిదు గంటలకల్లా ముచ్చటగా మూడు పాటలు పాడింది. మిగిలి వున్న చివరి పాటను రిథంబాక్సు రంగనాధం కోరస్ తో కనకారావే పాడి ముగించాడు. గంట రాత్రి తొమ్మిదయ్యింది--- అయిదు పాటలకు సంగీతం సమకూర్చిన కనకారావు రికార్డింగ్ ఇంజనీరు సహాయంతో మాస్టరు సి.డి.ని బయటికి తీసి సంతోషంతో 'పేకప్ 'అన్నాడు.స్టన్నైయ్యాడు రిథంబాక్సు ప్లేయర్ రంగనాధం. అంతలో ఆటోలోంచి దిగి సరాసరి 'కీ' బోర్డు ప్లేయర్ కనకారావు దగ్గరకొచ్చాడు కవిశ్రీ.చుట్టూ కలయ జూశాడు.అది సుమారైన చిన్న రికార్డింగ్ థియేటరని గుర్తించాడు. "ఏరా!రికార్డింగ్ పూర్తయినట్టేగా?"సందేహంగా అడిగాడు. మాస్టరు సి.డి,ని చూపుతూ ప్లే చేసి వినిపించమంటావా?"అడిగాడు. "ప్లీజ్ !వినిపించు."బ్రతిమాలినట్టు అడిగాడు కవిశ్రీ. వెంటనే సి.డిని ప్లే చేశాడు కనకారావు.చిటికలు వేస్తూ తను రాసిన సాహిత్యాన్ని సంగీతంతో విన్నాడు ఆనందడోలికల్లో వూగిపోతూ కవిశ్రీ. "పర్వాలేదు. క్వాలిటీ కాస్త తక్కువనిపించినా బాగానే వున్నాయ్ పాటలు"అన్నాడు కవిశ్రీ. "నిజమే !సంగీతాన్ని సమకూర్చింది ఒరిజినల్ ఇంట్రూమెంట్స్ తో కాదు.కేవలం ఈ 'కీ' బోర్డు,రిథం బాక్సుతోనే!పాటలు పాడింది నేనూ,మీ చెల్లెలు.నువ్విచ్చిన డబ్బుకు అలాగే చేయగలనురా!"అంటూ రంగనాధాన్ని చూశాడు కనకారావు. "కవిశ్రీగారు!చక్కటి బాణీలతో సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటలకు ఒరిజినల్ ఇన్స్ ట్రూమెంట్స్ తో చేసినట్లయితే బాగుండేది.కానీ మీరిచ్చిన డబ్బుకు..."అని రంగనాధం అంటుండగా, "ఏం పర్వాలేదు.బాగానే వున్నాయ్.ఈ పాటల రికార్డింగ్ విషయంగా ఫీల్డుకు సంబంధించిన వాళ్ళతో ముందే మాట్లాడాను.వీడికిచ్చిన డబ్బు చాలా తక్కువన్నారు. వీడూ వాడికున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆరోజు ఒప్పు కున్నాడు.పోనీలే!జనాల్లో భక్తి పెంపొందించటానికి ఇది చాలు. 'పిండికొద్ది రొట్టె' అన్నారు పెద్దలు,నేనిచ్చిన డబ్బుకు తగ్గట్టే సి.డి,ని చేశాడు"అంటూ సి.డి.ని జొలె సంచిలో పెట్టుకొని నవ్వుతూ వెళ్ళిపోయాడు కవిశ్రీ. అప్పటివరకూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగి అది ముదిరి కొట్లాటకు దారి తీస్తుందేమోనని భయంతో వొణికి పోయిన రిథం బాక్సు రంగనాధం గట్టిగా వూపిరి పీల్చుకొని కనకారావుని వాటేసుకున్నాడు.